చిత్తూరు

రాయలసీమను రతనాలసీమగా మారుస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఆగస్టు 15: రాయలసీమను రతనాల సీమగా మారుస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మరోమారు పునరుద్ఘాటించారు. ఎస్వీయూ తారకరామా స్టేడియంలో జరిగిన పంద్రాగస్టు వేడుకల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ నేడు రాష్ట్రంలో భిన్నమైన పరిస్థితులు కనబడుతున్నాయన్నారు. ప్రధానంగా వర్షాభావం తీవ్రంగా ఉందన్నారు. భారతదేశంలో తక్కువ వర్షపాతం పడే జిల్లాలో రెండో స్థానంలో అనంతపురం జిల్లా ఉందన్నారు. అందుకు ప్రధాన కారణం ప్రకృతిని పరిరక్షించుకోవడంలో జరుగుతున్న నిర్లక్ష్యమేనన్నారు. రాయలసీమలో కరవు కనబడుతోందని, కోస్తా జిల్లాలో తుఫాన్లు వస్తున్నాయన్నారు. ఇది అనాదిగా వస్తున్నదేనన్నారు. ఇందుకు కారణం వాతావరణంలో సమతుల్యత కోల్పోవడమేనని చెప్పారు. అందుకే ప్రకృతి పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. రాయలసీమను రతనాల సీమగా మార్చడం అసాధ్యమేమీ కాదన్నారు. భూగర్భజలాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యతను పెంచుకోవాలన్నారు. ఈ స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా ఎవరికి వారు ప్రతిజ్ఞ చేసుకోవాలన్నారు. నీరు లేకపోతే ప్రగతి ఉండదన్నారు. సమస్యలు కూడా పెరుగుతాయన్నారు. నీటి కోసం యుద్దాలు జరిగే పరిస్థితులు నెలకొంటున్నాయని ఆయన హెచ్చరించారు. వర్షపునీటిని భూగర్భజలాలుగా మార్చేందుకు రాష్టవ్య్రాప్తంగా పంట సంజీవనిని తవ్వించే కార్యక్రమం చేపట్టామన్నారు. చెరువుల్లో పూడికలు తీస్తున్నామన్నారు. గొలుసుకట్టు చెరువులను మరమ్మతులు చేస్తున్నామన్నారు. ఓవైపు నీరును పరిరక్షించుకుంటూనే సమర్థవంతంగా నీటిని పరిరక్షించుకోవాలన్నారు. అందుకోసమే సాంకేతికతను వ్యవసాయ రంగానికి అనుసంధానం చేసి డ్రిప్ ఇరిగేషన్ లాంటి విధానాలను అమలుచేస్తున్నామన్నారు. మనకు ఎన్నో నదులున్నా గోదావరి, కృష్ణాజలాలే మనకు నీరు అందిస్తాయన్నారు. గోదావరినీరు ఇప్పటికి కూడా సముద్రం పాలవుతుందని, కృష్ణాలో నీరే కరవైందన్నారు. అందుకే నదులు అనుసంధానం చేసి ఈ నీటిని పరిరక్షించడం కోసం మహారాష్ట్ర, కర్ణాటక, కొత్తగా తెలంగాణ రాష్ట్రాలు మనకు పైభాగాన ఉన్నాయన్నారు. వారు వదిలితేనే మనకు నీరన్నారు. అందుకే రాష్ట్రానికి ఇలాంటి సమస్యలు తలెత్తకూడదని, నదుల అనుసంధానికి శ్రీకారం చుట్టానన్నారు. ఈ క్రమంలోనే పోలవరం ప్రాజెక్టును కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి సాధించానన్నారు. పోలవరం ఒక వరమని, ఆ ప్రాజెక్ట్ పూర్తయితే కరవు పారిపోతుందన్నారు. 2018 నాటికి పోలవరంకు నీరు తీసుకురావడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తామన్నారు. 2019నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తిచేయిస్తానన్నారు. చిత్తూరు జిల్లా పుణ్యక్షేత్రాలకు నిలయం అన్నారు. అన్నిరకాలుగా అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉందన్నారు. జిల్లాను ఒక విద్యాకేంద్రంగా మార్చానని, రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌ను ఒక విజ్ఞాన కేంద్రంగా మారుస్తానన్నారు.
