కడప

గండికోట వారోత్సవాలు అనుమానమే?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మలమడుగు, జనవరి 19: రాష్ట్ర ఉత్సవాలుగా ప్రభుత్వం నిర్వహించతలపెట్టిన గండికోట చారిత్రక వారసత్వ వారోత్సవాలు నిర్వహణ మరోసారి వాయిదాపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2015లో సెప్టెంబర్‌లో నిర్వహించిన ఉత్సవాల్లో గండికోట వారసత్వ వారోత్సవాలను ప్రతియేటా సెప్టెంబర్ మాసంలో నిర్వహిస్తామని ప్రకటించింది. 2016 వారోత్సవాలు సెప్టెంబర్ మాసం నుండి పలుకారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. గత ఏడాది వారోత్సవాలను జనవరి 19వ తేదీ నుండి మూడు రోజులపాటు నిర్ణయించడానికి ప్రభుత్వం ఏర్పాట్లకు పూనుకుంది. ముఖ్యమంత్రి కూడా గండికోట వారోత్సవాల్లో పాల్గొనడానికి అధికార యంత్రాంగం కసరత్తుచేసింది. డిసెంబర్ 7న గండికోట టూ రిజం అతిథి గృహంలో కలెక్టర్ కె.వి. సత్యనారాయణ వారోత్సవాల ఏర్పాట్లపై జిల్లా అధికారులతో సమీక్షించారు. జనవరి 19 నుండి 22వరకు తేదీల్లో ముఖ్యమంత్రి పర్యటనకు అవకాశంగా అధికారులు వారోత్సవాల తేదీలను ఖరారు చేసుకున్నారు. ము ఖ్యమంత్రి పర్యటన ఖరాలు లేకపోవడంతో జనవరి 29, 30వ తేదీల్లో వారోత్సవాలు నిర్వహించడానికి అధికారు లు నిర్ణయించారు. ఆరుమార్లు వాయి దా పడిన చివరగా నిర్ణయానికి వచ్చిన 29, 30వ తేదీల్లో కూడా వారోత్సవాల నిర్వహణ అనుమానంగా కనిపిస్తోం ది. జనవరి 30వ తేదీన జాతిపిత గాంధీమహాత్ముని వర్ధంతి కారణంగా ఉత్సవాల నిర్వహణపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనికితోడు ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వానికి జిల్లా నుండి నివేదికలు వెళ్లినా ఇంతవరకు ఉత్సవాలపై అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో గండికోట వారోత్సవాల నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది.

ఎమ్మెల్సీ ఎన్నికలపై లోకేష్‌బాబు సమీక్ష

కడప,జనవరి 19:కేవలం నెలన్నర రోజుల వ్యవధిలో జరగనున్న ఎమ్మె ల్సీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాకు చెం దిన ఎమ్మెల్సీ అభ్యర్థులు జిల్లా ముఖ్యనేతలతో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి ఎన్.లోకేష్‌బాబు ప్రచార ప్రక్రియపై మూడురోజులుగా నిర్వహించిన సమీక్ష గురువారానికి ముగిసింది. ఈనేపధ్యంలో గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి కెజె రెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి బచ్చలల పుల్లయ్య, స్థానిక సంస్థల ఎ మ్మెల్సీ బిటెక్ రవి (రవీంద్రారెడ్డి) లతోపాటు ముఖ్యనాయకులతో లోకేష్‌బాబు విజయవాడలో కొంతమందితో ,హైదరాబాద్‌లో మరికొంతమందితో సమీక్షించారు. ఆదిపత్యపోరు మధ్య నలుగుతున్న నియోజకవర్గాల్లో ఈ మూడుస్థానాలకు వచ్చే ఎన్నికల ఫలితాలు బట్టి, సంబంధిత ప్రాంతాల్లో గుర్తింపు ఉంటుందని, ఎన్నికల ఫలితాలు పార్టీకి అనుకూలంగా లేనిపక్షంలో నియోజకవర్గ ఇన్‌చార్జిలను సైతం తొలగించనున్నట్లు తెలుస్తోంది. అగ్రస్థాయి పార్టీ పదవుల్లో ఉన్న నేతలకు కూడాదండన తప్పదనే విధంగా లోకేష్‌బాబు హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఎన్నికల ప్రచారంనిమిత్తం వివిధ విభాగాలకు చెం దిన వారికి ఎమ్మెల్సీల బాధ్యతను తెలుగుదేశంపార్టీ సీనియర్ నేత, రాష్టమ్రాజీ మంత్రి, శాసన మండలి అభివృద్ధికమిటీ చైర్మన్ గాలి ముద్దుకృష్ణమనాయుడు, చీఫ్ విఫ్ కాల్వ శ్రీనివాసులుకు టిడిపి పోలిట్ బ్యూరో సభ్యు డు, ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిలకు బాధ్యతలు అప్పగించారు. ఇప్పటికే సంబంధిత నేతలు జిల్లాలో పర్యటించి జిల్లాపరిస్థితులపై అధికారులు నివేదికలు కూడా సమర్పించినట్లు తెలుస్తోంది. జన్మభూమి, ఎన్‌టిఆర్ 21వ వర్దంతి సందర్భంగా తెలుగుతమ్ముళ్లలో ఆదిపత్యపోరు స్పష్టం గా కన్పించడంపై కూడా పార్టీ అధిష్టానం ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు మాత్రం జిల్లాకే పరిమితం కావడం, అధికసంఖ్యలో వైసిపికి చెందిన జెడ్పిటిసిలు, ఎంపిటిసిలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు అధికంగా ఉండటం, స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా వైసిపి తరపున జగన్ బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి బరిలో దిగారు. అదే విధంగా తెలుగుదేశంపార్టీ తరపున బిటెక్ రవిని రంగంలోదింపారు. ఈ వ్యవహారంపై అభ్యర్థి ఎంపిక ఏకాభిప్రాయం జరగలేదని పలువురు నేత లు
బాహాటంగానే విమర్శిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో దిగడం, అందరికీ యోగ్యంగా ఆయన ఉండటంతో అధిష్టానంతోపాటు పార్టీశ్రేణులు కూడా అతనికే మద్దతు ప్రకటించడం, ప్రచారం ముమ్మరం చేస్తున్నారు. గ్రాడ్యుయేట్ అభ్యర్థిగా కెజె రెడ్డి తరపున ప్రచారం ముమ్మరంగా ఉంది. మొత్తానికి ముగ్గురు అభ్యర్థుల విజయాలపైనే జిల్లా నేతల రాజకీయ భవిష్యత్ సైతం ముడిపడివుంది.

