కడప

బంగారం వ్యాపారులకు ఐటి నోటీసులు.!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,డిసెంబర్ 10: పెద్దనోట్ల రద్దు పుణ్యమా అని జిల్లాలోని పలువురు బంగారం నగల వ్యాపారస్తులకు ఐటిశాఖ శనివారం నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. దీంతో కొందరు పసిడి వ్యాపారులు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తొంది. ముఖ్యంగా గతనెల 8 పెద్దనోట్ల రద్దుతో గతనెల 9,10వ తేదీల్లో పెద్దనోట్ల ద్వారా వందలాది కిలోల బంగారు బిస్కెట్లు, నగలు వ్యాపారం జిల్లాలో వందలాది కోట్లరూపాయాల్లో జరిగినట్లు తెలుస్తోంది. రెండవ ముంబాయిగా పేరొందిన ప్రొద్దుటూరు నుంచి గుట్టుచప్పుడు కాకుండా గల్ఫ్, చెన్నై నుంచి తెప్పేంచే బంగారు, బిస్కెట్లు రాయలసీమ జిల్లాల్లో రద్దయిన పాత నోట్లతోనే వందల కోట్లరూపాయాల్లో వ్యాపారం జరిగినట్లు తెలుస్తోంది. జిల్లాలో ఎటువంటి ఫర్మ్ రిజిస్ట్రేషన్లు లేకుండా ఐటి రిటర్న్‌లు లేకుండా, బ్యాంకుల్లో కరెంటు అకౌంట్లు తెరవకుండా ప్రభుత్వానికి చెల్లించాల్సిన రుసుములు చెల్లించకుండా సేల్స్, కస్టమ్స్ పన్నులు సైతం ఎగవేసి జిల్లాలో వందమంది పైబడి బడా వ్యాపారులే కోట్లాదిరూపాయలు రోజువారీగా చేతులు మారుస్తున్నారు. అటువంటి వారందరూ తమ రికార్డులను ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులకు చూపాలని, గతనెల 8,9,10వ తేదీల్లో బంగారు నగల అమ్మకాలు, కొనుగోళ్లు, బ్యాంకు లావాదేవీలపై సమాచారం ఇవ్వాలని ఐటి అధికారులు ఆదేశించారు. కొంతమంది బంగారు నగల వ్యాపారులు పేరుకేమో ఫర్మ్ రిజిస్ట్రేషన్ చేసుకుని, తమ పేరిట సేవింగ్ ఖాతాలు తెరుచుకుని ఏడాదివారీగా ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేయకుండా నామమాత్రంగా తమ ఫర్మ్‌పేరిట రిటర్న్స్ దాఖలు చేస్తూ ప్రభుత్వాన్ని మభ్యపెడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రొద్దుటూరు, కడప, పులివెందుల, రాయచోటి, రాజంపేట, బద్వేలు తదితర బంగారు నగలు వ్యాపారం చేసే తిమింగళాలకు ఐటి అధికారులు నోటీసులు ఇచ్చారు. ముఖ్యంగా పెద్దనోట్లు రద్దు తర్వాత నగదు రహిత వ్యాపారాలు, స్వైపింగ్ మిషన్లు ఏర్పాటుచేయమని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు ఇచ్చినా పసిడి వ్యాపారులు, స్వైపింగ్ మిషన్ ఏర్పాటుచేసుకుంటే నిత్యం వ్యాపార లావాదేవీలు స్వైపింగ్ మిషన్ల ద్వారా లావాదేవీలు కోట్లరూపాయలకు చేరి ఇన్‌కమ్ ట్యాక్స్‌కు సమాచారం వెళ్తుందని, ప్రస్తుతం సరాసరి నెలరోజులు వ్యాపారాన్ని ఐటి అధికారులు పరిగణలోకి తీసుకుని ఆ దామాషిలో గత కొనే్నళ్లుగా పసిడి వ్యాపారస్తులు కోట్లలో లావాదేవీలు బట్టబయలు అవుతాయని భయపడి స్వైపింగ్ మిషన్లు ఏర్పాటు చేసుకోవడం లేదు. అలాగే కొంతమంది బంగారు నగల వ్యాపారులు తెలిసిన వారు చెక్కులు ఇస్తేచెక్కులు వద్దని నగదు కావాలని తెగేసి చెబుతున్నారు. ఐటి అధికారులు ఇప్పటికే జిల్లాలో ప్రతి బంగారు నగల వ్యాపారస్తుల లావాదేవీలపై గుట్టుచప్పుడు లేకుండా సమాచారం తెప్పించుకున్నట్లు తెలిసింది. మొత్తం మీద ఐటి నోటీసులతో ఇక జిల్లాలో బంగారు నగల అక్రమార్కులు తమ వ్యాపారానికి స్వస్తిచెప్పి ఇతరత్రా వ్యాపారాల్లోకి అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది.

ఆసుపత్రి కమిటీ ఎంపికపై
టిడిపిలో రగడ..!

