కడప

డ్రగ్ మాఫియా అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డ్రగ్ మాఫియా అరెస్టు

రాయచోటి, జనవరి 23: విదేశాలకు కొకైన్ సరఫరా చేస్తున్న డ్రగ్ మాఫియా ముఠా సభ్యులు ఒంటిమిట్టకు చెందిన ప్రసాద్, ఖాజా రహంతుల్లా, సుండుపల్లెకు చెందిన మస్తాన్ వలి, కేరళకు చెందిన మోహిద్దీన్, అజూబులను రాయచోటి రూరల్ సి ఐ ప్రభాకర్, సుండుపల్లె ఎస్‌ఐ మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది సుండుపల్లె మండలం బైరవగుట్ట సమీపంలో పట్టుకున్నారు. శనివారం స్థానిక రూరల్ పోలీసు స్టేషన్‌లో ఇన్‌చార్జి డిఎస్పీ నాగేశ్వరరెడ్డి విలేఖరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేరళకు చెందిన మోహిద్దీన్, పరివెంగుల అజూబులను కేరళ పోలీసులు కొకైన్‌ను సరఫరా చేస్తున్నారని నిఘా పెట్టడం జరిగిందన్నారు. ఈ క్రమంలో మోహిద్దీన్, అజూబుల నుంచి ఫోన్ కాల్స్ సుండుపల్లె మండలానికి చెందిన మస్తాన్‌కు రావడంతో కేరళ పోలీసులు స్థానిక పోలీసులకు సమాచారం చేరవేశారు. స్థానిక రూరల్ సిఐ ప్రభాకర్, సుండుపల్లె ఎస్ ఐలు కలసి మస్తాన్‌పై నిఘా పెట్టడం జరిగిందన్నారు. ఈ క్రమంలో కేరళకు చెందిన మోహిద్దీన్, అజూబులు కొకైన్‌ను మస్తాన్ ద్వారా విదేశాలకు తరలించేందుకు సుండుపల్లెకు రావడంతో వారిని పోలీసులు పట్టుకున్నారన్నారు. వీరిని విచారించగా కడప జిల్లా ఒంటిమిట్టకు చెందిన ప్రసాద్, ఖాజా రహంతుల్లాలు కూడా ఉన్నారని డిఎస్పీ తెలిపారు. ఈ ఐదుగురు సభ్యులు విదేశాలకు వెళ్లే అమాయక ప్రజలను టార్గెట్‌గా చేసుకుని ఈ కొకైన్‌ను సరఫరా చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కువైట్, కత్తర్‌లకు వెళ్లే వాళ్లకు మాయమాటలు చెప్పి వారికి డబ్బులు ఇచ్చి ఈ కొకైన్‌ను సరఫరా చేస్తున్నారని ఆయన తెలిపారు. ఈ కొకైన్‌ను కార్బన్ పేపర్‌లో చుట్టి ఎవ్వరికి కంటపడకుండా బ్యాగులో అడుగున పెట్టి సరఫరా చేశారన్నారు. ఈ క్రమంలో సుండుపల్లెకు చెందిన మస్తాన్ కూడా గతంలో కువైట్‌లో పలుమార్లు జైలుకు వెళ్లారని తెలిపారు. అక్కడ కేరళకు చెందిన మోహిద్దీన్‌తో సంబంధాలు పెట్టుకుని జైలు నుంచి ఇండియాకు వచ్చిన తర్వాత కొకైన్‌ను విదేశాలకు సరఫరా చేస్తూ పట్టుబడ్డారని ఆయన తెలిపారు. ప్రజలు కూడా ఇతరులు ఇచ్చే లగేజిలను విదేశాలకు తీసుకెళ్లరాదని ఇన్‌చార్జి డిఎస్పీ నాగేశ్వరరెడ్డి సూచించారు.

ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్ జంబ్లింగ్‌పై
కమ్ముకున్న నీలినీడలు..

