కడప

ఎస్సీ, ఎస్టీలపై చిన్నచూపు తగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,సెప్టెంబర్ 16: సమాజంలో అనేక మార్పులు వచ్చి సాంకేతికపరంగా ఎంతో ఎదిగి అన్నికులాలు, మతాల మేధావులు జాతీయ స్థాయికి చేరినా సమాజంలో నేటికి ఎస్సీ,ఎస్టీలపై చిన్నచూపు చూస్తున్నారని సమాజంలో తక్కువ స్థాయిలో ఉన్న వీరికి సమానహోదా కల్పించాలని ఎస్సీ,ఎస్టీ సంక్షేమ కమిషన్ జాతీయ సభ్యురాలు పిఎం కమలమ్మ పేర్కొన్నారు. శుక్రవారం ఆమె నగరంలోని స్టేట్ గెస్ట్‌హౌస్‌లో విలేఖర్ల సమావేశంలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగపిత డా.బి.ఆర్.అంబేద్కర్ దళితులకోసం రాజ్యాంగంలో అనేక అంశాలను చేర్చారని, అంటరానితనం రూపుమాపేందుకు ఆయన ఎనలేని కృషి చేస్తూ రాజ్యాంగంలోనే అనేక సిద్దాంతాలు రూపొందించారని, అయితే అంబేద్కర్ ఆశయాలకు తిలోదకాలు ఇస్తున్నారని ఆమె గుర్తు చేశారు. స్వచ్చంధ సంస్థలు, వివిధ సంఘాలు, మేధావులు అంబేద్కర్ ఆశయాలు విస్తృతంగా ప్రచారం చేసి ఎస్సీ,ఎస్టీలను ఉన్నతస్థాయికి తీసుకెళ్లేందుకు అంటరానితనం రూపుమాపేందుకు రాజ్యాంగంలో పొందుపరచిన హక్కులను సద్వినియోగం చేసుకునేందుకు అవగాహన కల్పించి ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేసి ప్రతి ఒక్కరిలో చైతన్యం తేవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. స్వాతంత్య్రం వచ్చి ఆరుదశాబ్దాలు దాటినా ఎస్సీ, ఎస్టీలపై సమాజంలో వివక్షత పోలేదని అధికారులు, స్వచ్చంధ సంస్థలు ఎస్సీ, ఎస్టీల హక్కులు కాపాడాలని ఆమె కోరారు. ఎస్సీ, ఎస్టీ సమస్యలు పరిష్కరించేందుకు రాష్టప్రతి, పార్లమెంట్‌కు కమిషన్ నివేదించిందన్నారు. ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్ కింద (విడుదలయ్యే నిధులు వారికి చెందకుండా పక్కదారి పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో ఎస్సీ,ఎస్టీ సమస్యలు తిష్టవేసుకుని కూర్చున్నాయని వాటి పరిష్కారంలో అధికారులు విఫలమయ్యారని వారికి ప్రభుత్వం ఇచ్చిన భూములు సైతం పెద్దల పాలయ్యాయని , పోలీసులు, రెవెన్యూశాఖల్లో సమన్వయం లేకుండా వాటిని పరిష్కరించడంలో కూడా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నట్లు ఆమె ఆరోపించారు. నేటికి ఎస్సీ,ఎస్టీ కాలనీల్లో రోడ్లు, మరుగుదొడ్లు, డ్రైనేజిలు, తాగునీటి సమస్య, వీధి దీపాలు తదితర సమస్యలు తిష్టవేసుకుని కూర్చున్నాయని వాటిని వెంటనే పరిష్కరించాలని ఆమె అధికారులను ఆదేశించారు. ఎస్సీ,ఎస్టీలపై వివక్షత చూపేవారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని వారి సంక్షేమం కోసం అధికారులు కృషి చేయాలని ఆమె పేర్కొన్నారు.

