చిత్తూరు

అధిక మొత్తంలో నిధులు కేటాయింపునకు కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఫిబ్రవరి 3 : స్థానిక సంస్థలకు, వివిధ మున్సిపాలిటీలకు, విశ్వవిద్యాలయాలను రాష్ట్ర ఆర్థిక సంఘం నుండి అధిక మొత్తంలో నిధులు మంజూరుచేయడానికి కృషి చేస్తామని ఆర్థిక సంఘం సీనియర్ సభ్యులు ప్రొ. కె మునిరత్నం నాయుడు హామీ ఇచ్చారు. బుధవారం నాడు ఎస్వీయూ సెనేట్ హాలు, మహిళా యూనివర్శిటీ సమావేశ మందిరంలో రాష్ట్ర ఆర్థిక సంఘం అభివృద్ధికి సంబంధించి అంశాలపై సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయంలోని వివిధ మేధావులు, అధికారుల సూచనలు తీసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమావేశంలో చర్చించిన అంశాలపై ప్రభుత్వానికి నివేదికలు అందజేయడం జరుగుతుందన్నారు. అనంతరం పద్మావతి అతిధి గృహం నందు మున్సిపల్ కమిషనర్ వి వినయ్ చంద్, జిల్లా సీఈవో, జిల్లా పంచాయితీ అధికారి, ఇతర శాఖాధికారులతో సమావేశమయ్యారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సలహాలు, సూచనలు తీసుకోవడానికి రెండు రోజుల పర్యటన వచ్చామని తెలిపారు. అనేక అంశాలపై అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో కూలంకుశంగా చర్చించామన్నారు. గురువారం నాడు ముఖ్యమంత్రి స్వగ్రామమైన నారావారి పల్లిలో జరిగే వివిధ అభివృద్ధి పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తామన్నారు. అలాగే చిత్తూరు ఎంపి డా. శివప్రసాద్ గ్రామమైన ఐతేపల్లి పంచాయితీని కూడా సందర్శిస్తామన్నారు. ప్రజలతో ముఖాముఖి చర్చిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక సంఘం మెంబర్లు జి సంధ్యారాణి, ఆర్ సుదర్శన రావు, సెక్రటరీ సి వెంకటేశ్వర రావు, జడ్పీ సీ ఈ వో పెంచల కుమార్, జిల్లా పంచాయితీ అధికారి ప్రభాకర్ రావు, నగర పాలక సంస్థ అడిషినల్ కమీషనర్ శ్రీదేవి, డి ఎల్ సి పి వో సురేష్ నాయుడు, నగిరి ఎంపిడివో సుశీలాదేవి, తిరుపతి రూరల్ ఎంపిడీవో రవికుమార్ నాయుడు, రామచంద్రయ్య, శంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
టిటిడి ఉద్యోగుల బ్రహ్మోత్సవ బహుమానానికి
ప్రభుత్వం కోత

* 10 వేలకు మించకూడదని జీవో జారీ
* మండిపడుతున్న టిటిడి ఉద్యోగులు
* నేడు సమావేశం కానున్న ఉద్యోగ సంఘాలు

ఆంధ్రభూమి బ్యూరో
తిరుపతి, ఫిబ్రవరి 3: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామికి ప్రతి ఏడాది నిర్వహించే బ్రహ్మోత్సవాల అనంతరం ఉద్యోగస్తులకు టిటిడి యాజమాన్యం కల్పించే బ్రహ్మోత్సవ బహుమానంలో ప్రభుత్వం కోత విధించడమే కాకుండా ఆంక్షలు విధిస్తూ జీవో నెం 123ను విడుదల చేయడంపై ఉద్యోగుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. గత ఏడాది బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్వాశత ఉద్యోగులు 11 వేల రూపాయలను