ఫోకస్

ఆర్థిక శక్తిగా భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత చేపట్టిన అతి పెద్ద పన్నుల సంస్కరణలకు ప్రతి రూపమే జిఎస్‌టి- అంటే వస్తు సేవల పన్ను విధానం. ఈ విధానంతో దేశం ఆర్థిక శక్తిగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. వివిధ రాష్ట్రాల్లో వస్తువులకు, సేవలకు వేర్వేరు రకాల పన్ను విధానాలు అమలులో ఉండటంతో దాని లెక్కల్లో గందరగోళం ఉండేది, తాజాగా గజిబిజి పన్నుల విధానానికి స్వస్తి పలుకుతూ ఏక రూప పన్నుల విధానం- జిఎస్‌టి బిల్లును పార్లమెంటు ఆమోదించింది. ఇది ప్రభుత్వాన్ని, వ్యాపార సంస్థలను, ప్రజలను విశేషంగా ప్రభావితం చేస్తుందని అంచనా వేస్తున్నారు. పదేళ్లుగా జిఎస్‌టి అమలుకు ప్రయత్నం జరుగుతున్నా, ఎట్టకేలకు నేడు ఫలించింది. ప్రస్తుతం కేంద్రం కొన్ని రకాల పన్నులు, రాష్ట్రాలు కొన్ని రకాల పన్నులను విధిస్తున్నాయి. దేశం అంతా వర్తించే పరోక్ష పన్ను విధానమే జిఎస్‌టి, దీనివల్ల పన్నుల విధింపునకు సంబంధించి ఒకే మార్కెట్ ఏర్పాటవుతుంది. ఒక వస్తువు లేదా ఒక సేవకు వివిధ దశల్లో జత కలిసే విలువ ఆధారంగా ఇన్‌పుట్ క్రెడిట్ (పన్ను మినహాయింపు) లభిస్తుంది. తుది వినియోగదారుడు తాను ఏ రిటైల్ వర్తకుడి నుండి వస్తువులు లేదా సేవలు తీసుకుంటున్నాడో ఆ వర్తకుడు చెల్లించే జిఎస్‌టిని భరిస్తే సరిపోతుంది. దీనివల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పన్ను వసూళ్ల ప్రక్రియ సులభతరం అవుతుంది. ఐదారు రకాల పన్నులకు బదులు ఒకే పన్ను వసూలు చేయవచ్చు. తద్వారా పన్నుల ఎగవేతను అరికట్టవచ్చు. పన్నుల భారం తగ్గుతుంది కనుక ఎగవేతలు కూడా తగ్గుతాయని అంచనా. దేశీయ వస్తువుల పన్నులు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది, మరోపక్క జిఎస్‌టి రిజిస్ట్రేషన్, పన్ను చెల్లింపు, రిఫండ్ కోరడం ఎంతో సులువవుతుంది. ఏదైనా ఒక వస్తువును దేశంలో ఎక్కడ కొన్నా ఒకే ధర ఉంటుంది. కేంద్రం, రాష్ట్రాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రెండు విభాగాలుగా జిఎస్‌టిని అమలుచేయబోతోంది.
ఇందులో సెంట్రల్ జిఎస్‌టి, స్టేట్ జిఎస్‌టి ఉంటాయి. కేంద్రం సెంట్రల్ జిఎస్‌టిని, రాష్ట్రాలు స్టేట్ జిఎస్‌టిని అమలుచేస్తాయి. సిజిఎస్‌టి, ఎస్‌జిఎస్‌టిల్లో ఎక్కడికక్కడే ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ వర్తిస్తాయి, అంతేగాక ఒకచోట లభించే ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ మరోచోటుకు బదలాయించే అవకాశం లేదు. ఈ మొత్తం వ్యవహారాలను పర్యవేక్షించేందుకు కేంద్రం గూడ్స్ అండ్ సర్వీసు టాక్స్ నెట్‌వర్కు సంస్థను ఏర్పాటు చేసింది. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు, పన్ను చెల్లింపుదారులు, ఇతర వినియోగదారుల సేవలకు ఈ సంస్థ దోహదం చేస్తుంది, అదే విధంగా వ్యాపారుల రిజిస్ట్రేషన్, ఆడిట్ మదింపు, అప్పీళ్లు తదితర అన్ని అవసరాలకు అనుకూలమైన ఒక పోర్టల్‌ను కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ప్రభుత్వంతోపాటు బ్యాంకులు, అకౌంటింగ్ సంస్థలు, ఆర్‌బిఐ తదితర సంస్థలు ఈ పోర్టల్‌తో అనుసంధానం అవుతాయి. వస్తువులు, సేవలపై లావాదేవీలు నమోదైన వెంటనే అక్కడే సెంట్రల్, స్టేట్ జిఎస్‌టిలను ఏకకాలంలో చెల్లించాల్సి ఉంటుంది. ఇపుడు ఒక వస్తువు విలువపై సెంట్రల్ ఎక్సైజ్ పన్ను విధించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్ వసూలుచేస్తున్నాయి. జిఎస్‌టి విధానంలో వస్తువు విలువ మీదే సెంట్రల్ జిఎస్‌టి, స్టేట్ జిఎస్‌టి విధిస్తారు. రెండు మూడు రాష్ట్రాల్లో జరిగే లావాదేవీలను సైతం సమీకృతంగా వసూలుచేస్తారు. ప్రస్తుతం దిగుమతులపై అదనపు ఎక్సైజ్ డ్యూటీ, ప్రత్యేక అదనపు డ్యూటీ ఉన్నాయి, జిఎస్‌టి అమలులోకి వస్తే ఆ పన్నులు ఉండవు, ఉభయ సభల్లో రాజ్యాంగ సవరణద్వారా జిఎస్‌టి బిల్లు ఆమోదం పొందింది. దేశంలోని 29 రాష్ట్రాల్లో కనీసం 15 రాష్ట్రాలు ఈ బిల్లును ఆమోదిస్తూ తీర్మానం చేయాలి, అపుడే జిఎస్‌టి దేశ వ్యాప్తంగా అమలులోకి వస్తుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుండి జిఎస్‌టి అమలుచేసే విధంగా కేంద్రం ఇప్పటికే రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీచేసింది. తదుపరి దశలో జిఎస్‌టి కౌన్సిల్ ఏర్పాటవుతుంది. ఇందులో కేంద్ర మంత్రులు, రాష్ట్రాల ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. జిఎస్‌టి రేటు ఎంత ఉండాలనేది ఈ కౌన్సిల్ నిర్ణయిస్తుంది. 18 శాతానికి మించకుండా చూడాలనేది అందరి అభిప్రాయంగా ఉంది. ఇంత జరిగిన తర్వాత కూడా రాష్ట్రాల్లో ఈ బిల్లుపై అనుమానాలు, అసంతృప్తి లేకపోలేదు. ఆంధ్రప్రదేశ్‌కు ఈ బిల్లువల్ల నష్టం వస్తుందని ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. అదే తరహాలో మరికొన్ని రాష్ట్రాలు స్పందించాయి. ఇంతకీ జిఎస్‌టి వల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం, ఈ ఏకీకృత పన్ను విధానం మంచిదేనా అనేదే ఈ వారం ఫోకస్.