రైతుల సుభిక్షమే సిఎం ఆకాంక్ష

పులివెందుల, సెప్టెంబర్ 16: రైతుల సుభిక్షమే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్ష అని శాసనమండలి ఉపాధ్యక్షుడు సతీష్‌కుమార్‌రెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక ఆర్ అండ్‌బి అతిథిగృహంలో పిబిసి అధికారులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన నీటిపారుదలశాఖ అధికారులతో మాట్లాడుతూ మిడ్‌పెన్నార్ నుంచి తుంపెర మీదుగా తుంగభద్రకు నీరురావడంలో ఎందుకు ఆలస్యం జరుగుతుందని అధికారులను సతీష్‌రెడ్డి ప్రశ్నించారు. తుంపెరవద్ద ఎడమ గేట్ సరిగా తెరుచుకోకపోవడంతో నీరు తగ్గిందని అధికారులు సమాధానమివ్వడంతో వెంటనే గేట్‌కు మరమ్మతులు నీరు సజావుగా వచ్చేలా చర్యలు తీసుకోవాలని సతీష్‌రెడ్డి ఆదేశించారు. అలాగే కాలువ లైనింగ్ పనులు ఎంతవరకు వచ్చాయని ఆరాతీశారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ నవంబర్, డిసెంబర్ నెలల కల్లా గండికోటకు నీరు తీసుకొచ్చి అక్కడి నుంచి పైడిపాళెం, చిత్రావతిలకు నీటిని తరలించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఇందుకు సంబంధించి అక్కడక్కడా ప్రాజెక్టు పనులను చేయిస్తున్నామని, ఈ నీరు రావడంవలన రైతులు పుష్కలంగా పంటలు పండించుకోవాలనే ధ్యేయంతోనే చంద్రబాబు దృష్టి కేంద్రీకరించారని తెలిపారు. కొందరు ప్రతిపక్షం ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని, ఆయా ప్రాజెక్టుల వద్ద జరిగే పనులను పరిశీలిస్తే పరిస్థితి అర్థమవుతుందన్నారు. రాయలసీమలో కరువు లేకుండా చూడాలనే దృఢ సంకల్పంతో ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. వర్షాలు సరిగా కురవకపోవడంతో పంటలకు నీరందించే ఉద్దేశ్యంతో రెయిన్‌గన్‌లను ప్రభుత్వం సరఫరా చేస్తోందన్నారు. ఇటీవల రాయచోటిలో జరిగిన సమావేశంలో ఐదు ఎకరాలకు పైగా భూమి కలిగిన వారికి 70శాతం రాయితీని ఇవ్వాలని, కాన్నీ అక్కడి రైతులు మాకు 90శాతం రాయితీ ఇచ్చేలా చూడాలని కోరడంతో వెంటనే ముఖ్యమంత్రి స్పందించి పది ఎకరాల లోపు భూమి ఉన్నవారికి 90శాతం, అంతకుపైగా ఉన్నవారికి 70శాతం రాయితీ ఇవ్వాలని జిఓ జారీచేశారని, ఇదీ చంద్రబాబుకు రైతులపట్ల వున్న ప్రేమ అని తెలిపారు. కడపలో ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి రైతు మహాధర్నా చేశారని, ఆయనకు రైతుల గురించి ఏమి తెలుసునని ప్రశ్నించారు. అక్కడక్కడా పరిశీలించడమే తప్ప అధికారులతో సమావేశాలు నిర్వహించి రైతుల సమస్యలను తెలుసుకోలేదన్నారు. ఆయన జిల్లాలో ఎప్పుడు పర్యటించినా వారి కుటుంబ సభ్యుల్లో ఏదో ఒక కార్యక్రమాలుంటేనే తప్ప జిల్లాకు రారని, కానీ పులివెందుల నియోజకవర్గానికి నీటిని తీసుకొచ్చేందుకు తాము అన్నివిధాలా ప్రయత్నాలు చేస్తుంటే జగన్ దానిని కూడా తప్పుబట్టడం దారుణమన్నారు. కార్యక్రమంలో పిబిసి ఎస్‌ఈ వెంకటేశ్వరరావు, డిఈ కిరణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఆయన అక్కడికి వచ్చిన కార్యకర్తలు, ప్రజలతో సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
ఊరిస్తున్న మున్సిపల్ ఎన్నికలు!

