చిత్తూరు

రోహిత్ మరణానికి కారకులైన కేంద్ర మంత్రి దత్తాత్రేయను పదవి నుంచి తొలగించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జనవరి 19 : హైదరాబాదు సెంట్రల్ యూనివర్శిటీలో నెలకొన్న సాంఘిక అసమానతల కారణంగా రోహిత్ వేముల అనే దళితుడైన పరిశోధక విద్యార్థి ప్రాణాలను పొగొట్టుకున్నాడని, ఈ ఘటనకు బాధ్యులైన కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, హెచ్‌సియు విసి అప్పారావును తక్షణం పదవి నుంచి తప్పించాలని తిరుపతి మాజీ ఎంపి చింతా మోహన్ డిమాండ్ చేశారు. రోహిత్ మరణంపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు పెల్లుపెక్కుతున్న నేపథ్యంలో తిరుపతిలో కాంగ్రెస్, సిపిఎం, ఎఐఎస్‌ఎఫ్, ఎ ఐడిఎస్‌వో, మాలమహానాడు, ప్రజా విద్యార్థి సంఘాలు మంగళవారం వేర్వేరుగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. పలుచోట్ల సంతాప సభలు నిర్వహించారు. సిపిఎం ఆధ్వర్యంలో కేంద్రమంత్రి దత్తాత్రేయ, స్మృతి ఇరానీ దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. ఎస్వీ యూనివర్శిటీలో జరిగిన రోహిత్ సంతాపసభలో చింతామోహన్ పాల్గొని ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘననివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హెచ్‌సియులో ఒక పరిశోధక పేద, దళిత విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 సంవత్సరాలు కావస్తున్న ఇప్పటికి సాంఘిక అసమానతలు కొనసాగుతుండడం దురదృష్టకరమన్నారు. ముఖ్యంగా ఉన్నత విద్యను బోధించే విశ్వవిద్యాలయాల్లో విద్యార్థుల మధ్య కుల వివాదాలు చెలరేగడం సమాజాభివృద్ధికి ప్రమాదకరమన్నారు. బిజెపి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేశవ్యాప్తంగా ఇలాంటి సాంఘిక దురాచారాలు కోకొల్లలు సాగుతున్నాయని నిప్పులు చెరిగారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఈ ఘటనకు కారకులైన వారు ఎంతపెద్దవారైన ఉపేక్షించకుండా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా ఈ ఘటన వెనుక ఉన్న కారణాలను వెలికితీసి, దోషులను గుర్తించేందుకు వీలుగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బాలకృష్ణన్ ఆద్వర్యంలో విచారణ జరిపించాలని డిమాండ్ చేసారు. ప్రధాని నరేంద్రమోడీ ఈ అంశంపై తక్షణం స్పందించాలన్నారు. మూడు నెలల్లో ఈ సంఘటనపై దర్యాప్తు చేసి నివేదిక తయారు చేసి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. రోహిత్ కుటుంబానికి కేంద్రం ఆర్థిక సహాయం అందించడమే కాకుండా ఆయన కుటుంబ సభ్యుల్లో ఒక్కరికి ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా విశ్వవిద్యాలయాల్లో నిరపేద విద్యార్థులకు తగిన రక్షణ కల్పించాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. రాజ్యాంగబద్ధంగా ప్రతి విద్యార్థి భావప్రకటన చేసే స్వేచ్ఛ ఉందన్నారు. ఆ హక్కును కాలరాసే విధంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఎస్సీ సెల్ రాష్ట్ర నాయకులు ప్రభాకర్, పి సిసి కార్యదర్శి శ్రీదేవి, నాగరాజు, శాంతి, సావిత్రమ్మ, తదితరులు పాల్గొన్నారు.
