చిత్తూరు

పనులు ఫుల్ - నిధులు నిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మదనపల్లె, సెప్టెంబర్ 19: వలసల నివారణకు ప్రతి కూలీకి పని కల్పించాలన్న సంకల్పంతో జాతీయ ఉపాధిహామీ పనులు కల్పించి పేదలను ఆదుకోవాలన్నది గత 13 సంవత్సరాల క్రితం కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా అమలుచేశారు. ఉపాధిహామీ పథకంలో చిత్తూరు జిల్లా ప్రథమస్థానంలో నిలిచేది. కూలీల వలసల నివారణకు అడిగిన వారందరికీ కూలీపనులు కల్పించాలన్న ప్రభుత్వ స్పష్టమైన ఆదేశాలతో పనులు కల్పిస్తున్నారు. జిల్లాలో ఎన్‌ఆర్‌ఇజిఎస్, కన్వర్షన్స్, అటవీశాఖ, వాటర్‌షెడ్ల నిర్మాణ పనులు చేపట్టి కూలీలకు గిట్టుబాటు కల్పించేవిధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఆచరణ, అమలు ఘనంగా ఉన్నప్పటికీ చేసిన పనులకు కూలీ డబ్బులు ఇవ్వకపోవడంతో రైతులు పనులకు వెళ్లకుండా గత మూడువారాలుగా కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఉపాధిహామీ బిల్లుల చెల్లింపులు నిలిచిపోయాయని అధికారులే బాహాటంగా చెప్తున్నారు. ఏటా ఉపాధిహామీ పథకంలో ప్రథమస్థానంలో నిలిచే చిత్తూరు జిల్లాలో గత మూడుమాసాలుగా 81,986 బిల్లుల చెల్లింపులు రూ.73,09,99,194 పెండింగ్‌లో ఉండటంపై రాష్టస్థ్రాయి నుంచి జిల్లా, మండలస్థాయి అధికారులందరికీ తెలిసిందే. పనులకెళ్తే గానీ పూటగడవని కూలీలు అధికంగా ఉండటం, మూడుమాసాలుగా పనులు చేసినా బిల్లులు రాకపోవడంతో వారి పరిస్థితి వర్ణనాతీతం. అప్పులు చేసి పనులు చేసిన కూలీలు వడ్డీలు చెల్లించలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. బిల్లులు అందక అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. చిత్తూరు జిల్లాలోని 66 మండలాలో 19,78,971 మంది కూలీలు ఉండగా, జిల్లాకు మంజూరైన ఉపాధిహామీ నిధులు రూ.215 కోట్లు, ఇప్పటివరకు రూ.140 కోట్లకు పనులు పూర్తిచేసి ఖర్చుచేశారు. ఇంకా మూడు నుంచి నాలుగు మాసాల వరకు పనులు చేసిన కూలీలకు సంబంధించిన 8,19,866 బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇందుకు గాను రూ.73.10 కోట్లు కూలీలకు, చెల్లించాల్సి ఉంది.