రాజంపేట, డిసెంబర్ 10:రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రి కమిటీ ఎంపికపై అధికార తెలుగుదేశం పార్టీలో రగడ చోటుచేసుకుంటుంది. ఈ కమిటీ ఎంపిక పట్ల పలువురు సీనియర్ తెలుగుతమ్ముళ్లు బహిరంగంగానే ఆసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ కమిటీ ఎంపిక పట్ల ప్రస్తుతం పట్టణ, మండలస్థాయిలో పార్టీ పదవుల్లో ఉన్న నేతలు గైర్హాజరయ్యారు. పార్టీకి మొదటి నుండి సేవలందిస్తూ వస్తున్న వారిని కాదని కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి పదవులు కట్టబెట్టడం ఎక్కడి న్యాయమన్నదే వీరి అభిప్రాయం. అంతేకాకుండా పార్టీలో సీనియర్లను ప్రక్కన పెడుతున్నారని వస్తున్న ఆరోపణలకు ప్రభుత్వ ఆసుపత్రి కమిటీ ఎంపిక బలాన్ని చేకూరుస్తున్నదంటున్నారు. పార్టీ అధికారంలో లేని సమయంలో 10 ఏళ్లపాటు ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కొని పార్టీ కోసం పనిచేసిన వారికి తగిన ప్రాధాన్యత కల్పించి ఉంటే బాగుండేదంటున్నారు. ఎందుకంటే ప్రస్తుతం ప్రకటించిన ఆసుపత్రి కమిటీలో మెజార్టీ సభ్యులు పార్టీలోకి తాజాగా వచ్చిన వారే అంటున్నారు. పార్టీలోకి వచ్చిన వారికి పదవులు కట్టబెట్టేటప్పుడు పార్టీకి మొదటి నుండి సేవలందిస్తూ వస్తున్న వారికి కూడా తగిన ప్రాధాన్యత ఇచ్చి ఉంటే బాగుండేదంటున్నారు. పార్టీ పుట్టుక నుండి ఉంటున్న ఓ సీనియర్ నేత కమిటీ ఎంపిక పట్ల బాహాటంగానే నిరసన వ్యక్తం చేయడమే కాకుండా, ఇలాంటి చర్యలు పునరావృత్తం కాకుండా పార్టీలో మొదటి నుండి ఉన్న నేతలతో ఓ సమావేశం త్వరలో నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఓ సీనియర్ నేత అయితే ఏకంగా ఆసుపత్రి కమిటీ ఎంపికపై పార్టీ అధిష్ఠానానికి నిరసన వ్యక్తం చేస్తూ ఫ్యాక్స్ మెసేజ్‌లు పంపడం కూడా జరిగింది. కాగా శాసనసభ్యులుగా, విప్‌గా నిజాయితీ రాజకీయాలకు పెద్దపీట వేస్తూ వస్తున్న మేడా వెంకట మల్లికార్జునరెడ్డిని తప్పుదోవ పట్టించే నేతలు అధికమయ్యారనే విమర్శలు ఆసుపత్రి కమిటీ ఎంపిక పట్ల పార్టీ సీనియర్ నేతలు పలువురు పేర్కొంటున్నారు. ఇకపోతే రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రి కడప-రేణిగుంట హైవే మార్గంలో మధ్యలో ఉంది. సుమారు 130 కిలోమీటర్ల మేరకు నిడివి కలిగిన ఈ మార్గం మధ్యలో ఉన్న ఏకైక ప్రభుత్వ ఆసుపత్రి కూడా రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రి కావడం వల్ల ఈ ఆసుపత్రికి ఎంపిక చేసే కమిటీ బాధ్యత కూడా అధికంగానే ఉంటుందన్నారు. ఈ మార్గంలో తరచూ ఏర్పడే రోడ్డు ప్రమాదాల వల్ల అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రికి చేరే వారు కూడా నిత్యం అధికంగానే ఉంటారు. ఈ కారణంగా ఈ ఆసుపత్రిలో అత్యవసర చికిత్సలకు వీలుగా అభివృద్ధి చేయాల్సిన అవసరముంది. అయితే ఈ ఆసుపత్రిలో ప్రస్తుతం అత్యవసర పరిస్థితులు ఏర్పడితే సరైన ఆధునిక వైద్య వసతులు లేని కారణంగా ప్రధమ చికిత్సలకే పరిమితమవుతూ, ఎక్కువగా కడప రిమ్స్‌కు, లేకుంటే తిరుపతి రుయా ఆసుపత్రికి రెఫర్ చేస్తున్న శాతం కూడా అధికంగానే ఉంది, ఇందువల్ల మార్గమధ్యంలో మృతి చెందుతున్న సంఘటనలు కూడా అధికంగానే ఉంటుంన్నాయి. అంతేకాకుండా శాసనసభ్యులుగా ఎన్నికైన తరువాత మేడా వెంకట మల్లికార్జునరెడ్డి అధికమార్లు ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీలు నిర్వహించడమే కాకుండా, నిర్లక్ష్యంగా వ్యవహరించే ఆసుపత్రి సిబ్బందిని తీవ్రస్థాయిలో హెచ్చరించిన సందర్భాలు అనేకమున్నాయి. అంతేకాకుండా ఈ ఆసుపత్రిలో ఆధునిక వసతులు కల్పించేందుకు ప్రత్యేక కృషి కూడా చేస్తున్న మేడా వెంకట మల్లికార్జునరెడ్డి ఆసుపత్రి కమిటీ ఎంపికలో అనుభవజ్ఞులకు అవకాశమిచ్చి ఉంటే బాగుండేదన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. రానున్న రోజుల్లోనైనా పార్టీలోకి కొత్తగా వచ్చిన నేతలతో పాటు పార్టీ సీనియర్లకు కూడా సరైన గౌరవం, ప్రాధాన్యత లభించేలా దృష్టి సారించే విషయంలో మేడా మల్లికార్జునరెడ్డి మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరముంది. అప్పుడే పార్టీ నియోజకవర్గంలో బలోపేతమవుతుందంటున్నారు. ప్రస్తుతం పార్టీలో సీనియర్లకు ప్రాధాన్యత లభించడం లేదన్న అంశంపై రగులుతున్న రగడను చల్లార్చి అభివృద్ధితో పాటు పార్టీని సమన్వయం చేయాల్సిన అవసరాన్ని కూడా మేడా గుర్తించాలన్నదే పార్టీ సీనియర్ల అభిప్రాయం.

రామిరెడ్డిది హత్యే..

