కడప

నగదు పాట్లు ఇంకెన్నాళ్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,డిసెంబర్ 8:పెద్దనోట్లు రద్దుచేసి నెలరోజులు పైబడినా నోట్ల కష్టాలు పెరుగుతూ చిన్ననోట్లు, పెద్దనోట్ల కోసం నోట్లు పాట్లు పడుతూనే జిల్లాలో ఆ ప్రాంతం ఈప్రాంతం అని లేకుండా కరెన్సీ కష్టాలు తీరడం లేదు. బ్యాంకుల్లో డబ్బులున్నా, సగానికి పైబడి ఏటిఎంలు తెరుచుకోక బ్యాంకుల వద్ద రోజురోజుకు భారీ రద్దీపెరిగి అరకొర కరెన్సీ ఉన్న ఏటిఎంల ముందు వందల్లో క్యూ కడుతున్నారు. మహిళలు, వృద్ధులు క్యూలో నిలుచుకోలేక అస్వస్థతలకు గురౌతున్నారు. వృద్ధులు పెన్షన్లకోసం వెళ్లి నానాయతలు పడుతూ రోజుల తరబడి బ్యాంకులు, ఏటిఎంల చుట్టు ప్రదక్షిణలు చేస్తున్నారు. బ్యాంకుల్లో డబ్బు ఉన్నా ఖాతాదారులకు డబ్బు అందక పేదల పరిస్థితి వర్ణణాతీతమైంది. కడప, ప్రొద్దుటూరు, రాజంపేట, రాయచోటి తదితర వ్యాపార కేంద్రాల్లో ఏటిఎంలు పనిచేయక, ఇంతవరకు నెలగడిచి , 8రోజులుగా బ్యాంకుల్లో జీతాలు జమ అయినా ఉద్యోగులకు బ్యాంకుల్లో రోజు రూ.4 వేలు, రూ.వేలు మాత్రమే అందజేస్తున్నారు. ఆర్‌బిఐ నిబంధనల ప్రకారం ప్రతి వ్యక్తికి వారానికి రూ.24వేలు తీసుకోవాల్సి ఉన్నా వారం పొడవునా బ్యాంకు చుట్టు బ్యాంకర్లు తిప్పించుకుని రూ.10వేలు నుంచి రూ.14వేలు మాత్రమే ఇస్తున్నారు. పెద్దనోట్లు రద్దుచేసి 30రోజులైనా పేదల కష్టాలు తీరలేదు. ఏటిఎంల వద్ద బారులు తీరినా నో క్యాష్ బోర్డులు వెలుస్తున్నాయి. జిల్లాలో 29 లక్షల మంది జనాభా ఉన్నా, 15 లక్షల మంది పైబడే ఏటిఎం కార్డులు ఉన్నాయి. కరెన్సీ కోసం ప్రతి నిత్యం సాధారణ ప్రజలు, రైతు కూలీలు, రైతులు, ప్రభుత్వ పెన్షన్‌దారులు, రిటైర్డు ఉద్యోగులు, రూ.1000 లు, రూ.1500 పెన్షన్లు పొందే వృద్ధులు, వికలాంగులు సైతం బ్యాంకుల వద్ద పడిగాపులు కాచి క్యూ కడుతున్నారు. జిల్లాలోని 10 నియోజకవర్గంలో ఉద్యోగులకు, పెన్షనర్లకు ప్రతినెలా దాదాపు రూ.3కోట్లు ఒక్కో నియోజకవర్గంలో చెల్లింపులు ఉన్నా యి. ఆ దామాషిలో రూ.30 కోట్లు జీతాలకే పోగా పెద్ద పెద్ద వ్యాపారులు, బంగారు వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు తదితర వ్యాపారాలకు సంబంధించి రూ.50కోట్లకు పైబడి కార్మికులకు జీత భత్యాలు ఉన్నాయి. మిగిలిన రైతు కూలీలు, సాధారణ ప్రజలు వారికి సైతం నెలకు సరాసరి రూ.10 కోట్లు పైబడే అవసరాలు ఉంటాయి. ఈమేరకు ప్రస్తుతం బ్యాంకు నుంచి 25శాతం కరెన్సీ కూడా ఏ ఒక్కరికి అందడం లేదు. పెద్దనోట్ల రద్దుకారణంగా నల్లకుబేరులు కనుమరుగవుతారని ప్రజల సంక్షేమం దేశభవిష్యత్ బాగుంటుందని ధరలు అదుపులోకి వస్తాయని, సామాన్యులు సైతం మూడుపూట్ల తిండి తింటారని ప్రధాని నరేంద్రమోదీ ఎంతో ఉన్నతాశయాలతో పెద్దనోట్లు రద్దుచేసి పేదలకు కష్టాలు తెచ్చారు. కాగా కరెన్సీతో పనిలేకుండా స్వైపింగ్ మిషన్ల ద్వారా చిరు వ్యాపారులకు నగదు రహిత లావాదేవీలు చేసుకోవాలని కొంతమేరకు చిల్లర కష్టాలు తీరుతాయని అరకొర స్వైపింగ్ మిషన్లు పంపిణీ చేశారు. దీనికితోడు 13 రకాలలో లావాదేవీలు కొనసాగించేందుకు ఏపి పర్స్ ద్వారా యాప్‌ను కూడా మార్కెట్‌లోకి రేపోమాపో తేనున్నారు. హోటళ్లలో, బస్టాండ్లలో, కూరగాయల అంగళ్లలో, పెట్రోలు బంకులు, వివిధ చౌకదుకాణాల్లో బ్యాంకర్లు స్వయంగా స్వైపింగ్ మిషన్లు ఇచ్చి లావాదేవీలు జరిపేందుకు ప్రభుత్వం నిర్థారించి 20శాతం వరకు మైక్రో ఏటిఎంలు, సంచార ఏటిఎంలు, నగదు బదిలీ , నగదు విత్‌డ్రాయల్ తదితర వాటికోసం బ్యాంకర్లు అన్ని ఏటిఎంలు ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. పైలెట్ ప్రాజెక్టు కింద ప్రైవేట్ ఐటి కంపెనీలు డ్వాక్రా మహిళలకు, అంగన్‌వాడీ కార్యకర్తలకు, చిరువ్యాపారులకు శిక్షణ ఇచ్చి నగదు రహిత వ్యాపార లావాదేవీలు కొనసాగించేందుకు చర్యలు చేపట్టారు. మొత్తం మీద కరెన్సీ కష్టాలతో జనజీవనం స్తంభించి ఏ ఒక్కరిని కదిలించినా వారి పాట్లు అన్నీ ఇన్నీ కాదు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరెన్సీ కష్టాలు తీర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

జన్మభూమి కమిటీలే కీలకం!

కడప,డిసెంబర్ 8:తెలుగుదేశం ప్రభుత్వం గత పాలనలో గ్రామసీమల అభివృద్ధి నిమిత్తం ప్రవేశపెట్టిన జన్మభూమి కార్యక్రమానికి ఏడాది నుంచి జన్మభూమి కమిటీలు ఏర్పాటుచేశారు. జన్మభూమి కమిటీలే కీలకపాత్ర వహిస్తూ గృహనిర్మాణం కోసం స్థలం కావాలన్నా, ఎన్‌టిఆర్ గృహం నిర్మాణ పథకం కింద గృహం కావాలన్నా, ఏదైనా పెన్షన్‌కావాలన్నా సంబంధిత గ్రామాల్లో ఎటువంటి అభివృద్ధి పనులు నిమిత్తం చిన్నచిన్న కాంట్రాక్టు పనులు కావాలన్నా జన్మభూమి కమిటీలు కీలకంగా మారనున్నాయి. గత జనవరిలో మూడవ విడత జన్మభూమి కార్యక్రమం చేపట్టగా 2017 జనవరిలో నాల్గవ విడత జన్మభూమి కార్యక్రమం మొదలుకానుంది. జిల్లా వ్యాప్తంగా 790 గ్రామపంచాయతీలు , దాదాదు 29లక్షల జనాభా ఉన్నా, రాజకీయ పార్టీ నేతలు ఎన్నికల సమయం వరకు ఆదిపత్యపోరు, రాజకీయాలు చేసుకుని ఎన్నికల అనంతరం పార్టీలకు అతీతంగా ప్రజలకు సేవచేయాల్సివుంది. గ్రామా ల్లో జెడ్పిటిసిలు, ఎంపిటిసిలు, సర్పంచ్‌లు తమకు ఓటు వేయని వారి విషయంలో పదవి ముగిసే వరకు ఓటు వేయనివారిని ప్రత్యర్థివారీగానే చూ స్తూ వారికి సంక్షేమపథకాలు అందకుండా అడ్డుకుంటూ వస్తున్నారు. మూడేళ్లక్రితం ఎంపిటిసిలు, జడ్పీటిసిలు, సర్పంచ్‌లు, వైకాపా నేతలే 80శాతం మంది పైబడి గెలుపొందడంతో రాష్ట్రంలో తెలుగుదేశంపార్టీ అధికారంలో ఉన్నా గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు స్థానిక ప్రజాప్రతినిధులు సహకరించకుండా ప్రత్యర్థి వర్గంగానే చూసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈనేపధ్యంలో తెలుగుదేశం పార్టీ కేడర్ అంతా ప్రభుత్వానికి స్థానిక సంస్థ ప్రజాప్రతినిధులపై ప్రభుత్వానికి ఫిర్యాదుచేశారు. ఈమేరకు చంద్రబాబునాయుడు జన్మభూమి గ్రామ కమిటీలు ఏర్పాటుచేసి సర్పంచ్, గ్రామకార్యదర్శి, స్వచ్చంధ కార్యకర్త, ప్రజాసేవకులు తదితరులు ఉంటారు. సర్పంచ్ జన్మభూమి