చిత్తూరు

యువత స్వామి వివేకానంద బాటలో నడవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, జనవరి 12: నేటి యువత స్వామి వివేకానంద బాటలో నడవాలని జడ్పి చైర్ పర్సన్ గీర్వాణి చంద్రప్రకాష్ పిలుపునిచ్చారు. గురువారం చిత్తూరు జడ్పి సమావేశ మందిరంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలు పురస్కరించుకొని ,జాతీయ యువజన దినోత్సవ వేడుకుల ఘనంగా జరిగాయి. ముందుగా వివేకానంద చిత్రపటానికి పూలమాలు వేసి నివాళి ఆర్పించారు. ఈసందర్భంగా జడ్పి చైర్‌పర్సన్ మాట్లాడుతూ వివేకానంద స్వామి యుగపురుషుడన్నారు. సంఘసేవలో తపించే వ్యక్తిగా, స్ర్తిలకు విద్యా సౌకర్యాన్ని కల్పిస్తే వారి సమస్యలను వారే పరిష్కరించుకొనే శక్తిగా ఎదుగుతారని చాటిచెప్పిన మహామనిషని కొనియాడారు. చిన్న వయస్సులోనే సంఘసేవలో పాలు పంచుకొని అనేక సేవా కార్యక్రమాలు చేపట్టిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. అనుకొన్న దాన్ని సాధించే వరకు పోరాటం చేయాలన్న ఆయన ఆశయం నేటితరం యువత స్పూర్తిగా తీసుకోవాని తెలిపారు. అతిచిన్న వయస్సులోనే ప్రపంచస్థాయిలో గుర్తింపు దక్కింది వివేకానంద స్వామికేనన్నారు. ఈయన ప్రసంగాలు మహాత్మ గాంధీని సైతం ప్రేరేపించడం నిజంగా గొప్ప విషయమన్నారు. దేశ భవిష్యత్తు యువతపైనే ఆధారపడి ఉందన్నారు. యువత కోసం ప్రభుత్వాలు కూడా అనేక సంక్షేమ కార్యక్రమలను చేపడుతున్నాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. చిత్తూరు ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ వివేకానంద స్వామి ఒక మహా శక్తని, కేవలం 39 ఏళ్ల వయస్సులోనే తన ఉపన్యాసాలతో ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొకున్నారన్నారు. చికాగోలో విశ్వమత సభల్లో తన ప్రసంగంతో యావత్ ప్రపంచాన్ని ఆకట్టుకొన్న గొప్పవ్యక్తిని కొనియాడారు. ఆశయం, త్యాగం, సేవలను విస్మరించరాదని చెప్పిన మహామనిషి వివేకానందుడన్నారు. యువతను చైతన్య పరచడానికి, వారిలో ఆత్య విశ్వాసం పెంచడానికి జీవితాంతం కృషి చేసారన్నారు. ప్రపంచ దేశాలకు భారతీయ సంస్కృతి సంప్రదాయాలను తెలియ జేసిన మహా గొప్పమేధావని తెలిపారు. మానవతా వాదిగా ఆయన ఆశయాలను సాధంచేందుకు అందురూ పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. అనంతరం జిల్లాలో యువజన, స్వచ్ఛంద సంస్థలు ప్రతినిధులకు పురస్కారాలను ప్రదానం చేసారు. ఈ కార్యక్రమంలో సెట్విన్ సిఈఒ నాగపద్మజ, నెహ్రుయువ కేంద్ర ప్రతినిధి భరత్, పివికెన్ కాలేజి ప్రిన్సిపాల్ దయానందరెడ్డ, రాష్ట్ర ఆర్థిక సహకార సంస్థ డైరెక్టర్ వైవి రాజేశ్వరి, జిల్లా యువజన కేంద్ర గణాంకాధికారి బాబు రెడ్డి, పలువురు జాతీయ యువజన సేవా కార్యకర్తలు , విద్యార్థులు పాల్గొన్నారు.