వేంపల్లె, డిసెంబర్ 10: మండలంలోని అలవలపాడు గ్రామానికి చెందిన వైకాపా ఎంపీటీసీ, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు గజ్జల రామిరెడ్డి(42) మృతి హత్యేనని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఆధిపత్యం కోసమే ఉపాధ్యక్షుడు రామిరెడ్డిని హతమార్చారని సమీప బంధువులు చెబుతున్నారు. హతుని బంధువు రామిరెడ్డి శేఖర్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ గ్రామానికి చెందిన ఐదుగురు టీడీపీ వర్గీయులపై కేసు నమోదు చేశారు. పులివెందుల సీఐ రామకృష్ణ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మండల పరిషత్ ఉపాధ్యక్షుడు రామిరెడ్డి శుక్రవారం మండల సర్వసభ్య సమావేశానికి హాజరై ద్విచక్రవాహనంలో రామిరెడ్డి ఒంటరిగా ఇంటికి వెళ్తుండగా గ్రామానికి చెందిన తెదేపా నేతలు పేరం కృష్ణారెడ్డి, అన్నారెడ్డి బాలస్వామిరెడ్డి, అన్నారెడ్డి రాజశేఖర్‌రెడ్డి, సుధారాఘవరెడ్డి, అన్నారెడ్డి మద్యానందరెడ్డి ఓ వాహనంతో ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టించి కొడవళ్లతో నరికి చంపారని సీఐ తెలిపారు. ఈ మేరకు హతుడు రామిరెడ్డి బంధువు రామిరెడ్డి శేఖర్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కేసు గురించి అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నామని ఆయన వెల్లడించారు. కాగా ఈ కేసుకు సంబంధించిన నిందితులను పట్టుకునేందుకు పోలీసు బృందాలను నియమించామన్నారు. ఈ హత్యలో ఎవరెవరు పాల్గొన్నారు వారు తీసుకొచ్చిన వాహనం ఏంటి హత్యకు గల కారణాలు ఏమి అన్న విషయాల గురించి పోలీసులు ముమ్మరంగా ఆరా తీస్తున్నారు. ఇప్పటికే నిందితుల బంధువులు, స్నేహితులు ఇతరత్రా వారితో ఈ విషయాలపై కూపీ లాగుతున్నట్లు తెలుస్తోంది. అలవలవాడులో మళ్ళీ భగ్గుమన్న కక్షలు: వేంపల్లె మండలం అలవాడు గ్రామంలో ఫ్యాక్షన్ కక్షలు భగ్గుమన్నాయి. గ్రామం ఫ్యాక్షన్ రికార్డులో ఉన్నా చాలా రోజులుగా ఎటువంటి ఘటనలు జరగలేదు. అయితే మండల ఉపాధ్యక్షులు రామిరెడ్డిని ప్రత్యర్థులు అంతమొందించడంతో ఒక్కసారిగా ఆ గ్రామం ఉలిక్కిపడింది. దీంతో ఫ్యాక్షన్ రక్కసి జడలు విప్పినట్లయింది. అలవలపాడులో ఇరువర్గాల మధ్య గత కొంతకాలంగా వర్గపోరు ఉంది. తెదేపాకు చెందిన జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ బాలస్వామిరెడ్డి, మరో వర్గానికి చెందిన అయ్యవారిపల్లె సింగిల్ విండో మాజీ అధ్యక్షుడు పేరం రామాంజనేయరెడ్డి నాయకత్వం వహిస్తూ ఉండేవారు. ప్రస్తుతం హత్యకు గురైన మండల ఉపాధ్యక్షుడు రామిరెడ్డి కూడా రామాంజనేయరెడ్డి వర్గంలో ఉండేవారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు గ్రామానికి వచ్చిన అభివృద్ధి పనులు, ఇతరత్రా విషయాలలో రామాంజనేయరెడ్డికి, రామిరెడ్డికి మధ్య విబేధాలు తలెత్తాయి. ఈ ఈ నేపథ్యంలో 2007లో ఆ గ్రామంలో చెరువు కట్ట విషయమై రామాంజనేయరెడ్డికి, రామిరెడ్డి మధ్య బాంబుదాడులు చోటు చేసుకోవడం జరిగింది. 2014లో రామాంజనేయరెడ్డి వైకాపాను వీడి తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. అప్పట్లో జరిగిన ఎన్నికలలో వైకాపా తరపున రామిరెడ్డి పోటీకి దిగగా తెదేపా తరపున రామాంజనేయరెడ్డి ఎంపీటీసీ అభ్యర్థులుగా పోటీకి దిగారు. తెదేపాకు చెందిన మరో నేత మాజీ గ్రంధాలయ సంస్థ ఛైర్మన్ బాలస్వామిరెడ్డి రామాంజనేయరెడ్డికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అయినప్పటికీ ఎంపీటీసీ ఎన్నికల్లో వైకాపా అభ్యర్థి రామిరెడ్డి గెలుపొందారు. అప్పటి నుంచి ఇరువర్గాల మధ్య గొడవల వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో 2014లోనే ఆ గ్రామ సమీపంలో రామిరెడ్డిపై దాడిచేసే ప్రయత్నం చేశారు. కానీ అది విఫలమైంది. మళ్లీ కడపలో కూడా అదే ప్రయత్నం చేశారు. అక్కడ కూడా విఫలమైంది. కాగా ఈ విషయమై పోలీసులకు రామిరెడ్డి తనకు ప్రాణహాని ఉందని అప్పట్లోనే ఫిర్యాదు చేశారు. కాగా అలవలపాడు గ్రామానికి చెందిన రామిరెడ్డి హత్యకు గురికావడంతో ఆ గ్రామాన్ని పోలీసులు పూర్తి స్థాయిలో వారి గుప్పిట్లోకి తీసుకున్నారు. ఫ్యాక్షన్ జోన్ డీఎస్పీ శ్రీనివాసులు నేతృత్వంలో ముగ్గురు సీ ఐలు, ఆరు మంది ఎస్‌ఐలు, 50 మంది పోలీసులు విధులు నిర్వర్తిస్తున్నారు. అలాగే పులివెందుల ఏఎస్పీ అన్బురాజన్ వేంపల్లె, అలవలపాడు గ్రామంలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. అలాగే వేంపల్లె మండలంలో ఫ్యాక్షన్ గ్రామాలుగా గుర్తించిన గ్రామాలపై కూడా కనే్నసి ఉంచారు.

