కడప

ఊసేలేని కడప-బెంగళూరు రైలు మార్గం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,జనవరి 19: కడప -బెంగుళూరు రైలు మార్గం పనులు అడుగుముందుకు మూడడుగులు వెనక్కి అన్నచందంగా సాగుతున్నాయి. రాష్ట్రప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాల్సిన సగభాగం నిధులు గత నాలుగేళ్లుగా విడుదల చేయని కారణంగా ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. రూ.2వేల కోట్లు పైబడి వ్యయంతో ఈ రైల్వేలైనుకు ఏడేళ్లక్రితం శ్రీకారం చుట్టారు. కేంద్రప్రభుత్వం ఏటా రూ.50కోట్లు విడుదల చేస్తే మ్యాచింగ్ గ్రాంట్ కింద రాష్ట్రప్రభుత్వం రూ.50కోట్లు విడుదల చేయాల్సివుంటుంది. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఈపనులకు శ్రీకారంచుట్టారు. జిల్లాలోని కడప, పెండ్లిమర్రి, వేంపల్లె, ఇడుపులపాయ, లక్కిరెడ్డిపల్లెతోపాటు రాయచోటి, చిత్తూరు జిల్లాలో పలు ప్రాంతాల గుండా బెంగుళూరుకు వెళ్లేవిధంగా రైలుమార్గం పనులు చేపట్టారు. దివంగత నేత వైఎస్ మరణానంతరం రెండు సంవత్సరాలపాటు రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ విడుదల చేసింది. గత మూడేళ్లుగా రాష్ట్రప్రభుత్వ వాటా విడుదల కాకపోవడంతో ఎక్కడి పనులు అక్కడే నిలచిపోయాయి. జిల్లాలో ఉత్పత్తి అయ్యే పండ్లను, ముఖ్యంగా వ్యవసాయ ఉత్పత్తులు, ఖనిజాలను కర్నాటక ప్రాంతానికి చేర్చడానికి, కర్నాటక రాష్ట్రంలో ఉత్పత్తి అయిన వస్తువులను జిల్లాకు దిగుమతి చేసుకునేందుకు ఈ మార్గం ద్వారా అనుకూలంగా ఉంటుంది. రైలు మార్గం నిర్మాణం కోసం కడప జిల్లాలో భూసేకరణ పనులు కూడా సంబంధిత అధికారులు పూర్తి చేశారు. చిత్తూరు జిల్లాలో భూసేకరణ జరుగుతుండగా రైలు మార్గం నిర్మాణ పనులు నిలచిపోయాయి. దీంతో కడప - బెంగుళూరు రైలుమార్గంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ వ్యవహారంపై జిల్లా ప్రజాప్రతినిధులు అటు కేంద్రం, ఇటు రాష్ట్రప్రభుత్వంతో చర్చించిన దాఖలాలు లేవు. వచ్చేనెలలో ప్రవేశపెట్టే రైల్వేబడ్జెట్‌లోనైనా మరిన్ని నిధులు కేటాయించి కడప-బెంగుళూరు రైలుమార్గం పనులను వెంటనే చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఎర్రచందనం, ఇసుక అక్రమార్కులపై ఉక్కుపాదం
కడప (క్రైం), జనవరి 19: జిల్లాలో ఎర్రచందనం, ఇసుక అక్రమరవాణాను అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ డాక్టర్ నవీన్‌గులాఠి పోలీసు అధికారులను ఆదేశించారు. మంగళవారం కడప పోలీసు ప్రధాన కార్యాలయంలో అధికారులతో నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ అసాంఘికశక్తులపై నిఘా ఉంచి వారిని ఉక్కుపాదంతో అణచివేయాలని ఆదేశించారు. అసాంఘిక శక్తులనుంచి ప్రజలకు రక్షణ కల్పించే బాధ్యత ప్రతి ఒక్కపోలీసుపై ఉందన్నారు. జిల్లాలో మట్కా, క్రికెట్ బెట్టింగ్‌లు, చైన్‌స్నాచింగ్‌లపై దృష్టిసారించాలన్నారు. గస్తీలు ముమ్మరం చేసి చోరీలను నివారించాలని పోలీసులను కోరారు. అలాగే పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ పివిజి విజయకుమార్, ఓఎస్‌డి సత్యయేసుబాబు, పులివెందుల ఏఎస్పీ అన్బురాజన్, ప్రొద్దుటూరు, మైదుకూరు,కడప, రాజంపేట, సిసిఎస్, ఎస్టీ, ఎస్టీ డిఎస్పీలు , జిల్లాలోని సిఐలు ఈసమావేశంలో పాల్గొన్నారు.