రాజంపేట, సెప్టెంబర్ 16: రాజంపేట మన్సిపాలిటీ ఎన్నికల ప్రక్రియ అదిగో ఇదిగో అన్నట్టుగా పరిస్థితులు తయారయ్యాయి. గత రెండేళ్ల నుండి వాయిదాపడ్డ రాజంపేట మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వ ప్రకటనల నేపధ్యంలో ముందస్తు వ్యూహరచనతో అధికార తెలుగుదేశం పార్టీ, విపక్ష వైకాపాలు పావులు కదుపుతున్నాయి. ఎవరికి వారు వారివారి వ్యూహరచనలు అమలుచేసుకుంటూ ముందుకెళుతుండడం జరుగుతుంది. అధికార తెలుగుదేశం పార్టీ అయితే అభివృద్ధి, సంక్షేమ పథకాల పేరుతో ఓటర్లను ఆకర్షించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తుంది. విపక్ష వైకాపా మాత్రం ప్రభుత్వ తప్పిదాలు ఎత్తిచూపుతూ ప్రజలకు దగ్గరయ్యేందుకు యత్నిస్తున్నది. తాజాగా రాష్ట్రంలో వాయిదా పడ్డ మున్సిపాలిటీలు, కార్పోరేషన్‌లకు ఎన్నికలు నిర్వహించే అవకాశాలపై ప్రకటనలు వెలువడుతున్న దృష్ట్యా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అధికార తెలుగుదేశంతో పాటు విపక్ష వైకాపాలు తమ వేగాన్ని పెంచాయని చెప్పవచ్చు. సామాజికసేవా కార్యక్రమాల ద్వారా కూడా ప్రజలకు చేరువయ్యేందుకు ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు. ఈ రెండు పార్టీల్లో మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థిత్వంకు సంబంధించి ఒక అవగాహనకు వచ్చి ఉన్నట్టు సమాచారం. దీంతో ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ వెలువడడమే ఆలస్యమన్నట్టు రాజంపేటలో మున్సిపల్ ఎన్నికల సమరం తయారై ఉంది. విపక్ష వైకాపా ఒక ఆడుగు ముందుకేసి మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి కమిటీ నియామకం పూర్తిచేసింది. తెలుగుదేశం పార్టీ కమిటీ వేయకపోయినా ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి పార్టీ నేతలు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని ఆదేశించి వెళ్ళడం జరిగింది. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి గంటా శ్రీనివాసరావు ఇప్పటకే మున్సిపాలిటీలో పర్యటనలు కూడా పూర్తిచేసి ఎన్నికలకు అవసరమైన ప్రణాళికను రూపొందించి వెల్లారు. వైకాపా అధినేత సొంత జిల్లా కావడం, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథరెడ్డి సొంత నియోజకవర్గం కావడంతో రాజంపేట మున్సిపల్ ఎన్నికలను ఆ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకోక తప్పదు. ఇదేవిధంగా అధికారంలోకి వచ్చిన తరువాత తొలిసారిగా జరుగుతున్న ఈ ఎన్నికల్లో విజయం సాధించడం అధికార తెలుగుదేశం పార్టీకి కూడా ప్రతిష్టాత్మకంగా మారింది. దీంతో సహజంగానే అధికార తెలుగుదేశం పార్టీతోపాటు, విపక్ష వైకాపా పార్టీలు ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి దృష్టి కేంద్రీకరించాయి. ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఈ పార్టీలు సమాయత్తమవుతున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించేందుకు అవసరమైన వ్యూహ ప్రతివ్యూహాలు ఇప్పటినుండే ఈ పార్టీలు రచిస్తున్నాయి. పట్టణ శివారు ప్రాంతాలు కలిపి ఎన్నికలు జరిగితే ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలి, ప్రస్తుతమున్న వార్డుల ప్రకారమే ఎన్నికలు జరిగిన పక్షంలో పరిస్థితులు ఏమిటి తదితర అంశాలపై లోతుగా ఈ పార్టీలు వ్యూహరచనలో నిమగ్నమయ్యాయి. అధికార తెలుగుదేశం పార్టీలో మున్సిపల్ ఛైర్మన్ కోసం పోటీ రసవత్తరంగా ఉన్నప్పటికి వైకాపాలో ఛైర్మన్ కోసం పోటీ లేదనే చెప్పాలి. ఇకపోతే అధికార తెలుగుదేశం పార్టీలో అంతర్గత వైషమ్యాలు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి. ముఖ్యంగా ఛైర్మన్ అభ్యర్థిత్వం ఆధికారికంగా వెల్లడైన తరువాత ఈ వైషమ్యాల ప్రభావం కనిపించనుంది. కొందరు ఇప్పటికే ఛైర్మన్ స్థానాన్ని దక్కించుకునే ఎత్తుగడల్లో పావులు కదుపుతున్నారు. ఇందుకోసం చిన్నపాటి క్యాంప్‌లు కూడా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీనేతల్లో వర్గ రాజకీయాలు రాజ్యమేలుతూ ఈ నేతలు పైకి బాగానే ఉన్నట్టు కనిపిస్తూ పలకరించుకుంటున్నప్పటికి ఎవరికి వారు యమునా తీరు అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. మున్సిపాలిటీలో అధికారపార్టీకి ఎదురొడ్డి నిలిచి గెలవాలంటే వైకాపాకు ఆషామాషీ వ్యవహరం కాదని రాజకీయ విశే్లషకులు భావిస్తున్నారు. ఎందుకంటే అధికార బలం తెలుగుదేశం పార్టీకి అండగా నిలిచే పరిస్థితులు ఎవరూ కాదనలేని సత్యం. అయితే వైకాపా పార్టీ నేతలంతా కలిసికట్టుగా పోరాడితే విజయం సాధిస్తామని ఆ పార్టీ అంతర్గత చర్చల్లో ఆ పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఏది ఏమైనా రాజంపేట మున్సిపల్ ఎన్నికల రాజకీయం రోజురోజుకు వేడెక్కుతున్నదని చెప్పవచ్చు.

కడప ఉక్కు.. రాయలసీమ హక్కు..

