చిత్తూరు

ఓటరు జాబితా సవరణలో తప్పులు లేకుండా చూడండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, డిసెంబర్ 2: ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం ఎలాంటి తప్పులు లేకుండా అదేవిధంగా బోగస్ ఓట్ల ఏరివేత ఎప్పటికప్పుడు వాటి వివరాలను సంబంధిత రాజకీయ పార్టీ ప్రతినిధులకు తెలియజేయాల్సిన బాధ్యత ఎన్నికల అధికారులపై ఉందని రాష్ట్ర ఎన్నికల జాబితా పరిశీలకులు విజయ్‌కుమార్ అన్నారు. శుక్రవారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో జిల్లాలోని ఓటర్ల జాబితా ఫోటో సవరణపై నియోజక వర్గ ఎన్నికల అధికారులతో, వివిద రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పోలింగ్ స్టేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఎప్పుడు అందుబాటులో ఉంచుకోవాలని అన్నారు. ప్రతి నియోజక వర్గంలో నూతన ఓటర్లు శాతం 3.6శాతం ఉండాలని, 2017 జనవరి 1వ తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరిని ఓటరుగా గుర్తించాలని నియోజకవర్గాల ఎన్నికల అధికారులను ఆయన ఆదేశించారు. ఓటర్ల జాబితా సరవణలో ఫోటోల జాబితా సవరణలో పలుసార్లు క్షుణ్ణంగా పరిశీలించి ప్రణాళిక ప్రకారం సిద్ధం చేసుకోవాన్నారు. ఎస్సీ, ఎస్టీ ఓటర్లశాతం, సెక్స్ రేషియో విషయం, ఓటర్లు ఫారం 6,7,8 గురించి ఆయన సమీక్షించారు. పుంగనూరు, శ్రీకాళహస్తి, నియోజకవర్గాల్లో మహిళా ఓటర్ల సంఖ్య ఘణనీయంగా పెరిగిందని తుది జాబితా తయారైయ్యేలోపు సవరణ పూర్తి చేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో పోలింగ్ స్టేషన్లపై ప్రత్యేకశ్రద్ధ వహించాలన్నారు. 2017, జనవరి 16వ తేదీ నాటికి ఓటర్ల తుది జాబితా ప్రచురణ చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. తిరుపతి ఓటర్ల జాబితాలో బోగస్ ఓట్లు ఎక్కువగా ఉన్నాయని వివిధ రాజకీయపార్టీలు చేసిన ఆరోపణలపై ఆయన స్పందిస్తూ ఈనెల 8వతేదీ వరకుసంబంధిత బూత్ లెవల్ అధికారులు పర్యవేక్షణలో ఎలాంటి పొరబాట్లు జరగకుండా జాబితా సవరణ కార్యక్రమాన్ని వేగవంతం చేయడానికి చర్యలు చేపడుతున్నామని ఇందుకు రాజకీయపార్టీలు కూడా సహకరించాలన్నారు. ఈకార్యక్రమంలో ఎమ్మెల్సీ వై.శ్రీనివాసులు రెడ్డి, డి ఆర్ ఓ విజయ్‌చందర్, సి పి ఎం నాయకులు కందారపు మురళి, కుప్పం ఎన్నికల అధికారి పెంచలకిషోర్ బాబు, శ్రీకాళహస్తి ఎన్నికల అధికారి శ్రీదేవి, నగరి ఎన్నికల అధికారి మాధవిలత, సత్యవేడు ఎన్నికల అధికారి నాగపద్మజ, పుంగనూరు ఎన్నికల అధికారి శ్రీనివాసకుమార్, గంగాధర నెల్లూరు, పలమనేరు, పీలేరు ఎన్నికల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

జిల్లాకు చేరిన 200 కోట్ల కొత్త కరెన్సీ

