చిత్తూరు

రెవెన్యూపరంగా ప్రజలకు మెరుగైన సేవలు అందాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, డిసెంబర్ 17: రెవెన్యూపరంగా ప్రజలకు మెరుగైన సేవలు అందాల్సి ఉందని రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి అమరనాథరెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రమైన చిత్తూరులో రూ.2.25 కోట్లతో నూతనంగా నిర్మించనున్న రెవెన్యూ డివిజనల్ కార్యాలయానికి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ నేడు ఉద్యోగులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు ప్రభుత్వం కల్పిస్తున్నదని, దీన్ని దృష్టిలో ఉంచుకొని ఉద్యోగులు కూడా ప్రజలకు పారదర్శకంగా సత్వర సేవలు అందించాలన్నారు. చిత్తూరులో ప్రస్తుతం ఉన్న ఆర్టీవో భవనం బ్రిటీష్ కాలం నాటిదని, నేడు మారుతున్న కాలానికి అనుగుణంగా అన్ని వసతులతో కొత్త భవనాన్ని నిర్మించాలని నిర్ణయించామన్నారు. పాత భవనం చరిత్రకు ఆనవాళ్లు కావడంతో దాన్ని కూడా అలాగే ఉంచి మరమ్మతులు చేస్తామన్నారు. రెవెన్యూపరంగా పారదర్శకంగా ఉండాలని, అన్ని వ్యవహారాలు ఆన్‌లైన్ విధానంతో జరుగుతున్నాయని, అయితే ప్రజలకు ఉద్యోగులు మంచి సేవలు అందించి వారి మన్ననలు పొందాలన్నారు. రెవెన్యూశాఖ అత్యంత కీలకమైందని, కావున ఉద్యోగులు పారదర్శకంగా తమ విధులు నిర్వహించాల్సి ఉందన్నారు. ఉద్యోగులకు నేటి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉందన్నారు. ఈ కొత్త భవనాన్ని మూడు నెలల్లోగా పూర్తయ్యే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న మాట్లాడుతూ చిత్తూరు రెవెన్యూ డివిజన్ పరిధిలో 20 మండలాలు ఉన్నాయని, కావున ప్రజలకు మంచి సేవలు అందించాలంటే మంచి భవనం ఉండాలని కొత్త భవనాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. కార్యాలయంలో అన్ని వసతులు ఉండేవిధంగా ఈ భవన నిర్మాణం కొనసాగుతుందన్నారు. త్వరగా భవన నిర్మాణ పనులు పూర్తయ్యే విధంగా అధికారులు చొరవ చూపాలన్నారు. చిత్తూరు ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ జిల్లా కేంద్రమైన చిత్తూరు అభివృద్ధిలో ముందుకు వెళ్తున్నదని, కొత్త రెవెన్యూ డివిజన్ కార్యాలయంతో పాటు కొత్తగా సెంట్రల్ లైబ్రరీని నిర్మించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ గిరీష, జడ్పీ చైర్‌పర్సన్ గీర్వాణి చంద్రప్రకాష్, ఎమ్మెల్సీ దొరబాబు, నగర మేయర్ కఠారి హేమలత, డిఆర్‌వో గంగాధర్‌గౌడ్, ఆర్డీవో మల్లికార్జున, మాజీ ఎమ్మెల్యేలు లలితకుమారి, రవి, పలువురు ప్రజాప్రతినిధులు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. అనంతరం కొత్త 108 వాహనాన్ని జెండా ఊపి మంత్రి ప్రారంభించారు.

