సబ్ ఫీచర్

అలుపెరగని ఉద్యమ నేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాధారణ కార్యకర్తగా రాజకీయ జీవితం ప్రారంభించి గవర్నరు స్థాయికి ఎదిగినా నిరాడంబరతకు నిదర్శనంగా అంకిత భావానికి నమూనాగా నిల్చిన కర్మశీలి, జాతీయ ఉద్యమాన్ని ఆజీవన వ్రతంగా కొనసాగించి వెంట్రప్రగడ రామారావు తరతరాలకు ఆదర్శమూర్తి. జాతీయ ఉద్యమకారులకు స్ఫూర్తి.
1966నుండి వరుసగా నాలుగుసార్లు ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి ఎన్నికైన రామారావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర బిజెపి అధ్యక్షుడుగా రెండుమార్లు ఎన్నికయ్యారు.
కేంద్రంలో అటల్ బిహారీ వాజ్‌పేయి నాయకత్వంలో ఎన్‌డిఏ ప్రభుత్వం ఏర్పడినప్పుడు 2002లో సిక్కిం గవర్నరుగా నియమితులైన ఆయన ఆ పదవిలో 2007 వరకు కొనసాగారు. 2004లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నేతృత్వంలోని యుపిఎ ప్రభుత్వం నాటి గవర్నర్లను పలువురిని పదవులనుండి తప్పించినా ఈయనను కొనసాగించడం ఆయనలోని వివాదరహిత రాజనీతిజ్ఞుణ్ణి చూపుతుంది.
1935లో కృష్ణాజిల్లాలో జన్మించిన ఆయన ఐదుగురు అన్నదమ్ములు, ఒక చెల్లెలు ఉన్న కుటుంబంతో 1956-57లలో హైదరాబాదుకు తరలి వచ్చారు. అప్పట్లో ఇంటింటికి తిరిగి వైద్యం చేస్తూ మంచి డాక్టరుగా పేరుపొందిన వారి తండ్రి కీర్తి ప్రతిష్టలు కాలాంతరంలో ఈయన రాజకీయ ప్రస్థానంలో ఉపకరించాయి. ఈయన విద్యాభ్యాసం హైదరాబాదులో పూర్తయింది. బిఎ., బియల్ చదివిన ఆయన విద్యార్థి దశలోనే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ సభ్యుడైనాడు. లా చదివిన తరువాత హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీసు ప్రారంభించినా అధిక సమయం సంఘ్ పనికో, రాజకీయాలకో వినియోగమయ్యేది. 1958లో ఆయన భారతీయ జనసంఘ్ బాధ్యతలు తీసుకున్నారు. రాష్ట్ర కార్యదర్శి, అధ్యక్షుడు వంటి వివిధ బాధ్యతలను ఆయన సమర్థవంతంగా నిర్వహించారు. డా.యల్‌వియస్ శర్మ, ఎ లక్ష్మీనారాయణ తదితరులు ఆయన సహచరులు.
1962లో శానససభ నియోజకవర్గం నుండి ఎంల్‌సిగా పోటీచేసి పరాజితుడైన ఆయన మళ్లీ ఎంఎల్‌సిగా పోటీచేసి 66లో, 72లో, 78లో, 84లో వరుస విజయాలు సాధించారు. పోలైన ఓట్లలో 50 శాతం కన్నా ఒక్కటైనా అదనంగా రావాల్సిన ఆ ఎన్నికల్లో 66లో గెలుపు ఓటములు నిర్ణయించడానికి రోజున్నర సమయం పడితే అదే 84లో ఎన్నికల నాటికి ప్రతి బూత్‌లోను 50 శాతానికి మించిన ఓట్లు రావడంతో గంటన్నరలో గెలుపు ప్రకటించారు.
ఎంయల్‌సిగా ఎన్నికై ఎంయల్‌ఏ క్వార్టర్స్‌లో ఆయనకో క్వార్టరు లభించేదాకా హిమాయత్‌నగర్‌లోని వారి ఇల్లే నాడు జనసంఘ్ కార్యాలయంగాను, అఖిల భారత నాయకుల వసతిగానే ఉండేదనడం అతిశయోక్తి కాదు.
జాతీయ ఉద్యమకారుడిగా ఆయన ప్రస్థానం అరెస్సెస్‌తో మొదలు కావడం, శిక్షణ పొందిన స్వయం సేవక్‌గా ఆయన జీవితాన్ని మలుచుకోవడంతో రాజకీయాల్లోకి వచ్చినా ఆయన వ్యవహార శైలిలో రాజకీయ నాయకుల్లో సహజంగా కనిపించే ప్రచార ఆర్భాటం, హడావిడి కనిపించేది కాదు. ఆయనలో ఎక్కువగా సంస్థాగత నిర్మాతే కనిపించేవాడు.