రాష్ట్ర ప్రయోజనాలు
విస్మరించరాదు
వస్తు సేవాపన్ను విధానం అమలులో రాష్ట్ర ప్రయోజనాలను విస్మరించకుండా కేంద్రం వ్యవహరించాలి. మా పార్టీ వస్తు సేవా పన్నును దేశ ప్రయోజనాలకోసం ఆహ్వానించింది. కాని రాష్ట్రానికి నష్టం వచ్చే విధంగా ఉంటే మాత్రం ఈ అంశాన్ని అన్ని చట్టసభల్లో ప్రస్తావిస్తాం. ఇంచుమించు దేశంలో అన్ని రాజకీయ పార్టీలు సొంత అజెండాలను పక్కనపెట్టి వస్తు సేవా పన్ను విధానాన్ని సమర్థించాయి. వస్తు సేవా పన్ను విధానం పన్ను సంస్కరణల్లో కొత్త అజెండాను ఆవిష్కరించదని చెప్పవచ్చు. బహుళ పన్ను విధానాలను నిరోధించే అవకాశం ఏర్పడింది. పన్ను విధానాలను సరళీకృతం చేశారు. పోటీతత్వం పెరుగుతుంది. తయారీ రంగం పరిశ్రమలకు బహుళ పన్నుల విధానంవల్ల తల బొప్పికడుతోంది. కొత్త పన్ను విధానాల్లో సమూలంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇంతకాలం రాష్ట్రాలు, కేంద్రాలు ఎవరికి వారే పన్నులు ఇష్టం వచ్చినట్లు విధించడం వల్ల పరిశ్రమలు, వినియోగదారులు తీవ్ర ఇక్కట్లకు లోనయ్యేవారు. ఇప్పుడా పద్ధతి లేదు. కాని రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టే విధంగా కేంద్రం వ్యవహరించరాదు. అన్నాడిఎంకె పార్టీ వస్తు సేవాపన్ను విధానాన్ని వ్యతిరేకించింది. అలాగే కాంగ్రెస్ తదితర పార్టీలు కూడా కొన్ని సవరణలు ప్రతిపాదించి ఆమోదింపచేశాయి. త్వరలో రాజ్యాంగ సవరణ జరిగిన తర్వాత దేశ వ్యాప్తంగా వస్తు సేవా పన్ను అమలులోకి వస్తుంది. ఆంధ్ర రాష్ట్రానికి దాదాపు వస్తు సేవా పన్ను వల్ల తొలి సంవత్సరాల్లో రూ.4 వేల కోట్ల వరకు నష్టం వాటిల్లుతుందని, కేంద్రం ఆదుకోవాల్సి ఉంటుందని ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు చెబుతున్నారు. ఈ విషయమై రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిడిపి, కేంద్రం దృష్టికి తీసుకువచ్చిందా? బిజెపి ప్రభుత్వంలో కూడా టిడిపి భాగస్వామ్యంగా ఉంది కాబట్టి వస్తు సేవా పన్నువల్ల రాష్ట్రానికి ఎప్పటినుంచి లాభాలు వస్తాయి? నష్టాలు ఎన్ని సంవత్సరాలు కొనసాగుతాయి అనే అంశంపై టిడిపి ప్రభుత్వం ప్రజలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది.
- విశే్వశ్వరరెడ్డి, వైకాపా శాసనసభాపక్ష ఉపనేత
సమాఖ్య స్ఫూర్తికి భంగం