శ్రీవారిని దర్శించుకున్న గవర్నర్

తిరుపతి, డిసెంబర్ 17: తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ దంపతులు సోమవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. క్షేత్ర సాంప్రదాయాన్ని పాటిస్తూ ముందుగా స్వామివారి పుష్కరణిలో నీటిని ప్రోక్షణం చేసుకున్నారు. ఆ తరువాత శ్రీ భూవరాహ స్వామివారిని దర్శించుకున్నారు. అక్కడ నుంచి శ్రీవారి ఆలయానికి చేరుకున్న గవర్నర్ దంపతులకు టీటీడీ తిరుమల జేఈఓ శ్రీనివాసరాజు, అర్చకులు ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో గవర్నర్‌కు వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. జేఈఓ శ్రీనివాస రాజు శ్రీవారి తీర్థప్రసాదాలతోపాటు 2019 డైరీ, క్యాలెండర్‌ను అందజేశారు. అనంతరం వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 4 నుంచి 14 వరకు కంపార్ట్‌మెంట్లు, సుపథం ప్రత్యేక దర్శన క్యూలైన్‌లను పరిశీలించారు. అనంతరం కాలినడక భక్తులు వెల్లే దివ్యదర్శన క్యూలైన్‌ను సైతం గవర్నర్ పరిశీలించారు. అక్కడ నుంచి నారాయణగిరి ఉద్యానవనం సెక్టార్ ఒకటి వద్ద క్యూలైన్లలో ఉన్న భక్తులతో మాట్లాడారు. అక్కడే టీటీడీ భక్తులకు అందిస్తున్న అల్పాహారం ఉప్మాను రుచి చూశారు. అనంతరం ఏటీజీహెచ్ వద్ద గవర్నర్ నరసింహన్ మీడియాతో మాట్లాడుతూ పవిత్ర వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పండుగ రోజుల్లో శ్రీవారి దర్శనం కోసం క్యూలైన్‌లు, కంపార్ట్‌మెంట్‌లలో వేచి ఉన్న భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా టీటీడీ చక్కటి ఏర్పాట్లు చేసిందని అభినందించారు. ఈకార్యక్రమంలో టీటీడీ సీవీ ఎస్వో గోపినాథ్ జెట్టి, తిరుపతి అర్బన్ ఎస్పీ అన్బురాజన్, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈ ఓ హరీంద్రనాథ్, పేష్కార్ రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.

ఈనెల 20న టీసీఎల్ ఇండస్ట్రీయల్ పార్క్‌కు శంకుస్థాపన
* జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న
ఏర్పేడు, డిసెంబర్ 17: మండలంలోని వికృతమాల వద్ద టీసీఎల్ ఇండస్ట్రియల్ పార్క్ నిర్మాణానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈనెల 20న శంకుస్థాపన చేస్తారని జిల్లా కలెక్టర్ పీఎస్ ప్రద్యుమ్న తెలిపారు. సోమవారం మధ్యాహ్నం ఏర్పేడు మండలం వికృతమాల వద్ద ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్న ప్రదేశాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. ఆర్ అండ్ బి అధికారులు రోడ్డు వెడల్పు, బ్యారీకేడ్లు జాగ్రత్తగా నిర్మించాలన్నారు. ఇది జిల్లాలో మరో టీవీలు, టీవి క్యాబినెట్ల తయారీ యూనిట్ 145 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్నారని తెలిపారు. సభ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ పర్యటనలో జేసీ గిరీషా, సబ్ కలెక్టర్ డాక్టర్ మహేష్‌కుమార్, పరిశ్రమల శాఖ జీఎం అనిల్‌కుమార్‌రెడ్డి, ఏపీ ఐఐసీసీ జోనల్ మేనేజర్ ఎల్.రామ్, కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.

టీటీడీ మితిమీరిన అవినీతి
* రోజూ గంటపాటు స్థానికులకు ఎల్ 1 దర్శనం కల్పించాలి
* కేంద్రమాజీ మంత్రి డాక్టర్ చింతామోహన్

తిరుపతి, డిసెంబర్ 17: నాడు దళితులను శ్రీవారి ఆలయంలోకి అనుమతించకపోతే 1933, డిసెంబర్ 17న మహాత్మా గాంధీ ఆలయం ముందు ధర్నా చేశారని, స్థానికులకు దర్శనం కల్పించకపోతే తాను ధర్నా చేయడానికి వెనుకాడబోనని కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ చింతామోహన్ అన్నారు. స్థానికులకు దర్శనం కల్పించాలన్న డిమాండ్‌తో డాక్టర్ చింతామోహన్ గత కొంతకాలంగా తీవ్రస్థాయిలో ఆందోళన చేపడుతున్న విషయం విదితమే. ముఖ్యంగా ప్రతి రోజూ రాజకీయ, సినీ ప్రముఖులకు ఎల్ 1 ప్రత్యేక దర్శనాలు కల్పిస్తున్న క్రమంలో స్థానికులకు ప్రతిరోజు దర్శనం కల్పించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా వైకుంఠ ఏకాదశి పర్వదినానికి కూడా స్థానికులను ఆలయంలోనికి అనుమతించాలని అన్నారు. ఈనేపథ్యంలో సోమవారం టీటీడీ పరిపాలనా భవనం ముందు కాంగ్రెస్ నాయకులు, నగర వాసులతో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. ఈసందర్భంగా డాక్టర్ చింతామోహన్, ఆయన మాట్లాడుతూ డిసెంబర్ 17కు ఒక ప్రత్యేకత ఉందన్నారు. దళితులకు ఆలయప్రవేశం లేని విషయం తెలుసుకున్న మహాత్మాగాంధీ 1933 డిసెంబర్ 17న ఆలయం ముందు ఆందోళన చేశారన్నారు. ఈక్రమంలో వారికి ఆలయ ప్రవేశం లభించిందన్నారు. స్థానికులకు ఎల్ 1 దర్శనం కల్పించకపోతే తిరుమల, తిరుపతి వాసులతో కలిసి తాను కూడా ఆందోళన చేయడానికి వెనుకాడబోనని హెచ్చరించారు. టీటీడీ అవినీతిమయమైందని ఆరోపించారు. చివరికి భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేసే పథకంలో కూడా అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. వైకుంఠ ఏకాదశి రోజున, జనవరి 1న కూడా గంటపాటు స్థానికులకు విఐపీలతో కలిపి శ్రీవారి ఆలయంలోకి అనుమతించాలని డిమాండ్ చేశారు. విఐపీలకు రోజుకు 3 గంటలు సమయం కేటాయిస్తున్న టీటీడీ, ఆ వేంకటేశ్వర స్వామిని నమ్ముకుని జీవిస్తున్న స్థానికులకు స్వామి దర్శనం కల్పించడంలో అభ్యంతరం ఏమిటని ప్రశ్నించారు. ఏఐసీసీ సభ్యురాలు ప్రమీలమ్మ, కాంగ్రెస్ నాయకుడు నవీన్ కుమార్ రెడ్డి, ఎస్సీ సెల్ నాయకుడు పూతలపట్టు ప్రభాకర్, నగర మహిళా విభాగం అధ్యక్షురాలు బుర్రా సవిత్రి యాదవ్, మాజీ కౌన్సిలర్ గోపాల్‌లు మాట్లాడుతూ తిరుపతి, తిరుమలలోజన్మించడం పూర్వజన్మ సుకృతంగా దేశంలో ప్రతి ఒక్కరూ భావిస్తారన్నారు. అలాంటి పుణ్య క్షేత్రంలో జన్మించి అక్కడే చివరి శ్వాస వదలాలని తపన పడే స్థానికులకు స్వామి దర్శనం దూరం చేసే అధికారం ఎవరిచ్చారన్నారు. శ్రీవారి దర్శనం స్థానికులకు అందని ద్రాక్షగా మారిందని, షిరిడి, శబరిమలైలో స్థానికులకు ప్రత్యేక దర్శనాలు కల్పిస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మహిళా నాయకురాళ్లు తేజోవతి, శాంతి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