రాయచోటి, సెప్టెంబర్ 16: కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ స్థాపన రాయలసీమ జిల్లా ప్రజల హక్కు అని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పులి కృష్ణమూర్తి అన్నారు. శుక్రవారం స్థానిక కొత్తపేట నుండి బస్టాండు మీదుగా కార్యకర్తలతో ర్యాలీగా నేతాజీ సర్కిల్‌కు చేరుకొని రహదారిని దిగ్బంధనం చేశారు. ఈ సందర్భంగా పులి కృష్ణమూర్తి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాయలసీమకు ద్రోహం చేశాయన్నారు. వెంటనే కడపలో ఉక్కు పరిశ్రమ స్థాపించాలని అలాగే గుంతకల్ రైల్వేజోన్ ఏర్పాటు చేయాలన్నారు. రాయలసీమకు నికర జలాలు ఇవ్వాలన్నారు. వెంటనే రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలన్నారు. గనుల ఆధార పరిశ్రమలు ఏర్పాటు చేయాలన్నారు. ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటైతే 28 వేల మందికి ప్రత్యక్షంగా లక్ష మందికి పరోక్షంగా ఉపాధి దొరుకుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సభ్యులు కోటేశ్వరరావు, సీపీఐ సీనియర్ నాయకులు గంగిశెట్టి, సుజాత, రమణ, బక్షు, సుధాకర్, ఏఐవైఎఫ్ నాయకులు వెంకటేష్, మల్లిఖార్జున, ఏఐఎస్‌ఎఫ్ నాయకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

నిబంధనల మేరకే పరీక్షలు నిర్వహించాలి
ఖాజీపేట,సెప్టెంబర్ 16: ప్రభుత్వం ఏర్పాటుచేసిన కాలపట్టిక మేరకే మూడునెలల పరీక్షలు (ఎస్-1) నిర్వహించాలని మండల విద్యాధికారి సివి ప్రసాద్ ప్రధానోపాధ్యాయులకు సూచించారు. మండలంలోని ఎమ్మార్సీ కార్యాలయంలో శుక్రవారం ప్రధానోపాధ్యాయుల ప్రత్యేక సమావేశం జరిగింది. సమావేశంలో ఆయన మాట్లాడుతూ మొదటగా విద్యార్థుల జాబితాలను ఆధార్‌తో అనుసంధానం చేయాలన్నారు. ఈనెల 22న ఉదయం 9.45గంటలకు, మధ్యాహ్నం 1.45 గంటలకు మాత్రమే ప్రశ్నాపత్రాల సీల్ తీయాలన్నారు. మండలంలోని ప్రతిపాఠశాల యాజమాన్యం, ప్రధానోపాధ్యాయులు నిబంధనలు తప్పక పాటించాలని సూచించారు.

తాగునీటికోసం రోడ్డెక్కిన మహిళలు

ఖాజీపేట,సెప్టెంబర్ 16: గత వారంరోజులుగా పెన్నా సమీపంలోని మునిపాక నుంచి రావాల్సిన తాగునీరు రాకపోవడం, స్థానికంగా ఉన్న బోర్లు కాలిపోయి పనిచేయకపోవడంతో పాడిమీదపల్లె, దుంపలగట్టు మహిళలు రోడ్డుపై బైఠాయించి జాతీయ రహదారిని స్తంభించారు. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గత పదిరోజులుగా మోటార్లు చెడిపోయాయంటూ రిపేర్లు చేయకుండా కాలయాపన చేస్తున్న అధికారులపై చర్యలు తీసుకుని తమకు తాగునీరు అందించేంతవరకు ఆందోళనలు కొనసాగిస్తామన్నారు. లక్షలాది రూపాయలు మునిపాక స్కీమ్‌కు ఖర్చు చేస్తున్నా ఇప్పటి వరకు మంచినీరు సరఫరా చేయకపోవడం బాధ కలిగిస్తుందని స్థానిక మోటార్లు రిపేర్లు చేయకపోవడం గ్రామంలో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఏర్పడిందని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. బోర్లలో సైతం నీరు అడుగంటిపోయి ప్రత్యేక అవసరాలకు వాడుకునే వీలు కూడా లేకపోయిందంటూ వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తాగునీటి వసతిని కల్పించకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ట్రాఫిక్ మూడు కిమీ మేర నిలిచిపోవడంతో స్థానిక పోలీసులు కల్పించుకుని అధికారులతో మాట్లాడతామని జాతీయ రహదారిని స్తంభింపచేయడం అందరికీ ఇబ్బంది కలుగచేస్తుందని వారించి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.