కమిటీతో సమన్వయంగా వ్యవహరిస్తే సర్పంచ్ నుంచి సంతకాలు సేకరిస్తారు. సర్పంచ్, సంబంధిత ప్రాం తాల ఎంపిటిసిలు రాజకీయ కోణం లో పరిశీలిస్తే వారిరువురితో పనిలేకుండానే జన్మభూమి కమిటీలు తీర్మాణాలు చేస్తాయి. దీంతో జన్మభూమి కమిటీలు కీలకంగా మారి స్థానిక సంస్థల నుంచి ఎన్నికైన ప్రజాప్రతినిధులు ప్రేక్షకులుగా మిగిలిపోతున్నారు. పనిలో పనిగా జన్మభూమి కమిటీ సభ్యుల్లో కొంతమంది దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే చందంగా వారు సైతం ఒక్కో పనికి ఒక్కోరేటు పెట్టుకుని చేతులు తడిపిన వారికే సిఫార్సులు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే జన్మభూమి కమిటీలపై కూడా ఫిర్యాదులు లేకపోలేదు. అధికారపార్టీకి చెందిన నేతలు , జన్మభూమి కమిటీలు పారదర్శకతతో వ్యవహరిస్తు అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమపథకాలు అందేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

రైతుల బీమాపై నిర్లక్ష్యం
కడప(టౌన్),డిసెంబర్ 8:కేంద్ర ప్రభుత్వం తనవంతు వాటాగా రూ.27 కోట్లు జిల్లాలోని రైతులకు బీమా మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఇంతవరకు రై తుల ఖాతాల్లో బీమా మొత్తం మం జూరు కాలేదని దీనిపై వెంటనే ప్ర భుత్వం స్పందించి త్వరతగతిన బీమా మంజూరు చేయాలని కలెక్టర్ కెవి సత్యనారాయణకు బిజెపి జిల్లా అధ్యక్షుడు పి.శ్రీనాథ్‌రెడ్డి గురువారం వినతిపత్రం ఇచ్చారు. ఈసందర్భంగా శ్రీనాథ్‌రెడ్డి మాట్లాడుతూ 2012-13 సంవత్సరానికి సంబంధించి మంజూరైన శెనగపంట బీమా మొత్తం ఇప్పటికీ రైతులకు అందకపోవడం దారుణమన్నారు. జిల్లావ్యాప్తంగా 50వేల మంది రైతులకు పైగా ప్రీమియం చెల్లిస్తే అవకతవకలు జరిగాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేయడం ద్వారా మూడు సంవత్సరాల తర్వాత 29వేల మందికి బీమా మొత్తాన్ని మంజూరు చేసినప్పటికీ ఆ మొత్తాన్ని బ్యాంకుల నుంచి పొందడానికి అన్నదాతలు అష్టకష్టాలు పడాల్సి వచ్చిందన్నారు. ప్ర స్తుతం రండవ దఫాగా 11వేల మంది రైతులకు బీమా మంజూరై కేంద్ర ప్రభుత్వం తన వంతు వాటాగా రూ.27కోట్లు మంజూరు చేసి నాలుగు మాసాలు కావస్తున్నా రాష్ట్రప్రభుత్వం ఇప్పటికీ తన వంతు వాటాగా రూ.27కోట్లు జమ చేసి కష్టకాలంలో ఉన్న రైతులను ఆదుకోటానికి ప్రయత్నించకపోవడం దారుణమన్నారు. అదే విధంగా ఇప్పటికీ ఇంకా దాదాపు 12వేల మంది రైతులకు బీమా మంజూరు చేసే విషయంలో వ్యవసాయ బీమా సంస్థ అధికారులు మీన మేషాలు లెక్కిస్తుండటం బాధాకరమన్నారు. ఈవిషయంలో రాష్ట్రప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతీసుకుని బీమా మంజూరయ్యేలా చూడాలని ఆయన కోరారు. 10రోజుల్లోగా రైతులకు ఖాతాల్లో బీమా మొత్తం జమచేయకుంటే అన్ని మండల రెవెన్యూ కార్యాలయాల ఎదుట ధర్నాలు చేస్తామని ఆయన హెచ్చరించారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో బిజెపి నాయకులు చలమారెడ్డి, శ్రీనివాసులురెడ్డి, పవన్‌కుమార్ తదితరులు ఉన్నారు.