టిటిడి చెల్లించింది. ఈ ఏడాది ఆ మొత్తాన్ని 12200 రూపాయలకు పెంచింది. అలాగే కాంట్రాక్టు కార్మికులకు 5500 రూపాయల నుండి 6000 రూపాయలకు పెంచుతూ ధర్మకర్త మండలి నిర్ణయం తీసుకుని ప్రభుత్వానికి పంపింది. యధాలాపంగా ప్రభుత్వం నుండి అనుమతి వస్తుందని ఉద్యోగులు భావించారు. అయితే అందుకు భిన్నంగా శ్వాశత ఉద్యోగులకు 10 వేల రూపాయలు, కాంట్రాక్టు ఉద్యోగులకు 5 వేల రూపాయలకు మించి ఇవ్వవద్దని ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ నేపథ్యంలో టిటిడి స్ట్ఫా అండ్ వర్కర్స్ నాయకులు వెంకటేష్, నాగార్జున, రత్న ప్రభాకర్, జె సి ఏ నాయకులు వెంకటరమణారెడ్డి, మునిరెడ్డి, ఎస్సీ ఎస్టీ సంఘ నాయకులు ప్రసాద రావు, భాస్కర్, బిసి సంఘ నాయకులు ముని కుమార్,రామచంద్రయ్య, రామచంద్ర యాదవ్, మహిళా సంఘ నాయకులు ఉషా, ఇందిర, కల్పనలు సమావేశమై ఈ అంశంపై చర్చించేందుకు గురువారం నాడు సమావేశం కావాలని నిర్ణయించారు. టిటిడి పరిపాలన భవనం ఆవరణంలోని క్యాంటీన్ ఉద్యోగులు సమావేశం కానున్నారు. ఈ వ్యవహారం ఎటు దారితీస్తుందో వేచి చూడాల్సి ఉంది.
తమిళనాడు చిట్టేరి ప్రాంతంలో
విద్యుదాఘాతంతో రెండు ఏనుగులు మృతి
కుప్పం, ఫిబ్రవరి 3 : తమిళనాడు రాష్ట్రం బరుగూరు సమీపంలోని చిట్టేరి ప్రాంతంలో విద్యుత్ షాక్‌కు గురై రెండు ఏనుగులు మృత్యువాత పడ్డాయి. పంట పొలాలను వణ్యప్రాణుల నుంచి కాపాడుకోవడానికి రైతులు పంట పొలాల చుట్టూ ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు తగిలి ఈ ఘటన చోటుచేసుకుంది. గత కొంతకాలంగా కుప్పం పరిసర ప్రాంతంలో ఏనుగుల మంద పంట పొలాలపై దాడులు జరిపి బీభత్సం సృష్టించాయి. దీంతో భారీగా పంట నష్టం వాటిల్లింది. అయితే మంగళవారం రాత్రి ఈ ఏనుగుల మంద కుప్పం సమీప ప్రాంతమైన బరుగూరు సమీపంలోని అటవీ ప్రాంతానికి వెళ్లాయి. ఈ నేపథ్యంలో అక్కడ రైతులు తమ పంట పొలాల్లో ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు తగిలి గుంపులోని రెండు ఏనుగులు అక్కడికక్కడే మృతి చెందాయి. ఇటీవల చిత్తూరు జిల్లాలో కుప్పం పరిసర ప్రాంతాల్లో కూడా పంట పొలాల్లో ఏర్పాటు చేసిన తీగలకు తగులుకొని పలు ఏనుగులు మృత్యువాత పడ్డాయి. ఇటీవల కాలంలో ఇటు ఆంధ్ర, అటు తమిళనాడు ప్రాంతంలో ఏనుగులు విద్యుత్ షాక్‌లకు గురై మృతి చెందడం పరిపాటిగా మారుతోంది. కుప్పం, పలమనేరు, రొంపిచెర్ల, రామకుప్పం, వి.కోట తదితర ప్రాంతాల్లో వణ్యప్రాణులు విద్యుత్‌షాకు గురై మరణించిన సంగతి తెలిసిందే. ప్రధానంగా అటవీ ప్రాంతాలు అంతరించిపోవడం, అడవుల్లో సరైన ఆహారం లేకపోవడంతో ఈ ఏనుగులు పంట పొలాలపై దాడులు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పంటలను రక్షించుకునేందుకు రైతులు వేస్తున్న విద్యుత్ కంచెలకు తగులుకొని ఇవి మృత్యువాత పడుతున్నాయి. తమిళనాడులో కూడా ఇదే తరహాలో ఈ ఘటన చోటుచేకుంది.