క్రమశిక్షణతో పనిచేయాలి

ఆంధ్రభూమి బ్యూరో
కడప,సెప్టెంబర్ 16: పోలీసులు నిజాయితీగా పనిచేస్తే శాంతిభద్రతలు అదుపులోకి వస్తాయని, అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపితే ప్రజల్లో నమ్మకం పెరుగుతుందని కొత్తగా ఎస్‌ఐలు విధుల్లో చేరుతున్న వారితో నిర్వహించిన సమావేశంలో ఎస్పీ పిహెచ్‌డి రామకృష్ణ పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నూతనంగా విధుల్లో చేరుతున్న ఎస్‌ఐలకు ఎస్పీ సమావేశమై మాట్లాడారు. ఎస్‌ఐలుగా శిక్షణ పూర్తిచేసుకుని తొలిసారిగా ఎస్పీకి రిపోర్టు చేసిన ఎస్‌ఐలతో ఆయన ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేసి మాట్లాడారు. ఎస్‌ఐలు పోస్టులు దక్కించుకోవాలంటే కష్టంతో కూడుకున్న పని అని విధుల్లో ప్రజలతో మమేకమై అవినీతి అక్రమాలను నిరోధిస్తూ శాంతిభద్రతలు పూర్తిస్థాయిలో పరిరక్షించాలని ఆయన కోరారు. జిల్లాలో మట్కా, గ్యాంబ్లింగ్, క్రికెట్ బెట్టింగ్, ఎర్రచందనం, ఇసుక అక్రమరవాణా జరుగుతోందని ఎస్‌ఐలు అసాంఘిక శక్తులపై నిఘా వుంచి అసాంఘిక కార్యకలాపాలకు కళ్లెం వేయాలని ఆయన సూచించారు. శాంతి భద్రతలకు విఘాతం కల్పించడం కానీ, సమస్యలు ఉత్పన్నం చేసి శాంతికి విఘాతం కల్పిస్తే వారిని ఉపేక్షించరాదని, ఎంతటివారినైనా క్షమించకుండా చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశించారు. అసాంఘిక శక్తుల వత్తిళ్లకు లొంగితే ప్రజల్లో నమ్మకాలు కోల్పోయి సమాజంలో చెడ్డపేరు తెచ్చుకుంటారని ఆయన గుర్తు చేశారు. ప్రతి ఎస్‌ఐ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల మర్యాద పూర్వకంగా వ్యవహరించి వారి సమస్యలను తెలుసుకుని సమగ్రంగా విచారించి వారికి న్యాయం చేసినప్పుడే పోలీసులకు ప్రజలు అందుబాటులోకి రావడం, శాంతి భద్రతలకు సహకరిస్తారని ఎస్పీ గుర్తు చేశారు. ప్రతి ఎస్‌ఐ సహనం, ఓర్పు, నిజాయితీ, క్రమశిక్షణతో ఉన్నప్పుడే ప్రజలకు చేరువ అవుతామని లేనిపక్షంలో ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని ఏ ఒక్కరిపై తనకు ఫిర్యాదులు అందినా క్షమించే ప్రసక్తేలేదని ఆయన హెచ్చరించారు. అనంతరం ఓఎస్‌డి (ఆపరేషన్) సత్యయేసుబాబు మాట్లాడుతూ ప్రతి ఎస్‌ఐ నీతి నిజాయితీ సిద్దాంతాలు కలిగి కష్టపడి పనిచేసి పోలీసుశాఖకు మంచి పేరు తెచ్చి శాఖప్రతిష్టను పెంచాలని సూచించారు. జిల్లా అదనపు ఎస్పీ (పరిపాలన) విజయకుమార్ మాట్లాడుతూ స్టేషన్‌కు ఫిర్యాదుదారులు వస్తే ఎస్‌ఐలే స్వయంగా ఫిర్యాదులు స్వీకరించి పూర్తిస్థాయిలో విచారణ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కడప డిఎస్పీ అశోక్‌కుమార్, ఎస్‌బి డిఎస్పీ, ఫ్యాక్షన్‌జోన్ డిస్పీ, తదితర శాఖల డిఎస్పీలు రాజగోపాల్‌రెడ్డి, శ్రీనివాసులు, నాగేంద్రుడు తదితరులు పాల్గొన్నారు.

జిల్లాకు 685 బోరుబావులు మంజూరు
ఆంధ్రభూమి బ్యూరో
కడప,సెప్టెంబర్ 16: అత్యంత దుర్భిక్షప్రాంతమైన కడప జిల్లాకు 685 బోరుబావులను ప్రభుత్వం మంజూరు చేసింది. కలెక్టర్ కెవి సత్యనారాయణ జిల్లా వ్యాప్తంగా ఆయనకున్న అవగాహనతో ఈ బోరు బావుల మంజూరుకు ఎనలేని కృషి చేశారు. జిల్లాలో భూగర్భజలాలు అంతంతమాత్రంగానే ఉండటంతో నీరు-చెట్టు కార్యక్రమంలో భాగంగా ఆయన ప్రతి వర్షం బొట్టును ఆదా చేసేందుకు చేపట్టిన పనులు సత్పలితాలు ఇవ్వడంతో గతంలో కంటే ప్రస్తుతం భూగర్భజలాలు కొంతమేరకు నిల్వతో ఆయన బోరుబావుల కోసం రాష్ట్ర ఉన్నతాధికారులతో సంప్రదించి జిల్లాకు 685 బోర్లు మంజూరు చేయించారు. జిల్లాలో 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నీటి అవసరం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఆయన బోరుబావులు ఏర్పాటుచేయించి రైతులను ఆదుకునేందుకు చేసిన కృషి ఫలించింది. ఎన్‌టిఆర్ జలసిరి ఫేస్ -2 కింద 400 అదనపు బోర్లు ప్రభుత్వం మంజూరు చేయగా ఇప్పటికే 280 బోర్లు మంజూరు చేసింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో ఈ బోర్లను మంజూరు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు జిల్లాపై పూర్తిగా అవగాహన ఉండటంతో సీమ జిల్లాల్లో అత్యంత కరవైన అనంతపురం జిల్లాతోపాటు కడప జిల్లాకు కూడా పెద్దపీట వేశారు. ఈనేపధ్యంలో ఎన్‌టిఆర్ జలసిరి ఫేస్ -2 కింద 400 బోర్లుకు అనుమతికి పంచాయతీశాఖ అధికారి రామాంజనేయులు శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలోని సన్న, చిన్నకారు రైతుల భూములకు జలవనరుల సౌకర్యం కల్పించేందుకు బోరు బావులు మంజూరు చేశారు. అయితే బోరుబావులు పెద్దల వశం కాకుండా పేదలకు అందేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జిల్లా కలెక్టర్ కెవి సత్యనారాయణ ప్రత్యేక దృష్టిసారించి వర్షాభావ పరిస్థితుల్లో పంటలు కాపాడుకోలేని స్థితిలో ఉన్న ప్రాంతాల్లో బోరుబావుల ఏర్పాటుకు ఆయన చర్యలు చేపట్టారు. ఈమేరకు సంబంధిత శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