ఆంధ్రభూమి బ్యూరో
కడప,జనవరి 23: ఫిబ్రవరి నెల 4 నుంచి నిర్వహించనున్న ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలను జంబ్లింగ్ సిస్టమ్‌లో నిర్వహించాల్సివుండగా ప్రభుత్వం తొలుత జంబ్లింగ్ తరహాలో నిర్వహిస్తామని ప్రకటించి అనంతరం విద్యార్థి సంఘాలు, విద్యార్థుల తల్లిదండ్రులు జంబ్లింగ్ విధానం వల్ల అక్రమాలు చోటుచేసుకుంటాయని, జంబ్లింగ్‌ను తీసివేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన దరిమిలా ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది. అయినా ఇటీవల ఇంటర్మీడియట్ బోర్డు ఉన్నతాధికారులు జంబ్లింగ్ విధానాన్ని అమలుచేయాలని ప్రకటించింది. ప్రభుత్వం కూడా జంబ్లింగ్ నిర్వహణపై స్పష్టత ఇవ్వకపోయినా జంబ్లింగ్ ఏర్పాట్లు చేయాలని రెండురోజుల క్రితమే జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఇంటర్మీడియట్ బోర్డు రీజనల్ ఇన్‌స్పెక్షన్ అధికారి రవి నేతృత్వంలో ప్రాక్టికల్స్ జంబ్లింగ్ విధానంపై జిల్లాలో 44 పరీక్ష కేంద్రాలు ఎంపికచేసి చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. 22 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, 12 ఎయిడెడ్ జూనియర్ కళాశాలలు, ప్రైవేట్ 8 జూనియర్ కళాశాలల్లో, 13021 మంది విద్యార్థులు ప్రాక్టికల్ పరీక్షలు రాసేందుకు ఏర్పాట్లు చేశారు. బైపిసి ప్రాక్టికల్స్ మాత్రం ప్రభుత్వ జూనియర్ కళాశాలలకే పరిమితం చేశారు. గతంలో కంటే ఈమారు ప్రైవేట్ కళాశాలల్లో సెంటర్లను పూర్తిగా తగ్గించారు. ఈనెల 27న నైతిక మానవాతి విలువలపై పరీక్ష, 30న పర్యావరణం విద్యపై పరీక్షలు ఉదయం 10గంటల నుంచి 1గంట వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రాక్టికల్స్‌కు సంబంధించిన పరీక్ష కేంద్రాల్లో వౌలిక సదుపాయాలు ఏర్పాట్లకు ప్రైవేట్, ప్రభుత్వ, ఎయిడెడ్ యాజమాన్యాలకు ఆర్‌ఐఓ రవి ఆదేశాలు జారీ చేసి పై పరీక్షల నిర్వహణ నిమిత్తం చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంట్లు అధికారులు, ఇన్విజిలేటర్లు, ప్రాక్టికల్స్‌కు వెళ్లే అధ్యాపకులు నియామకాలను మరో రెండుమూజురోజుల్లో నియామకం చేసేందుకు ఆర్‌ఐఓ కసరత్తు చేస్తున్నారు. ప్రాక్టికల్స్ వచ్చేనెల 4 నుంచి 24వ తేదీ వరకు జరగనున్నాయి. ఇదిలా ఉండగా నూతన రాష్ట్రం ఏర్పాటు అనంతరం పలు విషయాల్లో తెలంగాణ రాష్ట్రంలో తీసుకుంటున్న నిర్ణయాలపై కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధ్యయనం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతోంది. ఈ ఏడాది తెలంగాణలో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్ పరీక్షల్లో జంబ్లింగ్ రద్దుచేయడంతో రాష్ట్రప్రభుత్వం జంబ్లింగ్ విధానంపై మీనమేషాలు లెక్కిస్తున్నారు. ప్రాక్టికల్స్ జంబ్లింగ్ నిర్వహణపై ఇంతవరకు స్పష్టత ఇవ్వలేదు. దీనిపై విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది. ఇప్పటికైనా జంబ్లింగ్ విధానం ఉంటుందో లేదోనని ప్రభుత్వం తేల్చాల్సివుంది.