అసంపూర్తిగా పాఠశాల భవనాలు
చక్రాయపేట, జనవరి 19:మండలంలోని చీలేకాంపల్లె, మహదేవపల్లె, చక్రాయపేట జడ్పీ ఉన్నత పాఠశాలల్లో రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ ఫేజ్-3 క్రింద రూ.1.23 కోట్లతో స్కూల్ అదనపు బిల్డింగ్ మంజూరైనట్లు పీడీ గురివిరెడ్డి పేర్కొన్నారు. కానీ చక్రాయపేట జడ్పీ ఉన్నత పాఠశాలలో రూ.40.35 లక్షలు మంజూరు కాక కాంట్రాక్టర్ నరసింహారెడ్డి ఆకస్మికంగా చనిపోవడంతో ఆ భవనాన్ని సబ్ కాంట్రాక్టర్ తీసుకున్న కాంట్రాక్టర్ బిల్లులు చనిపోయిన వ్యక్తితో వస్తాయని అందుకు పనులు చేయడానికి నిరాకరించినట్లు డీఈ గురివిరెడ్డి తెలిపారు. అదే విధంగా మహదేవపల్లె జడ్పీ ఉన్నత పాఠశాలలో రూ.42.25 లక్షలకు మంజూరు కాగా రూ.17 లక్షలు పనులు పూర్తి చేశారని మిగిలిన పనిచేస్తే నిధులు ఉన్నాయని త్వరితగతిన ఆ భవనాన్ని పూర్తి చేసినట్లయితే మిగిలిన బిల్లులు ఇవ్వడానికి వీలుంటుందని వారు పేర్కొన్నారు. అదే విధంగా చీలేకాంపల్లె జడ్పీ ఉన్నత పాఠశాలలో రూ.41.35 లక్షలకు మంజూరు కాగా ఆరు నెలల క్రితమే స్కూల్ బిల్డింగ్ పూర్తయినప్పటికీ క్వాలిటీ కంట్రోలర్ తనిఖీ చేసి దాని నివేదికను ఇవ్వకపోవడంతో బిల్లులు చేయడానికి జాప్యం జరుగుతోందని డీఈ తెలిపారు. ఏది ఏమైనప్పటికీ చక్రాయపేట మండలంలో రూ.1.23 కోట్ల పైబడి 2015-16లో మంజూరైనప్పటికీ ఒక పక్కనేమో కాంట్రాక్టర్ మృతిచెందడంతోను, మరో పక్కనేమో పనులు చేయక బిల్లులు ఇవ్వకపోవడంతోను జాప్యం జరిగిందని వారు తెలిపారు. జిల్లాలో 99 అదనపు బిల్డింగులు మంజూరైనట్లు వాటిలో 75 శాతం పనులు పూర్తి చేసిన వారికే బిల్లులు పూర్తి చేయమని మిగిలినవి భవనాలను ప్రభుత్వం నిలిపివేయమని తెలియజేసినట్లు కూడా వారు పేర్కొన్నారు. ఎందుకనగా ప్రతి మండలంలో మోడల్‌స్కూల్‌కు ఎం పిక జరుగుతున్నాయని, ఈ అదనపు బిల్డింగ్ నిర్మించడం వలన ప్రయోజనం లేదని ప్రభుత్వమే నివేదికలు ఇచ్చినట్లు వారు పేర్కొన్నారు. కావున మిగిలిన భవనాలు త్వరితగతిన పూర్తి చేసినట్లయితే తదుపరి బిల్లు చెల్లించడానికి వీలుంటుందన్నారు. త్వరితగతిన విద్యార్థులకు సౌకర్యం ఉండేలా
చూడాలని ఆ గ్రామ ప్రజలు కాంట్రాక్టర్‌ను కోరినట్లు తెలిపారు.