ఫ్యాక్షన్ గ్రామాలపై
ఎస్పీ ప్రత్యేక దృష్టి.!

కడప,డిసెంబర్ 10: జిల్లాలోని గతంలో పేరుగాంచిన ఫ్యాక్షన్ గ్రామాలపై ఎస్పీ పిహెచ్‌డి రామకృష్ణ ఉక్కుపాదం మోపేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. శుక్రవారం వేంపల్లె మండలం అలవలపాడులో జరిగిన వైసిపి నేత హత్య ఘటనపై ఎస్పీ సీరియస్‌గా తీసుకుని అలవలపాడులో పోలీసు పికెట్ ఏర్పాటుచేసి ఫ్యాక్షన్ గ్రామాల్లో పులివెందుల ఏఎస్పీ అన్బురాజన్, ఫ్యాక్షన్ జోన్ డిఎస్పీ శ్రీనివాసులు, పలువురు డిఎస్పీలు, సిఐలు, ఎస్‌ఐలను పులివెందుల, జమ్మలమడుగు, కమలాపురం, ప్రొద్దుటూరు, మైదుకూరు నియోజకవర్గాల్లో గతంలో ఫ్యాక్షన్ గ్రామాలుగా పేరున్న ప్రాంతాలపై పోలీసులు నిఘా ఉంచారు. వేంపల్లె మండలం అలవలపాడు, రామిరెడ్డిపల్లెలో పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకుని గ్రామంలో పికెట్ ఏర్పాటుచేసి నిందితుల కోసం గాలిం పు చర్యలు చేపట్టారు. ఒకరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. ఒకప్పుడు ఫ్యాక్షన్‌కు, ఆధిపత్యపోరుకు నిలయమైన జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఫ్యాక్షన్ చాలా వరకు తగ్గుముఖం పట్టింది. ముఖ్యంగా జమ్మలమడుగు నియోజకవర్గంలోని మైలవరం మండలంలో నక్కవానిపల్లె, పెద్దముడియం మండలంలో జంగాలపల్లె, కొండాపురం మండలంలో ఏటూరు, ముద్దనూరు మండలంలో కోడిగాండ్లపల్లె గ్రామాలు అత్యంత సమస్యాత్మక గ్రామాలుగా పోలీసులు గుర్తించారు. పులివెందుల నియోజకవర్గంలోని లింగాల మండలంలో గునకనపల్లె, అంబకపల్లె, వేంపల్లి మండలంలో రామిరెడ్డిపల్లె, అలవలపాడు, చక్రాయపేట మండలంలో గండికొవ్వూరు, వేముల మండలంలో నారేపల్లి, కొండ్రెడ్డిపల్లె, చింతలజూటూరు, ఎర్రగుంట్ల మండలంలో చిన్నదండ్లూరు, ఇల్లూరు, వై.కోడూరు, కొమ్మద్ది తదితర గ్రామాలు గతంలో ఫ్యాక్షన్ హత్యలు జరిగి పోలీసుల రికార్డులకు ఎక్కాయి. శుక్రవారం అలవలపాడు సమీపంలో జరిగిన మండలాధ్యక్షుడి హత్యానంతరం పోలీసుల దృష్టి ఫ్యాక్షన్ గ్రామాలపై పడింది. ఈ నేపధ్యంలో ఎస్పీ తీసుకున్న చర్యలు ఏమేరకు ఫలితమిస్తాయో చూడాలి.

పాత భవనాలపై అప్రమత్తమైన
జిల్లా యంత్రాంగం

కడప,డిసెంబర్ 10: కడప పట్టణం నడిబొడ్డున పురాతన కాలంలో నిర్మించిన భవంతిలో సుజాత హోటల్ నిర్వహిస్తుండగా శుక్రవారం ఆ భవం తి కూలడంతో మొద్దునిద్రలో ఉన్న నగర పాలకం అధికారులు నిద్రలేచారు. సుజాత హోటల్ కుప్పకూలిన సంఘటనలో ఇరువురికి తీవ్రగాయాలై భారీ ప్రాణనష్టం నుంచి తృటిలో తప్పించుకున్నారు. నగర పాలకం పరిధిలో 50సంవత్సరాలు క్రితం నిర్మించుకున్న భవనాలు శిధిలావస్థలోని ఆ భవనాలను కూల్చుకునేందుకు నగర పాలక అధికారులు నాలుగు రోజులు గడువిచ్చారు. శుక్రవారం చోటుచేసుకున్న సంఘటన దరిమిలా నగర పాలకం కూల్చివేస్తుందని ప్రకటించడం కొంతమంది యజమానులు కూడా శిథిలావస్థలో ఉన్న భవనాల్లో అద్దెకుంటున్న వారిని ఖాళీ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. ముఖ్యంగా దశాబ్దాలకాలం నుంచి దంతెలు, నల్లబండలు, సున్నపురాయి, కర్రలు, తడికెలు, ఎదురుబొంగులు, చౌడుతో ఇళ్లనే కాకుండా కమర్షియల్ కాంప్లెక్స్‌లు కూడా నిర్మించుకున్నారు. అయితే కార్పొరేషన్ అధికారులు మాత్రం నివాసగృహాలు, వ్యాపార గృ హాలు, గోడౌన్ల భవనాలు యజమాను ల నుంచి మామూళ్లు తీసుకుని గుట్టుచప్పుడు కాకుండా కాలయాపన చేస్తున్నారు. ఈక్రమంలో శుక్రవారం సుజా త హోటల్ కుప్పకూలడంతో నడిబొడ్డున రద్దీగా ఉండే జనసంచా రం ఉన్న ప్రాంతంలోనే అనుకోని విధంగా సంఘటన జరిగింది. ప్రస్తుతం జిల్లా ఉన్నతాధికారులు, నగర పాలకం అధికారులు శనివారం హుటా హుటిన సమావేశమై పాత భవనాలు వెంటనే కూల్చివేయాలని శుక్రవారం జరిగిన సంఘటన పెనుప్రమాదం నుంచి బయటపడిందని పాత భవనాలు, శిధిలావస్థలోని భవనాలు కూల్చివేయడమే ఈ ప్రమాదాల నివారణకు చర్య లు అని అధికారులు అభిప్రాయపడ్డారు. ఈమేరకు పాతభవనాలు కూల్చివేతకు శనివారం కార్పొరేషన్ అధికారులు పలు భవనాల యజమానులకు నోటీసులు జారీ చేశారు. ఇచ్చిన గడువులోపల పాత భవనాలు కూల్చకపోతే ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో అధికారులు వాటిని కూల్చివేస్తారన్న అనుమానం వ్యక్తం అవుతోంది.

రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన సేవలు

రాజంపేట, డిసెంబర్ 10: రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులు మెరుగైన సేవలందించాలని విప్ మేడా వెంకట మల్లికార్జునరెడ్డి అన్నారు. శనివారం ప్రభుత్వ ఆసుపత్రి అడ్వైజరీ కమిటీ సభ్యులచే ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మేడా వెంకట మల్లికార్జునరెడ్డి మాట్లాడుతూ రాజంపేట ఆసుపత్రిలో అనేక సమస్యలున్నాయని, సిబ్బంది పనితీరు మెరుగుపడాల్సి ఉందన్నారు. అడ్వైజరీ కమిటీ బాధ్యతతో పనిచేసి ఆసుపత్రిని అన్నివిధాలుగా రోగులకు సేవలందించే వసతులు కల్పించాల్సి ఉందన్నారు. ఇప్పటికే ఆసుపత్రిని ఆధునీకరించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేక నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. వైద్యరంగాన్ని పేదలకు అందుబాటులోకి తేవాలన్నదే సీఎం లక్ష్యమని, సీఎం లక్ష్యసాధనకు ఆసుపత్రి సిబ్బంది, అడ్వైజరీ కమిటీ సభ్యులు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అడ్వైజరీ కమిటీ ఛైర్మన్‌గా కెవి.రమణ, డైరెక్టర్లుగా ఖాజామోహిద్దీన్, నారదాసు మధు, ఎల్.సుజాత ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు, ఎంపిడిఓ హరినాథ్, మున్సిపల్ కమిషనర్ ఎన్‌వి.రమణారెడ్డి, కడప ఆర్టీసీ రీజనల్ మాజీ ఛైర్మన్ యెద్దల సుబ్బరాయుడు, టిడిపి నేతలు మల్లెల సుబ్బరాయుడు, సీనియర్ న్యాయవాది ఎస్.రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.
ఆసుపత్రిలో ఎలాంటి సమస్యలు ఎదురుకాకూడదు : మేడా
ప్రభుత్వ ఆసుపత్రిలో ఎలాంటి సమస్యలు ఎదురుకాకుండా చూడాలని విప్ మేడా వెంకట మల్లికార్జునరెడ్డి అన్నారు. ఆసుపత్రి అడ్వైజరీ కమిటీ ప్రమాణ స్వీకారం అనంతరం ఆసుపత్రిలో కమిటీ సభ్యులు, ఆసుపత్రి సిబ్బందితో మేడా సమావేశమై మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆధునిక సౌకర్యాల సాధనకు తన వంతు కృషి చేస్తానన్నారు. కమిటీ సభ్యులు ప్రత్యేక శ్రద్ధతో ఆసుపత్రిని అన్నివిధాలుగా రోగులకు సేవలందించేలా దృష్టి సారించాలని కోరారు. ఆసుపత్రిని పరిశుభ్రంగా ఉంచాలన్నారు.