సాగునీటి సరఫరాలో అలక్ష్యం వహిస్తే
కఠిన చర్యలు
ఆంధ్రభూమి బ్యూరో
కడప, జనవరి 19: జిల్లాలో తాగునీటి సరఫరా విషయంలో, పనుల విషయంలోనూ జాప్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ కెవి రమణ అధికారులను హెచ్చరించారు. జిల్లాపరిషత్ సభాభవన్‌లో మంగళవారం జరిగిన ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులు, పంచాయతీ సెక్రటరీలు, ఈఓపిఆర్‌డిల సమావేశంలో ఆయన అధికారులు, సిబ్బందికి అక్షింతలు వేశారు. ప్రభుత్వ నిబంధనల మేరకు పనులు చేపట్టాలని, 13,14 ఫైనాన్స్ నిధులతో ఏ గ్రామంలో ఏం పనులు చేశారు, ఎంత నిధులు ఖర్చు చేశారో అవగాహన ఉండాలని అన్నారు. తాగునీటి పనులపై ఎప్పటికప్పుడు ఆర్‌డబ్ల్యుఎస్ , ఈఓపిఆర్‌డిలు నివేదికలు పంపాలని ఆదేశించారు. తాగునీటి పనులు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాల్లో జాప్యం జరుగుతోందని అధికారులపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఆర్‌డబ్ల్యుఎస్, పంచాయతీ కార్యదర్శులు పనులు చేపట్టే సమయంలో నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామపంచాయతీల ఆమోదం మేరకే పనులు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. పంచాయతీ, ఉపాధిహామీ నిధులతో గ్రామాల్లో సిసి రోడ్ల నిర్మాణం , తాగునీటి పనులు చేపట్టాలని , నీటి పన్నులు సక్రమంగా వసూళ్లుచేయాలని అన్నారు. బోర్ల మరమ్మతులు, పైపులైన్ల మరమ్మతులు , నీటి సరఫరాలో సంబంధిత అధికారులదే పూర్తి బాధ్యత అని, అధికారులు కుంటిసాకులు చెప్పకుండా కింది స్థాయి సిబ్బందితో పనులు చేయించాలని అన్నారు. ఈ సమావేశంలో జెడ్పి సిఇఓ రజియాబేగం, ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఇ డిఎన్ శ్రీనివాసులు, సిపిఓ తిప్పేస్వామి, జెడ్పి డిప్యూటీ సిఇఓ ఖాదర్‌బాష, ఇఓపిఆర్‌డిలు, ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులు , కార్యదర్శులు , పంచాయతీ అధికారులు పాల్గొన్నారు.