చెరువుల మరమ్మతులు చేపట్టరా?
* ఆయకట్టు రైతుల ఆందోళన
రాజంపేట, జనవరి 19:రాజంపేట డివిజన్‌లో ఆయకట్టు రైతుల పరిస్థితి భయానకంగా తయారవుతుంది. అసలు వ్యవసాయానికి స్వస్తిపలికి ఇతర వృత్తులపై ఆధారపడాలన్న ఆలోచన రోజురోజుకు ఆయకట్టు రైతుల్లో బలపడుతుంది. ఇందుకు వర్షాధారంపైనే ఇక్కడి వ్యవసాయం ఆధారపడి ఉండడం, డివిజన్‌లో వ్యవసాయం గాలిలో దీపంలా మారింది. ప్రకృతి కరుణించినా చెరువులకు నీరు చేరుతుందా అన్న అనుమానాలు ఆయకట్టు రైతుల్లో వ్యక్తమవుతుంది. చెరువులకు సాగునీటిని చేర్చే కాలువల స్వరూపం ప్రస్తుతం చాలాచోట్ల దారుణంగా ఉంది. కంపచెట్లతో నిండిపోయి ఉండడం వల్ల వర్షాలు పడి సాగునీరు పారేందుకు ఈ కంపచెట్లు, ఇతరత్రా పిచ్చిమొక్కలు అడ్డంకిగా మారే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతుంది. గత ఏడాది ఖరీఫ్, రబీని కోల్పోయిన డివిజన్ ఆయకట్టు రైతులు ఈ ఏడాది పంటల సాగుపై గంపెడాశ పెట్టుకొని ఉన్నారు. ఒకవేళ ప్రకృతి కరుణించితే సాగునీరు చెరువులకు చేరేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చెరువుల మొదలు చెరువులకు సాగునీటిని తీసుకొచ్చే కాలువలను మరమ్మత్తులు చేయాలని వీరి నుండి ప్రభుత్వానికి విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి. అయితే వర్షాలు పడి సాగునీరు చెరువులకు చేరేటప్పుడు మాత్రమే సంబంధిత ఇరిగేషన్ అధికారులు కాలువలు, చెరువుల విషయం పట్టించుకోవడం ఆనవాయితీగా మారుతుండడం దురదృష్టకరం. దేవుడు కరుణించి వర్షాలు పడితే చెరువులకు సాగునీరు చేర్చే కాలువలు, చెరువుల పటిష్టతకు సంబంధించి ఇబ్బందులు లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, ఇందుకోసం అవసరమైన నిధులు సంబంధిత శాఖకు ప్రభుత్వం మంజూరు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు. ఇకపోతే చెరువుల్లో పూడికలు తీయాలని, పిచ్చిమొక్కలు, కంపచెట్లు తొలగించాలని, చెరువులకు నీరు తీసుకొచ్చే కాలువల మరమత్తులు వెంటనే చేపట్టాలని చెరువుల కింద ఉన్న అయకట్టు రైతులు కోరుతున్నారు. డివిజన్‌లోని అన్ని మండలాల్లోని చెరువులు కంపచెట్లు, పిచ్చిమొక్కలతో నిండిపోయి ఉన్నాయి. కావున రాబోయే వర్షాకాలంలో వర్షాలు కురిసే సమయానికి ప్రభుత్వం చెరువులో పూడిక తీయడం, కాలువల మరమత్తులు చేపట్టడం చేయాలని రైతులు కోరుతున్నారు. నీరు-చెట్టు పథకం క్రింద చేపట్టిన పనులు కూడా అసంపూర్తిగా చేసి చేతులు దులుపుకోవడమే తప్ప పూర్తిస్థాయిలో పనులు చేపట్టలేదని ఆయకట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నకిలీ విత్తనాలతో నష్టపోయిన
కర్బూజా రైతులు
రామాపురం, జనవరి 19:కర్బూజా నకిలీ విత్తనాలు సాగు చేసి రైతులు పూర్తిగా నష్టపోయారు. మండలంలోని చిట్లూరు పంచాయతీ కస్పా, ముసలిరెడ్డిగారిపల్లె గ్రామాలకు చెందిన రైతులు కర్పూజా విత్తనాలు సాగు చేశారు. 70 రోజులు పూర్తయినప్పటికీ కర్బూ జా చెట్లకు పూత, కాయలు ఎక్కడా కనిపించకపోవడంతో కర్బూజా రైతు లు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ విత్తనాలు ఓ ప్రైవేటు సంస్థకు చెందిన దళారీ శ్రీనివాసులుకు చెందిన కిలో రూ.4,400 రైతులకు అమ్మడంతో వీరు సాగు చేశారు. ఏమాత్రం దిగుబడి లేకపోవడంతో రైతులు ఆందోళన చెందారు. ఇన్ని రోజులు పంట సాగు చేసి కష్టపడి సేద్యం, ఎరువులు, క్రిమిసంహారక మందులు, విత్తనాలు తెచ్చి దాదాపు ఎకరాకు రూ.60 వేలు పెట్టుబడి పెట్టామని తీరా చూస్తే తాము నష్టపోయినట్లు గమనించామని, 70 రోజుల సమయానికే దాదాపు 3-4 కిలోల వరకు కాయలు ఉండవలసిన సమయంలో పూత కూడా రాకపోవడంతో ఆందోళన చెందారు. విత్తనాలు ఇచ్చిన దళారీ శ్రీనివాసులును ప్రశ్నించగా కంపెనీ బిల్లు లేదని, బిల్లు వచ్చిన తరువాత తగు న్యాయం చేస్తామని కల్లిబొల్లి మాటలు చెబుతున్నారే తప్ప ఇంత వరకు ఏమీ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పంటను లక్కిరెడ్డిపల్లె హార్టికల్చర్ అధికారిణి చందన పరిశీలించారు. హెచ్‌వో మాట్లాడుతూ నకిలీ విత్తనాలు తక్కువ ధరకు వచ్చే విత్తనాలు సాగు చేస్తే ఇలా ఉంటుందని, ఇలా రైతులు నమ్మి మోసపోకూడదన్నారు. సంబంధిత వారిపై చర్య లు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. మండలంలో 25 మందికి పైగా రైతులు 60 ఎకరాల పైబడి సాగు చేశారు.