చిత్తూరు, డిసెంబర్ 2: కేంద్రప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసిన నేపథ్యంలో జిల్లాలో చిల్లర నోట్ల కష్టాలు తారస్థాయికి చేరాయి. ఈ తరుణంలో రూ.200 కోట్ల విలువచేసే కొత్త రెండు వేల రూపాయల నోట్లు శుక్రవారం రిజర్వు బ్యాంకు నుంచి జిల్లాకు వచ్చాయి. పాత నోట్లు రద్దయినప్పటి నుంచి జిల్లాలో నగదు కోసం ప్రజలు అవస్థలు పడుతున్నారు. రెండురోజుల క్రితం జిల్లాకు రూ.109 కోట్లు రాగా, తాజాగా మరో రూ.200 కోట్లు కొత్త కరెన్సీ వచ్చింది. ఈ నగదును మరో రెండురోజుల్లో జిల్లా వ్యాప్తంగా పలు బ్యాంకులకు పంపే విధంగా అధికారులు చర్యలు చేపట్టారు. శుక్రవారం వచ్చిన కరెన్సీని చిత్తూరులోని ఇండియన్ బ్యాంకు, ఎస్‌బిఐలు, తిరుపతిలోని ఆంధ్రా బ్యాంకుల ద్వారా జిల్లాలోని మిగతా బ్యాంకులకు పంపనున్నారు. కేంద్రప్రభుత్వం రూ.500, రూ.1000ల నోట్లను రద్దు చేయడంతో గత మూడు వారాలుగా ప్రజలకు నోట్ల కష్టాలు తారస్థాయికి చేరుకున్నాయి. అనేకచోట్ల బ్యాంకులు, ఏటిఎంల వద్ద జనం క్యూ కడుతున్నారు. అనేక బ్యాంకుల వద్ద నోక్యాష్ బోర్డులు ఉండగా, జిల్లాలో అత్యధిక ఏటిఎంలు మూతపడ్డాయి. అధికార యంత్రాగం మాత్రం నగదు రహిత ఆర్థిక లావాదేవీలు నిర్వహించాలని సూచిస్తున్నా ఆచరణలో సాధ్యంకాని పరిస్థితి నెలకొంది. మరోపక్క ఉద్యోగుల జీతాలు చెల్లింపులు చేయాల్సి ఉన్నా పలు బ్యాంకుల్లో నగదు సమస్య కారణంగా చెల్లించలేని పరిస్థితి నెలకొంది. ఈ తరుణంలో జిల్లాకు వచ్చిన రూ.200 కోట్లతో ఉద్యోగుల జీతాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు.
అభివృద్ధి నిరోధకుడు జగన్
* మాకిది.. మీకిది అని రాష్ట్రాన్ని దోచుకున్నది వైఎస్సే
* పవన్‌కల్యాణ్‌ను ఎవరైనా కలవచ్చు
* ఎమ్మెల్సీ గాలి ముద్దు కృష్ణమనాయుడు

తిరుపతి, డిసెంబర్ 2: వైకాపా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అభివృద్ధి నిరోధకుడిగా వ్యవహరిస్తున్నారని, ఆయన తీరుచూస్తే రాష్ట్రంలో అభివృద్ధి జరగడం ఇష్టంలేనట్లుగా కనిపిస్తోందని ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు మండిపడ్డారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్ తీరు చూస్తుంటే గాలిలో మేడలు కడుతున్నట్లు కనిపిస్తోందన్నారు. రాష్ట్ర విభజన తరువాత లోటు బడ్జెట్‌తో, రాజధాని కూడా లేని రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్‌గా నిలిపిన ఘనత సి ఎం చంద్రబాబు నాయుడుదని అన్నారు. అన్ని జిల్లాల ప్రజలకు అందుబాటులో రాజధానిని నిర్మించడానికి సి ఎం కృషి చేస్తుంటే దానికి అడ్డుపడుతున్నారన్నారు. రైతులు స్వచ్ఛందంగా భూములు ఇస్తే ఇవ్వరాదని అడ్డుపడటమే కాకుండా, తాను అధికారంలోకి వస్తే ఆభూములను తిరిగి ఇచ్చేస్తానని చెప్పడం జగన్‌కే చెల్లిందన్నారు. ప్రస్తుతం ఎంతో అభివృద్ధి చెందని హైదరాబాదుకుసైతం నీటి సమస్య ఉందని అయితే అమరావతికి ఆసమస్యల లేకుండా కృష్ణానది నుంచి నీటిని తరలించే అవకాశం ఉందని తెలిపారు. కరువు సమయంలోను ఇక్కడ నీటి కొరతలేకుండా ముందుచూపుతో నిర్మిస్తున్నారన్నారు. అయితే జగన్‌మోహన్‌రెడ్డి దీనిపై కూడా విమర్శలుచేస్తూ రాజధాని నిర్మాణాన్ని కూడా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తనకు చేతనైలే రాజధానిలో నిర్మించనున్న అసెంబ్లీ ఇతర భారీ భవనాల నిర్మాణాన్ని తీసుకుని తక్కువ ఖర్చుతో నిర్మించి చూపాలని సవాల్ విసిరారు. తన తండ్రి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి సి ఎంగా ఉన్నప్పుడు రాష్ట్రంలో గనులు, భూములను పరిశ్రమల పేరుతో దాదాపు లక్ష 80వేల ఎకరాలను బలవంతంగా గుంజుకున్నారని అన్నారు. దీని పర్యవశానమే ఇప్పటికీ జగన్ కోర్టుల చుట్టూ తిరగాల్సివస్తోందన్న విషయం మరచిపోరాదన్నారు. అయితే విశాఖపోర్టు, బందర్‌పోర్టు, ఫుడ్‌పార్కులు నిర్మించడానికి సి ఎం కృషి చేస్తుంటే అడ్డుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నారన్నారు. ఈవిలేఖరుల సమావేశంలో టిడిపి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం, జిల్లా నాయకుడు శ్రీనివాస చౌదరి పాల్గొన్నారు.
జిల్లా వ్యాప్తంగా మోస్తరు వర్షం
* అత్యధికంగా బిఎన్ కండ్రిలో 65.2 మిమీలు
* తూర్పు మండలాల్లో అధిక
వర్షపాతం నమోదు

చిత్తూరు, డిసెంబర్ 2: జిల్లాలో నాడా తుఫాన్ ప్రభావంతో పలు మండలాల్లో మోస్తరు వర్షం కురిసింది. తూర్పు మండలాల్లో తుఫాన్ ప్రభావం బాగా కనిపించింది. ఈ మండలాల్లో అధిక వర్షపాతం నమోదైంది. పడమర మండలాల్లో చిరుజల్లులకే పరిమితమైంది. తుఫాన్ కారణంగా జిల్లాలో ఒక్కసారిగా వాతావరణంలో మార్పు చోటుచేసుకుంది. అనేక చోట్ల ఉదయం నుంచి రాత్రి వరకు ఈదురుగాలులతో కూడిన చిరుజల్లులు కురిసి జనజీవనానికి తీవ్ర ఇబ్బందికరంగా మారింది. జిల్లాలో సరాసరి 16.5 మి.మీ వర్షం కురవగా, అత్యధికంగా బిఎన్ కండ్రిగలో 65.2 మి.మీల వర్షం కురిసింది. ఈ తుఫాన్ ప్రభావం శనివారం కూడా ఉండటంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ముఖ్యంగా తూర్పు మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదవుతుండటంతో ఈ ప్రాంతాల్లో రెవెన్యూ శాఖ ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టింది. నిండ్రలో 32.2 మి.మీ, వడమాలపేట 33.6, పుత్తూరు 22.8, నగరి 26.2, పిచ్చాటూరు 32.2, నగలాపురం 29.6, వడమాలపేట 36.6, కెవిబిపురం 37.6, నారాయణ వణం 21.6, సత్యవేడు 36.6, తొట్టంబేడు 46.6, ఏర్పేడు 44.4, రేణిగుంట 26.6, శ్రీకాళహస్తి 48, తిరుపతి అర్బన్ 18.8, ఎర్రావారిపాళ్యం 31, చిన్నగొట్టిగళ్లు 24.4, తిరుపతి రూరల్ 22.4, రామచంద్రాపురం 29.6, చంద్రగిరి 19.2, రొంపిచెర్ల 27.6, పులిచెర్ల 20.8, మదనపల్లి 18.4, కెవిపల్లి 18.6, కలికిరి 19.4,విజయపురం 19.3, కార్వేటినగర్ 12.6, వెదురకుప్పం 15.2, పాలసముద్రం 15.7, చిత్తూరు 11, పీలేరు 30.4 మి.మీ వర్షం కురిసింది.
తిరుమల రెండో ఘాట్ రోడ్డులో జీపు-బస్సు ఢీ
* ట్రాఫిక్ జామ్
తిరుపతి, డిసెంబర్ 2: తిరుపతి నుంచి తిరుమలకు వెళ్తున్న రెండో కనుమ మార్గంలో 9 వ కిలోమీటర్ వద్ద ముందు వెళ్తున్న బస్సును ఓవర్‌టేక్ చేయటానికి ప్రయత్నించిన ఓ జీపు బస్సును ఢీకొంది. ఈ సంఘటనతో వాహణాల ప్రయాణానికి తీవ్ర అంతరాయం కలిగింది. సమాచారం తెలుసుకున్న ఘాట్‌రోడ్డు పర్యవేక్షణకు సంబంధించిన పోలీసులు, టిటిడి రవాణాశాఖ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని వాహనాన్ని క్రమబద్దీకరించారు. కాగా బస్సు ఢీకొన్న సంఘటనలో బస్సులోనూ, జీపులోనూ ప్రయాణిస్తున్న భక్తులు స్వల్పగాయాలకు గురయ్యారు. తిరుమల ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

దొంగతనం కేసులో ముగ్గురు అరెస్ట్
* తొమ్మిది మోటార్‌బైక్‌లు స్వాధీనం
పలమనేరు, డిసెంబర్ 2: పలమనేరు మండల పరిధిలో ద్విచక్రవాహనాలను దొంగతనానికి పాల్పడుతున్న ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి తొమ్మిది మోటార్ బైక్‌లను స్వాధీనం చేసుకున్నట్లు డిఎస్పీ శంకర్ శుక్రవారం విలేఖర్ల సమావేశంలో తెలిపారు. డిఎస్పీ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పలమనేరు పోలీస్‌స్టేషన్ పరిధిలో ద్విచక్ర వాహనాలను చాకచక్యంగా దొంగతనాలకు పాల్పడే అంతర్ రాష్ట్ర ముఠా సభ్యులను అరెస్ట్ చేసి వారి వద్ద ఉన్న తొమ్మిది మోటార్‌బైక్‌లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దీని విలువ రూ.4.20 లక్షలు ఉంటుందని తెలిపారు. దొంగతనానికి పాల్పడిన జనీవుల్లా (23) గుడియాత్తం, ఇస్తిచార్‌బాషా (29), గుడియాత్తం, గుణ అలియాస్ దొరస్వామి (30)లను అరెస్ట్ చేశామని తెలిపారు. వీరు తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర రాష్ట్రాల్లో పలు కేసుల్లో నిందితులుగా ఉన్నారన్నారు. విలేఖర్ల సమావేశంలో పలమనేరు సిఐ సురేంద్రరెడ్డి, ఎస్సై లోకేష్, ఎస్సై రాంభూపాల్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
ముందస్తు జాగ్రత్తలు లేకుండా నోట్ల రద్దు దారుణం

* నల్లకుబేరులకే నష్టం.. పేద ప్రజలకు ఈ ఇబ్బందులు కొంతకాలమే* ప్రెస్‌క్లబ్‌లో చర్చా కార్యక్రమంలో వక్తల అభిప్రాయం
తిరుపతి, డిసెంబర్ 2: దేశంలోని 125కోట్ల మందికి ప్రజలకు సంబంధించి ప్రధాని మోదీ నోట్ల రద్దు నిర్ణయాన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా నిర్ణయం తీసుకుని అమలు చేయడం దారుణమని పలువురు మేధావులు, వక్తలు అభిప్రాయపడ్డారు. పెద్దనోట్ల రద్దు పర్యవసానాలు అనే అంశంపై శుక్రవారం ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో చర్చా కార్యక్రమం జరిగింది. ఈకార్యక్రమంలో పాల్గొన్న భూమన సుబ్రమణ్యం రెడ్డి మాట్లాడుతూ ప్రధాని మోదీ తాను తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయాలనే మూర్ఖపు ఆలోచన తప్ప ప్రజల కష్టాలను పట్టించుకోలేదని దుయ్యబట్టారు. తాను ఎమర్జన్సీ పెట్టాలను కుంటే దేశ ప్రజల పరిస్థితులను ఆలోచించకుండా అమలుచేసే మానసిక స్థితిలో మోదీ ఉన్నారన్నారు. నోట్లు రద్దు చేయడాన్ని ఎవరూ తప్పుపట్టరని అయితే సామాన్య, మధ్య తరగతి ప్రజల కష్టాలను దృష్టిలో ఉంచుకోకుండా నిర్ణయాలు తీసుకోకుంటే ప్రజలు కూడా స్వాగతించరన్నారు. నేడు అదే పరిస్థితి కొనసాగుతోందని చెప్పారు. డాక్టర్ కృష్ణప్రశాంతి మాట్లాడుతూ నల్లధనాన్ని వెలికి తీయాలని ప్రధాని చేసిన ఆలోచన మంచిదేకావచ్చని అయితే ప్రస్థుతం దేశంలో అమలవుతున్న విధానానికి ఎవరూ సమర్థించరని అన్నారు. ఇక బంగారు నగలకు సంబంధించి కేంద్రం పెడుతున్న షరత్తులు దారుణమన్నారు. తాత ముత్తాతల దగ్గర నుంచి కొన్ని ఆభరణాలు అనువంశీకంగా ఆ కుటుంబ సభ్యులకు అందుతాయని చెప్పారు. అలాంటి వాటిని ఏఖాతాలో చూపించాలో, ఎలా చూపించాలో కేంద్ర ఆర్థిక శాఖే స్పష్ట ఇవ్వాలన్నారు. వీటిని వ్యతిరేకిస్తే దేశద్రోహులని ముద్రవేయడం రాజకీయ స్వార్థాలకు పరాకాష్టగా అభివర్ణించారు. ఇక నోట్లరద్దు నిర్ణయాన్ని ప్రకటించే సమయంలో రూ.500, రూ.1000 నోట్లు చిత్తుకాగితాలే అని చేసిన ప్రకటన కోట్లాదిమంది పేద,మధ్య తరగతి ప్రజలను మనోవేదనకు గురిచేసిందన్నారు. తాము అనారోగ్యంగా ఉన్నా వాటిని మరచి నగదు మార్చుకోవడానికి క్యూలైన్లలో గంటలు రోజులు తరబడి వేచివుండాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈకార్యక్రమంలో 80 మంది ప్రాణాలు పొగొట్టుకున్నారని వారి కుటుంబాలను ఎవరు ఆదరిస్తారో చెప్పాలన్నారు. ఆధునిక పరిజ్ఞానాన్ని అందుబాటులో తీసుకురావడం స్వాగిస్తానన్నారు. దేశంలో నిరక్షరాశ్యుల సంఖ్య కోట్ల సంఖ్యలో ఉందన్నారు. ఇలాంటి సమయంలో మొబైల్ బ్యాంకింగ్ విధానాన్ని అమలు చేయడం ఎలా సాధ్యమవుతుందన్నారు. ఒక విధంగా చెప్పాలంటే విద్యా వంతులకు కూడా మొబైల్ బ్యాంకింగ్‌పై అవగాహన లేదన్నారు. ఒక డాక్టర్‌గా తనకు కూడా తెలియదని ఆమె స్పష్టం చేశారు. ఇలాంటి విధానాలను అమలు చేయాలంటే విస్తృతంగా అవగాహన కల్పించాలని అటు తరువాతే వాటిని అమలు చేస్తే ప్రజలకు కూడా శ్రేయస్కరమన్నారు. తాజా పరిణామాల మధ్య వాటిని పూర్తిగా విస్మరించారన్నది అక్షరసత్యమని అన్నారు. చార్టెడ్ అకౌంటెంట్ ఫల్గుణకుమార్ మాట్లాడుతూ నోట్ల రద్దు స్వాగతించదగ్గ విషయమన్నారు. ఈనిర్ణయం నల్లకుబేరులకు మాత్రమే నష్టం కలిగిస్తుందని, తాత్కాలికంగా సామాన్యులు ఇబ్బందులు పడ్డా భవిష్యత్తు వారికి బంగారుబాట వేస్తుందన్నారు. బంగారు ఆభరణాల విషయంలో కూడా ప్రజలు ఆందోళన పడాల్సిన అవసరం లేదని ప్రస్తుతం అమలు చేయాలనుకున్న నిర్ణయాలు ఎప్పటి నుంచో ఉన్నవే అన్నారు. నల్లకుబేరుల