22న సీమ జిల్లాల
కాపు సంఘాల నేతల సమావేశం

ఆంధ్రభూమి బ్యూరో
కడప,సెప్టెంబర్ 16: సీమ జిల్లాల్లో బలిజలను (కాపులు) బిసిల్లో చేర్చేందుకు ఈనెల 22న కలెక్టరేట్‌లో కాపుసంఘాల నేతలతో అవగాహన సదస్సు ఏర్పాటు చేసినట్లు కాపు సంఘాల నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రాంతాలవారీగా కాపుల్లో ఉన్న అనుమానలపై చర్చించడం, కాపుల కార్పొరేషన్ ఏర్పాటు, బిసిల్లో చేర్చేందుకు తీసుకోవాల్సిన కారణాలపై అవగాహన, అభిప్రాయసేకరణ నిమిత్తం ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నారు. ఈనెల 26న జిల్లాలో ఆంధ్రప్రదేశ్ జాతీయ సంక్షేమ కమిషన్ ఏర్పాటుచేసి ప్రజావాదనను విన్పించేందుకు కాపునేతలంతా సిద్దవౌతున్నారు. మంజునాధ కమిషన్ జిల్లా పర్యటన సందర్భంగా రానున్న సమయంలోబిసి కులాల నుంచి వ్యతిరేకత ఎదురుకాకుండా కాపులు వ్యవహరించేందుకు ముందస్తు వ్యూహాన్ని పన్నుతున్నారు. కాపుల జీవనశైలి, స్థితిగతులు, జీవన ప్రమాణాలు ఎదుర్కొంటున్న సమస్యలు, పేదరికం, రాజకీయంగా, సామాజికపరంగా, ఆర్థిక పరంగా వెసులుబాటుపై బిసి కమిషన్ ముందు వాదన విన్పించాలని కాపునేతలు నివేదికలు తయారుచేస్తున్నారు. జిల్లాలో కాపుల వెసులుబాటుతనాన్ని వివిధ పదవుల్లో అన్యాయం జరగడం, చాలామంది పేదరికంలో మగ్గుతున్నట్లు బిసి కమిషన్ ముందు వాదన విన్పించాలని నిర్ణయించారు. ఈనేపధ్యంలో శుక్రవారం మధ్యాహ్నం బిసి కార్పొరేషన్‌లో ఏపి రాష్ట్ర కాపుల సంక్షేమం, అభివృద్ధి కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ ఎం.పెంచలయ్య అధ్యక్షతన బిసి కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రామచంద్రారెడ్డి, బిసి సంక్షేమాధికారి వెంకయ్య తదితరులు పాల్గొని విలేఖర్ల సమావేశం ఏర్పాటుచేశారు.

మెట్టరైతుకు ఉపయోగపడని వర్షాలు!