నేడు ఇంటర్ ప్రయోగ పరీక్షలు
తిరుపతి, ఫిబ్రవరి 3: ఇంటర్మీడియట్ విద్యార్థులకు గురువారం నుండి ప్రయోగ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలు 24వ తేదీ వరకు కొనసాగుతాయి. జిల్లా వ్యాప్తంగా 31459 మంది విద్యార్థులు ఈ పరీక్షల్లో పాల్గొననున్నారు. ఇందుకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా 74 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో 47 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, 5 ఎయిడెడ్ కళాశాలలు, 22 ప్రైవేటు కళాశాలలను పరీక్ష కేంద్రాలుగా కేటాయించారు. 5 బ్యాచ్‌లుగా ఈపరీక్షలను నిర్వహించనున్నారు. ఇప్పటికే ప్రయోగాలకు అవసరమైన రసాయన పదార్థాలను పరీక్ష కేంద్రాల్లో ఏర్పాటు చేశారు. ఇంకా అవసరమైతే అదనంగా ఏర్పాటు చేయడం కోసం 20 వేల రూపాయలను ఒక్కొక్క కళాశాలకు కేటాయించే బాధ్యతలను ప్రిన్సిపాల్‌కు అప్పగించామన్నారు.

ముక్కంటీశుని సేవలో బిజెపి అధ్యక్షుడు అమిత్ షా
* ఘన స్వాగతం పలికిన కార్యకర్తలు
శ్రీకాళహస్తి, ఫిబ్రవరి 3: బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా బుధవారం శ్రీకాళహస్తీశ్వరుడ్ని దర్శించుకున్నారు. తిరుమల పర్యటనకు వచ్చిన ఆయన బుధవారం ఉదయం తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకొని శ్రీ కాళహస్తికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయనకు బిజెపి కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. సన్నిధి వీధిలోని విఐపి గేటు వద్ద పార్టీ నాయకుడు కోలా ఆనంద్ ఆధ్వర్యంలో పూలవర్షం కురిపించారు. బిజెపి జిందాబాద్.. అమిత్ షా జిందాబాద్.. అంటూ నినాదాలు చేశారు. దక్షిణ గోపురం వద్ద దేవస్థానం ఆధ్వర్యంలో ట్రస్టుబోర్డు చైర్మన్ గురవయ్యనాయుడు, సభ్యులు, ఇ ఓ భ్రమరాంబ, వేద పండితులు సంప్రదాయ పూర్వకంగా స్వాగతం పలికారు. ఆ తరువాత స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. దక్షిణామూర్తి సన్నిధిలో వేద పండితులు ఆశీర్వదించారు. ట్రస్టుబోర్డు చైర్మన్ తీర్థ ప్రసాదాలను, స్వామి, అమ్మవార్ల చిత్రపటాన్ని అందజేశారు. అమిత్ షాతో పాటు దేవాదాయశాఖామంత్రి మాణిక్యాలరావుకూడా వచ్చారు. ఎమ్మెల్సీ శ్రీనివాసులు, టిటిడి బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు చంద్రారెడ్డి, ఓబిసి రాష్ట్ర అధ్యక్షులు జల్లి మధుసూధన్ రావు, ప్రాంతీయ నాయకులు శాంతారెడ్డి, పుష్పలత, కండ్రిగ ఉమ, మనోహర్ రెడ్డి, రమేష్ తదితరులు స్వాగతం పలికారు. జిల్లా కలెక్టర్ సిద్దార్థజైన్, తహశీల్దార్ చంద్రమోహన్ దర్శన ఏర్పాట్లు చేయించారు. మునిసిపల్ చైర్‌పర్సన్ రాధారెడ్డి కూడా స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.
మహాశివరాత్రిని ఘనంగా నిర్వహించండి
బిజెపి అధ్యక్షుడు అమిత్ షా తో పాటు ఆలయానికి వచ్చిన దేవాదాయశాఖామంత్రి మాణిక్యాలరావు, ట్రస్టుబోర్డు చైర్మన్ గురవయ్యనాయుడు, సభ్యులు, ఈఓ భ్రమరాంబతో కొద్దిసేపు మాట్లాడారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించాలని సూచించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. అవసరమైన ఈ సదుపాయాలు కల్పించాలని భక్తులందరికీ త్వరగా దర్శనమయ్యే విధంగా చూడాలని సూచించారు. స్థానిక డి ఎస్పీ వెంకటకిశోర్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

‘ప్రత్యేక రాష్టమ్రే సీమ ప్రజల ఆకాంక్ష’
ఆంధ్రభూమి బ్యూరో
తిరుపతి, ఫిబ్రవరి 3 : ప్రత్యేక రాష్ట్రం కావాలని రాయలసీమ ప్రజలు ఎంతగానో కోరుకుంటున్నారని, తాము కూడా వేరుపడాలని కోస్తా జిల్లా ప్రజలుకూడా అంతే కాంక్షతో ఉన్నారన్నార ని రాయలసీమ అధ్యయనాల సంస్థ అధ్యక్షుడు భూమన్ సుబ్రహ్మణ్యం అన్నారు. రాయలసీమ రాష్ట్ర సాధనే ఏకైక ఎజెండాగా ఈనెల 14న కర్నూలు జిల్లా ఆలూరు నుంచి రాయలసీమ పరిరక్షణ సమితి నాయకుల ఆధ్వర్యంలో బస్సు యాత్ర నిర్వహించనున్నారు. బుధవారం స్థానిక ప్రెస్ క్లబ్‌లో బస్సు యాత్ర సన్నాహ సమావేశాన్ని రాయలసీమ పరిరక్షణ సమితి నాయకులు నిర్వహించారు. ఈసందర్భంగా భూమన్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ రాయలసీయకు చెందిన వారు ఎక్కువ శాతం ముఖ్యమంత్రులు, ప్రతిపక్షనాయకులున్నారని ఈ అసంతృప్తి కోస్తా జిల్లా వాసులకు ఎక్కువగా ఉందన్నారు. విభజన సమయంలోనే మూడు రాష్ట్రాలు చేసి ఉంటే ఈ సమస్య వచ్చేది ఉండేదికాదు. సమైక్య ఉద్యమం వల్ల సీమ ఎంతో నష్టంపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, రైతు నాయకులు దశరథరామి రెడ్డి, హైకోర్టు న్యాయవాది శివారెడ్డి, సీనియర్ జర్నలిస్టు రాఘవశర్మ, ప్రముఖ కథారచయిత బండినారాయణ స్వామి, విద్యార్థి నాయకుడు భాస్కర్, నవీన్ రెడ్డి, పురుషోత్తం రెడ్డి ఉన్నారు.
రాయలసీమకు 200 టిఎంసీల నీరందివ్వండి
* అమిత్ షాకు జల్లి వినతి
ఆంధ్రభూమి బ్యూరో
తిరుపతి, ఫిబ్రవరి 3 : రాయలసీమ సమగ్రాభివృద్ధికి 200 టి ఎం సిల నీరు, ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని బిజెపి జాతీయ అద్యక్షుడు అమిత్ షాను ఓబిసి మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు జల్లి మధుసూధన్ కోరుతూ వినతి పత్రం సమర్పించారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చిన ఆయనను తిరుమల పద్మావతి అతిథి భవనంలో కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపి అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని కేంద్రం నిదులు కేటాయించడం అభినందనీయమని అందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు.