ఆడపిల్లలతో ఆడుకుంటే కఠినంగా వ్యవహరిస్తా
ఆడపిల్లకు భద్రతకల్పించే బాధ్యత తన ప్రభుత్వం తీసుకుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. ఆడపిల్లలతో ఆడాలని ఎవరు ప్రయత్నించినా అందుకు తగిన మూల్యం తప్పదన్నారు. కఠినంగా చర్యలు తీసుకుంటామన్నారు. మహిళల ఆర్థిక సాధికారతే కాకుండా వారికి భద్రత కల్పించే భరోసాను తమ ప్రభుత్వం ఇస్తుందన్నారు.
తిరుపతిని స్మార్ట్‌సిటీ ప్లస్‌గా అభివృద్ధిచేస్తా
స్మార్ట్‌సిటీగా ఎన్నికైన తిరుపతి నగరాన్ని స్మార్ట్‌సిటీ ప్లస్‌గా అభివృద్ధి చేసి తీరుతానని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. పంద్రాగస్టు వేడుకలలో మంగళవారం పాల్గొన్న ఆయన తన ప్రసంగంలో తిరుపతి నగర అభివృద్ధిపై ప్రత్యేకంగా ప్రస్తావించారు. హుద్ హుద్ తుఫాన్ వచ్చిన సమయంలో విశాఖపట్టణం చిన్నాభిన్నంగా అయిందని, దానిపై ప్రత్యేక శ్రద్దచూపి అభివృద్ధి పరిచిన విషయాన్ని గుర్తుచేశారు. తిరుపతి పుణ్యక్షేత్రం కలియుగ ప్రత్యక్షదైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువుదీరి ఉన్నారని, ఈక్రమంలో తిరుపతిలో పచ్చదనం, పరిశుభ్రతతో క్లీన్ సిటీగా అభివృద్ధి చెందిందన్నారు. తిరుపతిలో చెరువులు ఎక్కువగా ఉన్నాయని, వాటిని అనుసంధానం చేసి లేక్ సిటీగా తయారుచేస్తానన్నారు. ఎన్‌టిఆర్ పట్టణ గృహ నిర్మాణ పథకం కింద నగరంలో 10వేల ఇళ్లను నిర్మిస్తున్నామన్నారు. స్మార్ట్‌సిటీకి ఎంపికైన తిరుపతిలో త్వరలో 1600 కోట్ల రూపాయలతో 77 ప్రాజెక్టుల పనులు ప్రారంభిస్తారన్నారు. అమృత కార్యక్రమంలో భాగంగా మరో 110 కోట్ల విలువైన పనులు జరుగుతాయన్నారు. ఏది ఏమైనా తిరుపతిని విశాఖపట్టణంకు ధీటుగా అభివృద్ధి చేస్తామన్నారు.

పంద్రాగస్టు రోజున జిల్లాకు సిఎం వరాల జల్లు
* అభివృద్ధి పనులకు రూ.67 కోట్లు
* ఎస్వీయూ తారకరామ స్టేడియం అభివృద్ధికి రూ.6కోట్లు
* జిల్లాకు కొత్త రహదారుల ఏర్పాటుకు హామీ
రేణిగుంట, ఆగస్టు 15: తిరుపతిలో తొలిసారిగా మంగళవారం జరిగిన పంద్రాగస్టు వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎంతో ఉత్సాహంగా, ఆనందంగా కనబడ్డారు. ఈ క్రమంలో చిత్తూరు జిల్లాకు ఆయన వరాలజల్లు కురిపించారు. ముఖ్యంగా తిరుపతిలో అధనంగా కలిసిన ఎమ్మార్‌పల్లి, తిమ్మినాయుడుపాళెం, రాజీవ్‌నగర్ పంచాయతీల అభివృద్ధికి రూ.67 కోట్లు నిధులు మంజూరుచేస్తానని ప్రకటించారు. అంతేకాదు పంద్రాగస్టు వేడుకలు తారక రామా స్టేడియంకు మహర్దశను తీసుకొచ్చి పెట్టాయి. ఎన్‌టిఆర్ పేరుతో ఉన్న ఆ స్టేడియం ఇటీవల వర్షాలకు బురదమయం కావడాన్ని గమనించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్టేడియంను ఆధునీకరించడానికి రూ.6కోట్లు మంజూరుచేసినట్లు ప్రకటించారు. జిల్లాలో ఉన్న 8 మునిసిపాలిటీల పరిధిలో 43వేల ఇళ్లు నిర్మించి నిరుపేదల ఇంటి కల పండిస్తామన్నారు. నాయుడుపేట-చిత్తూరుకు 6 లైన్ల రోడ్లను, తిరుపతి-మదనపల్లికి వయా పీలేరు మీదుగా మరో రోడ్డు నిర్మిస్తామన్నారు. కుప్పం, వయా వి.