ఫోకస్

సీబీఐ ఒక్కటే స్వతంత్రంగా ఉంటే చాలదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిగతా సంస్థలతో పోల్చి చూస్తే సీబీఐకి స్వతంత్ర ప్రతిపత్తి ఉన్నట్టే లెక్క. సీబీఐ డైరెక్టర్‌ను లోక్‌పాల్ చట్టం కింద ప్రధాన మంత్రి, ప్రతిపక్ష నాయకుడు, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి కలసి ఎంపిక చేస్తారు. దేశంలో ఈ ముగ్గురూ కలిపి ఎంపిక చేసే మరో సంస్థ ఏదీ లేదు. సీబీఐలో నియామకాలు, బదిలీలు సీవీసీ ప్యానెల్ తయారు చేస్తుంది. ఆ ప్యానెల్ మేరకు నియామకాలు, బదిలీలు జరుగుతుంటాయి. ప్రస్తుతం సీబీఐకి స్వయం ప్రతిపత్తి ఒక్కటే సమస్య కాదు. ప్రస్తుతం ఉన్న ప్రొఫెషనలిజం చాలదు. సరైన ఫోరెన్సిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఉదాహరణకు ఢిల్లీలో జరిగిన సునంద పుష్కర్ కేసు వివాదాస్పదమైన విషయం విదితమే. ఈ కేసు మాజీ కేంద్రమంత్రి భార్యకు సంబంధించినది. అలాంటి కేసులో డీఎన్‌ఏ అనాలిసిస్ చేయడానికి సీబీఐకి సంవత్సర కాలం పట్టింది. ప్రపంచంలో ఎక్కడైనా డీఎన్‌ఏ అనాలిసిస్ చేయడానికి నాలుగు గంటలు పడుతుంది. ఆధునిక యుగంలో నేర సాక్ష్యాలు సేకరించే సామర్థ్యం కావాలి. అవి మన దేశంలో చాలా ప్రాథమిక దశలోనే ఉన్నాయి. ఆర్భాటమే తప్ప న్యాయస్థానంలో నేరం రుజువు చేసే స్థాయిలో నేరపరిశోధన లేకుండాపోయింది. సీబీఐకి మరో సమస్య చాలీచాలని సిబ్బంది. సీబీఐలో మొత్తం 8వేల మంది ఉండగా, అందులో నేర పరిశోధన చేసేవారు రెండు వేల మంది. దేశంలో అన్ని రకాల కేసులు, అవినీతి కేసులు, రాష్ట్రం నుంచి కేంద్రానికి వెళ్లే కేసులు కేవలం ఈ రెండు వేల మందే చూడాల్సి ఉంటుంది. అమెరికాలో ఎఫ్‌బీఐకి 65వేల మంది ఉన్నారు. ఈ మూడు రకాల బలహీనతలు సీబీఐకి ఉన్నాయి. సీబీఐకే కాకుండా నేరపరిశోధన చేసే ఏ పోలీసు శాఖకైనా స్వతంత్ర ప్రతిపత్తి కావాలి. ఫోరెన్సిక్ టెక్నాలజీ కావాలి. ప్రాసిక్యూషన్ కూడా బలంగా ఉండాలంటే ఇండిపెండెంట్ ప్రాసిక్యూషన్ ఉండాలి. సీబీఐకి ఆధునిక నేర పరిశోధన సామర్థ్యాన్ని పెంపొందించడంతోపాటు సరిపడా సిబ్బందిని నియమించడం, నేరాలు రుజువు చేసేందుకు అవసరమైన టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది.
- జయప్రకాష్ నారాయణ లోక్‌సత్తా ఉద్యమ సంస్థ జాతీయ అధ్యక్షుడు