సబ్ ఫీచర్

ఆలయాల గోడు పట్టని న్యాయవ్యవస్థ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అయోధ్యలోని ‘రామజన్మభూమి’ వివాదంపై న్యా య నిర్ణయం చేసేందుకు తమకు సమయం లేదని దేశంలోని సర్వోన్నత న్యాయస్థానం విస్పష్టంగా ప్రకటించడం మరో చర్చనీయాంశమైంది. అత్యున్నత న్యాయస్థానం- ‘తాను చెప్పిన మాటల్ని తానే వెనక్కి తీసుకున్న ట్టు’ (యూటర్న్)గా దీన్ని భావించాలి. ఎందుకంటే- అయోధ్య వివాదంపై ఉభయ పక్షాలకు స్నేహపూర్వకమైన పరిష్కారాన్ని చూపేందుకు అవసరమైతే తానే మధ్యవర్తిత్వం వహిస్తానని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జెఎస్ ఖేహార్ తనంతట తాను (సూ మోటోగా) జోక్యం చేసుకుని ఇటీవల ప్రకటించారు. ‘మధ్యవర్తిత్వాని’కి సంసిద్ధత వ్యక్తం చేసిన ఆయన కొద్ది రోజులకే తన మాటలపై తానే వెనక్కి మళ్లి- ‘న్యాయ నిర్ణయం చేసేందుకు సమయం లేదు..’ అంటూ తేటతెల్లం చేయడంలో మతలబు ఏమిటో? న్యాయస్థానం తన వైఖరిని ఇలా వెంటనే మార్చుకోవడానికి కారణాలు ఏమిటని ప్రశ్నించడం- న్యాయవ్యవస్థకు దురుద్దేశాలను ఆపాదించడం కాదు, న్యాయస్థానాలను ధిక్కరించడం కాదు.
‘సమయం లేద’న్న సాకుపై మనం లోతుగా విశే్లషిస్తే- సర్వోన్నత న్యాయస్థానం కొన్ని కేసుల్లో కాలాన్ని వృథా చేసినట్లు, పాలనావ్యవస్థలో కొన్ని చోట్ల మితిమీరి జోక్యం చేసుకున్నట్లు అనిపిస్తుంది. అయితే, దీనిని ‘న్యాయవ్యవస్థ క్రియాశీలత’ అని కొందరు అభివర్ణిస్తున్నారు. స్వయంగా భారత రాష్టప్రతి ప్రణబ్‌కుమార్ ముఖర్జీ గత ఏడాది భోపాల్ జరిగిన ఓ కార్యక్రమంలో ‘న్యాయవ్యవస్థ క్రియాశీలత’పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ ‘క్రియాశీలత’ సరిహద్దులను గుర్తుంచుకోవాలని ఆయన సుప్రీం న్యాయమూర్తులకు నిష్కర్షగా హెచ్చరించారు. పాలన, శాసనవ్యవస్థల అధికారాలను చేజిక్కించుకునేందుకు ప్రయత్నించరాదని కూడా రాష్టప్రతి న్యాయమూర్తుల సదస్సులో సున్నితమైన హెచ్చరికలు చేశారు. ఇతర వ్యవస్థలకు రాజ్యాంగం నిర్దేశించిన హక్కులను పలుచన చేసే విధంగా ‘న్యాయవ్యవస్థ క్రియాశీలత’ ఉండరాదన్నారు.
అయితే, చాలా ఆసక్తికరంగా కొన్ని ‘గమ్మత్తయిన’ కేసుల్లో ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే సుప్రీం కోర్టు తన చేతులను కడిగేసుకుంది. ‘అయోధ్య కేసు’ ఎలాంటి ముగింపు లేకుండా తరాల తరబడి కొనసాగడం ఇందుకు ఉదాహరణ. ఈ కేసులో ఒక స్పష్టమైన నిర్ణయానికి ‘సుప్రీం’ రాలేకపోతోంది. ఒకే ఆలోచనతో నిర్ణయం తీసుకోకపోవడం, తీర్పు ఇస్తే ఎక్కడ అప్రతిష్ఠ ఎదురవుతుంతోనన్న ఆందోళన వంటివి సుప్రీం వ్యవహార శైలిలో స్పష్టంగా గోచరిస్తున్నాయి. కాశ్మీర్‌లోని మైనార్టీలను ‘నిర్వచించే’ విషయంలోనూ సు ప్రీం ఇదే నాన్చుడు ధోరణిని ప్రదర్శిస్తోంది. ‘మైనారిటీ’ల పై న్యాయ నిర్ణయం ప్రకటించేందుకు విముఖత చూపుతున్న సర్వోన్నత న్యాయస్థానం- ఈ వివాదాన్ని కేం ద్రం, రాష్ట్రం తేల్చుకోవాలని చేతులెత్తేసింది.
