ఫోకస్

విద్య ప్రజలందరికీ అందాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విద్యను కొంత మంది వ్యాపారం చేశారు. విద్యా రంగం మొత్తాన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. విద్యపై ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. అయితే దీన్ని ప్రభుత్వం ఖర్చుగా భావించడం లేదు. మానవ వనరుల అభివృద్ధికి పెట్టుబడిగా భావిస్తోంది. అలాంటప్పుడు విద్యార్థులకు సరైన విద్య అందాలని ప్రభుత్వం కోరుకోవడంలో తప్పు లేదు. ఉద్యమ కాలం నుంచి కూడా టిఆర్‌ఎస్ విద్యారంగంపై ప్రత్యేకంగా దృష్టిసారించింది. చదువు ద్వారానే సమాజం అభివృద్ధి చెందుతుంది. వ్యక్తి ఉన్నత స్థాయికి ఎదగడానికి విద్య ఉపకరిస్తుంది. ఉద్యమ కాలంలో విద్యారంగంపై టిఆర్‌ఎస్ నాయకత్వం ఎంతో లోతుగా ఆలోచించింది. ఈ ఆలోచనల నుంచి పుట్టిందే కేజీ నుంచి పీజి వరకు ఉచిత విద్య. కొన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో ఆ దేశ ప్రధానమంత్రికి, సామాన్యుడి పిల్లలకు ఒకే రకమైన విద్య లభిస్తుంది. తెలంగాణలో సైతం కేజీ నుంచి పీజీ వరకు ఉచిత ఆంగ్ల విద్య అలానే ప్రజలందరికీ సమానంగా అందాలనేదే ముఖ్యమంత్రి కెసిఆర్ లక్ష్యం. ఉమ్మడి రాష్ట్రంలో 240 గురుకులాలు ఉంటే ఈ ఒక్క విద్యా సంవత్సరమే తెలంగాణలో 250 గురుకులాలు ప్రారంభిస్తున్నారు. దీనివల్ల ఎంతోమంది సామాన్య కుటుంబాలకు చక్కని విద్య లభిస్తుంది.
పలు ప్రైవేటు విద్యా సంస్థల్లో ఇష్టానుసారం ఫీజులు వసూలు చేస్తున్నారు. బోధనా సిబ్బంది, కనీస సదుపాయాలు లేని ఇంజనీరింగ్ కాలేజీలు ఎన్నో ఉన్నాయి. వీటిలో తనిఖీలు నిర్వహించి సౌకర్యాలు లేని కాలేజీలపై చర్య తీసుకోవాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. విద్యా రంగాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయాలనే నిర్ణయంలో భాగంగానే ప్రభుత్వం ఇలా చేస్తోంది. ప్రజల బాగు కోరి, మన పిల్లలకు మంచి చదువు లభించాలనే మంచి ఉద్దేశంతో ప్రభుత్వం చేసే ఈ తనిఖీలకు మద్దతు పలకాల్సిందిపోయి ప్రతిపక్ష కాంగ్రెస్ అక్రమాలకు పాల్పడే వారికి మద్దతు ఇవ్వడం మంచిది కాదు. ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు చేస్తున్నది, ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లిస్తున్నది పిల్లల భవిష్యత్తు కోసమే తప్ప కాలేజీల వాళ్లకోసం కాదు. ప్రభుత్వం ఎవరి ఒత్తిడికి తలొగ్గదు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందాల్సిందే. దానికోసం అవసరమైన చర్యలు తీసుకుంటుంది. తాత్కాలికంగా ఇబ్బంది అనిపించవచ్చు కానీ ఇలాంటి తనిఖీలు కచ్చితంగా తెలంగాణలో విద్యా రంగాన్ని మంచి దారిలో పెడతాయి. పిల్లలకు చక్కని చదువు లభిస్తుంది.
- కర్నె ప్రభాకర్
ఎమ్మెల్సీ టిఆర్‌ఎస్

