ఫోకస్

ఫిరాయిస్తే.. ఏంచేయాలి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విధేయత, సిద్ధాంతాలతో పనిలేకుండా రాజకీయ అవకాశవాదమే అజెండాగా అధికారంకోసం పార్టీలను ఫిరాయించే నాయకుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. అది ఫలానా పార్టీ అంటూ ఏమీ లేదు, అన్ని పార్టీల్లో పరిస్థితి ఒకేలా ఉంది. తాజాగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ముగ్గురు తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరడంతో మరోమారు పార్టీ ఫిరాయింపుల అంశం చర్చకు వచ్చింది. గతంలో కాంగ్రెస్ నుండి తెలంగాణ రాష్ట్ర సమితిలోకి శాసనమండలి సభ్యులు ఫిరాయించారు. వీరిని అనర్హులుగా ప్రకటించాలని తెలంగాణ శాసనమండలి చైర్మన్‌కు గత జూలై 1న ఫిర్యాదు చేస్తే ఇంతవరకూ ఆయన దానిని పరిశీలిస్తూనే ఉన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మూడు వారాల్లో చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. తెలుగుదేశం నుండి తెరాసలోకి గతంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ సహా ఏడుగురు, తాజాగా ముగ్గురు కలిపి మొత్తం పది మంది పార్టీ ఫిరాయించారు. ఇంకా తెలుగుదేశం పార్టీలో మిగిలింది ఐదుగురే. గతంలో తెరాసలో చేరిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని టిడిపి చాలా కాలంగా కోరుతోంది. అనర్హత వాజ్యాలు నెలల తరబడి స్పీకర్ పరిశీలనలోనే ఉన్నాయి. దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించినా, తాము స్పీకర్ అధికారాలను ప్రశ్నించలేమని తేల్చి చెప్పింది. తర్వాత సనత్‌నగర్ ఎమ్మెల్యే రాజీనామా చేయడం, మరోసారి ఎన్నికలకు సిద్ధపడటం కూడా జరిగిపోయాయి. ఒక పార్టీ పేరు, గుర్తు ఉపయోగించుకుని ప్రజల ఓట్లతో ఎన్నికై , మరో పార్టీలోకి మారిపోవడం ప్రజలను అవమానించడమే అవుతుంది. ఇది ఏదో ఒక రాష్ట్రానికే పరిమితం అయిన విషయం కాదు, ఆంధ్రప్రదేశ్‌లో వైకాపా ఎమ్మెల్యేలు టిడిపిలో చేరిపోయారు. మరికొంతమంది అధికారికంగా టిడిపిలో చేరకున్నా, అనుబంధంగా వ్యవహరిస్తున్నారు, స్వతంత్య్ర అభ్యర్థులు సైతం గెలిచిన తర్వాత అధికార పార్టీకి అనుబంధంగా మారిపోతున్నారు. ఈ వ్యవహారం చాలా కాలంగా భారతదేశంలో నడుస్తున్న చరిత్రే. గతంలో ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలోనూ పార్లమెంటు సభ్యులను తనవైపు ఆకర్షించారు. ‘ఆపరేషన్ ఆకర్ష్’ పేరుతో అధికార పార్టీ నాయకులు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. పదవులు, కాంట్రాక్టుల పేరుతో ప్రలోభాలు పెట్టడం అధికార పార్టీకి అలవాటైన విద్య. జంప్ జిలానీలు సైతం మీడియా ముందుకు వచ్చి అంతవరకూ తమ పార్టీని పొగిడినవారే, అకస్మాత్తుగా మరో పార్టీకి మారడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. కొంతమంది తిట్టలేక తిట్టినట్టు, పొగడలేక పొగిడినట్టు వ్యవహరించడం కూడా జనం గమనించకపోలేదు. నియోజకవర్గం అభివృద్ధి కోసమే పార్టీ మారామని చెప్పడం, అంతర్గత ప్రజాస్వామ్యం లోపించిందని చెప్పడం, అవమానాలు తట్టుకోలేకపోతున్నామని చెప్పడం ఇవన్నీ కొన్ని సాకులు మాత్రమే. అయితే చట్టంలో ఉన్న చిన్న చిన్న లోపాలను సైతం ఫిరాయింపుదారులు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నా రన్నది కూడా బహిరంగ రహస్యమే. పార్టీ ఫిరాయింపుల కారణంగా అనర్హత రెండు రకాలుగా ఉంటోంది. సభ్యుడు స్వచ్ఛందంగా తన రాజకీయ పార్టీకి రాజీనామా చేసినపుడు, రెండోది తాను ప్రాతినిధ్యం వహించే రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా సభలో ఓటు వేసినపుడు లేదా సభకు గైర్హాజరైనప్పుడు జరుగుతుంది. ఒకవేళ పార్టీని ధిక్కరించి ఓటు వేసినా, సభకు రాకపోయినా 15 రోజుల లోపల సభ్యుడి ప్రవర్తనను ఆ పార్టీ క్షమిస్తే ఈ క్లాజు వర్తించదు. పార్టీ ఫిరాయింపుల ఫిర్యాదులపై ప్రిసైడింగ్ ఆఫీసర్లు తమ నిర్ణయాలు తెలపడానికి నెలలు, మరికొన్ని సందర్భాల్లో సంవత్సరాలు సమయం తీసుకుంటున్నారు. ఈ ప్రిసైడింగ్ ఆఫీసర్లు అధికార పార్టీకి చెందినవారే ఉంటారు. 10వ షెడ్యూలు 7వ నియమం ప్రకారం సభ్యుని అనర్హతకు సంబంధించి ఎటువంటి అంశంపైనా న్యాయస్థానాలు సహజంగానే విచారణ జరపవు. ఈ వివాదాలపై అంతిమ నిర్ణయం స్పీకర్‌దేనని న్యాయస్థానాలు తమ పరిధిపై గిరిగీసుకోవడం జరుగుతోంది. స్పీకర్‌కూడా అధికార పక్షానికి చెందినవారే ఉండటంవల్ల అనేక సందర్భాల్లో నిర్ణయాలు ఏకపక్షంగా కూడా కనిపిస్తుంటాయి. ప్రజాప్రతినిధులు తమ పార్టీకి రాజీనామా చేయకుండా వేరొక పార్టీకి మద్దతు ఇవ్వడం లేదా చేరడం జరుగుతోంది. ఇలాంటి సందర్భాల్లో ప్రిసైడింగ్ ఆఫీసర్ పాత్ర ఎంతో కీలకంగా మారుతుంది. ఎవరైనా శాసనసభ, శాసనమండలికి రాజీనామా చేసినపుడు సదరు సభ్యుడు స్వచ్ఛందంగా చేశారా? లేక బలవంతంగా చేశారా అని విచారించే అధికారం స్పీకర్‌కు ఉంటుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసినపుడు వాటిని తిరస్కరించిన సందర్భం కూడా మనం చూడలేకపోలేదు. కొన్నింటిని చాలాకాలం పెండింగ్‌లో ఉంచారు. ఒక సభ్యుడు పార్టీ మారితే అది ఫిరాయింపు కిందకు వస్తుంది, అదే ఒక పార్టీ నుండి మూడో వంతు మంది మరో పార్టీలోకి మారితే అది ఫిరాయింపు కిందకు రాదని కూడా రాజ్యాంగం క్లాజు చెబుతోంది. ఇటువంటి లొసుగులను ఎప్పటికపుడు పార్టీలు సమయానుకూలంగా వాడుకుంటున్నాయి. ఫిరాయింపులతో లాభపడుతున్నాయి. ఫిరాయింపులు అధికార పార్టీకి మోదం అయితే విపక్షాలకు ఖేదంగా మారాయి. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఫిరాయింపులపై నిపుణుల అభిప్రాయాలే ఈ వారం ఫోకస్.