కోట మీదుగా బెంగళూరు వెళ్లే రహదారిలో, పుత్తూరు-సత్యవేడు నాలుగు లైన్ల రోడ్లు ఏర్పాటుచేస్తామని హామీ ఇచ్చారు. చిత్తూరు జిల్లా వాసులకు నీటి కొరత లేకుండా హంద్రీ-నీవా ప్రాజెక్టును సెప్టెంబర్‌లో పూర్తిచేయిస్తామన్నారు. గాలేరు-నగరి ప్రాజెక్టులను 2018-19 నాటికి పూర్తిచేయిస్తామన్నారు. తడ-శ్రీకాళహస్తి మధ్య నాలుగులైన్లరోడ్డును మంజూరుచేస్తామన్నారు. ఈ పంద్రగస్టు వేడుకల నేపథ్యంలోజిల్లాపై ప్రత్యేక ఫోకస్ పెడుతామన్నారు. ఎక్కడ పంద్రాగస్టు వేడుకలు నిర్వహిస్తామో ఆ జిల్లా సమగ్రాభివృద్ధికి దృష్టిసారించే ఆనవాయితీ పాటిస్తున్నామన్నారు. రాబోయే 2 సంవత్సరాల్లో పట్టణాల్లో 50,806 ఇళ్లు పూర్తవుతాయన్నారు. తద్వారా పేదవాడికి ఇంటి సమస్యలేకుండా చేస్తామన్నారు. ఇదిలా ఉండగా తాను ఈ వేదికపై నుంచి రాష్ట్రంలో ప్రతి ఒక్కరినీ కోరేది ఒక్కటేనని, అభివృద్ధిలో ప్రజలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.

భక్తజన సంద్రమైన శ్రీకాళహస్తి
* మరో శివరాత్రిని తలపించిన భక్తులు
* శ్రీకాళహస్తీశ్వరాలయంలో రద్దీ, ఆడికృత్తికకు పోటెత్తిన భక్తులు
శ్రీకాళహస్తి, ఆగస్టు15: శ్రీకాళహస్తిలో మంగళవారం భక్తజనంతో నిండిపోయింది. వరుస సెలవులతో గత 3 రోజులుగా కిటకిటలాడిన శ్రీకాళహస్తీశ్వరాలయం మంగళవారం మరింత రద్దీ పెరగడంతో శివరాత్రిని తలపించింది. తెల్లవారుజామునుంచే భక్తులు స్వామి, అమ్మవార్ల దర్శనం కోసం రావడంతో క్యూలైన్లు నిండిపోయాయి. దేవస్థానం సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బంది అదనపు క్యూలైన్‌లను ఏర్పాటుచేయాల్సి వచ్చింది. దీనికితోడు రాహు-కేతు పూజలు కూడా ఎక్కువ మంది భక్తులు రావడంతో దానికి సంబంధించిన క్యూలైన్లు కూడా నిండిపోయాయి. దీంతో ఆలయంలో, ఆవరణంలో ఎక్కడ చూసినా భక్తులే. దర్శనానికి, రాహు-కేతు పూజలకు కనీసం 4 నుంచి 5 గంటల సమయం పట్టింది. అధికారులు, సిబ్బంది క్యూలైన్‌లను పరిశీలించి త్వరగా దర్శనం చేయడానికి ప్రయత్నించినా భక్తులు గంటల తరబడి క్యూలైన్‌లలో వేచి ఉండాల్సి వచ్చింది. మధ్యాహ్నం 4 గంటలకు 60వేల మందికి పైగా భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. సుమారు 3500 రాహు-కేతు పూజలు జరిగాయి. రిటైర్డ్ డిజిపి దినేష్ రెడ్డి, సినీ నటుడు, రచయిత తనికెళ్లభరణి స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. వీరికి దేవస్థానం సిబ్బంది, ట్రస్టుబోర్డు సభ్యులు దర్శనం చేయించి తీర్థప్రసాదాలను అందజేశారు. రాత్రి వరకు భక్తుల రద్దీ కొనసాగింది.