ప్రత్యేక చట్టం తేవాలి

తెలుగు రాష్ట్రాల్లో విజృంభిస్తున్న ప్రైవేటు విద్యాసంస్థలను కట్టడి చేసేందుకు ప్రత్యేక ఫీజుల చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ విద్యను పూర్తిగా నిర్వీర్యం చేస్తూ తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేటు విద్యను పెద్దఎత్తున ప్రభుత్వమే ప్రోత్సహిస్తోంది. దేశంలో ఆర్థిక సంస్కరణలు ఎప్పుడైతే వేగం పుంజుకున్నాయో, అప్పటినుంచి ప్రైవేటు విద్యారంగం వేళ్లూనుకుంటూ వచ్చింది. ప్రైవేటు విద్యను ప్రోత్సహిస్తూ ప్రభుత్వ విద్యను అసలు పట్టించుకోలేదు. దీంతో విద్యా వ్యవస్థ మొత్తం గాడి తప్పింది. ప్రైవేటు విద్యా సంస్థలకు ఉన్న నిబంధనల్లో ఏ ఒక్కటీ అమలు కావడం లేదు. ఫీజుల నియంత్రణకు 42 జివో ఉంటే దానిని ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. 2004లో నవీన్ మిట్టల్ నాయకత్వంలో చేసిన సిఫార్సులను పట్టించుకున్న పాపాన పోలేదు. ఫీజులు ఏయే ప్రాంతాల్లో ఏయే స్థాయిలో ఉండాలన్న అంశంపై చాలా స్పష్టంగా వివరాలు అందించినా ఆచరించలేదు. ఇప్పుడు ప్రైవేటు విద్యాసంస్థలు ప్రభుత్వాన్ని శాసించే స్థాయికి చేరాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏ ఇతర రాష్ట్రాల్లో లేనన్ని ప్రైవేటు స్కూళ్లు పుట్టుకు వచ్చాయి. ప్రభుత్వ విద్యను ప్రోత్సహించడం మానివేసి, వౌళిక సదుపాయాల కల్పన అనేది మర్చిపోయిన ప్రభుత్వం ప్రైవేటు విద్యకు మాత్రం పెద్దపీట వేస్తూ వచ్చారు. తమ పాఠశాలలను తనిఖీ చేస్తే తడాఖా చూపుతామంటున్న ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల పరిస్థితి ఏమిటో చాలా స్పష్టంగా తెలుస్తోంది. తమపై వేధింపులు ఆపకపోతే టెట్ పరీక్షను నిర్వహించడం మానేస్తామని ప్రభుత్వానికే చెబుతున్నారంటే, వాళ్ల తెగింపు ఏ స్థాయికి చేరిందో తెలుస్తుంది. పాఠశాలల పరిస్థితి ఇలా ఉంటే కార్పొరేట్ జూనియర్ కాలేజీల ధాటికి ప్రభుత్వ జూనియర్ కళాశాలలు నిలబడ్డం లేదు. అదీ కాకుండా కిందిస్థాయి నుంచి కళాశాలల వరకు ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ కాకుండా ఉండడం వల్ల ప్రభుత్వ విద్యకు అన్నీ ఆటంకాలు ఎదురవుతున్నాయి. ప్రభుత్వ ఆలోచన ధోరణి మారితే తప్ప ప్రైవేటు విద్యకు చెక్ పెట్టి, ప్రభుత్వ విద్యను బలోపేతం చేయలేము. దీనికితోడు విద్య రంగానికి కేటాయించే బడ్జెట్ కూడా అంతంతమాత్రంగా ఉండడం వల్ల ఆశించిన స్థాయిలో ఫలితం ఉండడం లేదు. ఉపాధ్యాయులు లేక, వౌళిక సదుపాయాలు లేక చాలామంది తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపడం లేదు. అంతేకాకుండా ప్రభుత్వ ఉపాధ్యాయులే తమ పిల్లలను ప్రైవేటు స్కూళ్లకు పంపుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో స్పష్టమవుతోంది. ప్రైవేటు విద్యను ప్రోత్సహించడం ఇరు రాష్ట్రాల్లో తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది.
- బి.సాంబశివ
ఎస్‌ఎఫ్‌ఐ, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి

ప్రభుత్వం స్పందించాలి

ప్రస్తుతం పాఠశాల, ఇంటర్మీడియట్ స్థాయిలలో విద్యావ్యవస్థలో వచ్చిన మార్పులు విద్యార్థులను మానసికంగా కృంగదీసే విధంగా ఉన్నాయి. గతంలో ప్రభుత్వ విద్యాసంస్థలతోపాటు ఛారిటబుల్, ఫిలాంత్రపి ఆలోచనలు ఉన్నవారు కూడా విద్యాసంస్థలను నడిపేవారు. విద్యతోపాటు విద్యార్థుల మానసికోల్లాసానికి ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు తదితర అంశాలకు కూడా ప్రాధాన్యత ఇస్తూ, అన్ని కోణాల్లో ఎదిగేలా కరికులం ఉండేది. ప్రస్తుతం ప్రైవేట్ రంగం.. మరీ ముఖ్యంగా కార్పొరేట్ వ్యవస్థ విద్యారంగాన్ని కబళించివేసింది. కార్పొరేట్ కబంధ హస్తాల్లో విద్యావ్యవస్థ నలుగుతోంది. టెక్నోస్కూల్స్ తదితర పేర్లతో విద్యార్థుల తల్లిదండ్రులనుండి భారీ ఫీజులు వసూలు చేస్తూ దోపిడీ చేస్తున్నారు. ఎసి పాఠశాలలు, ఎసి కళాశాలలు రావడంతో అటువైపు చాలామంది పిల్లల తల్లిదండ్రులు ఆకర్షితులవుతున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను మంచి విద్య పేరుతో సుదూర ప్రాంతాల్లో ఉండే పాఠశాలలు, ఇంటర్ కాలేజీలకు పంపిస్తున్నారు. గంట ఆపైగా సమయం ప్రయాణానికే పడుతోంది. దాంతో విద్యార్థులు అలసిపోతున్నారు. అలసిపోతున్న పిల్లలు ఎసి క్లాసుల్లోకి వెళ్లగానే నిద్రపోయే పరిస్థితి ఏర్పడుతోంది.
పాఠశాల, ఇంటర్ స్థాయిలో ఉదయం నుండి సాయంత్రం వరకు దాదాపు 12 గంటలు ఆ పైగా విద్యార్థులను తరగతి గదుల్లో బంధిస్తున్నారు. మిగతా సమయం ప్రయాణానికి, నిద్రకు సరిపోతోంది. శారీరక, మానసిక ఎదుగుదలకు అవకాశం ఉండటం లేదు. చాలా విద్యాసంస్థలకు ప్లేగ్రౌండ్స్ ఉండటం లేదు. పైగా విద్యార్థులు ఆటపాటలకు అవకాశం లేకుండా ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు దూరం చేస్తున్నాయి. పాఠశాల స్థాయి నుండే మెడిసిన్, ఇంజనీరింగ్ తరగతులను దృష్టిలో ఉంచుకుని విద్యార్థులను ప్రత్యేక కోచింగ్ పేరుతో ఇక్కట్లకు గురిచేస్తున్నారు. ఈ కారణాల వల్ల విద్యార్థులు సమాజానికి అనుణంగా ఎదిగే పరిస్థితి ఉండటం లేదు.
ఇలా ఉండగా ఎల్‌కెజి, యుకెజి స్థాయిలలోనే లక్ష రూపాయలు, రెండులక్షల రూపాయల ఫీజులను కార్పోరేట్ సంస్థలు వసూలు చేస్తున్నాయి. పాఠశాల, ఇంటర్ స్థాయిలలో ఫీజులు ఠారెత్తిస్తున్నాయి. పేదలు, మధ్యతరగతి వారికి ఈ ఫీజులు అందుబాటులో ఉండటం లేదు. దాంతో కార్పోరేట్-ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థుల మధ్య అగాథం ఏర్పడుతోంది. ఇంటర్‌లో బైపిసి, ఎంపిసి విద్యార్థులకు ప్రాక్టికల్స్ సరిగ్గా ఉండటం లేదు. దాంతో పుస్తకాల పురుగుల్లా విద్యార్థులు తయారవుతున్నారు. ఈ పరిస్థితిలో ప్రభుత్వం రంగంలోకి దిగి ప్రైవేట్ సంస్థల యాజమాన్యాల చర్యలను అదుపు చేయాల్సిన అవసరం ఉంది. విజిలెన్స్ దాడులవల్ల ఫలితం ఉండదు. తల్లిదండ్రుల సహకారంతో, సమాజంలో విస్తృతంగా చర్చించి, భవిష్యత్తు తరాల విద్యార్థులను కాపాడేందుకు ప్రభుత్వ-ప్రైవేట్ రంగాల్లో అమలయ్యేలా సమగ్ర విద్యావిధానాన్ని అమల్లోకి తీసుకురావాలి. లేనిపక్షంలో ప్రజలకు ప్రభుత్వంపై విశ్వాసం పోతుంది.
- ప్రొఫెసర్ బి. సత్యనారాయణ
చైర్మన్, టిఎస్ ఫెడరేషన్ ఆఫ్
యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్స్