ఆర్టీపీపీలో కనీస వసతులకు నోచుకోని కాంట్రాక్ట్ కార్మికులు!
ఎర్రగుంట్ల, జనవరి 23: రాయలసీమ ఉద్యమ ఫలితంగా సాధించుకున్న ఆర్టీపీపీ నిర్మాణంలో ఉన్న ఆరవ యూనిట్‌లో పని చేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వసతులు కూడా కల్పించడం లేదన్న విమర్శలు కార్మిక వర్గాల నుండి వినిపిస్తున్నాయి. 3,500 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మిస్తున్న ఈ 600 మెగావాట్ల విద్యుత్తు ప్రాజెక్టులో స్థానికులకు ఉపాధి అవకాశాలు కూడా లభించడం లేదన్న విమర్శలు కూడా నిరుద్యోగుల నుండి వినిపిస్తున్నాయి. బిహెచ్‌ఇఎల్, వి-ఎటెక్ లాంటి పెద్ద కంపెనీలు టెండర్లు వేసి పనులు దక్కించుకున్నా వారు కూడా చిన్న చిన్న కంపెనీలకు పనులను అప్పగించడంతో నిర్మాణపు పనులు కూడా నత్తనడకన నడుస్తున్నాయి. దీనికి తోడు ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ నాయకులు కొందరు కంపెనీలను తమ చెప్పుచేతుల్లో పెట్టుకొని పెత్తనం చెలాయిస్తున్నారు. ప్రస్తుతం వారి అనుమతి లేనిదే కూలీ పనులు కూడా దొరికే పరిస్థితులు కనిపించడం లేదు. ఒక వేళ అలాజరిగితే ఆ కంపెనీ యాజమాన్యానికి ముడినట్లే. దీంతో నాయకుల ఇంటి చుట్టు నిరుద్యోగులు క్యూ కడుతున్నారు. ఇక నిర్మాణపు పనులు చేపట్టిన కంపెనీ యాజమాన్యాలు ప్రభుత్వ నిర్ణయం మేరకు కార్మికులకు వేతనాలు చెల్లించాల్సి వస్తుందని ఇతర రాష్ట్రాల నుండి కూలీలను దిగుమతి చేసుకొని వారికి పదోపరకో ఇచ్చి గోడ్డు చాకిరి చేయించుకుంటున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన కారణంగా ఆ కాంట్రాక్టర్ ఇచ్చిందే వేతనమనుకొని వందలామంది బడుగు,బలహీన వర్గాలు రాత్రింబవళ్లు కష్టపడుతూ చాకిరి చేస్తున్నారు. ఇక్కడ పని చేస్తున్న కూలీలకు కనీస వేతనాలు కానీ ఈపిఎఫ్. ఈఎస్‌ఐ సౌకర్యాలంటి కానీ ఉండవు. కేవలం కాంట్రాక్టర్ వేసిన రేకుల షెడ్లల్లో కుటుంబమంతా తలదాచుకుంటూ కష్టపడుతున్నారు. నిర్మాణం జరిగే ప్రాంతంలో భోజన సదుపాయాలు కానీ షెల్టర్లు ఉన్న దాఖాలాలు లేవు. ప్రస్తుతం ఆరవ యూనిట్ నిర్మాణపు పనుల్లో ఉన్న వారికి కార్మిక చట్ట ప్రకారం స్కిల్డ్, సెమీ స్కిల్డ్, నాన్ స్కిల్డ్‌గా గుర్తించి వేతనాలు ఇవ్వాల్సి ఉండగా ఇక్కడ అలాంటి పరిస్థితులు లేవు. అడిగితే వెళ్లిపొమ్మంటారేమోనని ఇతర రాష్ట్రం నుంచి వచ్చిన కార్మికులు