దేశంలో నెంబర్-1గా కడప ట్రిపుల్ ఐటి
* డైరెక్టర్ భగవన్నారాయణ
వేంపల్లె, జనవరి 19: గ్రామీణ ప్రాంత విద్యార్థుల కోసం ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా స్థాపించిన ఇడుపులపాయను దేశంలో నెంబర్-1 యూనివర్శిటీగా తీర్చిదిద్దుతామని ట్రిపుల్ ఐటి నూతన డైరెక్టర్ భగవ్‌న్నారాయణ అన్నారు. మంగళవారం ట్రిపుల్ ఐటి అధ్యాపకులు, సిబ్బందితో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను గ్రామీణ ప్రాంతం నుంచి శాస్తవ్రేత్త స్థాయికి ఎదిగానన్నారు. ప్రస్తుతం గ్రామీణ ప్రాంత విద్యార్థుల కోసం ట్రిపుల్ ఐటి డైరెక్టర్‌గా నియమితులవడం ఎంతో సంతోషంగా వుందన్నారు. గ్రామీణ విద్యార్థులకు సేవ చేసే భాగ్యం తనకు దక్కిందన్నారు. నాపై ట్రిపుల్ ఐటి ఉన్నత స్థాయి అధికారులు ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా, విద్యార్థులను ఉన్నత స్థాయికి తీర్చిదిద్ది, ప్రతి ఒక్కరికీ ఉద్యోగాలు వచ్చేలా కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో ఎఓ విశ్వనాధరెడ్డి, ఆర్థికశాఖ అధికారి ఆచార్య కెఎల్‌ఎన్.రెడ్డి, అకడమిక్ డీన్ ఆచార్య వేణుగోపాల్‌రెడ్డి తదితర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
సోలార్ భూముల పరిశీలన
మైలవరం, జనవరి 19: మండలంలోని ప్రభుత్వ భూముల్లో సోలార్ ప్రాజెక్టు ఏర్పాటు సంబంధిత శాఖల అధికారులు మంగళవారం భూపరిశీలనలు చేశారు. నెడ్‌క్యాప్ హైదరాబాద్ అధికారి వియస్‌ఆర్ నాయుడు ఆధ్వర్యంలో జిల్లా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఇందులో భాగంగా మండలంలోని పొన్నంపల్లె, తలమంచిపట్నం, దొడియం, రామచంద్రాయ పల్లె, వద్దిరాల గ్రామాల పరిధిలోని ప్రభుత్వ భూములను పరిశీలించారు. వీటిలో సోలార్ ప్రాజెక్టు ఏర్పాటుకు దాదాపు 6వేల ఎకరాలు అవసరం అవుతుందని అంచనా వేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మెగా సోలార్ ప్రాజెక్టు ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుండడంతో అందుకు అవసరమైన భూములు అందుబాటులో వున్నవాటిని అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలోనే మండలంలోని ప్రభుత్వ భూములను పరిశీలించినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ పరిశీలనలో జిల్లా నెడ్‌క్యాప్ అధికారులు, యర్రగుంట్ల గనులు, భూగర్భశాఖ అధికారులు, మండల సర్వేయర్ ఇంద్రజ తదితరులు వున్నారు.

గణతంత్ర దినోత్సవ వేడుకలను విజయవంతం చేయాలి
కడప (కలెక్టరేట్), జనవరి 19: ఈనెల 26న జరిగే 67వ గణతంత్య్ర దినోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కెవి రమణ జిల్లా అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని సభాభవన్‌లో గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారత గణతంత్ర దినోత్సవ కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీగా నిర్వహించాలని పోలీసు అధికారులకు సూచించారు. 