మన సంస్కృతిని కాపాడుకుందాం
* ఎంపి శివప్రసాద్ పిలుపు
తిరుపతి, జనవరి 12: పాశ్యాత్య సంస్కృతి నుంచి భారతీయ సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని చిత్తూరు ఎంపి డాక్టర్ ఎన్.శివప్రసాద్ సూచించారు. లాయర్స్ వాయిస్ ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గులు, గాలిపటాల పోటీల్లో విజేతలకు బహుమతుల ప్రదానోత్సవం గురువారం స్థానిక బైరాగిపట్టెడలో నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన చిత్తూరు ఎంపి శివప్రసాద్ మాట్లాడుతూ పాశ్చాత్య సంస్కృతి ప్రతి ఇంటిలో విలయతాండం ఆడుతోందని, దీంతో యువత తప్పుదోవ పడుతుందన్నారు. దీంతో తెలుగుభాష, తెలుగు పండుగలు, తల్లితండ్రుల మీద అభిమానం, ఆప్యాయత, మానవీయ విలువలు మరచిపోయే పరిస్థితి ఉందన్నారు. ప్రధానంగా నేడు వస్తున్న సినిమాలు, టివిలు అత్యంత వేగంగా ప్రభావం చూపిస్తున్నాయన్నారు. సంక్రాంతి పండుగు తెలుగువారి పెద్ద పండుగన్నారు. ఆ పండుగ విలువను గుర్తించే పరిస్థితిలో నేటి యువత లేదన్నారు. దీంతో నగరాల్లో, పట్టణాల్లో సంక్రాంతి పండుగ కరవైందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ పండుగను గొప్పగా జరుపుకుంటున్నారని, అందుకే అక్కడి వారు మన సంస్కృతి, సాంప్రదాయాల పట్ల విలువలతో వ్యవహరిస్తున్నారన్నారు. ఈ పోటీల్లో సుమారు 600 మంది పాల్గొనగా విజేతలైన వారికి 1,2,3 విభాగాల్లో బహుమతులు ప్రదానం చేశారు. ఈకార్యక్రమంలో తిరుపతి టౌన్ బ్యాంక్ చైర్మన్ పులుగోరు మురళీకృష్ణా రెడ్డి, టిడిపి నాయకులు సైకం జయచంద్రారెడ్డి, వైకాపా నాయకుడు పోకల అశోక్‌కుమార్, జికె బిల్డర్స్ అధినేత గంగాధర్‌రెడ్డి, శ్రీకర్ బిల్డర్స్ అధినేత దేవీప్రసాద్, సివి రామన్ అకాడమి కరస్పాండెంట్ వెంకటరమణ, టిడిపి నాయకులు చంద్రశేఖర్, రెడ్డెప్ప నాయుడు, ప్రమీలమ్మ, యశోద, భారతి, మిమిక్రి కళాకారుడు విజయ్‌కుమార్, సాంబోల హరినాథ్‌లు పాల్గొన్నారు.

పసుపు తోరణాలతో నారావారిపల్లి
చంద్రగిరి, జనవరి 12: చంద్రగిరి మండలం నారావారి పల్లి గ్రామంలో పూర్తిగా పసుపుతోరణాలు, పార్టీ పతాకాలు, స్వాగత ద్వారాలు, భారీ ఫ్లెక్సీలతో అత్యంత వైభవంగా ఏర్పాటుచేశారు. సంక్రాంతి ఉత్సవాలను పురస్కరించుకొని నారావారి పల్లికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, నారా కుటుంబ సభ్యులు, నందమూరి కుటుంబ సభ్యులు విచ్చేస్తున్న సందర్భంగా టిడిపి నాయకులు, కార్యకర్తలు ఈ ఏర్పాట్లు చేశారు. ఈ ఏర్పాట్లను కనుమూరి ఉదయ్‌కుమార్, సర్పంచ్ చంద్రకుమార్‌నాయుడు తదితరులు పర్యవేక్షిస్తున్నారు. జిల్లా తెలుగుయువత అధ్యక్షుడు శ్రీ్ధర్‌వర్మ, ఎవి రమణమూర్తి, టిఎన్‌ఎస్‌ఎఫ్ జాతీయ కార్యదర్శి రవినాయుడు, తెలుగుయువత నాయకులు ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. పోలీసులు అడుగడుగునా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటుచేశారు. ముఖ్యమంత్రి ప్రత్యేక భద్రతాధికారులతో కలిసి జిల్లా పాలనాధికారి సిద్దార్థజైన్, అర్బన్ ఎస్పీ జయలక్ష్మిలు భద్రతా ఏర్పాట్లను పరిశీలిస్తూ తగు సూచనలు, సలహాలు ఇస్తున్నారు. శుక్రవారం భోగి పండుగ వేళ నారా, నందమూరి కుటుంబ సభ్యులు భోగి మంటలతో గడపనున్నారు. ఇప్పటికే నారా లోకేష్ నారావారిపల్లి చేరుకున్నారు. శుక్రవారం సాయంత్రం విజయవాడ నుంచి బయలుదేరి రానున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదివారం తన నివాసంలో పార్టీ శ్రేణులు, గ్రామస్థులతో మాటామంతీ చేస్తారు. ఇలా ముఖ్యమంత్రి 3 రోజుల పాటు జన్మభూమిలో గడుపనున్నారు. జిల్లా యంత్రాంగం అందుకు అవసరమైన ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నది.