జిల్లాలో మండలాల వారీగా పెండింగ్‌లో ఉన్న బిల్లులు
ఎర్రావారిపాళెం 20,750 బిల్లులకు రూ.2.39 కోట్లు, ఏర్పేడు 15,401 బిల్లులకు రూ.94.42 లక్షలు, యాదమరి 8029 బిల్లులకు రూ.68.56 లక్షలు, విజయపురం 14,095 బిల్లులకు రూ.81.94 లక్షలు, బి.కొత్తకోట 10,341 బిల్లులకు రూ.97.90 లక్షలు, బైరెడ్డిపల్లె 13,110 బిల్లులకు రూ.1.36 కోట్లు, బంగారుపాళెం 10,123 బిల్లులకు రూ.1.07 కోట్లు, బుచ్చినాయుడుకండ్రిగ 14,830 బిల్లులకు రూ.79.09 లక్షలు, చంద్రగిరి 12,452 బిల్లులకు రూ.1.10 కోట్లు, చిన్నగొట్టిగల్లు 22,994 బిల్లులకు రూ.2.67 కోట్లు, చిత్తూరు 8362 బిల్లులకు రూ.74 లక్షలు, చౌడేపల్లె 6684 బిల్లులకు రూ.55.82 లక్షలు, జిడినెల్లూరు 9250 బిల్లులకు రూ.80.54 లక్షలు, గంగవరం 20,991 బిల్లులకు రూ.2.13 కోట్లు, గుడిపల్లె 13,753 బిల్లులకు రూ.1.19 కోట్లు, గుడిపాల 6676 బిల్లులకు రూ.58.33 లక్షలు, గుర్రంకొండ 8652 బిల్లులకు రూ.80.24 లక్షలు, ఐరాల 17123 బిల్లులకు రూ.2.08 కోట్లు, కెవిబిపురం 14,989 బిల్లులకు రూ.1.08 కోట్లు, కలకడ 9,497 బిల్లులకు రూ.1.03 కోట్లు, కలికిరి 9,543 బిల్లులకు రూ.96.79 లక్షలు, కెవిపల్లె 8,584 బిల్లులకు రూ.89.15 లక్షలు, కార్వేటినగరం 19,492 బిల్లులకు రూ.1.62 కోట్లు, కుప్పం 21,600 బిల్లులకు రూ.1.91 కోట్లు, కురబలకోట 4,830 బిల్లులకు రూ.48.54 లక్షలు, మదనపల్లె 7,255 బిల్లులకు రూ.70 లక్షలు, ములకలచెరువులో 9,685 బిల్లులకు రూ.86.06 లక్షలు, నాగలాపురం రూ.17,758 బిల్లులకు రూ.1.13కోట్లు, నగరి 11,814 బిల్లులకు రూ.65.74 కోట్లు, నారాయణవనం 19,905 బిల్లులకు రూ.1.27 కోట్లు, నిమ్మనపల్లె 4,850 బిల్లులకు రూ.41.06 లక్షలు, నిండ్ర 12,972 బిల్లులకు రూ.86.28 లక్షలు, పలమనేరు 6,412 బిల్లులకు రూ.74.86 లక్షలు, పాలసముద్రం 8,120 బిల్లులకు రూ.56.30 లక్షలు, పెద్దపంజాణి 9,344 బిల్లులకు రూ.83.05 లక్షలు, పెద్దమండ్యం 9,254 బిల్లులకు రూ.85.46 లక్షలు, పెద్దతిప్పసముద్రం 7,873 బిల్లులకు రూ.74.22 లక్షలు, పెనుమూరు 1,040 బిల్లులకు రూ.92.63 లక్షలు, పిచ్చాటూరు 10,216 బిల్లులకు రూ.62.04 లక్షలు, పీలేరు 17,554 బిల్లులకు రూ.1.97 కోట్లు, పులిచెర్ల 23,292 బిల్లులకు రూ.2.51 కోట్లు, పుంగనూరు 7,007 బిల్లులకు రూ.65.29 లక్షలు, వి.కోట రూ.17,590 బిల్లులకు రూ.1.96 కోట్లు, వెదురుకుప్పం, 15,998 బిల్లులకు రూ.1.42 కోట్లు, వాయల్పాడు 8,975 బిల్లులకు రూ.95.44 లక్షలు, వరదయ్యపాళెం 10,774 బిల్లులకు రూ.64.67 లక్షలు, వడమాలపేట 15,574 బిల్లులకు రూ.99.85 లక్షలు, తిరుపతి అర్బన్ 214 బిల్లులకు రూ.25 లక్షలు, తిరుపతి రూరల్ 8,496 బిల్లులకు రూ.75.09 లక్షలు, తొట్టంబేడు 12,284 బిల్లులకు రూ.88.37 లక్షలు, తవణంపల్లె 4,906 బిల్లులకు రూ.51.83 లక్షలు, తంబళ్లపల్లె 8,070 బిల్లులకు రూ.79.89 లక్షలు, శ్రీరంగరాజపురం 13,658 బిల్లులకు రూ.1.18 కోట్లు, శ్రీకాళహస్తి 23,844 బిల్లులకు రూ.1.44 కోట్లు, సోమల 16,855 బిల్లులకు రూ.1.89 కోట్లు, సదుం 10,898 బిల్లులకు రూ.1.23 కోట్లు, శాంతిపురం 17,216 బిల్లులకు రూ.1.60 కోట్లు, సత్యవేడు 15,096 బిల్లులకు రూ.83,68 లక్షలు, రొంపిచెర్ల 16,307 బిల్లులకు రూ.1.64 కోట్లు, రేణిగుంట 8,648 బిల్లులకు రూ.71.94 లక్షలు, రామసముద్రం 8,604 బిల్లులకు రూ.88.54 లక్షలు, రామచంద్రాపురం 18,219 బిల్లులకు రూ.1.69 కోట్లు, రామకుప్పం 15,835 బిల్లులకు రూ.1.79 కోట్లు, పుత్తూరు 8,591 బిల్లులకు రూ.67.72 లక్షలు, పూతలపట్టు 9,190 బిల్లులకు రూ.86.02 లక్షలు వరకు కూలీలకు చెల్లించాల్సి ఉంది. రాష్ట్ర ఉన్నతాధికారులు స్పందించి బిల్లులు మంజూరు చేయాలని కూలీలు కోరుతున్నారు.