26వ తేదిన పోలీసుమైదానంలో ఉదయం 7.45గంటలకు జెండా ఎగురవేయడం జరుగుతుందని, జిల్లా అధికారులందరూ ఉదయం. 7.30గంటలకే హాజరుకావాలన్నారు. మైదానంలో స్వాతంత్య్ర సమరయోధులు, అతిధులు, అధికారులకు షామియానాలు, కుర్చీలు ఏర్పాటుచేయడంతోపాటు ఆహ్వానపత్రికలు సిద్ధం చేయాలని కడప , సికెదినె్న తహసీల్దార్లను కలెక్టర్ ఆదేశించారు. పోలీసు మైదానం , కళాక్షేత్రంలో విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని, వీటికి సంబంధించిన పాటల సిడిలను మూడురోజుల ముందుగానే సమాచార శాఖ ఇంజినీరింగ్ విభాగం వారికి అందజేయాలన్నారు. పోలీసు మైదానంలో తాత్కాలిక టాయ్‌లెట్స్, తాగునీటి సరఫరా ఏర్పాట్లను మున్సిపల్ కార్పొరేషన్ వారు చూడాలన్నారు. జిల్లాస్థాయిలో ఉద్యోగులకు అందించే అవార్డులకు సంబంధించి ప్రతిశాఖ నుంచి అయిదుగురికి మించకుండా పేర్లను సూచిస్తూ వివరాలు పంపాలన్నారు. డివిజన్ స్థాయిలో ఆర్డీవో, డిఎస్పీలు ఉద్యోగులకు అవార్డులు అందజేయాలన్నారు. వ్యవసాయ, ఉద్యానవన, డ్వామా, డిఆర్‌డిఏ, హౌసింగ్, మెడికల్, 108, అగ్నిమాపక , పోలీసుశాఖలు ఆహుతులను ఆకర్షించేలా శకటాలు రూపొందించాలన్నారు. మెడికల్‌శాఖ వారు ఎన్‌టిఆర్ ఆరోగ్యశ్రీ, తల్లీబడ్డ ఎక్స్‌ప్రెస్, జలసిరి వంటి శకటాలు ఉండేలా చూడాలన్నారు. అలాగే గణతంత్ర దినోత్సవం రోజున పోలీసు మైదానంలో విద్యుత్ అంతరాయం లేకుండా జనరేటర్ ఏర్పాటుచేయాలని విద్యుత్ ఎస్‌ఇ సుబ్బరాజును ఆదేశించారు. త్వరితగతిని గణతంత్ర సందేశాన్ని సిద్ధం చేయాలని సమాచారశాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
ఇలావుండగా ఈనెల 24 నుంచి బాలికల దినోత్సవం, 25న జాతీయ ఓటర్ల దినోత్సవం కార్యక్రమాలను జిల్లా అధికారులందరూ కలిసికట్టుగా విజయవంతం చేయాలని కలెక్టర్ అధికారులను విజ్ఞప్తిచేశారు. 24న బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉదయం 9.30గంటలకు రాష్ట్ర అతిధిగృహం నుంచి కళాక్షేత్రం వరకు సాగే ర్యాలీలో బాలికలు, ఆశావర్కర్లు అధిక సంఖ్యలో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని డిఇఓ, మెప్మా పిడిలను ఆదేశించారు. ర్యాలీ అనంతరం కళాక్షేత్రంలో సమావేశం ఏర్పాటుచేయాలన్నారు. 25న జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమానికి యువత అధికసంఖ్యలో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని తహసీల్దార్‌ను ఆదేశించారు. ఈసమావేశంలో జాయింట్ కలెక్టర్ శే్వత , అదనపు ఎస్పీ విజయకుమార్ , డిఆర్వో సులోచన , ఆర్డీవో చిన్నరాముడు, జెడ్పి సిఇఓ రజియాబేగం, స్టెప్ సిఇఓ మమత, జిల్లా పరిశ్రమల జనరల్ మేనేజర్ గోపాల్, మెప్మా పిడి వెంకటసుబ్బయ్య ,డ్వామా పిడి బాలసుబ్రమణ్యం, ఐసిడిఎస్ పిడి రాఘవరావు, ఎస్సీ కార్పొరేషన్ ఇడి ప్రతిభాభారతి, సాంఘిక సంక్షేమశాఖ డిడి సరస్వతి తదితరులు పాల్గొన్నారు.
అధికారపార్టీ నేతల సిఫారసులకే అందలం!