వైకాపా జిల్లా అధ్యక్షుడు అమర్ ఆధ్వర్యంలో
14వ తిరుమల పాదయాత్ర ప్రారంభం

రాజంపేట, డిసెంబర్ 10: తిరుమలకు శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యులు నడిచి వెళ్ళిన మార్గంలో 14వ మారు జిల్లా వైకాపా అధ్యక్షులు ఆకేపాటి అమర్‌నాథరెడ్డి శనివారం తిరుమలకు మహాపాదయాత్ర మొదలెట్టారు. రాజంపేట మండల ఆకేపాడు ఆలయ సముదాయాల నుండి మొదలెత్తిన ఈ పాదయాత్రలో సతీమణి జ్యోతమ్మతో పాటు గోవిందమాలలు ధరించిన భక్తులు అమర్‌నాథరెడ్డిని అనుసరించారు. ఆకేపాటి ట్రస్ట్‌చే గోవిందమాలలు, వస్త్రాలు ఉచితంగా అమర్‌నాథరెడ్డి భక్తులకు అందజేయడమే కాకుండా, పాదయాత్రలో పాల్గొన్న భక్తులకు అల్పాహారం, భోజన వసతులు సమకూర్చడం విశేషం. శనివారం తెల్లవారుజామున ఆకేపాడు ఆలయ సముదాయాల నుండి మొదలైన పాదయాత్రలో పాల్గొన్న భక్తులు ఉదయం 7-30 గంటలకు రాజంపేట పట్టణానికి చేరుకున్నారు. పట్టణ శివారు ప్రాంతంలోని మన్నూరు వద్ద వైకాపా బీసీ నేత పసుపులేటి సుధాకర్ నేతృత్వంలో మొదట అమర్‌నాథరెడ్డికి ఘనస్వాగతం లభించింది. మున్సిపల్ వైస్ ఛైర్మెన్ పోలా శ్రీనివాసరెడ్డి, జిల్లా వైకాపా అధికార ప్రతినిధి పి.విశ్వనాథరెడ్డి, పట్టణ వైకాపా నేతలు పెంచలయ్యనాయుడు, బోనం మోహన్, రిటైర్డు స్పెషల్ కలెక్టర్ ఈశ్వరయ్య, దాసరి రమేష్‌గౌడ్ తదితరులు అమర్‌నాథరెడ్డికి పూలమాలలు వేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పాదయాత్రలో పాల్గొన్న భక్తులకు పండ్లు, బిస్కెట్స్ సుధాకర్ అందజేశారు. ఆ తరువాత పట్టణంలో అడుగడుగునా అమర్‌నాథరెడ్డి వైకాపా శ్రేణులతోపాటు ఆధ్యాత్మిక ప్రియులు ఘనంగా స్వాగతం పలికారు. పలువురు భక్తులకు మజ్జిగ ప్యాకెట్స్, నీళ్ల ప్యాకెట్లు కూడా అందజేశారు. పాదయాత్రలో పాల్గొన్న వారికి పట్టణంలోని శ్రీ అయ్యప్పస్వామి ఆలయంలో అల్పాహారం ఏర్పాటు చేశారు. రెడ్డిపల్లె చెరువుకట్ట వద్ద ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు.
అనంతరం మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని పాదయాత్ర చేస్తున్నట్టు చెప్పారు. అంతేకాకుండా అన్నమయ్య తిరుమలకు నడిచివెళ్ళిన కాలిబాటను తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు సౌకర్యంగా అభివృద్ధి చేయాలన్నారు. 14వ మారు పాదయాత్ర గోవిందమాలలు ధరించిన భక్తులతో కలిసి చేయడం తనకెంతో సంతోషంగా ఉందన్నారు. అంతకు మించి అడుగడుగునా అన్ని వర్గాల ప్రజల నుండి లభిస్తున్న స్వాగతం మరవలేనిదన్నారు. ఇలాంటి కార్యక్రమాల వల్ల ఆధ్యాత్మిక ప్రపంచం సమాజంలో ఏర్పడి శాంతి సుఖసౌఖ్యాలు కలుగుతాయన్నది తన విశ్వాసమన్నారు. అందుకే ప్రతిఏటా గోవిందమాలలు ధరించిన భక్తబృందంతో ఈ పాదయాత్ర స్వయంగా చేపట్టి తానుకూడా పాల్గొంటూ అన్ని వర్గాల ప్రజల్లో ఆధ్యాత్మిక చైతన్యాన్ని తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నట్టు అమర్‌నాథరెడ్డి తెలిపారు. పాదయాత్ర సందర్భంగా గోవిందనామ స్మరణతో కడప-చెన్నై హైవే హోరెత్తింది. పాదయాత్రలో పాల్గొన్న భక్త బృందం గోవిందనామ స్మరణ చేస్తూ పాదయాత్రలో పాల్గొన్నారు. పాదయాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసుశాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంది.
నేడు రైల్వేకోడూరుకు..
అమర్‌నాథరెడ్డి ఆధ్వర్యంలో మొదలైన తిరుమల పాదయాత్ర ఆదివారం రైల్వేకోడూరు పట్టణానికి చేరుకోనుంది. ఇదేరోజు రాత్రి కుక్కలదొడ్డి వద్ద బస చేసి సోమవారం నాటికి తిరుమలకు చేరుకుంటుంది.

సాతుపల్లెలో ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం ప్రారంభం
రాజంపేట, డిసెంబర్ 10: రాజంపేట పట్టణం సాతుపల్లె అరుంధతివాడలో శనివారం విప్ మేడా వెంకట మల్లికార్జునరెడ్డి ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకంలో భాగంగా మినరల్ వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మేడా మాట్లాడుతూ పేద ప్రజలు కూడా మినరల్ వాటర్ తాగాలన్న లక్ష్యంతో సీఎం చంద్రబాబు ఈ పథకానికి శ్రీకారం చుట్టారన్నారు. రూ.2లకే 20లీటర్ల మంచినీటిని అందించడం జరుగుతుందన్నారు. స్థానిక డ్వాక్రా మహిళలచే ఈ పథకం నిర్వహణకు శ్రీకారం చుట్టడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక టిడిపి నాయకుడు సత్యాల రామక్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.
రైతులకు ఉచితంగా మొక్కలు పంపిణీ
రైల్వేకోడూరు, డిసెంబర్ 10:రైల్వేకోడూరు, బాలుపల్లె అటవీ శాఖ పరిధిలో ఉచితంగా రైతులకు లక్ష మొక్కలు పంపిణీకి సిద్ధంగా ఉన్నట్లు డిఎఫ్‌ఓలు ఖాదర్‌వలీ, పవన్‌కుమార్ శనివారం తెలిపారు. సుమారు ఏడాది పాటు లక్షలాది రూపాయలు ఖర్చు చేసి పర్యావరణ పరిరక్షణ కోసం రైతులకు ఉచితంగా ఇచ్చేందుకు వేప, నేరేడు, ఎర్రచందనం, మద్ది తదితర మొక్కలు కోడూరు టౌన్‌లో సిద్ధం చేశామన్నారు. కావాల్సిన రైతులు తమ పట్టాదారు పాసుపుస్తకాలతో సంప్రదించాలని వారు కోరారు.