నాటు తుపాకి పేలి రైతు మృతి
గంగవరం, సెప్టెంబర్ 19: మండలంలోని బూడిదపల్లి సమీపంలోని అడవిలో నాటుతుపాకి పేలి రైతు దుర్మరణం చెందాడు. నేలపై ఉన్న తుపాకికి ప్రమాదవశాత్తు కాలు తగలడంతో అది పేలి అమరనాథ్ అనే రైతు మృతి చెందాడు. సమాచారం అందుకున్న గంగవరం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై దిలీప్‌కుమార్ తెలిపారు. అనంతరం మృతుని వివరాలను పోలీసులు సేకరించారు. నాటు తుపాకితో అక్కడికి ఒక్కడే వచ్చాడా.. లేక ఇతరులతో వచ్చాడా అనే కోణంలో విచారణ కొనసాగించారు. ఈ క్రమంలో బూడిదపల్లి గ్రామానికి చెందిన చిన్నరెడ్డెప్పరెడ్డి అడవి పందులను వేటాడటానికి నాటు తుపాకితో అడవికి వెళ్లాడు. ఈ క్రమంలో ఎం.కొత్తూరు గ్రామానికి చెందిన అమరనాధ్(38) లక్ష్మణ్(42), చెంగప్ప(35) అను ముగ్గురు వ్యక్తులు అడవిలో ఎద్దులు దారి తప్పాయని వాటిని వెతకడానికి వెళ్లారు. ఈ క్రమంలో చిన్నరెడ్డెప్పరెడ్డి అడవి పందుల వేటకోసం తీసుకెళ్లిన తుపాకిని నేలపై ఉంచి అడవిలోకి పందుల జాడ కనుక్కోవడానికి వెళ్లాడు. మంగళవారం వేకువ జామున సుమారు 3గంటల ప్రాంతంలో చీకట్లో చిన్నరెడ్డెప్పరెడ్డి నేలపై ఉంచిన తుపాకిని గమనించని అమరనాధ్ కాలితో తొక్కడంతో ఒక్కసారిగా తుపాకి పేలి తూటా చాతిలోకి దూసుకెళ్లింది. దీనితో అమరనాథ్ అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే అమరనాథ్‌తో పాటు అడవిలోకి వెళ్లిన లక్ష్మణ్, చెంగప్పలు భయభ్రాంతులకు గురై పారిపోయారు. అయితే ఈ విషయాన్ని గమనించి అడవిలో తుపాకి ఉంచిన చిన్నరెడ్డెప్పరెడ్డి కూడా పరారయ్యాడు. అయితే ఉదయం ఈ విషయాన్ని లక్ష్మణ్, చెంగప్పలు గ్రామస్తులకు తెలిపారు. అనంతరం గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీనితో రంగంలోకి దిగిన పోలీసులు అడవిలోకి వెళ్లి అమరనాథ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలమనేరు ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ఘటనలో పలు అనుమానాలు ఉన్నట్లు మృతుని భార్య అలివేలమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నారు.