పాలనావ్యవస్థ చూసుకోవాల్సిన అనేక పనికిమాలిన కేసులను సుప్రీం కోర్టు చాలా ఉత్సాహవంతంగా విచారించడం మనం గమనించవచ్చు. ఇందుకు ఉదాహరణలు కోకొల్లలు. ఎంతో సమయం వెచ్చించి సుప్రీం ‘న్యాయ నిర్ణయం’ చేసిన కొన్ని కేసులు నిజానికి పాలన, శాసనవ్యవస్థలు సులువుగా పరిష్కరించగలిగేవే. సర్వోన్నత న్యాయస్థానం జోక్యం అవసరం లేని కేసుల్లో కొన్ని..
* గోకులాష్టమి ఉత్సవంలో యువకులు కొట్టే ‘ఉట్టి’ (దహీ హుండీ) ఎంత ఎత్తులో ఉండాలి? ఈ వివాదాన్ని తేల్చేందుకు సాక్షాత్తూ సుప్రీం న్యాయమూర్తులు ‘మేధోమథనం’ చేయాలా?
* సినిమా హాళ్లలో జాతీయగీతం ప్రదర్శన సందర్భంగా ప్రేక్షకులంతా లేచి నిలబడాలా? అందరూ నిలబడి తీరాలన్నపుడు వికలాంగులకు మినహాయంపు ఇవ్వాలా? ‘జనగణ మన’ సందర్భంగా ప్రేక్షకులంతా నిలబడాలని తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టు ఆ తర్వాత- వికలాంగులను మినహాయిస్తూ ఇంకో ఆదేశం ఇచ్చింది.
* కార్లు నడిపేవారందరూ వాటి అద్దాలకు ‘నలుపు తెరల’ను తొలగించాలి. ఇలాంటి నిబంధనలను అమలు చేయించాల్సింది సంబంధిత కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మాత్రమే. సుప్రీం మాత్రం కాదు.
* జాతీయ రహదారులకు ఇరువైపులా 500 మీటర్ల దూరంలో మద్యం దుకాణాలు ఉండరాదు. ఇలాంటి నిబంధనలు రహదారి భద్రతకు ఎలా భరోసా ఇస్తాయి? ఇంట్లోనే మద్యం సేవించి వాహనాలను నడిపే వారిని ఎవరు అడ్డుకుంటారు? ‘మద్యం సేవించి వాహనాలు నడపరాదన్న’ వి షయమై అవగాహన కల్పించాలే తప్ప రోడ్డు పక్క మ ద్యం దుకాణాలను మరికొంత దూరానికి నెట్టేస్తే- డ్రైవర్లు తాగడం మానేస్తారా? మద్యం సేవించి వాహనాలు నడిపేవారికి భారీ జరిమానాలు, జైలుశిక్షలు వేయడం, డ్రైవింగ్ లైసెన్స్‌లను రద్దు చేయడం వంటి చర్యలు తీసుకోవాలే తప్ప- సుప్రీం ‘చిట్కాల’తో పరిస్థితి మారుతుందని ఎవరూ అనుకోరు.
* ‘పక్షులకు ఎగిరే హక్కు’ ఉందంటూ సుప్రీం నిర్ధారిం చడం నిజంగా మరో ఆసక్తికరమైన తీర్పు!