ఇచ్చింది తీసుకొని చాకిరి మాత్రం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు ఆర్టీపీపీలో జరుగుతున్నా కార్మిక శాఖ అధికారులు ఇటువైపు చూచిన దాఖాలాలు కూడా లేవు. ఇక స్థానికంగా ఉన్న నిరుద్యోగులు కూడా చిన్నపాటి ఉపాధి ఉద్యోగాలు కూడా దొరకక ఇతర ప్రాంతాలకు వెళ్లి పోతున్నారు. అప్పట్లో కడప జిల్లాలో ధర్మల్ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుందంటే ఎంతో మంది ఈ ప్రాంత నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. తమకు ఎంతో కొంత ఉపాధి దొరుకుతుందన్న ఆశతో ఎదురు చూశారు. ఈ ప్రాంత నిరుద్యోగుల కోసం మరో 600 మెగావాట్ల సామర్థ్యంతో ఆరవ యూనిట్ నిర్మాణానికి అవకాశం కల్పిస్తానని 2007లో అప్పటి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 5వ యూనిట్‌ను ప్రారంభిస్తూ ఈ ప్రాంత ప్రజలకు హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు అన్ని అనుమతులు త్వరత్వరగా పూర్తి చేసి 3,500 కోట్ల రూపాయలను కేటాయించడం కూడా జరిగింది. జిల్లాలో నిరుద్యోగ సమస్యతో పాటు విద్యుత్తు కొరతను ఈ ఆరవ యూనిట్ తీరుస్తుందని ఆనాడు ఆయన చేసిన ప్రకటన పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. అయితే ప్రస్తుతం కొందరు స్థానిక నాయకుల తీరు నిరుద్యోగుల ఆశలకు గండికొట్టే పరిస్థితి దాపురించింది. ఆర్టీపీపీ చుట్టుపక్కల ప్రాంతాల్లో వేలాది మంది నిరుద్యోగులు ఉపాధి కోసం ఎదురుచూస్తుస్నారు. వారికి ఉపాది దొరకక పోగా ఉపాధి దొరికిన వారు కూడా కనీస వసతులకు వేతనాలకు నోచుకోక ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం నిర్మాణపు పనుల్లో జరుగుతున్న జాప్యాన్ని కూడా అటు జెన్‌కో కానీ ఇటు ప్రజా ప్రతినిధులు కానీ గుర్తించడం లేదు. 2015 నాటికే పూర్తి చేస్తామని ఆనాడు జెన్‌కో అధికారులు ఇచ్చిన హామీ 2018 నాటికి కూడా నెరవేరే అవకాశాలు కనిపించడం లేదు. ఇందుకు కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో పాటు జరిగిన అవకతవకలు కూడా కారాణాలుగా చెప్పవచ్చు. స్థానిక నాయకులకు ఆదాయం తప్ప మరోలోచన లేదన్న అభిప్రాయం ప్రజలు, నిరుద్యోగుల నుండి వినిపిస్తుంది. రాయలసీమ ఉద్యమ ఫలితంగా ఈ ప్రాంత అభివృద్ధిని దృష్టిలోపెట్టుకొని సాధించుకున్న థర్మల్ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉంది.

