చిత్తూరు

నగదు రహిత లావాదేవీలపై ఇబ్బందులు సిఎం దృష్టికి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, డిసెంబర్ 4: నగదురహిత లావాదేవీలను అన్ని వర్గాల ప్రజలకు అలవాటు చేయడానికి అధికారులు, బ్యాంకర్లు కృషి చేయాలని మున్సిపల్ శాఖా మంత్రి నారాయణ సూచించారు. ఆదివారం ఉదయం మంత్రి, జిల్లాకలెక్టర్ సిద్ధార్థ్ జైన్, నగదురహిత లావాదేవీల నోడల్ అధికారి కరికాలవళవన్‌తో కలసి అధికారులు, బ్యాంకర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నగరంలోని వివిధ వ్యాపార సంస్థల ప్రతినిధులతో నగదురహిత లావాదేవీల వ్యాపారాలపై ఎదురవుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో పెట్రోల్ బంకుల అసోసియేషన్ అధ్యక్షులు మాట్లాడుతూ జిల్లాలోని 260 బంకుల్లో 80శాతం వరకు స్వైపింగ్ మిషన్లను వినియోగిస్తున్నారని, మెడికల్ షాపుల్లో కొనుగోలు దారులు 20శాతం నుంచి 30శాతం వరకు కొనుగోళ్ళకు కార్డులు వాడలేక ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. తిరుపతి చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ చిరు వ్యాపారస్తులు ఇబ్బందులు పడుతున్నారని, ఈపాస్ మిషన్లకు అద్దె, కమీషన్లను రద్దు చేయాలని కోరారు. దీనిపై అనేక సందేహాలు ఉన్నాయని అన్నారు. నగదురహిత లావాదేవీలపై పూర్తి భద్రత కల్పించి జాగ్రత్త తీసుకోవాల్సి ఉందని తెలిపారు. చిల్లర వ్యాపారస్తులకు రోజులకు రూ.5వేలు వరకు వ్యాపారం జరుగుతుందని వారు కూడా రూ.10వేలు డిపాజిట్ చేయాలంటే ఇబ్బందులు ఉన్నట్లు వెల్లడించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ వివిధ వర్గాల వ్యాపారస్తులు దరఖాస్తుచేసుకున్నవారికి ఈ పాస్ యంత్రాలు త్వరితగతిన ఏర్పాటు చేయాలని బ్యాంకర్లను కోరారు. అలాగే వ్యాపారులు తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను సి ఎం దృష్టికి తీసుకువెడతానన్నారు. ఈసమావేశంలో పాల్గొన్న బ్యాంకింగ్ కరస్పాండెంట్ ఉషా మాట్లాడుతూ తాము 2,3 హ్యాబిటేషన్లు తిరిగి సంక్షేమ పింఛన్లు ఇంటికే వెళ్ళి అందిస్తుండటం వల్ల లబ్దిదారులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. వైన్‌షాప్‌ల సంఘం అధ్యక్షులు గుణశేఖర్ మాట్లాడుతూ చిల్లరలేని కారణంగా తమ వ్యాపారాలు తగ్గాయని, స్వైపింగ్ యంత్రాలు కూడా సర్వర్ డౌన్ అవుతున్న కారణంగా స్వైప్ కావడంలేదని వాపోయారు. దీనిపై మంత్రి సమాధానమిస్తూ ప్రతి ఒక్కరు నగదురహిత లావాదేవీలను అలవాటు చేయడానికి అధికారులు, బ్యాంకర్లు కృషిచేయాలన్నారు. చెలామణిలో అంతా తెల్లధనమే ఉండేలా చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యమని వివరించారు. ప్రైవేట్ కళాశాల యాజమాన్యం సంఘం నాయకులు వెంకటేష్ మాట్లాడుతూ 75వేల మందికి నగదు రహిత లావాదేవీలపై అవగాహన కల్పించామని అయితే ఈ తరహా చెల్లింపులపై విద్యార్థులు భయాందోలనలకు గురవుతున్నారని వివరించారు. రైతు బజార్లలోని రైతులు, బియ్యం వ్యాపారులు