ప్రస్తుత భారత రాజ్యాంగం ప్రకారం వస్తుసేవలపై ‘కేంద్రీయ పన్ను’ విధించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి లేదు. కేంద్రీకృత వస్తు సేవల పన్ను విధించే అనుమతి లభించాలంటే రాజ్యాంగాన్ని సవరించాలి. అందుకుగాను, కేంద్ర ప్రభుత్వం జిఎస్‌టి చట్టం తీసుకొచ్చేందుకు అనుమతించే రాజ్యాంగ సవరణకు ఆగస్టు 3న రాజ్యసభ అంగీకరించింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు (విభజన ఫలితంగా) ఇవ్వవలసిన రెవెన్యూ లోటు రూ.16 వేల కోట్లు ఇవ్వడానికి నానా పేచీలు పెడుతున్నది. జిఎస్‌టి అమలులోకి వస్తే సంవత్సరానికి 4,500 కోట్ల ఆదాయం కోల్పోతామని మంత్రులు, నిపుణులు చెపుతున్నారు.
ఇటువంటి నేపథ్యంలో ఈ లోటును కేంద్ర ప్రభుత్వం పూడుస్తుందని ప్రకటించడం పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 1991లో నూతన ఆర్థిక విధానాలను అక్కున చేర్చుకోవడంతో ఏకీకృత పన్నుతో కూడి మార్కెట్ కావాలన్న వారి డిమాండ్ రెండింతలైంది. ఈ బిల్లుపై పార్లమెంటులో చర్చ సందర్భంగా సిపిఎం పలు అంశాలపై తన అభ్యంతరాలను లేవనెత్తింది కూడా. మొదటిది- రాష్ట్ర ప్రభుత్వాలను ఎన్నుకున్న ప్రజలకోసం సంక్షేమ కార్యక్రమాలను చేపట్టేందుకు వీలుగా పన్నుల ద్వారా ఆదాయాన్ని సమీకరించే హక్కులకు ఆటంకం ఏర్పడే ప్రమాదం ఉంది. ప్రజల చేత ఎన్నుకోబడిన రాష్ట్ర ప్రభుత్వాల హక్కులకు, రాజ్యాంగంలో పేర్కొన్న సమాఖ్య స్పూర్తికి భంగం కలుగుతుంది. రెండవది- జిఎస్‌టికి సంబంధించి పార్లమెంటు ఆమోదం పొందడానికి మూడు చట్టాలను చేయాల్సి వుంది. అవి వరుసగా 1. కేంద్ర జిఎస్‌టి (సిజిఎస్‌టి), 2. అంతరాష్ట్ర జిఎస్‌టి (ఐజిఎస్‌టి), 3. రాష్ట్ర జిఎస్‌టి (ఎస్‌జిఎస్‌టి), వీటిని కూడా రాష్ట్ర అసెంబ్లీలు ఆమోదించాల్సి వుంటుంది. ఈ మొత్తం ప్రక్రియలో జిఎస్‌టి రూపంలో జనసామాన్యంపైన మోయలేని భారాలను మోపకుండా అడ్డుకునేందుకు సిపిఎం ప్రయత్నిస్తోంది. జిఎస్‌టి అనేది పరోక్ష పన్ను విధానం. విధానపరంగా చూస్తే, పరోక్ష పన్నులన్నీ వస్తువునో, సేవలనో కొనుగోలు చేసినప్పుడు వినియోగదారుడిపై భారాలు వేసేవే. ప్రత్యక్ష పన్నుల ద్వారా ధనికుల నుండి పరోక్ష పన్నుల రూపేణా ఎప్పటికప్పుడు భారాలు మోపడం ద్వారా పేదల నుండి ఆదాయాన్ని సమీకరిస్తుంటాయి ప్రభుత్వాలు. ఇప్పటికే కేంద్ర ఆదాయంలో మూడింట రెండు వంతులు పరోక్ష పన్నుల ద్వారా వచ్చేదే. పరోక్ష పన్నులు పెంచేసి, ప్రత్యక్ష పన్నులను తగ్గించడమంటే ధనవంతులను మరింత ధనవంతులుగాను, పేదలను నిరుపేదలుగానూ చేయటమే. ఈ చట్టం పార్లమెంటు ముందుకు వచ్చినపుడు తనిఖీలు చేసి, తగిన రక్షణ కవచాలు ఏర్పాటు చేయని పక్షంలో దేశంలో ఇప్పటికే వున్న ఆర్థిక అసమానతలను జిఎస్‌టి మరింతగా పెంచవచ్చు. నూతన ఆర్థిక సంస్కరణల ద్వారా తమ జీవితాలపై ప్రభుత్వాలు మోపే అదనపు భారాలకు వ్యతిరేకంగా పోరాడేందుకు ప్రజలు సన్నద్ధం కావాల్సి వుంది.

