సబ్ ఫీచర్

ఫాఠం చెప్పే పద్ధతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉపాధ్యాయుని కార్యరంగం తరగతి గది. పిల్లలతో తరగతి గ దిలో ఆప్తవాక్యాలు, ప్రోత్సాహక మాటలు, ఆత్మీయతతో మెలగాలి. ఉపాధ్యాయుడు ఎంతో ఓపిక, సంయమనంతో బోధనను ప్రారంభించవలసి ఉంది. విద్యార్థులు ఉపాధ్యాయుని నోటి నుంచి ఏ మాట వస్తుందా? అని ఎదురుచూస్తూ ఉంటారు. పాఠం మొదలుపెట్టేటప్పుడే ఆ పిల్లల నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుని తాను సాధించిన జ్ఞానాన్ని సులభ శైలిలో ఉపాధ్యాయుడు వ్యక్తం చేస్తాడు. ఈ పని అంత సులభం కాదు. అది ఆ ఉపాధ్యాయుని ప్రావీణ్యతపై ఆధారపడి ఉంటుంది. ఫలానా విధంగా పాఠం చెప్పాలని ఎవరూ ఆదేశించలేరు. తరగతి గదిలో పిల్లల ముఖాలే బోధకునికి గీటురాయి. పుస్తకంలో వున్న దానికి, పిల్లలకు చెప్పే పద్ధతికి మధ్యలో పెద్ద అగాధమే ఉంటుంది. పుస్తకంలో వున్న జ్ఞానం పండితులు రాశారు. తరగతిలో టీచర్ తన జ్ఞానాన్ని అందించేది పిల్లలకు అని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. పిల్లల మానసిక స్థితిని గమనించి సులభశైలిలో వారి నేపథ్యాలను బట్టి బోధన చేస్తే వారికి బోధపడుతుంది.
పిల్లలు తమకర్థమయ్యే రీతిలో చెబితేనే సులువుగా గ్రహించగలుగుతారు. ఉపాధ్యాయునిలో అంతర్లీనంగా ఉన్న జ్ఞానాన్ని సమయం, సందర్భాన్ని బట్టి ఛలోక్తులతో, కొన్నిసార్లు ఛాలెంజింగ్ మూడ్‌లో, కొన్నిసార్లు కన్విన్సింగ్ మూడ్‌లో, ఒక్కొక్కసారి హాస్యం, వ్యంగ్యం, కొన్నిసార్లు హావభావాలతో పాఠం చెబితే పిల్లలు అందులో లీనమవుతారు. అనుభవ పూర్వక బోధనే ఉపాధ్యాయుని, విద్యార్థుల భవిష్యత్ తేల్చుతుంది. టీచర్ తన జ్ఞానాన్ని కంచంలో పెట్టినట్లు ఉంచకూడదు. పిల్లల్లో జ్ఞానంపై కుతూహలాన్ని పెంచాలి. పిల్లల నుంచి ప్రశ్నలు రావటమే టీచర్ బోధనకు మొదటి సోపానం. ఆ ప్రశ్నలను ఆధారం చేసుకుని టీచర్ తాను నేర్పవలసిన జ్ఞానాన్ని విద్యార్థులకు అందించగలిగితే పిల్లల్లో ఆత్మవిశ్వసం పెరుగుతుంది. ఒక్కోసారి ఉపాధ్యాయునికి తెలియని విషయాలు కూడా పిల్లలు చెబుతారు. ఇక్కడే టీచర్‌లో నిజాయితీ అవసరం. పిల్లలు వేసిన ప్రశ్నకు సమాధానాలు తెలియకపోతే రేపు చెబుతానని అనాలే తప్ప వారిని నిరాశ పరచకూడదు. పిల్లలు అడిగే విషయాలపై అధ్యయనం చేయాలి. వారిని తప్పుదోవ పట్టించకూడదు. తాత్కాలికంగా ఉపాధ్యాయులకు కొంత ఇబ్బంది అయినా అధ్యయనం చేసి చెబితే ఆ నిజాయితీని పిల్లలు హర్షిస్తారు.
ఉపాధ్యాయులు తొందరపడితే పిల్లలు అయోమయానికి గురవుతారు. అవగాహనే గీటురాయి. తరగతి గదిలో తెలివిగల పిల్లలు టీచర్‌ను తమవైపు లాగుతారు. అటువైపు పరుగెత్తకుండా మాట్లాడటం, పిల్లలను కూడా కదిలించి తన పాఠం వైపు మళ్లించాలి. బోధనలో మెలకువలు అంటే పాఠ్యప్రణాళికలు కాదు. అనునిత్యం స్థితిని బట్టి అప్పటికప్పుడు అవలంబించే పద్ధతే బోధనకు ప్రాణం.

- చుక్కా రామయ్య