బాలబాలికలు ఇరువురూ సమానులే
ముద్దనూరు, జనవరి 23: బాలికలు బాలురుతో దేనికీ తిసిపోరని, ఇద్దరూ సమానులేనని తహశీల్దార్ రమా పేర్కొన్నారు. శనివారం స్థానిక జిల్లాపరిషత్ పాఠశాల ఆవరణంలో పాఠశాలకు సంబంధించిన ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు బాలికా దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా తహశీల్దార్ మాట్లాడుతూ నానాటికీ దేశంలో స్ర్తిల నిష్పత్తి తగ్గిపోతోందని, వెయ్యిమంది పురుషులకు 916 మంది స్ర్తిలున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి కళావతి, మేజర్ సర్పంచ్ వరలక్ష్మి, ఎంపిడి ఓ కార్యాలయ సూపరింటెండెంట్ రమణయ్య, ప్రభుత్వ వైద్యురాలు అనితాగ్లోరీ, వెలుగు ఎపి ఎం రమణప్ప, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, మహిళలు, విద్యార్థినిలు పాల్గొన్నారు.

సీసీ రోడ్లకు రూ.103 కోట్ల నిధులు మంజూరు

గాలివీడు, జనవరి 23: జిల్లాలో 233 కిలోమీటర్ల సిమెంట్‌రోడ్ల నిర్మాణాలకు రూ.103 కోట్లు మంజూరైనట్లు పంచాయతీరాజ్ సూపరింటెండెంట్ ఇంజనీర్ నాగేశ్వరరావు పేర్కొన్నారు. శనివారం ఎస్‌ఈ మండలంలోని అరవీడు, గాలివడు, గుండ్లచెరువు, గోపనపల్లె, ప్యారంపల్లెలలో జరుగుతున్న సిమెంట్‌రోడ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్‌ఈ మాట్లాడుతూ 13, 14 ఫైనాన్స్ నిధులకు అనుసంధానంగా ఉపాధి నిధులతో కలిపి సిమెంట్‌రోడ్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ మండలంలో 5.4 కిలోమీటర్లు సిమెంట్‌రోడ్ల నిర్మాణానికి రూ.2.52 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. అనంతరం ఆయనరాయచోటి డీఈఈ రామచంద్రారెడ్డి, మండల ఇంజనీరింగ్ అధికారి సుబ్బరాయుడులతో కలిసి సిమెంట్‌రోడ్లను పరిశీలించారు. సీసీ రోడ్ల నిర్మాణంలో నాణ్యత లోపించకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఆయన జే ఈకి సూచించారు. ఆయన వెంట సర్పంచ్ మహమ్మద్‌రియాజ్, టీడీపీ నాయకులు డాక్టర్ రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఉపాధిలో రైతు ఆధారిత అంశాలకు ప్రాధాన్యత

కమలాపురం, జనవరి 23: ఉపాధిహామీ పనుల్లో రైతు ఆధారిత అంశాలకు ప్రాధాన్యత కల్పించేలా కౌన్సిల్ సమావేశంలో చర్చిస్తామని ఉపాధిహామీ పథకం రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కాశీభట్ల సాయినాథశర్మ తెలిపారు. ఆయన శనివారం సాయంత్రం స్థానిక మండల పరిషత్ సభాభవనంలో కమలాపురం నియోజకవర్గంలోని వల్లూరు,పెండ్లిమర్రి, వీయన్‌పల్లె,సికె దినె్న,కమలాపురం, మండలాల ఎంపిడివోలు, ఏపివోలు, ఫీల్డ్ అసిస్టెంట్లతో జరిగిన ఉపాధిహామీ సమీక్షాసమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధిహామీ పథకం లో చేపట్టిన అభివృద్ధిపనులతో దేశంలోనే గర్వించదగ్గ స్థాయిలో కడప జిల్లా నిలిచిందని అన్నారు. దేశవ్యాప్తంగా ఉపాధిహామీ పథకం ద్వారా అమలు జరిపిన పనులను గుర్తించి జాతీయ అవార్డుకు ఎంపిక చేసిన రాష్ట్రంలోని 6 జిల్లాలో ఈ జిల్లా మొదటి స్థానంలో ఉండడం హర్షనీయమన్నారు. ఇందుకు కృషిచేసిన ఉపాధిహామీ అధికారులు సిబ్బందిని ఈ సందర్భంగా ఆయన అభినందించారు. జిల్లాలో కరువును పారద్రొలెందుకు నీటికందకాలను విరివిగా తవ్విస్తామన్నారు. ప్రభుత్వం నీటికుంట- రైతులకు సిరులపంట అనే నినాదాన్ని రైతుల ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లాలో ఉన్న వనరులను సమీకరించి ప్రజలకుపయోగపడేలా ఈ పధకాన్ని మరింతగా చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డ్వామా పీడి బాల సుబ్రమణ్యం మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్దేశించిన మేరకు జిల్లా వ్యాప్తంగా లక్షఫారంపౌండ్లను పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయస్థాయిలో ఉపాధిహామి పనుల్లో మొదటిస్థానం పొందేలా కృషిచేసిన డ్వామా పీడి బాలసుబ్రమణ్యంను సాయినాథశర్మ సన్మానించారు. రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడుగా ఎన్నికైన సాయిని ఎంపిపి సులేఖ, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు దుశ్శాలువ కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపిడివో ప్రభాకరరెడ్డి, ఉపాధిహామీ ఏపిడి రాఘవేంద్ర, ఏపివో గరుడాచలం, 5 మండలాల ఉపాధిహామి అధికారులు,్ఫల్డ్, టెక్నికల్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.