-వై.వెంకటేశ్వరరావు
సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, ఆంధ్రప్రదేశ్

విప్లవాత్మకమైన చట్టం
చారిత్రాత్మకమైన జిఎస్‌టి బిల్లుకు పార్లమెంటు ఉభయ సభలూ ఆమోదించడం సంతోషకరం. జిఎస్‌టి బిల్లు ఆమోదానికి ప్రతిపక్షాలన్నీ కేంద్ర ప్రభుత్వానికి సహకరించడంతో ఏకగ్రీవమైంది. ఫెడరల్ స్పూర్తికి నిదర్శనం, ఇది శుభపరిణామం. జిఎస్‌టి బిల్లుతో ఉత్పత్తి అధికంగా ఉన్న రాష్ట్రాలకు నష్టం వాటిల్లుతుందన్న సందేహాలకు ‘తెర’దించడంతో అందరూ సహకరించారు. ఆ రాష్ట్రాలకు ఐదేళ్ళపాటు పరిహారం ఇచ్చేందుకు మార్గం సుగమం అయింది. ఈ బిల్లుకు పార్లమెంటు ఆమోదం లభించడంతో దేశవ్యాప్తంగా బహుముఖ పన్నులకు తెరపడి ఒకే విధమైన, సులభతరమైన పన్ను విధానం అమలులోకి వస్తుంది. పన్నుల సరళీకృత విధానానికి దోహదపడుతుంది. జిఎస్‌టి వల్ల ఎక్సైజ్, ఆక్ట్రాయ్‌లో పారదర్శకత వస్తుంది. ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పమైన మేక్ ఇన్ ఇండియాకు ఊతం ఇచ్చే విధంగా ఉంటుంది. ప్రతిపక్షాలన్నింటినీ కలుపుకుని ఈ బిల్లుకు ప్రధాని మోదీ ఆమోదం సాధించడం గొప్ప విషయం. ప్రధాని వ్యూహాత్మకంగా అడుగులు వేసి విజయం సాధించారు. భారత్‌ను సూపర్ పవర్‌గా మార్చేందుకు చేస్తున్న కృషికి తోడ్పడుతుంది. జిఎస్‌టి బిల్లు ఆమోదంతో చిన్న, మధ్య తరగతి పరిశ్రమలకు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకే కాకుండా భారీ పరిశ్రమలకూ ఎంతో ఉపయోగపడుతుంది. ఉత్పత్తి అయిన వస్తువులపై పన్నులు తగ్గడం వల్ల వినియోగదారులకూ ధరలు తగ్గుతాయి. ఇది ఉత్పత్తిదారులకు, ప్రజలకు లాభదాయకం. ప్రపంచ మార్కెట్‌తో పోటీ పడడం, ఒకే పన్ను విధానం ఉండడం వల్ల క్రీయాశీలకంగా సులభతరం కావడం, మేక్ ఇన్ ఇండియా, మేక్ మాన్యుఫాక్ష్చర్‌గా ఉంటుంది. ఇది విప్లవాత్మకమైన చట్టం.