నేడు జాతీయ స్థాయి సస్య రక్షణ యాజమాన్య సదస్సు
ఆంధ్రభూమి బ్యూరో
తిరుపతి, ఫిబ్రవరి 3 : ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం లో జాతీయ స్థాయి యాజమాన్య సదస్సును భారతీయ సస్య రక్షణ సంస్థ ఆద్వర్యంలో సస్య రక్షణ యాజమాన్యలో జాతీయ ప్రాధాన్యతలు అనే అంశంపై యాజమాన్య సదస్సును గురువారం నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ అధ్యక్షుడు డాక్టర్ కె ఎస్ వరప్రసాద్ తెలిపారు. బుధవారం వ్యవసాయ పరిశోధన స్థాన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెండు రోజుల పాటు ఈ సదస్సును నిర్వహిస్తున్నామన్నారు. వివిధ రాష్ట్రాల నుండి ప్రముఖ శాస్త్ర వేత్తలను ఆహ్వానించి సస్య రక్షణ యాజమాన్యంలో జరుగుతున్న అభివృద్ధి, భవిష్యత్తులో అనుసరించాల్సిన విధానాలు,రైతుల సమస్యలపై చర్చిస్తామన్నారు. 1972వ సంవత్సరంలో ఈ సంస్థ ఏర్పాటై 1000 మంది శాస్తవ్రేత్తలు 46 సంస్థల సభ్యత్వం కలిగి ఉందన్నారు. రైతులకు ఉపయోగపడే అంశాలపై పరిశోధన చేయడం, ప్రతి రెండు సంవత్సరాలకు ఒక సారి జాతీయ, అంతర్జాతీయ సదస్సులు నిర్వహించడం చేస్తున్నామన్నారు. ఈ సదస్సులో ఐ ఎ ఎస్ అధికారిణి డా. ఉషారాణి, వ్యవసాయ వర్శిటీ వీసి డా. ఎ పద్మరాజ్ లు పాల్గొంటారన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి డా. వి శరత్‌బాబు, డా. ఎ రామకృష్ణరావులు పాల్గొన్నారు.
తెగుళ్ల నివారణపై జాగ్రత్తలు తీసుకోండి
* మామిడి తోట యాజమాన్యాలపై
రైతులకు అవగాహన సమావేశం
సత్యవేడు, ఫిబ్రవరి 3 : వాతావరణం అనుకూలంగా ఉంటేనే మామిడి తోటలు ఫలితాలు వస్తాయే తప్పా రసాయనిక మందుల వల్ల కాదని తెగుళ్ల నివారణపై రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఉద్యానవన పరిశోధన కార్యాలయం కీటక నాశిని పరిశోధకులు శ్రీనివాసులు రెడ్డి పిలుపునిచ్చారు. మండల పరిధిలోని పి వి పురం గ్రామంలో ఉద్యానవన శాఖాధికారిణి శైలజ ఆధ్వర్యంలో అనంతరావుపేటలో రైతులకు అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉష్ణోగ్రత అధికంగా ఉంటేనే మామిడి పూత వస్తుందన్నారు. ఈ సందర్భంగా ఇస్టానుసారంగా రసాయనిక మందులు వాడకూడదన్నారు. మొదటి దశలో ఆస్ఫేట్, సల్ఫర్ లేదా లథాన్ మందులను వాడడం వల్ల పూత అధికంగా వస్తుందన్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో తేనే మంచు పురుగు మామిడి పూతను ఆవహిస్తున్నదన్నారు. దీని నిర్మూలనకు థయోమెథాక్సిన్ ( అక్తర), అప్లాడ్, ఎమిడా, ఎక్స్‌కోనాజల్ వంటి మందులను వాడడం వలన వాటిని నివారించవచ్చునన్నారు. కాయలు ఎక్కువ దిగుబడి కావాలంటే తక్కువ శాతంలో రసాయనిక మందులను పిచకారి చేయాలన్నారు. పండ్లతోట పెంపకాలను చేపడుతున్న రైతులు సమీపంలో ఉన్న ఉద్యానవన శాఖ అధికారులను సంప్రదించి తగు సూచలను తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉపాధ్యక్షులు సుందర రామి రెడ్డి, రైతులు ప్రసన్న కుమార్ రాజు, సుబ్రమణ్యం రాజు, శివయ్య, భాస్కర్ రెడ్డి, గజపతి, ఆనంద్ రెడ్డి, రమేష్, హేమంత్, రాజయ్య, సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.