ఎర్రగుంట్ల,సెప్టెంబర్ 16: గత వారంరోజులుగా కడప జిల్లాలో పలు ప్రాంతాల్లో కురుస్తున్న ఒక మోస్తరు వర్షాలు మెట్టరైతాంగానికి మాత్రం ఉపయోగపడే పరిస్థితి కన్పించడం లేదు. ఖరీఫ్‌లో వేసిన వేరుశెనగ, మినుము, పత్తి తదితర పంటలు వర్షాభావ పరిస్థితుల కారణంగా ఎండిపోవడం, పూర్తిగా దెబ్బతినడం జరిగింది. ప్రస్తుతం కురిసిన అరకొర వర్షాలకు ఆ పంటలు చేతికొచ్చే పరిస్థితి కన్పించలేదు. కురిసిన వర్షాలు బోర్లకింద , బావుల కిందవేసిన వరి, కూరగాయలు, పండ్లతోటలకు మాత్రం కొంత ఊరటకలిగించింది. జిల్లాలో ఈ ఏడాది మెట్టరైతులు వేరుశెనగతోపాటు పత్తి,మినుము, కంది, కొర్ర తదితర పంటలు వేశారు. ముఖ్యంగా వర్షాదారంపై ఆధారపడిన రైతాంగం వేసిన పంట చేతికి వచ్చే పరిస్థితికానరాక పోవడంతో ప్రస్తుతం జొన్న, శెనగ, ధనియాలు తదితర పంటలు వేసేందుకు సిద్దపడుతున్నారు. అయితే అక్టోబర్ మాసం మొదటి వారంలో శెనగ, ధనియాలు, ప్రొద్దుతిరుగుడు తదితర పంటలు వేయాల్సివుంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు భూగర్భజలాలను అంతో ఇంతో పెంచేందుకు తప్ప ఇప్పటికిప్పుడు పంటలకు వచ్చే లాభం ఏమీలేదు. ఎండిన పంటలు ఎండిపోగా అంతో ఇంతో బ్రతికి ఉన్న పంటలు మాత్రం దిగుబడి తగ్గి రైతాంగాన్ని తీవ్రనష్టాన్ని కలిగించింది. ముఖ్యంగా పులివెందుల, జమ్మలమడుగు, కమలాపురం, రాయచోటి, ప్రొద్దుటూరు తదితర ప్రాంతాల్లో వేసిన వేలాది ఎకరాల మెట్టపంటలు పూర్తిగా దెబ్బతినడం, ఎండిపోవడం జరిగింది. వారంరోజులుగా ఒక మోస్తరు వర్షాలుకురిసినా దెబ్బతిన్న పంటలకు మాత్రం ఎలాంటి ప్రయోజనం లేదు. అక్టోబర్ మొదటివారంలో జొన్న, శెనగ, పత్తి, ప్రొద్దుతిరుగుడు, ధనియాలు తదితర పంటలు వేసేందుకు రైతులు సిద్దపడుతున్నారు. పంటలు వేసేందుకు తిరిగి భూములు చదునుచేసేందుకు రైతాంగం ఆర్థికంగా ఇబ్బందులుపడుతూ విత్తనాల కోసం ఆరాటపడుతున్నారు. ప్రస్తుతం కురిసిన వర్షాలు విత్తనం వేసేందుకు ఉపయోగపడినా అనంతరం వర్షాలు పడకపోతే వేసిన పంటలు దెబ్బతింటాయేమోనన్న అనుమానం రైతుల్లో కలుగుతోంది. ఖరీఫ్‌లో వేసిన పంట దెబ్బతినడం, రెండవ పంట కూడా అదే పరిస్థితికి వస్తే కోలుకోలేని దెబ్బ రైతాంగంపై పడుతుందని సామాన్యరైతు ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. రైతులను అన్ని విధాల ఆదుకుంటామని చెబుతున్న ప్రభుత్వం కానీ, అధికారులు కానీ నష్టపోయిన రైతుల వంక చూడను కూడా చూడలేదు. గతంలో బ్యాంకులు పంట రుణాలను రెన్యువల్ చేయడంతో మొదటి పంట వేసుకోగలిగిన రైతులు రెండవ పంటకు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రూ.2లు నుంచి రూ.5లు వరకు ప్రైవేట్ వ్యక్తుల నుంచి వడ్డీలకు తెచ్చుకుని విత్తనం వేసేందుకు కొందరు సిద్దపడుతున్నా విత్తనం వేసిన అనంతరం వర్షాభావ పరిస్థితులు ఏర్పడితే తమ పరిస్థితి ఏమిటన్న ఆందోళన సర్వత్రా వ్యక్తవౌతోంది. పంట వేయకపోతే ఆర్థికభారం ఎక్కువ అవుతుందని, వేస్తే మరింతభారం పెరుగుతుందన్న ఆందోళన రైతుల్లో స్పష్టంగా కనబడుతోంది. ఈపరిస్థితుల్లో మెట్టరైతులను ఆదుకోవాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉంది.

