చిత్తూరు

స్పాట్ వాల్యూయేషన్ కేంద్రం ఎదుట ఉపాధ్యాయుల ధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, ఏప్రిల్ 11 : దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలంటూ జిల్లాలోని పలు ప్రాంతాల్లో పనిచేస్తున్న పలువురు ఉపాధ్యాయులు ఆందోళన చేపట్టారు. ఈ మేరకు ఉపాధ్యాయ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి (్ఫ్యప్టో, జాక్టో) ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక పిసిఆర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న పదోతరగతి పబ్లిక్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం (స్పాట్ వాల్యూయేషన్)ను బహిష్కరించారు. ఈ క్రమంలో స్పాట్ కేంద్రం ఎదుటే ధర్నాకు ఉపక్రమించారు. వీరికి పిడిఎఫ్ ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులురెడ్డి మద్దతు ప్రకటించి ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫ్యాప్టో, జాక్టోల ప్రతినిధి, అపస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బాలాజీ మాట్లాడుతూ పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుల జీవనానికి అవరోధాలు తెచ్చిపెట్టే కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సిపిఎస్) విధానాన్ని వెంటనే రద్దు చేసి, దాని స్థానంలో పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలన్నారు. స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని, వెబ్ కౌనె్సలింగ్, ప్రతిభ ఆధారిత పాయింట్ల విధానం, విద్యార్థులకు, ఉపాధ్యాయులకు భారంగా మారిన సిసిఇ విధానం, బాహ్య మూల్యాకనం విధానాలను రద్దు చేయాలని స్పష్టం చేశారు. ఎయిడెడ్, మోడల్ పాఠశాల టీచర్ల జీతాలు, పాత బకాయిలను చెల్లించాలని కోరారు. అదేవిధంగా ప్రభుత్వ, జిల్లా పరిషత్ పాఠశాలల టీచర్లతో సమానంగా పనిచేస్తున్న మున్సిపల్ టీచర్ల సర్వీసు రూల్స్ సమస్యలను వెంటనే పరిష్కరించడంతో పాటు అన్ని మేనేజ్‌మెంట్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు వేతన సవరణ కమిటీ సిఫార్సు మేరకు రావాల్సిన బకాయిలు, రెండు విడతల డిఎలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వీటితో పాటు పండితులకు కేటాయించిన పోస్టులను అర్హులైన పండితులకే కేటాయించాలని, ఈ ఏడాది ఫిబ్రవరి నెలలోప్రభుత్వం జారీ చేసిన జిఓ నెంబర్లు 14, 15లను యధాతధంగా అమలుచేసి తెలుగు, హిందీ, ఉర్దూ తదితర పండితులకు న్యాయం చేయాలని కోరారు. ముఖ్యంగా 2008 సంవత్సరంలో హామీ పత్రాల ద్వారా ఉద్యోగాలు పొందిన ఉపాధ్యాయులకు మంజూరు చేస్తున్న వేతన వ్యత్యాసం తొలగించాలని, జిల్లాలోని టీచర్లందరి సర్వీసు రెగ్యులరైజేషన్, సీనియారిటీ జాబితాలను వెంటనే విడుదల చేయడం, గతంలో ఫ్యాప్టో, జాక్టో ప్రాతినిధ్యం చేసిన అన్ని సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఈ సందర్భంగా బాలాజీ డిమాండ్ చేశారు.