ఆంధ్రభూమి బ్యూరో
కడప,జనవరి 19: రాష్ట్రప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన జన్మభూమి-మా ఊరు కార్యక్రమం ఇటీవల 3వ విడత ముగియగా, గ్రామసభలకు లక్షల్లో దరఖాస్తులు వచ్చాయి. అధికారులే ప్రజలవద్దకు వెళ్లి సమస్యలను పరిష్కరించాలన్న ఉద్దేశంతో చేపట్టిన ఈ కార్యక్రమం మూడువిడతల్లో రెండులక్షలు పైబడే దరఖాస్తులు వచ్చాయి. ఈ దరఖాస్తుల్లో రేషన్‌కార్డులు, పెన్షన్లు , దీపం గ్యాస్‌కనెక్షన్లు, శాశ్వత గృహాలు, రోడ్లు, రుణమాఫీ, డ్రైనేజి తదితరాలపై కుప్పలు తెప్పలుగా అర్జీలు వచ్చాయి. ఒక మూడవ విడత జన్మభూమిలోనే 80వేలు పైబడి దరఖాస్తులు వచ్చాయి. అధికారులు వాటిని కంప్యూటీకరణ చేసి ఆన్‌లైన్‌లో సంబంధిత అధికారులకు పరిశీలన నిమిత్తం పంపారు. దశాబ్దాలుగా ఈ సమస్యలపై దరఖాస్తులు అధికారులకు అందుతూనే ఉన్నాయి. గత పదేళ్లుగా కాంగ్రెస్‌పాలనలో ప్రస్తుత అధికారపార్టీ నేతలు ప్రతిపక్షంలో ఉన్నందున వారి అనుచరగణాలకు వివిధ పథకాల్లో పెద్దగా చోటు లభించలేదు. నవ్యాంధ్ర ఏర్పాటయ్యాక తెలుగుదేశం పాలనలో ఇప్పటివరకు జరిగిన మూడు విడతల జన్మభూమి కార్యక్రమంలో అర్హులతోపాటు అనర్హులచే కూడా అధికారపార్టీ నేతలు పోటీపడి దరఖాస్తులు చేయించారు. సంబంధితశాఖల అధికారులు ఈ దరఖాస్తులను అప్‌లోడ్ చేసి దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారి జాబితాల తయారీలో తలమునకలై ఉన్నారు. ఒకే కుటుంబంలో ఇప్పటికే పలు ప్రభుత్వ పథకాలు అందుతున్నా కుటుంబ సభ్యుల్లో మరికొందరి పేర్లతో దరఖాస్తులు చేయించారు. ప్రతి పథకానికి ఆధార్‌కార్డు అనుసంధానం తప్పనిసరి కావడంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన సంక్షేమ పథకాలకు, కొత్తగా వచ్చే దరఖాస్తులకు పొంతన కుదరడంలేదు. జిల్లాలో గత పదేళ్లలో ఇందిరమ్మ పథకం కింద అడిగిన వారికందరికీ గృహాలను నాటి ప్రభుత్వం మంజూరుచేయగా, కడపజిల్లా రాష్ట్రంలోనే ప్రధమస్థానంలో నిలిచింది. ఇందిరమ్మ గృహాలు మూడు దశల్లో జిఓనెం 171, జిఓనెం 33, జిఓ నెం 44, జిఓనెం 23 కింద 2లక్షల 93వేల 787 ఇళ్లు మంజూరుకాగా , 2లక్షల 58వేల 700 ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేశారు. ఈ ఇళ్లకు రూ.10కోట్ల 28 లక్షల 28వేలు ఖర్చు చేశారు. అలాగే జిల్లాలో 28లక్షల 84వేల 500 పైచిలుకు జనాభా ఉండగా, వీరికి 6 లక్షల 99వేల 673 రేషన్‌కార్డులు ఉండగా, ఇటీవల మరో 97వేల కార్డులు మంజూరయ్యాయి. వీరుగాక మరో లక్షమంది రేషన్‌కార్డులకు దరఖాస్తులు చేసుకున్నారు. ఇక జిల్లావ్యాప్తంగా 2లక్షల 52వేల 700 పైచిలుకు పెన్షన్లు అందజేస్తుండగా, ప్రస్తుత జన్మభూమిలో మరో 50వేలు పైబడి దరఖాస్తులు వచ్చాయి. ఎన్నిసార్లు జన్మభూమి సభలు నిర్వహించినా ఒకే తరహా దరఖాస్తులు వస్తుండటం, ప్రభుత్వాలు మారినప్పుడల్లా సంబంధిత రాజకీయ పార్టీల నేతలు తమ అనుచరగణాలకు పథకాలు మంజూరు చేయిస్తుండటంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఈ క్రమంలో అర్హులను గాలికి వదిలి అనర్హులకు అవకాశం కల్పించడంపై సర్వత్రా విమర్శలు విన్పిస్తున్నాయి.