అమాంతం పడిపోయిన ధర!
దువ్వూరు, డిసెంబర్ 8: ఖరీఫ్ సీజన్‌లో నాలుగురూపాయలు సంపాదిద్దామని ఆశించి టమోట పంటను సాగుచేసిన రైతులకు ధరలు నిండా ముంచాయి. టమోటా రైతుల పరిస్థితి కొనబోతే కొరివి అమ్మబోతే అడవిలా తయారైందని బాధిత రైతులు లబోదిబోమంటున్నారు. మార్కెట్‌లో టమోటాలు కిలో ఒక్కరూపాయి కూడా పలక్కపోవడంతో పంటపొలాల్లో కాయలను కోయకుండానే వదిలేసిన సందర్భాలున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని రామాపురం, గుడిపాడు, చిన్నసింగనపల్లె, మదిరేపల్లె, రామ్‌సాయినగర్, మీర్జగాన్‌పల్లె తదితర గ్రామాలలో విస్తారంగా టమోట పంట సాగైంది. గత ఏడాది అనుభవాలను దృష్టిలో వుంచుకొని ఈసారైనా టమోట పంట చేతి నిండా ఆదాయాన్నిస్తుందని ఆశించి రైతులు పంటను విస్తారంగా సాగుచేశారు. పంట కోతకు వచ్చినప్పటి నుంచీ ఒక్కసారి కూడా ధర లభించకపోవడంతో రైతులు తీవ్రం గా నష్టపోవాల్సి వచ్చింది. 25కిలోల బుట్ట రూ.200 నుంచి రూ.500లు పలకాల్సి వుండగా కేవలం రూ.30 నుంచి రూ.40 వరకు పలుకుతుండడంతో చేసేదేమీ లేక విక్రయించాల్సి వస్తోందని రైతులు పేర్కొంటున్నారు. కనీసం కోత కూలీల ఖర్చులు కూడా రావడం లేదని రైతులు వాపోతున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా టమోటాలకు ధర పూర్తిగా పడిపోవడంతో పెట్టుబడులు, ఖర్చులను తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చిందని రైతులు వాపోతున్నారు. అందుబాటులో శీతల గిడ్డంగులను ఏర్పాటుచేసి పండినపంటను కొంతకాలంపాటు నిలకడ చేసేందుకు సౌకర్యం కల్పించాల్సిన ప్రభుత్వం ఏమాత్రం రైతుల గురించి పట్టించుకోకపోవడంతో వచ్చిన పంటను వచ్చినట్లుగానే విక్రయిస్తూ చేతులు కాల్చుకుంటున్నామని రైతులు వాపోతున్నారు.