తిరుమల గిరులను జల్లెడపడుతున్న గ్రేహౌండ్స్ దళాలు
తిరుపతి, సెప్టెంబర్ 19: శ్రీవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని తిరుమలలో పటిష్ట భద్రతా చర్యల్లో భాగంగా చిత్తూరు, తిరుపతి, అనంతపూర్‌లకు చెందిన గ్రేహౌండ్స్ దళాలకు చెందిన 127 మంది సిబ్బంది తిరుమలను జల్లెడ పడుతున్నారు. ఈసందర్భంగా తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ అభిషేక్ మహంతి వారికి పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన తనను కలిసిన విలేఖరులతో మాట్లాడుతూ ఒక ఆర్‌ఐ, ఆరుగురు ఆర్‌ఎస్‌ఐలతో తనఖీలు చేపడుతున్నట్లు తిరుపతి ఎస్పీ అభిషేక్ మహంతి తెలిపారు. తిరుమల మొదటి, రెండవ ఘాట్ రోడ్లను, శ్రీవారి మెట్టు, అన్నమయ్య మార్గం, తిరుమలకు వెళ్లే ఇతర నడక దార్లను ఈ బృందాలు తనిఖీ చేస్తాయన్నారు. అలాగే డాగ్ స్క్వాడ్స్, ఏరియా డామినేషన్ పార్టీలు, బాంబ్ స్క్వాడ్స్, ఫుడ్ పెట్రోలింగ్‌తో నిరంతరం తనిఖీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. తిరుమలకు వచ్చే విఐపిలే కాకుండా భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు. తిరుమల మొత్తం అణువణువును అధునాతన తనిఖీ స్కానర్స్‌తో ప్రావీణ్యత కలిగిన సిబ్బంది తనిఖీ చేయడం జరుగుతుందని అన్నారు.

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ప్రణాళికాబద్దంగా ఏర్పాట్లు
* జెఇఓ శ్రీనివాసరాజు వెల్లడి
తిరుపతి, సెప్టెంబర్ 19: తిరుమల శ్రీవారిబ్రహ్మోత్సవాలకుప్రణాళికా బద్దంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు టిటిడి తిరుమల జెఇఓ శ్రీనివాసరాజు వెల్లడించారు. తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో మంగళవారం ఆయన అధికారులతో సమీక్షాసమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీవారి బ్రహ్మోత్సవాలతోపాటు పెరటాశి మాసం వస్తుండటంతో భక్తులు విశేష సంఖ్యలో వచ్చే అవకాశం ఉందన్నారు. బ్రహ్మోత్సవాల్లో రూ. 300 ప్రత్యేకప్రవేశ దర్శనం టికెట్లను పరిమితంగా భక్తులకు అందుబాటులో ఉంచుతామన్నారు. దివ్యదర్శనం భక్తులకు 2008 సంవత్సరంలో తీసుకున్న నిర్ణయం మేరకు పెరటాశి నెలలో వచ్చే నాలుగు శనివారాలు, గరుడ సేవ, వైకుంఠ ఏకాదశి, నూతన సంవత్సరం రోజుల్లో దివ్యదర్శనం టోకెన్లు జారీ చేయబడవని చెప్పారు. అందులో బాగంగా శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 23వ తేదీన వచ్చే శనివారం, 30వ తేదీన వచ్చే శనివారం, 27న గరుడ సేవ రోజున కాలినడక వచ్చే భక్తులకు దివ్యదరవ్శనం టోకెన్లు జారీ చేయడం లేదన్నారు. ప్రోటోకాల్ పరిధిలోకి వచ్చే విఐపిలుకు మాత్రమే బ్రేక్ దర్శనాలను పరిమితం చేస్తామని, వృద్ధులు, దివ్యాంగులు, చంటి పిల్లల తల్లితండ్రులు, ప్రవాసాంద్రులు, డిఫెన్స్, దాతలకు ప్రివిలేజ్‌డ్ దర్శనాలను రద్దుచేశామన్నారు. ఆర్జిత సేవలను పూర్తిగా రద్దు చేసి సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనం కల్పిస్తామన్నారు. తిరుమలలో గరుడ సేవ రోజుభక్తుల రద్దీ ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా నాలుగు చక్రాల వాహనాలను ఏడువేల వరకు అనుమతించి ఆపైన వచ్చే వాహనాలను తిరుపతిలోని దేవలోక్, అలిపిరి, భారతీయ విద్యాభవన్ ప్రాంతాల్లో పార్కింగ్ చేయాల్సి ఉంటుందన్నారు. దేవ్‌లోక్, భారతీయ విద్యాభవన్‌లో పార్క్ చేసిన వాహనదారులకు అక్కడ నుంచి ఏర్పాటు చేసిన బస్సుల్లో నగదు చెల్లించి తిరుమలకు చేరుకోవాల్సి ఉంటుందన్నారు. బ్రహ్మోత్సవాల్లో ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్, వాటర్ వర్క్స్, వసతి, ఆరోగ్య విభాగం, అన్నప్రసాద శాఖల అధికారులు మరింత అప్రమత్తంగా సేవలు అందించాలని సూచించారు. తిరుమలలో ప్రైవేట్ దుకాణదారులు భక్తులకు అధిక ధరలకు విక్రయించకుండా తగు చర్యలను తీసుకోవాలని ఎస్టేట్ అధికారులను ఆయన ఆదేశించారు. తిరుమలలో ప్రస్తుతం ఉన్నవాటితోపాటుగా సంచార వైద్య వైద్యశాలలు ద్వారా వైద్య సేవలు అందించడం జరుగుతుందన్నారు. ఈకార్యక్రమంలో చీఫ్ ఇంజినీర్ చంద్రశేఖర్‌రెడ్డి, ఎఫ్‌ఏసిఏఓ బాలాజీ, ఎస్‌ఇ రామచంద్రారెడ్డి, డిప్యూటి ఇఓలు కోదండరామారావు, వేణుగోపాల్, వెంకటయ్య, హరినాథ్, ట్రాన్స్‌పోర్ట్ జిఎం శేషారెడ్డి, విజిఓలు రవీంద్రారెడ్డి, సదాలక్ష్మి, ఓఎస్డీ లక్ష్మీనారాయణ, క్యాటరింగ్ అధికారి శాస్ర్తీ తదితరులు పాల్గొన్నారు.

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అదనంగా 300 బస్సులు
* ఆర్టీసీ ఆర్‌ఎం నాగశివుడు వెల్లడి
తిరుపతి, సెప్టెంబర్ 19: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు తిరుపతి ఆర్టీసీ రీజియన్ నుంచి అదనంగా 150 బస్సులు, తమిళనాడు నుంచి 150 బస్సులను నడుపుతున్నట్లు ఆర్‌ఎం నాగశివుడు వెల్లడించారు. మంగళవారం అదనపు బస్సుల గురించి, అదనపు సిబ్బంది ఏర్పాటు గురించి ఆయన డిప్యూటీ సిటిఎం భాస్కర్, ఎంవి కృష్ణారావు, డిప్యూటీ సిఎంఇలు నరసింహులు, శ్రీనివాసులు, నాలుగు డిపోల మేనేజర్లు తదితరులతో సమీక్షించారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఆర్టీసీ విశేష సేవలు అందిస్తోందని తెలిపారు. ఇందులో భాగంగా 2013లో తిరుపతి నుంచి తిరుమలకు 6877 ట్రిప్పులతో 1,66,226 మంది ప్రయాణీకులను తరలించామన్నారు. 2016వ సంవత్సరంలో 18,671 ట్రిప్పులతో, 4,97,514 మందిని తరలించామన్నారు. ఈ సంవత్సరం 428 బస్సులతో 1680 ట్రిప్పులతో బస్సులను నడుపుతున్నామన్నారు. బ్రహ్మోత్సవాల సమయంలో 2645 ట్రిప్పులను, అలాగే గరుడ సేవ రోజున 4186 నడపాలని నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు. ఇందువల్ల ఆర్టీసీకి రూ.575 లక్షలు ఆదాయం వస్తుందని అంచనావేస్తున్నట్లు చెప్పారు. భక్తుల సౌకర్యార్థం అలిపిరి బస్టేషన్ నుంచి సెంట్రల్ బస్టేషన్, రైల్వే స్టేషన్ వరకు ప్రతి రోజు 40 బస్సులను ఉచితంగా తిప్పనున్నట్లు తెలిపారు. ఘాట్ రోడ్డులో ప్రత్యేకంగా విధులు నిర్వహించడానికి అదనపు సిబ్బందిని కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్‌ఎం వెల్లడించారు.