ప్రతి పేదవాడికి సొంత ఇల్లే టిడిపి లక్ష్యం

కడప,(రూరల్)సెప్టెంబర్ 16: ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఉండాలనే లక్ష్యంతో తెలుగుదేశం ప్రభుత్వం ముందుకెళుతోందని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆర్.శ్రీనివాసరెడ్డి (వాసు) పేర్కొన్నారు. శుక్రవారం నబీకోటలోని కార్పొరేషన్ డివిజన్ కార్యాలయం ఆవరణలో చెర్లోపల్లె లబ్ధిదారులకు అవగాహన సదస్సు జరిగింది. సమావేశానికి హాజరైన వాసు మాట్లాడుతూ ప్రతి పేదవాడికి కూడు, గూడు, గుడ్డ ఉండాలనే లక్ష్యంతో అప్పటి సిఎం స్వర్గీయ ఎన్‌టి రామారావు, ప్రస్తుత ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు పనిచేస్తున్నారన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక పేదలు సంతోషంగా ఉండాలనే తపనతో పనిచేస్తున్నారన్నారు. చెర్లోపల్లె కాలనీలో అసంపూర్ణంగా ఉన్న ఇళ్ల నిర్మాణాలను పూర్తిచేసుకుని లబ్ధిదారులు సొంత ఇళ్లల్లో చేరాలన్నారు. 4,444 ఇళ్లు మంజూరయ్యాయని అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సహాయం అందుతుందన్నారు. ఖాజానాపై ఎంతభారం ఉన్నా ఇళ్లనిర్మాణాలు పూర్తిచేయించి ప్రజలకు వౌలిక వసతులు కల్పిస్తామన్నారు. గత ప్రభుత్వాలు హౌసింగ్‌ను నిర్లక్ష్యం చేశాయని తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా పేదలకు గృహనిర్మాణ కార్యక్రమం చేపడుతూనే ఉంటుందన్నారు. భవిష్యత్‌లో ఇంకా ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామన్నారు. చెర్లోపల్లె కాలనీ వాసులు ప్రతి సమస్యను స్థానిక కార్పొరేటర్ ద్వారా తన దృష్టికి తీసుకురావచ్చునన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్టన్రాయకులు ఎస్.గోవర్ధన్‌రెడ్డి, నగర అధ్యక్షుడు ఎస్.హరిప్రసాద్, చింతకొమ్మదినె్న తహశీల్దార్ మధుసూదన్‌రెడ్డి, హౌసింగ్ డిఇ రమణరాజు, కార్పొరేటర్లు పి.సురేష్, చైతన్య, బాలస్వామిరెడ్డి, రాజశేఖరరెడ్డి, రామకృష్ణారెడ్డి, ఎంఎల్‌ఎన్ సురేష్ తదితరులు పాల్గొన్నారు.

మైరాడ వాటర్‌షెడ్ల నిర్మాణంలో
నిధుల దుర్వినియోగం

గాలివీడు, సెప్టెంబర్ 16: మండలంలోని మూడు గ్రామ పంచాయతీలలో మైరాడ(ఎన్జీవో) సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన వాటర్‌షెడ్ పనుల్లో భారీ స్థాయిలో అక్రమాలు నెలకొని కోటి రూపాయల మేర ప్రభుత్వ నిధుల దుర్వినియోగం జరిగిందని డ్వామా పీడీ రమేష్ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక మైరాడ కార్యాలయంలో మూడు గ్రామ పంచాయతీలకు సంబంధించిన వాటర్‌షెడ్ పనుల నిర్వహణపై ప్రజలతో బహిరంగ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన పీడీ మాట్లాడుతూ వాటర్‌షెడ్ పనులపై రికార్డులను పరిశీలించగా భారీ స్థాయిలో నిధులు దుర్వినియోగమైనట్లు స్పష్టమైందని ఈ సమాచారాన్ని సమగ్రంగా జిల్లా కలెక్టర్‌కు నివేదించి నిధుల దుర్వినియోగానికి పాల్పడిన ఎన్జీవోలు, స్వాహారాయుళ్లపై క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఓపెన్‌ఫోరమ్ సందర్భంగా రికార్డులను పరిశీలిస్తూ ఇందులో జరిగిన అవకతవకలపై డ్వామా పీడీ అసహనం వ్యక్తం చేస్తూ మైరాడ అధికారులపై మండిపడ్డారు. 2009 నుండి ఈ వాటర్‌షెడ్ పనుల నిమిత్తం దాదాపు రూ.2,54,80,755 ఖర్చు చేసినట్లు ప్రాజెక్టు ఆఫీసర్ దేవరాజ్‌గౌడ్ పేర్కొన్నారు. గరుగుపల్లె, నూలివీడు, చీమలచెరువుపల్లె గ్రామ పంచాయతీల్లో జరిగిన వాటర్‌షెడ్ పనులపై ప్రత్యేకాధికారితో పరిశీలన జరిపిస్తామని పీడీ తెలిపారు. ఈ సమావేశంలో ఏపీడీ శివారెడ్డి, సర్పంచులు ఉమాపతిరెడ్డి, చిన్నపరెడ్డి, నారాయణమ్మ, డీఆర్‌పీలు, ఎస్‌ఆర్‌పీలు, ఎఫ్‌ఏలు తదితరులు పాల్గొన్నారు.
ప్రోటోకాల్‌పై కలెక్టర్‌కు ఫిర్యాదు: స్థానిక మైరాడ కార్యాలయంలో శుక్రవారం జరిగిన ఓపెన్‌ఫోరమ్ సమాచారం తమకు తెలపలేదని జడ్పీటీసీ లక్ష్మిదేవి, ఎంపీపీ చిన్నరెడ్డిలు మండిపడ్డారు. ఈ విషయాన్ని తాము కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు.