చిత్తూరు

ప్రత్యేక హోదా నినాదంతో దద్దరిల్లిన తిరుపతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఆగస్టు 2 : ప్రత్యేక హోదా కోసం వైకాపా ఇచ్చిన బంద్ పిలుపు దాదాపు విజయవంతమైంది. ప్రత్యేక హోదా నినాదంతో ఆందోళనకారులు చేసిన నిరసన కార్యక్రమాలతో తిరుపతి దద్దరిల్లింది. నిత్యం గోవిందనామస్మరణలు వినిపించే తిరుపతి పుణ్యక్షేత్రంలో ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై చేసిన విమర్శలతో తిరుపతి వేడెక్కింది. ఉదయం 5 గంటలకే వైకాపా నేతలు తెలుగుతల్లి విగ్రహం ముందు బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. అంతకుముందు ర్యాలీ చేశారు. అటు తరువాత సిపిఎం, సిపిఐ, లోక్‌సత్తా, రాయలసీమ పోరాట సమితి, వివిధ విద్యార్థి సంఘాలు, ప్రజాసంఘాలు ప్రత్యేకహోదాపై నినదించారు. వామపక్షాల ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్‌కు మోదీ భూతంలాంటి వాడని, కార్యకర్తలు వేసిన వేషధారణాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. అలాగే నరేంద్రమోదీ, వెంకయ్యనాయుడు, అరుణ్‌జైట్లీ, చంద్రబాబునాయుడు ప్రత్యేకహోదాపై నాటకం ఆడుతున్నారని వామపక్ష కార్యకర్తలు ప్రదర్శించిన వీధి నాటకం కూడా విశేషంగా ఆకట్టుకుంది. ఇక ఆందోళనకారులను కట్టడి చేయడంలో తిరుపతి అర్బన్ ఎస్పీ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఉదయం 5 గంటల నుంచి ఆందోళనకారులు నిరసనలు ప్రారంభించగానే నగరంలో భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరింపచేశారు. రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు బృందాలుగా విడిపోయి నగరంలో పలుచోట్ల రాస్తారోకో, ధర్నాలు చేశారు. ఈ క్రమంలో 8 గంటల వరకు పోలీసులు ఆందోళనకారుల వెంట ఉంటూనే ఆపై ఎక్కడివారిని అక్కడ అరెస్ట్‌చేసే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా భారీగా వాహనాలను తీసుకొచ్చి వారిని వాహనాల్లో ఎక్కించి ఊరికి దూరంగా ఉన్న పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో వైకాపా రాష్ట్ర కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి, ఆయన అనుచరులను, అలాగే సిపిఐ, సిపిఎం జిల్లా కార్యదర్శులు రామానాయుడు, కుమార్‌రెడ్డి, వారి కార్యకర్తలను అరెస్ట్‌చేసి ఎంఆర్‌పల్లికి తరలించారు. శాంతియుతంగా తాము రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం నిరసిస్తుంటే ప్రభుత్వం పోలీసులను ఉపయోగించి ప్రజా ఉద్యమాల పీక నొక్కేందుకు తెగబడిందంటూ నాయకులు నిప్పులు చెరిగారు. ఈ క్రమంలో ఎమ్‌ఆర్ పల్లి పోలీస్‌స్టేషన్‌లో అరెస్టయిన వైకాపా, వామపక్ష నేతలు ధర్నాకు దిగారు. ఇక మునిసిపల్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగిన లోక్‌సత్తా అధ్యక్షుడు బాలసుబ్రహ్మణ్యం, రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్‌కుమార్‌రెడ్డి, వారి అనుచరులను పోలీసులు అరెస్ట్‌చేసి ఈస్ట్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అలాగే డిసిసి అధ్యక్షుడు వేణుగోపాల్‌రెడ్డి, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీదేవి, రాష్ట్ర మహిళా నాయకులు సింధూజ, వారి అనుచరులను అరెస్ట్ చేసి ఈస్ట్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కాగా భూమన కరుణాకర్‌రెడ్డిని అరెస్ట్‌చేసే సమయంలో వైకాపా కార్యకర్తలు ఆయన్ను అరెస్ట్ చేయనీకుండా కవచంలా ఏర్పడి పద్మవ్యూహం పన్నారు. అయితే తీవ్ర ప్రతిఘటనల మధ్య పోలీసులు భూమన్‌ను, ఆయన అనుచరులను అరెస్ట్ చేశారు. ఇక వామపక్ష నాయకులను అరెస్ట్ చేసే సమయంలో కూడా పోలీసులు తీవ్ర ప్రతిఘటనలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో పోలీసులు మహిళా ఆందోళనకారుల పట్ల విచక్షణా రహితంగా వ్యవహరించారని విమర్శలు ఎదురయ్యాయి. ఒకవిధంగా చెప్పాలంటే పోలీసులు సంయమనం పాటిస్తూ ఆందోళనకారులను నియంత్రించగలిగారు. గమనించదగ్గ విషయం ఏమిటంటే ఎస్పీ జయలక్ష్మి పన్నిన వ్యూహరచనతో నగరంలో ఎక్కడా అవాంఛనీయ సంఘటనలకు అవకాశం లేకుండా పోయింది. ఉదయం 8.30 గంటలకే ఆందోళనకారులను ఆరెస్ట్ చేయడంతో అప్పటివరకు బస్టాండ్‌లోని డిపోలకే పరిమితమైన 1425 బస్సులు 11 గంటల నుంచి రోడ్డుపైకి వచ్చాయి. అయితే బంద్ నేపథ్యంలో ప్రయాణికులు లేకుండా చాలావరకు బస్సులు ఖాళీగానే నడపాల్సి వచ్చింది. ఇదిలాఉండగా ఆందోళనకారులను పోలీసులను అరెస్ట్ చేసినప్పటికీ వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేసి బంద్‌కు మద్దతు చాటారు. దీంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి.
మహిళల పట్ల ఇంత పైశాచికమా
* భూమన కరుణాకర్‌రెడ్డి
రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామంటూ ప్రధాని నరేంద్రమోదీ మోసం చేస్తే ఆయన్ను ప్రశ్నించే ధైర్యం లేకుండా చంద్రబాబునాయుడు ప్రజల మనోభావాలను ఢిల్లీ ముందు తాకట్టుపెట్టిన నేపథ్యంలో శాంతియుతంగా బంద్ నిర్వహిస్తున్న తమను అరెస్ట్ చేయడమే కాకుండా మహిళా కార్యకర్తల పట్ల పోలీసుల చేత పైశాచికంగా వ్యవహరింపచేయడం సిగ్గుచేటని వైకాపా రాష్ట్ర కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి నిప్పులు చెరిగారు. వైకాపా అధినేత జగన్మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రజల మనోభీష్టాన్ని నెరవేర్చేందుకు ప్రత్యేకహోదా కోసం పోరాడుతున్నారన్నారు.