కూరగాయల మార్కెట్‌పై పెద్దనోట్ల రద్దు ప్రభావం

ప్రొద్దుటూరు, డిసెంబర్ 10: కేంద్ర ప్రభుత్వం పెద్దనోట్ల రద్దు ప్రకటన అనంతరం పట్టణంలోని కూరగాయల మార్కెట్ వినియోగదారులు లేక వెలవెలబోతోంది. నిత్యం రద్దీగా కనిపించే మార్కెట్‌పై నోట్ల రద్దు ప్రభావం భారీగా కనిపిస్తోంది. శనివారం ఉదయం నుంచి వ్యాపారులు బేజారుగా కూర్చొని నిట్టూరుస్తూ కనిపిస్తున్నారు. అడుగుతీసి అడుగు వేయాలన్నా ఇబ్బందిగా ఉండే మార్కెట్‌లో ప్రజలు లేక నిర్మానుశ్యంగా కనిపిస్తోంది. రూ.500, రూ.1000 నోట్లను వ్యాపారులు తీసుకోకపోవడంతో ప్రజలు కూడా చేసేదేమీ లేక ఏరోజుకారోజు సరుకులు, కూరగాయలను మాత్రమే వారివారి ఇళ్ల వద్దనున్న దుకాణాల వద్ద కొనుగోలు చేస్తున్నారు. మార్కెట్‌లోని వ్యాపారులు మాత్రం వేలాదిరూపాయలు వెచ్చించి నిత్యం కూరగాయలు, ఆకుకూరలు తదితర వాటిని దిగుమతి చేసుకుంటున్నా కొనుగోలుచేసేవారు లేక కుళ్లిపోతుండడంతో లబోదిబోమంటున్నారు. డిసెంబర్ నెలాఖరు వరకు ఇదే పరిస్థితి ఎదురవుతుందని, చేసేదేమీ లేక కొనుగోలుదారుల కోసం ఎదురుచూస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. వేలాదిరూపాయలకు వేలం ద్వారా వ్యాపారాలను దక్కించుకున్నామని, పెద్దనోట్ల రద్దు ప్రకటన వెలువడినప్పటి నుంచి ఇదే పరిస్థితి నెలకొందని, తాము ఎలా రుసుమును చెల్లించాలని, తమ కుటుంబాలను ఎలా పోషించుకోవాలని వ్యాపారులు వాపోతున్నారు. సుదీర్ఘకాలంగా మార్కెట్‌లో వినియోగదారులు లేక వెలవెలబోవడం ఇదే మొదటిసారి చూస్తున్నామని, మునుపెన్నడూ ఇలాంటి పరిస్థితులు ఎదురుకాలేదని వ్యాపారులు అంటున్నారు. ఇదే అదునుగా భావించిన చిల్లర దుకాణాదారులు మాత్రం కూరగాయలు, పప్పుదినుసులు, తదితర నిత్యావసర సరుకులపై విపరీతమైన ధరలు పెంచి విక్రయిస్తున్నారని, ఇదేమని ప్రశ్నిస్తే పెద్దనోట్ల రద్దుతో ధరలు పెరిగాయని, కొంటే కొనండి లేకపోతే లేదు పొండ ని బెదిరింపు ధోరణితో సమాధానమిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.

పెద్దనోట్ల రద్దుతో కుదేలైన
నాపరాళ్ల పరిశ్రమ!

ఎర్రగుంట్ల,డిసెంబర్ 10: పెద్దనోట్ల రద్దుతో జిల్లాలో నాపరాళ్ల పరిశ్రమ కుదేలైంది. నాపరాళ్ల పరిశ్రమద్వారా జిల్లాలో వేలాది మంది కూలీలు పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. ముఖ్యంగా జమ్మలమడుగు నియోజకవర్గంలోని ఎర్రగుంట్ల మండలంలో దాదాపు 200లకు పైగా నాపరాళ్లు యూనిట్లు ఉన్నాయి. ఈ యూనిట్లపై ఆధారపడి దాదాపు 5వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీరంతా నాపరాళ్ల గనుల్లో పూడిక తీసే పనులతోపాటు రాళ్లకోతలు, పాలిషింగ్ తదితర యూనిట్లలో రాత్రింబవళ్లు పనులు చేస్తూ జీవనం సాగించేవారు. ఈ నాపరాళ్లు గతంలో ఇతర రాష్ట్రాలతోపాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు ఎగుమతి అయ్యేవి. మంచి గిరాకీ ఉండటంతో ఈ పరిశ్రమపై ఆధారపడి వేలాది మంది జీవనం సాగించే పరిస్థితులు ఈ ప్రాంతంలో కన్పిస్తాయి. అయితే ఇటీవల కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నోట్లరద్దు కారణంగా ఈ పాలిషింగ్ యూనిట్లు పూర్తిగా కుదేలయ్యాయి. రాళ్ల ఎగుమతులు సరిగా లేకపోవడంతో కూలీలకు డబ్బులు ఇవ్వలేక పోతున్నారు. అసలు రాళ్లుకొనే నాధుడే లేకపోవడంతో కూలీలకు ఇవ్వాల్సిన డబ్బులు చెల్లించలేక యజమానులు చేతులెత్తేస్తున్నారు. దీంతో ఈ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్న వేలాది మంది కార్మికులు దిక్కుతోచని పరిస్థితుల్లో తమకెన్నాళ్లీ కష్టాలంటూ రోధిస్తున్నారు. నోట్లరద్దుతో యజమానులు కూలీలకు ఇవ్వాల్సిన మొత్తాన్ని ఇవ్వలేకపోవడం, అరకొర కూలీ ఇచ్చినా రూ.2వేలునోటు ఇవ్వడంతో వాటిని మార్చుకునేందుకు బ్యాంకుల చుట్టు తిరగడంతో అటు కూలిపనిపోయి, ఇటు చిల్లర దొరక్క కూలీలు అవస్థలు వర్ణణాతీతంగా మారాయి. యజమానులు మాత్రం తమ రాళ్లకు గిరాకీ లేదని కూలీలను పాలిషింగ్ యూనిట్ల వైపు తిరగనివ్వడం లేదు. కష్టం చేసినా కరెన్సీ దక్కక పోవడంతో నాపరాళ్ల కూలీల పరిస్థితి దయనీయంగా మారింది. కరెన్సీ కష్టాలు తమకింకా ఎన్నాళ్లని బాధితులు వాపోతున్నారు. పాలిషింగ్ పరిశ్రమకు ప్రసిద్దికెక్కిన ఎర్రగుంట్ల మండలంలో చిలంకూరు, పోట్లదుర్తి, తిప్పలూరు, కోడూరు తదితర ప్రాంతాల్లో నాపరాళ్ల పాలిషింగ్ యూనిట్లపై ఆధారపడి వేలాది మంది జీవిస్తున్నారు. వీరి పరిస్థితి ప్రస్తుతం పెద్దనోట్ల రద్దుతో అగమ్యగోచరంగా మారింది.
ప్రభుత్వాలు మారినా గిరిజనుల బతుకుల్లో మార్పేదీ.?