మాట్లాడుతూ ఈ పద్దతి ఎంతో బాగుందని తాము ఇప్పుడిప్పుడే అలవాటు పడుతున్నామని చెప్పారు. ప్రత్యేకాధికారి కరికాలవళవన్ మాట్లాడుతూ ఇది చారిత్రాత్మక నిర్ణయమని చెప్పారు. మన రాష్ట్రంలో దీనిని త్వరితగతిన అమలు అవుతుందని, జిల్లా స్థాయిలో పలు నిర్ణయాలు, వాటి అమలుపై అభినందించారు. అన్ని ప్రభుత్వ చెల్లింపులు నగదు రహితంగా సాగాల్సి ఉందని చెప్పారు. జిల్లా కలెక్టర్ సిద్దార్థ్ జైన్ మాట్లాడుతూ జిల్లా స్థాయిలో ఒక సమన్వయ కమిటీ ఏర్పాటు చేసి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. దీనివల్ల గ్రామస్థాయిలో బ్యాంకులకు నగదుపంపణి, ఈపాస్ యంత్రాలకు దరఖాస్తుల స్వీకరణ జరుగుతోందని వివరించారు. కళాశాలల విద్యార్థులందరికి నగదు రహిత లావాదేవీలపై శిక్షణ, అవగామన కల్పిస్తున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్ గిరీషా, జిల్లా సంయుక్త కలెక్టర్-2 వెంకటసుబ్బారెడ్డి, తిరుపతి నగరపాలక సంస్థ కమీషనర్ వినయ్‌చంద్, జడ్పీ సి ఇ ఒ పెంచలకిషోర్, డి ఆర్ డి ఏ పిడి రవిప్రకాష్ రెడ్డి, తుడా కార్యదర్శి మాధవీలత తదితరులు పాల్గొన్నారు.
హస్తకళలు భారతీయ
సంస్కృతికి ఆనవాళ్లు

చిత్తూరు, డిసెంబర్ 4: హస్తకళలు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ఆనవాళ్లని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గీర్వాణి చంద్రప్రకాష్ తెలిపారు. స్థానిక టిటిడి కళ్యాణ మండపంలో హైదరాబాదుకు చెందిన కళాభారతి రూరల్ హేండీక్రాఫ్ట్స్, హేండ్‌లూమ్స్ కళాకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హస్తకళలు, చేనేత వస్త్రాల ప్రదర్శన, అమ్మకాలనుజడ్పీ చైర్‌పర్సన్ ఆదివారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశ సంస్కృతిలో అంతర్భాగమైన హస్తకళలు చేనేత వస్త్రాలకు ప్రపంచ వ్యాప్తంగా ఒకప్పుడు ఎంతో ప్రాధాన్యత ఉండేదన్నారు. అగ్గిపెట్లెలో పట్టుచీరను మలచిన అద్భుతమైన కళా నైపుణ్యాన్ని కలిగి నాటి ప్రభువుల ఆదరణ, ప్రోత్సాహాలతో విరాజిల్లిన కళాకారులు నేడు అందుకు విరుద్దంగా జీవనం సాగిస్తున్నారని పేర్కొన్నారు. ఆధునిక కంప్యూటర్ యుగంలో ప్రాశ్ఛాచ్చ పోకడకలకు పోతూ భారతీయ కళలు, సంప్రదాయాలను విస్మరిస్తున్నారని వాపోయారు. అభివృద్ధి చెందుతున్న యాంత్రీకరణ కూడా చేనేత కళాకారులకు ఆదరణ కరువవుతోందన్నారు. ప్రపంచానికే నాగరికతను నేర్పిన మనదేశ సంస్కృతిని కాపాడుతూ వారసత్వ కళలకు జీవంపోస్తూ కాలం వెళ్లదీస్తున్న కళాకారుల హస్తకళలను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించి భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను మరికొన్ని రోజులపాటు కొనసాగించేలా చూడాలని జడ్పి చైర్‌పర్సన్ కోరారు. కళాభారతి సంస్థ అధ్యక్షులు ఆర్ ప్రసాదరావు మాట్లాడుతూ ఈనెల 4నుంచి 18వతేది వరకు ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు హస్తకళలు, చేనేత వస్త్రాల ప్రదర్శన, అమ్మకం ఉంటుందన్నారు. చిన్ననోట్లకొరతను దృష్టిలో ఉంచుకుని అమ్మకాలకు సంబంధించిన మొత్తాలను స్వైపింగ్ యంత్రాల ద్వారా స్వీకరిస్తామని అన్నారు. అయితే డెబిట్, క్రెడిట్ కార్డులులేని వినియోగదారుల నుంచి కేంద్ర ప్రభుత్వం నిషేదించిన రు500, రు1000 పెద్ద నోట్లను సైతం స్వీకరిస్తామని వెల్లడించారు. తమవద్ద పోచంపల్లి బెడ్‌షీట్స్, డ్రస్ మెటీరియల్స్, కళంకారి, ఖద్దరు వస్త్రాలు, మంగళగిరి చేనేత వస్త్రాలు, వరంగల్ తువ్వాళ్లు, హైదరాబాదీ ఎంబ్రాయిడరీ, గద్వాల్, చీరాల, మధ్యప్రదేశ్ మహేశ్వరి కాటన్, తమిళనాడు చెట్టినాడు, కాశ్మీర్, బెంగాలీ కాటన్, చీరలు, ఢిల్లీ సోఫా కవర్లు, చిన్నారుల డ్రెస్‌లు, చేబ్రోలు ఖాదీ వస్త్రాలు లాంటి చేనేత వస్త్రాలు లభిస్తాయని పేర్కొన్నారు. అదేవిధంగా హస్తకళలైన కొండపల్లి, ఏటుకొప్పాక బొమ్మలు, హైదరాబాదు మంచి ముత్యాలు, ఆయుర్వేద ఔషదాలు, ఇమిటేషన్ జ్యుయలరీ, జ్యూట్ బ్యాగులు, గోవా టాయిస్, మైసూర్ రోజ్‌వుడ్ ప్యానల్స్, షహరాన్‌పూర్ ఉడెన్ లాకర్‌వేర్, వెదురువేణువులు, కళాత్మక ఆభరణాలు, వట్టివేరు అలంకరణ వస్తువులు లభిస్తాయని పేర్కొన్నారు. అన్ని రకాల చేనేత, హస్తకళల ధరలపై 10 శాతం రాయితీతిని ఇవ్వనున్నట్లు వెల్లడించారు. చిత్తూరు నగరం, పరిసర ప్రాంతాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కాగా ఈ కార్యక్రమానికి చిత్తూరు ఆర్‌డిఓ కోదండరామిరెడ్డి టిడిపి సీనియర్ నాయకుడు చంద్రప్రకాష్ విచ్చేసి హస్తకళలను కొనుగోలు చేశారు.

ముగిసిన శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు
తిరుపతి, డిసెంబర్ 4:
తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు జరిగిన కార్తీక బ్రహ్మోత్సవాలు ఆదివారం పంచమీతీర్థ మహోత్సవంలో ఘనంగా ముగిశాయి. చవరిరోజు ఆలయం వద్ద గల పద్మపుష్కరిణిలో జరిగిన చక్రస్నానం కార్యక్రమానికి విశేష సంఖ్యలో భక్తులు విచ్చేసి తమ భక్త్భివాన్ని చాటుకున్నారు. ఈ ఉత్సవానికి విచ్చేసిన అశేష భక్తజనవాహినికి ఎలాంటి రాజీకి తావులేకుండా టిటిడి విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టింది. టిటిడి ఇ ఓ డాక్టర్ డి.సాంబశివరావు, తిరుమల జె ఇ ఓ శ్రీనివాసరాజు, తిరుపతి జె ఇ ఓ పోలాభాస్కర్ ఏర్పాట్లను ప్రత్యక్షంగా పర్యవేక్షించారు.
లక్ష మందికి అల్పాహారం, అన్నప్రసాదాలు
టిటిడి అన్నప్రసాద విభాగం ఆధ్వర్యంలో సుమారు లక్ష మంది భక్తులకు అల్పాహారం, అన్నప్రసాదాలు అందించారు. ఉదయం పుష్కరిణిలో వేచి ఉన్న భక్తులకు 20వేల ప్యాకెట్ల సేమియాబాత్ పంపిణీ చేశారు. అదేవిధంగా బయట క్యూలైన్లలో వేచి ఉన్న 30వేల భక్తులకు ఉప్మా, పొంగళ్ అందజేశారు. మధ్యాహ్నం తోళ్లప్పగార్డెన్స్, జడ్పి హైస్కూల్, అయ్యప్పస్వామి, గుడి పక్కన పసుపు మండపం వద్ద 50 వేల మంది భక్తులకు కదంబం, చక్కెర పొంగళి, ధద్యోధనం అందజేశారు. తోళ్లప్ప గార్డెన్స్‌లో టిటిడి ఇ ఓ దంపతులు భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించారు.
దాదాపు 4 లక్షల తాగునీటి ప్యాకెట్ల పంపిణీ
పంచమీతీర్థం సందర్భంగా విచ్చేసిన లక్షలాది మంది భక్తులకు టిటిడి ఆరోగ్య విభాగం ఆధ్వర్యంలో దాదాపు 4 లక్షల తాగునీటి ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఆలయం, పుష్కరిణి పరిసరాల్లో ఎప్పటికపుడు చెత్తను తొలగించి పరిశుభ్రంగా ఉంచారు. భక్తుల సౌకర్యార్థం అదనంగా ఐదు మొబైల్ మరుగుదొడ్లను ఏర్పాటుచేశారు. బ్రహ్మోత్సవాల్లో రోజుకు 150 మంది, గజ వాహనం నాడు 300 మంది పంచమీతీర్థం రోజున 700 మంది పారిశుధ్య సిబ్బంది సేవలందించారు.
పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు
పంచమీతీర్థానికి విచ్చేసిన భక్తులకు టిటిడి పటిష్టమైన భద్రతా చేపట్టింది. పుష్కరిణిలోకి ప్రవేశించేందుకు, తిరిగి వెళ్లేందుకు వేరువేరుగా గేట్లను ఏర్పాటుచేశారు. పుష్కరిణి వద్ద భద్రతా ఏర్పాట్లను అనంతపురం రేంజి డి ఐజి ప్రభాకర్‌రావు స్వయంగా పర్యవేక్షించారు. టిటిడి సివి ఎస్ ఓ శ్రీనివాస్, అదనపు సివి ఎస్ ఓ శివకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో విజిలెన్స్ అధికారులు తిరుపతి అర్బన్ ఎస్పీ జయలక్ష్మి, ఇతర పోలీసు ఉన్నతాధికారులతో సమన్వయం చేసుకొని భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పార్కింగ్ ఏర్పాట్లు, ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపట్టారు. కాలినడకన వచ్చిన భక్తులకు ఇబ్బందులు లేకుండా తిరుచానూరు బయటి నుంచే వాహనాలను దారి మళ్లించారు. తిరుపతి నుంచి వచ్చే వాహనాలకు, పాడిపేట వైపు నుంచి వచ్చే వాహనాలకు ఆయా ప్రాంతాల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేపట్టారు.

శ్రీవారి సేవకులు, స్కౌట్స్ విశేష సేవలు
బ్రహ్మోత్సవాలకు విచ్చేసిన భక్తులకు శ్రీవారి సేవకులు, స్కౌట్స్ అండ్ గైడ్స్ విశేష సేవలు అందించారు. ఆలయంలోని క్యూలైన్లు, వాహన సేవల్లో, అన్నప్రసాద భవనంలో భక్తులకు సేవలందించారు. బ్రహ్మోత్సవాల్లో రోజుకు దాదాపు 300 మంది పంచమీతీర్థం రోజున దాదాపు 500 మంది శ్రీవారి సేవకులు భక్తులకు సేవలందించారు.

సాంస్కృతిక కార్యక్రమాలకు విశేష స్పందన
టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్ట్, దాససాహిత్య ప్రాజెక్టు, ఎస్వీ సంగీత, నృత్య కళాశాల ఆధ్వర్యంలో ప్రతిరోజూ వాహనసేవల్లో కోలాటాలు, భజనలు, పూణె డ్రమ్స్ తదితర సాంస్కృతిక కార్యక్రమాలకు విశేష స్పందన లభించింది. ఎస్వీ బాలమందిర్ విద్యార్థులు ప్రదర్శించిన కోలాటం ప్రత్యేక ఆకర్షణా నిలిచింది. తిరుచానూరులోని ఆస్థాన మండపం, తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరం, మహతి కళాక్షేత్రం, శిల్పారామం, వేదికలపై ప్రతిరోజూ ఆధ్యాత్మిక, ధార్మిక, సంగీత, నృత్య కార్యక్రమాలు నిర్వహించారు.