ధర్నాను వ్యతిరేకించిన ఎస్‌ఎల్‌టిఎ, పండితులు :
సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పిసిఆర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల స్పాట్ కేంద్రం ఎదుట ఉపాధ్యాయులు చేస్తున్న ధర్నాను స్టేట్ లెవల్ తెలుగు టీచర్స్ అసోసియేషన్ (ఎస్‌ఎల్‌టిఎ) ప్రతినిధులతో పాటు పలువురు తెలుగు, హిందీ, ఉర్దూ ఇతర భాషా పండితులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో ధర్నాను బహిష్కరించి స్పాట్ కేంద్రంలోకి వెళ్తున్న ఎస్‌ఎల్‌టిఎ జిల్లా అధ్యక్షుడు దొడ్డ ఉమామహేశ్వరావుకు ఫ్యాప్టో, జాక్టో నాయకులకు మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. తమ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో ఫ్యాప్టో, జాక్టో ప్రతినిధులు విఫలం కావడంతోనే ధర్నాను బహిష్కరిస్తున్నామని పలువురు పండితులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. స్పాట్ వాల్యూయేషన్‌లో పాల్గొంటామంటూ డిఇఓ శామ్యూల్‌కు తమ సమ్మతిని తెలియజేశారు. దీంతో స్పాట్ కేంద్రం వద్ద మరోసారి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో ప్రధాన గేటు వద్ద ఇరువర్గాల వారు తోపులాడుకున్నారు. ప్యాప్టో, జాక్టో ప్రతినిధులను సవాలు చేస్తూ తెలుగు, హిందీ, ఇతర భాషా పండితులు స్పాట్ వాల్యూయేషన్ విధులకు హాజరయ్యారు. అయితే ఫ్యాఫ్టో, జాక్టో ప్రతినిధులు కొంతమంది మరోసారి పండితులతో సామరస్యపూర్వకంగా చర్చలు జరపడంతో వివాదం సద్దుమణిగింది.
* టీచర్ల ధర్నాకు ఎమ్మెల్సీ యండపల్లి మద్దతు :
స్పాట్ కేంద్రం వద్ద ధర్నా నిర్వహిస్తున్న ఉపాధ్యాయులకు ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులురెడ్డి తమ మద్దతును ప్రకటించి కాసేపు ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తప్పకుండా పరిష్కరిస్తానని ఆయన ఈ సందర్భంగా ఫ్యాప్టో, జాక్టో నాయకులు, పాల్గొన్న ఉపాధ్యాయులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలు ఉపాధ్యాయ సంఘాల నేతలు, పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

జ్యోతిరావు పూలే ఆశయ సాధనకు కృషి చేయాలి
* రాష్ట్ర పరిశ్రమల శాఖా మంత్రి అమరనాథరెడ్డి పిలుపు
చిత్తూరు, ఏప్రిల్ 11 : మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర పరిశ్రమల శాఖామంత్రి ఎన్ అమరనాథరెడ్డి కోరారు. మంగళవారం స్థానిక అంబేద్కర్ భవన్‌లో పూలే జయంతి వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు అధ్యక్షత వహించారు. తొలుత పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ బలహీన వర్గాల అభ్యున్నతికి ఆది పురుషుడైన పూలే జయంతి వేడుకలకు హాజరుకావడం ఆనందంగా ఉందన్నారు. పూలే ఆశయాలకు అనుగుణంగానే దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు పనిచేశారని గుర్తు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి పెద్దపీట వేశారని, ఇందులో భాగంగానే బిసి సబ్‌ప్లాన్ కింద రూ.10 వేల కోట్లు మంజూరు చేశారని వివరించారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా బిసిల కమ్యూనిటీ హాలు నిర్మాణానికి తగినన్ని నిధులను ప్రభుత్వం మంజూరు చేసిందని, భవన నిర్మాణానికి కూడా తప్పకుండా స్థలాన్ని కేటాయిస్తామని ఆయన ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. జడ్పీ చైర్‌పర్సన్ గీర్వాణి మాట్లాడుతూ వెనుకబడిన వర్గాల ఆశాజ్యోతి పూలే అని, అధికారులు, నాయకులు ఆయన బాటలోనే పయనిస్తూ రాష్ట్రం, జిల్లా అభివృద్ధికి పాటుపడాలని కోరారు. ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ పూలే ఒక మహోన్నత వ్యక్తి అని, ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చారు. అనంతరం ఎమ్మెల్సీలు గౌనివారి శ్రీనివాసులు, నరేష్‌కుమార్‌రెడ్డి, దొరబాబు, జెసి -2 వెంకటసుబ్బారెడ్డి, నగర మేయర్ సుబ్రహ్మణ్యం, బిసి ఫెడరేషన్ అడ్వయిజరీ కమిటీ డైరెక్టర్ షణ్ముగం, వడ్డెర ఫెడరేషన్ డైరెక్టర్ మీనాక్షితో పాటు బిసి సంఘాల నాయకులు జెల్లి మధుసూదన్, నారాయణ, అశోక్ ఆనంద్‌యాదవ్, ఆలిండియా ఎస్సీ, ఎస్టీ ఐక్యవేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మునస్వామి తదితరులు ప్రసంగించారు. ఇదిలాఉండగా కార్యక్రమంలో భాగంగా ఉదయం జడ్పీ చైర్‌పర్సన్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు స్థానిక పూలే విగ్రహానికి పూలమాలు వేసి ర్యాలీగా అంబేద్కర్ భవన్‌కు సాగారు. ఈ ర్యాలీని జడ్పీ చైర్‌పర్సన్ గీర్వాణి జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బిసి సంక్షేమశాఖ డిడి శ్రీధర్‌రెడ్డి, సాంఘిక సంక్షేమశాఖ జెడి విజయ్‌కుమార్‌తోపాటు పెద్ద ఎత్తున బిసి సంఘాల ప్రతినిధులు, బిసిలు, బడుగు, బలహీన వర్గాల ప్రజలు, విద్యార్థులు హాజరయ్యారు.

కుమారధారలో అదృశ్యమైన ఆదాయపు పన్నుశాఖ ఉద్యోగి
* గాలిస్తున్న పోలీసులు

తిరుపతి, ఏప్రిల్ 11: కుమారధార ముక్కోటి తీర్థానికి వెళ్లి తిరుపతిలోని ఆదాయపు పన్నుశాఖ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న సుబ్రహ్మణ్యం అదృశ్యమయ్యాడు. ఈ మేరకు అతని వెంట వచ్చిన సన్నిహితులు తిరుమల టు టౌన్ పోలీస్ స్టేషన్లో మంగళవారం ఫిర్యాదు చేశారు. ఈక్రమంలో పోలీసులు అటవీప్రాంతంలోను, కుమార తీర్థంలోని నీటి కొలనులోను గాలిస్తున్నారు. వివరాల్లోకి వెడితే సుబ్రహ్మణ్యం తన 8మంది స్నేహితులతో కలసి సోమవారం కుమారధార ముక్కోటి తీర్థానికి వెళ్లారు. సోమవారం అర్థరాత్రి అందరూ కలసి అక్కడున్న కొలనులో స్నానం ఆచరించడానికి వెళ్లారు. స్నేహితులందరు ఒక్కొక్కరు స్నానమాచరించి గట్టుపైకి వచ్చారు. అదే సమయంలో తమిళ మహిళా భక్తురాలు రక్షించండి.. రక్షించండి అంటూ కేకలు వేసింది. అయితే ఎవరిని రక్షించమంటుందో అర్ధంకాక అందరూ కొలను వద్దకు వెళ్లారు. ఆ చీకటిలో ఏమి కనిపించక పోవడంతో ఉదయం వరకు వేచి ఉన్నారు. తమతోవున్న సుబ్రహ్మణ్యం కనిపించకపోవడంతో వెంటనే టు టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుబ్రహ్మణ్యం అడవిలో దారితప్పాడా లేక ఆయనకేమైనా ప్రమాదం జరిగిందా అనే ది తెలియరాలేదు. మంగళవారం రాత్రి వరకు ఆయన ఆచూకీ దొరకలేదు.
