సబ్ ఫీచర్

సీమకు జలకళ కలేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక్క పంట తడి కోసం డెబ్బయి ఏళ్లుగా పడిగాపులు..
కన్నీళ్లతో నిరంతరం రైతుల ఎదురుచూపులు..
దేశానికి స్వాతంత్య్రం సిద్ధించినప్పటి నుంచి ‘నీటి సమస్యను నివారిస్తామం’టూ నేతలు చేస్తున్న ప్రసంగాలు వినీ వినీ రాయలసీమ రైతుల చెవులు చెవుడుపట్టి పోయాయి.. అయిదేళ్లకోసారి ఎన్నికల ముందు నాయకులు చెప్పే ‘నీటిమూటల మాటలు’ సీమరైతులకు ఎలాంటి ఉపశమనం కలిగించలేక పోతున్నాయి.. సాగునీరు, తాగునీరు లేక విలవిలలాడుతున్న రాయలసీమ ప్రాంత రైతుల, ప్రజల కన్నీళ్లు పాలకుల హృదయాలను కదిలించలేక పోతున్నాయి.. దశాబ్దాల తరబడి ప్రభుత్వాల నిర్లక్ష్యం ఫలితంగా రాయలసీమకు ‘కరవుసీమ’ అనే ముద్రపడింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోను, రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రలోనూ సీమ ప్రాంతం అనాథగానే మారుతోంది. ఏళ్ల తరబడి వర్షాభావం కొనసాగుతున్నందున ఇక్కడి వ్యవసాయ భూములు బీటలు వారుతూ, ఈ ప్రాంతంలోని నిరుపేదలు వలసపోయే దుస్థితి ఏర్పడింది.
రాయలసీమలో వర్షాలు పడేందుకు గతంలో ‘మేఘ మథనం’ లాంటి కార్యక్రమాలు చేపట్టినా ఎలాంటి ఫలితం రాలేదు. ఇటీవల ఎపి ప్రభుత్వం పంటలను తడిపేందుకు ‘రెయిన్ గన్స్’ పేరిట హడావుడి చేసింది. చిన్నపిల్లలు ఊదురుగొట్టాల్లో నీళ్లు నింపి తమ బుగ్గలు పూరించి ‘ఉఫ్’మని ఊదితే నీళ్లు బయటికి చిమ్మినట్టు- రెయిన్ గన్స్‌తో ఎండిన వేరుశెనగ పైర్లపై థుపుక్కున నీళ్లు చిమ్మడం ఓ ప్రహసనంలా కనిపిస్తోంది. ఈ ప్రయోగాలతో పంట చేతికి రావడం దేవుడెరుగు..! అరకొరగా ఉన్న చేనుపై బురద నీరు చిమ్ముతూ ‘రెయిన్ గన్స్’ ఉపయోగించిన తీరు- ఏడుస్తున్న చిన్నపిల్లల చేతిలో తాయిలం పెట్టినట్టు ఉంది. ఇలాంటి తాత్కాలిక చర్యలు తప్ప ఈ ప్రాంతంలో సాగునీటి సమస్య పరిష్కారానికి శాశ్వత సమాధానం ఏదీ లభించడం లేదు. అప్పటికే ఎండిపోయిన వేరుశెనగ ఆకులపై రెయిన్ గన్స్‌తో నీళ్లు చల్లితే అవి ఆకుపచ్చగా మారవచ్చేమో గానీ, వేరు భాగంలో కాయలు ఎదగడం అసాధ్యం. బురద నీరు పేరుకుపోతే పగిలిన లేత కాయలు చిట్లిపోయి ఎందుకూ పనికిరాకుండా పోతాయి. ‘ఎండిన పంటకు నీళ్లు పట్టడం- శవం నోట్లో నీళ్లు కొట్టడం ఒకటేన’ని సీమ రైతులు ఆగ్రహం ప్రకటిస్తున్నారు.
రాయలసీమ భూములకు శాశ్వత ప్రాతిపదికపై సాగునీటిని అందించాలని పాలకులు ఏనాడూ ఆలోచించడం లేదు. ఏటా కరవుమేఘాలు కమ్ముకుంటున్నాయే తప్ప పొలాలకు నీరు అందడం లేదు. మిగతా ప్రాంతాల నుంచి వచ్చే ‘మిగులు జలాల’ కోసం సీమ రైతులు దీనంగా ఎదురుచూడాల్సి వస్తోంది. అందరూ తినగా మిగిలిపోయిన పాచి అన్నం కోసం సీమ ప్రజలు, రైతులు ఎదురు చూడడం లేదు. అయినప్పటికీ ఈ ప్రాంతవాసులను బిచ్చగాళ్లుగా, బానిసలుగా ప్రభుత్వాలు చూస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల్లో సాగునీటి ప్రాజెక్టులకు భారీగా నిధులు వెచ్చించినా సీమను మాత్రం పాలకులు నిర్లక్ష్యం చేశారు. అన్ని రాజకీయ పార్టీలూ ఇన్నాళ్లూ సీమ ప్రజల దాహార్తిని, సాగునీటి అవసరాలను అపహాస్యం చేశాయి. దాదాపు రెండుకోట్ల జనాభా ఉన్న రాయలసీమలో 67,526 కిలోమీటర్ల విస్తీర్ణానికి తగ్గట్టుగా శాశ్వత జలాలను కేటాయించాల్సిన బాధ్యతను ఇన్నాళ్లూ పాలకులు విస్మరించారు. ఫలితంగా ‘కరవు’ అనే పదానికి రాయలసీమ ప్రత్యక్ష నిదర్శనంగా మారింది.
శ్రీకృష్ణదేవరాయల నాటి కాలంలో సీమలో జనం దాహార్తిని, రైతుల పంటలను దృష్టిలో పెట్టుకుని చెరువులు తవ్వించారు. 500 ఏళ్లకు సరిపడా నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని రాయల కాలంలో చెరువులు, ఇతర జలవనరులను ఏర్పాటు చేశారు. బుక్కపట్నం, ధర్మవరం, అనంతపురం చెరువులను పరిశీలిస్తే ఏటా రెండు పంటలకు సరిపడా నీరు సమృద్ధిగా ఉండేదని, దేశానికి స్వాతంత్య్రం రాకముందు పరిస్థితి ఎంతో మెరుగ్గా ఉండేదని సీమవాసులు చెబుతుంటారు. రానురానూ చెరువులు అన్యాక్రాంతం కావడంతో నీటివనరుల జాడ తగ్గిపోయింది. చెరువులను కబ్జా చేసిన వారిని పాలకులు గానీ, అధికారులు గానీ దండించనందున సాగునీటికి, తాగునీటికి కష్టాలు మొదలయ్యాయి. పూడికలు తీయనందున కొన్ని చెరువులు నిరుపయోగంగా మారి, ఆ తర్వాత కబ్జాదారుల కబంధ హస్తాల్లో చిక్కుకున్నాయి. చెరువులను ఆక్రమించి ఇళ్లు నిర్మించగా అధికారులు అక్కడ రోడ్లు, విద్యుత్ వంటి సౌకర్యాలు కల్పించారు. చెరువుల్లో ఆక్రమణలను తొలగించే పనిని ఏనాడూ చేపట్టలేదు. చెరువులున్న చోట ఇళ్లు నిర్మించినందున వర్షం పడితే అవి నీట మునుగుతున్నాయి. ఉపాధి హామీ పథకం కింద చెరువులను తవ్వుతున్నట్లు మీడియాలో హడావుడి చేయడం తప్ప అధికారులు, నాయకులు ఆచరణలో సాధించింది శూన్యం. చెరువుల్లో పూడిక తీసి వాటిని సంరక్షించే ప్రయత్నాలు చేస్తే సాగునీటి అవసరాలు కొంతవరకైనా తీరే అవకాశం ఉంది.
ఆంధ్ర ప్రాంతంలో భారీ వర్షాలు కురిసినపుడు నదుల నుంచి లక్షలాది క్యూసెక్కుల వరద నీరు సముద్రంలోకి వృథాగా కలుస్తోంది. ఆ నీటిలో ఒక్క శాతం నీరు సీమకు ఇచ్చినా కరవు సమస్య కొంతైనా తీరుతుంది. నీటి కేటాయింపుల విషయంలో శాశ్వత చర్యలు తీసుకోడానికి బదులు ఇపుడు ‘రెయిన్ గన్స్’ పేరిట ఎండిన పంటలపై పాలకులు ప్రయోగాలు చేయడం విడ్డూరంగా ఉంది. పుష్కరాలు, రియో ఒలింపిక్స్ మాదిరి- ఇటీవల సీమలో నీళ్లు నింపిన తూటాలను ఎండిన పంటలపై ప్రయోగించారు. వారం రోజుల పాటు ‘ఎంటర్‌టైన్‌మెంట్’లా సాగిన ఈ ‘నీటి నాటకం’ సీమరైతులను అవమాన పరిచేదిగా, అవహేళన చేసేదిగా ఉంది. ఈ ఏడాది సీమలో 3 లక్షల ఎకరాల్లో వేరుశెనగ పంటను ఆదుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. అదే ప్రభుత్వం ఈ ఏడాది గోదావరి నది నుంచి దాదాపు 3,500 క్యూసెక్కుల నీటిని సముద్రం పాలు చేశామని ప్రకటించింది. వంద టిఎంసి నీటితో కోటి ఎకరాల్లో పంటను సాధించవచ్చు. గోదావరి నుంచి వృథాగా పోయే నీటిని సీమకు అందిస్తే లక్షలాది ఎకరాల్లో వేరుశెనగ, రాగి, జొన్న, సజ్జ, కొర్రలు వంటివి పుష్కలంగా పండించవచ్చు. సీమ రైతుల ఆకాంక్షలను, వారి ఆలోచనలను పరిగణనలోకి తీసుకునే నాథుడే లేడు. ఉపాధి హామీ పథకం కింద కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నా చెరువులకు జలకళ సాధ్యం కావడం లేదు. ఏళ్ల తరబడి పంటలు లేక కుంగిపోతున్న సీమ రైతులు ఇక కూలీలుగా ఇతర ప్రాంతాలకు వలస పోవాల్సిందేనా? అసలు నీళ్లే లేనపుడు బిందుసేద్యం, రెయిన్ గన్స్ అంటూ నిధులను ఖర్చు చేయడం దేనికి? అన్ని గ్రామాల వద్ద కాలువలు, పిల్ల కాలువలను తవ్వించి నీరు ప్రవహించేలా ఇకనైనా శాశ్వత చర్యలు తీసుకోవాలి. వ్యవసాయానికి అవసరమైన బోరు బావులు తవ్వేందుకు, ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలి. ఇతర ప్రాంతాల నుంచి మిగులు జలాలను రప్పించి సాగునీటి ప్రాజెక్టులను నిర్మించేందుకు పాలకులు చిత్తశుద్ధితో ప్రయత్నించాలి.

- యక్కలూరి శ్రీరాములు 99856 88922