నుంచి ఆదాయపు పన్నులను వసూలు చేయడంలో ఇదో ప్రక్రియలో బాగమన్నారు. ఏపి డబ్ల్యుజె జిల్లా అధ్యక్షులు డాక్టర్ మురళీ మాట్లాడుతూ చట్టం నుంచి తప్పించుకునే దోపిడీ దారులకు ఇలాంటి నిర్ణయం అవసరమని అన్నారు. అయితే తక్షణం ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోకుంటే ఈ సంక్షోభం మరింత ముదిరిపోయి దేశంలో విపత్కర పరిస్థితులకు దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. సీనియర్ జర్నలిస్టు యర్రమరెడ్డి మాట్లాడుతూ నేడు దేశంలో ఏపన్నయినా నిజాయితీగా చెల్లిస్తున్నారంటే అది సామాన్య, మధ్య తరగతి ప్రజలే అన్నారు. ఇక సంపన్నులు పన్నులు ఎగ్గొట్టినా పట్టించుకునే వ్యవస్థ దేశంలో కొరవడిందన్నద అందరికీ తెలిసిన విషయమన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం జవాబుదారీ తనాన్ని విస్మరించి నోట్ల రద్దుకు తెగబడిందన్నారు. తిరిగి పేద, మధ్య తరగతి ప్రజల సొమ్మును నల్లకుభేరులకు అప్పగించడానికి ప్రహాసనంగా సాగిపోతుందని ఆయన జోస్యం చెప్పారు. ఈకార్యక్రమానికి సీనియర్ జర్నలిస్టు రాఘవశర్మ అధ్యక్షత వహించగా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు మురళి, ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు గిరిబాబు, చేపల వ్యాపారి గోవిందరెడ్డి, తిరుపతి చాంబర్ ఆఫ్ కామర్స్ నాయకులు చౌదరి, క్రెడాయ్ అధ్యక్షులు శ్రీనివాసులు, ఏపి డబ్ల్యుజె జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ నాయుడు, ఎస్వీయూ ఆచార్యులు కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
నగదు లేక తెరుచుకోని ఎస్‌బిఐ గేట్లు
* బ్యాంకు ముందు ఖాతాదారుల ధర్నా
వరదయ్యపాల్యెం, డిసెంబర్ 2: బ్యాంకులోని ఎస్‌బిఐలో నగదులేదని బ్యాంకు అధికారులు ఉదయం 11 గంటలైనా తెరవకపోవడంతో శుక్రవారం ఉదయం బ్యాంకు ఎదుట ప్రజలు ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెడితే స్థానిక వరదయ్యపాల్యెంలోని ఎస్ బి ఐ బ్రాంచ్‌లో నగదులేని కారణంగా బ్యాంకును అధికారులు తెరవలేదు. అయితే ఖాతాదారుల మాత్రం ఉదయం 9గంటలకే క్యూలో నిలబడ్డారు. కాని బ్యాంక్ సమయానికే విధులకు వచ్చినా గేట్లు మూసివేసి ఉంచారు. దాదాపు 11 గంటలైనా గేట్లు తీయకపోవడంతో బ్యాంకు లోపల ఉన్న సిబ్బందిని ప్రశ్నించారు. బ్యాంకులో నగదులేదని అందుకే గేట్లు తీయలేదని సమాధాన మిచ్చారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఖాతాదారులు బ్యాంకు ముందే బైటాయించి అధికారుల తీరుకు నిరసనగా నినాదాలు అయితే ఈవిషయం తెలుసుకున్న ఎస్ ఐ షేక్‌షావళి అక్కడకు చేరుకుని విషయం తెలుసుకుని బ్యాంక్ అధికారులతో సంప్రదించారు. బ్యాంకులో రూ.40వేలే ఉందని, అయితే ఖాతాదారులు ఎక్కువగా ఉండటంతో ఎవరిని లోనికి అనుమతించలేదని చెప్పారు. అయితే బ్యాంకు గేట్లు తెరిపించిన ఎస్ ఐ బ్యాంకులో నగదులేని విషయాన్ని వారికి చెప్పి శాంతింపజేశారు. అసలు విషయం తెలుసుకున్న ప్రజలు ఇక చేసేదిలేక అక్కడ నుంచి వెళ్లిపోయారు. కొందరు మాత్రం మధ్యాహ్నం వరకు క్యూలైన్లలో వేచివుండి డబ్బులురావని తెలుసుకుని నిరాశగా వెళ్లిపోయారు.

