సబ్ ఫీచర్

పసిడిపై మోజు కన్న.. దేశహితం మిన్న

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన దేశంలో జనానికి సెంటిమెంట్లు ఎక్కువ. అందులోనూ ఆడవాళ్లకు అవి మరీ ఎక్కువ. ‘ఆడవాళ్లు గడపదాటి బయటకు రాకూడద’న్న అతి సాంప్రదాయ సంస్కృతిలో పుట్టిపెరిగిన స్ర్తిలు నాలుగు గోడల మధ్యే కాలం గడపడంతో అటువంటి భావజాలానికి అనాదిగా అలవాటుపడిపోయారు. ‘బొట్టు, కాటుక, పసుపు, కుంకాలు, పుస్తెల తాడు, నల్లపూసలు, మె ట్టెలు’వంటి మాటలు తప్ప.. మరో కొత్తమాట వాళ్ళ నోటినుండి రానంత చాలా చిన్న పరిధిలో వాళ్ళ జీవితం అక్కడక్కడే తిరిగింది. నిరక్షరాస్యత అందుకు తోడవటం స్ర్తిలను మరింత ‘గుడిగుడి గుంచం’ ఆడించింది. దానికితోడు ఆ కాలం సినిమాలు కూడా ఆడవాళ్ళ సెంటిమెంట్‌ను ఆధారం చేసుకుని ‘మహిళా చిత్రాలు’ అంటూ తెరమీదికి వచ్చి కన్నీళ్ళతో వ్యా పారం చేసుకున్నాయి. ‘ఉండమ్మా బొట్టుపెడతా!’, ‘మాంగల్యబలం’ వంటివి ఇందుకు ఉదాహరణలు. సంప్రదాయబద్ధమైన మన సంస్కృతిని చాటిచెప్పే ఆచారాలు, అలవాట్లు, విశ్వాసాలు తప్పుకాదు. వాటిని విమర్శించే హక్కు ఎవ్వరికీ లేదు. కానీ అవి బలహీనతలుగా, చాదస్తాలుగా, అపరిపక్వ వాదనలకు ఉపయోగపడేవిగా, ఎదుటివాళ్ళ మనసుమీద దెబ్బతీసేవిగా, సమాజ శ్రేయస్సుకు ఆటంకం కలిగించేవిగా ఉంటేనే- ఇబ్బందిగా ఇరుకున పెట్టేవిగా పరిణమిస్తాయి.
పెద్దగీత పక్కన అంతకన్నా ‘పెద్ద’గీత గీస్తే మొదటిది చిన్నదైపోయినట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన ‘పెద్దనోట్ల రద్దు’ తర్వాత ‘నిల్వ బంగారం లెక్కలు చెప్పమ’న్న మరో ప్రభుత్వ ఉత్తర్వు వెలువడి నోట్ల లెక్కల గొడవ కాస్తంత వెనకబడిపోయింది. ఈమధ్యన పెద్దలెక్కల మాస్టారుగా మారిన మోదీ.. బెత్తం చేతపట్టుకుని నల్లకుబేరులను ఎడాపెడా వాయించటానికి పూనుకోవటంతో- ‘లెక్కలు సరిగా చేసే మాకెందుకు మధ్యలో మీ దెబ్బలు?’ అని సామాన్య జనం గగ్గోలు పెట్టేస్తున్నారు. అందులోనూ ‘బంగారం’ అనేది ఆడవాళ్ళకు సంబంధించిన సెంటిమెంట్ వ్యవహారం గనుక టీవీ చానెళ్ళకు ఎక్కి- ‘మా మహిళల జోలికివస్తే ఊరుకోం మోదీ..’ అని చూపుడు వేలుతో బెదిరిస్తున్నారు. ‘పుస్తెలు, నల్లపూసల గొలుసుకు కూడా లెక్కలు చెప్పాలా..? మా పుట్టింటివాళ్ళు మాకు స్ర్తిధనంగా ఇచ్చిన బంగారానికి లెక్కలు ఎక్కడినుంచి తేవాలి? మా అమ్మమ్మ ఇచ్చిన.. మా బామ్మ ఇచ్చిన బంగారు వడ్డాణం, కాసుల పేరు, పెద్ద గొలుసు ఇలా మాదగ్గర ఎన్ని కేజీల నగలయినా ఉంటాయి. అడగటానికి ప్రభుత్వానికి హక్కేముంటుంది?’అంటూ కొంతమంది గుడ్లురిమి, మరికొంతమంది కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ టీవీ తెరమీద వీరంగం చేస్తున్నారు. దీనికి ఇతోధికంగా సహాయపడటానికి, మంటను మరికాస్త ఎగదోయటానికి అన్నట్లు టీవీ వాళ్ళు సైతం ‘నగల పెట్టెపై కేంద్రం కన్ను..’, ‘ఆడవాళ్ళ మెళ్ళో పుస్తెలా.. నారాయణ.. నారాయణ’, ‘తులం ఉన్నా లెక్కలెక్కే...!’అంటూ బ్రేకింగ్ న్యూస్ వేసి.. చర్చల్లో మాట్లాడిస్తూ ఆడవాళ్ళను మరింత హడలగొడుతున్నారు.
అసలు చిక్కంతా ఎక్కడ వస్తున్నదంటే- ‘గవర్నమెంట్ ఏం చెబుతోందో అది సరిగా మనం వినకపోవడం వల్ల.. విన్నా దాన్ని స్వంత బుద్ధితో ఆలోచించడమో.. తెలిసినవాళ్ళను అడిగి వివరాలు తెలుసుకోవడమో చేయకుండా.. చానల్ వాళ్ళ అపరిపక్వ వాదనలకు, వక్రభాష్యాలకు లొంగిపోవడంవల్ల..! ‘ఏ పార్టీకి చెందిన రాజకీయ నాయకులు, కార్యకర్తలు ఆ పార్టీకి అనుకూలంగా మాత్రమే (మనస్సాక్షి ఒప్పుకోకపోయినా) మాట్లాడతారన్న వర్తమాన లోకజ్ఞానం లేకపోవడం వల్ల కూడా- చానళ్లలో వాదనల ప్రభావానికి దాసులం కావటం జరుగుతోంది. ఏ పార్టీకీ చెందని కొందరు రాజకీయ విశే్లషకులు, జర్నలిస్టులు కూడా మొహమాటానికో, మళ్ళీ ఇంకోసారి పిలవరన్న భయంతోనో ‘ఏ రోటికాడ ఆ పాట’ అన్నట్టు చానళ్ల ఆలోచనలకు అనుగుణంగా మాట్లాడుతుండటం ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. ‘ఇందుగలడందులేడన్న’ట్లు సమాజం మొత్తం ఆవరించి ప్రతిమనిషిని, ప్రతి ఇంటిని ఇంతగా ప్రభావితం చేస్తున్న ఎలక్ట్రానిక్ మీడియా మాయలో ఇలా పడకుండా ఉండాలంటే సామాన్యులు సైతం మెదడుకు బాగా పదునుపెట్టి, స్వంత బుద్ధితో విశే్లషణ చేయాల్సి ఉంటుంది.
ఇక్కడ అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తున్న మరో విషయం ఏమిటంటే- ‘మెడలో పుస్తెల తాడు, చేతికి గాజులు వేసుకోకుండా మోడ్రన్ థింకింగ్‌తో’ ఆడవాళ్ళు ఎదగాలంటూ చానళ్లలో అరిచి చెప్పే ఫెమినిస్టులు- ‘మా పుస్తెలు.. మా స్ర్తిధనం’ అంటూ వీధులకెక్కి గగ్గోలు పెడుతుంటే ‘ఇలాంటి సెంటిమెంట్స్ నుంచి బయటికి రండి.. వ్యక్తిగత విశ్వాసాలు పక్కకుపెట్టి దేశం బాగుకు ప్రభుత్వంతో సహకరించండి’- అని ఏ మాత్రం చెప్పకపోవడం..! వాళ్ల పరిధి పురుషాధిక్యత మీద గొంతు చించుకోవటం వరకే..! అని మనం మిన్నకుండాలి కాబోలు.
ఆడవాళ్ళకు బంగారం మీద ప్రీతి ఉండటం తప్పుకాదు. ‘పుస్తెలు, నల్లపూసల’ సెంటిమెంట్‌నూ ఎవరూ ఆక్షేపించటం లేదు. మన సంస్కృతి, సంప్రదాయం, మన వివాహవ్యవస్థ ఖండాంతర ఖ్యాతిని ఆర్జించాయన్న విషయం అందరికీ తెలుసు. కాకుంటే పరిస్థితులను బట్టి తమ విశ్వాసాలను, ఇష్టాలను కొంత సడలించుకుని దేశం కోసం చిరుత్యాగాలను చేయక తప్పదు. స్వాతంత్య్రోద్యమ కాలంలో ఎంతోమంది స్ర్తిలు తమ వంటిమీది బంగారాన్ని తీసి ఉద్యమకారులకు ఇచ్చారంటే వాళ్ళకు బంగారం మీద ప్రీతి లేకనా..? కాదు- దేశభక్తి ఆ బలహీనతను జయించింది కనుక! మోదీని నిందించటమే పనిగా పెట్టుకోకుండా ఈ కాలపు ఎదిగిన స్ర్తిలు ఆయన ఆంతర్యాన్ని గ్రహించగలిగితే అపోహలకు తావే ఉండదు. స్ర్తిల పుస్తెల తాడుపై కనే్నశానని గానీ, స్ర్తిధనాన్ని కొల్లగొడతానని గానీ, వారి నగల పెట్టెను స్వాధీనం చేసుకుంటానని గానీ మోదీ ఎక్కడా చెప్పలేదు. నవంబరు 8 తర్వాత కొనుగోలు చేసిన భారీ బంగారానికి మాత్రమే లెక్కలడుగుతారని వివరణ ఇచ్చారు. వదంతులు, చానళ్లలో చర్చల ఆధారంగా బెంగ పడిపోకుండా, జాతి ప్రయోజనాల కోసం మహిళలు సైతం అండగా నిలవాలి.

- కొఠారి వాణీచలపతిరావు