శాసన మండలి ఓటర్ల తుది జాబితా విడుదల

చిత్తూరు, జనవరి 12: చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం పట్ట్భద్రులు ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ నియోజక వర్గాల ఓటర్ల తుది జాబితాను విడుదల చేసారు. గురువారం ఎన్నికల అధికారి చిత్తూరు డిఆర్‌ఓ విజయ్ చందర్ ఈ జాబితాను ప్రకటించారు. చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం పట్ట్భద్రులు, ఉపాధ్యాయుల నియోజక వర్గాల ఎమ్మెల్సీల పదవీకాలం మార్చితో ముగియనుంది. దీంతో ఈలోగా ఈ ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల తుది జాబితాను తయారు చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఇందుకుగాను గత ఏడాది అక్టోబర్‌లో షెడ్యూల్డ్ విడుదల చేసారు. గతంలో ఉన్న ఓటర్ల జాబితాను రద్దుచేసి, తిరిగి కొత్తగా ఓటర్ల జాబితాను తయారు చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. అక్టోబర్ నెల నుంచి నవంబర్ ఐదవ తేది వరకు ఓటర్ల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. మూసాయిదా ఓటర్ల జాబితాను తయారు చేసారు. ఇందులో డిసెంబర్ 19 వరకు ఫిర్యాదులు స్వీకరించి, వచ్చిన వాటిపై విచారణ జరిపి ఓటర్ల తుది జాబితాను ప్రకటించారు. చిత్తూరు , నెల్లూరు, ప్రకాశం పట్ట్భద్రలు నియోజకవర్గ పరిధిలో మొత్తం 2,29,371 మంది ఓటర్లు ఉండగా, అందులో ప్రకాశం జిల్లాలో 77,831, నెల్లూరులో 75,494, చిత్తూరులో 76,046,మంది ఓటర్లు ఉన్నారు. ఉపాధ్యాయుల నియోజక వర్గంలో మొత్తం 20,480మంది ఉండగా అందులో ప్రకాశం జిల్లాలో 5,503మంది, నెల్లూరులో 5,977, చిత్తూరు జిల్లాలో 9000 మంది ఓటర్లు ఉన్నారు.

