సబ్ ఫీచర్

అడవి బిడ్డలను ఆదుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంపద కొందరి చేతుల్లోకి అపరిమితంగా చేరి అసమానతలు అమిత వేగంగా భారత్‌లో పెరిగిపోతున్నాయని తాజా అధ్యయనం చెబుతోంది. విన్నింగ్ గ్రోత్ గేమ్స్: గ్లోబల్ వెల్త్ 2015 నివేదిక అదే విషయాన్ని సాధికారంగా తెలిపింది. అమెరికాలోని బోస్టన్ కన్సల్టింగ్ ఏజన్సీ జరిపిన అధ్యయనం దిగ్భ్రాంతి గొలిపే వాస్తవాలు వెల్లడించింది. ప్రపంచ ఆర్థిక అసమానతలపై ఇదొక సమగ్ర నివేదికగా పేర్కొనవచ్చునని కొందరు విశే్లషకులు అంటున్నారు. ఇండియాలో 49 శాతం వ్యక్తిగత సంపద కేవలం ఒక శాతం భారతీయుల చేతుల్లోకి చేరిపోతుండగా, 99 శాతం మంది మిగిలిన సంపదను పంచుకొంటున్నారని చెప్పింది. అందులో కూడా అసమానతలు న్నాయని పేర్కొంది. 51 శాతం సంపదలో 74 శాతాన్ని 10 శాతం మంది చేజిక్కించుకొంటున్నారన్నది. రవంత సంపదను 89 శాతం మంది ప్రజ పంచుకోవాల్సిన దుర్భర పరిస్థితులు భారత్‌లో వున్నాయన్నది. ప్రపంచ దేశాల్లోని 20 శాతం మంది కడు బీదలు ఇక్కడనే వున్నారట. ప్రతి నలుగురు ప్రపంచ పేదల్లో ఒకరు భారతీయులని చెప్పింది. చైనాలో పేదలు మూడు శాతానికి మించి లేరంది.
దేశ ఆర్థిక అసమానతలపై కలవరపడవలసింది ఏమి లేదని కొందరి వాదన. అభివృద్ధి క్రమంలో ఇది సర్వసాధారణమని ఈ వాదనను బలపరచేవారంటున్నారు. పారిశ్రామికీకరణ జోరందుకొంటున్నపుడు కొంతకాలం ఆదాయాల్లోను, అభివృద్ధిలోను అసమానతలు తప్పవని వారు సెలవిస్తున్నారు. కాని సంపద కేంద్రీకరణ తారస్థాయికి చేరాక ఆ కొందరి చేతుల్లో ధనం చేరిక తగ్గే ఒక మలుపు తిరుగుతుందని నమ్మబలుకుతున్నారు. ఆ మలుపు ఎగిసిపడే అల లాంటిదని వర్ణిస్తున్నారు. సముద్రంలో ఎగిసిపడ్డ అల అన్ని పడవలను ఒకేసారి పైకెత్తేస్తుంది. భారీ నీటి ప్రవాహాల్లో ఇది సహజం. కాని అదే విధంగా సంపదను పంచే అల ఎక్కడా వచ్చినట్టు మానవ చరిత్రలో కానరాదు. ఏ దేశంలోను ఇటువంటి మార్పు జరగలేదు. అలా భారత్‌లో జరుగుతుందంటే నమ్మగలమా?
ఇటీవలి కాలంలో పేదరికం దేశంలో ఒక మేరకు తగ్గింది. కాని అసమానతలు వేగంగా బలపడుతున్నాయి. బుసలుకొడుతున్నాయి. ఆర్థిక సంస్కరణలకు ముప్పై ఏళ్ళు నిండాయి. ఈ కాలంలో వృద్ధి గణనీయమైంది. అంతకన్నా విపరీత స్థాయిలో అసమానతలు పెరిగాయి. 2000లో భారత్‌లో అత్యంత సంప న్న వర్గం సంపద వాటా 37 శాతం. నేడది 50 శాతానికి అమాంతం ఎగిసింది. దీని వెనుక క్రోనీ కేపిటలిజమ్ వుంది. అంతులేని అవినీతి వుంది. విధాన లోపాలున్నాయి. అధికారుల చేతి వాటం వుంది. రాజకీయ అండదండలు దండిగా ఉన్నాయి. దేశాభివృద్ధి కోరుకునే ప్రతివారు ఈ పరిణామాలను నిశితంగా పరిశీలించాలి. వీటికి అడ్డుకట్ట వేయాలి.