బాంబుల ఘటన వెనుక ఎర్రస్మగ్లర్ల హస్తం?
ఆంధ్రభూమి బ్యూరో
కడప,జనవరి 19: కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం వనిపెంట సమీపంలో నలమల్ల అడవులకు వెళ్లే దారిలో సోమవారం బాంబుపేలి గొర్రెలకాపరికి తీవ్రగాయాలైన ఘటనపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ ఘటనతో అటవీశాఖ అధికారులు, సిబ్బంది ఉలిక్కిపడ్డారు. ఆ ప్రాంతంలో పాతక్షక్షలు ఉండటంతో వారేమైనా బాంబులు దాచిపెట్టారా, లేక ఇటీవల నలమల్లలో ఎర్రచందనం స్మగ్లర్లు పెద్దఎత్తున మాటువేసి ఉండటంతో వారే ఈ బాంబులను ఉంచారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుశాఖ అధికారులు, సిబ్బంది మాత్రం ఈ బాంబులు చాలా పాతవని, ఎవరు దాచివుంచారో అంతుపట్టడం లేదని చెబుతున్నారు. సాధారణంగా ఫ్యాక్షన్ గ్రామాలైన పులివెందుల, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు నియోజకవర్గాల్లోని ఫ్యాక్షన్ గ్రామాల్లో బాంబులను వీధి చివర పేడదిబ్బలు, పాత చెత్తకుప్పల్లో దాచిపెట్టే ఆనవాయితీ ఉండేది. ప్రస్తుతం ఫ్యాక్షన్ గ్రామాల్లో పోలీసులు డేగకనే్నయడంతో ఫ్యాక్షనిస్టులు బాంబుల సంస్కృతిని వదిలేశారు. అటవీప్రాంతంలో బాంబులు బయల్పడటం పోలీసు, అటవీశాఖకు సవాల్‌గా మారింది. ఇటీవల మైదుకూరు నియోజకవర్గంలోని చాపాడులో ఒక పాత ఇంటిని పడగొడుతుండగా, గోడల్లో నుంచి బాంబులు కిందపడి పలువురికి గాయాలయ్యాయి. ఆ ఊరిలో గతంలో ఫ్యాక్షన్ కక్షలు ఉండేవి. కాగా, సోమవారం బాంబులు పేలిన ఘటనను పోలీసు అధికారులు పరిశీలించగా, గతంలో ఆ ప్రాంతంలో ఎటువంటి సంఘటనలు జరిగిన దాఖలాలు లేవని చెబుతున్నారు. తాజాగా దొరికిన బాంబులు కూడా పాతవని అంటూ అటవీ ప్రాంతంలో బాంబులను ఎందుకు దాచిపెట్టారో అంతుబట్టడం లేదని అంటున్నారు. ఎర్రచందనం స్మగ్లర్లు శేషాచలం అడవుల నుంచి వందలకోట్ల రూపాయలు సంపదను దోచుకుంటున్నా బాంబులు అమర్చిన ఘటన ఎప్పుడూ లేదు. ఈ నేపథ్యంలో సోమవారం నల్లమల అటవీప్రాంతాలకు వెళ్లే దారిలో గొర్రెల కాపర్లు, పశువుల కాపర్లు నిత్యం సంచరించే ప్రాంతంలో బాంబుపేలి బాలుడికి తీవ్రగాయాలయ్యాయి. ఇటీవల ఎర్రచందనం స్మగ్లర్లు ఈప్రాంతానికి చేరారు. పోలీసులు, అటవీశాఖ అధికారులు కూంబింగ్ నిర్వహిస్తున్న నేపథ్యంలో వారిని ఎదుర్కొనేందుకు స్మగ్లర్లు బాంబులు దాచిపెట్టారేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత కొంతకాలంగా నలమల్ల అడవుల్లో కూడా పెద్ద ఎత్తున ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్నారు. ఇటీవల 100మందికి పైబడి ఎర్రకూలీలను ఈప్రాంతంలో అరెస్టు చేశారు. దీంతో ఆ కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.