110 కోట్లతో
ఇస్కా పనులు వేగవంతం
* జిల్లా కలెక్టర్ సిద్దార్థ్ జైన్ వెల్లడి
తిరుపతి, డిసెంబర్ 4: అంతర్జాతీయ ప్రమాణాలతో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ఏర్పాట్లు అభివృద్ధి పనులు నిర్వహించడానికి ఇప్పటికే రూ.110 కోట్ల అంచనాలతో పనులు వేగవంతం చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్ జైన్ చెప్పారు. ఆదివారం తుడా కార్యాలయంలోనే పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జనవరి 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకు జరిగే సదస్సును ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రారంభిస్తారని, 12వేల మంది పైగా ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. పలు అభివృద్ధి పనులకు షార్ట్ టెండర్లు ద్వారా పనులను అప్పగించడం జరిగిందన్నారు. ఇస్కా మహాసభలను ఎస్వీయు నిర్వహించడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్నారు. ఈ పనులను పర్యవేక్షించడానికి 16మందితో కమిటీలు ఏర్పాటు చేశామన్నారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి తిరుపతి వరకు అన్ని రహదారులను సుందరీకరించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఇందుకు ప్రభుత్వం ఇప్పటికే రూ.60కోట్లు నిధులు మంజూరు చేసిందన్నారు. వర్శిటీలో వివిధ అభివృద్ధి పనుల కోసం రూ.30కోట్లు కేటాయించగా, ఆర్ అండ్ బి ఆధ్వర్యంలో రూ. 10కోట్లు, మున్సిపాలిటికి రూ.20కోట్లు మంజూరుచేయడం జరిగిందన్నారు. ఈనెల 6వ తేదీన మంత్రి గంటా శ్రీనివాసరావు అధ్యక్షతన తిరుపతికి రానున్న నలుగురు మంత్రుల బృందం ఈపనులను సమీక్షిస్తారని కలెక్టర్ చెప్పారు. అలాగే తిరుపతిలో ట్రాఫిక్ సమస్యను అధిగమించడానికి ప్రధాన కూడళ్ల విస్తరణ పనులు వేగవంతం చేస్తున్నామని, తిరుచానూరు నుంచి అన్నమయ్య కూడళ్లలో ప్రత్యేక విస్తరణ పనులను మున్సిపాల్టీ అధ్వర్యంలో వేగంగా చేస్తున్నట్లు చెప్పారు. ఈపాస్ యంత్రం ద్వారా నగదురహిత లావాదేవీలు నిర్వహించేటప్పుడు పాస్‌వర్డ్, పిన్ నెంబర్‌ను రహస్యంగా ఉంచుకోవాలని, నగదు చెల్లింపు తరువాత అకౌంట్ విలువను జాగ్రత్తగా సరిచూసుకోవాలని , లావాదేవీల ద్వారా పొందే నగదుకు సంబంధించిన రశీదు సరిచూసుకోవాలని కలెక్టర్ కోరారు.
టమోటా రైతులకు భారీ నష్టం
రామకుప్పం, డిసెంబర్ 4: మండలంలో టమోటా సాగు చేస్తున్న రైతులకు భారీ నష్టం కలిగించింది. రామకుప్పం మండలంలో సుమారు 500 ఎకరాలకు పైగా టమోటాసాగు చేస్తున్నారు. ఒక ఎకరాకు పంట సంరక్షణ కొరకు 50వేల రూపాయలు వరకు ఖర్చు అవుతుందని రైతులు పేర్కొన్నారు. అప్పులు చేసి పంటలు సాగు చేసినా కేజీ 4 రూపాయల ధర పలుకుతుందని తెలిపారు. రామకుప్పంలో టమోటా మార్కెట్ లేకపోవడంతో వి.కోట మండలానికి తరలిస్తున్నారు. ఈ క్రమంలో ఆటోబాడుగకు కూడా సరిపోవడం లేదని ఆవేదన చెందుతున్నారు. దీనిపై ప్రభుత్వం స్పదించి టమోటా సాగు చేస్తున్న రైతులను ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు.
