చిత్తూరు

జిల్లా సిపిఒలు రాష్ట్రానికే ఆదర్శం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, డిసెంబర్ 8: జిల్లాలోని సిపిఒ (పోలీసు కమ్యూనిటి ఆఫీసర్స్) వ్యవస్థ రాష్ట్రానికే ఆదర్శమైందని రాష్ట్ర డిజిపి సాంబశివరావు కొనియాడారు. గురువారం రాత్రి చిత్తూరు పోలీసు మైదానంలో జిల్లా స్థాయి సిపిఒల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా డిజిపి మాట్లాడుతూ ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా సమాజసేవలో మేము సైతం అంటూ అనేకమంది శాంతి భద్రతలు కాపాడాలన్న ఉత్సాహంతో యువత సిపిఒలుగా ముందుకు రావడం గొప్ప విషయమన్నారు. జిల్లాలో సిపిఒలు పోలీసులకు చక్కగా సహకరిస్తూ, ట్రాఫిక్, శాంతి భద్రతలు పరిరక్షణలో, రాత్రివేళ బీట్ డ్యూటీలు తదితర పోలీసులు విధుల్లో పాలుపంచుకోవడం గొప్ప విషయమన్నారు. ఈజిల్లాలో సుమారు నాలుగువేల మంది సిపిఒలుగా పనిచేస్తూ పోలీసులకు అండగా ఉంటున్నారని తెలిపారు. ఈజిల్లాలో వినూత్నంగా చేపట్టిన ఈ విధానాన్ని త్వరలో రాష్ట్రంలో అనేక జిల్లాలో అమలు చేయాలని నిర్ణయించామన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలోప్రజలు భాగస్వామ్యం అయితే సమాజం బాగుపడుతుందని అన్నారు. సమాజ సేవకోసం ఈ జిల్లాలో అనేకమంది యువత ముందుకు రావడం గర్వించతగ్గ విషయమని తెలిపారు. అయితే నిబంధనలు అతిక్రమంచ కుండా చట్టాలను తమ చేతికి తీసుకోకుండా సిపిఒలు విధులు నిర్వహించాలన్నారు. శాంతి భద్రతల్లో ప్రజల్ని భాగస్వామ్యం చేయాలని ఇటీవల ప్రధాన మంత్రి కూడా సూచించారన్నారు. ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా సిపిఒలు విధులు నిర్వహిస్తున్నారని, వీరికి భవిష్యత్తులో పోలీసు యంత్రాగం తమవంతు చేయూత నిచ్చే విధంగా తమవంతు కృషి చేస్తామన్నారు. ఈ జిల్లాలో అర్హులైన సిపిఒలకు పోలీసు రిక్య్రూట్‌మెంట్ కోసం జిల్లా పోలీసు అధికారులు ఉచితంగా ప్రత్యేక శిక్షణా తరగతులు ఇవ్వడం జరిగిందన్నారు. రానున్న రోజుల్లో మంచి ప్రతిభ ఉన్న సిపిఒలకు గుర్తింపు ఇవ్వడం జరుగుతుందన్నారు. అనంతరం విధుల నిర్వహణ, అతితర అంశాలపై సిపిఒలతో ఆయన ముఖాముఖి కార్యక్రమంలో పాలు పంచుకొన్నారు. ఈ సమావేశంలో అనంతపురం రేంజి డిఐజి ప్రభాకర్‌రావు, ఐజి శ్రధర్ రావు, జిల్లా ఎస్పీ శ్రీనివాస్, ఎస్పీ మహంతి, పలువురు పోలీసు అధికారులు, సిపిఒలు పాల్గొన్నారు.