- కృష్ణ సాగర్ రావు
అధికార ప్రతినిధి, తెలంగాణ బిజెపి రాష్ట్ర శాఖ

జిఎస్‌టిలో స్పష్టత లేదు
కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న జిఎస్‌టి అమల్లోకి వస్తే ఎవరికి లాభం చేకూరుతుందనే మీమాంస వెంటాడుతోంది. జిఎస్‌టి తేవడంలో స్పష్టత లేదనిపిస్తోంది. విలాసవంతమైన కార్లు, ఎఫ్‌ఎంసిజి ఉత్పత్తులు, విమానయాన చార్జీలు, గృహోపకరణాలు, రెడిమేడ్ దుస్తుల వంటి ధరలు తగ్గుతాయని చెబుతుండగానే, పన్నుల రూపంలో ధరలు పెరిగే అవకాశం లేకపోలేదని ప్రచారం జరుగుతోంది. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి జిఎస్‌టి చట్టం అమల్లోకి రానున్న దరిమిలా పరిశ్రమల యజమానుల్లో హర్షం వ్యక్తమవుతోంది. వినియోగదారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. జిఎస్‌టి అమలుతో దేశ ఆర్థిక పరిపుష్టికి దోహదమే.. కానీ వినియోదారుడి వెసులుబాటును కూడా ప్రభుత్వం గుర్తెరగాల్సిన అవసరం ఉంది. పార్లమెంట్, రాజ్యసభల్లో జిఎస్‌టి చట్టం ఆమోదించినప్పటికీ అమలుకు ఇంకా సమయం ఉన్నందున కేంద్రం అందరి ఆమోదంతోనే అమలుకు పూనుకోవాలి. జిఎస్‌టి దేశ ఆర్థికాభివృద్ధికి దోహదపడే దిశగా చట్టం తీసుకువచ్చినా.. అది అందరికీ ఆమోదయోగ్యం కావాలి. ఏ వస్తువుల ధరలు తగ్గుతాయి.. మరే వస్తువుల ధరలు పెరుగుతాయి అనే అనుమానాలను కేంద్రం నివృత్తి చేయాలి.
-జగన్‌మోహన్ మెట్ల
లోక్‌సత్తా తెలంగాణ కన్వీనర్

తెలంగాణ మద్దతు
కొత్త పన్నుల చట్టానికి తెలంగాణ మద్దతుగా నిలిచింది. తెలంగాణ ప్రయోజనాలే టిఆర్‌ఎస్ ప్రభుత్వానికి మొదటి ప్రాధాన్యత. పార్లమెంటులో జిఎస్‌టి బిల్లుకు టిఆర్‌ఎస్ మద్దతు ప్రకటించింది. రాజకీయంగా పార్టీల మధ్య ఎన్ని విభేదాలు అయినా ఉండవచ్చు. కానీ దేశం రాష్ట్రం అభివృద్ధి పనుల్లో కలిసి పని చేయాలి. ఆ కోణంలోనే తెలంగాణ ఘర్షణ వైఖరి కాకుండా కేంద్రం రాష్ట్రాల మధ్య మంచి సంబంధాలు ఉండాలని కోరుకుంటోంది. కేంద్ర రాష్ట్రాల సంబంధాల్లో మన రాష్ట్రం సమాఖ్య స్ఫూర్తిని గౌరవిస్తోంది, కేంద్ర ప్రభుత్వంతో సఖ్యంగా వ్యవహరిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గజ్వేల్‌లో మిషన్ భగీరథను ప్రారంభించి తెలంగాణ ప్రభుత్వ ప్రయత్నాలను ప్రశంసించారు. అదే విధంగా తెలంగాణ ప్రభుత్వం సైతం దేశానికి ప్రయోజనం కలిగే నిర్ణయాల్లో పార్లమెంటులో కేంద్రానికి మద్దతు ప్రకటించింది. దీనిలో భాగంగానే వస్తుసేవల పన్ను బిల్లుకు మద్దతు ఇచ్చింది. పన్నుల విషయంలో ప్రస్తుతం ఉన్న అనేక గందరగోళాలు జిఎస్‌టితో సమసి పోతాయి. రాష్ట్రాలకు ప్రారంభంలో కలిగే నష్టాన్ని కేంద్రం చెల్లించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసినందున అన్ని రాష్ట్రాలు అంగీకరించాయి. వస్తుసేవల పన్ను నూతన విధానం వచ్చే సంవత్సరం ఏప్రిల్ నుంచి అమలులోకి వస్తుందని అంటున్నారు. జిఎస్‌టి అమలులోకి వచ్చాక పన్నుల్లో గణనీయమైన వృద్ధి కనిపిస్తుందని, మార్పు కనిపిస్తుందని అనిపిస్తోంది. వస్తు, సేవల పన్ను గరిష్ట పరిమితి 18 శాతంకు మించరాదని బిల్లులో స్పష్టంగా పేర్కొన్నారు. ప్రస్తుత విధానంలో పన్ను మీద పన్ను చెల్లించే విధానం ఉంది. ఇప్పుడు వీటికి బదులుకి జిఎస్‌టిలో ఒకే పన్ను విధానం ఉంటుంది. పార్లమెంటు ఆమోదించిన ఈ బిల్లును రాష్ట్రాలు కూడా ఆమోదిస్తున్నాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా పన్నుల విధానంలోనూ మార్పులను ఆహ్వానించాలి. ఆ ఉద్దేశంతోనే టిఆర్‌ఎస్ మద్దతు ఇచ్చింది.
- ఎర్రోళ్ల శ్రీనివాస్, టిఆర్‌ఎస్ పొలిట్ బ్యూరో సభ్యుడు