పార్టీ రాజకీయాల్లోకి బండారు దత్తాత్రేయ, ఆలె నరేంద్ర, బంగారు లక్ష్మణ్‌వంటి నేతలతోపాటు నేను రావడం వెనుకకూడా ఆయన కృషి, ఆలోచన ప్రయత్నం ఉన్నాయి.
ఆయన రాష్ట్ర బిజెపి అధ్యక్షుడిగా, నేను ప్రధాన కార్యదర్శిగా పనిచేసే రోజుల్లో కార్యకర్తలను ఉత్సాహ పరచడానికి, లక్ష్యసాధనలో వారిని ముందుకు ఉరికించడానికి ‘ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని, ఆ స్థితిని సాధించలేకపోతే మనం పార్టీ మూసేయడం మంచిది’ అని నేను ఉద్వేగ భరితంగా చెప్పగానే ఆయన అందుకుని ‘పార్టీని ఎప్పుడు మూసెయ్యాలో ఒకరు చెప్పాల్సిన పనిలేదు. పార్టీని ఎలా పెంచాలో ఎలా బ్రతికించాలో మనం చెప్పాలి’ అని సంస్థాగత నిర్మాణంలో సానుకూల దృక్పథాన్ని అలవర్చేవారు.
1994లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర బిజెపి అధ్యక్షుడుగా ఎన్నికైన ఆయన రెండు పర్యాయాలు రాష్ట్ర అధ్యక్షుడుగా ఎన్నికయ్యారు.
1997లో ఆయన అధ్యక్షుడుగా, నేను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న సమయంలోనే తెలంగాణ రాష్ట్ర విభజన కోరే తీర్మానానికి కాకినాడలో జరిగిన బిజెపి రాష్ట్ర బిజెపి కార్యవర్గ సమావేశాల్లో ఆమోదం లభింపజేయడం విశేషం. స్వయంగా ఆయన ఆంధ్రప్రాంతీయుడే అయినా, చిన్న రాష్ట్రాలకు బిజెపి అనుకూలమనే సిద్ధాంతంపట్ల ఆయన నిబద్ధత, తెలంగాణ ప్రాంత ప్రజల్లోని తీవ్ర ఆకాంక్షలను అర్థం చేసుకోగలిగిన ప్రజాస్వామిక దృక్పథం మనకు ఆయనలో కనిపిస్తాయి.
ఇవాళ నడుస్తున్న (సిస్) శ్యామప్రసాద్ ఇనిస్టిట్యూట్ ఫర్ సోషల్ సర్వీస్ అనే ట్రస్టు ఆవిర్భావానికి, ఈనాటికి అదొక స్వచ్ఛంద సేవా సంస్థగా ఎదగడం వెనుక ఆయన దూరదృష్టి ప్రయత్నం ఎంతో ఉన్నాయి.
జనసంఘ్ వరిష్ఠ నేత స్వర్గీయ గోపాలరావు ఠాగూర్‌జీ పేరిట 2000 సంవత్సరంలో ఠాగూర్జీ మెమోరియల్ ట్రస్టు ఏర్పాటు చేయించి, దానికి కొంత మూలధనం సమకూడేట్లుచూసి, దాని ద్వారా ప్రముఖులతో సెమినార్లు, చర్చలు గోష్టులు జరిపించి వివిధ అంశాలపై ప్రచురణలు వెలువడేట్లు చేయించడం ఆయన దీక్షా దక్షతలు నిర్మాణాత్మక దృష్టికి నిదర్శనం.
పార్టీ ప్రారంభ దినాల్లో సభలు నిర్వహించడం కోసం అప్పటికే లా గ్రాడ్యుయేటు అయన ఆయన ముందు వెళ్లి బల్లలు, కుర్చీలు ఏర్పాట్లుచేసి, మైకులు, బ్యానర్లు, జెండాలుకట్టి, ఆ తరువాత ఇంటికి వచ్చి శుభ్రంగా స్నానంచేసి అటల్జీ వంటి అఖిల భారత నాయకులను రిక్షాలో ఎక్కించుకుని సభాస్థలికి వెళ్లే వారని గుర్తు చేసుకుంటే ఆయనలోని నిరాడంబర కర్మయోగి, నిజమైన కార్యకర్త మనకు సాక్షాత్కరిస్తారు.
ఆయన హాస్పిటల్లో ఉన్నారని తెలిసి నిన్న అంటే జనవరి 16 సాయంత్రం ఆయన్ను పరామర్శిద్దామని ఆసుపత్రికి వెళ్లతే ఆ సమయానికి మంచంమీద పడుకుని ఉన్న ఆయన్ను అలాగే ఐసియులోకి తరలిస్తున్నారు. పడుకునే ఆయన నన్ను అలా చూశారు.
ఆయనతో మాట్లాడాలని వెళ్లిన నాకు చూపులే లభించాయి. 24 గంటలు కూడా తిరక్కముందే మరణవార్త వచ్చింది. నిన్న చివరి దర్శనం మాత్రమే లభించింది. ఈ రోజు స్మరించుకోవడమే మిగిలింది. దానే్న ప్రాప్తం అంటారు కామోసు!

ఎల్.కె.అద్వానీతో వి.రామారావు (ఫైల్ ఫొటో)

పి.వేణుగోపాల్‌రెడ్డి చైర్మన్, ఏకలవ్య ఫౌండేషన్