‘ఘంటసాల అమరగాయకుడు’
తిరుపతి, డిసెంబర్ 4: పద్మశ్రీ ఘంటసాల అమరగాయకుడని తెలుగువారి గుండెల్లో చెరగని ముద్రవేసిన గాయకుడు కూడా ఆయనేనని సాయిసుధ మల్టీ స్పెషాలిటి హాస్పిటల్ అధినేత్ర డాక్టర్ సుధారాణి అన్నారు. ఘంటసాల జయంతి సందర్భంగా పద్మశ్రీ ఘంటసాల చైతన్యవేదిక ఆధ్వర్యంలో రూపొందిన పాటల పుస్తకాన్ని ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ సుధారాణి మాట్లాడుతూ తెలుగు చలనచిత్ర రంగంలో 11,800 మధురమైన పాటలను పాడిన గాన గంధర్వుడని అన్నారు. ఆయన జన్మదినాన ఆయనపాడిన పాటల పుస్తకాన్ని తాను ఆవిష్కరించడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. గాయకుడు సోము ఉమాపతి మాట్లాడుతూ గాయకుడిగా ఎదగడానికి ఎన్నో ఇబ్బందులను ఘంటశాల ఎదుర్కొన్నారని అన్నారు. అయితే వాటన్నింటిని తట్టుకుని తన గానామృతాన్ని తెలుగు ప్రజలకు అందించిన చిరస్మరణీయుడని కొనియాడారు. ఆయన పాడిన పాటలను గుర్తుంచుకున్న ప్రజలు ఆ సినిమాలను మాత్రం మరచిపోయారని తెలిపారు. ఈకార్యక్రమంలో ఇ ఎస్ ఐ హాస్పిటల్ హెచ్‌డిసి అంబూరి సింధూజ, టిఎన్‌టియుసి నాయకుడు మల్లిఖార్జున కూడా పాల్గొన్నారు.
పేదల వైద్యానికి ప్రభుత్వం పెద్దపీట
* జగన్ ఇలాంటి లేఖలు రాయడం సరికాదు
* ముద్రగడ పంతానికి పోవడం తగదు
* ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు

తిరుపతి, డిసెంబర్ 4: రాష్ట్రంలో నిరుపేదల వైద్యానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, మాజీ సిఎం ఎన్‌టిఆర్ నుంచి నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు టిడిపి ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు చెప్పారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి రాష్ట్రంలో పేదలకు వైద్యం అందడంలేదని, ఆరోగ్య శ్రీ అమలుకావడంలేదని, 104,108 పనిచేయడంలేదని సిఎంకు లేఖ రాయడం సరికాదన్నారు. రాష్ట్రంలో ఒక్కరోజే 750 పి హెచ్‌సిలు ప్రారంభించింది ఎన్‌టిఆర్ అనే విషయం మరచిపోరాదన్నారు. 108ను కూడా ప్రారంభించింది చంద్రబాబు నాయుడేనని, దీనిని వైఎస్ విస్తృతం చేశారని తెలిపారు. రాష్ట్రంలో 104,108లను జివికే సంస్థకే అప్పగించామని ఇవి బాగానే పనిచేస్తున్నాయని అన్నారు. అవసరమైన వారికి ఆర్థిక సాయం అందించడానికి సిఎం రిలీఫ్ ఫండ్ ఏర్పాటు చేయడం, మన్యంలోని గిరిజనులు విషరోగాల బారిన పడుతుంటే వారికి దోమ తెరలను అందించడం, ఆరోగ్యశ్రీలో 1044 జబ్బులను చేర్చి వైద్య ఖర్చులను రెండున్నర లక్షలకు పెంచింది కూడా చంద్రబాబు నాయుడే అని చెప్పారు. డాకర్లు, నర్సుల కొరత తీర్చేందుకు కొత్తగా నియామకాలను కూడా చేపట్టారని వివరించారు. రోగాల బారినపడ్డవారు డబ్బుల్లేకే చనిపోతున్నారని, బడ్జెట్‌లో నిధులు కేటాయించలేదని జగన్మోహన్ రెడ్డి ఆరోపించడం సరికాదన్నారు. రాష్ట్ర