నష్టపోయే
రాష్ట్రాలకు చేయూత
జిఎస్‌టి అమలులోకి వచ్చిన తర్వాత పన్నుల ద్వారా ఆదాయం నష్టపోయే రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం నష్టాన్ని భర్తీచేయాలి. జిఎస్‌టికి జాతీయ స్థాయిలో మద్దతు ఇచ్చాం. దేశంలో వస్తున్న సంస్కరణలను స్వాగతించేందుకే పార్లమెంట్‌లో జిఎస్‌టి బిల్లుకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నాం. అయితే ఈ బిల్లు చట్టంగా రూపొంది అమలులోకి వచ్చిన తర్వాత ఏర్పడే పరిణామాలకు కేంద్రం బాధ్యత వహించాల్సి ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం విషయం పరిశీలిస్తే, జిఎస్‌టి వల్ల తెలుగు రాష్ట్రాలకు లాభంగానే ఉంటుంది. ఉత్పత్తుల రంగం ఎక్కువగా ఉన్న తమిళనాడు లాంటి రాష్టాలకు నష్టం జరిగే అవకాశం ఉంది. జాతీయ స్థాయిలో పరిశీలిస్తే, కేంద్ర ప్రభుత్వానికి అన్ని రాష్ట్రాలు సమానమే. ఎన్నికల సమయంలోనే రాజకీయాలకు ప్రాధాన్యత ఉండాలి తప్ప, ఆ తర్వాత పరిపాలన సాగే సమయంలో కేవలం అభివృద్ధి, సంక్షేమ రంగాలకు ప్రాధాన్యత ఉండాలి. జిఎస్‌టి వల్ల ఇప్పటివరకు ఉన్న 14 శాతం పన్ను, కాస్త పెరిగి 15 శాతానికి చేరుతుంది. అందువల్ల కొన్ని రాష్ట్రాలకు లాభం జరుగుతుండగా, మరికొన్ని రాష్ట్రాలకు నష్టం వాటిల్లుతుంది. నష్టంవాటిల్లే రాష్ట్రాలకు చేయూత ఇస్తామని ఇప్పటికే పార్లమెంట్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ హామీ ఇచ్చారు. ఈ హామీ నుండి ఎట్టి పరిస్థితిలోనూ వెనక్కు వెళ్లకూడదు. ఎపికి ప్రత్యేక హోదా ఇస్తామని కూడా గత ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ హామీ ఇచ్చారు. అయితే గత ప్రభుత్వం ఇచ్చిన హామీని నేటి మోదీ ప్రభుత్వం అమలు చేయడం లేదు. అలాగే జిఎస్‌టి విషయంలో కూడా కేంద్రం ఇచ్చిన హామీ భవిష్యత్తులో కూడా అమలయ్యేలా చట్టంలో నియమ, నిబంధనలు ఉండాలి. ఏ రాష్ట్రానికి కూడా ఆర్థికంగా నష్టం రాకుండా చూడాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంటుంది.
- డాక్టర్ కె. నారాయణ, సిపిఐ జాతీయ కార్యదర్శి

ఆ రోజు అడ్డుపడింది
మోదీ, చంద్రబాబే!
వస్తువులు, సేవల పన్ను బిల్లును కాంగ్రెస్ 11 ఏళ్ల క్రితమే ప్రవేశపెట్టింది. అప్పట్లో బిజెపి, టిడిపి సహకరించలేదు. సహకారం అందించి ఉన్నట్లయితే ఆ రోజే జిఎస్‌టి బిల్లు ప్రక్రియ పూర్తయి ఉండేది. ఆ రోజు ఇదే నరేంద్రమోదీ, ఇదే చంద్రబాబు నాయుడు అడ్డుపడ్డారు. నరేంద్ర మోదీ మరీ ఎక్కువగా వ్యతిరేకించారు. రాష్ట్రాలకు నష్టమని, కేంద్ర ప్రభుత్వమే అంతా కబళించేస్తుందని అడ్డుకున్నారు. అప్పుడే జిఎస్‌టి బిల్లు అమలులోకి వచ్చి ఉంటే ఇప్పటికి దేశం ఎంతో అభివృద్ధిని సాధించి ఉండేది. ఆలస్యంగానైనా బిల్లు తెచ్చినందుకు మా తరఫున హర్షం వ్యక్తం చేస్తున్నాం. బిజెపి ఇప్పటికైనా రియలైజ్ అయినందుకు సంతోషం. మేము (కాంగ్రెస్ పార్టీ) సామాన్యుల ప్రయోజనాలకు సంబంధించి మూడు సవరణలను తీసుకొచ్చాం. వీటిని అంగీకరింపజేశాం. రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ ఉన్నందున జిఎస్‌టి బిల్లు సాధ్యమైంది.
- ఎన్.రఘువీరారెడ్డి
ఆంధ్రప్రదేశ్ పిసిపి అధ్యక్షుడు