మైక్రో ఇరిగేషన్
లక్ష్యాలు పూర్తిచేయాలి
* కలెక్టర్ కెవి సత్యనారాయణ

కడప,జనవరి 19:మైక్రో ఇరిగేషన్ ఏర్పాటుపై కేటాయించిన లక్ష్యాలను ఆయా కంపెనీలు పూర్తి చేయాలని జి ల్లా కలెక్టర్ కెవి సత్యనారాయణ అన్నారు. గురువారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో ఏపిఎంఐసి వివిధ కంపెనీల రాష్టక్రో-ఆర్డినేటర్లతో సమావేశం జరిగింది. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ ఏడాది 40వేల హెక్టార్లలో మైక్రో ఇరిగేషన్ ఏర్పాటుకు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని , అధికారులు ఆయా కంపెనీల ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కంపెనీలు ఇచ్చిన లక్ష్యాలను అధికమించడంలో వెనుకబడి ఉన్నారని యుద్దప్రాతిపదికన చర్యలు చేపట్టి కేటాయించిన విస్తీర్ణం కంటే ఎక్కువ విస్తీర్ణంలో మైక్రో ఇరిగేషన్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటి వ రకు కేవలం 16.350హెక్టార్లలో చేయ డం జరిగిందని ఇది చాలా తక్కువ ఫలితమన్నారు. గతంలో ఇంత సాంకేతికం లేకున్నా లక్ష్యాలను అధికమించారన్నారు. ప్రస్తుతం వర్షా లు తక్కువ కురిసిన భూగర్భజలాలు పుష్కలంగా ఉన్నాయని అందుకు మె క్రో ఇరిగేషన్ ఏర్పాటుచేయాలన్నారు. ఏపిఎంఐసి రాష్ట్ర ప్రాజెక్టుల అధికారి సూర్యప్రకాష్, ఓఎస్‌డి వెంకటేశ్వర్లు, ఏపిఎంఐసి ప్రాజెక్టు డైరెక్టర్ మధుసూధన్‌రెడ్డి, ఉద్యానవనశాఖ డిడి సరస్వతి, వివిధ కంపెనీల రాష్ట్ర కో-ఆర్డినేటర్లు, జిల్లా కో ఆర్డినేటర్లు అధికారులు పాల్గొన్నారు.