వృద్ధి జరిగింది. అది ధనిక వర్గాన్ని అనతికాలంలోనే ఆకాశపు అంచులకు చేర్చింది. కోట్లాది మందిని మరచిపోయింది. వృద్ధి ప్రజలకు భాగస్వాములను చేయలేకపోయింది. పలు అసమానతలకు దారివేసింది. లింగ, జాతి, మత, కుల, వర్గ, ప్రాంత అసమానతలు పేర్కొనదగినవి. దేశ ప్రజలందరిలో అత్యధికంగా నష్టపోయింది గిరిజనులేనన్నది సుస్పష్టం. వృద్ధి బాగా సాధించిన దేశంగా భారత్‌కు ఇటీవల గుర్తింపు లభించింది. వృద్ధితో మానవాభివృద్ధి ఏమేరకు జరిగిందో అంచనావేయాల్సిన సమయం వచ్చింది. ఒక రాష్ట్రం, ఒక జిల్లా సాధించిన అభివృద్ధిని గుండుగుత్తగా చూడటం సరికాదు. ప్రతి జిల్లాలో వెనుకబడిన ప్రాంతాలు, దళిత, గిరిజనాభివృద్ధి ఏమేరకు జరిగిందో ఆ ఆధారంగా ప్రగతిని లెక్కించాలి. అంటే సామాన్యుని ప్రగతే అభివృద్ధికి కొలమానం. ప్రభుత్వ లెక్కల ప్రకారమే ఏ అభివృద్ధికి నోచుకోనిది గిరిజన ప్రాంతం. వారికి ఏవిధమైన అభివృద్ధి ఫలాలు అందడం లేదు.
20 శాతం జిల్లాలు పారిశ్రామికంగా అభివృద్ధి చెందాయి. విశాఖపట్నం, రాంచీ, దేన్, కొరాపుట్, రాయ్‌గఢ్, పశ్చిమసింగ్‌భం, బరోడా, మయుర్‌భంజ్ ఇలా 92 జిల్లాలున్నాయి. వీటి అభివృద్ధిని గమనిస్తే ఆ చిత్రం చాలా అసమానంగా అగుపిస్తుంది. జిల్లాలో ఒక భాగంలో ఆధునిక వసతులు, రవాణా, విద్య, వైద్యం తదితర రంగాలతో అలరారుతుంటాయి. అదే జిల్లాలో మరికొన్ని ప్రాంతాల్లో అభివృద్ధి జాడలే కనిపించవు. వెనుకబడిన ప్రాంతాలన్నీ గిరిజన ప్రాంతాలే. తీవ్ర అసమాన అభివృద్ధిని తొందరగా సరిదిద్దాలి. ఎందుకంటే ఇది అభివృద్ధి పేరు జరిగిన అన్యాయం. స్వేచ్ఛావిఫణిని గట్టిగా సమర్ధించే ఆర్థిక నిపుణులు సైతం ఈ రకమైన అభివృద్ధి నమూనాను కొనసాగించడం సరికాదంటున్నారు. అందువల్ల అభివృద్ధి అందరికీ అందే దిశకు మరలాలి. జనాభా పెరుగుదలకు అనుగుణంగా ఉద్యోగ కల్పన చేయలేని అభివృద్ధి నమూనాను కొనసాగించడం తగదు. జిడిపి పెరుగుదల ఎంత ముఖ్యమో ప్రజలను అభివృద్ధిలో భాగస్వాములను చేయడం అంతకన్నా ఎంతో ప్రధానం. గృహ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల ప్రోత్సాహం ఉద్యోగాలు అధికంగా కల్పిస్తాయని చాలా రోజులుగా ఆర్థిక నిపుణులు ప్రభుత్వానికి సూచిస్తునే వున్నారు. నేడు 5 లక్షల చిన్నతరహా పరిశ్రమలు ఖాయిలాపడటం గమనార్హం. భారీ పరిశ్రమలు, చిన్న తరహా పరిశ్రమల మధ్య సమన్వయత, సమతుల్యత పాటించాలి. నాణ్యమైన ఉద్యోగ కల్పనకు అవసరమైనఅన్ని చర్యలు తీసుకోవాలి.
వెనుకబడిన ప్రాంతాల పర్యావరణ సమతుల్యత ఘోరంగా దెబ్బతిన్నది. అటవీ భూములన్నీ బంజర్లుగా మారాయనడం అతిశయోక్తికాదు. గిరిజనుల స్థితిగతులు నిజంగా మెరుగుపడాలంటే వారికి యోగ్యమైన జీవన మార్గాల్ని అందివ్వాలి. పర్యావరణానికి మేలుచేసే జీవన వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించాలి. ఇది నేలకు మేలు చేస్తాయి. ఆరోగ్యాన్ని అందరికి ప్రసాదిస్తాయి. వ్యవసాయ ఖర్చులు తగ్గుతాయి. ప్రపంచ దేశాలన్నింటిలో విద్య, వైద్యంపై భారత్ చాలా తక్కువ ఖర్చుచేస్తున్నది. గిరిజనుల్లో డిగ్రీ చదివిన వారు ఒక శాతం కూడా వుండరు. ఇక వీరు వారి ప్రాంతంలో జరిగిన అభివృద్ధితో ఎలా లాభపడగలరు? కలపేతర అటవీ ఉత్పత్తుల సేకరణ, నిలువ, అభివృద్ధి, రవాణా, అమ్మకాలపై దృష్టి పెడితే గిరిజన ఆదాయం పెరుగుతుంది. వెదురు, తేనె, మందు మొక్కలు వంటివి వందల రకాలున్నాయి. వీటి ద్వారా వేల కోట్ల వ్యాపారం సాగించే వీలుంది. అడవిపైన, భూమిపైన అన్ని హక్కులు గిరిజనులకు నిజంగా లభించినపుడే అడవి చిగురిస్తుంది. వారి ఆదాయం మెరుగౌతుంది. బ్రతుకులు బాగుపడతాయి.

- వి.వరదరాజు