ఫోకస్

జ్యుడీషియల్ కమిషన్ వేసి ఉండాల్సింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జిల్లాల పునర్విభజన కోసం రాష్ట్ర ప్రభుత్వం జ్యుడీషియల్ కమిషన్ నియమించి ఉంటే బాగుండేది. జ్యుడీషియల్ కమిషన్‌ను నియమిస్తే అన్ని వర్గాల, అన్ని పార్టీల అభిప్రాయాలను, ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుని, క్షుణ్ణంగా అధ్యయనం చేసి నివేదిక సమర్పించేందుకు ఆస్కారం ఉండేది. కానీ ప్రభుత్వం ఆ విధంగా చేయకుండా పట్టుదలకు పోయి, తమకు నచ్చిన వారికి జిల్లాలు ఇచ్చి, నచ్చని వారికి మొండిచేయి చూపించింది. పరిపాలనా సౌలభ్యానికి కొత్త జిల్లాల ఏర్పాటు అవసరమని రాష్ట్ర ప్రభుత్వం భావించడంలో తప్పులేదు. కానీ, అందుకు అనుగుణంగా అభిప్రాయ సేకరణ చేయకుండా ఏదితోస్తే అది చేసింది. ప్రమాణాలు లేకుండా ఎలాంటి ఫలితాన్ని ఆశిస్తున్నారో అర్థం కావడం లేదు. రాజ్యాంగం ప్రకారం వెళ్ళకుండా జిల్లా, జిల్లాలకు కొత్త పాలసీని చేపట్టడం విడ్డూరంగా ఉంది. కొత్త జిల్లాల ఏర్పాటులో శాస్ర్తియత కొరవడింది. ఉదాహరణకు వరంగల్ జిల్లాలో ములుగు జిల్లా ఏర్పాటుకు ఎన్ని ఆందోళనలు నిర్వహించినా, ప్రభుత్వం పట్టించుకోకుండా వరంగల్ రూరల్ జిల్లాకు శ్రీకారం చుట్టింది. నిజానికి వరంగల్ రూరల్ కావాలని ఎవరూ అడగలేదు. పైగా వరంగల్ అర్బన్‌ను రెండు ముక్కలు చేసి వేర్వేరు జిల్లాలుగా చేసింది. వరంగల్ జిల్లాను అలాగే ఉంచేసి ములుగు జిల్లా ఏర్పాటు చేస్తే బాగుంటుందన్నది నా ప్రజాభిప్రాయం. అయినా ప్రభుత్వం ప్రజాభిప్రాయాన్ని ఖాతరు చేయకుండా మొండిగా వ్యవహారించింది. కరీంనగర్ జిల్లాలో హుజురాబాద్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఉన్నా, ప్రభుత్వం పెద్దపల్లిని జిల్లాగా చేసేందుకు సిద్ధమైంది. తాజాగా సిరిసిల్ల జిల్లానూ ఏర్పాటు చేసింది. ఇంకా విచిత్రం, ఆశ్చర్యకరమైన అంశమేమిటంటే సిరిసిల్ల జిల్లాలో కేవలం 5 లక్షల జనాభానే ఉంటారు. ఆదిలాబాద్‌లో నిర్మల్, మంచిర్యాల జిల్లాల ఏర్పాటుకు రంగం సిద్ధం చేశాక తాజాగా అసిఫాబాద్ జిల్లా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. మెదక్ జిల్లాలో సిద్ధిపేట కమిషనరేట్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సొంత జిల్లా కాబట్టి కమిషనరేట్ ఏర్పాటు చేయబోతున్నారు. రంగారెడ్డి జిల్లాలో 25 లక్షల మంది జనాభా ఉంటే అదనంగా వికారాబాద్, మేడ్చల్ జిల్లాలు ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు.
మహబూబ్‌నగర్ జిల్లాలో నారాయణపేట జిల్లా డిమాండ్ ఉన్నా, దానిని పక్కనపెట్టి గద్వాల జిల్లా ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ తన కుమారునికి సిరిసిల్ల జిల్లాను కానుకగా ఇవ్వాలి కాబట్టి విమర్శలకు తావు ఇవ్వరాదన్న భావనతో గద్వాలనూ జిల్లాగా ప్రకటించారు. నాగర్‌కర్నూలు, వనపర్తి పక్కపక్కనే ఉండే ప్రాంతాలను జిల్లాలుగా చేశారు. నల్లగొండలో యాదాద్రి, సూర్యాపేట, నల్లగొండ జిల్లాలను ఏర్పాటు చేశారు. దేవరకొండ జిల్లా కావాలన్న ప్రజల డిమాండ్‌ను ప్రభుత్వం పట్టించుకోలేదు. జనాభాను ప్రాతిపదికగా తీసుకోకుండా అశాస్ర్తియంగా జిల్లాలు ఏర్పాటు చేయడంవల్ల ప్రయోజనం ఏమీ ఉండదు. పైగా భవిష్యత్తులో అన్నీ సమస్యలే ఎదురవుతాయి. హైదరాబాద్‌లో 40 లక్షల జనాభా ఉంటే కొత్తగా ఏర్పాటు చేసే కొన్ని జిల్లాల్లో 25 లక్షలు జనాభా ఉంటారు. 11 జిల్లాల్లో 10 లక్షల లోపు, సిరిసిల్లలో ఐదు లక్షల జనాభా ఉండడం విస్మయం కలిగిస్తున్నది. జిల్లాల పునర్విభజన పరిపాలనా సౌలభ్యంకోసం ఉండాలే తప్ప రాజకీయ లబ్దికోసం చేయడం భావ్యం కాదు.

- జి. ప్రేమేందర్ రెడ్డి ప్రధాన కార్యదర్శి, బిజెపి తెలంగాణ రాష్ట్ర శాఖ