ఆడికృత్తికకు పోటెత్తిన భక్తులు
ఆడికృత్తిక సందర్భంగా శ్రీకాళహస్తి క్షేత్రం సుబ్రహ్మణ్య స్వామి భక్తులతో హరోంహర నినాదాలతో మారుమోగింది. తమిళమాసమైన ఆడినెలలో వచ్చే కృత్తికకు విశేష ప్రాధాన్యత ఉంది. అధికమాసం కావడంతో ఆడినెల చివరిలో కృత్తికను ఉత్సవంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సోమవారం జరిగిన భరణి ఉత్సవం నుంచే భక్తుల రద్దీ పెరిగింది. మంగళవారం తెల్లవారుజామున 4 గంటల నుంచి భక్తులు విజ్ఞానగిరిపై ఉన్న కుమారస్వామి ఆలయానికి రావడం ప్రారంభమైంది. ఉదయం 9 గంటల తరువాత రద్దీ బాగా పెరిగింది. ఒకవైపు నుంచి కొండపైకి వెళ్లడానికి, మరోవైపు నుంచి కిందకు దిగడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. పూలకావళ్లుతో వచ్చిన భక్తులు నారదపుష్కరిణిలో తలనీలాలు సమర్పించి స్నానాలు చేసి కొండమీదకు వెళ్లి మొక్కులు తీర్చుకున్నారు. మధ్యాహ్నం 4 గంటలకు సుమారు 30వేల మంది భక్తులు కుమారస్వామిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా డిఎస్పీ వెంకటకిషోర్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. ట్రాఫిక్‌ను కూడా మళ్లించారు. కుమారస్వామి తిప్ప, ఆర్టీసీ బస్టాండు, బాబు అగ్రహారం, సినిమా వీధి, మార్కెట్ వీధుల్లో భక్తులు వెళ్లిపోయారు. నడిచి వెళ్లడానికి కూడా ఇబ్బందులు పడ్డారు. తలనీలాలు సమర్పించడానికి నారద పుష్కరిణిలో కూడా భక్తులు వేచి ఉండాల్సి వచ్చింది. ఇఓ భ్రమరాంబ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆలయం వద్దే ఉండి భక్తుల రద్దీని సమీక్షించారు. సిబ్బందికి అవసరమైన సూచనలు చేశారు. బోర్డు సభ్యులు ప్రమీలమ్మ, వెంకటరామానాయుడు, గుర్రప్పశెట్టి, జయగోపాల్ తదితరులు స్వామిని దర్శించుకున్నారు. రాత్రి వరకు రద్దీ కొనసాగింది.

గిరిజనులకు ఉప ప్రణాళికల ద్వారా రూ.3,528కోట్లు ఖర్చు చేస్తున్నాం
* 14మంది గిరిజనులకు ఇన్నోవాలు పంపిణీ
రేణిగుంట, ఆగస్టు 15: ఈ ఆర్థిక సంవత్సరానికి గిరిజనులకు ఉప ప్రణాళిక ద్వారా రూ.3,528కోట్లు ఖర్చు చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెల్లడించారు. జిల్లాలో రెండు రోజులు పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణంలో రేణిగుంట విమానాశ్రయంలో గిరిజన సంక్షేమ ఆధ్వర్యంలో జిల్లాలోని 14మంది గిరిజనులకు ఇన్నోవాలను పంపిణీ చేసి తాళాలు అందజేశారు. రూ.15,48,372 విలువ చేసే ఇన్నోవా కార్లను స్టాండప్ పథకం ద్వారా 14మంది లబ్ధిదారులకు రూ.15కోట్ల విలువ చేసే పంపిణీ చేయడంపై గిరిజనుల్లో ఆనందం వ్యక్తమైంది. ఈ సందర్భంగా సంక్షేమ శాఖ ఎండి ముఖ్యమంత్రితో మాట్లాడుతూ ఇండియన్ బ్యాంకు ఆధ్వర్యంలో ఐదుమంది లబ్ధిదారులకు, సప్తగిరి బ్యాంకు ద్వారా ముగ్గురికి, ఎస్‌బిఐ ద్వారా నలుగురికి, ఆంధ్రాబ్యాంకు ద్వారా ఇద్దరికి ఇన్నోవా కార్లు అందజేశామన్నారు. రెండు రోజుల్లో రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామన్నారు. మగవారికి 5లక్షలు సబ్సిడీ, మహిళలకు ఆరులక్షలు సబ్సిడీ ఇస్తున్నామన్నారు. కరకంబాడిలోని లక్ష్మీకాంతమ్మ అనే వృద్ధురాలికి ఆరోగ్యం సరిగా లేదని పలువురు విజ్ఞప్తి చేయడంతో స్పందించిన సిఎం తన సహాయ నిధి నుండి రూ.50వేలు ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు శంకర్, తలారి ఆదిత్య, ఎస్టీ కార్పొరేషన్ ఎండి రవీంద్రబాబు, తుడా చైర్మన్ నరసింహయాదవ్, సంక్షేమ శాఖ అధికారులు శ్రీనివాసరావ్, లీడ్ బ్యాంకు మేనేజర్ లక్ష్మీనారాయణ, ఇండియన్ బ్యాంకు అధికారి సూరిబాబు, జయరాం నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఇన్నోవా కార్లు అందుకున్న లబ్ధిదారులు బి.రోజ, ఎం.శైలజ, పి.రేఖ, సుష్మనాయక్, యుగందర్, బేబిషాలిని, మోహన్, విజయ, ముత్యాలు, రమేష్‌నాయక్‌లు ఆనందం వ్యక్తం చేశారు.

ప్రాణాలను హరించిన సెల్ఫీ సరదా
* చెలిమిచేను వాటర్ ఫాల్స్‌లో పడి ఇద్దరు మృతి
రామకుప్పం , ఆగస్టు 15:సెల్ఫీ సరదా ఇద్దరి ప్రాణాలను బలి కొంది. సరదాగా జలపాతం వద్ద స్నేహితులతో కిలిసి సెల్పీ తీసుకొంటుండగా కాలు జారి జలపాతంలో పడి పోవడంతో రెండు రోజుల్లో ఇద్దరు ప్రాణాలను కోల్పియిన సంఘటన రామకుప్పం మండల పరిధిలోని చెలిమిచేసు జలపాతం వద్ద చోటు చేసుకొంది. ఈ జలపాతం ఆంధ్రా కర్నాటకా, తమిళనాడు రాష్ట్రాలకు సరిహద్దులో ఉంటండంతో సెలవు రోజుల్లో అధిక సంఖ్యంలో పర్యాటకలు ఇక్కడికి రావడం జరుగుతుంది. ఈనేపధ్యంలో వరుస సెలవులు రావడంతో మంగళవారం తమిళనాడు రాష్ట్రం వాణియంబాడి ప్రైవేట్ కాలేజికి చెందిన అరుల్ కుమార్ (35) తన స్నేహితులతో కలిసి చెలిమి చేసు జలపాతానికి వచ్చారు. ఇక్కడ సరదాగా జలపాతం వద్ద అరుల్ కుమార్ తన స్నేహితులతో సెల్ఫీ తీసుకొంటుండగా ప్రమాదవ శాస్తూ కాలు జారి సుమారు వేయ్యి అడుగుల లోతు ఉన్న జలపాతంలో పడిపోవడంతో మృతి చెందాడు. అయితే ఇదే జలపాతంలో సోమవారం కూడా తమిళనాడుకు చెందిన మరో యవకుడు సెల్ఫీ తీసుకొంటు ప్రమాదవశాస్తూ పడి పోయి మరణించినట్లు స్థానికులు తెలిపారు. ఈ జలపాతం వద్ద ఎటువంటి గిల్స్ లేకపోవడంతో తరుచూ ప్రమాదాలు చోటుచేసుకొంటున్నాయి. పలువురు మరణిస్తున్నారు. సంబంధిత అధికారులు ఇకనైనా తగు చర్యలు చేపట్టాల్సిన అవనర ఎంతైనా ఉంది.