నుడాలో జిల్లాలోని 11 గ్రామాలను విలీనం చేస్తారా...సిఎంతో మాట్లాడతా

* నుడా కాదు చిత్తూరు డెవలప్‌మెంట్ అథారిటీగా పేరు మార్చాలి
* జిల్లాలో శ్రీసిటీ- ఉద్యోగాలు తమిళనాడుకా?
* శ్రీసిటీలో ఉద్యోగ నియామకాలపై సి ఎం దృష్టి సారించాలి
* ఎమ్మెల్సీ గాలి ముద్దకృష్ణమనాయుడు

తిరుపతి, డిసెంబర్ 2: జిల్లాలోని సత్యవేడు, వరదయ్యపాల్యెంలోని 11 గ్రామాలను నెల్లూరు డెవలప్‌మెంట్ అథారిటీలోకి విలీనం చేస్తారా? దీనిపై జి ఓ విడుదలైందా? నేనీ విషయంపై సి ఎం చంద్రబాబు నాయుడుతో చర్చిస్తానని ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు అన్నారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విలేఖరులు అడిగిన ఓ ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ శ్రీసిటీకి అవసరమైన 1400 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందన్నారు. అయితే ఇక్కడ అనేక పరిశ్రమలు నెలకొల్పుతున్నా అందులో తమిళనాడుకు చెందిన వారికే ఎక్కువ ఉద్యోగాలు ఇస్తున్నారని అన్నారు. భూమి ఆంధ్రప్రదేశ్‌ది, ఉద్యోగాలు తమిళనాడు వాసులుకా అని ప్రశ్నించారు. దీనిపై సి ఎం దృష్టి సారించాలని ఆయన కోరారు. అలాగే నడా అని 11 గ్రామాలను తరలించే బదులు, చిత్తూరు డెవలప్ మెంట్ అథారిటీ అని కాని, సత్యవేడు ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ అని కాని పేరుపెట్టు వచ్చుకదా అని అన్నారు. శేషాచల కొండల నుంచి ఎర్రచందనం అక్రమ రవాణాను నియంత్రిస్తున్నట్లే చిత్తూరు జిల్లా నుంచి ఇసుక, గుల్లను తరలించడాన్ని కూడా కఠినంగా నియంత్రించాలని ముద్దు కృష్ణమనాయుడు డిమాండ్ చేశారు. తమిళనాడులో ఇసుక, గుల్లను తరలించడాన్ని అక్కడి సి ఎం జయలలిత నియంత్రించడంతో చిత్తూరు జిల్లాను గుల్లచేసి వీటిని అక్రమార్కులు తరలించేస్తున్నారని చెప్పారు. దీనిని నియంత్రించకపోతే చిత్తూరు జిల్లా భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు పడకతప్పదని ఆయన హెచ్చరించారు. సి పి ఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ జనసేనపార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ను కలవడంపై స్పందిస్తూ వీరి కలయికలో జరిగిన చర్చలు ఇప్పటి వరకు తమకు తెలియదన్నారు. టిడిపి విజయానికి దోహదం చేసిన పవన్ కల్యాణ్ స్పందన చూశాక మాట్లాడతామని చెప్పారు. పవన్‌ను రాష్ట్రంలోని ఎవరైనా కలసి మాట్లాడవచ్చని తెలిపారు.