తిరుమలలో తమిళనాడుకు చెందిన వృద్దుడు మృతి
జి ఎన్ సి టోల్ గేట్ వద్ద ఉన్న మురిగునీటి ట్యాంకులో తమిళనాడు రాష్ట్రం ఆడికరాట్టి, కానూరు తాలూకా, నీలిగిరికి చెందిన కుమారరామన్ (66) అనే వృద్ధుడు మృతి చెంది ఉండటాన్ని మంగళవారం గుర్తించారు. అయితే ఈవృద్దుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడా, మరేమనా కారణాలు ఉన్నాయన్నది తేలాల్సి ఉందన్నారు. ఈ మేరకు తిరుమల టు టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

విద్యతోనే అసమానతలు దూరం
* పూలే జయంతి సభలో టిటిడి ఇ ఓ సాంబశివరావు

తిరుపతి, ఏప్రిల్ 11: విద్య ద్వారానే సమాజంలో వివక్ష, అసమానతలు తొలగిపోతాయని టిటిడి ఇ ఓ డాక్టర్ డి.సాంబశివరావు అన్నారు. మహాత్మ జ్యోతి రావ్ పూలే 190 వ జయంతిని మంగళవారం టిటిడి పరిపాలనా భవంలో ఘనంగా నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన టిటిడి ఇ ఓ మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒక్కరు వారి పరిధిలో మార్పునకు కృషి చేసినప్పుడే మహానుభావుల ఆశయాలు నెరవేరుతాయన్నారు. ఏవిధమైన సిఫార్సులు లేకుంటా తిరుమలకు వచ్చిన భక్తులకు ప్రశాంతంగా స్వామివారి దర్శనమయ్యేలా ఉద్యోగులు కృషి చేయాలన్నారు. అలా చేసినప్పుడే పూల ఆశయాలను సాధించినట్లవుతుందని చెప్పారు. మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన జ్యోతిబాపూలే వర్ణ వ్యవస్థతో కునారిల్లుతున్న సమాజానికి సంస్కారం నేర్పారని కొనియాడారు. అణాగారిన వర్గాల సమున్నతి కోసం విద్యే సరైన ఆయుధమని పాఠశాలలు నెలకొల్పారని, స్ర్తి విద్యను ప్రోత్సహించారని, వితంతు పునర్వివాహానికి నాంది పలికారని వివరించారు. అన్ని వర్గాల వారికి విద్య, ఉపాధి, రాజకీయాల్లో సమాన అవకాశాలు కల్పించేందుకు కృషి చేశారని చెప్పారు. జె ఇ ఓ పోలభాస్కర్ మాట్లాడుతూ వివక్షకు గురవుతున్న బడుగులలో వెలుగునింపిన వ్యక్తి పూలే అన్నారు. సాంఘిక సంస్కరణలకు నాంది పలికిన ఘనత పూలేకు దక్కుతుందన్నారు. పేదల హక్కుల కోసం తన చివరి శ్వాస వరకు పోరాడారన్నారు. స్వాతంత్రోద్యమానికి ముందు సాంఘిక సంస్కరణోద్యమం ద్వారా సమాజంలోని వివిధ రుగ్మతలను రూపుమాపేందుకు పూలే విశేష కృషి చేశారని తెలిపారు. కారణ జన్ములైన కొంత మంది నాయకుల వల్ల సమాజంలో మార్పు సాధ్యమవుతుందని అలాంటి నాయకుల్లో జ్యోతిబాపూలే ఒకరని చెప్పారు. టిటిడి బిసి సెల్ లైజన్ ఆఫీసర్ రవిప్రభాకర్ మాట్లాడుతూ వెనుకబడిన వర్గాల సమస్యల పరిష్కారానికి రాజీలేని పోరాటం చేశారన్నారు. ఈకార్యక్రమంలో టిటిడి సహాయ ప్రజాసంబంధాల అధికారి పి.నీలిమ, డిప్యూటి ఇ ఓలు చలపతి బాబు, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

మున్సిపల్ ఉప ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి జయభేరి
* 1609 ఓట్ల మెజారిటీతో 38వ డివిజన్ కార్పొరేటర్‌గా వసంత్ ఎన్నిక
* నగరంలో టిడిపి భారీ ర్యాలీ