..... ఇలాంటి సాదాసీదా కేసులతో అత్యున్నత న్యాయస్థానం మమేకం అవుతుంటే- కీలక కేసులను విచారించేందుకు న్యాయమూర్తులకు సమయం ఎక్కడిది? దైవ సన్నిధిలో ఆరాధన చేసుకునేందుకు హిందువులకు ఉండే ప్రాథమిక హక్కుల గురించి, ఆలయాల్లో ప్రభుత్వ జో క్యం గురించి విచారించేందుకు మాత్రం న్యాయమూర్తులకు తీరికే ఉండదు! కోయంబత్తూరులోని ఆర్ష విద్యా గురుకులానికి చెందిన దివంగత దయానంద సరస్వతి స్వామి, మరో ఇద్దరు వ్యక్తులు 2012లో వేసిన రిట్ పిటిషన్ విచారణకు నోచుకోక అయిదేళ్లుగా సుప్రీం కోర్టు బీరువాలో భద్రంగానే ఉంది. ‘ఆరాధన చేసుకునే హక్కు’ వంటి కీలక అంశాలపై విచారించేందుకు అయిదేళ్లుగా కోర్టుకు సమయం చిక్కలేదేమో! హిందూ ఆలయాలపై ప్రభుత్వ జోక్యం ఉండరాదన్నది ఈ కేసులో పిటిషనర్ల అభ్యర్థన. రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను కాపాడాలని, ప్రభుత్వ జోక్యాన్ని నివారించాలన్న పిటిషనర్ల గోడును వినే నాథుడే లేడు. హిందూ ఆలయాలకు స్వేచ్ఛ, స్వయం ప్రతిపత్తి లేకపోవడం వల్ల తమ హక్కులను గుర్తించేవారే లేరన్నది పిటిషనర్ల ఆవేదన. దీనికి భిన్నమైన పరిస్థితులు కొన్ని ఆలయాల్లో కనిపిస్తాయి. ఇందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ఓ ఉదాహరణ. ఈ ఆలయంలో పనిచేసే ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగుల మా దిరి జీతభత్యాలు చెల్లిస్తారు. రాష్ట్ర ముఖ్యమంత్రి టిటిడికి ‘నిజమైన సిఇఓ’గా వ్యవహరిస్తాడు. టిటిడి పాలకమండలికి చైర్మన్‌ను, సభ్యులను ముఖ్యమంత్రే నియమిస్తాడు. వీరంతా రాజకీయ రంగానికి చెందిన వారే తప్ప ఎవరికీ ఆధ్యాత్మిక విషయాలపై ఎలాంటి అవగాహన ఉండదు. ఓ ఐఎఎస్ అధికారి టిటిడి ఇవోగా వ్యవహరిస్తాడు తప్ప అతనికి ఎలాంటి అధికారాలు ఉండవు. తమిళనాడుకు చెం దిన ఆర్థిక నేరస్థుడు శేఖర్‌రెడ్డికి టిటిడి పాలకమండలిలో ఎలా స్థానం కల్పించారు? ఆధ్మాతిక రంగంతో ఆయనకు ఉన్న సంబంధం ఏమిటి? చర్చిలు, మసీదులకు సంబంధించి ఆస్తిపాస్తుల వ్యవహారంలో ప్రభుత్వం ఎందుకు శ్రద్ధ చూపదు? తిరుపతి ఆలయంపైనే పాలకులకు అమితాసక్తి ఎందుకు?
హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్టు అనే ప్రైవేటు సంస్థకు నిధులు ఇవ్వరాదని హైదరాబాద్‌లోని ఉమ్మడి హైకోర్టు ఇటీవల ఓ మంచితీర్పు ఇచ్చింది. ఓ రిటైర్డు అధికారి స్థాపించిన ఈ సంస్థకు ప్రతి నెలా 50 లక్షల రూపాయలు విడుదల చేయాలంటూ ఎపి ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి (రెవెన్యూ) టిటిడిని ఆదేశించారు. ఈ ఆదేశాలను చూస్తుంటే టిటిడి స్వయం ప్రతిపత్తి గల సంస్థ అని మనం గుడ్డిగా నమ్మాలా? టిటిడికి ఇలాంటి ఆదేశాలు ఇక్కడితోనే ఆగలేదు. తిరుమలలో ప్రసాదాల తయారీ (పోటు)కి కేంద్రం నుంచి లైసెన్స్ ఉండాలంటూ ‘్భరత ఫుడ్ సేఫ్టీ, స్టాండర్డ్స్ సంస్థ’ టిటిడికి హుకుం జారీ చేసింది. ఇక ఆలయంలో ఇచ్చే ‘తీర్థ ప్రసాదం’ నాణ్యతను కూడా పరిశీలించాలన్న ఆదేశాలు కూడా ఇస్తారేమో? చర్చిలు, మసీదుల్లో భక్తులకు పంచే ఆహార పదార్థాలను తనిఖీ చేసే సాహసం ఎవరైనా చేస్తారా? తిరుపతి లడ్డూలపై దేవస్థానం ఎంతగా సబ్సిడీ ఇస్తుందో, ప్రసాదాలపై వాణిజ్య దృక్పథం లేదని ఎంతమందికి తెలుసు?
హిందువుల ఆలయాలను ప్రభుత్వం ఆక్రమిసున్నా, రాజ్యాంగం ఇచ్చిన హక్కులను ‘మెజారిటీ మతస్థులు’ పొందలేక పోతున్నా- వీటిపై దృష్టి సారించేందుకు సుప్రీం కోర్టుకు సమయం లేదా? ప్రభుత్వాలే చట్టపరంగా భారీ ఉల్లంఘనలకు పాల్పడుతున్నందున- భక్తులకు న్యాయాన్ని అందించేందుకు సర్వోన్నత న్యాయస్థానం ఇకనైనా కాస్త తీరిక చేసుకుంటుందా?
*

cell: 80083 22206