సబ్ ఫీచర్

దీన్‌దయాళ్ స్ఫూర్తితో ‘కమల వికాసం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో మాత్రమే నాయకులను, కార్యకర్తలను చైతన్యపరచడం మన దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలకు అలవాటు. అయితే, రాజకీయ పార్టీ అంటే నిరంతరం ప్రజలతో మమేకం అవ్వాలని, తద్వారా వారి అభిమానాన్ని చూరగొనవచ్చనే సూత్రాన్ని ఆచరణలో పెడుతోంది భారతీయ జనతా పార్టీ. 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికలకు పార్టీ యంత్రాంగాన్ని సమాయత్తం చేయడానికి భాజపా అధ్యక్షుడు అమిత్ షా అప్పుడే దేశవ్యాప్త పర్యటనలకు శ్రీకారం చుట్టారు. గత నెల 25న ప్రారంభమైన ఆయన పర్యటన సెప్టెంబర్ 25న ముగియనుంది. ఐదు నెలల కాలంలో 88 వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో పార్టీ కార్యకర్తలతో ఆయన సమావేశం కానున్నారు. ఉత్తరప్రదేశ్ ప్రస్తుతం బిజెపికి కంచుకోటగా ఉంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హంగూ ఆర్భాటాలు లేకుండా ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రజలకు చేరువ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో పార్టీ శ్రేణులు ప్రజలలోకి చొచ్చుకుపోవడానికి ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకొంటున్నాయి. బిజెపి మాతృక అయిన ‘జనసంఘ్ పార్టీ’ వ్యవస్థాపకులలో ఒకరైన పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ శత జయంతి ఉత్సవాలను ఏడాది పొడవునా నిర్వహించాలని భాజపా నిర్ణయించింది. దీన్‌దయాళ్ ఉపాధ్యాయకు నిజాయితీపరుడైన నాయకుడిగా జాతీయస్థాయిలో గుర్తింపు ఉంది. ఆయన ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు. దీన్‌దయాళ్ శత జయంత్యుత్సవాల ద్వారా ఉత్తరప్రదేశ్‌లో పార్టీని మరింత బలోపేతం చేసే కార్యక్రమానికి బిజెపి శ్రీకారం చుట్టింది.
ఆయన సందేశాన్ని ఇంటింటికీ చేర్చడంతోపాటు, బిజెపి సభ్యత్వ నమోదును పెంచడం కోసం ‘మై హౌస్ - బిజెపి హౌస్’ (నా ఇల్లు - బిజెపి ఇల్లు) అనే వినూత్న కార్యక్రమాన్ని పార్టీ చేపట్టింది. ఈ కార్యక్రమం నిర్వహణకు 20 వేలమంది కార్యకర్తలను, అందుకు అవసరమైన ప్రచార సామగ్రిని పార్టీ నాయకత్వం సిద్ధం చేసింది. ఈ కార్యక్రమం ఆరు నెలలపాటు కొనసాగనుంది. యువతను ఆకర్షించేందుకు పండిట్ దీన్‌దయాళ్ ఖేల్ ఉత్సవ్, యువకళా సంగమమ్ పేరిట పలు కార్యక్రమాలను నిర్వహించనుంది. ఖేల్ ఉత్సవ్‌లో భాగంగా పలు క్రీడాపోటీలను నిర్వహించడంతో పాటు, జాతీయ, అంతర్జాతీయ పోటీలలో అద్భుత ప్రతిభ కనబరచిన క్రీడాకారులను సన్మానించనున్నారు. చరిత్రకారులు, గాయకులు, నటులు, కళాకారులతో ‘యువ సంగమ్’ను నిర్వహించనున్నారు.
దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జీవిత కథను రాష్ట్రంలోని 8, 9, 10 తరగతులు చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేసి, ఆయన జీవితంపై గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు క్విజ్ పోటీలు నిర్వహించనున్నారు. పేదల అభివృద్ధి, అభ్యున్నతి కోసం కృషిచేస్తున్న స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులను సన్మానించనున్నారు. ఆడపిల్లల్ని బాగా చదివించిన తల్లిదండ్రులను గుర్తించి వారిని సత్కరించనున్నారు. తద్వారా లైంగిక వివక్ష కొంతవరకు తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఎస్‌సి, ఎస్‌టి, ఇతర సామాజిక వర్గాలకు చెందిన విద్యార్థులకు విద్య, ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పించేందుకు జిల్లా స్థాయిలో ‘కెరీర్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ సెంటర్స్’ ఏర్పాటు చేస్తున్నారు. ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న రోగులకు అత్యవసర పరిస్థితులలో రక్తదానం చేసేందుకు జిల్లాల వారీగా ‘పండిట్ దీన్ దయాళ్ బ్లడ్ డోనర్స్ డైరెక్టరీ’ని ప్రచురిస్తున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయనున్నారు.
బిజెపి మైనారిటీ విభాగం త్రిపుల్ తలాక్, మహిళా సాధికారత అంశాలపై సదస్సులు నిర్వహించనుంది. త్రిపుల్ తలాక్ ద్వారా బలవంతంగా భర్తనుంచి విడాకులు పొందిన మహిళల వివరాలను రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనుబంధ సంస్థ అయిన ‘రాష్ట్రీయ ముస్లిం సేవక్ సంఘ్’ ఇప్పటికే సేకరించింది. వారి పిల్లలకు విద్యాబుద్దులు ఉచితంగా నేర్పించడానికి ఆర్‌ఎంఎస్ ప్రణాళికలు సిద్ధం చేసింది. పార్టీపై ఉన్న ‘హిందూత్వ’ ముద్రను తొలగించుకొని, అన్ని మతాలకు చెందిన వారికి చేరువకావడానికి భారతీయ జనతా పార్టీ సన్నాహాలు ప్రారంభించింది. పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకత, మొక్కల పెంపకంతో కలిగే లాభాల గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు పోలింగ్ బూత్‌ల స్థాయిలో మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. మొక్కలను నాటి వదలివేకుండా, వాటి పరిరక్షణ బాధ్యతలను బూత్ స్థాయి కమిటీలకు అప్పగించనున్నారు. దీన్‌దయాళ్ ఉపాధ్యాయ శత జయంత్యుత్సవాలు పూర్తి అయ్యేనాటికి ఉత్తరప్రదేశ్‌లోని అన్ని సామాజిక వర్గాలకు చెందిన ప్రజలకు మరింత చేరువ కావడానికి భారతీయ జనతా పార్టీ సన్నాహాలు ప్రారంభించింది. ఇదే తరహాలో దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన మహనీయుల పేరిట పలు కార్యక్రమాలు నిర్వహించడానికి బిజెపి సన్నద్ధం అవుతున్నది.

-పి.మస్తాన్‌రావు