పేదలు ఆర్థిక స్వావలంబన సాధించాలి
*రాష్ట్ర సమాచారహక్కు చట్టం కమిషనర్ తాంతియాకుమారి పిలుపు
మదనపల్లె, జనవరి 12: పేదప్రజలు ఆర్థికంగా స్వావలంబన దిశకు చేరుకున్నప్పుడే నిజమైన స్వాతంత్య్రం పొందినట్లు అవుతుందని రాష్ట్ర సమాచారహక్కు చట్టం కమిషనర్ తాంతియాకుమారి అన్నారు. సమాచారహక్కు చట్టానికి వచ్చిన అప్పీళ్ళపై విచారణ రెండవరోజు గురువారం మదనపల్లె సబ్‌కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్‌లో జరిగింది. ఈ సందర్భంగా సమాచారహక్కు చట్టం కమిషనర్ తాంతియాకుమారి మాట్లాడుతూ అప్పీళ్ళ విచారణలో భాగంగా 26కేసులను విచారించి అందులో 19కేసులలో షోకాజ్ నోటీసులు ఇవ్వడంతో పాటు 3కేసులను విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. రెండుకేసులు వాయిదావేసి, మరో రెండుకేసులు కొట్టివేశారు. 3కేసుల పూర్తిచేసినట్లు వారు వెల్లడించారు. కలకడ మండలానికి చెందిన వెంకటాద్రి కేసుకు సంబంధించి డికెటి భూమిని దళితులకు కాకుండా కృష్ణాజిల్లాకు చెందిన వ్యక్తులకు ఇవ్వడంపై మదనపల్లె సబ్‌కలెక్టర్ వెట్రిసెల్వి, డిఆర్‌ఓ విజయచందర్ విచారణ చేయవలసినదిగా తెలిపారు. సదుంకు చెందిన రాజారెడ్డి కేసులో 1బి రికార్డులకు సంబంధించి, ఎర్రావారిపాళెంకు చెందిన యల్లారెడ్డి కేసులో 12సర్వేనెంబర్ల రికార్డుల విషయమై విచారణకు ఆదేశించారు. రెండుకేసులకు సంబంధించి మదనపల్లె సబ్‌కలెక్టర్ హాజరుకాగా, అందులో ఒకకేసుకు సంబంధించి సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. దరఖాస్తుదారునికి సమాచారాన్ని 30రోజులలో ఇవ్వాలని, సమాచారహక్కు చట్టంను పూర్తిస్థాయిలో అమలుచేసేందుకు అధికారులు మరింత చొరవ చూపాలన్నారు.

నల్లకుబేరుల దిష్టిబొమ్మ దగ్ధం చేసిన సిపిఐ
* మోదీకి ప్రజా కోర్టులో శిక్షతప్పదు
* సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ హెచ్చరిక

తిరుపతి, జనవరి 12: దేశంలోని నల్ల కుబేరుల వల్లే దేశాభివృద్ధి ఆగిపోతోందంటూ సిపిఐ ఆధ్వర్యంలో గురువారం బోగిమంటల్లో నల్లకుబేరుల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. స్థానిక బైరాగిపట్టెడలోని పార్కువద్ద ఒక రోజు ముందే భోగిమంటలు వేసిన సిపిఐ నాయకులు అవినీతికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ దేశంలోని నల్లడబ్బును వెలికి తీస్తానని ప్రగల్బాలు పలికిన ప్రధాని మోదీ తీరు ఉత్తరకుమారుని తలపిస్తోందని చెప్పారు. మోదీ చెప్పిన 50 రోజులు పూర్తయినా ఇప్పటి వరకు 60వేల కోట్లే జమైందని తెలిపారు. బ్యాంకుల వద్ద, ఏటిఎంల వద్ద నిలబడి 120మంది నిరుపేదలు ప్రాణాలను కోల్పోయారని, నల్లకుభేరులు మాత్రం ఆనందంగానే ఉన్నారన్నారు. ఇప్పటి వరకు నగదు రహిత లావాదేవీల పేరుతో ప్రజలపై పన్నుల భారాన్ని మోపి లక్ష 60వేల కోట్లును ప్రజల గోళ్లు ఊడకొట్టిమరీ వసూలు చేశారని నారాయణ మండిపడ్డారు. ప్రాణాలు కోల్పోయిన సామాన్యప్రజల ఆత్మలు శాంతించేలా సిపిఐ పోరాటాలు చేస్తుందని ఈ సందర్భంగా చెప్పారు. ప్రధాని మోదీకి ప్రజా కోర్టులో శిక్షతప్పదని ఆయన స్పష్టం చేశారు. ఈకార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి రామానాయుడు, నగర కార్యదర్శి పెంచలయ్య, నాయకులు మురళి, రాధాకృష్ణ, వి.జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