నైపుణ్యాభివృద్ధికి పెద్ద పీట
* వ్యవసాయ విశ్వవిద్యాలయ విసి దామోదర్ నాయుడు వెల్లడి
తిరుపతి, సెప్టెంబర్ 19: నైపుణ్యాభివృద్ధికి వ్యవసాయ విశ్వవిద్యాలయం పెద్దపీట వేస్తోందని, దీనిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని శ్రీవేంకటేశ్వర వ్యవసాయ విశ్వ విద్యాలయ విసి డాక్టర్ వి.దామోదర్ నాయుడు వెల్లడించారు. బిఎస్సీ అగ్రికల్చర్ మొదటి సంవత్సరం విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ పుస్తకాల ద్వారా అందుకున్న విజ్ఞానం రైతులకు సక్రమంగా ఉపయోగపడాలంటే ఆ శాస్త్ర విజ్ఞానంలోని నైపుణ్యతను ప్రతి విద్యార్థి బాగా అభ్యసించాలన్నారు. వ్యవసాయ రంగంలో రైతాంగానికి నేరుగా ఉపయోగపడేందుకుప్రతి విద్యార్థి కూడా వ్యవసాయంలోని కష్టనష్టాలను తెలుసుకుని తద్వారా రైతులకు అవసరమైన సమాచారం ఎప్పటికప్పుడు అందించాలన్నారు. కేవలం ఉద్యోగాల మీద ఆధారపడకుండా మంచి వ్యాపార వేత్త కావడానికి వ్యవసాయ విద్య బాగా ఉపయోగపడుతుందన్నారు. భవిష్యత్తులో అభ్యుదయ రైతులుగా కూడా వ్యవసాయ పట్ట్భద్రులు ముందు పోవచ్చన్నారు. క్రమశిక్షణ, పట్టుదల ప్రతి విద్యార్థి తప్పకుండా పాటించాలన్నారు. ఎస్వీ వ్యవసాయ కళాశాలకు మంచి పేరుందని, దీనిని ఇంకా ముందుకు తీసుకువెళ్లాలన్నారు. వ్యవసాయ పట్ట్భద్రులు నేరుగా రైతుకు ఉపయోగపడినప్పుడే వ్యవసాయ విద్యకు సార్థకత ఉంటుందన్నారు. వ్యవసాయ రంగంలోని నూతన ఒరవడులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ముందుకు పోవాలన్నారు. అధ్యాపకులు ప్రతి ఒక్కరూ వ్యవసాయ పరిశోధనకు ప్రాధాన్యత ఇస్తూ, పిజి, పిహెచ్‌డి విద్యార్థులు పరిశోధన ఫలితాలను రైతు అభివృద్ధికి దోహదపడేలా ఫలితాలను తీసుకువచ్చినప్పుడే ప్రగతి సాధించవచ్చన్నారు. పరిశోధనాపత్రాలను వివిధ జర్నల్స్ ప్రచురించే సమయంలో విధిగా వాటి నాణ్యతను గమనించాలన్నారు. విద్యతోపాటుగా మానవీయ విలువలకు ప్రాధాన్యత ఇస్తూ మంచి పౌరుడిగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. ఈకార్యక్రమంలో కళాశాల డీన్ రాజేశ్వరి, విశ్వవిద్యాలయ పాలక మండలి సభ్యులు డాక్టర్ కోటేశ్వరావు, డాక్టర్ భవానీదేవి, మురళీనాథ్‌రెడ్డి, డాక్టర్ బి.పద్మోదయ, డాక్టర్ హరిప్రసాద్ రెడ్డి, డాక్టర్ గిరిధర్‌క్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.

అమరావతి వెళ్లిన కలెక్టర్

చిత్తూరు, సెప్టెంబర్ 19: జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న మంగళవారం అమరావతికి తరలివెళ్లారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు రాష్ట్ర స్థాయి కలెక్టర్ల సదస్సు జరగనున్నది. ఇందులో పాలుపంచుకోవడానికి కలెక్టర్ మంగళవారం సాయంత్రం వెళ్లారు. ముఖ్యమంత్రి సమావేశం ఉన్న నేపధ్యంలో జిల్లాలోని అన్ని శాఖలకు చెందిన అధికారులతో కలెక్టర్ చిత్తూరులో రెండు రోజుల పాటు సమావేశాలు నిర్వహించి, శాఖల వారీగా ప్రగతి నివేదికలను రూపొందించారు. ముఖ్యమంత్రి జిల్లాల వారీగా పలు కార్యక్రమాలపై సమీక్షించే అవకాశం ఉన్న తరుణంలో జిల్లాలో అన్ని శాఖలకు చెందిన ప్రగతి నివేదికలతో కలెక్టర్ వెళ్లారు.

టిటిడి మహిళా ఉద్యోగిని ఆత్మహత్యాయత్నం
* లైంగిక వేధింపులే కారణమంటున్న బంధువులు
తిరుపతి, సెప్టెంబర్ 19: స్థానిక టిటిడి పరిపాలనాభవనంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఒక మహిళా ఉద్యోగిని మంగళవారం తన స్వగృహంలో ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. వివరాల్లోకి వెళితే టిటిడి ఔట్‌సోర్సింగ్ విభాగంలో పనిచేస్తున్న సూపరింటెండెంట్ సురేష్ ఎంతోకాలంగా మహిళా ఉద్యోగిని పట్ల లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు బాధితురాలి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈనేపథ్యంలో సురేష్ చర్యలతో విసిగిపోయిన మహిళా ఉద్యోగిని తన నివాసంలో నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. వెంటనే ఆమెను కుటుంబ సభ్యులు స్విమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. మహిళా ఉద్యోగిని తండ్రి, సూపరింటెండెంట్ సురేష్‌పై జెఇఓ పోలా భాస్కర్‌కు ఫిర్యాదు చేయడంలో ఆయన విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. మహిళా ఉద్యోగిని భర్త మృతి చెందడంతో ఆమె ఔట్ సోర్సింగ్ విభాగంలో పనిచేస్తూ తన కుటుంబాన్ని పోషిస్తోంది.

స్వచ్ఛతే సేవకు ప్రజలు సమయం కేటాయించాలి
* కమిషనర్ హరికిరణ్ సూచన
తిరుపతి, సెప్టెంబర్ 19: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పిలుపు మేరకు అక్టోబర్ 2వ తేదీ వరకు నిర్వహించనున్న స్వచ్ఛతే సేవ కార్యక్రమానికి నగర ప్రజలు కొంత సమయం కేటాయించాలని నగర పాలక సంస్థ కమిషనర్ హరికిరణ్ చెప్పారు. మంగళవారం సాంస్కృతిక వారసత్వప్రాంతాలు, టూరిస్టుప్రదేశాలు, యువజన, డిఫెన్స్, పౌరులతో కలసి శ్రమదాన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. మొత్తం 50 డివిజన్లలో నిర్వహించిన కార్యక్రమంలో రోడ్లను శుభ్రం చేయడం, కాలువలను శుభ్రం చేయడం, వ్యర్థాలను తొలగించడం, వ్యక్తిగత పరిశుభ్రతపై విద్యార్థుల్లో అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. ఈసందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగర ప్రజలందరూ పారిశుద్ధ్యంపై ప్రత్యేకశ్రద్ధ వహించాలన్నారు. నగర ప్రజలందరూ అధికారులతో సహకరించి పారిశుద్ధ్యానికి పెద్ద పీట వేయాలని పిలుపునిచ్చారు. ఇందులో విద్యార్థులు, యువకులు కీలకపాత్ర పోషించాలన్నారు. ఈకార్యక్రమంలో నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు.