ఫోకస్

సంప్రదాయాల జోలికి రావద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవాలయాలు ఆగమశాస్త్రాల ప్రకారం, అనూచాన సాంప్రదాయం ఆచారాల ప్రచారం నడుస్తాయి. ఆలయ సాంప్రదాయాలలో ఆచారాల్లో ప్రభుత్వానికి నామమాత్ర ప్రమేయం ఉంటుంది. భారత రాజ్యాంగం ప్రకారం మత స్వేచ్ఛకు ప్రాథమిక హక్కులలో స్థానం కల్పించారు. భారత రాజ్యాంగ చట్టంలోని 26, 27, 28 అధికరణలు మతస్వేచ్చకు హక్కును కల్పిస్తున్నాయి. ప్రత్యేకించి ఆర్టికల్ 26 మత సంస్థలను స్వేచ్ఛగా నిర్వహించుకునే హక్కును ఆయా మతశాఖలకు కల్పిస్తూ జరిగిన రాజ్యాంగం ఏర్పాటు, దానికితోడు 1976లో భారత రాజ్యాంగ చట్ట సవరణ 42 ప్రకారం రాజ్యాంగ పీఠికనే అనుసరించి లౌకిక అనే ఆదర్శాన్ని ఏర్పాటు చేశారు. భారత ప్రభుత్వానికి మతాతీతంగా వ్యవహరించే నిబంధన విధించారు. కేరళ రాష్ట్రంలో స్వామి అయ్యప్ప దేవాలయం పూర్తిగా హిందూ దేవాలయం. దాని ఆచార సాంప్రదాయాలతో ప్రభుత్వాలకు, కోర్టులకు ప్రమేయం ఉండరాదు. జాతా శౌచం (పురుడు వల్ల అశౌచం), మృతా శౌచం (మృతి వల్ల అశౌచం), స్ర్తిలకు రుతుస్రావ సమయంలో పాటించే అశౌచం అనేవి దేవాలయ సాంప్రదాయ ఆచారాల్లో ఏనాటినుంచో పాటిస్తున్న నియమం. అలాగే కేరళ రాష్ట్రంలోని శబరిమల క్షేత్రంలో కఠోరమైన నిష్టపాటించే సాంప్రదాయం ఉంది. దీక్షాకాలంలో బ్రహ్మచర్యం పాటించడంతోపాటు అనేక కఠిన నియమాలను పాటిస్తారు. రుతుస్రావ ప్రాయంలో ఉన్న మహిళలకు ప్రవేశం నిషిద్ధం. ఎందుచేతనంటే అనారోగ్యం చేతకాని లేక హోర్మోనుల హెచ్చుతగ్గుల వల్ల గాని స్ర్తిలకు రుతుస్రావం ఎప్పుడైనా కూడా రావడం కద్దు. తద్వారా ఆలయ పవిత్రత దెబ్బతింటుందనే ఉద్దేశ్యంతో ఏనాటి నుంచో శబరిమలైలో ఆ నిబంధన ఉంది. రుతుస్రావ ప్రాయం దాటిపోయిన మహిళలు, రుతుస్రావం కాని బాలికలు స్వామిని దర్శించుకోవడానికి ఎటువంటి ఆంక్షలులేవు. కాబట్టి దీనిని స్ర్తిలపట్ల వివక్షగా రాజ్యాంగ హక్కుల దృక్కోణం నుంచి చూడడం సమంజసం కాదు. కాబట్టి శబరిమల ఆలయంలోగల ఆచారాలను రాజ్యాంగ హక్కుల దృక్కోణంలో చూసి రాద్దాంతం చేయడం ధర్మ సమ్మతం కాదు. రాజ్యాంగం ఎంత గొప్పదైనా ఆచార సాంప్రదాయాలను గౌరవించడం మతవిశ్వాసాలలో జోక్యం తగ్గించుకోవడం సమాజశ్రేయస్సు రీత్యా మంచిది. భారతదేశంలో ముస్లిం సాంప్రదాయాల్లో మసీదులోకి మహిళలను అనుమతించరు. అది వారి మత సాంప్రదాయం. దానిలో జోక్యం చేసుకుని మసీదులోకి స్ర్తిలను ప్రవేశపెట్టే సాహసం ప్రభుత్వాలు, కోర్టులు చేయగలవా? అలాంటి ప్రయత్నం ఏ వ్యక్తులు, ప్రభుత్వాలు, కోర్టులు చేసినప్పటికీ మరుక్షణం దేశం అల్లకల్లోలంగా మారుతుంది. అందుచేత మతస్వేచ్చను గౌరవించడం, సాధ్యమైనంత మేర మత సంస్థల సాంప్రదాయాల జోలికి వెళ్లకుండా ఉండడం మంచిది. సాంప్రదాయాలను గౌరవించాలి. అప్పుడే సమాజం శాంతి సామరస్యాలతో ఉంటుంది. లేకుండా అంతా అశాంతే.

- అగ్నిహోత్రం ఆత్రేయబాబు, ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ అర్చక సమాఖ్య