కడప

ఘోర రోడ్డు ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పులివెందుల, డిసెంబర్ 29: పులివెందుల - ముద్దనూరు ప్రధాన రహదారిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులతోపాటు వందకుపైగా గొర్రెలు మృతిచెందాయి. గురువారం తెల్లవారుజామున 3గంటల ప్రాంతంలో పులివెందుల మండలం ఆర్.తుమ్మలపల్లె గ్రామ సమీపంలో రోడ్డుపైవెళ్తున్న గొర్రెల కాపరులను, గొర్రెలను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గొర్రెల కాపరులైన తొండూరు మండలం కోరమానుపల్లెకు చెందిన రాచకుంట వెంకటసుబ్బయ్య (40), రాచకుంట రామ్మోహన్ (36), బొబ్బూరి సుదర్శన (33) అను ముగ్గురు వ్యక్తులతో వందకుపైగా గొర్రెలు అక్కడికక్కడే మృతిచెందారు. పులివెందుల సిఐ ప్రసాద్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కోగరమానిపల్లె గ్రామానికి చెందిన నలుగురు గొర్రెల కాపరులు వేముల మండలం రాచగుంటపల్లెకు గొర్రెలను మేపుకొనేందుకై తోలుకొనిపోతుండగా తుమ్మలపల్లె గ్రామ సమీపానికి వచ్చేసరికి పులివెందులకు డిపోకు చెందిన ఎపి 04 జెడ్ 0162 అను నెంబరుగల బస్సు శ్రీశైలం నుంచి పులివెందులకు వస్తుందన్నారు. ఈ తరుణంలో పులివెందుల నుంచి బెంగుళూరు వైపు వెళ్తున్నబస్సు ప్రొద్దుటూరుకు వెళ్తుండగా రెండు బస్సులూ ఎదురెదురుగా రావడంతో లైటింగ్‌కు శ్రీశైలం బస్సు డ్రైవర్ బాబావల్లి గొర్రెలకాపరులను గమనించక వారిపై నుండి బస్సును పోనించడంతో ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుందని సిఐ తెలిపారు. ప్రమాదంలో మిగతా 420 గొర్రెలు కనబడకుండాపోయాయని తెలిపారు. మృతులందరూ ఒకే గ్రామం, ఒకే కుటుంబానికి చెందినవారు కావడంతో ఆ గ్రామంలో విషాధఛాయలు అలుముకున్నాయి. సంఘటనా స్థలానికి మృతుల బంధువులు చేరుకుని నిర్లక్ష్యంగా వ్యవహరించిన బస్సు డ్రైవర్‌పై కఠిన చర్యలు తీసుకుని, నష్టపోయిన కుటుంబానికి ప్రభుత్వం పరిహారం అందించాలని ధర్నా నిర్వహించారు. వీరికి మాజీమంత్రి వైఎస్.వివేకానందరెడ్డి, పలువురు నాయకులు మద్ధతు తెలిపారు. ఈ మేరకు మృతులను పోస్టుమార్టం నిమిత్తం పులివెందుల ప్రభుత్వాసుపత్రికి తరలించి, కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని సిఐ ప్రసాద్ పేర్కొన్నారు.
పులివెందులకు గండికోట నీరు

కడప,డిసెంబర్ 29:గండికోట ప్రాజెక్టు నుంచి పులివెందులకు నీరు వదిలేందుకు కలెక్టర్ కెవి సత్యనారాయణ , జలవనరుల అధికారులు గు రువారం ఎత్తిపోతల పథకం ప్రాం తాన్ని సందర్శించారు. ప్రస్తుతం గండికోటకు 3.5 టిఎంసిల నీరు ఉండటంతో రేపోమాపో 5టిఎంసిలకు నీరు నిల్వచేసి ఎత్తిపోతల ద్వారా ట్రైల్ రన్ చేసి పైడిపాలెం ఎత్తిపోతల పథకానికి నీరు తీసుకురానున్నారు. అక్కడి నుంచి వామికొండ, సర్వారాయసాగర్‌లకు నీరు పంపేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. ఒకపక్క పరిహారం కోసం గండికోట పునరావాసాలకు చెందిన 22 గ్రామాల ముంపువాసులలో 14గ్రామాలకు చెందిన ముంపువాసులు ఆందోళన చేపట్టారు. అయితే కలెక్టర్ సత్యనారాయణ, రాష్ట్ర ప్రభుత్వం ముంపు పరిహారం కింద రూ.479కోట్లు 15రోజుల్లో అందిస్తామని హామీ ఇచ్చినా నిర్వాసితులు ఆందోళన విరమించలేదు. చివరకు చౌటపల్లె, గండ్లూరు, బొమ్మెపల్లెలకు నీరు చేరినా రేపోమాపో ఓబనపల్లెకు నీరు చేరుతుంటే నిర్వాసితులకు రాజకీయాలు తోడుకావడం, ప్రతిపక్షాల ప్రోత్సాహంతో నిర్వాసితులు గ్రామా లు ఖాళీ చేయకుండా నాలుగురోజులుగా రోడ్డెక్కారు. చివరకు కలెక్టర్‌ను కూడా రాజకీయ రొచ్చులోకి దించా రు. అయితే కలెక్టర్ ప్రభుత్వ ఆదేశాల మేరకు గండికోట నీరును పులివెందుల ఇలాఖాకు తీసుకెళ్లేందుకు తనదైన శైలిలో జలవనరులశాఖ అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ మరోపక్క పునారావాసులకు ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాకుండానే కలెక్టర్ పర్యవేక్షిస్తున్నారు. గండికోటలో 5టిఎంసిల నీటిని నిల్వచేసి అక్కడి నుంచి పైడిపాలెం జలాశయానికి 