‘పాలకుల వల్లే బిఎస్‌ఎన్‌ఎల్‌కు నష్టాలు, కష్టాలు’
ఆంధ్రభూమి బ్యూరో
తిరుపతి, ఫిబ్రవరి 3 : బిఎస్‌ఎన్ ఎల్ వినియోగదారులకు అద్భుతమైన సేవలందిస్తూ లాభాల బాటలో నడుస్తున్న ఈ ప్రభుత్వ రంగం సంస్థను పాలకులు అనుసరిస్తున్న విధానాలతో నష్టాలు, కష్టాలు తెచ్చిపెడుతున్నాయని ఆల్ ఇండియా బిఎస్‌ఎన్‌ఎల్ డీవోటి ఫెన్షనర్స్ అసోసియేషన్ జాతీయ ప్రధానకార్యదర్శి కెసి జయరాజ్ అన్నారు. స్థానిక రామతులసి కళ్యాణ మండపంలో జరుగుతున్న మహాసభ రెండవ రోజు అయిన బుధవారం నాడు ఘనంగా ముగిసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నష్టాల సాకు చూపి ఉద్యోగులకు, పెన్షనర్లకు వేతన సవరణ నిరాకరిస్తే చూస్తూ ఊరుకోబమని హెచ్చరించారు. బిఎస్‌ఎన్‌ఎల్ ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలంటే సానుకూల విధానాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక పెన్షన్ వ్యతిరేక విధానాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు భట్టాచార్య మాట్లాడుతూ సమావేశంలో తీసుకున్న తీర్మానాన్ని వివరించారు. బిఎస్‌ఎన్‌ఎల్ పెన్షనర్లకు 78.2 శాతం ప్రకారం వేతన సవరణ చేయాలని తీర్మానించామన్నారు. అలాగే 2017 జనవరి 1వ తేదీనుంచి ఉద్యోగులకు, పెన్షనర్లకు అ సౌకర్యం అందేలా చర్యలు చేపట్టాలన్నారు. డి ఏ బేసిక్ ఫే ని పెన్షన్లకు విలీనం చేయాలన్నారు. బి ఎస్‌ఎన్‌ఎల్‌ను సంరంక్షించేదుకు ప్రభుత్వం విధానాన్ని మార్చుకోవాలన్నారు. మతోన్మాదుల శక్తుల వల్ల పెరుగుతున్న అసహనాన్ని తమ సభ తీవ్రంగా ఖండించిందన్నారు. మత సామరస్యాన్ని, లౌకిక తత్వాన్ని కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే క్యాజువల్ కాంట్రాక్టు కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేసారు.
నూతన కమిటీ అధ్యక్షుడుగా
ఏ కె భట్టాచార్య
ఆల్ ఇండియా బిఎస్‌ఎన్‌ఎల్‌డివోటి పెన్షనర్ల అసోసియేషన్ నూతన కమిటీ అధ్యక్షుడుగా పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఏ కె భట్టాచార్య, ప్రధాన కార్యదర్శిగా కె జి జయరాజ్‌లను ఈ మహాసభ సందర్భంగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారి, సీనియర్ నాయకులు నంబూద్రి పర్యవేక్షణలో జరిగిన ఈ ఎన్నికల్లో కోశాధికారిగా కేరళకు చెందిన ఆర్ అరవింద ద్రాక్షాయన్, సలహాదారుగా వి ఏ ఎన్ నంబూద్రి, ప్యాట్రిన్‌గా పివి చంద్రశేఖరన్, ఏపి సర్కిల్ నుంచి జాతీయ ఉపాధ్యక్షుడుగా అశోక్ బాబును ఎంపిక చేసుకున్నారు.