చిత్తూరు

విదేశాలకు అమరావతి అప్పగింత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూలై 31: రాష్ట్రంలో నూతన రాజధాని అమరావతి నిర్మాణాన్ని విదేశీ కంపెనీలకు అప్పగించడం వల్ల తీవ్ర నష్టం జరుగనున్నదని ప్రముఖ విప్లవకవి జట్టి జయరాం ఆవేదన వ్యక్తం చేశారు. విప్లవ కమ్యూనిస్టు నాయకులు తరిమెల నాగిరెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వర రావు వర్థంతి సభలు ఆదివారం స్థానిక యూత్ హాస్టల్‌లో నిర్వహించారు. ఈసందర్భంగా జయరాం మాట్లాడుతూ రాజధాని నిర్మాణానికి నీళ్లు, సిమెంటు వంటివి మనం సరఫరాచేసి రోడ్లు వంటి కనీస సదుపాయాలు మనం కల్పించి మన కార్మికులు శ్రమచేస్తే విదేశీయులు లాభం పొందే పరిస్థితి తలెత్తడం దురదృష్టకరమన్నారు. విదేశీ పెట్టుబడుల వల్ల మన దేశం ఎంత నష్టపోతుందో నాలుగున్నర దశాబ్దాల క్రితమే తరిమెళ నాగిరెడ్డి ‘‘తాకట్టులో భారతదేశం’’ అన్న పుస్తకంలో నిర్వహించారని గుర్తుచేశారు. బడుగు, బలహీన వర్గాల కార్మికులు, రైతులు, విద్యార్థులు సంఘటితమైనప్పుడే సోషలిస్ట్ వ్యవస్థ నిర్మాణం సాధ్యమవుతుందని అన్నారు. ఈ ఆశయసాధనకోసం తరిమేళ, దేవులపల్లి లాంటి విప్లవనాయకులు తమ జీవితాలను అర్పించారన్నారు. సీనియర్ జర్నలిస్ట్ రాఘవశర్మ మాట్లాడుతూ స్వేచ్ఛకు, స్నేహానికి, విప్లవానికి పర్యాయపదం తరిమేళ నాగిరెడ్డి అన్నారు. పది పెట్టి గుణకారం చేసిన మంచి తనమని మహాకవి శ్రీ శ్రీ తరిమెలపై చేసిన వ్యాఖ్యలను ఆయన గుర్తుచేశారు. అన్యాయాన్ని ఎదిరించిన వారిని ఆరాధిస్తామని, అందుకే దేవులపల్లి నాకు ఆరాధ్యులని, పూజ్యుడని ప్రముఖకవి కాలోజీరావు అన్న మాటలు కూడా ఆయన గుర్తుచేశారు. నాగిరెడ్డి రాసిన తాకట్టులో భారతదేశం చదివిన ఒక జిల్లా జడ్జి తాకట్టు పెట్టడం కాదు అమ్మేశారని వ్యాఖ్యనించడం మనదేశ దౌర్భాగ్యం ఏ స్థితిలో ఉందో అర్థమైందన్నారు. పాతికేళ్లక్రితం చేపట్టిన ఆర్థిక సంస్కరణల వల్ల స్థూల జాతయోత్పత్తి, జాతీయ ఆదాయం పెరిగినా సామాన్యుల జీవన స్థితిగతుల్లో మాత్రం ఇసుమంత మార్పు కూడా రాలేదన్నారు. అందుకు కారణం ఈ సంస్మరణలో మానవీయ ధృక్పథం లేకపోవడమే నన్నారు. గొప్ప వాగ్ధాటి గల నాగిరెడ్డి ఆర్థిక విశే్లషణలో దిట్టయితే దేవులపల్లి విప్లవ పద నిర్దేశంలో, సాహితీ సంస్కృతి రంగాలపై పట్టుకలిగిన దిట్ట అన్నారు. ఒకరు వస్తువైతే మరొకరు రూపం అన్నారు. భారత కమ్యూనిస్టు విప్లకారుల సమైక్యతా కేంద్రం నాయకుడు భాస్కర్ మాట్లాడుతూ వ్యవసాయ విప్లవం ఆధారంగా సాగే సాయుధ పోరాటాన్ని తెలంగాణ సాయుధ పోరాట యోధులు దేవులపల్లి, తరిమెల ఆశించారన్నారు. భూస్వామ్య విధానాన్ని రద్దుచేసి దునే్నవాడికే భూమి పంచాలనే వ్యవసాయ విప్లవ కార్యక్రమాన్ని వీరిరువురూ ప్రకటించారన్నారు. ఆ మార్గంలో పయనించినపుడే మనం వారికి నిజమైన నివాళి అర్పించినట్లవుతుందన్నారు. భారత కమ్యూనిస్ట్ విప్లవకారులు సమైక్యతాకేంద్రం మరో నాయకుడు బాలు మాట్లాడుతూ మనిషి మనిషిగా ఆత్మగౌరవంతో బతికే సమాజం కోసం ఈ ఇద్దరు విప్లవనాయకులు కృషిచేశారన్నారు. రాయలసీమ తాగునీటి కోసం సేకరించిన డబ్బులు కూడా అమరావతి నిర్మాణానికి అర్పించడం దారుణమన్నారు. సభకు అధ్యక్షత వహించిన గ్రామీణ పేదల సంఘం రాష్ట్ర కార్యదర్శి భాస్కర్ మాట్లాడుతూ భూస్వామి అయిన తన తండ్రికి వ్యతిరేకంగా 40 ఏళ్లక్రితమే పోరాడిన తరిమెళ నడిచిన మార్గం తమకు స్ఫూర్తి దాయకమన్నారు. ఆ స్ఫూర్తితోనే తమ సంఘం పనిచేస్తుందన్నారు. సభ ప్రారంభానికి ముందు తరిమెళ నాగిరెడ్డి చిత్రపటానికి జట్టి జయరాం, దేవులపల్లి వెంకటేశ్వరరావు చిత్రపటానికి రాఘవ శర్మలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.