2టిఎంసిలు నీటిని పంపి, పైడికాలువకు పంపేందుకు గొట్టపుమార్గం ద్వారా పైపులను పరిశీలించారు. కొండాపురం వద్ద తిమ్మాపురం రహదారిలో బ్రెజిల్ నుంచి తెప్పించిన 9్భరీ యంత్రాలు ఏర్పాటుచేసేందుకు పరిశీలించారు. అలాగే పైడికాలువకు 2టిఎంసిల నీటిని, వామికొండకు 0.6టిఎంసిల నీటిని ఇవ్వడానికి సర్వారాయ సాగర్ పనులు కూడా పూర్తి అయితే 3.5టిఎంసిల నీరును విడుదల చేయనున్నారు. ఏదేమైనా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ సొంత ఇలాఖాలో నీరును సరఫరా చేసి రాష్ట్రంలో జగన్ తన పర్యటనలో తెలుగుదేశం చేపట్టిన ప్రాజెక్టులపై తప్పుడు ప్రచారం చేయకుండా పులివెందులకు నీరు తెప్పిస్తే జగన్ నోటికి తాళం వేయవచ్చునన్న ఉద్దేశ్యంతో శరవేగంతో గండికోట ప్రాజెక్టుకు కృష్ణాజలాలు అవుకు రిజర్వాయర్ ద్వారా తెప్పిస్తున్నారు. మరో రెండురోజుల్లో 5టిఎంసిల నీటిని నిల్వచేసి గండికోట నుంచి 2టిఎంసిలు పైడిపాలెం ఎత్తిపోతలకు పంపి అక్కడి నుంచి పులివెందులకు నీరు వదిలి అనంతరం గండికోటకు కృష్ణాజలాలను పెద్ద ఎత్తున తెచ్చేందుకు సర్వం సిద్దం చేస్తున్నారు. జలవనరులశాఖ చీఫ్ ఇంజనీర్ వరదరాజులు, సూపరింటెండెంట్ ఇంజనీర్ వెంకటేశ్వరరావు, ఆర్డీఓ వినాయకం తదితరులు కలెక్టర్‌తో కలిసి పర్యటించారు.
ముంపువాసుల ఆందోళన బాట
కొండాపురం, డిసెంబర్ 29: గండికోట వెనుకజలాలు ముంపుగ్రామాలను ముంచెత్తుతున్నాయని మంగళవారం ఉదయం 9గంటలకు ప్రారంభమైన తాడిపత్రి - కడప రహదారి దిగ్భంధం గురువారం సాయంత్రానికి 50గంటలైనా కొనసాగుతూనే ఉంది. పరిహారం అందేంతవరకు నిరసన తెలుపుతామని ముంపుగ్రామస్తులు భీష్మించి కూర్చున్నారు. రోడ్లపైనే వంటావార్పు చేసుకుంటూ రహదారిని నిర్భంధించినా ఇంతవరకు అధికారులుగానీ, ప్రజాప్రతినిధులుగానీ రాలేదని ఆందోళనకారులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టుల్లో నీటిమట్టం 3.400 టిఎంసీకి చేరుకుంది. 1300 నుండి 1350 క్యూసెక్కుల నీరు గండికోటకు చేరుకుంటోంది. దీంతో చెవిటిపల్లె గ్రామంలోని దిగువనున్న ప్రాంతం జలమయమవుతోంది. గురువారం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు ముంపువారికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2013 భూసేకరణ చట్టం ప్రకారం ముంపువాసులకు పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్‌చేశారు. గండికోట ప్రాజెక్టులోనికి రెండునెలల నుంచి నీరు వస్తున్నా ముంపుగ్రామాల్లోకి సైతం నీరు ప్రవేశించడం మొదలైనా పూర్తిస్థాయిలో పరిహారం ఇప్పటివరకు ఇవ్వకపోడమేమిటని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం ఇస్తామంటున్న పరిహారం వెంటనే అందించాలని ఆయన డిమాండ్‌చేశారు. మరోవైపు కొండాపురంలోని గండికోట ఎత్తిపోతల పథకం ద్వారా పులివెందుల ప్రాంతంలోని పైడిపాళెం రిజర్వాయర్‌కు నీటిని ట్రయల్న్ నిర్వహించేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. బుధవారం రాత్రికి గండికోట ఎత్తిపోతల పథకం వద్దకు క్రిష్ణాజలాలు చేరాయి. రెండుమూడురోజుల్లో పైడిపాళెం ప్రాజెక్టుకు నీటిని ట్రయల్న్ నిర్వహించేందుకు అధికారులు సంసిద్ధమైనట్లు సమాచారం. మంగళవారం నుండి రోడ్డుపైనే వృద్ధులు, మహిళలు, పిల్లలు సైతం బైఠాయించి పరిహారం కోసం పడిగాపులు కాస్తున్నారు. రెండురోజులుగా రాత్రి తీవ్రమైన చలిగాలులు, పగటిపూట వేడిమిని తట్టుకోలేక వారు కొద్దిమేర ఇబ్బందులు పడుతున్నారు. కార్యక్రమంలో మానవహక్కులవేదిక జిల్లా కన్వీనర్ జయశ్రీ, సిపిఎం నాయకుడు ఓబులు, రైతుసంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
2017 మార్చి 20 నాటికి
ఆర్టీపీపీ ఆరవ యూనిట్ పూర్తి
