ఫోకస్

విద్యాలయాలా..రాజకీయ కేంద్రాలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశ ఆర్థిక, పారిశ్రామిక , సామాజిక అభివృద్ధికి బాటలు వేసేది విశ్వవిద్యాలయాలే. ఆ మాటకు వస్తే ఆధునిక యుగ ఆవిష్కరణలో యూనివర్శిటీలదే కీలకపాత్ర, కాని ప్రభుత్వాలు మాత్రం ఆదినుండి విశ్వవిద్యాలయాలను అన్ని విధాలా నిర్లక్ష్యం చేస్తున్నాయి. నిధుల కేటాయింపులోనూ, సిబ్బంది భర్తీలోనూ, విద్యార్థుల సౌకర్యాలను పెంచడంలోనూ, ప్రమాణాలను పాటించేందుకు అవసరమైన నిబంధనలను అమలుచేయడంలోనూ, బోధనా సిబ్బంది, బోధనేతర సిబ్బంది సౌకర్యాలను కల్పించడంలోనూ అటు కేంద్రం ఇటు రాష్ట్రాలు బాధ్యత తమది కాదంటే తమది కాదన్నట్టు వ్యవహరిస్తున్నాయి. మరోమాటగా చెప్పాలంటే యూనివర్శిటీలకు పెట్టే ఖర్చును దండగమారి వ్యవహారంగానే భావిస్తున్నాయ. ఓటు బ్యాంకుపై దృష్టి సారించేంతగా ఏ ప్రభుత్వమూ విద్యారంగంపై దృష్టిపెట్టకపోవడానికి కారణం దానినో వ్యయంగానే చూడటం. దేశంలో 740 వరకూ యూనివర్శిటీలు ఉన్నాయి. వాటిలో 46 సెంట్రల్ యూనివర్శిటీలు, 342 రాష్ట్ర విశ్వవిద్యాలయాలు, 125 డీమ్డ్ వర్శిటీలు, మరో 227 ప్రైవేటు యూనివర్శిటీలున్నాయి. అత్యధికంగా యూనివర్శిటీలున్న రాష్ట్రం రాజస్థాన్. అక్కడ మొత్తం 71 వర్శిటీలు ఉండగా అందులో 41 ప్రైవేటు యూనివర్శిటీలే. తమిళనాడులో అత్యధికంగా 28 డీమ్డ్ వర్శిటీలు ఉన్నాయి. ఆంధ్రాలో అన్నీ కలిపి 26 యూనివర్శిటీలు ఉండగా, తెలంగాణలో అన్నీ కలిపి 20 యూనివర్శిటీలు ఉన్నాయి. గుజరాత్‌లో 26, బెంగాల్‌లో 25, యుపిలో 24 వరకూ యూనివర్శిటీలు ఉన్నాయి. అయితే అంతర్జాతీయ ప్రమాణాలతో పోటీ పడాల్సిన ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు విద్యార్థి ఉద్యమాలతో, సంఘర్షణలతో కుల-మత వివాదాలతో కునారిల్లిపోతున్నాయి. సిబ్బంది, విద్యార్థులు నిట్టనిలువుగా రెండు వర్గాలుగా విడిపోవడంతో విశ్వవిద్యాలయాలకు వివాదాల చెద పడుతోంది. వాటి పరిష్కారానికి పాలకులు చేస్తున్న ప్రయత్నాలు ఎలాంటి ఫలితాలను ఇవ్వడం లేదు సరికదా అవి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, న్యాయవ్యవస్థలకు సైతం ఇబ్బందికరంగా తయారయ్యాయి. నిధుల కొరత అనేది ఒక అంశం అయితే యూనివర్శిటీల్లో అనునిత్యం పెరిగిపోతున్న వివాదాలు, అనుమానాలు, కొట్లాటలు మరో ప్రధాన అంశంగా మారింది. ఈ క్రమంలో దేశంలోని రాజకీయ పార్టీలు సైతం ఉన్నత విద్యాసంస్థలు తమకు కేంద్రాలుగా ఎలా పనిచేస్తాయో అనే కుత్సిత వైఖరి కారణంగా ఏదో ఒక పక్షానికి బాసటగా నిలవడంతో వ్యవహారం మరింత దిగజారిపోతోంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలోనూ, కొద్ది రోజుల క్రితం ఇంగ్లీషు, ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్శిటీలోనూ, అంతకుముందు ఉస్మానియా వర్శిటీ, తాజాగా ఢిల్లీలోని జెఎన్‌యులోనూ, ఇతర విశ్వవిద్యాలయాల్లో వివాదాలు అన్నీ ఒక సారూప్యానే్న ప్రదర్శిస్తున్నాయి. రాజకీయ పార్టీలన్నీ ఈ తరుణంలో సమీక్షించుకోవల్సిన సమయం ఆసన్నమైంది. కుల మతాల ప్రాతిపదికగా స్పందిస్తూ పోవడం వల్ల ఇతర వర్గాలు సహజంగానే దూరం అయిపోతున్నాయి. పరమత సహనం, అన్యకుల సహనం నేర్పిన ఈ దేశమే ఇపుడు కులాల కుంపట్లలో చిక్కుకుని మగ్గిపోతున్నది. హెచ్‌సియులో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి రోహిత్ దళితుడా కాదా అనే అంశంపై దేశవ్యాప్తంగా ఒక రకమైన చర్చ జరుగుతోందంటే దీనికి కారణం రాజకీయ పార్టీలే. అన్ని విశ్వవిద్యాలయాల్లో పిహెచ్‌డి అడ్మిషన్లు, మార్కుల కేటాయింపు, ఇతర అన్ని విషయాల్లో కులాల కుంపట్లు ప్రాతిపదిక అవుతున్నాయనేది నిర్వివాదాంశం. విద్యార్థులందర్నీ సమదృష్టితో చూడాల్సిన అధ్యాపకులు కులాలవారీగా చీలిపోయి విద్యార్థులందర్నీ మా వాళ్లు, మీ వాళ్లు అంటూ విభజించడంతో రోజురోజుకూ పరిస్థితులు విషమిస్తున్నాయి. దీనికి మూలం ఎక్కడుందీ అంటే అసలు విశ్వవిద్యాలయాల్లో నియామకాల నుండే మొదలవుతోంది. విసిల నియామకాలు అర్హతల ఆధారంగా కాకుండా ప్రాపకాల ఆధారంగా నియామకాలు జరుగుతుండటం వల్లే ఈ దుస్థితి ఏర్పడుతోంది. స్వేచ్ఛకు నిలయాలైన యూనివర్శిటీల్లో రాజకీయ పరమైన అంశాలపై హోరాహోరీ చర్చలు జరుగుతున్నాయి. రాజకీయాలపై ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి. అంతమాత్రాన తమ అభిప్రాయాలతో విభేదించే వారిని శత్రువులుగా పరిగణించే దుష్ట సంస్కృతిని ఇపుడే చూస్తున్నాం. ఈ కారణంగానే చిన్న చిన్న కారణాలతో మొదలవుతున్న వివాదాలు చివరికి విద్యార్థుల ఆత్మహత్యలు, అరెస్టుల వరకూ దారితీస్తున్నాయి. దాంతో వర్శిటీల పట్ల అందరికీ ఉన్న నమ్మకం సడలుతోంది. తమ పిల్లలను వర్శిటీలకు పంపించాలంటే కూడా భయపడే పరిస్థితి వస్తోంది. యూనివర్శిటీల్లో తాజా పరిస్థితులపై కొంతమంది ప్రముఖుల అభిప్రాయాలే ఈ వారం ఫోకస్.