మహనీయుల బాటలో అందరూ నడవాలి
* జాయింట్ కలెక్టర్ గిరిషా పిలుపు

చిత్తూరు, ఆగస్టు 15: స్వాతంత్య్రం కోసం ప్రాణాలు త్యాగాలుచేసి స్వేచ్చా జీవితాన్ని ప్రసాదించిన మహనీయుల బాటలో అందరూ నడవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ గిరిషా పిలుపునిచ్చారు. మంగళవారం 71వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని తొలుత జిల్లాకలెక్టర్ కార్యాలయం వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. గాంధీ చిత్రపటానికి పూజలు నిర్వహించారు. అనంతరం చిత్తూరు పోలీస్ మైదానంలో జిల్లా ఎస్పీ రాజశేఖర్‌బాబుతో కలసి డిఎస్పీ జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. ఈసందర్భంగా పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించారు. తదుపరి జెసి మాట్లాడుతూ గతంలో స్వాతంత్య్రం కోసం అనేక మంది మహనీయులు పోరాటం చేశారని వారి పోరాట ఫలితమే నేడు స్వాతంత్య్ర ఫలాలను ఆశ్వాదిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరు మహనీయులను గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. వారి త్యాగాలను మరవలేమని వారందరిని నేటి తరం స్పూర్తిగా తీసుకోవాలని తెలిపారు. ప్రజాసంక్షేమ కార్యక్రమాల కోసం జిల్లా యంత్రాంగం చిత్తశుద్ధితో పనిచేస్తుందని, అలాగే ప్రభుత్వ సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లా ఎస్పీ రాజశేఖర్‌బాబు మాట్లాడుతూ ఎందరో మహనీయుల త్యాగఫలితమే మనకు స్వాతంత్య్రం వచ్చిందని తెలిపారు. శాంతి భద్రతలకు ఆటంకం కలగకుండా ప్రజలందరూ ముందుకెళ్లాలన్నారు. ఈకార్యక్రమంలో చిత్తూరు ఆర్‌డిఓ కోదండరామిరెడ్డి, ఎఎస్‌పి రాధిక తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా గోకులాష్టమి వేడుకలు
* ఇస్కాన్‌కు తరలివచ్చిన భక్తులు

తిరుపతి, ఆగస్టు 15: శ్రీకృష్ణాష్టమిని పురస్కరించుకుని తిరుపతిలోని ఇస్కాన్, ఎస్వీ గోసంరక్షణశాల, శ్రీకృష్ణుని ఆలయాల్లో మంగళవారం వైభవంగా గోకులాష్టమి వేడుకలు నిర్వహించారు. తిరుపతిలోని రాధాకృష్ణ కమలమందిరం (ఇస్కాన్) అధ్యక్షులు రేవతి రమణదాస్ ఆధ్వర్యంలో వైభవంగా పూజలు నిర్వహించారు. కృష్ణాష్టమి సందర్భంగా శ్రీకృష్ణుని ఆలయాల్లో ఉదయానే్న కృష్ణునికి విశేషాభిషేకాలు నిర్వహించి, సుగంధ భరితమైన పుష్పాలతో విశేషాలంకరణలు చేశారు. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు. ఎస్వీ గోశాలలో టిటిడి ఆధ్వర్యంలో ఇఓ అనిల్‌కుమార్ సింఘాల్ ఆధ్వర్యంలో గోపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. తిరుపతిలోని పలు ఆలయాల్లో శాస్రోక్తంగా పూజలు నిర్వహించారు. పలువురు చిన్నారులు చిన్ని కృష్ణుని వేషధారణలో ఆలయాలకు వచ్చారు. ఇందులో యశ్వికసాయి అనే చిన్నారి చిన్నికృష్ణుని వేషధారణలో అలరించింది.