రోడ్డ్భుద్రతా నియమాలు పాటించాలి

కడప,జనవరి 19:సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ రోడ్డ్భుద్రత నియమాలు పాటించి సుఖవంతమైన ప్రయాణాలు చేసి సురక్షితంగా ఉండాలని కలెక్టర్ కెవి సత్యనారాయణ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లోని సభాభవన్‌లో 28వ రోడ్డ్భుద్రతా వారోత్సవాలు ప్రారంభం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిత్యం జరిగే రోడ్డుప్రమాదాల్లో ద్విచక్రవాహనదారులు 24శాతంవరకు చనిపోతున్నారని అంచనా ఉండగా జిల్లా వ్యాప్తంగా గత సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ వరకు మొత్తం 1349ప్రమాదాలు జరిగి 529 మంది చనిపోయారని, అందులో కేవలం ద్విచక్రవాహనాల ద్వారా 317 ప్రమాదాలు జరిగి 101 మంది చనిపోయారన్నారు. అందులో హెల్మెట్ ధరించని వారే అధికశాతం ఉన్నారన్నారు. అధికవేగం పరిమితి లేకుండా ప్రయాణం, మద్యం సేవించి నడపడం, ప్రయాణంలో సెల్‌ఫోన్ మాట్లాడటం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని వీటిలో 18సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల యువత ప్రమాదాలకు గురౌతున్నారని , వీటన్నింటిని గమనించి కుటుంబాన్నిసంతోషంగా ఉంచే విధంగా రోడ్డ్భుద్రతా నియమాలు పాటించాలన్నారు. జిల్లాలో అన్ని రంగాల్లో ముందుందని కొన్నింటిలో అవగాహన లేకపోవడం వల్ల వెనుకబడివున్నామని, ముఖ్యంగా రాష్ట్రంలో మన జిల్లా ఆడపిల్లల నిష్పత్తి చాలా తక్కువగా ఉందని, వెయ్యిమంది మగవారికి కేవలం 918 మంది స్ర్తిలు ఉన్నారన్నారు. ఆడపిల్లల నిష్పత్తి పెంచే విధంగా ప్రతి ఒక్కరు ముందుకురావాలన్నారు. పుట్టిన పిల్లలు చనిపోవడం, కాన్పుల సమయంలో తల్లిచనిపోవడం జరుగుతోందని వాటిని నివారించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. హెచ్‌ఐవి వ్యాధిగ్రస్తులు భారతదేశంలో 0.2శాతం ఉండగా, మన జిల్లాలో 0.7శాతం ఉన్నట్లు అంచనాలు ఉన్నాయన్నారు. ప్రజలు అన్నీ తెలిసికూడా ప్రమాదాల పట్ల నిర్లక్ష్యంతో తప్పులు చేస్తూ జీవితాలను పోగొట్టుకుంటున్నారన్నారు. వాహనచోదకులు ర్యాంగ్ డైరెక్షన్‌లో వెళ్లడం వల్ల వాహన చోదకులు రెస్ట్‌లేకుండా ప్రయాణాలు చేయడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ఎస్పీ పిహెచ్‌డి రామకృష్ణ మాట్లాడుతూ నిర్లక్ష్యం వల్లే ప్రమాదాలు కొనితెచ్చుకుంటున్నారని రోడ్డు భద్రతా నియమాలు పాటించాలన్నారు. గత రెండు సంవత్సరాల కాలం నుంచి ప్రస్తుతం పోల్చి చూస్తే కొద్దిపాటి ప్రమాదాలు తగ్గాయని పోలీసుశాఖ, రోడ్డురవాణాశాఖలు ఎన్ని అవగాహన కార్యక్రమాలు , చర్యలు తీసుకుంటున్నా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయని, ప్రతి ఒక్కరు తమ ఆలోచన విధానాన్ని మార్పుచేసుకుని ప్రమాదాలు జరగకుండా చూడాలని అధికారులకు సహకరించాలన్నారు. ఈకార్యక్రమంలో డిటిసి బసిరెడ్డి, రోడ్డురవాణాశాఖ ఆర్టీవోలు, ఎంవిఐలు, ఏపిఎస్‌ఆర్టీసి డ్రైవర్లు , విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
ప్రజా స్ఫూర్తితో ఉద్యమాన్ని కొనసాగిస్తా..!
ప్రొద్దుటూరు టౌన్, జనవరి 19: రాయలసీమ ప్రజల స్ఫూర్తితో తాను ఆమరణ నిరాహారదీక్షకు పూనుకోవడం జరిగిందని, ఉక్కుపరిశ్రమను సాధించేంతవరకు తన పోరాటం ఆగదని ఉక్కుపరిశ్రమ సాధన సమితి అధ్యక్షుడు గండ్లూరు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. ఆమరణ నిరాహారదీక్ష రెండవరోజైన గురువారం ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ రాయలసీమ ప్రజల కన్నీళ్లను తుడిచి, వారి ముఖాల్లో సంతోషాన్ని చూడాలని తాను ఉద్యమాన్ని నిర్వహించడం జరుగుతోందని, మరో లాభాపేక్ష లేదన్నారు. తనకు మద్ధతునిస్తున్న ప్రతి ఒక్కరీకీ ధన్యవాదాలు తెలియజేశారు. జిల్లాలో పరిశ్రమ ఏర్పాటుకు మీ అభ్యంతరమేంటో ముఖ్యమంత్రి చంద్రబాబు తన అభిప్రాయాన్ని తెలియజేయాలని కోరారు. ఉక్కుపరిశ్రమ సాధనకై ప్రొద్దుటూరు పట్టణవాసులే కాకుండా జిల్లా, రాయలసీమ ప్రజానీకమంతా కలిసి పోరడాలని ఆయన పిలుపునిచ్చారు. దీక్షకు మద్ధతు తెలిపిన ప్రముఖులు: ప్రవీణ్‌కుమార్‌రెడ్డి చేపట్టిన దీక్షకు మద్ధతుగా గురువారం ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, జమ్మలమడుగు నియోజకవర్గ వైకాపా ఇన్‌చార్జి డాక్టర్ సుధీకర్‌రెడ్డి, జిల్లా వైకాపా యువజనసంఘం అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి తదితరులు మద్ధతు తెలిపారు. నారాయణరెడ్డి, సుధీకర్‌రెడ్డిలు మాట్లాడుతూ పరిశ్రమ ఏర్పాటు కొరకు ఆమరణ నిరాహారదీక్షకు పూనుకున్న ప్రవీణ్‌కుమార్‌రెడ్డిని అభినందిస్తున్నామని, తమ పూర్తి మద్ధతు ఎన్నటికీ ఉంటుందని, ప్రవీణ్ వెనె్నంటి ఉంటామని వారు హామీ ఇచ్చారు. జిల్లాలోని అధికారపక్షానికి చెందిన నాయకులు, ప్రజాప్రతినిధులు కూడా ఈ విషయమై తమ హైకమాండ్ల వద్దకెళ్లి విషయాన్ని వివరించి తమ వంతుగా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఉద్యమపోరాటంలో ప్రవీణ్‌కు ఎలాంటి ఇబ్బంది కలిగినా జిల్లా అధికారయంత్రాంగంతోపాటు రాష్ట్ర ప్ర భుత్వమే అందుకు బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. అలాగే ప్రొ ద్దుటూరు పట్టణంలోని పెన్షనర్స్ అసోసియేషన్, రెడ్డికులస్తులు, ప్రైవే టు ఆసుపత్రుల సంఘం, పద్మశాలీయ అభ్యుదయసంఘం, బార్ అసోసియేషన్, బంగారు వ్యాపారులసంఘం, రైతులు, విద్యార్థులు దీక్షాశిబిరానికి చేరుకొని ప్రవీణ్‌కు పూలమాల వేసి తమ మద్ధతు తెలియజేశారు. కాగా విద్యార్థులు శివాలయం సెంటర్‌లో మానవహారంగా ఏర్పడి ఉక్కుపరిశ్రమ సాధనపై పెద్దఎత్తున నినాదాలు చేశారు. గంటపాటు సాగిన మానవహారం కారణంగా వాహనాలరాకపోకలకు అంతరాయం కలిగింది.
ఒంటిమిట్టలో కార్యరూపం దాల్చని
జాంబవంతుని విగ్రహం!
* ఎదురు చూస్తున్న భక్తులు, పర్యాటకులు
ఒంటిమిట్ట, జనవరి 19: పవిత్ర పుణ్యక్షేత్రమైన ఒంటిమిట్టను అభివృద్ధి చేయడమే కాకుండా ఎంతో ఘన చరిత్రకు ఆనవాలు ఉన్న ఇక్కడ జాంబవంతుని విగ్రహా ఏర్పాటు చేయాలన్నది ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు కల అని చెప్పవచ్చు. ఒంటిమిట్ట కోదండ రామాయంలో మూడవసారి ముచ్చటగా ఈ యేడాది ఏప్రిల్ 5 నుండి కోదండ రామస్వామికి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. అందుకు తగ్గట్లు టిటిడి రామాలయాన్ని విలీనం చేసుకున్నాక రెండోమారు ఈ ఉత్సవాల నిర్వహణ జరగనుంది. దీనికోసం ప్రణాళికలు సిద్ధం చేసుకొంటూ కార్యాచరణ చేపట్టారు. చరిత్రను బట్టి పరిశీలిస్తే ఒంటిమిట్ట ఏకశిల రామయ్య త్రేతాయుగంలో జాంబవంతునిచే ఏకశిలపై ప్రతిష్టించబడ్డారు. ఈ నేపథ్యంలో ఆ చరిత్ర చిరస్ధాయిగా నిలవాలనే ఉద్ధేశ్యంతో సిఎం ఒంటిమిట్ట చెరువులో జాంబవంతుని భారీ విగ్రహాం ఏర్పాటుచేయాలని టిటిడి మాస్టర్ ప్లాన్‌లో చేర్చినట్లు స్పష్టం అవుతుంది. అందుకు తగ్గట్టు టిటిడి చెరువులో జాంబవంతుని విగ్రహా ఏర్పాటుకు సమ్మతించింది. ఇదీలా ఉండగా ఒంటిమిట్ట చెరువుకు ఎత్తిపోతల పథకం ద్వారా సోమశిల జలాల మళ్లింపు కూడా జరిగింది. చెరువు మధ్యలో కన్యాకుమారిలో వివేకానందుని విగ్రహాం, హైదరాబాద్ హుస్సేన్‌సాగర్‌లో గౌతమ బుద్ధుని విగ్రహా తరహలో జాంబవంతుని విగ్రహాం ఏర్పాటు చేయాలని యోచనలో ఉన్నారు. అలాచేస్తే ఒంటిమిట్ట చరిత్ర దశ దిశలా వ్యాప్తి చెందుతుందని సిఎం యోచన. ఈ ఏడాది బ్రహ్మోత్సవాలకు విచ్చేసే సిఎం చేతుల మీదుగా జాంబవంతుని విగ్రహా ఏర్పాటుకు శంకుస్థాపన జరుగుతుందని భక్తుల విశ్వాసం. ప్రస్తుతం టిటిడి రూ. 5 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులు జోరుగానే సాగుతున్నాయి. ఈ నూతన నిర్మాణాలను సిఎం ప్రారంభోత్సవం చేయనున్నారు. ఒంటిమిట్ట కోదండ రామయ్య చరిత్రకు ఆధారంగా ఉండే జాంబవంతుని విగ్రహా ఏర్పాటు జరిగితే ఒంటిమిట్ట మరో ట్యాంక్‌బండ్‌గా ఆధ్యాత్మిక కేంద్రంగా, పర్యాటక కేంద్రంగా అభివృద్ధిచెందే అవకాశం ఉంది. అయితే టిటిడి వారు మాత్రం 108 అడుగుల వీరాంజనేయ స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు గతంలో టిటిడి చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఇఓ పేర్కొనడం జరిగింది. వీటిని పరిశీలిస్తే జాంబవంతుని విగ్రహా ప్రతిష్ట జరుగుతుందా, లేదా అనుమానాలు ప్రజలలో, పర్యాటకులలో లేక పోలేదు. ఇలా జరిగితే సిఎం కలగా ఉన్న జాంబవంతుని విగ్రహా ఏర్పాటు జరుగుతుందా లేదా అని యోచించాల్సి ఉంది. ఏదీ ఏమైనా ఒంటిమిట్ట చరిత్ర ఆనవాలను బట్టి జాంబవంతుని విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే ఒంటిమిట్టను ప్రభుత్వం గుర్తించినందులకు ఫలితం కూడా ఉంటుంది. టిటిడి పునరాలోచించి ఒంటిమిట్టలో జాంబవంతుని విగ్రహాం ఏర్పాటు చేయాలని జిల్లా వాసులు కూడా కోరుకొంటున్నారు.