నూతన సాంకేతిక పరిజ్ఞానంతో రాష్ట్భ్రావృద్ధి
* ఐటి శాఖ మంత్రి పల్లె రఘునాధరెడ్డి వెల్లడి
తిరుపతి, డిసెంబర్ 8: దేశంలో ఆంధ్రరాష్ట్రం ఒక్కటే నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని సంపూర్ణంగా సద్వినియోగం చేసుకుని అభివృద్ధి బాటలో పయనిస్తోందని రాష్ట్ర ఐటి శాఖ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి వెల్లడించారు. గురువారం మంత్రి తిరుమలకు చేరుకుని శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయనకు టిటిడి అధికారులు సాదరస్వాగతం పలికి శ్రీవారి దర్శన ఏర్పాటు చేశారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలను అందించారు. ఈసందర్భంగా మంత్రి ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ సిఎం చంద్రబాబు నాయుడు రాష్ట్భ్రావృద్ధికి చేస్తున్న కృషి సత్ఫలితాలు ఇవ్వాలని, ఇందుకు ఆదేవదేవుని అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలని దేవుని ప్రార్థించానన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, కరవు కాటకాల నుంచి బయటపడాలని స్వామిని ప్రార్థించినట్లు ఆయన చెప్పారు. కేంద్రం తీసుకున్న పెద్దనోట్ల రద్దుతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా, నగదు రహిత లావాదేవీలతో అవినీతిని నిర్మూలించవచ్చని చెప్పారు. ముఖ్యమంత్రి ఆశయం మేరకు ప్రతి ఒక్కరూ నూతన టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరూ నగదురహిత లావాదేవీలను అలవరచుకోవాలని చెప్పారు. నోట్ల రద్దుతో సామాన్య ప్రజలు, భక్తులు ఇబ్బందులు పడకుండా టిటిడి చర్యలు తీసుకోవడం ఆనందంగా ఉందని మంత్రి తెలిపారు. మంత్రితోపాటు టిడిపి నాయకులు నరసింహయాదవ్, శ్రీ్ధర్‌వర్మ కూడా స్వామివారిని దర్శించుకున్నవారిలో ఉన్నారు. ప్రముఖ సినీ సంగీత దర్శకుడు తమన్ కూడా శ్రీనివాసుని దర్శించుకున్నారు.

కరెన్సీ కష్టాలు తీరేదెన్నడో..?
* ఆందోళనలో పింఛన్‌దారులు, సామాన్యప్రజలు
* డబ్బుల్లేక ఎటిఎంల మూత * పరిమితమైన విత్‌డ్రాయల్స్
మదనపల్లె, డిసెంబర్ 8: బ్యాంకులు, ఎటిఎంల ముందు జనం క్యూలు గత రెండు రోజులు పోలిస్తే మరింత పెరిగాయి. నగదు కొరత కారణంగా మదనపల్లె పరిసర ప్రాంతాలలో ఎటిఎంలు మూతపడుతుండగా, బ్యాంకులలో విత్‌డ్రాయల్స్ పరిమితం చేస్తున్నారు. జిల్లాలోని పడమటి కరువు ప్రాంతాలు బి.కొత్తకోట, కురబలకోట, తంబళ్ళపల్లె, మదనపల్లె, రామసముద్రం, వాల్మీకిపురం, కలికిరి, పీలేరు, పుంగనూరు, ములకలచెరువు ప్రధాన ప్రాంతాల బ్యాంకులు, ఎటిఎంల ముందు జనం కిలోమీటరు పొడవునా క్యూలు కొనసాగుతున్నాయి. పడమటి ప్రాంతాల ఎటిఎంలు 40శాతం పనిచేయకపోగా, మిగిలిన ఎటిఎంలలో ఉన్న నగదు కేవలం 4గంటల్లో అయిపోతోంది. దీంతో ఉద్యోగుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు విధులకెళ్ళి, సాయంత్రం నుంచి రాత్రి వరకు ఎటిఎంల వద్ద క్యూలో నిల్చున్నా డబ్బులు దొరకకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. మదనపల్లె, పుంగనూరు, పీలేరు, వాల్మీకిపురం, కలికిరి బ్యాంకులలో వారానికి రూ.5వేలకు మించి విత్‌డ్రా చేయడానికి బ్యాంకర్లు అంగీకరించడం లేదు. ప్రధానంగా మదనపల్లె పట్టణంలోని ప్రధాన బ్యాంకులవద్ద బ్యాంకులు తెరవకముందే ఉదయం 8గంటలకే క్యూలు కడుతున్నారు. ఇతరులకైతే ఆ పరిమితి మరింత తగ్గించేశారు. బ్యాంకులలో నగదు కొరత ఫలితంగా ఖాతాదారులకు ఒకరోజు ముందే టోకన్‌లు జారీచేసి, ఒకటి నుంచి మూడురోజుల గడువు విధిస్తున్నారు. మదనపల్లె పట్టణంలోని ఎస్‌బిఐ, ఐసిఐసిఐ, హెచ్‌డిఎఫ్‌సి, ఐడిపిఐ బ్యాంకుల ఎటిఎంలు పనిచేస్తుండగా, మిగిలిన బ్యాంకుల ఎటిఎంలు పూర్తిగా మూతపడ్డాయి. దీంతో పనిచేస్తున్న ఎటిఎంల ముందుజనం భారీఎత్తున క్యూలు కడుతున్నారు.
సామాన్యులకు తప్పని కరెన్సీ కష్టాలు: నోట్లరద్దు చేసి నెలరోజులు దాటినా కరెన్సీ కష్టాలు తీరడం లేదు. తగినంత కరెన్సీ అందుబాటులో లేకపోవడంతో అసలు కరెన్సీ కష్టాలు తీరుతాయా? అన్న ప్రశ్నలు సామాన్యులు, పింఛన్‌దారులలో నెలకొంటోంది. ఈ నగదు సంక్షోభం ఇప్పట్లో పరిష్కారమైయ్యే అవకాశాలు కన్పించడం లేదు. నోట్లరద్దు ప్రకటనతో జిల్లాలోని అన్ని బ్యాంకులలో 2750కోట్ల రూపాయలు డిపాజిట్‌ల రూపంలో ఉన్నట్లు అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. ఆ నగదుకు అవసరమైన కొత్తకరెన్సీ అందుబాటులోకి రాకపోవడంతో రోజువారీ కూలీలు, నెలసరి పింఛన్‌లు తీసుకునే వృద్ధులు, వికలాంగులు సైతం బ్యాంకుల వద్ద గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. ఎటిఎంలు, బ్యాంకులలో విత్‌డ్రాలు పరిమితం చేయడంతో జిల్లాలో రోజుకు రూ. 25కోట్ల నుంచి రూ.40కోట్ల వరకు లావాదేవీలు జరుగుతున్నాయని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. జిల్లాకు రావాల్సిన నగదు మరింత ఆలస్యం అవుతుందని అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే బ్యాంకులకు వచ్చే జనానికి నగదు రావడం ఇంకెన్నిరోజులు పడుతుందో చెప్పుకోలేని పరిస్థితి. ఇదిలావుండగా ఎక్కువశాతం 2వేల నోట్లు రావడంతో, జనాలవద్ద చిల్లర్లులేక, ఆ 2వేల నోటును మార్చడం సామాన్యులకు అసాధ్యంగా మారింది. ఇదిలావుండగా పూర్తిగా చిరిగిపోయిన రూ.10లు, రూ.20ల నోట్లతో ప్రజలు బ్యాంకర్లపై ఆగ్రహిస్తున్నారు. ఒకటవ తారీఖుతో అటు ఉద్యోగులు, ఇటు పింఛన్‌దారులు, మరోవైపు సామాన్యులు నేటికి 8రోజులుగా బ్యాంకులు, ఎటిఎంలవద్ద జనం క్రమేణా పెరుగుతున్నారు. ప్రధానంగా 40శాతం ఎటిఎంలు పనిచేస్తుండటం, బ్యాంకులలో విత్‌డ్రాలు పరిమితం చేయడంతో పాటు ఈనెల 10న రెండవ శనివారం, 11న ఆదివారం, 12న సోమవారం మిలాదినబీ పండుగ సెలవుల కారణంగా మూడురోజుల పాటు బ్యాంకులు, ఎటిఎంలు మూతపడనున్నాయి. మూడురోజులు బ్యాంకులు లేకపోతే ప్రజలు మరింత ఇబ్బందులు పడటం ఖాయం, దీనిని దృష్టిలో ఉంచుకుని పనిచేయని ఎటిఎంలను మరమ్మతులు చేపట్టి, అన్ని ఎటిఎంలలో పూర్తిస్థాయిలో కరెన్సీని అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా చర్యలు తీసుకోవాల్సివుంది.

మొబైల్ డిజిటల్ బ్యాంకింగ్‌పై గ్రామీణ ప్రజలకు అవగాహన కల్పించండి
* అధికారులకు జిల్లా కలెక్టర్ సూచన
తిరుపతి, డిసెంబర్ 8: మొబైల్ డిజిటల్ బ్యాంకింగ్‌పై గ్రామీణ ప్రజల్లో అవగాహన కల్పించడానికి వివిధ కళాశాలల విద్యార్థులచే గ్రామాలను దత్తత తీసుకుని ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ సిద్దార్థ్ జైన్ అధికారులను ఆదేశించారు. గురువారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో బ్యాంకర్లతో సమావేశమైన ఆయన అధికారులతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రజల్లో ప్రతి ఒక్కరికి బ్యాంక్ ఖాతాలు ఉండేలా కృషి చేయాలన్నారు. నగదు రహిత లావాదేవీలపై గ్రామీణ ప్రజలను చైతన్యవంతం చేయాలన్నారు. మొబైల్ బ్యాంకింగ్, రూపే కార్డ్, డెబిట్, క్రెడిట్‌ల ద్వారా యాప్‌లు గురించి వివరించాలన్నారు. ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డులను అనుసంధానం చేసి బ్యాంకు అకౌంట్లు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈకార్యక్రమంలో జిల్లాలోని ఎంపిడి ఓలు, తహశీల్దార్లు, ప్రత్యేక అధికారులు, సబ్‌కలెక్టర్ నిషాంత్ కుమార్, తుడా కార్యదర్శి మాధవీలత, లీడ్ బ్యాంక్ మేనేజర్ రామ్మోహన్‌రావు పాల్గొన్నారు.

నూతన ఆంగ్ల సంవత్సర, వైకుంఠ ఏకాదశికి పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి
* జెఇఓ శ్రీనివాసరాజు ఆదేశం
తిరుపతి, డిసెంబర్ 8: నూతన ఆంగ్ల సంవత్సరం 2017 జనవరి 1, అదేవిధంగా 8, 9 తేదీల్లో వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల్లోవిశేష సంఖ్యలో భక్తులు తిరుమలకు రానున్న సందర్భంగా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని టిటిడి జెఇఓ శ్రీనివాసరాజు అధికారులను ఆదేశించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో ఆయన గురువారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈ పర్వదినాల్లో భక్తులకు మరింత ఉన్నతంగా దర్శన, వసతి, అన్నప్రసాద సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. టిటిడి నిబంధలను పాటిస్తూనే సామాన్య భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగడకుండా చర్యలు తీసుకోవాలన్నారు. జనవరి 7 ఉదయం నుంచి 9వ తేదీ రాత్రి వరకు దాతలకు కల్పిస్తున్న ప్రత్యేక సౌకర్యాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జిత సేవలను రద్దు చేసినట్లు తెలిపారు. క్యూలైన్లలో ఉన్న భక్తుల అవసరార్థం 3లక్షల తాగునీటి వాటర్ ప్యాకెట్లు సిద్ధం చేసుకోవాలన్నారు. కాలనుగుణంగా వచ్చే వ్యాధుల నివారణకు అవసరమైన మందులు అందుబాటులో ఉంచుకోవాలని, అదనంగా ప్రథమ చికిత్సా కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆయన చెప్పారు. తిరుమలను వైకుంఠాన్ని తలపించేలా పుష్ప, విద్యుత్ అలంకరణలు చేపట్టాలని ఆదేశించారు. ఘాట్ రోడ్లల్లో అత్యవసర పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని క్రేన్‌లను, అత్యవసర బృందాలను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఈ సమావేశంలో టిటిడి ఎస్‌ఇ -2 రామచంద్రారెడ్డి, డిప్యూటి ఇఒ కోదండరామారావు, విఎస్‌ఓ రవీంద్రారెడ్డి, ట్రాన్స్‌ఫోర్స్ జిఎం శేషారెడ్డి, అన్నప్రసాదం ఒఎస్‌డి చెంచులక్ష్మి, క్యాటరింగ్ అధికారి శాస్ర్తీ, ఆరోగ్యశాఖాధికారి షర్మిష్ట, టిటిడి ఒఎస్‌డి బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

ఉద్ధృతమవుతున్న కాంట్రాక్టు అధ్యాపకుల ఆందోళనలు
* రోడ్డుపైనే వంటావార్పుతో నిరసన
* ఆందోళనలకు వైకాపా శ్రేణుల మద్దతు
చిత్తూరు, డిసెంబర్ 8: 15 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలంటూ పోరుబాట పట్టిన కాంట్రాక్టు అధ్యాపకులు తమ ఆందోళనలను ఉద్ధృతం చేశారు. రెండు రోజులుగా అధ్యాపకుల రాష్ట్ర జెఎసి నాయకులతో రాష్ట్ర మానవ వనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు జరిపిన చర్చల సందర్భంగా ఇచ్చిన హామీలకు సంతృప్తి చెందని జిల్లాలోని పలు ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులు తమ ఆందోళలను మరింత ఉద్ధృతం చేసేందుకే నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం నుంచి రోజుకో రీతిలో ధర్నాలు, నిరసనలు చేపట్టాలని ఏకగ్రీవంగా తీర్మానించుకున్నారు. పదో పిఆర్‌సి మార్గదర్శకాల ప్రకారం ఉద్యోగ భద్రత కల్పించడం, సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా సమాన పనికి సమాన వేతనం చెల్లించడం వంటి ముఖ్యమైన అంశాలకు రాత పూర్వక హామీ లభించే వరకు ఆందోళనలు విరమించవద్దని రాష్ట్ర జెఎసి నాయకుల సూచనల మేరకు జిల్లా కేంద్రంలోనూ ఇకపై విభిన్న రీతిలో ఆందోళనలు చేపట్టాలని సంబంధిత అధ్యాపకులు నిర్ణయించుకున్నారు. అందుకనుగుణంగా జిల్లా జెఎసి అధ్యక్షుడు రెడ్డెప్పరెడ్డి ఆధ్వర్యంలో సభ్యులు సురేంద్రనాయుడు, గాయత్రి, లత, చంద్రబాబు, దేవరాజ, సహదేవలు తగు ప్రణాళికలు రచిస్తున్నారు.
వంటావార్పుతో నిరసన
ఆందోళనను ఉద్ధృతం చేసే చర్యల్లో భాగంగా గురువారం స్థానిక పిసిఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎదుట కాంట్రాక్టు అధ్యాపకులు వంటా వార్పుతో తమ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అధ్యాపకులు రోడ్డుపైనే పొయ్యి వెలిగించి భోజనం వండుకుని తిన్నారు. ప్రభుత్వ తీరుతో తమ బతుకులు రోడ్డుపైకి వచ్చాయని, దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయేందుకే తాము రోడ్డుపై వంటా వార్పు కార్యక్రమాన్ని చేపట్టామని ఈ సందర్భంగా అధ్యాపకుల జేఎసి నాయకులు తెలిపారు. అనంతరం సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి పరిష్కరించాలని కోరుతూ స్థానిక ఎమ్మెల్యే సత్యప్రభకు వినతిపత్రం సమర్పించారు.
వైకాపా శ్రేణుల మద్దతు
గత ఆరు రోజులుగా రోజుకో రీతిలో ఆందోళన చేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులకు వైకాపా శ్రేణులు తమ మద్దతు ప్రకటించాయి. ఈక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పురుషోత్తంరెడ్డి, వైఎస్సార్ సేవాదళ్ చిత్తూరు నగర అధ్యక్షుడు నరేష్‌చంద్రారెడ్డి, పార్టీ బిసి విభాగం నగర అధ్యక్షుడు జ్ఞానజగదీష్, సీనియర్ నాయకుడు మనోహర్‌రెడ్డి, విద్యార్థి విభాగంనేత ధరణీష్‌రెడ్డి, బిసి విభాగం నాయకులు సుజిత్, నవీన్ నవరసు,శ్రీను, సందీప్, దినకరన్ తదితరులు అధ్యాపకులకు మద్దతుఇచ్చి ఆందోళనలో పాల్గొన్నారు. సమస్యలను తమ పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి వద్దకు తీసుకెళ్లి పరిష్కరిస్తామని ఈ సందర్భంగా వారు అధ్యాపకుకు హామీ ఇచ్చారు.

సిద్ధాపురం గ్యాంగ్ అరెస్ట్
* 90 గ్రాముల బంగారు, రూ.80వేలు స్వాధీనం
తిరుపతి, డిసెంబర్ 8: తిరుపతి, తిరుమలలో భక్తులు రద్దీగా ఉండే ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతున్న ఏడుగురు సిద్దాపురం గ్యాంగ్‌ను అరెస్ట్ చేసినట్లు క్రైం ఏఎస్పీ సిద్దారెడ్డి చెప్పారు. గురువారం తిరుపతి క్రైం పోలీస్ స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సిద్దాపురం గ్యాంగ్‌కు చెందిన ఎం.రవీంద్రనాయక్ (22), ఎం.రోజాబాయి (25), పీట్ల జమ్ములమ్మ (28), వేముల వెంకట్రమణ (20), వేముల భారతి (45), చెదళ్ల భూదేవి (75), సముద్రాల గౌరి (27)ను బుధవారం స్థానిక నాలుక్కాళ్ల మండపం వద్ద అరెస్ట్ చేశామని చెప్పారు. నెల్లూరు జిల్లా బోగోలు మండలం, బిట్రగుంటకు చెందిన వీరు బస్టాండ్, రైల్వే స్టేషన్‌ల వద్ద, జాతరలు, తిరునాళ్లల్లో జేబు దొంగతనాలు, బ్యాగులు చోరీలకు పాల్పడేవారని తెలిపారు. తిరుమలలో రెండు దొంగతనాలకు పాల్పడ్డారని, వీరిని అరెస్టు చేసి 90 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.80వేలు నగదు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. జిల్లా ఎస్పీ జయలక్ష్మి ఆదేశాల మేరకు ఏఎస్పీ సిద్దారెడ్డి, క్రైం డిఎస్పీ టి.వి.కొండారెడ్డి ఆధ్వర్యంలో సిఐ సత్యనారాయణ అరెస్ట్ చేశారని చెప్పారు. సిఐలు శరత్‌చంద్ర, వి.్భస్కర్, ఎస్‌ఐలు ప్రభాకర్‌రెడ్డి, కె.చంద్రశేఖర్ పిళ్ళై, మోహన్‌గౌడ్, రామ్మూర్తి, సిబ్బంది సుధాకర్, మునిరాజ, చంద్రశేఖర్, మున్నా, రాజశేఖర్, మురళి, కామేశ్వరరావు, శివకుమార్, శేఖర్, శ్రీనివాసులు, రామయ్యలు సహకరించారన్నారు.

ఏపిఎస్‌ఎస్‌డిసి ఆధ్వర్యంలో 10న జాబ్ మేళా
తిరుపతి, డిసెంబర్ 8: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, టిఎంఎల్‌ఇటుఇ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో మోడల్ కెరీర్‌సెంటర్ ద్వారా ఈనెల 10న శనివారం స్థానిక ప్రకాశం రోడ్డులోని గాయత్రి డిగ్రీ, పిజి కళాశాలలో బిఎస్సీ, లేదా ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులకు వివిధ రకాల ఉద్యోగాల కోసం జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు ప్రాజెక్ట్ మేనేజర్ ఆర్.లోకనాథం గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అవకాశాన్ని జిల్లాలోని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈమేళాలో పాల్గొనదలచిన అభ్యర్థులు 9704727787, 7997008877 సెల్ నెంబర్లను సంప్రదించాలని కోరారు.

మొబైల్ హబ్ పనులు పరిశీలించిన ఐటి మంత్రి
రేణిగుంట, డిసెంబర్ 8: మండల పరిధిలోని విమానాశ్రయ సమీపంలో మొబైల్ హబ్ నిర్మాణ పనులను రాష్ట్ర ఐటి శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి గురువారం రాత్రి పరిశీలించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ సిఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని డిజిటల్ ఆంధ్రప్రదేశ్‌గా మార్చేందుకు ప్రణాళికా బద్ధంగా ముందుకు వెడుతున్నారన్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని కాకినాడ, అనంతపురం, చిత్తూరు శ్రీసిటీల్లో మొబైల్ హబ్‌లకు అనుమతులు ఇచ్చిందని చెప్పారు. తిరుపతి పుణ్యక్షేత్రంలో ఐటిలో భాగంగా ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌కు అనుమతులు ఇచ్చినట్లు చెప్పారు. రేణిగుంట వద్ద ప్రభుత్వం నిర్మిస్తున్న మొబైల్ హబ్‌లో సెల్‌కాన్, లాలా, కార్బన్ కంపెనీలకు 122 ఎకరాలస్థలం కేటాయించామన్నారు. ఈమూడు కంపెనీలు రూ.750 కోట్ల పెట్టుబడులతో నిర్మాణాలకు ముందుకు వచ్చాయన్నారు. ఇవి పూర్తయితే ఒక్క యూనిట్‌కు 10వేల మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. 4జి, 5జి మొబైల్ సేవలు ఇక్కడ నుంచి ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ, తెలుగుయువత జిల్లా అధ్యక్షులు శ్రీ్ధర్‌వర్మ, టిడిపి రాష్ట్ర కార్యదర్శి నరసింహయాదవ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

సుప్రీంకోర్టు తీర్పును గౌరవించైనా సమానవేతనం ఇవ్వండి
* డిస్కం సిఎండికి విద్యుత్ కార్మికుల వినతి
తిరుపతి, డిసెంబర్ 8: సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పునైనా గౌరవించి తమకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ కమిటీ కన్వీనర్ ఎం.సుధాకర్ డిస్కం సిఎండికి విజ్ఞప్తి చేశారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులను దశలవారీగా క్రమబద్ధీకరించాలని, కార్మికులకు ప్రతినెలా 1వ తేదీకి సంస్థే జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎస్‌ఒఒ 146 ప్రకారం పెయిడ్ హాలిడేస్, ఎర్న్‌లీవ్‌లు 2013 నుంచి ఇప్పటి వరకు ఉన్న బకాయిలను తక్షణం చెల్లించాలన్నారు. ఎక్స్‌గ్రేషియాను రూ.10లక్షలకు, క్రెడిట్‌ను రూ.2 లక్షలకు పెంచాలని కోరారు. ప్రతి సర్కిల్, డివిజనల్ స్థాయిలో కార్మికుల ఉపయోగార్థం గ్రీవెన్స్ సెల్‌ను ఏర్పాటుతోపాటుగా తమ 20 డిమాండ్లను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విలేఖరుల సమావేశంలో కార్యాచరణ కమిటీ ఉపాధ్యక్షులు ప్రహ్లాదయ్య, కో ఆర్డినేటర్లు రామనాధం, లోకేష్, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.