బీసీల అభ్యునతే చంద్రబాబు ధ్యేయం
* రాష్ట్రం విడిపోయినా అన్ని రంగాల్లో ఏపీ ముందంజ * రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి అమరనాథరెడ్డి
పుంగనూరు, డిసెంబర్ 17: రాష్ట్రంలో బీసీల అభ్యున్నతే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ధ్యేయమని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి నూతనకాల్వ అమరనాథరెడ్డి అన్నారు. సోమవారం స్థానిక ట్రావెలర్స్ బంగ్లాలో జయహో బీసీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మంత్రితో పాటు టీడీపీ జిల్లా అధ్యక్షుడు పులివర్తి నాని, ఎమ్మెల్సీ పోతుల సునీత, తిరుపతి తుడా చైర్మన్ నరసింహయాదవ్, రాష్ట్ర బీసీ సంఘం కార్యదర్శి దశరధ ఆచారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రం విడిపోయిన తరువాత అనేక ఇబ్బందులు ఉన్నా ప్రజల సంక్షేమం కోసం చంద్రబాబు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు. రాష్ట్రంలో లోటు బడ్జెట్ రూ.16 వేల కోట్లు ఉన్నా ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టిన ఘనత చంద్రబాబుకే దక్కిందన్నారు. బీసీల అభ్యున్నతి కోసం ఆదరణ పథకం కింద రూ.227 కోట్లు ఖర్చు పెట్టి పనిముట్లు అందించారన్నారు. ఆదరణ 2వ పథకం కింద నాలుగు లక్షల మందికి ఉపాధి కల్పించడానికి గాను రూ.750 కోట్ల నిధులతో పనిముట్లు కొనుగోలు చేసి బీసీలకు అందిస్తామన్నారు. రూ.5 కోట్లతో తిరుపతి, చిత్తూరులో బీసీ కమ్యూనిటీ హాళ్లు నిర్మిస్తున్నామని తెలిపారు. అలాగే మున్సిపాలిటీలలో త్వరలోనే రూ.25 లక్షల వ్యయంతో భవనాలు ఏర్పాటు చేయడానికి చంద్రబాబు కృషి చేస్తున్నారన్నారు. జిల్లాలో సుమారు 2800 కిలోమీటర్లకు పైగా సీసీ రోడ్లు ఏర్పాటు చేసిన ఘనత చంద్రబాబుదే అన్నారు. ప్రతి గ్రామంలోనూ వీధిలైట్లు ఏర్పాటు చేశామన్నారు. ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేల నియోజకవర్గాలో కూడా అభివృద్ధి చేశామన్నారు. వారు మాత్రం తామే చేశామని ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. చంద్రబాబు నిధులు మంజూరు చేస్తేనే రాష్ట్రంలో అభివృద్ధి కొనసాగుతుందన్నారు. రాష్ట్రంలో రిజర్వేషన్ల ప్రకారం బీసీలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బిల్లు ప్రవేశపెట్టింది చంద్రబాబేనన్నారు. గతంలో పింఛన్లు రూ.200 ఉంటే వాటిని రూ.1000 పెంచింది చంద్రబాబేనన్నారు. బిడ్డ పుట్టినప్పటి నుంచి పెరిగి పెద్దయ్యి పెళ్లి చేసే వరకు వారి కోసం అనేక పథకాలతో లబ్ధి పొందుతున్నారని గుర్తు చేశారు. పేదలు కడుపు నిండా భోజనం చేయాలని చంద్రన్న అన్న క్యాంటిన్ ద్వారా రూ.5కే భోజనం పెడుతున్నామన్నారు. అలాగే హంద్రి-నివా ద్వారా సంక్రాంతి పండుగ రోజుకు నీరు తీసుకొస్తామని తెలిపారు. రాష్ట్రంలో వైకాపాను గెలిపిస్తే హంద్రీ-నీవాలో పారేది నీరు కాదని, రక్తమని అన్నారు. ప్రతిపక్ష నాయకులు చెప్పే మాయమాటలు నమ్మకుండా చంద్రబాబుకు ఓట్లు వేసి మరో పదేళ్లపాటు ముఖ్యమంత్రిని చేసి మన పిల్లల భవిష్యత్తు కాపాడుకోవాలన్నారు. వైకాపా నాయకులకు వయసు ఇంకా ఉందని, పదేళ్ల తరవాతనైనా ఒక్కసారి గెలుపించుకోవచ్చని, 2019 ఎన్నికల్లో టీడీపీకి ఓట్లు వేసి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాలన్నారు. ఈ సమావేశంలో తాయారమ్మ, మాజీ ఎమ్మెల్యే బగ్గిడి గోపాల్, మాజీ ఎమ్మెల్సీ నరేష్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎంపీపీ రత్నమ్మ, ఎద్దుశేఖర్‌నాయుడు, సురేష్, కృష్ణమూర్తి, శ్రీకాంత్, నాగరాజయాదవ్, ఖలీల్ తదితరులు పాల్గొన్నారు.

వెంకన్న ఆశీస్సులతోనే విజయం సాధించాం
* తెలంగాణ మాజీ మంత్రి హరీష్‌రావు
రేణిగుంట, డిసెంబర్ 17: వెంకన్న ఆశీస్సులతోనే ఎన్నికల్లో విజయం సాధించామని, మొక్కు తీర్చుకునేందుకే వచ్చామని తెలంగాణ మాజీమంత్రి హరీష్‌రావు అన్నారు. సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో పాటు ఎమ్మెల్యేగా రెండోసారి విజయం సాధించిన టీఆర్‌ఎస్ నేత హరీష్‌రావు,వారి కుటుంబ సభ్యులు, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ సతీమణి, వారి కుటుంబ సభ్యులు రేణిగుంట విమానాశ్రయంకు మధ్యాహ్నం 3గంటలకు చేరుకున్నారు. వీరికి అభిమానులు పుష్పగుచ్చాలిచ్చి ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో టీఆర్‌ఎస్ చారిత్రాత్మక విజయం సాధించిందని, ప్రజల అభిమానమే తమను మరోసారి అధికారంలోకి తీసుకొచ్చిందన్నారు. తిరుమల శ్రీవారి మొక్కు తీర్చి ఆయన ఆశీస్సులు పొందేందుకు వచ్చామని అన్నారు. ఏపీలో జరుగునున్న ఎన్నికల సమయంలో ప్రచారం చేస్తారా.. అన్న ప్రశ్నకు ఈ సమయంలో రాజకీయాలు మాట్లాడబోనన్నారు. అనంతరం రోడ్డుమార్గాన తిరుమలకు బయలుదేరి వెళ్లారు.

ఎర్రస్మగ్లర్లకు రహదారిగా ములకలచెరువు, చేలూరు రోడ్డు
పెద్దతిప్పసముద్రం, డిసెంబర్ 17: ఎర్రస్మగ్లర్లకు రహదారికి ములకలచెరువు, చేలూరు రోడ్డు ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆదివారం రాత్రి ములకలచెరువు నుండి చేలూరుకు వెళ్లే రహదారిలో భాగంగా పులికల్లు జిల్లా పరిషత్ పాఠశాల కాల్వర్ట్ వద్ద ఓ ఇండిగో కారు అనుమానాస్పదంగా వదిలి వెళ్లారు. ఈ కారును గ్రామస్థులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. రోడ్డు నుండి అర కిలోమీటర్ దూరం వరకు డిజల్ కారిన దృశ్యం పోలీసులకు కనిపించడంతో కారును పరిశీలించారు. కారుకు ముందు వెనుక భాగాల్లో నెంబర్ లేకపోవడంతో పరిశీలించగా ఓ నెంబర్ ప్లేట్ దొరికింది. అందులో ఓ పక్క ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఏపి29బిపి 3606గా మరో నెంబర్ తమిళనాడుకు చెందిన టియన్ 20 ఏహెచ్ 2017నెంబర్‌గా నెంబర్‌ప్లేట్‌పై ఉంది. ఈ విషయం స్థానిక సీఐ శ్రీనివాసులుకు సమాచారం అందడంతో ఆయన కారును పరిశలించి పిటియం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ప్రజలు కూడా ఏదో ఎర్రచందనం దొంగలు తరలించే వాహనామే అంటూ అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ విషయంపై పరిశీలించిన పోలీసులకు అర కిలోమీటర్ దూరంలో ముళ్ల పొదల్లో 11 ఎర్రచందనం దుంగలు కనపడ్డాయి. వీటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు వీఆర్‌వో వెంకటరమణ ఆధ్వర్యంలో పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ విషయంపై పలువురు మాట్లాడుతూ జిల్లాలోని పడమటి మండలాలు ఎర్రచందనం తొలగించడానికి రాజమార్గంగా ఏర్పడుచుకున్నారని పేర్కొంటున్నారు. పిటియం మండలానికి కూతవేటు దూరంలో అటూ కర్నాటక, ఇటూ అనంతపురం జిల్లా సరిహద్దుల్లో ఉండడంతో ఇక్కడ పోలీస్ గస్తీ తక్కువుగా ఉండడం స్మగ్లర్లకు అనుకులంగా మారి ఉంటుందని పలువురు పేర్కొన్నారు. ఈ విషయంపై ఇప్పటికైనా సంబంధిత అధికారులు, పోలీసులు స్పందించి ఎర్రచందనం స్మగ్లింగ్‌ను ఆరికట్టాలని పలువురు ప్రజలు కోరుతున్నారు.