సుండుపల్లె, డిసెంబర్ 10: సుండుపల్లె మండలం గిరిజన నాయకులకు నిలయం సుండుపల్లె చుట్టూ గిరిజన గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ప్రభుత్వాలు మారినా గిరిజన బతుకులు మారడం లేదు. గత 30 సంవత్సరాల నుండి గిరిజనులు పూరిగుడిసెల్లోనే జీవనం సాగిస్తున్నారు. అసలు పూరిగుడిసె అంటే ఏమిటి బోద కొట్టం అంటే ఏమిటి తెలియని ఈ కాలంలో మండలంలోని వానరాచపల్లె ఎగువబిడికికి కాలిబాట తప్ప మరో మార్గం లేదు. సుండుపల్లె పంచాయతీకి 6 కిలోమీటర్ల దూరంలో ఈ బిడికి ఉంది. ఇక్కడ కూడా ఒక ఊరు ఉందా అనిపించేంత మారుమూల ప్రదేశంలో ఉంది. మడితాడు గ్రామంలో ఉన్న ఎగువబిడికికి ఎన్నికల సమయంలో ఓట్ల కోసం తప్ప మరే సమయంలోనూ ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వ సంబంధిత అధికారులు కానీ ఊరు ముఖం చూడరు. అత్యవసర చికిత్స అవసరమైతే గ్రామస్థులు 2కిలోమీటర్ల పాటు కాలినడకన రావాల్సిందే తప్ప వారికి మరే మార్గం లేదు. ఎన్ని ప్రభుత్వాలు మారినా వారి బతుకులు మారడం లేదు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో అనేకసార్లు పక్కా గృహాల కోసం మంజూరు చేశాం అయితే ఫలితం మాత్రం ఏమీ లేదని, ఈ సారి ప్రభుత్వం మారినా రెండు సార్లు గృహాల కోసం మంజూరు చేసినా తమకు పక్కా గృహం మంజూరు కాలేదని వానరాచపల్లె ఎగువబిడికికి చెందిన రాజమ్మ, సాలమ్మ, చక్రేనాయక్, రాజక్కలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల సంక్షేమం పేదల సంక్షేమం కోసం మా ప్రభుత్వం ఏమైనా చేస్తుందని రాజకీయ నాయకులు గొంతు చించుకుని మాటలు చెబుతున్నారు కానీ ఇవేవీ మాటలకే పరిమితమా అని తీవ్ర స్థాయిలో విమర్శలు వినిపిస్తున్నాయి. టీడీపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన జనచైతన్యయాత్రను కూడా మండల నాయకులు ఆ గ్రామానికి వెళ్లలేదు. ఎందుకంటే నడిచివెళ్లాలి కాబోలు. ఇదిలా ఉంటే పక్కా గృహాల విషయంలో తెలుగు తమ్ముళ్లు బాగానే కష్టపడుతున్నారు. వారికి కావాల్సిన వారికి, పార్టీ కోసం కష్టపడాల్సిన వారికి, కార్యకర్తలకు ఓటేసిన ఉద్యోగస్థులకు ఎన్నికలలో ఓడిపోయిన కార్యకర్తలకు మాత్రమే ఇళ్లు కేటాయిస్తు, తమకు అన్యాయం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇది మండలంలోని పక్కా గృహాల విషయంలో టీడీపీ అనుసరిస్తున్న వ్యవహారశైలి. మేము ప్రజల కోసం ఏవైనా చేస్తామని మాటలు చెబుతున్నా వైసీపీ నాయకులు పేదల విషయంలో నోరు విప్పిన తరుణం కనపడదు. ఎవరికి వారు స్వలాభం కోసం పనిచేస్తున్నారే తప్ప ప్రజల విషయంలో వారి కష్టాలు పట్టించుకునే నాధుడే కరువయ్యాడు. మండలమంతా వైసీపీ, టీడీపీ నేతలు రోడ్లు వేస్తున్నారు కానీ గిరిజన గ్రామాలైన ఆరోగ్యపురం, వానరాచపల్లె, పెద్దమాదిగపల్లె, వడ్లపల్లె, సొంఠంవారిపల్లెలలో మాత్రం రోడ్లు వేయడం లేదు. ఎందుకంటే అక్కడున్న గిరిజనులు నిలదీయరు. ఓట్లు మాత్రం వేస్తారు కానీ నిలదీయరులే అని రాజకీయ నాయకులలో పదిలంగా పాతుకుపోయింది. కనీస సమస్యలైన పక్కా గృహాలు, రోడ్లు, నీటిసమస్యలైనా తీర్చాల్సిన అవసరం ఉంది. ఇకనైనా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకొని పక్కా గృహాల విషయంలోనైనా గిరిజనులను ఆదుకోవాలని గిరిజన ప్రజలు, గిరిజన సంఘ నాయకులు కోరుకుంటున్నారు.