ఫోకస్

ప్రజల ఆకాంక్ష నెరవేరేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై జెఎసి చైర్మన్ హోదాలో ప్రొఫెసర్ కోదండరామ్ చేసిన వ్యాఖ్యానాలతో పెద్ద దుమారమే రేగింది. ఒక్కసారిగా తెలంగాణ మంత్రులు, అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు, టిఆర్‌ఎస్ అభిమానులు కోదండరామ్‌పై దుమ్మెత్తి పోశారు. తెలంగాణ ప్రజల బతుకుల్లో మార్పునకు సర్కార్ చేసింది ఏమీ లేదని కోదండరామ్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్రంలో కలకలం సృష్టించాయి. ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ తెలుగుదేశంపై విపక్ష నేత డాక్టర్ జగన్మోహన్‌రెడ్డి నిరంతరం నిప్పులు చెరుగుతున్నా కోదండరామ్ వ్యాఖ్యలు మాత్రం రాజకీయ దావానలానే్న సృష్టించింది. ప్రజాసంక్షేమమే తమ అజెండా అని చెప్పి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఏమైనా చేస్తుందా అని రెండేళ్లుగా ఎదురుచూశామని, ఇక తామే జనం బాగుకోసం గట్టిగా నిలబడి పోరాటం చేస్తామని కోదండరామ్ అన్నారు. దీనికి టిఆర్‌ఎస్ గట్టిగానే స్పందించింది. ఎన్నికల్లో ప్రజలు అప్రతిహతంగా ఇస్తున్న తీర్పు సంగతి ఏమిటని టిఆర్‌ఎస్ నిలదీసింది. ప్రాజెక్టుల భూ సేకరణ విషయంలో సర్కార్ వైఖరిని కోదండరామ్ తప్పుపడుతూ గొర్రెల మంద మీద తోడేళ్లు పడ్డట్టు గ్రామాల మీద పడతారా అంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. మల్లన్న సాగర్ ముంపు బాధితులకు సంఘీభావం తెలిపారు. తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత జెఎసి ఇంకెక్కడుందో కోదండరామ్ చెప్పాలని గులాబీ నేతలు నిలదీశారు. పరిపాలన చేయడం అంటే పాఠాలు చెప్పడం కాదని, తెలంగాణ ప్రభుత్వం ఎన్నో ప్రజా సమస్యలను పరిష్కరించిందని చెప్పారు. కోదండరామ్ గొంతు ఆయనది కాదని, ఎవరో ఆడమన్నట్టు ఆయన ఆడుతున్నారని టిఆర్‌ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యేలు మొదలు మంత్రుల వరకూ నేతలు అంతా కోదండరామ్‌పై తీవ్రస్థాయిలోనే ధ్వజమెత్తారు. ప్రజల ఉద్యమ ఆకాంక్షలు నెరవేరడం లేదని, కులవృత్తుల బతుకుతెరువు విస్తృతం కావాలని కోదండరామ్ అన్నారు. ఆ దిశగా ప్రభుత్వం ముందడుగు వెయ్యడం లేదని, గ్రామాల్లో ఉపాధిని విస్మరించారని, ప్రజలు ఇంకా గట్టిగా ఒత్తిడి తేవాలని హైదరాబాద్‌కే అభివృద్ధి పరిమితం కాకుండా తెలంగాణ అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉందని అన్నారు. తెలంగాణ ప్రజలే కేంద్రంగా అభివృద్ధికి రూపకల్పన చేసుకోవాల్సి ఉందని, ఇది చాలా కీలకమని అన్నారు. తెలంగాణ ఆదాయంలో 13 శాతం గ్రామాలకు, 87 శాతం జిహెచ్‌ఎంసికి పోతోందని, ఈ పరిస్థితి మారాలని అన్నారు. గ్రామాలు, పట్టణాలు సమాన అవకాశాలకు కేంద్రాలుగా మారాలని కోదండరామ్ వాదిస్తున్నారు. వ్యవసాయం, కులవృత్తులు, గృహ, సూక్ష్మ పరిశ్రమలపై ఆధారపడిన వారి బతుకులు బాగుపడాలని, వాళ్ల ఆదాయం పెరగాలని, ఆ దిశగా ప్రభుత్వం పరిపాలన సాగించాలని కోదండరామ్ గట్టిగా వాదిస్తున్నారు. తెలంగాణలో ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలుచేసినా, ప్రజల జీవనోపాధి అవకాశాలు మాత్రం విస్తృత పడలేదు, తెలంగాణ పల్లెల్లో వ్యవసాయ రంగంలోని చిన్న రైతు పరిస్థితి, కల్లు గీత కార్మికులు, మత్స్య పరిశ్రమ, చేనేత, తోలు పరిశ్రమ, గృహ పరిశ్రమలను నమ్ముకున్న వారి పరిస్థితి నేటికీ దుర్బరంగానే ఉందని, ఈ రంగాల్లో బతుకుతెరువు అవకాశాలు విస్తృతం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నించాలని కోదండరామ్ పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్ష మేరకు అభివృద్ధి పంథాలో మార్పు రావాలంటే ప్రజా సంఘాలుగా తాము కూడా కీలకపాత్రను పోషించాల్సి ఉందని, అయితే తాము అధికార పక్షంలోనో, ప్రతిపక్షంలోనో లేమని కోదండరామ్ చెబుతున్నారు. ప్రజల పక్షాన నిలుస్తామని, తమకు ఎలాంటి రాజకీయ ఆకాంక్ష లేదని, దురాశ లేదని, ప్రజల బాగుకోసం, వారి ఉపాధి అవకాశాలను చేతనైనంత మేర పెంచే విధానాల సాధన కోసం ప్రయత్నిస్తామని కోదండరామ్ చెప్పారు. అయితే కోదండరామ్ వ్యాఖ్యలపై తీవ్రమైన ప్రతిఘటనే ఎదురైంది. కోదండరామ్ ఒక విషపు నాగు అని, కుబుసం విడిచిన పాము అని కాంగ్రెస్ ఏజెంట్ అని టిఆర్‌ఎస్ ఎంపి బాల్క సుమన్ ఆరోపించారు. రెండేళ్లకే కోదండరామ్‌కు అంత అసహనం ఎందుకని ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. తన వ్యాఖ్యలతో నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలను కోదండరామ్‌రెడ్డి కించపరిచారని మంత్రి హరీశ్‌రావు పేర్కొంటే కోదండరామ్‌కు మతిభ్రమించిందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. అసలు కోదండరామ్‌ను జెఎసి చైర్మన్‌ను చేసింది కెసిఆర్ అనేది మరిచిపోతే ఎలా అని హరీశ్ ప్రశ్నించారు. అసలు ఈ వ్యాఖ్యల వెనుక ఉన్న కుట్ర ఏమిటో వెల్లడించాలని ఆర్ధిక మంత్రి ఈటల రాజేందర్ నిలదీశారు. కోదండరామ్ తన స్థాయిని తానే తగ్గించుకున్నారని జూపల్లి కృష్ణారావు, చౌకబారు రాజకీయాలను సహించేది లేదని తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రజలను తప్పుదారిపట్టించారని మరో మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, తమది చేతకాని ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వమని ఆరోగ్యమంత్రి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. ఈ మాటల యుద్ధం ఏ ప్రస్థానానికో... నిపుణుల అభిప్రాయాలే ఈ వారం ఫోకస్.