సిపిఎం ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దగ్ధం
రోహిత్ మరణానికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సిపిఎం నగర కమిటీ కార్యవర్గ సభ్యుడు గురుప్రసాద్ నేతృత్వంలో మంగళవారం నాడు కెటిరోడ్డులో దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందూమతోన్మాదంతో బిజెపి నాయకులు పేద విద్యార్థుల కుటుంబాల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని నిప్పులు చెరిగారు. ముఖ్యంగా దళితులపైన, మైనారిటీలపైన పైశాచికంగా వ్యవహరిస్తూ వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. రోహిత్ మరణానికి కేంద్ర మంత్రులు బండారు దత్తాత్రేయ, స్మృతి ఇరానీపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను నమోదు చేసి కఠినంగా శిక్షించాలన్నారు. అలాగే ఆంధ్ర రాష్ట్రంలో పేద ప్రజల భూములను బలవంతంగా లాక్కొని రైతుల జీవితాలతో ఆడుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం కూడా తక్షణం తన ప్రయత్నాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు లౌకిక, అభ్యుదయ వాదులతో పాటు ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రతి ఒక్కరూ స్పందించి ఖండించాలని పిలుపునిచ్చారు. ఇక రోహిత్ కుటుంబానికి కేంద్రం 10 లక్షల రూపాయలు, రాష్ట్రం 5 లక్షల రూపాయలు ఎక్స్‌గ్రేసియా చెల్లించాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు నాగభూషణమ్మ, రాద, సుజాతమ్మ, మోహన్, మోహన్ రావు, బుజ్జి, మల్లిఖార్జున రావు, ఎం డి శ్రీను, దీప, వెంకట రెడ్డి, బుజ్జమ్మ తదితరులు పాల్గొన్నారు.

ఎఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో
ఎఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి జె విశ్వనాథ్ ఆధ్వర్యంలో భవాని నగర్ సర్కిల్లో విద్యార్థులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వాహన రాకపోకలకు కొంత సమయం అంతరాయం ఏర్పడింది. ఈ సందర్భంగా విశ్వనాథ్ మాట్లాడుతూ ఒక పేరెన్నిక కన్న హైదరాబాదు కేంద్ర విశ్వవిద్యాలయంలో కుల విష జ్వాలలకు ఒక దళిత పరిశోధక విద్యార్థి ఆహుతైపోయాడని ఆవేదన వ్యక్తం చేశారు. రోహిత్‌ది ఆత్మహత్య కాదని, బిజెపి, ఆర్ ఎస్ ఎస్ విశ్వవిద్యాలయంలో వైస్ ఛాన్స్‌లర్‌ను అడ్డుపెట్టుకొని చేసిన హత్యే అని ఆయన అభిప్రాయపడ్డారు. బండారు దత్తాత్రేయ, స్ముృతి ఇరానీ కేంద్ర మంత్రులు కలుగజేసుకొని రోహిత్‌పై కక్ష కట్టిన తీరులో ఆర్‌ఎస్‌ఎస్ ఫాసిస్టు ధోరణి కనిపిస్తుందన్నారు. ఇద్దరు మంత్రులను, ఎస్వీయు వీసి అప్పారావును పదవుల నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్ష కార్యదర్శులు ఎస్ దామోదరం, చలపతి, తదితరులు పాల్గొన్నారు.
ఇది దారుణం - దుర్మార్గం - ఎ ఐ డి ఎస్ వో
హైదరాబాదు సెంట్రల్ యూనివర్శిటీలో ఒక దళిత విద్యార్థిపై కక్ష కట్టి, వేధించి ఆ విద్యార్థి ఆత్మహత్య చేసుకునే విధంగా పరిస్థితులు కల్పించడం దారుణమని, దుర్మార్గమని దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని ఎఐడిఎస్ వో కార్యదర్శి ఆర్ గంగాధర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఐదు మంది రీసెర్చ్ స్కాలర్స్‌ను బహిష్కరించేందుకు కేంద్ర మంత్రులు, వీసి తెగబడడం దుర్మార్గమన్నారు. రోహిత్ మరణానికి కారణమైన కేంద్రమంత్రులను, వీసిని తక్షణం పదవుల నుండి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనకు నిరసనగా ఈ నెల 20 వ తేదీన అఖిల భారత నిరసన దినంగా పాటించాలని ఎ ఐ డి ఎస్ వో పిలుపునిస్తున్నదన్నారు.