మంచినీటి సమస్య తీర్చాలి
* ఎంపిపి అనూరాధ
పెండ్లిమర్రి,జనవరి 19:వేసవికాలం సమీపిస్తుండటంతో 19 గ్రామ పంచాయతీల్లోని గ్రామాల్లో మంచినీటి సమస్య తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు ప్రణాళికలతో చర్యలు చేపట్టాలని మండలాధ్యక్షురాలు సి.అనూరాధ అధికారులను ఆదేశించారు. గురువారం ఎంపిడివో సభాభవన్‌లో ఏర్పాటుచేసిన మండల సమావేశంలో ఆమె మాట్లాడుతూ గ్రామీణప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు కూడా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రతినిత్యం ప్రజలు చిన్నసమస్యకు మండల కార్యాలయానికి రావాలంటే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయా గ్రామాల్లో పర్యటిస్తూ సమస్యలు పరిష్కరించేలా చూడాలన్నారు. ముఖ్యంగా మారుమూలగ్రామాల్లో గ్రామస్థాయి అధికారులు నిత్యం గ్రామాల్లోనే ఉండాలన్నారు. అనంతరం సమావేశంలో మండల వైద్యాధికారి మాధవరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఏప్రిల్ 1 నుంచి నూతనంగా ఆరోగ్యశ్రీ కార్డులు లేని వారికోసం నెలకు రూ.100లు చొప్పున డబ్బులు చెల్లిస్తే వారికి రెండున్నర లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యసదుపాయం కల్పించేలా ప్రణాళికలు రూపొందించిందని అందుకు ఆసక్తిగల వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఏపిఓ వసుధ మాట్లాడుతూ ఐదు ఎకరాలులోపు రైతులకు పండ్లతోటల పెంపకంపై ఆసక్తికనబరిస్తే వారికి ఉచితంగా మొక్కలు, వందశాతం సబ్సిడీతో డ్రిప్ పరికరాలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఆమె పేర్కొన్నారు. మండలంలో ఇప్పటి వరకు 1490 మంది మాత్రమే పసల బీమాతో దరఖాస్తుచేసుకున్నారని ఏపిఎం శైలజ తెలిపారు. స్పెషలాఫీసర్ నరసింహారెడ్డి, ఎంపిడిఓ మల్‌రెడ్డి, పశువైద్యులు రామచంద్ర, జిటిఓ అరవింద్‌కిశోర్ ఇతర మండలాధికారులు పాల్గొన్నారు.
కట్నం వేదింపులతో వివాహిత ఆత్మహత్య
రాజుపాళెం, జనవరి 19: వరకట్న పిశాచానికి ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. పెళ్లి చేసుకున్న భర్తతోపాటు అత్తమామలు, వారి బంధువులు అదనపుకట్నంకోసం వేధింపులతో ఆ మహిళ అత్తవారింట్లోనే ఉరి వేసుకొని తనువు చాలించింది. రాజుపాళెం మం డలం తొండలదినె్న గ్రామానికి చెందిన ఉమ్మడిశెట్టి గౌతమి(18) అనే వివాహిత గురువారం ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలు తండ్రి పల్లా రామక్రిష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాజుపాళెం ఎఎస్‌ఐ కె.వి.సుబ్బయ్య కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఎఎస్‌ఐ తెలిపిన వివరాల మేరకు తొండలదినె్న గ్రామానికి చెందిన కార్పెంటర్ ఉమ్మడిశెట్టి శ్రీ్ధర్‌కు మూడు మాసాల క్రితం అదే గ్రామానికి చెందిన గౌతమితో వివాహం జరిగిందన్నారు. అయితే వివాహ సమయంలో ఇచ్చిన ఆరు తులాలు బంగారం కాకుండా రూ.లక్ష నగదు ఇవ్వాలని భర్తతోపాటు అత్తమామలైన రాములమ్మ, శింగరయ్య మృతురాలి భర్త శ్రీ్ధర్ పెద్దమ్మ రామలక్షుమ్మ, పెద్దనాన్న వెంకటేశ్వరరావు, ఆయన కుమారుడు సుబ్బరాయుడు వేధింపులకు తాళలేక ఆత్మహత్య చేసుకుందన్నారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రొద్దుటూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామన్నారు. ఈ విషయంపై మృతురాలు తండ్రి ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు.