ఈ విలేఖరుల సమావేశంలో పాల్గొన్న టిడిపి రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం మాట్లాడుతూ దేవుడు కరుణిస్తే ఏడాదిలోపే రాష్ట్రంలో ఎన్నికలు వస్తాయని వైకాపా అధ్యక్షుడు చెప్పడం ప్రజాస్వామ్యంపై ఆయనకున్న విశ్వాసాన్ని తెలియజేస్తోందని అన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వంపై జగన్ పదవీకాంక్షతో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.

విద్యార్థులు మొబైల్ బ్యాకింగ్ ద్వారా నగదు రహిత లావాదేవీలు నిర్వహించాలి
* జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి ప్రభాకర్ రెడ్డి
తిరుపతి, డిసెంబర్ 2: విద్యార్ధులు వ్యక్తిగతంగా ఖాతాలు ప్రారంభించి మొబైల్ బ్యాంకింగ్ ద్వారా పలురకాల నగదురహిత లావాదేవీలు నిర్వహించాలని జిల్లా మైనారిటీ సంక్షేమశాఖ అధికారి ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. స్థానిక బైరాగిపట్టెడలోని రాయలసీమ ఎంబిఏ, ఎంసిఏ కళాశాల కంప్యూటర్ సైన్స్ హాల్లో శుక్రవారం మొబైల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్‌పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నగదురహిత జిల్లాగా చిత్తూరును ప్రథమ స్థానంలో నిలిపేందుకు జిల్లా కలెక్టర్ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని వివరించారు. డిజిటల్ ఇండియా ద్వారా ప్రజలకు వేగవంతంగా సేవలందించాలన్నారు. తమ తల్లితండ్రులకు, గ్రామీణ ప్రాంత ప్రజలకు దీనిపై అవగాహన కల్పించాలని కోరారు. రుపే కార్డులో, మొబైల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్ ద్వారా నిత్యావసర సేవలు వినియోగించుకోవచ్చని చెప్పారు. ఎయిర్ టెల్ కంపినీ ప్రతినిధి వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఎయిర్‌టెల్ మనీ ద్వారా ఎక్స్‌ప్రెస్ అకౌంటు, పవర్‌అకౌంటు ద్వారా ఎలాంటి అపరాధ రుసుము చెల్లించకుండా నగదురహిత లావాదేవీలు నిర్వహించుకోవచ్చని తెలియజేశారు.వొడాఫోన్ ప్రతినిధి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ వొడాఫోన్ ద్వారా ఎం-పీసా ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకొని ఐసిఐసి బ్యాంక్ అనుసంధానం ద్వారా నగదురహిత లావాదేవీలు నిర్వహించుకోవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో సహాయ సాంఘిక సంక్షేమాధికారి జ్యోత్స్న, కళాశాల మేనేజర్ ప్రకాశ్‌రెడ్డి, ప్రిన్సిపాల్ నిరంజన్ రెడ్డి, అలాగే కృష్ణయ్య, అంజప్ప నాయుడు, ప్రసన్న, శశికళ, చంద్రన్న పాల్గొన్నారు.