ఎర్రగుంట్ల,డిసెంబర్ 29:2017మార్చి 20నాటికి ఆర్టీపీపిలోని ఆరవ యూనిట్‌ను పూర్తిచేసి సింగరనైజేషన్ చేసేందుకు అన్నిచర్యలు తీసుకున్నట్లు జన్కో డైరెక్టర్ (ప్రాజెక్ట్సు) సుందర్‌సింగ్ తెలిపారు. గురువారం ఆర్టీపీపి ఆరవ యూనిట్‌లోని బాయిలర్‌లో లైటప్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ 600మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించ తలపెట్టిన ఆరవ యూనిట్‌ను జెన్కో యాజమాన్యం 2012 జూన్‌లో ప్రారంభించిందన్నారు. 2013 నవంబర్‌లో డ్రమ్ లిఫ్టింగ్ కార్యక్రమాలు జరిగాయని, 2016 మార్చి నెలలో టిజిఫ్లోర్ పూర్తి అయ్యిందన్నారు. అలాగే 2016 నవంబర్ 24 నాటికి జనరేటర్ టెస్టింగ్ జరిగిందని, గురువారం బాయిలర్‌లో లైటప్ కార్యక్రమాన్ని నిర్విగ్నంగా కొనసాగించామన్నారు. అతి తక్కువ ఖర్చుతో విద్యుత్ ఉత్పత్తిని చేసి సరఫరా చేయాలనే కృతనిశ్చయంతో ఈ యూనిట్‌ను ఏర్పాటుచేసినట్లు ఆయన వివరించారు. అలాగే సెఫ్టీ, సాంకేతిక నిబందనల మేరకు నిర్మాణం జరిగిందని వివరించారు. ఈప్రాజెక్టు పూర్తి అయ్యేందుకు అన్ని రకాల సహకరించిన జెన్కో ఎండి విజయానంద్, జెన్కో, ట్రాన్స్‌కో చైర్మన్ అజయ్ జైన్‌లను ఆయన అభినందించారు. ఈకార్యక్రమంలో సిఇ సివిల్ రత్నకుమారి, ఆర్టీపిపి సిఇ రవీంద్రకుమార్‌లు కూడా పాల్గొన్నారు. కాగా రాయలసీమ ధర్మల్ పవర్ ప్రాజెక్టు ఆర్టీపీపీలో 600 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యంతో నిర్మించతలపెట్టిన ఆరవ యూనిట్ లైటప్ కార్యక్రమాన్ని గురువారం జెన్కో డైరెక్టర్ ప్రాజెక్ట్సు సుందర్‌సింగ్ విజయవంతంగా ప్రారంభించారు. ముందుగా ఆయన సిఇ రవీంద్రకుమార్‌తోపాటు సిఇ లావణ్య, సిఇ రత్నకుమారిలతో కలిసి ప్రాజెక్టులో జరుగుతున్న వివిధ ప్రాంతాల్లోని పనులు పరిశీలించారు. అనంతరం బాయిలర్‌లో పూజలు నిర్వహించి లైటప్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా అక్కడున్న అధికారులతో ఆయన మాట్లాడుతూ స్థానిక అధికారులు, సిబ్బంది, కార్మికుల సహకారంతో ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టామని వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈలైటప్ కార్యక్రమం కూడా విజయవంతం చేసేందుకు తోడ్పడిన అధికారులందరినీ ఆయన అభినందించారు. ముందుగా అధికారులు డైరెక్టర్‌కు పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు. ఈకార్యక్రమంలో విద్యుత్‌సధా సిఇ సూర్యరశ్మి, సిఇ సివిల్ కుమార్, స్థానిక ఎస్‌ఇలు సోమశేఖర్‌రెడ్డి, రామసుబ్బారెడ్డి, ఏడిఇలు, డిఇలతోపాటు ఆరవ యూనిట్ పనులను నిర్వహిస్తున్న గుత్తేదారులు పవర్ నెక్, విఏటెక్, బిహెచ్‌ఇఎల్ తదితర కంపెనీలకు చెందిన అధికారులు, అనధికారులు పెద్ద ఎత్తునపాల్గొన్నారు.
రక్తమోడిన రహదారులు...!

కడప,డిసెంబర్ 29:జిల్లాలో నేరా లు-ఘోరాలు తగ్గుముఖం పట్టాయి. జిల్లా ఎస్పీ పిహెచ్‌డి రామకృష్ణ అవినీతి అక్రమాలకు పాల్పడే పోలీసులపై వేటు వేసేందుకు దృష్టిసారించి మైదుకూరు డిఎస్పీ రామకృష్ణతోపాటు ఎస్‌ఐలు, సిఐలు, కానిస్టేబుళ్లు 35మందిపై వేటువేసి మరికొంతమందిపై వేటువేసేందుకు రంగం సిద్దవౌతున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో రోడ్డు ప్రమాదాలు మితిమీరి రోడ్లన్నీ రక్తసిక్తంగా మారుతున్నాయి. ఇప్పటి వరకు 1366 రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకోగా 526 మంది మృత్యువాతపడి వందలాది మంది క్షతగాత్రులయ్యారు. జా తీయ రహదారి అయిన గువ్వలచెరువుఘాట్‌లో ఒక లారీ-ఆర్టీసి బస్సు బోల్తాపడి ఏడుమంది మృత్యువాతపడ్డారు. దువ్వూరు మండలం ఏకోపల్లె వద్ద పెండ్లిబృందం ట్రాక్టర్ బోల్తాపడి ఐదుమంది ప్రాణాలు పోయాయి. ప్రపంచంలోనే ప్రసిద్దిగాంచడంతోపాటు అత్యంత విలువైన ఎర్రచందనం దేశవిదేశాల్లో ఎగుమతి అవుతూ అందుకు సంబంధం వున్న 1050మంది స్మగ్లర్లను, ఎర్రకూలీలను అరెస్టుచేసి 12మంది అంతర్జాతీయ స్మగ్లర్లపై పిడి యాక్టు నమోదుచేశారు. అలాగే డ్రగ్స్ మాఫియా రాకెట్ కేరళ నుంచి జిల్లావరకు వ్యాపించి సుండుపల్లె, ఒంటిమిట్ట నుంచి గల్ఫ్‌దేశాలకు స్వదేశానికి బ్రౌన్‌షుగర్ భారీ ఎత్తున పట్టుకుని 10మందిని అరెస్టుచేశారు. ముఖ్యంగా జిల్లాలోని క్రికెట్ బుక్కీలు మూడు రాష్ట్రాల్లో బెట్టింగ్ నిర్వహిస్తుండగా 108 మందిని అరెస్టుచేసి రూ.70లక్షల 71 వేలు స్వాధీనం చేసుకున్నారు. డ్రంకన్‌డ్రైవ్ చేస్తూ 1670 మందిని అరెస్టుచేసి వారిపై 16పిడి యాక్టులు బనాయించారు. మట్కాబీటర్లను వెంటాడి 240 మందిని స్వదేశంలో కాకుండా విదేశాల్లో అరెస్టుచేసి తీసుకొచ్చారు. వారి నుంచి కోటి 14 లక్షల 47వేల రూపాయలు పై చిలుకు పోలీసులు రికవరీ చేశారు. అలాగే జిల్లాలో 65హత్యలు ఈ ఏడాది చోటుచేసుకోగా డబ్బు, ఆస్తికోసం తోపాటు అక్రమ సంబంధాలతోనే హత్యలు అధికంగా జరుగుతున్నాయి. మద్యానికి బానిసై మహిళలను హతమార్చడం షరా మామూలైంది. కడప జిల్లాకు చెందిన మావోయిస్టు రాష్టక్రమిటీ సభ్యుడు గజ్జల కృష్ణారెడ్డి కర్నూలు జిల్లాలో పోలీసులకు లొంగిపోయారు. అలాగే ఫ్యాక్షన్‌లో భాగంగా వేంపల్లె మండల పరిషత్ ఉపాధ్యక్షుడు వైసిపి నేత గజ్జల రామకృష్ణారెడ్డిని ప్రత్యర్థులు హతమార్చారు. ఇకపోతే జిల్లా వ్యాప్తంగా 7435 కేసులు నమోదుకాగా అందులో దొంగతనాలు 780 పైబడే ఉన్నాయి. గతంలో ప్రైవేట్ వ్యక్తుల ఇళ్లల్లోనే దోపిడీ చేయగా ప్రభుత్వ కార్యాలయాలు, చిన్నా చితక ఇన్సురెన్స్ కంపెనీలపై కూడా దాడిచేశారు. పులివెందులలో కాపలాదారులే ఏటిఎంలో దోపిటీ చేసి రూ.53లక్షలు ఎత్తుకెళ్లగా వారిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల అంచనాల మేరకు ఈ ఏడాది రూ.6కోట్ల 41వేల పై చిలుకు ప్రజల సొమ్ముదొంగలించగా రూ.2 కోట్ల 30లక్షలు మాత్రమే రికవరీ అయినట్లు పోలీసుల రికార్డులు చెబుతున్నాయి. ఇక పేకాట విషయంలో 795 కేసులు నమోదుచేయగా 4615 మం దిని అరెస్టుచేసి వారి నుంచి రూ.79 లక్షల 75వేలు పైబడి స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. కోడిపందేలలో 283 మందిని అరెస్టుచేసి రూ.3లక్షల 32వేలు స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలో జిల్లాకేంద్రంలోని ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో పెద్ద ఎత్తున అగ్నిప్రమాదానికి చోటుచేసుకుంది. మెట్రో పాలిటిన్ సిటీలకే పరిమితమైన చైన్‌స్నాచింగ్‌లు ఇప్పుడిప్పుడే జిల్లాకు ప్రాకాయి. క్రైమ్ నివారణకు పోలీసులు చేపట్టిన చర్యలు ఇప్పుడిప్పుడే సత్ఫలితాలు ఇస్తున్నాయి. మొత్తంమీద రోడ్లన్నీ రక్తసిక్తంగా మారుతున్నాయి.
అన్నదాతలకు కలసి వచ్చిన వేళ..!
* 70 యేళ్ల తర్వాత ఒంటిమిట్టకు శాశ్వత జలాలు
ఒంటిమిట్ట, డిసెంబర్ 29: సుమా రు 70 యేళ్ల అనంతరం ఒంటిమిట్ట చెరువుకు శాశ్వత జలాలురావడం విశేషం. ఈ ఏడాది ఏప్రిల్‌లో సోమశిల మిగులు జలాలను ఒంటిమిట్ట చెరువుకు సుమారు రూ. 35 కోట్లతో ఏర్పాటుచేసిన ఎత్తిపోతల పథకాన్ని సిఎం చంద్రబాబునాయుడు ప్రారంభించిన విషయం విదితమే. దీంతో ఈ ఏడాదిలో అన్నదాతల చిరకాలవాంఛ నెరవేరడంతో రాబోవు కొత్త సంవత్సరంలో ఆనందంతో వేడుకలు జరుపుకునేందుకు సమాయత్తం అవుతున్నారు. జిల్లాలో పెద్ద చెరువుగ ఒంటిమిట్ట పేరుగాంచింది. మాజీమంత్రి పసుపులేటి బ్రహ్మయ్య సుమారు రూ. 4 కోట్లతో జన్మభూమి పథకం ద్వారా పెన్నానది నుండి చేపట్టిన కాలువ పనులు అర్ధాంతరంగా నిలిచాయి. సుమారు 70 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న నాయకులు ఈ చెరువుపై చేసిన వాగ్దానాలు అంతా ఇంతా కాదు. రాష్ట్ర విభజన అనంతరం ఒంటిమిట్టను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడం, సిఎం గత ఏడాది జరిగిన ఉత్సవాలలో చెరువుకు శాశ్విత జలాల కోసం శంకుస్థాపన చేసి, త్వరితంగా పూర్తిచేసి ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రారంభించారు. ఫలితంగా తరతరాలుగా ఉన్న కరవు ఈ ప్రాంతంలో పటాఫంచలైంది. ఆయకట్టు భూములన్ని పంటలతో కళకళ లాడుతున్నాయి. ప్రస్తుతం సోమశిల జలాలు చెరువుకు వస్తున్నాయి. మరో రెండునెల్లో చెరువులో పూర్తి స్థాయి నీటిసామర్ధ్యం ఉండేలా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. బీడుబారిన భూములు పంటలతో కళకళ లాడడంతో రైతులు సంబర పడుతున్నారు. నూతన సంవత్సరాన్ని సంతోషంగా గడిపేందుకు రైతులు సన్నద్ధం అయ్యారు.
గండికోట ముంపువాసులకు
తక్షణమే పరిహారం చెల్లించాలి
* టిడిపికి కొమ్ముకాస్తున్న కలెక్టర్ * ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి
కమలాపురం, డిసెంబర్ 29: గండికోట ముంపువాసులకు ప్రభుత్వం తక్షణమే పరిహారం చెల్లించాలని లేనిపక్షంలో తమ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులందరితో కలసి పెద్దఎత్తున ఆందోళన చేపడతామని ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి హెచ్చరించారు. ఆయన గడప గడపకూ వైసిపి కార్యక్రమంలో భాగంగా గురువారం సాయంత్రం పంచాయతి పరిధిలోని కె కొత్తపల్లెలో విలేఖర్లతో మాట్లాడుతూ ముంపుగ్రామమైన చౌటపల్లె వాసులుచేపట్టిన ధర్నాకు సంఘీభావం తెలిపేందుకు వెళుతున్న వైయస్ వివేకాను పోలీసులు దౌర్జన్యంగా అరెస్టు చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. రాష్ట్రంలో చంద్రబాబుపాలన హిట్లర్ పాలనను తలపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసారు. పోలవరం బాధితులకు ఎకరాకు రు.16 లక్షలు చెల్లించిన ప్రభుత్వం ఈజిల్లావాసులకు ఎందుకు పరిహారం తగ్గించారని ప్రశ్నించారు. కడప జిల్లా కలెక్టర్ తెలుగుదేశంకు కొమ్ము కాస్తున్నారని ధ్వజమెత్తారు. గండికోట బాధితులకు పరిహారం చెల్లించకపోతే తాను రాజీనామా చేస్తానని పేర్కొనడాన్ని రాజకీయనేతల మాటలను తలపిస్తోందన్నారు. అలాగే కలెక్టర్‌గా ఉం టూ అధికారపార్టీకి వత్తాసు పలుకుతూ సవాలు విసరడం, రాజీనామా చేస్తాననడం సమంజసంగా లేదన్నా రు. అబద్దాలుచెప్పి గద్దెనెక్కిన చంద్రబాబు ముంపువాసులను ముం పులోనే ముంచుతున్నారని అన్నారు. తమ పార్టీ అధినేత జగన్ పులివెందుల రెవెన్యూ కార్యాలయంవద్ద ధర్నా చేయడాన్ని తప్పుపట్టిన తెలుగుదేశం నేతలమాటలు చూస్తుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుందన్నారు. ప్రజాసమస్యల కోసం తమ అధినేత ముందుంటారన్నారు. మం డలి ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులు విజయం సాధించడం ఖాయమన్నారు. ఎన్ని ఫిరాయింపులు చేయించినా తమదే విజయం అన్నారు.
కలెక్టర్‌ను టార్గెట్ చేస్తున్న వైకాపా !
* నిర్వాసితులకు గట్టిహామీ ఇవ్వడంపై విమర్శలు

కడప,డిసెంబర్ 29:గండికోట ముం పువాసులకు పరిహారం ప్రభు త్వం నుంచి చెల్లించేందుకు సర్వం సిద్ధం చేశామని 15రోజుల్లో బాధితుల ఖా తాల్లో పరిహారం జమచేస్తామని కలెక్టర్ కెవి సత్యనారాయణ ఈనెల 25న నిర్వాసితుల సమావేశంలో గట్టిహామీ ఇచ్చారు. ఈ హామీలో నిర్వాసితులు కలెక్టర్‌ను గట్టిగా ప్రశ్నించడంతో 15 రోజుల్లో ఖాతాల్లో పరిహారం వేయించలేని పక్షంలో ఉద్యోగానికి రాజీనామాచేసి నిర్వాసితులతో కలిసి పోరాడుతానని ముంపువాసులకు నిర్ధిష్టమైన హామీ ఇచ్చారు. దీన్ని ఆసరా చేసుకుని వైకాపాకి చెందిన ఎమ్మెల్యేలు కలెక్టర్ సత్యనారాయణను రాజకీయ కోణంలో ఆలోచిస్తూ రాజకీయ దుమారం రేపుతున్నారు. గతం లో పనిచేసిన కలెక్టర్ కెవి రమణపై కూడా అవాకులు చవాకులు పేలి వైకా పా ఎమ్మెల్యేలు, నేతలు రమణపై తర చు ఆరోపణల ప్రకటనలు ఇవ్వడం ఆయన వాటిని ఖండిస్తూ రెండేళ్లపాటు తన పదవీకాలాన్ని ముగించుకుని బదిలీపై వెళ్లారు. కలెక్టర్ రమణపై జిల్లా పరిషత్‌లోనే తీర్మానాలు చేసి కలెక్టర్ మాకొద్దంటూ ప్రభుత్వానికి నివేదికలు పంపారు. అయితే వైకాపా ఎమ్మెల్యేలు చివరి వరకు ఆ యనతో కలవకుండా యుద్ధప్రాతిపదికపై వైకాపా ప్రజాప్రతినిధులంతా రాజీ అయ్యారు. ప్రస్తుతం కలెక్టర్ కెవి సత్యనారాయణ కేవలం నిర్వాసితులను రెచ్చకొట్టకుండా సమయస్ఫూర్తితో ప్రభుత్వం నుంచి రూ.479కోట్లు పరిహారాన్ని మంజూరుచేయించి ఈనె ల 31న జరిగే కేబినెట్ సమావేశంలో తీర్మానం చేయించి మరో వారం రోజుల్లోగా పరిహారం చెల్లించేందుకు చర్య లు వేగవంతం అవుతున్నందున కలెక్టర్ 15రోజులు నిర్వాసితులకు గడువుపెట్టారు. అయితే 15రోజుల్లో పరిహారం అందకపోతే పరిస్థితి ఏమిటని కలెక్టర్‌ను ఆందోళనకారులు ప్రశ్నించడంతోపాటు కలెక్టర్‌ను తికమకపెట్టిన ఆయన సహనంతోనే 15రోజుల్లో పరిహారం ఇప్పిస్తారా రాజీనామా చేస్తారా అని కలెక్టర్‌ను కొంతమంది ప్రశ్నించారు. ఇలాగో 15రోజుల్లో నష్టపరిహారం అందుతుందన్న ఉద్దేశ్యంతో కలెక్టర్ నిర్వాసితులకు భరోసా ఇచ్చేందుకు నిర్వాసితులు ప్రశ్నించిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ పరిహారం అందకపోతే తాను రాజీనామా చేస్తానని చెప్పి సర్దుబాటుచేశారు. వైకాపా నేతలు ఈ వ్యవహారాన్ని చిలికి చిలికి గాలివానగా మార్చేందుకు ప్రకటనలు ఇచ్చేవిధంగానే కలెక్టర్‌పై ప్రకటనలు మొదలుపెట్టారు. ఆయన వైకాపానేతల ప్రకటనలకు బెదరకుండా ఖండించకుండానే గురువారం మరో మారు గండికోటను సందర్శించి ఎత్తిపోతల పథకం ద్వారా నీరు ఇచ్చేందుకు ట్రైల్ రన్ చేసేందుకు జలవనరులశాఖ అధికారులను వెంటపెట్టుకుని పర్యటించారు. గతంలో కలెక్టర్లను రెచ్చగొట్టి తమ నియోజకవర్గాల అభివృద్ధిపై కలెక్టర్‌ను కలవలేక చివరకు రాజీ అయినా ఎటువంటి అభివృద్ధి పనులు సాధించుకోలేక రెం డున్నర సంవత్సరం కాలపరిమితి గడిచిపోయింది. తిరిగి ఎమ్మెల్యేలు ప్రస్తు త కలెక్టర్‌పై కూడా కాలుదువ్వుతుండటంతో వైసిపి ఎమ్మెల్యేలు, ఎంపిలు ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ, పార్లమెంట్ ని యోజకవర్గాల అభివృద్ధి కాలమే నిర్ణయించాల్సివుంది.
ఆటో చోరీ
రైల్వేకోడూరు, డిసెంబర్ 29:పట్టణంలోని చిట్వేల్ రోడ్‌లో నివాసం ఉంటున్న బాబుకు చెందిన ఆటోను గుర్తు తెలియని వ్యక్తులు బుధవారం రాత్రి చోరీ చేశారని బాధితుల ఫిర్యాదు మేరకు గురువారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు. ఇప్పటికే మూడు రోజుల క్రిందట మండలంలోని శాంతినగర్‌కు చెందిన సురేష్ ఆటో కూడా చోరీకి గురైందని, ఈ రెండు ఆటోల కోసం ప్రత్యేక బృందాలను పంపామన్నారు.
ఉప్పరపల్లెలో 19తులాలు బంగారు అపహరణ
సిద్దవటం,డిసెంబర్ 29:మండలంలోని ఉప్పరపల్లె గ్రామపంచాయతీ సాయినగర్ అవ్వారు రామ్మూర్తి ఇంట్లో బుధవారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడినట్లు ఎస్‌ఐ అరుణ్‌రెడ్డి గురువారం తెలిపారు. ఇంటిలో ఎవరూలేని సమయంలో గుర్తు తెలియని దుండగులు అర్ధరాత్రి తలుపుల బీగాలు కోసి ఇంట్లోకి చొరబడ్డారన్నారు. రామ్మూర్తి స్వగృహంలోని దాదాపు మూడు లక్షల రూపాయలు విలువచేసే బంగారును అపహరించుకుపోయారన్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు.
ఆరు ఎర్రచందనం దుంగలు స్వాధీనం
* ఒకరు అరెస్టు-ముగ్గురు పరారీ
సిద్దవటం,డిసెంబర్ 29:మండలంలోని భాకరాపేట సమీపంలో ఉన్న రామస్వామిపల్లె వద్ద అక్రమంగా తరలిస్తున్న ఆరు ఎర్రచందనం దుంగలతోపాటు ఆటోను స్వాధీనం చేసుకుని కర్నాటకకు చెందిన నాగరాజును అరెస్టుచేసినట్లు ఎస్‌ఐ అరుణ్‌రెడ్డి తెలిపారు. గురువారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ రాజంపేట డిఎస్పీ రాజేంద్ర, ఒంటిమిట్ట సిఐ శ్రీరాములు ఆదేశాల మేరకు గాలింపు చర్యల్లో భాగంగా రామస్వామిపల్లెలో అక్రమ రవాణా జరుగుతుండగా దాడులు చేశామన్నారు. ఈ దాడుల్లో కర్నాటకకు చెందిన నాగరాజును అరెస్టుచేయగా పోలయ్య, అర్షద్‌ఖాన్, ఆసీఫ్‌ఖాన్‌లు పరారయ్యారన్నారు. స్వాధీనం చేసుకున్న దుంగలు, ఆటోను సిద్దవటానికి తరలించామన్నారు. ఈమేరకు కేసు నమోదుచేసుకుని దర్యాప్తుచేస్తున్నామన్నారు. పట్టుబడిన నాగరాజును జడ్జి ఎదుట హాజరుపరచగా ఆయన రిమాండ్‌కు ఆదేశించారన్నారు.
