ఫోకస్

ఉమ్మడి పౌరస్మృతి వద్దా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉమ్మడి పౌర స్మృతి (కామన్ సివిల్ కోడ్) పై మరోమారు బహిరంగ చర్చ జరుగుతోంది. కామన్ సివిల్ కోడ్ అమలు చేసే విషయంలో సూచనలు ఇవ్వాలని లా కమిషన్ ప్రజలకు బహిరంగ ప్రశ్నావళి విడుదల చేయడంతో మరో మారు ఈ అంశం వార్తల్లోకి వచ్చింది. ఉమ్మడి పౌర స్మృతి తీసుకురావాలని కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను రాజకీయ అస్త్రంగా విపక్షాలు కొట్టిపారేస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌సహా ఐదు రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే ఈ అంశంపై చర్చ జరుగుతోందని విపక్షాలు చెబుతున్నాయి. భారత వివాహ చట్టాల్లో బహుభార్యత్వానికి వీలులేదు, ఏకపక్ష విడాకులకూ అవకాశం లేదు. ముస్లిం పర్సనల్ లా ప్రకారం పురుషులు ఎన్ని వివాహాలైనా చేసుకోవచ్చు. మూడుసార్లు తలాక్ అని చెప్పడం ద్వారా భార్యకు విడాకులు ఇవ్వవచ్చు. కామన్ సివిల్ కోడ్ అమలులోకి వస్తే ఈ ఆచార వ్యవహారాలు సాగవు. ముస్లిం మహిళలు తమ వ్యక్తిగత, సాంఘిక, ఆర్థిక భద్రతలకోసం కోర్టుకు ఎక్కుతున్నారు. అరేబియా దేశాల్లో కూడా మహిళల విషయంలో ముస్లిం చట్టాలను రద్దు చేసి వారి హక్కులను కాపాడుతున్నాయి. భారత్ వంటి విభిన్న మతాలు, సంస్కృతులున్న దేశంలో ఉమ్మడి పౌరస్మృతి అమలు సాధ్యం కాదని కొంతమంది నేతలు వ్యతిరేకిస్తూనే ఉన్నారు. దేశంలో ప్రస్తుతం నేర శిక్షా స్మృతి తదితర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ చట్టాలతోపాటు 1955 హిందూ వివాహ చట్టం, ముస్లింలకు షరియా అమలులో ఉన్నాయి. ముస్లింలు చాలాకాలంగా ఉమ్మడి పౌరస్మృతి అమలును గట్టిగానే వ్యతిరేకిస్తున్నారు. ఉమ్మడి పౌర స్మృతిని అమలుచేయడం అంటే తమ విశ్వాసాలను దెబ్బతీయడమే అనేది వారి వాదన. ప్రధానిగా వాజపేయి హయాంలోనూ బిజెపి ఉమ్మడి పౌరస్మృతిపై దృష్టి పెట్టినా, అమలుకు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. మళ్లీ ఇపుడు మోదీ నేతృత్వంలోని ఎన్టీయే ప్రభుత్వం దీనిపై దృష్టిపెట్టింది. ఒక దశలో దేశ ప్రజలు అందరికీ ఒకే చట్టం అమలుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సుప్రీంకోర్టు కేంద్రానికి సూచించింది. కొందరు ముస్లిం మహిళలు తమ భర్తల ఏకపక్ష విడాకుల వ్యవహారంపై సుప్రీంకోర్టు తలుపు తట్టినపుడు న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. లా కమిషన్ సిఫార్సుల ఆధారంగా ఉమ్మడి పౌరస్మృతిని అమలుచేయాలని బిజెపి యోచిస్తోంది. దేశప్రజలందరికీ ఒకే చట్టాన్ని అమలు చేసేందుకు ఎన్టీయే ప్రభుత్వం సిద్ధం కావడాన్ని స్వాగతిస్తానని కేంద్ర పౌర విమానయాన సహాయ మంత్రి మహేష్ శర్మ పేర్కొన్నారు. సిపిఎం కార్యదర్శి కారత్, సిపిఐ కార్యదర్శి డి రాజా కూడా సానుకూలంగానే స్పందించారు. దేశంలోని మహిళల హక్కులను పరిరక్షించాల్సి ఉందంటూ, లా కమిషన్ ఏం చెబుతుందనేది చూసిన తర్వాత పూర్తి స్థాయిలో ప్రతిస్పందించడం మంచిదని వారు చెబుతున్నారు. దేశంలో అనేక మతాలకు చెందినవారు ఉండటం వల్ల అందరికీ వర్తించేలా సమగ్రంగా ఉండే కామన్ సివిల్ కోడ్ తీసుకురావల్సిన అవసరం ఉందనేది అందరి అభిప్రాయం. అయితే ప్రభుత్వం చేయదలచిన సవరణల వల్ల భవిష్యత్‌లో తీవ్ర పరిణామాలే ఉంటాయనేదాంట్లో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు. అయినా ప్రభుత్వం సాహసంతో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది. ఉమ్మడి పౌరస్మృతిపై కొంతమంది ప్రముఖుల అభిప్రాయాలే ఈ వారం ఫోకస్.
* * *