సిమ్‌కార్డు విక్రేతల అరెస్టు
కడప,(క్రైమ్)జనవరి 19:నకిలీ ఫ్రూఫ్‌తో సిమ్‌కార్డులు అమ్ముతున్న ఇరువురిని అరెస్టు చేసినట్లు వన్‌టౌన్ ఎస్‌ఐ ప్రతాప్‌రెడ్డి తెలిపారు. సయ్యద్ జిలానీబాషా, తోటంశెట్టి మణికంఠలు స్థానిక రాయల్ థియేటర్ వద్ద కస్టమర్ల నుంచి ఎటువంటి ఫ్రూఫ్స్ తీసుకోకుండా అధిక ధరలకు సిమ్‌కార్డులు అమ్మేవారన్నారు. ఆ తర్వాత వేరేవారి ఫోటోలు, ఇతరుల ఆధార్‌కార్డులు జతచేసి కంపెనీ వారిచే యాక్టివేట్ చేయించేవారన్నారు. ఇటు కస్టమర్లను, అటు కంపెనీని మోసం చేస్తున్నట్లు వీరిపై 11/2017 -468,420 కింద కేసులు నమోదుచేసినట్లు తెలిపారు. వీరి వద్ద నుంచి 32 వోడా సిమ్‌కార్డ్సు, సెల్‌ఫోన్, ఆరువోడాఫోన్ కస్టమర్ల అప్లికేషన్స్ , 17 ఐడియా సిమ్‌కార్డులు, 57 ఎయిర్‌టెల్ సిమ్‌కార్డ్సు, ఆధార్ జిరాక్స్ కాపీలు తదితర వాటిని స్వాధీనం చేసుకున్నామన్నారు.
పాపాగ్నివంతెన వద్ద లారీ బోల్తా
కమలాపురం, జనవరి 19: స్థానిక పాపాగ్ని నది సమీపంలోని వంతెన వద్ద గురువారం లోడుతో వెళుతున్న లారీ అదుపు తప్పి వ్యవసాయ పొలాల్లో బోల్తాకొట్టింది. ఈ సంఘటనలో లారీ డ్రైవర్,క్లీనర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం కడపరిమ్స్‌కు తరలించారు. వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు వివరించారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్రగాయాలు
రైల్వేకోడూరు, జనవరి 19: మండలంలోని మైసూరువారిపల్లె సమీపంలో మోటార్‌బైక్‌ను లారీ ఢీకొన్న ప్రమాదంలో శివరామరాజు తీవ్రంగా గాయపడినట్లు ఎస్సై వెంకటేశ్వర్లు గురువారం తెలిపారు. సూరపురాచపల్లెకు చెందిన శివరామరాజు బైక్‌పై వస్తుండగా లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందన్నారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
హక్కుల కమిటీకి అధికారులు
పూర్తిసమాచారం ఇవ్వాలి:కలెక్టర్
కడప,(కల్చరల్)జనవరి 19: ప్రభుత్వ హక్కుల కమిటికీ అధికారులు ఆయాశాఖలకు సంబంధించిన నివేదిక పూర్తి సమాచారంతో హాజరై వివరాలను అందించాలని జిల్లాకలెక్టర్ కెవి సత్యనారాయణ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టర్ ఛాంబర్‌లో ఏపిఎల్‌ఏ హామీల కమిటీ రాక సందర్భంగా అధికారులతో ముందస్తు చర్యల నిమిత్తం సమావేశం జరిగింది. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 20వ తేదిన శుక్రవారం ఏపిఎల్‌ఏ హామీల కమిటీ రానుందని, కమిటీ నిర్వహించే సమావేశానికి అధికారులు ఆయాశాఖలకు సంబంధించిన అంశాలపై పూర్తి సమాచార నివేదికను తయారుచేసుకుని కమిటి ముందుండాలన్నారు. అలాగే కమిటి సూచనలు, సలహాలు, ఆదేశాలను పాటించాలన్నారు. అజెండాకు సంబంధించిన అంశాలపై సంపూర్తి సమాచారాన్నికమిటికీ అందించాలని ఆదేశించారు. సమావేశంలో డిఆర్వో ఈశ్వరయ్య, రాజంపేట ఆర్డీవో వీరబ్రహ్మం, డిఇఓ ప్రతాప్‌రెడ్డి, ఎస్‌ఎస్‌ఏ పిఓ వెంకటసుబ్బయ్య, ఐసిడిఎస్ పిడి రాఘవరావు, కలెక్టరేట్ ఏఓ శ్రీనివాసులు, పర్యవేక్షకులు జయరాం తదితరులు పాల్గొన్నారు.