మత్తు పదార్థాలకు బానిసవుతున్న యువత!

ఆంధ్రభూమి బ్యూరో
కడప,జనవరి 23: మారుతున్న కాలానుగుణంగా కొంతమంది యువత మత్తుపానీయాలకు బానిసలు కాగా, మరికొంతమంది మాదకద్రవ్యాలకు బానిసలు అవుతున్నట్లు తెలుస్తోంది. రెండురోజులు క్రితం బ్రౌన్‌షుగర్ ముఠాను జిల్లాలోని రాయచోటి, రాజంపేట ప్రాంతాల్లో ఒక ముఠా నుంచి పోలీసులు ఏకంగా కిలో బ్రౌన్‌షుగర్ పట్టివేతతో జిల్లాలో కలకలం రేగింది. జిల్లాలో ఇతర జిల్లాలకు చెందిన విద్యార్థులు మెడిసిన్, ఇంజనీరింగ్ మరిన్ని వృత్తికోర్సుల్లో విద్యనభ్యసిస్తుండటంతో హెరాన్, బ్రౌన్ షుగర్ , కొకైన్ వంటి మాదక ద్రవ్యాలకు ఆకర్షితులౌతున్నారని గత కొంతకాలంగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ మాఫియా, ఎర్రచందనం స్మగ్లింగ్ మాఫియాలకు ముంబాయి, దేశంలో ఇతర రాష్ట్రాలతో సంబంధాలుండటంతో మాదక ద్రవ్యాలు జోరుగా జిల్లాలో జరుగుతున్నట్లు పోలీసుల్లో అనుమానాలు లేకపోలేదు. ఇప్పటికే జిల్లా పోలీసు యంత్రాంగం మాదకద్రవ్యాలపై దర్యాప్తునకు శ్రీకారం చుట్టింది.
గతంలో జిల్లా నుంచి గల్ఫ్‌దేశాలకు మత్తుకు ఉపయోగించే స్పిరిట్‌లు, క్లోరోఫాం తదితర లిక్విడ్‌లు సరఫరా కావడం, జిల్లాలో కూడా మత్తులో మునుగుతున్న యువత ఆకర్షిలవుతున్నది పాఠకులకు విధితమే. ఈ నేపధ్యంలో కొకైన్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి కేరళ, జిల్లాకుచేరి గల్ఫ్‌దేశాలకు ఎగుమతులు చేస్తుండటంతో జిల్లాలో కూడా మాదకద్రవ్యాలు యధేచ్చగా చలామణి అవుతున్నట్లు తెలుస్తోంది. అలాగే అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తు సెంట్రల్ జైలుకు వెళ్లి వచ్చిన కొంతమంది మాఫియా డాన్‌లు కూడా మాదకద్రవ్యాల వ్యాపారంలో ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లా నుంచి విదేశాలతోపాటు హైదరాబాద్ , విజయవాడ, బెంగళూరు, ముంబాయి వంటి నగరాల్లో వివిధ వ్యాపారాలతో రాకపోకలు కొనసాగిస్తున్న యువకులు మాదక ద్రవ్యాలు చలామణి చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద యువత మాదకద్రవ్యాలకు అలవాటు పడి వారి జీవితాలు చేజేతులారా నాశనం చేసుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో యువత తల్లిదండ్రులు మేలుకుని తమ పిల్లలను కట్టడిచేయడంతోపాటు పోలీసు యంత్రాంగం కఠినంగా వ్యవహరించి మాదక ద్రవ్యాలు అరికట్టేందుకు ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