హెచ్‌సియు ఘటనపై దోషులను కఠినంగా శిక్షించాలి
హెచ్ సి యు లో దళిత విద్యార్థి నేత రోహిత్ మరణాన్ని రాజకీయ కోణంలో కాకుండా సామాజిక కోణంలో పరిశీలించి ఈ ఘటనకు కారణమైన దోషులను కఠినంగా శిక్షించాలని మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు కల్లూరి చెంగయ్య డిమాండ్ చేసారు. రోహిత్ ఆత్మహత్యకు కారణాలు వెలికితీసేందుకు నిజనిర్ధారణ కమిటీతో నిగ్గుతేల్చాలని కోరారు. దోషులు ఎంతటివారైన కఠినంగా శిక్షించాలన్నారు. స్వార్థ రాజకీయాలకు విద్యార్థులను వాడుకుంటూ, వారిని తప్పుదారి పట్టిస్తూ కలుషితం చేస్తూ వారి జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని చెంగయ్య నిప్పులు చెరిగారు. విద్యార్థి కుటుంబానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక, ఉద్యోగ పరంగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేసారు.
రోహిత్ ప్రాణం తీసింది ఎబివిపి, ఆర్‌ఎస్‌ఎస్, బిజెపిలే
* పరమశివన్
హెచ్‌సియు దళిత విద్యార్థి రోహిత్ ప్రాణాలను తీసింది ఎబివిపి, ఆర్‌ఎస్ ఎస్, బిజెపిల మతోన్మాదం, ఆరాచక విధానాలేనని ఇందుకు కారణమైన మంత్రి బండారుదత్తాత్రేయను తక్షణమే పదవి నుంచి తొలగించి అరెస్టు చెయ్యాలని రాష్ట్ర ఎస్సీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు పి పరమశివన్ మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్‌లో రోహిత్ చురుగ్గా పాల్గొనడాన్ని చూసి ఓర్వలేకనే ఈ కుల వేధింపులకు దిగారని ఆరోపించారు. ఇందుకు కారణమైన విసి ని కూడా తక్షణం పదవి నుండి తొలగించాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు.
మహిళా దొంగ అరెస్టు
* 250గ్రాముల బంగారు నగలు స్వాధీనం

మదనపల్లె, జనవరి 19: సాటి ప్రయాణికురాలిగా బస్సులలో పయనిస్తు.. మత్తుమందు చల్లి, మాయమాటలు చెప్పి దోచుకున్న 250గ్రాముల బంగారు ఆభరణాలతో తిరుపతికి వెళ్తున్న మహిళా దొంగను మంగళవారం మదనపల్లె రెండవ పట్టణ పోలీస్ సిఐ హనుమంత్‌నాయక్, ఎస్‌ఐ నాగేశ్వర్‌రావులు అరెస్టుచేశారు. ఈమేరకు స్థానిక రెండవ పట్టణ సిఐ సర్కిల్ కార్యాలయంలో మదనపల్లె డిఎస్‌పి రాజేంద్రప్రసాద్ ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో వెల్లడించారు. వివరాలు ఇలావున్నాయి.. బికొత్తకోట మండలం ఇందిరమ్మకాలనీకి చెందిన పఠాన్ రహంతుల్లాఖాన్ భార్య పఠాన్ నౌహీరా(40) వారం రోజుల కితం మదనపల్లెకు చెందిన చెల్లెమ్మ అనే మహిళ హ్యాండ్ బ్యాగును దొంగలించి అందులోని రెండు బంగారుగాజులు దోచుకుంది. అదోరోజు సాయంత్రం ఆర్టీసీ బస్టాండులో బురకాయలకోటకు చెందిన ఖాసీంబీ హ్యాండ్‌బ్యాగ్‌ను దొంగలించి అందులో బంగారు నగలు దోచుకుంది. గత ఆదివారం మధ్యాహ్నాం 3గంటల ప్రాంతంలో ఆర్టీసి బస్టాండులో రాయచోటికి చెందన అనురాధ బెంగళూరు వెళ్ళేందుకు మదనపల్లె ఆర్టీసిబస్టాండుకు