చిత్తూరు

ప్రత్యేక హోదాపై నీళ్లు చల్లారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూలై 29: కాంగ్రెస్ పార్టీతో పాటు అన్ని పార్టీలు ముక్తకంఠంతో ప్రత్యేకహోదా కావాలని రాజ్యసభలో గళం విప్పినా కేంద్ర ప్రభుత్వం మాత్రం నీళ్లుచల్లిందని, ఇందుకు బాబు కపట రాజకీయాలే కారణమని కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి రామచంద్రయ్య అన్నారు. శుక్రవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని రాజ్యసభలో అన్ని పార్టీలనూ కాంగ్రెస్ పార్టీ ఒక్క తాటిపైకి తీసుకొచ్చిందన్నారు. అయితే నాడు 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేసిన వెంకయ్యనాయడు ఈ వ్యవహారంపై నీళ్లు చల్లాడని ఆరోపించారు. ఇక బాబు తనపాలన నీతివంతంగా సాగుతోందని, అభివృద్థి పథంలో నడుస్తుందని, 85 శాతం సర్వేలో తేలిందని చెప్పుకుంటున్నారన్నారు. అదే సర్వేలో రెవెన్యూ విభాగంలో 47 శాతం అవినీతి పెరిగిందని కూడా చెప్పారన్నారు. అంటే తాను నీతివంతుడనని, ఎమ్మెల్యేలు, మంత్రులు నీతిమంతులు కాదని బాబు చెప్తున్నాడా అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో ఒక విభాగంలో అవినీతి 47 శాతం ఉన్నపుడు బాబుకు మాత్రం ఎలా నీతివంతన పాలన అవుతుందో ఆయన నీతికే తెలియాలన్నారు. కేంద్ర ప్రభుత్వం 7 కరువు జిల్లాలకు 2 సంవత్సరాలకు గాను ఒక్కో జిల్లాకు 50కోట్ల చొప్పున 700 కోట్లు కేటాయించిందన్నారు. ఆ డబ్బులు ఎలా ఖర్చుపెట్టారో కేంద్రం అడిగితే సమాధానం లేదన్నారు. చివరకు కేంద్రమే ఒక బృందాన్ని పంపి తనిఖీచేస్తే వారు ఖర్చుపెట్టిన సొమ్ము కేవలం 8 కోట్లు అని , తక్కిన నిధులు ఎవరికోసం ఎక్కడ ఖర్చుపెట్టారో ఆయన నీతికే తెలియాలన్నారు. ఇక అందులోనూ చిత్తూరుకు 4 కోట్లు, అనంతపురంకు 2కోట్లు ఇలా ఖర్చుపెట్టారని, కర్నూలు, కడపకు ఒక్కరూపాయి కూడా ఖర్చుపెట్టలేదన్నారు. కరువు సొమ్ము తినేవారుకూడా ఎలా నీతివంతులవుతారో తెలియడం లేదన్నారు. ఇక బడ్జెట్‌లో నిధులను ఆయన తన ఇష్టారాజ్యంగా మళ్లించి ఖర్చుచేస్తున్నారన్నారు. 2015 కోట్లు రాజధాని నిర్మాణానికి ఇచ్చామని కేంద్రం చెబుతున్నదని, మరి ఆ సొమ్ము ఏమైందని అర్థం కావడం లేదన్నారు. తాను బాబుకు చెప్పేది ఒక్కటేనని, రెండేళ్లపాటు టిడిపిలోని అనుచర గణంతో రాష్ట్రాన్ని దోపిడీ చేయించాడని, ఇక తక్కిన 3 సంవత్సరాలైనా ప్రజల సంక్షేమంకోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడాలని ఆయన అన్నారు. ఇక బిల్లుపై కేంద్రాన్ని నిలదీసే దమ్ములేనపుడు రాష్ట్రం పట్ల చిత్తశుద్ధి ఉంటే బిజెపితో ఆడుతున్న సయ్యాటను వదులుకోవాలని హితవు పలికారు. ఇక పుష్కరాలు బృహస్పతి రాశి మారితే వస్తాయన్నారు. ఇది 10 సంవత్సరాల ముందే తేలుతుందన్నారు. అలాంటపుడు కృష్ణా పుష్కరాలకు సంబంధించి చేపడుతున్న పనులు ముందే ఎందుకు చేపట్టలేదంటే కేవలం నామినేషన్‌పైన తన వారికి కాంట్రాక్ట్ పనులను ఇప్పించుకోవడం కోసమేనని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు పొలకలూరి మల్లికార్జున్, పిసిసి కార్యదర్శి నయనార్ శ్రీనివాసులు, ప్రమీలమ్మ, మోహనరెడ్డి, నాయకులు డి ఎంసి భాస్కర్, మహిళానాయకులు సింధూజ, భారతి, మనోహరమ్మ, మాజీ కౌన్సిలర్ నరసింహులు, ఎస్టీ సెల్ నాయకులు గుండాల నాయక్ తదితరులు పాల్గొన్నారు.