ఉత్తమక్రీడాకారులుగా జాతీయస్థాయికి ఎదగాలి
కమలాపురం, డిసెంబర్ 8: గ్రామీణస్థాయి పాఠశాలల విద్యార్థులు జాతీయస్థాయి క్రీడాకారులుగా ఎదగాలని రీజినల్ ఇన్స్‌పెక్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ భానుమూర్తిరాజు ఆకాంక్షించారు. ఆయన గురువారం మండల పరిధిలోని పెద్ద చెప్పల్లిలో జరిగిన యర్రగుంట్ల జోన్ ప్రభుత్వ పాఠశాలల జోనల్‌మీట్ క్రీడాపోటీలను ఎంపిపి సులేఖతో కలసి క్రీడాజ్యోతిని వెలిగించి పోటీలను ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ స్థాయిలో ఈ పోటీలను పారదర్శకంగా పట్టణాల్లో జరిగే పోటీలకు ధీటుగా నిర్వహించడం అభినందనీయమన్నారు. సమీపంలోని చిన్నచెప్పల్లి పాఠశాల విద్యార్థులు పలుక్రీడల్లో రాష్ట్ర,జాతీయస్థాయి పోటీలకు ఎంపికై పాల్గొనడం గర్వకారణమన్నారు. క్రీడల్లో రాణించిన వారికి ప్రభుత్వం అనేక సదుపాయాలను కల్పించి ప్రోత్సహిస్తోందన్నారు. ఎంపిపి సులేఖ మాట్లాడుతూ చదువుతో పాటు క్రీడలు కూడా ముఖ్యమేనని అన్నారు. క్రీడల్లో రాణించిన వారికి ప్రభుత్వం విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని, ఈ అవకాశాన్ని క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. స్థానిక డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ రాజగోపాలరెడ్డి, ఎమీవో జాఫర్‌సాధిక్ తదితరులు పాల్గొని ప్రసంగించారు. బహుమతుల దాతలు రవీంద్రనాధరెడ్డి, సర్పం చ్ హరితాసుధాకర్, ఇన్‌చార్జి హెచ్‌ఎం కేశవరెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయులు శివశంకరరెడ్డి, జోన్ కో ఆర్డినేటర్ సుబ్బన్న, బాబు తదితరులు పాల్గొన్నారు. కాగా అనంతరం జరిగిన పోటీల్లో కొండాపురం పాఠశాల తన సత్తా చాటింది. కబడ్డీ బాలికల విభాగంలో విన్నర్స్‌గా కొండాపురం, రన్నర్స్‌గా చిన్నచెప్పల్లి, కోకో విన్నర్స్‌గా ఆర్టీపిపి, రన్నర్స్‌డా కొండాపురం, జూనియర్ బాయ్స్ కబడ్డీలో విన్నర్స్‌గా ముద్దనూరు, రన్నర్స్‌గా కొండాపురం. కోకో జూనియర్ బా య్స్‌లో విన్నర్స్‌గా ఆర్టీపీపీ, రన్నర్స్‌గా కొండాపురం గెలుపొందినట్లు వ్యా యామ ఉపాధ్యాయుల సంఘం జిల్లానేత శివశంకర్‌రెడ్డి వివరించారు. ల యర్రగుంట్ల కొండాపురం, ముద్దనూరు, కమలాపురం, వీయన్‌పల్లె మండలాలకు చెందిన పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.
ఫుడ్ అడ్వైజరీ కమిటీ కీలకం
జమ్మలమడుగు, డిసెంబర్ 8:ఆహా ర సలహా సంఘాలు సమాజంలో చురుకైన పాత్రను పోషించాల్సి వుందని ఆర్డీవో కె.వినాయకం పేర్కొన్నారు. స్థానిక ఆర్డీవో కార్యాలయ సభాభవనంలో గురువారం సాయం త్రం నియోజకవర్గ స్థాయిలో ఫుడ్ అడ్వైజరీ కమిటిలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆర్డీవో మండలాల వారీగా రేషన్ పంపిణీతో పాటు విషయాలపై మండలాల వారీగా ఆయా మండలాల అధికారులు, ఫుడ్ అడ్వైజరీ కమిటీలతో సమీక్షించారు. అనంతరం ఆర్డీవో వినాయం మాట్లాడుతూ ఎక్కడైనా రేషన్ పంపిణీలో తేడాలు కానీ, రేషన్ పొందడంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తమ దృష్టికి తీసుకువస్తే వాటిని పరిష్కరించడానికి కృషి చేస్తామన్నారు. ఆహార సలహా సంఘాలకు మండల స్థాయి పరిమితి వుంటుందన్నారు. ఈ సంఘాలకు రేషన్ పంపిణీ విషయంలోనే కాక గోదాములు, ఆహారధాన్యాలు, పెట్రో లు,డీజలు కల్తీ వంటి పలు విషయాలపై సమస్యలను అధికారుల ముం దు వుంచవచ్చన్నారు. రేషన్ పంపిణీ పర్యవేక్షణ ఆర్‌ఐ, తహశీల్దార్, ఎన్‌ఫోర్స్ మెంట్ డిప్యూటి తహశీల్దార్ పర్యవేక్షణ ఉంటుందన్నారు. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలోప్రజలకు చిల్లర అందుబాటులో లేని పరిస్థితుల్లో వ్యాపార సంస్థలు సహకరించాలన్నారు. ముఖ్యంగా పెట్రోలు బంకులపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయన్నారు. పెట్రో లు బంకుల వద్ద స్వైపింగ్ మెషిన్లు అందుబాటులో వుంచకుండా ప్రజలకు ఇబ్బందులకు గురిచేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలు కూడా నగదు రహిత లావాదేవీలపై అవగాహన పెంచుకోవాలని ఆర్డీవో వినాయకం తెలిపారు. ఈ సమావేశంలో నియోజకవర్గంలోని తహశీల్దార్‌లు, రెవెన్యూ సిబ్బంది, ఆహార సలహా సంఘం సభ్యులు పాల్గొన్నారు.