ప్రక్షాళన అవసరం

ప్రాథమిక విద్య నిర్లక్ష్యానికి గురవుతోంది. సాంకేతిక, ఉన్నత విద్య వ్యాపారంగా మారింది. దీంతో సామాన్యులకు విద్య అందని ద్రాక్షలా మారింది. తెలుగు రాష్ట్రాలు చేపట్టిన ఉచిత విద్య, నిర్బంధ విద్య ప్రకటనలకే పరిమితమయ్యాయి. క్షేత్రస్థాయి నుంచే విద్యార్థుల్లో నైపుణ్యతను పెంపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పాలకుల అలసత్వం విద్యపట్ల వహిస్తున్న నిర్లక్ష్య వైఖరి ప్రైవేటు విద్యాసంస్థలను ప్రోత్సహిస్తోంది. ప్రాథమిక విద్యకు ఇతోధికంగా నిధులు కేటాయిస్తే విద్యార్థుల్లో నైపుణ్యత పెరుగుతుంది. ఉన్నత విద్యాభ్యాసానికి దోహదపడుతుంది. అయితే ప్రభుత్వాలు మాత్రం ప్రాథమిక విద్యకు తగిన నిధులు కేటాయించడం లేదు. ఎందుకంటే విద్యపై పెట్టిన పెట్టుబడి రిఫండబుల్ కాదు కాబట్టి. అదేవిధంగా విద్యాబోధనకు సరైన సిబ్బంది లేకపోవడమూ ఒక కారణమే. ఉపాధ్యాయులను ప్రభుత్వ పథకాలకు వినియోగించుకోవడం, ప్రాథమిక విద్యే కదా.. అని ఒక పాఠశాలకు ఒక ఉపాధ్యాయుణ్ని కేటాయించి రెండు, మూడు తరగతులకు బోధించాలని నిబంధనలు పెట్టడంతో క్షేత్రస్థాయిలో విద్యార్థులకు సరైన విద్యాభ్యాసం జరగడం లేదు. విద్యావ్యవస్థలో మార్పులు జరగాలి, సిబ్బంది ప్రక్షాళన జరగాలి. ఇక సాంకేతిక, ఉన్నత విద్య ప్రభుత్వం కల్పించిన ఫీజు రియింబర్స్‌మెంట్‌తో విద్యార్థులు స్కిల్‌ను డెవలప్ చేసుకోలేక సోమరులుగా మారుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో 90 శాతం విద్యార్థులు ఉన్నత చదువులు చదివితే, పొరుగు రాష్ట్రాల్లో 70శాతం విద్యార్థులు చదువుతారు. కానీ తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థుల్లో స్కిల్ డెవలప్‌మెంట్ కనిపించదు. ప్రభుత్వం కల్పించే రాయితీతోనే చదువుకుంటున్నానని విద్యార్థుల్లో ధీమా తమ నైపుణ్యతపై ఉండదు. అందుకే పొరుగు రాష్ట్రాల్లో తక్కువ శాతం ఉత్తీర్ణత నమోదైనా వారిలో స్కిల్ డెవలప్‌మెంట్ ఉంటుంది. సాంకేతిక విద్యలో ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోంది. ఒక విద్యార్థి ఇంజనీర్ చదువుతుంటే మరో విద్యార్థి కూడా ఇంజనీర్ వైపే దృష్టి పెడతారు. ఇలా ఎంతమంది ఇంజనీర్లవుతారు.. అందరూ ఇంజనీర్లే అయతే, మరి ఇతరత్రా సాంకేతిక విద్యలు ఎవరు అభ్యసించాలి. అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్న తరుణమిది. కేవలం ఫీజు రియింబర్స్‌మెంట్ కోసమే చదువుతున్నామని కొందరనుకుంటుంటే.. మరికొందరికి అసలు ఉన్నత విద్య అందుబాటులో లేకుండా పోతోందని విషయాన్ని గుర్తించాలి. అందుకు ప్రభుత్వం విద్యార్థుల్లో మెరిట్, స్కిల్స్‌ను ప్రేరేపించే దిశగా పథకాలు రచించాలి. ప్రాథమిక విద్య నుంచే దేశానికి అవసరమయ్యే మేథోసంపత్తిని పోగు చేసుకోవాలి. ఫీజు లేదని చదువుకునే కొందరైతే, ఫీజు చెల్లించలేని దుస్థితిలో మరికొందరున్నారు. కాబట్టి ప్రభుత్వాలు విద్యావిధానాలను మార్చాలి. దేశవ్యాప్తంగా ఒకే విద్యావిధానం, ఉద్యోగ బాధ్యత ప్రభుత్వాలు తీసుకోవాలి. అప్పుడే విద్యావ్యవస్థ బాగుపడుతుంది. విద్య అందరికీ అందుబాటులోకి వస్తుంది. జీవన విధానం బోధ పడుతుంది. దేశానికి ఎలాంటి భావితరం అవసరమో గుర్తిస్తోంది.
-జగన్‌మోహన్ మెట్ల
లోక్‌సత్తా తెలంగాణ
రాష్ట్ర అధికార ప్రతినిధి