కెసి కెనాల్‌కు నీరు విడుదల
చెన్నూరు,జనవరి 23: మండలంలోని కెసి కెనాల్ ఆయకట్టుకింద సాగుచేసిన ఆరుతడి పంటలకు ఎట్టకేలకు కెనాల్ అధికారులు సాగునీరు విడుదల చేశారు. శనివారం నుంచి మండలంలో చెన్నూరు, బుడ్డాయపల్లె, రామనపల్లి, ముళ్లపల్లె, కొక్కరాయపల్లి కాలువలకు నీరు వస్తున్నాయి. అలాగే ఆదినిమ్మాయపల్లె ఆనకట్ట నుంచి కడప కాలువకు , పాతకడప చెరువుకు మండలంలోని రాచినాయపల్లె చెరువుకు కెనాల్ నీరు వదిలారు. దీంతో 250 క్యూసెక్కుల నీరు కెనాల్ ద్వారా వివిధ కాలువలకు ప్రవహిస్తోంది. కెనాల్ ఆయకట్టు కింద జొన్న, మినుము, పెసర, ప్రొద్దుతిరుగుడు ఇతర ఆరుతడి పంటలు సాగుచేసిన విషయం తెలిసిందే. కెనాల్‌కు నీరు రావడం వల్ల కెనాల్ ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కెనాల్ నీటిని విడతల వారీగా ఆరుతడి పంటలకు అందివ్వాలని మండల బిజెపి అధ్యక్షుడు తప్పెట రవీంద్రనాధరెడ్డి కెనాల్ అధికారులకు సూచించారు.

ఆడపిల్లలే అన్ని రంగాల్లో ముందంజ

రాజంపేట, జనవరి 23:నేటి సమాజంలో ఆడపిల్లలు అన్ని రంగాలలో ముందజలో ఉన్నారని ఆర్డీఓ ప్రభాకర్ పిళ్లై అన్నారు. శనివారం జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక ఇన్‌ఫ్యాంట్ జీసెస్ హైస్కూల్‌లో ప్రధాని ప్రవేశ పెట్టిన బేటీ బచావో బేటీ బడావో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ ప్రభాకర్ రావు మాట్లాడుతూ తల్లిదండ్రులు కూడా మగ పిల్లలతో పాటు ఆడపిల్లలను పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కొంతమంది తల్లిదండ్రులు ఆడపిల్లల పట్ల వివక్షత చూపి మగపిల్లలకే అధిక ప్రాధాన్యత కల్పించడం తగదన్నారు. మహిళలు లేకుంటే సమాజమే లేదన్నారు. ఆడపిల్లకు పెళ్లి చేసి కట్న కానుకలు సమర్పించి అత్తారింటికి పంపాలంటే ఎంతో ఖర్చుగా భావించి కొంతమంది తల్లిదండ్రులు గర్భంలోనే ఆడపిల్లలను చంపేస్తున్నారన్నారు. దీంతో మనదేశంలో ప్రతి వంద మంది పురుషులకు 933 మంది మహిళలు ఉన్నారన్నారు. రాబోయే రోజులలో మహిళల సంఖ్య పూర్తిగా తగ్గే ప్రమాదం ఉందని ప్రధాని నరేంద్రమోదీ బేటీ బచావో బేటీ బడావో కార్యక్రమాన్ని ప్రారంభించారన్నారు. ప్రభుత్వ పథకాలలో మహిళలకే మొదటి ప్రాధాన్యతను కల్పిస్తుందన్నారు. భ్రూణ హత్యలు చట్టరీత్యా నేరమన్నారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేసిన వారికి ఐదేళ్ల జైలు శిక్ష, జరిమానా విధించడం జరుగుతుందన్నారు.