బడ్జెట్‌లో వైద్యానికి తొలుత 568 కోట్లు కేటాయించారని, మిగిలిన 390 కోట్లను కూడా కేటాయిస్తారని ముద్దు కృష్నమనాయుడు అన్నారు. రాష్ట్రంలో మెడికల్, డెంటల్, నర్సింగ్ కళాశాలలకు అవినీతి రహితంగా అనుమతులివ్వడం జరిగిందని దీని ద్వారానే అవసరమైన డాక్టర్లు ఇప్పుడు ప్రజలకు అందుబాటులో ఉన్నారన్న విషయాన్ని ప్రతిపక్ష నేత గుర్తుంచుకోవాలన్నారు. విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యత ఇస్తూ కేంద్రం నుంచి అధిక నిధులు తెస్తున్న ఘనత సి ఎం కే దక్కుతుందన్నారు. ముద్రగడ పద్మనాభం కొంత సంయమనం పాటించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ఎమ్మెల్సీ హితవుపలికారు. గతంలో ఆయన చేసిన ఆందోళనలో అసాంఘిక శక్తులు పోలీస్ స్టేషన్లు, వాహనాలు, చివరికి రత్నాంచల్ ఎక్స్‌ప్రెస్‌ను దగ్ధం చేసిన విషయం మరచిపోరాదన్నారు. ఇప్పుడు మళ్లీ పాదయాత్ర అంటే జరిగే విధ్వంసాలకు ప్రజలు బాధపడాల్సివస్తుందన్నారు. ఒక రాజకీయపార్టీ పదవి వ్యామోహంతో విద్వాంసాలకు పాల్పడ్డ విషయం మరచిపోరాదని ముద్దుకృష్ణమనాయుడు అన్నారు. కాపులకు రిజర్వేషన్ కల్పిస్తామని సి ఎం చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారని ఇందుకోసం మంజునాథ కమీషన్ కూడా ఏర్పాటు చేశారన్నారు. కాపులకు రుణాలు, సబ్సిడీలు, విద్యార్థుల ఉన్నత చదువులకు నిధులు కేటాయిస్తున్న విషయాన్ని ఆయన గుర్తుంచుకోవాలని జగన్‌కు చెప్పారు. కాపు రిజర్వేషన్ ఒక్కరోజుతో జరగదని, ఇందుకు రాజ్యాంగ సవరణ అవసరమని తెలిసి కూడా ముద్రగడ ఇలా పాదయాత్రలు చేస్తానడం సరికాదన్నారు.
వకుళమాత ఆలయంతో పేరూరు అభివృద్ధి

* స్వామి పరిపూర్ణానంద స్పష్టం
తిరుపతి, డిసెంబర్ 4: శ్రీవేంకటేశ్వరుని మాతృమూర్తి వకుళమాత ఆలయం నిర్మాణంతో తిరుపతి రూరల్‌లోని పేరూరు గ్రామం అభివృద్ధి చెందుతుందని శ్రీపీఠం మఠాధిపతి పరిపూర్ణానంద స్వామి చెప్పారు. ఆదివారం పేరూరు సమపంలో వకుళామాత ఆలయ స్వాగత ఆర్చీని ప్రారంభించిన సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ పేరూరు బండపై ఉన్నది వకుళామాత ఆలయమేనని చారిత్రక ఆధారాలను బట్టి నిర్ధారణ అవుతోందని ఆయన స్పష్టం చేశారు. శ్రీపద్మావతి అమ్మవారు కొలువైవున్న తిరుచానూరు ఎంత అభివృద్ధి చెందిందో చూస్తున్నామని, అదే తరహాలో ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుందనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ వకుళామాత ఆలయ అభివృద్ధితో ఈ ప్రాంతం పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు. ఈకార్యక్రమంలో బిజెపి ఓబిసి మోర్చా రాష్ట్ర అధ్యక్షులు జల్లి మధుసూధన్, నగర మాజీ అధ్యక్షులు అజయ్‌కుమార్, నాయకులు గుండాల గోపినాథ్, కె.విశ్వనాథ్, కె.్భస్కర్ పెద్దసంఖ్యలో భక్తులు, ప్రజలు పాల్గొన్నారు.