చిత్తూరు, ఏప్రిల్ 11 : చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 38వ డివిజన్‌కు జరిగిన ఉప ఎన్నికల్లో అధికార టిడిపి అభ్యర్థి వసంత్‌కుమార్ జయభేరి మోగించారు. ఈ నెల 9వ తేదీన జరిగిన ఈ ఉప ఎన్నికకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియను మంగళవారం నిర్వహించారు. స్థానిక పివికెఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద అత్యంత పటిష్ట బందోబస్తు మధ్య ఉదయం 8 గంటలకు నిర్వహించిన ఓట్ల లెక్కింపు కార్యక్రమంలో టిడిపి అభ్యర్థి చెరుకూరి వసంత్‌కుమార్ తమ సమీప వైకాపా అభ్యర్థి సి జ్యోతిపై 1609 ఓట్ల మెజారిటీతో గెలుపొంది సత్తా చాటారు. ఈ డివిజన్‌లో మొత్తం 3594 ఓట్లు ఉండగా, వాటిలో 2317 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీటిలో టిడిపి అభ్యిర్థి వసంత్‌కుమార్ 1963 ఓట్లు సాధించగా, వైకాపా అభ్యర్థి జ్యోతికి కేవలం 354 మాత్రమే లభించాయి. పోలైన ఓట్లులో 1/6 వంతు రాబట్టుకోవడంలో విఫలమైన జ్యోతి మరో 32 ఓట్లు వెనుకబడి డిపాజిట్‌ను సైతం కోల్పోయారు. కార్పొరేటర్‌గా గెలుపొందిన వసంత్‌కుమార్‌కు ఎన్నికల అధికారి ఇన్భనాధన్, కార్పొరేషన్ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం ఎన్నిక ధ్రువీకరణ పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వసంత్‌కుమార్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి టిడిపి బి-్ఫరం అందించిన చిత్తూరు ఎమ్మెల్యే సత్యప్రభకు రుణపడి ఉంటానన్నారు. ఆమె నమ్మకాన్ని వమ్ము చేయకుండా మంచి మెజారిటీతో గెలిపించిన పార్టీ శ్రేణులు, డివిజన్ ఓటర్లకు ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు.
టిడిపి శ్రేణుల సంబరాలు :
టిడిపి నాయకులు, కార్యకర్తలు మంగళవారం ఉదయం చిత్తూరు నగరంలో సంబరాలు చేసుకున్నారు. ఈ క్రమంలో తొలుత స్థానిక దుర్గమ్మ వారి ఆలయంలో పార్టీ నాయకులతో కలిసి వసంత్‌కుమార్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఓపెన్ టాప్ జీపులో ఎక్కి మిట్టూరు వరకూ ర్యాలీగా వెళ్తూ నగరవాసులు, ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకుడు డికె బద్రినారాయణ, టౌన్ బ్యాంక్ చైర్మన్ షణ్ముగం, దుర్గమ్మ ఆలయ పాలక మండలి చైర్మన్ విశ్వనాథ్, టిడిపి నగర అధ్యక్షుడు మాపాక్షి మోహన్, నాయకులు డిష్ సురేష్, రణధీర్, పులికంటి గోపి, సుధీర్, ప్రసాద్, సతీష్ తదితరులు పాల్గొన్నారు

తుంబుర తీర్థానికి విచ్చేసిన భక్తులకు విస్తృత ఏర్పాట్లు
* జెఇఓ శ్రీనివాసరాజు
తిరుపతి, ఏప్రిల్ 11: తిరుమలలోని శేషాచల అడవుల్లో ప్రముఖ తీర్థాల్లో ఒకటైన తుంబురు తీర్థముక్కోటికి విచ్చేసిన భక్తులకు విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టామని టిటిడి తిరుమల జె ఇ ఓ శ్రీనివాసరాజు తెలిపారు. తుంబురు తీర్థానికి వెళ్లే మార్గంలో పాపవినాశనం డ్యామ్ వద్ద భక్తుల సౌకర్యార్థం చేపట్టిన అన్నప్రసాదాలు, తాగునీటి పంపిణీని మంగళవారం జె ఇ ఓ పరిశీలించారు. అనంతరం పలువురుభక్తులకు జె ఇ ఓ అన్నప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జె ఇ ఓ మాట్లాడుతూ తుంబురు తీర్థానికి వెళ్లే మార్గంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. భక్తులందరికీ రెండు పులిహోరా, ఒక పెరుగన్నం, మజ్జిగ ప్యాకెట్, నాలుగు తాగునీటి ప్యాకెట్లను ఒకసంచిలో శ్రీవారి సేవకుల ద్వారా పంపిణీ చేసినట్లు వివరించారు. దాదాపు 30 వేలమంది భక్తులు తుంబురు తీర్థ ముక్కోటికి విచ్చేసినట్లు ఆయన తెలిపారు. పాల్గుణ మాసంలో ఉత్తర ఫల్గుణి నక్షత్రంతో కూడిన పౌర్ణమినాడు అనగా మంగళవారం తుంబుర తీర్థ ముక్కోటి ఉన్న నేపథ్యంలో సోమవారం ఉదయం నుంచి భక్తులు కాలినడకన ఈ తీర్థానికి వెళ్లారు. భక్తుల భద్రతకు సంబంధించి టిటిడి భద్రతా విభాగం, పోలీసులు, అటవీశాఖ సిబ్బంది కలిసి పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. టిటిడి అన్నప్రసాదాలు అందించడంపై భక్తులు సంతోషం వ్యక్తం చేశారు. ఈకార్యక్రమంలో ఎస్ ఇ 2 రామచంద్రారెడ్డి, వి ఎస్ ఓ రవీంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

బూత్ కమిటీలను పటిష్టం చేయండి
* బూత్ కమిటీలతోనే యుపిలో విజయం * కేంద్రమంత్రి కల్‌రాజ్ మిశ్రా
శ్రీకాళహస్తి, ఏప్రిల్ 11: బూత్ కమిటీలు పటిష్టంగా ఉండటం వల్లే యుపి ఎన్నికల్లో విజయంసాధించామని అలాగే ఏపిలో కూడా కమిటీలను ఏర్పాటు చేయాలని కేంద్ర చిన్న తరహా పరిశ్రమల శాఖ మంత్రి కల్‌రాజ్ మిశ్రా అన్నారు. మంగళవారం శ్రీకాళహస్తి పట్టణంలోని శివం కల్యాణ మండపంలో బూత్ స్థాయి కమిటీల సమావేశం జరిగింది. ఈసమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ ప్రతి నియోజక వర్గంలో, పట్టణాలు, గ్రామాల్లో బూత్ స్థాయి కమిటీలను ఏర్పాటు చేసి వాటిని పటిష్టం చేయాలని పిలుపునిచ్చారు. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ప్రతిష్టాత్మక ఎన్నికల్లో బిజెపి విజయం సాధించడానికి ఈ కమిటీలే కీలక బాధ్యత వహించాయని, బూత్ స్థాయి కమిటీలు పటిష్టంగా ఉంటే ప్రతి ఎన్నికల్లో సులభంగా విజయం సాధించవచ్చని పేర్కొన్నారు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో కేంద్రం అమలు చేస్తున్న జన్‌ధన్, దీపం వంటి పథకాల గురించి ప్రజలకు వివరించాలన్నారు. వీటిని గ్రామస్థాయికి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ఈకార్యక్రమంలో టిటిడి పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్‌రెడ్డి, పార్టీ నాయకులు శాంతారెడ్డి, జిల్లా అధ్యక్షుడు చంద్రారెడ్డి, ఉమా, ఆంజనేయ రెడ్డి, రాజు తదితరులు పాల్గొన్నారు.
శ్రీసిటీలో పర్యటించిన చైనా వ్యాపార ప్రతినిధుల బృందం
సత్యవేడు, ఏప్రిల్ 11: చైనా జియాంగ్ న్సూ రాష్ట్రానికి చెందిన ఐదుగురు సభ్యుల వ్యాపార ప్రతినిధుల బృందం మంగళవారం శ్రీసిటీలో పర్యటించింది. వారంతా ఎలక్ట్రానిక్, వౌళిక వసతులు, గృహనిర్మాణం, నిర్మాణ వస్తువుల తయారీ వంటి వ్యాపార రంగాలకు చెందిన వారు. వీరికి శ్రీసిటీ ఎండి రవీంద్ర సన్నారెడ్డిస్వాగతం పలికారు. అనంతరం జరిగిన సమావేశంలో వివిధ అంశాలపై చర్చించారు.