వైద్యమిత్రల కడుపు కొట్టొద్దు

రాయచోటి, జనవరి 23: ఎన్‌టిఆర్ వైద్యసేవ ఉద్యోగులను ఎనిమిదేళ్ల పాటు ఊడిగం చేయించుకొని అర్ధాంతరంగా ఉద్యోగాల నుండి తొలగిస్తే వారి పరిస్థితి ఏంటని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. శనివారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ సాధారణ డిగ్రీ విద్యార్హతలతో ఉద్యోగాలు పొందిన వీరు ఎనిమిదేళ్ల పాటు చిత్తశుద్ధితో పనిచేయడం వల్లనే పథకం అంతర్జాతీయ స్థాయిలో విజయవంతమైందన్నారు. నైపుణ్యం, విద్యార్హతల పేరుతో ప్రస్తుతం పనిచేస్తున్న వారందరినీ కాదని బీఎస్సీ నర్సింగ్, ఎమ్మెస్సీ నర్సింగ్, బీ ఫార్మసీ, డీ ఫార్మసీ, బీ ఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ వంటి విద్యార్హతలున్న వారిని నియమించాల్సిన అవసరం ఏమొచ్చిందన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 28 వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 2,400 మంది రోడ్డున పడ్డారన్నారు. ఆరోగ్యశ్రీగా ఉన్న పథకం పేరును మార్చినట్లు అందులో పనిచేసే ఉద్యోగులను కూడా మార్చాలా అని ఆయన మండిపడ్డారు. పథకం పేరు మార్పుపై ఉన్న శ్రద్ధ ఉద్యోగులపై లేదని ఘాటుగా విమర్శించారు. ఇదే తరహా పథకాన్ని అమలు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం వీరికున్న విద్యార్హతలున్న వారినే కొనసాగిస్తూ 40 శాతం మేర వేతనాలు పెంచిందన్నారు. తెలంగాణ తరహాలో ఇక్కడ కూడా వేతనాలు పెంచాల్సిన తరుణంలో ఏకంగా ఉద్యోగాల నుండే తొలగించారన్నారు. చంద్రబాబు ఎన్నికల సమయంలో జాబు కావాలంటే బాబు రావాలని ప్రచారం చేసుకున్నారని సిఎం అయి ఇప్పుడు జాబు పోవాలంటే బాబు రావాలన్న చందనంగా వ్యవహరిస్తున్నారన్నారు. టీడీపీ ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించిన వాటిని అమలు చేయలేదన్నారు. లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయని పత్రికా ప్రకటనలకే పరిమితమవుతున్నారని, ఏ ఒక్కరికి మేలు జరగడం లేదన్నారు. వైద్యమిత్రల విషయంలో విడుదలైన జీవో నెంబర్ 28ని తక్షణం రద్దు చేసి ప్రస్తుతం పనిచేస్తున్న వారందరినీ యథాతథంగా కొనసాగించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామన్నారు. వైద్యమిత్రలకు అండగా ఉన్నానని ఈ విషయంపై అసెంబ్లీలో నిలదీస్తామన్నారు.
ఎమ్మెల్యేకు
గోడు వెలుబుచ్చిన వైద్యమిత్రలు
నియోజకవర్గ పరిధిలోని వైద్యమిత్రలు శనివారం ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డిని కలిసి ప్రభుత్వం చేస్తున్న చర్యలను గోడు వెలిబుచ్చారని అధైర్యపడవద్దని అండగా ఉంటామని ఆయన వారికి హామీ ఇచ్చారు.