పోలవరం ప్రాజెక్టుపై
అవగాహన లేని జగన్
* టిడిపి నాయకులు
కడప(క్రైమ్),డిసెంబర్ 8:పోలవరం ప్రాజెక్టుపై వైఎస్ జగన్ అవగాహన లేమితో మాట్లాడుతున్నారని తెదెపా నాయకులు రెడ్యం వెంకటసుబ్బారెడ్డి పేర్కొన్నారు. గురువారం టిడిపి కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రాజెక్టులపై అవగాహన లేకుండా ప్రజలను రెచ్చగొట్టడమే ఏకైక మార్గంగా జగన్ పనిచేస్తున్నారని టిడిపి నాయకులు విమర్శించారు. పోలవరం నిర్వాసితులకు చంద్రబాబు మోసం చేస్తున్నారని విమర్శించడం అవివేకమని పోలవరం ప్రాజెక్టుపై చిత్తశుద్దితో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతి సోమవారం పనులపై పర్యవేక్షిస్తు నిర్వాసితులను ఆదుకుంటామని చంద్రబాము చెబుతున్నది జగన్‌కు తెలియదా అని ఎద్దేవా చేశారు. టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు ప్రజల్లో దూసుకుపోతుండటం వల్ల బెంబేలెత్తిన వైకాపా నాయకులు ఆరోగ్యశ్రీపై కూడా మాట్లాడటం తగదన్నారు. ఉద్యోగులకు, జర్నలిస్టులకు ఆరోగ్యశ్రీ కల్పించిన ఘనత టిడిపిదే అన్నారు. మతిస్థిమితం లేకుండా మాట్లాడితే ప్రజలు గమనిస్తున్నారని రాబోయే ఎన్నికలే గీటురాయిగా ప్రజలునిర్ణయిస్తారన్నారు. ఈకార్యక్రమంలో ఉపాధిహామీ కౌన్సిల్ సభ్యుడు పీరయ్య, ఎస్సీసెల్ జిల్లా ఉపాధ్యక్షుడు ఏలియా, టిఎన్‌టియుసి జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీను, కార్యదర్శి ప్రభాకరాచారి, శివారెడ్డి పాల్గొన్నారు.
కోరలు చాచిన నాటుసారా
సుండుపల్లె, డిసెంబర్ 8:నాటుసారా గ్రామాల్లో కోరలు చాస్తోంది. విచ్చలవిడిగా సారాబట్టీలను పెట్టి నాటుసారాను తయారుచేస్తున్నారు. మండలంలోని పలు గ్రామాల్లో నాటుసారా విచ్చలవిడిగా తయారుచేసి అమ్మకాలు సాగిస్తున్నారు. ప్రభుత్వం నాటుసారాను నిషేధించాలని కృషి చేస్తుండగా కొంత మంది అక్రమాలకు పాల్పడటం వలన అధికారులు సారా తయారీ అరికట్టలేకపోతున్నారు. సుండుపల్లెలోని గ్రామీణ ప్రాంతాలలో అయితేనేమి, వంకల్లోనూ రహస్య స్థావరాలు ఏర్పాటు చేసుకుని నాటుసారా తయారు చేస్తున్నారు. మండలంలోని వానరాచపల్లె, ఎగువబిడికి, నాయునివారిపల్లె, మడితాడు వడ్డెపల్లె, మాచిరెడ్డిపల్లె కఠారుముడుకుతో పాటు పలు గ్రామాల్లో సారా బట్టీలు వెలుగుతూనే ఉన్నాయి. అయితే మండల కేంద్రానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న కుప్పగుట్ట, హరిజనవాడల్లోనూ మాదిగపల్లెలోనూ నాటుసారా ఏరులై పారుతున్నది. గత కొన్ని సంవత్సరాల నుండి అధికారుల నిర్లక్ష్యం వలన రోడ్లకు ఇరువైపులా పబ్లిక్‌గానే అమ్మకాలు సాగుతున్నాయి. ప్రభుత్వం సారారహిత గ్రామాలే లక్ష్యంగా ముందుకుపోతుంటే ఎక్సైజ్ అధికారులు సారా రహిత గ్రామాలల్లో నామమాత్రపు దాడులు నిర్వహిస్తున్నారు. నాటుసారా త యారే జీవనోపాధిగా నేటి గ్రామాలు నాటుసారా మ త్తులో జోగుతున్నాయి. సుండుపల్లె మండలంలో ఎక్సైజ్ అధికారులు దాడు లు నిర్వహించి సుమారు