జన్మభూమి పేరుతో తెలుగు తమ్ముళ్లు దోచుకున్నారు
* ప్రతిపక్ష పార్టీల ఆరోపణ
తిరుపతి, జనవరి 12: జన్మభూమి గ్రామ సభలతో ప్రజలకు ఒరిగింది ఏమీలేదని, అయితే తెలుగు తమ్ముళ్లు మాత్రం రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు, ఇంటి స్థలాలు ఇప్పిస్తామంటూ ఒక్కోదానికి ఒక్క్ధోర నిర్ణయించి దోచుకున్నారని సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్, వైకాపా నాయకులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జన్మభూమి గ్రామసభల్లో ప్రశ్నించిన సిపిఎం నేతల అరెస్టుకు నిరసనగా గురువారం స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు చంద్రశేఖర్, సిపిఐ నాయకుడు పెంచలయ్య, కాంగ్రెస్ నాయకురాలు శ్రీదేవి, వైకాపా నాయకుడు తిరుత్తణి సుబ్రమణ్యంలు మాట్లాడుతూ జన్మభూమి గ్రామ సభలు కేవలం టిడిపి ప్రాచార ఆర్భాటానికే నిర్వహించారని మండిపడ్డారు. ఎక్కడా అర్హులైన పేదలకు ప్రభుత్వ పథకాలు దక్కలేదన్నారు. రేషన్‌కార్డు కావాలంటే రూ.500, ఆధార్‌కార్డు కావాలంటే రూ.1000, ఇంటి స్థలం కావాలంటే రూ. 5వేలు చొప్పున వసూలు చేసుకున్నారని వారు ఆరోపించారు. ప్రజలు పడుతున్న సమస్యలను పరిష్కరించడానికి బదులు, సిఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని స్వర్ణమయం చేస్తానని అరచేతిలో స్వర్గం చూపించారన్నారు. అన్ని చోట్ల మాటల గారడీలు తప్ప నిజమైన పేదలకు ఏం చేశారో మాత్రం చెప్పలేదన్నారు. ఇప్పటికి రేషన్‌కార్డులు లేనివారు, సొంత ఇళ్లు లేక అద్దె ఇంటిలో ఉండలేక అప్పులపాలవుతున్న పేదలకు అన్యాయమే జరుగుతోందని ఆరోపించారు. దీనిని ప్రశ్నిస్తే సిపిఎం నాయకులపై కేసులు బనాయించడం ప్రజాస్వామ్యమేనా అని ప్రశ్నించారు. సంక్రాంతి కానుక పేరుతో ఇస్తున్న సరుకులతో పేదలు ఎలా పండుగ చేసుకోవాలో సిఎం తన కుటుంబ సభ్యులతో చేసి చూపించాలని సవాల్ విసిరారు.