రాగా ఆమె పర్సుకూడా చోరిచేసి అందులోని బంగారు నగలు చోరిచేసింది. సోమవారం ఉదయం 9గంటల ప్రాంతంలో కెవిపల్లె మండలానికి చెందిన మంగమ్మ స్వంతపనులపై పీలేరు బస్సుకు వేచివుండగా ఆమె హ్యాండ్‌బ్యాగ్‌లో ఉన్న బంగారు నగలు దోచుకుంది. వీటన్నింటిని తీసుకుని మంగళవారం తిరుపతి వెళ్ళేందుకు ఆర్టీసీ బస్టాండులో వేచివుండగా అనుమానించిన పోలీసులు పట్టుకుని ఆమె బ్యాగ్‌ను పరిశీలించగా బంగారు ఆభరణాలు దొరికాయి. వీటిని స్వాధీనం చేసుకుని విచారించగా చేసిన దొంగతనాలను ఒప్పకుంది. సుమారు రూ.5.75లక్షల విలువగల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకుని మహిళాదొంగను అరెస్టుచేసి కోర్టుకు హాజరు పరిచినట్లు డిఎస్‌పి వెల్లడించారు. బంగారు మొత్తాన్ని రికవరీ చేసిన హెడ్‌కానిస్టేబుల్ శరవణ్‌శెట్టి, హరిబాబు, అప్పయ్య, దుర్గా, శ్యామల, సునీతలకు డిఎస్‌పి రాజేంద్రప్రసాద్ నగదు రివార్డ్‌లు అందజేస్తు.. జిల్లా ఎస్‌పికి సిఫార్సులు చేస్తున్నట్లు తెలిపారు.

ప్రభుత్వాసుపత్రిలో మెరుగైన సేవలు
* ఆరోగ్యశాఖ జాయింట్ డైరెక్టర్ వెల్లడి

పుంగనూరు రూరల్, జనవరి 19: ప్రభుత్వాసుపత్రులలో ఉత్తమ నాణ్యతా ప్రమాణాలతో వైద్యపరీక్షలు, సేవలు మరింత మెరుగ్గా అందించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని వైద్యవిధాన పరిషత్ జాయింట్ డైరెక్టర్ జయచంద్రారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం స్థానిక ప్రభుత్వాసుపత్రి సందర్శనకు విచ్చేసిన ఆయన వసతులపై రోగులను ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాసుపత్రులలో మెరుగైన సేవలందించేందుకు ప్రైవేటు భాగస్వామ్యంతో అనేక సంస్కరణలు ప్రవేశపెడుతున్నట్టు తెలిపారు. రోగులకు సత్వరమే ఎక్స్‌రే రిపోర్టులు అందించేందుకు కంప్యూటరైజ్డ్ రేడియోగ్రాఫర్‌ను, టెలి రేడియాలజీతో ఎక్స్‌రేను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తున్నట్టు చెప్పారు. అనేక రకాల వైద్య పరీక్షలు అందించేందుకు అవుట్‌సోర్స్ సహాయంతో ల్యాబ్‌డయాగ్నసిస్ విధానాన్ని ఏర్పాటుచేసి 24 గంటలు అందుబాటులో ఉంటారని వివరించారు. ప్రభుత్వాసుపత్రులలో చెడిపోయిన సామగ్రిని తక్షణమే మరమ్మతులు చేసేందుకు ప్రత్యేక వ్యవస్థను నియమించినట్టు తెలిపారు. ప్రసవ సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తల్లీ, బిడ్డ క్షేమం కోసం 102తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ను ప్రవేశపెట్టినట్టు చెప్పారు. మండల పరిధిలో 98శాతం పల్స్‌పోలియో కార్యక్రమం విజయవంతంగా పూర్తయిందని మిగిలిన శాతం రెండవ విడతలో పూర్తి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలోజిల్లా అదనపు వైద్యాధికారి ఫైరోజాబేగం,డాక్టర్ పవన్,రాజశేఖర్, ఉషశ్రీ,హెల్త్ ఎడ్యుకేటర్ కొండయ్య,రవి తదితరులు పాల్గొన్నారు.
‘గ్రామీణ ప్రాంతాల రూపురేఖలు మార్చుతాం’
* మరుగుదొడ్ల బకాయిలు నిధులు విడుదల
చిత్తూరు, జనవరి 19 : రానున్న మూడేళ్ల కాలంలో జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల రూపురేఖలనే మార్చుతామని జిల్లా ప్రజా పరిషత్ చైర్‌పర్సన్ గీర్వాణి చంద్రప్రకాష్ స్పష్టం చేశారు. మంగళవారం ఆమె తన ఛాంబర్‌లో విలేఖరులతో మాట్లాడారు. 14వ ఆర్థిక సంఘం జిల్లాకు రూ 100 కోట్ల మేర నిధులను కేటాయించిందన్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే 90 కోట్లరూపాయలు మంజూరు అయ్యాయని, మిగిలిన 10 కోట్ల రూపాయలు రెండు రోజుల్లో మంజూరు అయ్యే అవకాశాలున్నాయని చెప్పారు. సంబంధిత నిధులతో ఆయా గ్రామ పంచాయతీల్లో పెండింగ్‌లో ఉన్న పనులన్నింటిని పూర్తిచేసి గ్రామాలను సమగ్రంగా అభివృద్ధి చేస్తామన్నారు. ముఖ్యంగా సీసీరోడ్లు, మురుగునీటి కాలువల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తామన్నారు. జిల్లాలో స్వచ్చ్భారత్ పథకం కింద 1, 75, 370 మరుగుదొడ్లు మంజూరు అయ్యాయని, వాటిలో ఇప్పటి వరకు దాదాపు 61, 390 మరుగుదొడ్లు పూర్తయ్యాయని వెల్లడించారు. ఈ నిర్మాణాలకు సంభందించి మొత్తం రూ 13 కోట్లు బకాయిలను లబ్దిదారులకు చెల్లించాల్సి ఉండగా, తొలి విడతగా 6 కోట్ల రూపాయలను విడుదల చేస్తున్నట్లు చెప్పారు. మిగిలిన 7 కోట్ల రూపాయలు త్వరలోనే విడుదల చేస్తామని, ఈ విషయంలో లబ్ధిదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేకుండా మరుగుదొడ్ల నిర్మాణాలను పూర్తిచేసి మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడాలని సూచించారు. సంబంధిత తొలివిడత బకాయిల మొత్తాలను వారం రోజుల్లో లబ్దిదారుల వ్యక్తిగత ఖాతాల్లో జమచేస్తామని స్పష్టం చేశారు. అదే విధంగా గత వేసవికాలంలో వాహనాల ద్వారా ప్రజలకు తాగునీరందించిన వారి బకాయిలను సైతం త్వరలోనే పైసాతో సహా చెల్లిస్తామన్నారు. ఏదైనా గ్రామాల్లో ఇంకా తాగునీటి సమస్య ఉంటే తమ పరిధిలోని ఎంపీడీవోకు గాని, జడ్పీ సీ ఈవోకు గాని, తనకు గాని స్వయంగా తెలియజేస్తే తప్పక పరిష్కరిస్తామని ఆమె తెలిపారు. ఈ సమావేశంలో జడ్పీ సీ ఈవో పెంచల కిషోర్, టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు, జడ్పీ ఛైర్‌పర్సన్ భర్త చంద్రప్రకాష్ పాల్గొన్నారు.

నేటి నుంచి పోలీస్ ఉద్యోగులకు
క్రీడా పోటీలు
* చిత్తూరు పోలీస్‌పెరెడ్ మైదానంలో ఏర్పాట్లు పూర్తి
చిత్తూరు, జనవరి 19 : ఎప్పుడూ ఆయుధాలు, లాఠీలు చేతపట్టి ప్రజల రక్షణ కోసమే పనిచేసే పోలీసు అధికారులు, సిబ్బంది ఆటవిడుపుగా బుధవారం నుంచి శుక్రవారం వరకు మూడు రోజుల పాటు పలు క్రీడలు ఆడుతూ సేద తీరనున్నారు. ఇందుకు సంబంధించి చిత్తూరు పోలీస్ పెరెడ్ మైదానంలో అన్ని ఏర్పాట్లును పూర్తిచేశారు.
మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాల్లో సంప్రదాయ ఆటలైన కబడ్డి, ఖోఖో, పరుగుపందెం, జావెలిన్ త్రో, డిస్కస్ త్రో, వాలీబాల్, త్రోబాల్, బాల్ బాడ్మింటన్ , స్పూన్ అండ్ లెమన్, సూదికి దారం, మ్యూజికల్ ఛైర్స్ తదితర అంశాలపై పోటీ పడనున్నారు.
మహిళలు, పురుషుల విభాగంలో విడివిడిగా నిర్వహించే ఈ క్రీడల్లో హోంగార్డు కేడర్ నుంచి ఎస్పీ కేడర్ వరకు ఉద్యోగులు పాల్గొననున్నారు. ఈ క్రీడల్లో ఉత్తమ ప్రతిభ చూపిన ఉద్యోగులకు మెమొంటోలతో పాటు,ప్రశంసాపత్రాలను ఇవ్వనున్నారు. ఏర్పాట్లును పలువురు డీ ఎస్పీలు మంగళవారం పర్యవేక్షించి నిర్వాహకులకు పలు సూచనలు, సలహాలను తెలియజేశారు.

ఫిబ్రవరి 7 నుంచి తిరుమలలో శ్రీ పురందరదాసు ఆరాధన మహోత్సవాలు
తిరుపతి, జనవరి 19:కన్నడ సంగీత పితామహులు శ్రీ పురందర దాసు ఆరాధన మహోత్సవాలను ఫిబ్రవరి 7 నుండి మూడు రోజుల పాటు తిరుమలలో ఘనంగా నిర్వహించనున్నట్లు టిటిడి పిఆర్‌వో తలారి రవి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఎంపి అరెస్ట్ అక్రమం
* వైసిపి ఆధ్వర్యంలో ధర్నా
శ్రీకాళహస్తి, జనవరి 19: రాజంపేట ఎంపి మిధున్‌రెడ్డి అరెస్ట్‌కు నిరసనగా మంగళవారం శ్రీ కాళహస్తిలో వైసిపి ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ పార్టీ నాయకుడు శ్రీనివాసులు ఆధ్వర్యంలో కార్యకర్తలు ధర్నా చేశారు. రేణిగుంట విమానాశ్రయం మేనేజర్ రాజశేఖర్‌పై జరిగిన దాడికి సంబంధించి ఎంపి మిధున్ రెడ్డి, పార్టీ నాయకుడు మధుసూదన్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్‌చేశారని శ్రీనివాసులు ఆరోపించారు. గౌరవమైన ఎంపిని అరెస్ట్‌చేయడంలో పోలీసులు అమానుషంగా వ్యవహరించారని దుయ్యబట్టారు. అంతేకాకుండా న్యాయమూర్తి వద్దకు తీసుకెళ్లడం, నెల్లూరు సబ్ జైలుకు తరలించడం సమయాల్లో కూడా పోలీసులు అతిగా వ్యవహరించారని ఆరోపించారు. అక్రమ అరెస్ట్‌కు నిరసనగా ఆందోళన చేయడానికి కూడా హక్కులేని పరిస్థితి కల్పించారని ఆరోపించారు. ప్రతిపక్ష నాయకులపై ప్రభుత్వం కక్ష కట్టి వ్యవహరిస్తోందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్‌పట్ల
ఒంటికాలిపై నిలబడి నిరసన