ఆరు నెలలవుతోంది. అప్ప ట్లో రెండు, మూడు కేసులు నమోదు చేసుకొని హడావుడి చేసి ఆపేశారు. అంతే సంగతులు ఆ తరువాత నాటుసారా జోలికెళ్లలేదు. అధికారులు శాశ్వతంగా నాటుసారా నిర్మూలన చేప ట్టే దిశగా వారు పనిచేయడం లేదని సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఏయే గ్రామాల్లో సారా తయారుచేస్తున్నారో, ఎవరు అమ్ముతున్నారో ఎక్కడ అమ్ముతున్నారో తెలిసినా నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు ఛోద్యం చూస్తున్నారు. గతంలో ఎక్సైజ్ అధికారులు దాడులు చేసిన ప్రతి చోటా సారాబట్టీలు ఊట బిందెలు, డ్రమ్ములు, కుండలు తిరిగి ప్రాణం పోసుకున్నాయి. చిత్తూరు జిల్లా సరిహద్దు ప్రాంతమైన జిల్లేలమంద నుండి రోజు వందల లీటర్లు సుండుపల్లె మండలంలోని పలు ప్రాంతాలకు యధేచ్ఛగా అమ్ముకుంటున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు సారారహిత గ్రామాలు చేయలేకపోయినా నాటుసారా నిర్మూలించి గ్రామాల్లో శాంతిభద్రతలు కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని మండల ప్రజలు కోరుతున్నారు.

టీడీపీ సభ్యత్వంతో భరోసా!
* తెలుగు మహిళ జిల్లా ప్రధాన కార్యదర్శి సుజాత
రాయచోటి, డిసెంబర్ 8: తెలుగుదేశం పార్టీ సభ్యత్వంతో కార్యకర్తలకు భరోసా ఉంటుందని తెలుగు మహిళా జిల్లా ప్రధాన కార్యదర్శి సుజాత అన్నారు. గురువారం మునిసిపల్ పరిధిలోని 23వ వార్డులో టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి రమేష్‌కుమార్‌రెడ్డి ఆదేశానుసారం చంద్రన్న ఫలాల గురించి మహిళలకు అవగాహనా సమావేశం సుజాత ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సభ్యత్వంతో ఇన్సూరెన్సు సదుపాయం భారతదేశంలో ఏ పార్టీ ప్రవేశపెట్టలేదని, ఆ క్రెడిట్ అంతా ఒక్క టీడీపీకే దక్కుతుందని వివరించారు. కార్యకర్తల సంక్షేమమే పరమావధిగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌బాబు ఈ వినూత్న పథకాన్ని ప్రవేశపెట్టడం ద్వారా కార్యకర్తల కుటుంబాలకు ఎంతో భరోసా కలిగినట్లయిందన్నారు. అంతేకాకుండా ము ఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి నారా చంద్రబాబునాయుడు అనేక వినూత్న పథకాలను ప్రవేశపెట్టి టెక్నాలజీ సాయంతో మారుమూల పేద ప్రజలకు కూడా అందేలా చేశారంటే ఆ ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. నేడు సీఎం చంద్రబాబు ఉపయోగించిన టెక్నాలజీని పక్క రాష్ట్రాలు కూడా ఉపయోగిస్తున్నాయంటే కార్యకర్తలు సీఎంకు అండగా నిలవాల్సిన అవసరం ఎంతైనా కలదన్నారు. అడ్డగోలుగా రాష్ట్రాన్ని గత పాలకులు విభజిస్తే లోటుబడ్జెట్‌లో ఉన్నా సీఎం తన అపార అనుభవంతో నేడు వృద్ధిరేటును కూడా దేశంలోనే ముందంజలో నిలపారంటే సీఎం గొప్పదనం ఎంటో అర్థం అవుతుందన్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమమే పరమావధిగా పనిచేస్తూ వినూత్న సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి వాటిని పేద ప్రజల దరికి చేర్చేందుకు టెక్నాలజీ సాయంతో ముందుకు దూసుకెళ్తున్న ఏకైక నాయకుడు మన సీఎం చంద్రబాబు అన్నారు. దీనిని ఓర్వలేని ప్రతిపక్ష పార్టీల నాయకులు సీ ఎంపైన, ఆయన కుమారుడిపైన లేనిపోని అభండాలు మోయడం తగదన్నారు. రాష్ట్ర అభివృద్ధికి సహకరించాల్సింది పోయి ప్రతి ఒక్క దాంట్లోనూ వేలెత్తి చూపడం వారికి తగదన్నారు. వీటన్నిటినీ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని, జరగబోయే ఎన్నికలలో ప్రతిపక్ష పార్టీలకు కనీసం డిపాజిట్ కూడా రాకుండా చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆమె జోష్యం చెప్పారు. రాయచోటి నియోజకవర్గ ఇన్‌ఛార్జి రమేష్‌రెడ్డి సహాయ సహకారాలతో నియోజకవర్గం అభివృద్ధి దిశలో పయనిస్తోందన్నారు. ఇందుకు ఉదాహరణే మాండవ్యానది ప్రక్షాళన అని, ప్రతి ఒక్కరూ రమేష్‌రెడ్డికి సహకారం అందించి వచ్చే ఎన్నికలలో అత్యధిక మె జార్టీతో రమేష్‌రెడ్డిని గెలిపించాలని ఆమె మహిళలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కా ర్యవర్గ సభ్యురాలు విజయశాంతి, జిల్లా ఉపాధ్యక్షురాలు నసీబ్‌జాన్, పలువురు వార్డు మహిళలు తదితరులు పాల్గొన్నారు.
రోడ్డుప్రమాదంలో వ్యక్తి మృతి
రాజుపాళెం, డిసెంబర్ 8: మండలపరిదిలోని కూలూరుగ్రామ సమీపంలో కుందూనదిపై నిర్మించిన వంతెనకున్న సైడ్ డివైడర్‌ను మోటర్‌సైకిల్ ఢీకొనడంతో దండు ఇర్ఫాన్ (27) మృతిచెందినట్లు ఎస్‌ఐ శ్రీనివాస్ తెలిపారు. కర్నూలుజిల్లా మండల కేంద్రమైన చాగలమర్రికి చెందిని ఇర్ఫాన్ ప్రొద్దుటూరు పట్టణంలో స్నేహితుని వివాహ నిమిత్తం చాగలమర్రి నుంచి మోటర్‌సైకిల్‌పై బయలుదేరాడన్నారు. అయితే కుందూనదిపై నిర్మించిన వంతెనకు సైడ్‌కు ఉన్న ఇనుప కమీలను ప్రమాదవశాత్తు మోటర్‌సైకిల్ ఢీకొనడంతో ఇర్ఫాన్ కిందపడి తలకు బలమైన గాయాలయ్యాయన్నారు. దీంతో చికిత్సనిమిత్తం ఇర్ఫాన్‌ను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమద్యంలో మృతిచెందాడని తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రొద్దుటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించామని, సంఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్‌ను ధరించాలని, అతివేగం ప్రమాదకరమని ఎస్సై వాహనదారులకు సూచించారు.
ఎర్రచందనం స్వాధీనం
రైల్వేకోడూరు, డిసెంబర్ 8:రైల్వేకోడూరు మండలంల శెట్టిగుంట మాజీ సర్పంచ్ కోలా చెంచయ్యతోపాటు మరో ఆరుగురిని గురువారం అరెస్టుచేసి వారి నుండి 50 ఎర్రచందనం దుంగలను స్వాధీనపరచుకున్నట్టు సిఐ అశోక్‌కుమార్ తెలిపారు. అందిన సమాచారంతో ఎస్‌ఐలు వెంకటేశ్వర్లు, భక్తవత్సలం వారి సిబ్బందితో కలిసి శెట్టిగుంట సమీపంలో అక్రమరవాణాకు సిద్ధంగా ఉన్న రూ.25లక్షలు విలువచేసే ఎర్రచందనం దుంగలతో పాటు ఒక మోటారు బైక్‌ను స్వాధీనపరచుకున్నామని సిఐ పేర్కొన్నారు. ఈ సంఘటనకు సంబంధించి మరో 16 మంది శెట్టిగుంట ప్రాంతానికి చెందిన వారు పరారైనట్టు సిఐ వివరించారు.