వచ్చే నెల 9 నుంచి జాతీయ స్థాయి కుస్తీ పోటీలు
* ఒలంపిక్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర కుస్తీ పోటీల అసోసియేషన్ అధ్యక్షుడు పురుషోత్తం వెల్లడి
చిత్తూరు, జనవరి 12 : వచ్చే నెల 9 వ తేది నుంచి 12 వ తేది వరకు చిత్తూరు నగరంలో 36వ జాతీయ స్థాయి బాయ్స్ ప్రీ స్టైల్, గ్రీకోర్మ్ సబ్ జూనియర్ లెవల్ కుస్తీ పోటీలను నిర్వహించనున్నట్లు ఒలంపిక్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర కుస్తీ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్‌కె పురుషోత్తం వెల్లడించారు. గురువారం ఆయన చిత్తూరులోని ఓ ప్రైవేటు హోటల్‌లో విలేఖరులతో మాట్లాడారు. చిత్తూరు చరిత్రలోనే తొలిసారిగా జాతీయ స్థాయి పోటీలను జరపనున్నట్లు చెప్పారు. 9వతేది సాయంత్రంలోగా ఆయా రాష్ట్ర క్రీడాకారులు చిత్తూరు నగరానికి చేరుకుంటారని, క్రీడలు ఫిబ్రవరి 10వతేది మధ్యాహ్నం 3గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతుల మీదుగా పోటీలు ప్రారంభమవుతాయని వివరించారు. నాలుగు రోజుల పాటు జరిగే ఈ పోటీలకు దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన దాదాపు1200 మందికిపైగా కుస్తీ క్రీడాకారులు పాల్గొంటారని వెల్లడించారు. సంబంధిత క్రీడలు సజావుగా నిర్వహించేందుకు వీలుగా 60 మందితో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేశామన్నారు. పోటీల ప్రారంభోత్సవానికి రియో ఒలంపిక్ పతకాల విజేతలు సాక్షిమాలిక్, సింధు, మేరీకోమ్‌లు సైతం హాజరు కానున్నారని తెలిపారు. ప్రారంభానికి ముందు ఆయా రాష్ట్రాల నుంచి వచ్చిన క్రీడాకారులు, ముఖ్య అతిథులతో చిత్తూరు నగరంలో పెద్దఎత్తున ర్యాలీ నిర్వహిస్తామన్నారు. వచ్చేనెల 12న జరిగే ముగింపు కార్యక్రమానికి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, ప్రముఖ బాలివుడ్ నటుడు అమీర్‌ఖాన్ సైతం హాజరవుతారని పేర్కొన్నారు. 2017వ సంవత్సరంలో రాష్ట్రంలోనే మెగా ఈవెంట్‌గా నిర్వహిస్తున్న ఈకుస్తీ పోటీలకు అన్ని క్రీడా అసోసియేషన్లు తమవంతు సహకారం అందజేయాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. అనంతరం పోటీల నిర్వహణపై జిల్లాలోని పలు క్రీడా అసోసియేషన్ల ప్రతినిధులు, పలువురు ఫిజికల్ డైరెక్టర్లు, పిఇటిల అభిప్రాయాలను సేకరించారు. కాగా ఈ సమావేశంలో ఒలంపిక్ అసోసియేషన్, తైక్వాండో అసోసియేషన్ అధ్యక్షులు చంద్రశేఖర్, సభ్యుడు శరత్‌కుమార్, బాస్కెట్‌బాల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు చెంగల్రాయనాయుడు, ప్రతినిధి జయప్రకాష్, ప్రముఖ క్రీడల నిర్వాహకులు జోసఫ్, పద్మనాభం తదితరులు పాల్గొన్నారు.

గిరి ప్రదక్షిణం సర్వోత్తమం
* ఆధ్యాత్మిక వేత్త చాగంటి ఉవాచ
శ్రీకాళహస్తి, జనవరి 12: శ్రీకాళహస్తిలో కైలాసగిరి ప్రదక్షిణం చేయడం సర్వోత్తమమని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు ఉద్బోధించారు. గురువారం ఆయన శ్రీకాళహస్తి దేవస్థానం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీకాళహస్తి దేవస్థానం నుంచి ప్రారంభమైన గిరిప్రదక్షిణ సుమారు 15 కిలోమీటర్లు సాగింది. ఈ సందర్భంగా చాగంటి మాట్లాడుతూ శ్రీకాళహస్తిలో పరమశివుడు కొలువై ఉన్నాడని, అన్నిచోట్లా దక్షిణ కాశీలు ఉన్నాయని, అయితే దక్షిణ కైలాసం మాత్రం ఒక్క శ్రీకాళహస్తి మాత్రమేనని వివరించారు. పరమశివుడు కొండ రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నాడని, ఈ విధంగా మరెక్కడా లేడన్నారు. ఈ కొండలో ఎన్నో తీర్థాలు, పవిత్ర ప్రదేశాలు ఉన్నాయని, ఋషులు, సిద్ధులు తపస్సు చేసుకుంటూ ఉంటారన్నారు. పార్వతీదేవి మొదట గిరి ప్రదక్షిణ చేసి ముక్తి పొందిందని, అదేవిధంగా భక్తులకు కూడా మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని ఎంతోకాలంగా చేయాలని అనుకుంటే ఇప్పటికి తీరిందని, శివుడు అనుగ్రహించాడని చెప్పారు. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ కమిషనర్ అనూరాధ, దేవస్థానం ట్రస్టుబోర్డు ఛైర్మన్ గురవయ్యనాయుడు, సభ్యులు, ఇఓ భ్రమరాంబలు గిరిప్రదక్షిణలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన భక్తులకు దేవస్థానం భోజన సదుపాయాలు కల్పించింది. భక్తులు ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొని చాగంటికోటేశ్వరరావు అనుగ్రహ భాషణాన్ని శ్రద్ధగా ఆలకించారు.