చంద్రగిరి, జనవరి 19: చంద్రగిరి శాసనసభ నియోజకవర్గ ప్రజా ప్రతినిధి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్‌కు నిరసనగా ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులు మంగళవారం ఒంటికాలిపై నిలబడి నిరసన తెలిపారు. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సమైక్యాంద్ర ఉద్యమంలో చేసిన ఆందోళన కార్యక్రమాలపై అప్పట్లో కేసు నమోదైన విషయం తెలిసిందే. కోర్టులో సంబంధించిన కేసుకు సంబంధించి వాయిదాలకు హాజరుకానందున కోర్టు అరెస్ట్ వారెంటు జారీ చేసింది. దీంతో నెల్లూరు పోలీసులు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని అరెస్ట్‌చేసిన విషయం తెలిసిందే. ఈ విషయమై చంద్రగిరిలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేయడం అన్యాయం అంటూ చంద్రగిరి టవర్‌క్లాక్ వద్ద ఒంటికాలిపై నిరసన తెలిపారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో ఉద్యమానికి సంబంధించిన కేసులన్నీ కూడా తొలగించి వేస్తామని రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసిన విదితమే. అన్యాయంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిమీద కక్షగట్టి రాష్ట్ర ప్రభుత్వం అరెస్ట్ చేయించిందంటూ ఆ పార్టీ మండలాధ్యక్షుడు కొటాల చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. సుమారు అరగంట పాటు జరిగిన నిరసన కార్యక్రమంలో పలువురు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
విద్యుత్ దుకాణంపై కమర్షియల్ టాక్స్ అధికారులు దాడులు
రేణిగుంట, జనవరి 19 : విద్యుత్ దుకాణంపై కమర్షియల్ ట్యాక్స్ అధికారులు మంగళవారం రాత్రి 7 గంటల నుండి తనిఖీలు నిర్వహించారు. రేణిగుంట బజారు వీధిలోని గోల్డ్ మోడల్ విద్యుత్ దుకాణంలోని అమ్మకాలు, కొనుగోళ్లు, స్టాక్‌లను క్షుణ్ణంగా పరిశీలించారు. అమ్మకాలకు, కొనుగోళ్లకు సంబంధించిన రికార్డులను పరిశీలించి తిరుపతి కార్యాలయానికి తీసుకెళ్లారు. దుకాణంలోని అమ్మకాలు, కొనుగోళ్లు, స్టాకుకు సంబంధించిన వివరాలను పరిశీలిస్తామన్నారు. ఈ దాడుల్లో డిప్యూటీ కమర్షియల్ ట్యాక్స్ శ్రీనివాసులు, సిబ్బంది పాల్గొన్నారు.
స్విమ్స్ అభివృద్ధిలో బలరామ్ రెడ్డి పాత్ర మహోన్నతం
తిరుపతి, జనవరి 19 : ఎస్వీయు ప్రారంభదినాల్లో సిండికేట్ సభ్యులు, స్విమ్స్ సలహామండలి మాజీ సభ్యులు దివంగత ఎం బలరామ్ రెడ్డి స్విమ్స్ అభివృద్ధిలో కూడా విశేష సేవలందించారని ప్రముఖ న్యూరాలజీ నిపుణురాలు, స్విమ్స్ పూర్వపు సంచాలకులు డా॥ బి వెంగమ్మ అన్నారు. మంగళవారం స్థానిక భీమాస్ డీలక్స్ హోటల్లో బలరామ్‌రెడ్డి 6 వ వర్థంతి సందర్భంగా ధర్మనిధి ఉపన్యాసాసం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏదైనా ఒక పని చేయాలంటే బలరాం రెడ్డి ఎంతో పట్టుదలతో పూర్తి చేసేవారన్నారు. అనంతరం న్యూరాలజీ ఆఫ్ హ్యాపీనస్ అనే అంశంపై ఆరోగ్యం బాగుండాలంటే మెదడును ప్రశాంతంగా ఉంచుకోవాలన్నారు. రోగాలకు మూల కారణం మనస్సు అన్నారు. ఆరోగ్యాన్ని రక్షించుకోవడం మందులతో కాకుండా ఆరోగ్యకరమైన భోజనం, ఆలోచనలు సక్రమంగా ఉంచుకుంటే మనిషి ఆరోగ్యం పరిపూర్ణంగా ఉంటుందన్నారు. న్యూరాలజీ అంశం నేడు అనేక కొత్త పుంతలను తొక్కుతూ ఉందన్నారు. ఆ దిశ అనేక పరిశోధనలు జరుగుతునాయన్నారు. ద్రవిడ విశ్వవిద్యాయలం పూర్య వైస్ ఛాన్స్‌లర్ ఆచార్య పి వి అరుణాచలం మాట్లాడుతూ బలరాం రెడ్డి ఒక క్రమశిక్షణ కలిగిన సైనికుడన్నారు. విద్యా, వైద్య రంగాలకు సేవలందించిన మహా మనిషి అన్నారు. ఎస్వీయు పూర్వపు వీసి ఆచార్య పి జయరాం రెడ్డి మాట్లాడుతూ బలరాం రెడ్డి మెమోరియల్ సొసైటీ తరపున అనేక ప్రజాహిత కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. బలరాం రెడ్డిలాంటి ఆదర్శప్రాయులు నూటికో, కోటికో ఒకరు పుడతారన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ ఉపాధ్యక్షులు భీమాస్ రఘు, కార్యదర్శి పుట్టా మునిరత్నం, సంయుక్త కార్యదర్శి పేటా శ్రీనివాసులు రెడ్డి, అసెంబ్లీ మాజీ స్పీకర్ అగరాల ఈశ్వర్ రెడ్డి, పి నారాయణ రెడ్డిలు పాల్గొన్నారు.

ములకలచెరువులో టమోటా కిలో 10
ములకలచెరువు, జనవరి 19: స్థానిక వ్యవసాయ మార్కెట్‌యార్డులో కిలో రూ.10లు పలికాయి. పడమటి మండలాల రైతులు ఎక్కువుగా టమోటా పంటను సాగు చేశారు. ఈ ములకల చెరువు మార్కెట్‌కు జిల్లా నుండే కాకుండా అనంతపురం జిల్లా తనకల్లు, నల్లచెరువు, ముది గుబ్బ, కదిరి, ఎన్‌పికుంట తదితర ప్రాంతాల నుండి రైతులు టమోటాలను ఈమార్కెట్‌కు తీసుకువస్తారు. పడమటి మండలాల్లోలో ములకల చెరువు, బి కొత్తకోట, పెద్దమండ్యం, పెద్దతిప్పసముద్రం, కురబలకోట, తంబళ్ళపల్లె మండలాల్లో వేలసంఖ్యలో టమోటా పంటను సాగు చేశారు. మంగళవారం స్థానిక వ్యవసాయ మార్కెట్‌లో మొదటి రకం టమోట బాక్సు ధర రూ.300ల నుండి రూ.250లు పలికింది. రెండో రకం ధర రూ.100ల నుండి రూ.50 వరకు పలికింది.

శ్రీ గోవింద రాజస్వామివారి ఆలయంలో
అధ్యయనోత్సవాలు
తిరుపతి, జనవరి 19: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ప్రతిరోజూ సాయంత్ర అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. జనవరి 9న ప్రారంభమైన ఈ ఉత్సవాలను ఫిబ్రవరి 1 వ తేదీ వరకు నిర్వహించనున్నారు. మాఘమాసంలో ఈ ఆలయంలో దివ్యప్రబంధాన్ని పారాయణం చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా ప్రతిరోజూ సాయంత్రం 5.30 గంటల నుండి 6.30 గంటల వరకు ఆలయంలోని కల్యాణమండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని, సేనాధిపతివారిని, ఆళ్వార్లను వేంచేపు చేస్తారు. వారి సమక్షంలో దివ్యప్రబంధాన్ని పారాయణం చేస్తారు.