కేంద్రంపై నమ్మకం లేకే!
కేంద్రంపై నమ్మకం లేకే జిఎస్‌టి బిల్లుపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. విభజన చట్టంలో పొందుపర్చిన విధంగా రెవెన్యూ లోటును భర్తీ చేస్తామనే అంశానికి సంబంధించి గతంలో యుపిఏ ప్రభుత్వం ఇచ్చిన హామీకే దిక్కులేదు. కేంద్రం వైఖరితో ఏపీలో ఆర్థిక పరిస్థితి దారీతెన్నూ లేకుండా అయంది. ఇక జిఎస్‌టి బిల్లుపై నమ్మకం ఎలా కుదురుతుంది? ఈ నేపథ్యమే ఈ బిల్లుపై వ్యతిరేకతకు కారణం. ఆంధ్రప్రదేశ్‌కు రూ.14 వేల కోట్ల లోటు బడ్జెట్ వుంటే.. ఇంతవరకు కేవలం రూ.2,800 కోట్లు మాత్రమే ఇచ్చారు. ఈ పరిస్థితిల్లో ఇక జిఎస్‌టి బిల్లుపై నమ్మకం ఎలా కలుగుతుంది? జిఎస్‌టి వల్ల ప్రారంభంలో రాష్ట్రాలు నష్టపోతాయని, క్రమేణా బిల్లు విధానానికి తదనుగుణంగా తర్వాత సరళీకృతమవుతాయ. బిల్లు ద్వారా తొలి దశలో రాష్ట్రాలకు ఎదురయ్యే నష్టాన్ని ఎలా భర్తీ చేస్తారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఈ నేపథ్యంలోనే కేంద్రంలో భాగస్వామ్య పార్టీ అయినప్పటికీ తెలుగుదేశం పార్టీ అధినేత జిఎస్‌టి బిల్లును అడ్డుకోవాలని కాంగ్రెస్‌కు పిలుపునివ్వడం దేశంలోనే మొదటిసారి చూస్తున్నాం. జిస్‌టిపై ఆందోళన వుంది కాబట్టే చంద్రబాబునాయుడు కాంగ్రెస్‌ను ఉసిగొలిపేందుకు ప్రయత్నించారు. వాజ్‌పేయి ప్రభుత్వ హయాంలో జిఎస్‌టిని మంత్రులతో కూడిన ఎంపవర్ కమిటీ ప్రతిపాదించింది. యుపిఏ 2006లో ప్రతిపాదించి, 2010నుంచి అమల్లోకి తేవాలని ప్రయత్నించింది. అప్పుడు యుపిఏ ప్రతిపాదనను బిజెపి తీవ్రంగా వ్యతిరేకించింది. దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధానంవల్ల సరళీకృత విధానం వస్తుంది. అయితే తొలి దశలో మాత్రం రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయ. ఆ నష్టాన్ని ఎలా పూడ్చుతారో తేల్చాల్సి వుంది. రాష్ట్ర విభజన నేపధ్యంలో ఏర్పడిన ఆర్థిక లోటును భర్తీ చేయలేని స్థితిలో వుంటే.. ఇక జిఎస్‌టి వల్ల తొలి దశలో వచ్చే నష్టాన్ని ఎలా భర్తీ చేస్తారనే నమ్మకం కలగనందువల్లే కొన్ని రాష్ట్రాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
- ఉండవల్లి అరుణ్‌కుమార్, రాజమహేంద్రవరం మాజీ ఎంపీ

ఎగవేతదారులకు
ఎదురుదెబ్బ
జిఎస్‌టి బిల్లును పార్లమెంటు ఆమోదించడం శుభప్రదం. దీనివల్ల పన్ను ఎగవేతదారులకు ఎదురుదెబ్బ తగిలినట్లే. తొలుత ఈ జిఎస్‌టి బిల్లును ప్రతిపాదించింది కాంగ్రెస్సేనన్న విషయాన్ని మరిచిపోవద్దు. పన్ను ఎగవేతదారులకు చెక్ పెట్టేందుకే లోగడ తమ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఈ ఆలోచన చేసింది. నాడు ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, అప్పటి ప్రధాని, ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ జిఎస్‌టి బిల్లు తెచ్చేందుకు ప్రయత్నించారు. అయితే అప్పుడు ఏకాభిప్రాయం కుదరక చట్టం కాలేకపోయింది. రూపకల్పన కాంగ్రెస్ చేసినా, ఇప్పుడు కేంద్రంలో బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం జిఎస్‌టి బిల్లుకు కృషి చేసింది. దీంతో ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందన్న ఉద్దేశ్యంతో పార్లమెంటులో ప్రధాన ప్రతిపక్షమైన మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సహకరించింది. అందుకే జిఎస్‌టి బిల్లుకు పార్లమెంటులో ఆమోద ముద్ర లభించింది.
దేశం మొత్తం ఒకే విధమైన పన్నులు ఉంటాయి. పన్ను ఎగవేతలు తగ్గుతాయి. కొన్ని పన్నులు 2 శాతం నుంచి 22 శాతం వరకూ ఉంటాయి. ఎక్కువ అమ్మకపు పన్ను ఉంటే, ఆ పన్నును ఎగవేయడం ద్వారా ధనార్జన చేయవచ్చని వ్యాపారులు భావించడం సహజం. అయితే దేశం మొత్తంలో ఒకే విధమైన పన్ను ఉంటే వినియోగదారులకు మేలు జరుగుతుంది. దీంతో కేంద్రానికి రాబడి పెరుగుతుంది. రాష్ట్రాలకు కేంద్రం కొన్ని వెసులుబాట్లు కల్పించింది. అమ్మకం పన్నువల్ల వచ్చే ఆదాయంలో తమకూ కొంత వాటా కావాలంటూ కొన్ని రాష్ట్రాలు కేంద్రాన్ని సంప్రదించాయి. దానికీ కేంద్రం సానుకూలంగా స్పందించింది. అయితే వచ్చిన ఆదాయం నుంచి వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం అడుగులు ముందుకు వేయాలి. దెబ్బతింటున్న వ్యవసాయ రంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. ప్రోత్సాహకాలు ఇస్తే తప్ప వ్యవసాయదారులు కోలుకోలేరు. తెలంగాణతోపాటు వివిధ రాష్ట్రాల్లో రైతులకు వ్యవసాయం లాభసాటిగా లేదు. ప్రత్యామ్నాయం లేక రైతులు వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మంచి పని, మంచి నిర్ణయాలు ఏవి తీసుకున్నా మేము స్వాగతిస్తాం. అందుకే ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ ప్రజల మేలును దృష్టిలో పెట్టుకుని ఈ బిల్లును సమర్థించింది. దీంతో జిఎస్‌టి సవరణ బిల్లుకు ఆమోదం లభించింది. కొత్త జిఎస్‌టి విధానం వల్ల అవినీతి కూడా తగ్గుతుంది.

- ఎం.కోదండ రెడ్డి
మాజీ ఎమ్మెల్యే, చైర్మన్, కిసాన్ ఖేత్ కాంగ్రెస్

ఆర్థిక పురోగతికి దోహదం
వస్తు సేవా పన్ను (జిఎస్‌టి) బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందడం దేశానికి శుభ సూచకం. దీనివల్ల దేశ ఆర్థికాభివృద్ధి రేటు పెరుగుతుంది. ముఖ్యంగా రోడ్లు, రైల్వేలు, మైనింగ్ వంటి రంగాలతో పాటు వౌలిక సదుపాయాల రంగాలు మరింత పుంజుకుంటాయి. దేశంలో ప్రస్తుతం బహుళ పన్నుల విధానం అమలులో ఉంది. ఇది గందరగోళంగా ఉంది. దేశం మొత్తానికి ఒకే రకమైన పన్నుల విధానం ఉండాలి. దీనివల్ల విదేశీ మారకం పెరుగుతుంది. జిఎస్‌టి వల్ల కలిగే ప్రయోజనాలను సరిగ్గా అర్థం చేసుకున్న రాజకీయ పక్షాలు పార్లమెంట్‌లో ఇది ఆమోదం పొందడానికి మద్దతు ఇవ్వడం హర్షనీయం. జిఎస్‌టి బిల్లు ఏప్రిల్ 2017 నుంచి అమలులోకి రానుంది. జిఎస్‌టి బిల్లు ఫలాలు వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అందుతాయి.
- డిఎస్ రావత్, సెక్రటరీ జనరల్, అసోచమ్

వ్యాపారులకు, వినియోగదారులకు మేలు
కొత్త పన్నుల వ్యవస్థను తీసుకురావడానికి ఉద్దేశించిన 122వ రాజ్యాంగ సవరణ బిల్లుకు పార్లమెంటు ఆమోదం లభించడం శుభపరిణామం. వస్తు సేవల పన్ను అమలులోకి వస్తే దేశమంతా ఒకే పన్ను విధానం అమలులోకి వస్తుంది. మిగిలిన పరోక్ష పన్నులు ఉండవు. దేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా వస్తువుల రవాణా సులభం అవుతుంది. దేశమంతా ఒకటే మార్కెట్‌గా ఆవిర్భవిస్తుంది. వ్యాపారం సులువుగా చేసుకునే అవకాశం ఉంది. పన్నులపై పన్నులు ఉండవు. చిన్న వ్యాపారులకు తనిఖీల పేరుతో వేధింపులు ఉండవు. పన్నుల పరిధి పెరిగి ఆదాయం పెరుగుతుంది. వస్తువుల ధరలన్నీ చాలావరకు తగ్గే అవకాశాలున్నాయి. ఒక శాతం అదనపు పన్ను రద్దు హర్షణీయం. పన్నుల్ని వీలైనంత తక్కువగా విధిస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడం మంచి పరిణామం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులతో కూడిన జీఎస్టీ మండలి ఈ మేరకు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
-వక్కలగడ్డ భాస్కరరావు, అధ్యక్షుడు, విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