ఉక్కుపరిశ్రమను మరిచిన ప్రభుత్వం
ప్రొద్దుటూరు టౌన్, డిసెంబర్ 29: రాష్ట్ర విభజన చట్టంలో కడపజిల్లాలో ఉక్కుపరిశ్రమ స్థాపన అంశాన్ని పొందుపరచడం జరిగిందని, గడిచిన ఎన్నికల్లో ఉక్కుపరిశ్రమను తప్పకుండా ఏర్పాటుచేస్తామని సిఎం చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారని, కానీ ఆ విషయాన్ని ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం మరిచిందని ఉక్కుపరిశ్రమ సాధనకమిటీ అధ్యక్షుడు గండ్లూరు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. పరిశ్రమ సాధనకై ప్రవీణ్‌కుమార్‌రెడ్డి త్వరలో చేపట్టబోవు ఆమరణనిరాహారదీక్షకు ప్రజల మద్ధతు కోరుతూ గురువారం స్థానిక పాత బస్టాండ్‌లో ప్రజలకు కరపత్రాలను పంపిణీచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిశ్రమ స్థాపనకు జిల్లాలో వనరులన్నీ పుష్కలంగా ఉన్నా ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చేస్తోందని ప్రశ్నించారు. పరిశ్రమ ఏర్పాటు వలన ఒక్క కడప జిల్లాయే కాదని రాయలసీమ మొత్తం అభివృద్ధి చెందే అవకాశాలున్నాయన్నారు. రాయలసీమలో ప్రస్తుతం నిరుద్యోగ సమస్య తీవ్రతరమవుతోందని, ఏమి చేయాలో పాలుపోక వ్యవసాయం, కూలి పనులకు వెళుతూ జీవనం జీవనం సాగిస్తున్నారని, వారు చదివిన చదువులకు విలువలేకుండా పోతోందని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. తాను చేపట్టబోవు ఆమరణ నిరాహారదీక్షకు ప్రజలందరూ పూర్తి స్థాయిలో మద్ధతు తెలిపినట్లయితే ప్రభుత్వం దిగివచ్చి పరిశ్రమను స్థాపించి తీరుతుందని ఆయన కోరారు. పరిశ్రమ సాధనకై తన ప్రాణాలైనా అర్పించేందుకు వెనుకాడనని అన్నారు. జిల్లాలో ఉన్నటువంటి టిడిపి ప్రజాప్రతినిధులు పరిశ్రమపై నోరు మెదపడం లేదన్నారు. కార్యక్రమంలో సాధనకమిటీ సభ్యులు అమర్‌నాధ్‌రెడ్డి, ఖలంధర్ పాల్గొన్నారు.
2016లో రాజంపేట డివిజన్ రైతన్నకు భారీ నష్టాలే!

రాజంపేట, డిసెంబర్ 29: 2016వ సంవత్సరంలో రాజంపేట డివిజన్ రైతన్న అన్నివిధాలా నష్టపోయారు. వర్షాభావంతో ఆయకట్టు రైతుల్లో బతుకు భయం, ప్రకృతి వైపరీత్యాలతో పండ్లతోటల రైతాంగం కడగండ్లు చెప్పనలవి కాదు. ఈ ఏడాది ఏ విధంగా చూసినా డివిజన్‌లో రైతులు భారీగా నష్టాలపాలయ్యారనే చెప్పవచ్చు. ప్రకృతి వైపరీత్యాలు, గిట్టుబాటు ధరలు లేకపోవడం, తెగుళ్లు, పెనుగాలులకు అరటి, బొప్పాయి, మామిడి, నిమ్మ తదితర తోటలకు భారీ నష్టాలు ఏర్పడ్డాయి. దీంతో ఒక ప్రక్క తోటల నష్టం, మరోప్రక్క దిగుబడులు లేక లక్షలు పోసి పెంచుతున్న పండ్ల తోటల రైతాంగం పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఇదేవిధమైన పరిస్థితులు దాదాపుగా అన్ని తోటల రైతాంగం ఎదుర్కొన్నారు. వర్షాభావంతో మిట్టప్రాంతాల్లో నిమ్మతోటలను కాపాడుకునేందుకు రైతులు నానా అవస్థలు పడక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. ఇక వర్షాభావ పరిస్థితులతో ఖరీఫ్‌తో పాటు రబీ పంటను డివిజన్ ఆయకట్టు రైతులు పండించుకోలేకపోయారు. దీంతో వరిసాగు విస్తీర్ణం కేవలం బావులు, బోర్ల క్రింద మాత్రమే సాగయ్యింది. వేల హెక్టార్లలో ఆయకట్టు భూములు బీడుగా మారాయి. డివిజన్‌లో ఏ చెరువు, కుంట చూసినా చుక్కనీరు లేకుండా ఎండిపోయి కనిపిస్తున్నాయి. వరి పంట దిగుబడి భారీగా డివిజన్‌లో వర్షాభావంతో పడిపోయిందనే చెప్పవచ్చు. వరిసాగు లేకపోవడంతో ఆయకట్టు భూములు కంపచెట్లు, రకరకాల పిచ్చిచెట్లతో నిండిపోయి కనిపిస్తున్నాయి. భారీ వర్షాలు పడతాయని ఎప్పటికప్పుడు ఆశతో ఎదురుచూసిన రైతులకు నిరాశే ఎదురైంది. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు రైతులను దిక్కూమొక్కు లేకుండా చేయగా, ప్రకృతి వైపరీత్యాలు వాణిజ్య పంటల రైతాంగం కొంప ముంచాయి. పండ్లతోటలకు ప్రసిద్ధి చెందిన రాజంపేట డివిజన్‌లో వాణిజ్య పంటల రైతాంగాన్ని ఆదుకునేందుకు పంటల బీమా వసతిని సులభతరం చేయమని స్థానికంగా కొన్ని దశాబ్దాల నుండి రైతులనుండి విజ్ఞప్తులు వస్తున్నా పట్టించుకునే నాధుడే కరవయ్యారు. ప్రతియేడు పెనుగాలులతోనో, గిట్టుబాటు ధరలు కరవవ్వడమో, సరైన రీతిలో గిట్టుబాటు ధరలు లేకపోవడం, సరైన మార్కెటింగ్ వసతుల కరవవ్వడం, దళారుల రంగ ప్రవేశం, తెగుళ్లు ఇలాఏదో ఒకవిధంగా వాణిజ్య తోటల రైతాంగం తీవ్రంగా నష్టపోవడం జరగుతూ వస్తుంది. వాణిజ్య రైతాంగంను ఆదుకోకుంటే ఈ ప్రాంతంలో పండ్లతోటల విస్తీర్ణం బాగా దెబ్బతినే అవకాశాలున్నాయని చెపుతున్నా సంబంధిత అధికార్లు నిమ్మకు నీరెత్తిన చందంగా మిన్నకుంటుండడం విచారకరం. ప్రకృతి వైపరీత్యాలతో వాణిజ్య తోటల రైతాంగం నష్టాలకు గురైనప్పుడు ఒకోమారు ప్రభుత్వం సకాలంలో స్పందిస్తూ నష్టపరిహారం అందిస్తున్నా అధికమార్లు నష్టపరిహారం అందించని సందర్భాలే ఎక్కువగా ఉన్నాయి. నాలుగైదు సంవత్సరాలుగా పరిస్థితులు పరిశీలిస్తే నష్టాలు ఎదురైనప్పుడు అధికమార్లు నష్టపరిహారం ఊసే ఉండదు, ఒకవేళ ఉన్నా నష్టంలో 10శాతం కూడా రైతులు పరిహారం అందుకోని సందర్భాలే ఎక్కువ. ఏడాదికేడాది ఈ ప్రాంతంలో వాణిజ్య తోటల రైతుల కష్టాలు పెరుగుతున్నాయి తప్పితే తగ్గడం లేదు. ప్రకృతి వైపరీత్యాలను ప్రభుత్వం అదుపు చేయలేకపోయినా కనీసం వర్షాభావ పరిస్థితులకు గురవుతున్న ఆయకట్టు రైతులను ఆదుకునేందుకు ఇక్కడి జలవనరులను రైతుల దరికి చేర్చేందుకు అవసరమైన చర్యలు చేపట్టాల్సి ఉంది. రైతులకు నష్టాలు ఎదురైతే తప్పనిసరిగా వారికి పరిహారం అందించేలా ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం కూడా ఉంది. లేకుంటే రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుందని చెప్పడంలో సందేహం లేదు. వర్షాభావం, ప్రకృతి వైపరీత్యాలతో రైతులు ఎదుర్కొంటున్న కష్టాలను గుర్తెరిగి వారిని ఆదుకునేందుకు అవసరమైన చర్యలు చేపట్టాల్సి ఉంది.
మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించండి
జమ్మలమడుగు, డిసెంబర్ 29: మున్సిపాలిటీ అభివృద్దికి అందరూ సహకరించాలని మున్సిపల్ చైర్‌పర్సన్ టి.తులసి కోరారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో గురువారం సాయంత్రం మున్సిపల్ అత్యవసర సమావేశం నిర్వహించారు. సమావేశంలో మున్సిపల్ సిబ్బంది 4 అంశాలతో కూడిన అజెండాను చదివి వినిపించారు. ఇందులో మున్సిపల్ ప్రజాప్రతినిథులకు ప్రభుత్వ ఇటీవలచేసిన వేతన పెంపునిర్ణయం, రూ.10లక్షలతో షాపింగ్ కాంప్లెక్స్ నిరా
మణం, రూ.2లక్షలతో పట్టణపరిధిలో పైప్‌లైన్ పనులకు, రూ.70 లక్షల అంచనా వ్యయంతో మార్కెట్‌లో భవన నిర్మాణాలు, అభివద్దిపరుచుటకు చేపట్టాల్సిన పనులను అజెండా అంశాలను పొందుపరిచారు. వీటిని మున్సిపల్ కౌన్సిల్ ఏకగ్రీవ తీర్మాణంతో ఆమోదించారు. మున్సిపాలిటీ నుండి పందుల తరలింపు, ఖాళీ ప్రదేశాల్లో నీటి నిల్వపై సదరు యాజమానులకు తాఖీదులు ఇవ్వడం వంటి చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. అనంతరం మున్సిపాలిటి అభివద్ధికి చేపట్టాల్సిన చర్యలు, పట్టణంలోని సమస్యలపై చర్చించారు. మున్సిపల్ ఛైర్‌పర్సన్ తులశమ్మ మాట్లాడుతూ మున్సిపాలిటీలో రోడ్లపైకి ఆవులను వదలకుండా యజమానులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మున్సిపాలిటీలో పారిశుద్ద్యంపై ప్రజలు తమ వంతు సహకారాన్ని అందించాలన్నారు. మున్సిపాలిటీ అభివృద్దికి ప్రత్యేక నిధులు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తెప్పిస్తున్నారన్నారు. మున్సిపాలిటీ అభివృద్ది కొరకు అందరూ సహకరించాలని చైర్‌పర్సన్ తులసి కోరారు. ఈ సమావేశంలో వైస్ చైర్మన్ ఎం.జానీ, మున్సిపల్ కమీషనర్ మధుసూదన్‌రెడ్డి, మున్సిపల్ ఇంజినీరు వేణుగోపాల్, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు.