కడప

11న జాతీయ మెగా లోక్ అదాలత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దవటం,జనవరి 31: ఈనెల 11వ తేదీన జరగబోయే జాతీయ లోక్ అదాలత్‌లో వీలైన పెండింగ్ కేసులు పరిష్కరించుకుని కక్షిదారులు సద్వినియోగంచేసుకోవాలని జిల్లా జడ్జి గంధం సునీత పిలుపునిచ్చారు. స్థానిక జూనియర్ సివిల్ జడ్జి కోర్టును మంగళవారం జిల్లా జడ్జి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కోర్టు నూతన భవనానికి రూ.4కోట్లు నిధులు మంజూరయ్యాయన్నారు. సిద్దవటం కోర్టును స్ర్తిశక్తి భవనంలోకి మార్చి, పాతభవనాన్ని కూల్చి కొత్త్భవనాన్ని నిర్మిస్తామన్నారు. సిద్దవటం, అట్లూరు, ఒంటిమిట్ట మండలాల న్యాయవాదులు, పోలీసులతో జిల్లా జడ్జి సమీక్షించారు. ఈ సందర్భంగా న్యాయవాదులు కోర్టు భవనాన్ని త్వరితగతిన తరలించి నిర్మించాలని ఆమె దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కాంపౌండబుల్ కేసులు, సివిల్ కేసులు, శిక్షపడి అప్పీల్‌లో పెండింగ్‌లో ఉన్న రాజీ అవ్వక ఉన్న కేసులు లోక్ అదాలత్‌లో పరిష్కరించుకోవచ్చునన్నారు. ప్రతి న్యాయవాది, పోలీసులు, జ్యుడిషియల్ సిబ్బంది సహకరించి కక్షిదారులకు మేలు చేయాలని సూచించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగించుకుని కేసులు పరిష్కరించుకోవచ్చునన్నారు. ఈ కార్యక్రమంలో డిఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి యుయు ప్రసాద్, సిద్దవటం జూనియర్ సివిల్ జడ్జి అతిఖ్ అహ్మద్, ఏజిపి చెన్నారెడ్డి, ఒంటిమిట్ట సిఐ, ఎస్‌ఐలు ,కార్యాలయ సూపరింటెండెంట్ శ్రీనివాసులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.

పేదల అభివృద్ధి కోసమే ఎన్‌టిఆర్ భరోసా

కడప,జనవరి 31: రాష్ట్ర ప్రభుత్వం పేదప్రజలు ఆర్థిక, సామాజికంగా అభివృద్ధి చెందేందుకు ఎన్‌టిఆర్ భరోసా పథకాన్ని అమలు చేస్తోందని విప్ మేడా వెంకటమల్లికార్జునరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం స్థానిక నేక్‌నామ్‌ఖాన్ కళాక్షేత్రంలో నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో ఎన్‌టిఆర్ భరోసా, పెన్షన్ల కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ ఎన్‌టిఆర్ భరోసా పథకం కింద అర్హులైన పేదప్రజలకు వృద్ధాప్య, వితంతు, వికలాంగుల, చేనేత కార్మికులు 1841 మంది లబ్ధిదారులకు రూ.18లక్షల 70వేలు పంపిణీ చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. జిల్లాకు ప్రస్తుతం 20వేల పెన్షన్లు, నియోజకవర్గానికి 2వేల పెన్షన్లు వచ్చేందుకు ఎంతో కృషి చేశామన్నారు. ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు ఆంగీకరించి మంజూరు చేశారన్నారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లని స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి ఎన్‌టి రామారావు ప్రభోధించిన విధంగా పేదవారు పేదవారిగానే మిగిలిపోకూడదని భావించి రాష్ట్రప్రభుత్వం పేదలకు పెన్షన్లు మంజూరు చేసిందన్నారు. మొదటగా రూ.30లతో పెన్షన్ల పథకం ప్రవేశపెట్టింది ఎన్‌టి రామారావు అని ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు రూ.200 నుంచి రూ.1000లకు, వెయ్యినుండి రూ.1500లకు పెంచారన్నారు. దేశంలో ఏరాష్ట్రంలో లేని విధంగా దుల్హన్ పథకం కింద పేద ముస్లిం ఆడపిల్లలకోసం రూ.50వేలు, మసీదులో పనిచేస్తున్న వౌజన్, పేష్ ఇమామ్‌లకు గౌరవ వేతనంగా రూ.5వేలు, రూ.3వేలు ఇస్తున్నారన్నారు. ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పేదప్రజలకు ఎన్నోపథకాలు అమలుచేస్తోందని వాటిని తెలుసుకుని ప్రయోజనం పొందాలన్నారు. భవిష్యత్‌లో మరిన్ని పెన్షన్లు వచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఇళ్లులేని వారికి ఇళ్లు ఇస్తామని , చౌకదుకాణాల ద్వారా ప్రతి వ్యక్తికి నెలకు 5కేజిలు బియ్యం ఇస్తున్నామని, పండుగలు సంతోషంగా జరుపుకునేందుకు రంజాన్, క్రిస్మస్, సంక్రాంతి పండుగలు చంద్రన్నకానుకలు అందజేశామన్నారు. ఒంటిమిట్ట చెరువుకు నీరు అందించడమేగాక ఒంటిమిట్ట కోదండరామస్వామి దేవాలయంలో ఒకేసారి లక్షమందికి సరిపడే వేదిక తయారు చేయడం జరిగిందన్నారు. డిప్యూటీ మేయర్ ఆరిఫుల్లా మాట్లాడుతూ పేదలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ముఖ్యమంత్రి ఎన్‌టిఆర్ భరోసా కింద వివిధ రకాల పెన్షన్లు మంజూరు చేశారని, పేదవారు నెలకు రూ.1000లతో ఎవరి ఆసరా లేకుండా జీవనం సాగించేందుకు ఉపయోగపడుతోందన్నారు. టిడిపి జిల్లా అధ్యక్షుడు ఆర్.శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ పేదప్రజల కష్టాలు తెలుసుకుని 1984లోనే అప్పటి మాజీ ముఖ్యమంత్రి ఎన్‌టిరామారావు పెన్షన్ల పథకం ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. భవిష్యత్‌లో ఇంకా పెంచే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ కమిషనర్ చంద్రవౌళీశ్వరరెడ్డి, టిడిపి జిల్లాకార్యదర్శి బి.హరిప్రసాద్, వైవియు పాలక మండలి సభ్యులు ఎస్.గోవర్దన్‌రెడ్డి, ముస్లిం మైనార్టీ సంక్షేమ అసోసియేషన్ అధ్యక్షుడు అమీర్‌బాబు, నాయకులు జి.లక్ష్మిరెడ్డి, జిలానీబాషా, విశ్వనాధరెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, బాలకృష్ణ, హరికృష్ణ, సురేష్ పాల్గొన్నారు.

2న జగన్ జిల్లా పర్యటన
పులివెందుల, జనవరి 31:ఈనెల 2న వైఎస్.జగన్ మూడురోజులపాటు జిల్లాలో పర్యటించనున్నట్లు కడప ఎంపి వైఎస్.అవినాష్‌రెడ్డి తెలిపారు. 2వ తేదీ ఉదయం పులివెందులలోని వైఎస్.ప్రకాష్‌రెడ్డి కుటుంబంతో సమావేశం, జగన్ వ్యక్తిగత కార్యదర్శి రవిశేఖర్ కుటుంబాన్ని ఓదార్చడం జరుగుతుందన్నారు. మధ్యాహ్నం 1:30గంటలకు ఇడుపులపాయకు వెళతారని, రాత్రికి సింహాద్రిపురం మండలం వైకాపా నాయకుడి కుటుంబసభ్యుల వివాహానికి పులివెందులకు వస్తారన్నారు. 3న ఉదయం 8:45గంటలకు టిటిడి కల్యాణమండపంలో నూతన వధూవరులను ఆశీర్వదించి, కడపకు వెళ్లి వెంకటేశ్వరస్వామిని దర్శించుకోనున్నారని, 11:30గంటలకు కడపలోని జయరాజా ఫంక్షన్‌హాలులో ఎంపిటిసి, జడ్పిటిసి, కౌన్సిలర్లతో సమావేశం కానున్నారు. 4వ తేదీ ఉదయం 9:30గంటలకు పైడిపాళెం డ్యామ్‌ను, 11:30గంటలకు పంప్‌హౌస్‌ను పరిశీలించనున్నట్లు తెలిపారు.
కల్పవృక్ష వాహనంపై దర్శనమిచ్చిన
అనంత భూపాలుడు
కడప,(కల్చరల్)జనవరి 31:శ్రీలక్ష్మీవెంకటేశ్వరస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదవరోజైన మంగళవారం శ్రీలక్ష్మీవెంకటేశ్వరుడు కల్పవృక్ష వాహనంపై కొలువుదీరాడు. భక్తులు అడుగడుగునా స్వామిని దర్శించుకుని పూజలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు. గ్రామోత్సవం సాగిన వీధులన్నీ మహిళలు నీరు పోసుకుంటూ స్వామివారికి సాంప్రదాయంగా స్వాగతం పలికారు. ఆలయ ప్రాంగణంతోపాటు మాడవీధులన్నీ విద్యుత్ దీపాలంకరణలో కాంతులు వెదజల్లాయి. భక్తులు గోవిందనామస్మరణలతో గ్రామోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరిగింది. అలాగే సాయంత్రం హనుమంత వాహనంపై శ్రీవారు భక్తులకు దర్శనమిచ్చారు. తొలుత స్వామివారికి ఆలయ ప్రధాన అర్చకులు మంగళహారతులు ఇచ్చి స్వామివారిని దేవునికడప మాడవీధుల్లో ఊరేగించారు. ఈగ్రామోత్సవంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులు, చెక్క్భజన బృందాలు ప్రదర్శించిన నృత్యాలతో భక్తులను,ప్రజలను అలరించాయి. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత స్వామివారి ఊంజల్ సేవ కమనీయంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో టిటిడి అన్నమయ్య ప్రాజెక్టు నుంచి వచ్చిన కళాకారులు అన్నమాచార్య కీర్తనలు విన్పించారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారి గ్రామోత్సవం చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. అలాగే బుధవారం శ్రీవారు ముత్యాల పందిరి వాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు.

జిల్లాలో పల్స్‌పోలియో అమలు భేష్
కమలాపురం, జనవరి 31: జిల్లాలో పల్స్‌పోలియో అమలు పట్ల రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ జాయింట్ డైరెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఆమె మంగళవారం పట్టణంలోని పైడిమానుకాలనీలో సంచారజీవుల పిల్లలకు పల్స్‌పోలియో చుక్కలు అమలును ఆకస్మిక తనిఖీ చేశారు. పల్స్‌పోలియో 3వరోజులో భాగంగా పెద్దచెప్పల్లి పిహెచ్‌సి వైద్యసిబ్బంది సంచారజీవుల పిల్లలకు పల్స్‌పోలియో చుక్కలను వేశారు. ఈ సందర్భంగా ఆమె చిన్నారులకు పోలియో చుక్కలు వేసి, ప్రజలను చైతన్యపరిచారు. ఈ సందర్భంగా కాన్పు అయిన మహిళలను కలసి ప్రభుత్వం కాన్పుల పట్ల తీసుకుంటున్న జాగ్రత్తలను ఆరా తీశారు. ప్రభుత్వ ఆసుపత్రిలోనే కాన్పులు జరుగుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అలాగే ఆడశిశువును ప్రసవిస్తే ప్రభుత్వం జెయస్‌వై పథకం కింద ఇచ్చే వెయ్యి రూపాయలను అందచేశారా.. లేదా అని, అంతేకాక యన్‌టిఆర్ కిట్‌లను అందించారా అని అడిగారు. ఈ కిట్‌లోని వస్తువులను సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. అంతేకాక మాతాశిశు సంరక్షణ పట్ల తీసుకుంటున్న చర్యలను వైద్యాధికారి వెంకటరమణను అడిగి తెలుసు కున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా కాన్పులను ప్రభుత్వ ఆసుపత్రిలోనే జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చిన్నారులకు టీకాలను సకాలంలో వేసేలా సిబ్బంది చర్యలు పాటించాలని ఇందుకోసం కార్యాచరణ సిద్దంగా ఉండాలని జిల్లా టీకాల అమలు అధికారి నాగరాజును ఆదేశించారు. రెండవ విడత పల్స్‌పోలియోపై కూడా ఇప్పటినుంచే కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.

నిరుపేదలకు ఆసరా ఎన్‌టిఆర్ భరోసా

రాయచోటి, జనవరి 31: ఎన్‌టిఆర్ భరోసా పింఛన్లు నిరుపేదలకు ఎంతో ఆసరాగా నిలుస్తుందని రాయచోటి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌ఛార్జి, మాజీ ఎమ్మెల్యే రమేష్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో రవికుమార్ అధ్యక్షతన ఎన్‌టిఆర్ భరోసా కొత్త పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే రమేష్‌రెడ్డి మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా నిరుపేదలందరికీ పింఛన్లు అందే విధంగా చూస్తామన్నారు. పింఛన్లలో ఎలాంటి అవకతవకలు జరగకుండా ఉండేందుకు ఇక్కడ అందరినీ సమావేశపరిచి ఇవ్వడం జరిగిందన్నారు. అర్హులైన వృద్ధులు, వికలాంగులు, అందరికీ అందేలా చూస్తామన్నారు. ఎంపీడీవో రవికుమార్ మాట్లాడుతూ రూరల్ పరిధిలో తొమ్మిది గ్రామాలకు 200 పింఛన్లు పంపడం జరిగిందన్నారు. 183 మందికి అనుమతి రాగా 17 మందికి భూమి ఎక్కువగా ఉన్న కారణంగా తిరష్కరించడం జరిగిందన్నారు. వీటిలో 76 వృద్ధాప్య పింఛన్లు, 76 వితంతు పింఛన్లు, 21 వికలాంగ పింఛన్లు, ఒక చేనేత పింఛన్ ఉన్నట్లు తెలిపారు. వరిగపాపిరెడ్డిగారిపల్లె గ్రామానికి ఏడు, యండపల్లె గ్రామానికి 18, శిబ్యాల గ్రామానికి 24, పెమ్మాడపల్లె గ్రామానికి 11, గొర్లముదివీడు గ్రామానికి 19, కాటిమాయకుంట గ్రామానికి 11, మాధవరం గ్రామానికి 32, దిగువ అబ్బవరం గ్రామానికి 16, చెన్నముక్కపల్లె గ్రామానికి 45 పింఛన్లు మంజూరైనట్లు ఎంపీడీవో తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు శ్రీనివాసరెడ్డి, సహదేవరెడ్డి, జన్మభూమి కమిటీ సభ్యులు, మాజీ వైస్ ఎంపీపీ అనుంపల్లె రాంప్రసాద్‌రెడ్డి, టీడీపీ రూరల్ అధ్యక్షుడు మురికినాటి సుబ్బారెడ్డి, టీడీపీ నాయకులు వేణుగోపాల్‌రెడ్డి, రమణారెడ్డి, సైకం రమేష్‌రెడ్డి, అన్ని గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, కార్యాలయ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.

హత్య కేసులో నిందితుల అరెస్టు
మైదుకూరు, జనవరి 31:పట్టణంలో గతనెల హత్య చేసి శవాన్ని గుర్తుపట్టలేని విధంగా కాల్చివేసిన సంఘటనలో మైదుకూరు అర్బన్ సిఐ వెంకటేశ్వర్లు నేతృత్వంలో కేసు మిస్టరీని ఛేదించారు. మంగళవారం స్థానిక పోలీసు స్టేషన్ ఆవరణంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో డిఎస్పీ శ్రీలక్ష్మి నిందితుల వివరాలను వెల్లడించారు. గొల్లపల్లెకు చెందిన పసల ధనరాజు కుమారుడు పసల శేఖర్ (28) అనే యువకుడు కులాంతర వివాహం చేసుకుని పట్టణంలో జీపు డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో పోరుమామిళ్లరోడ్ మార్కెట్ సమీపంలోని భారతి అనే వివాహితతో అక్రమసంబంధం ఏర్పరుచుకున్నాడని తెలిపారు. ఈ నేపధ్యంలో జనవరి 19వ తేదీ రాత్రి 11గంటల సమయంలో భారతి నివాసముంటున్న ఆమె తండ్రి బండి లక్షుమన్నగారి వెంకటరమణ అద్దె ఇంటిలోకి వెళ్లి భారతిని బలవంతంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. దీంతో కలతచెందిన భారతి తండ్రి సహనం కోల్పోయి అందుబాటులో ఉన్న రోకలిబండతో శేఖర్ తలపై బలంగా కొట్టడంతో శేఖర్ అక్కడికక్కడే మృతిచెందాడని తెలిపారు. శేఖర్ శవాన్ని నానుబాలుపల్లె సమీపంలోని కల్వర్టు కింద మూటగట్టి కాల్చివేశారు. ఈ సంఘటనపై మైదుకూరు పోలీసులు మిస్టరీ కింద కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తును వేగవంతం చేసి కేసును ఛేదించారు. దీంతో నిందితుడు బండి లక్ష్మన్నగారి వెంకటరమణ, భారతిని పోలీసులు అరెస్ట్‌చేసి కోర్టుకు హాజరుపరుస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో అర్బన్ సిఐ వెంకటేశ్వర్లు, ఎస్సై రామక్రిష్ణ, ఎఎస్సై శ్రీనివాసులు, పోలీసులు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో శ్రీకాళహస్తి విద్యార్థి మృతి
రైల్వేకోడూరు, జనవరి 31:రైల్వేకోడూరు మండలం బాలుపల్లె చెక్‌పోస్టు వద్ద సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి చెందిన ఓ విద్యార్థి మృతి చెందినట్లు ఎస్సై వెంకటేశ్వర్లు మంగళవారం తెలిపారు. వివరాలిలావున్నాయి. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి చెందిన ఆర్టీసీ డ్రైవర్ సయ్యద్ ఫైజల్ కుమారుడైన ఫిరోజ్ (18)తో పాటు స్నేహితుడు షామీర్ కలసి మోటార్‌బైక్‌పై సోమవారం రాత్రి కాళహస్తి నుండి కడపకు వెళ్తుండగా మార్గమధ్యంలోని బాలుపల్లె చెక్‌పోస్టు వద్దకు రాగానే గుర్తు తెలియని వాహనం వెనుక వైపు ఢీ కొనడంతో ఫిరోజ్‌తో పాటు ఇతని స్నేహితుడు రోడ్డు ప్రక్కనే పడి పోయారు. అయితే అదే మార్గంలో జీప్‌లో వచ్చిన అటవీశాఖ అధికారి నయూంబాషా క్షతగాత్రులను వాహనంలో వేసుకుని కోడూరు ప్రభుత్వాసుపత్రికి వస్తుండగా మార్గమధ్యంలో ఫిరోజ్ మృతి చెందినట్లు వైద్యులు గుర్తించారు. కాని ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన షామీర్ పారిపోయినట్లు ఎస్సై తెలిపారు. ఫిరోజ్ కాళహస్తిలో డిప్లొమో చదువుతున్నట్లు చెప్పారు. పోస్టుమార్టమ్ నిమిత్తం మృతదేహాన్ని రాజంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
ఇద్దరు స్మగ్లర్ల అరెస్టు
సుండుపల్లె, జనవరి 31: ఎర్రచందనంను అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు స్మగ్లర్లను అటవీశాఖ అధికారులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా సానిపాయి రేంజ్ ఫారెస్టు అధికారి వినాయక్ మాట్లాడుతూ జిల్లేలమంద బీట్ పరిధిలో 319 కిలోల బరువు గల పది ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకుని ఇద్దరు స్మగ్లర్లను అరెస్టు చేసినట్లు తెలిపారు. చిత్తూరు జిల్లాకు చెందిన శివకుమార్, తమిళనాడు రాష్ట్రం వేలూరుకు చెందిన షరీఫ్‌లుగా వీరిని గుర్తించినట్లు తెలిపారు.
రైల్వేకోడూరులో...
రైల్వేకోడూరు: మండలంలోని బాలుపల్లె అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తుండగా మంగళవారం ఒక వ్యక్తిని అరెస్టు చేసి అతని నుండి 8 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు అటవీ అధికారి రెడ్డిప్రసాద్ తెలిపారు. తమిళనాడు రాష్ట్రం వేలూరుకు చెందిన గోవిందన్ అనే నిందితున్ని అటవీ ప్రాంతంలో అరెస్టు చేశామన్నారు. పాత కేసులో నిందితునిగా ఉన్న ఉంగరాల సురేష్‌ను మంగళవారం అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచామన్నారు.
పోలీసుల అదుపులో తమిళ కూలీలు
మైదుకూరు, జనవరి 31:మున్సిపాలిటీ పరిధిలోని పాతపాళెంలో ఐదుమంది తమిళకూలీలు మంగళవారం వరిగడ్డివాముల చాటున దాగి ఉండగా గ్రామస్థులు వారిని గుర్తించి వెంబడించి పట్టుకున్నట్లు తెలిసింది. ఈ సంఘటనలో ఒక తమిళుడు పారిపోయాడని, గ్రామస్థులు తమిళులను పట్టుకుని అదుపులోకి తీసుకున్న విషయాన్ని మైదుకూరు అర్బన్ సిఐ వెంకటేశ్వర్లుకు చేరవేయడంతో తన సిబ్బందితో హుటాహుటీన అక్కడికి వెళ్లి కూలీలను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన తమిళులను మైదుకూరు పోలీసుస్టేషన్‌కు తీసుకువచ్చి విచారిస్తున్నారు. కూలీలను ఎర్రచందనం కూలీలుగా భావిస్తున్నారు.

కెసి కెనాల్‌కు ఆగిన సాగునీరు..

చాపాడు, జనవరి 31:జిల్లాలోని ప్రధాన నీటి వనరుల్లో ఒకటైన కర్నూలు-కడప ప్రధాన ఆయకట్టు కాలువకు మంగళవారం సాగునీటిని అధికారులు నిలిపివేశారు. కెసికెనాల్ పరిధిలోని పలు ప్రాంతాల్లో పంటలు సాగులో ఉన్నాయని, వాటిని కాపాడుకోవడానికి మరో రెండు తడులకైనా సాగునీటిని అందివ్వాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు. గత ఏడాది ఆగష్టు 12వ తేదీ కెసికెనాల్‌కు అధికారులతోపాటు మైదుకూరు ఎమ్మెల్యే ఎస్.రఘురామిరెడ్డి కుందూనది నుంచి రాజోలి ఆనకట్ట ద్వారా మెయిన్ కాలువలతోపాటు చాపాడు చానల్‌కు అధికారికంగా నీటిని విడుదలచేసిన విషయం తెలిసిందే. పైతట్టు ప్రాంతాల్లో సంమృద్ధిగా నీరు రావడంతో శ్రీశైలం జలాశయానికి ఆశించిన స్థాయికి నీటిమట్టం చేరడం వల్ల జిల్లాలోని కెసికెనాల్‌తోపాటు తెలుగుగంగ ఆయకట్టుకు సాగునీటిని విడుదల చేశారు. ఐదునెలలపాటు పూర్తి స్థాయిలో నీటి సరఫరా కొనసాగడంతో కొన్నిచోట్ల వరినాట్లతోపాటు పసుపు, చెరకు, వేరుశనగ పంటలను ఆలశ్యంగా సాగుచేశామని రైతులు పేర్కొంటున్నారు. ఈ పంటలను కాపాడుకోవడానికి మరో నెలరోజులు సాగునీరు అవసరమని రైతులు కోరుతున్నారు. కనీసం ఫిబ్రవరి నెలలో రెండు తడులైనా నీటిని అందించి సాగులో ఉన్న పంటలను కాపాడాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ విషయంపై కెసికెనాల్ డివిజనల్ ఇంజనీర్ జిలానీబాషాను వివరణ కోరగా ప్రభుత్వ ఆదేశాల మేరకు కెసికెనాల్‌కు నీటిని నిలుపుదలచేసిన మాట వాస్తవమేనన్నారు. జలాశయాల్లో నీరు అడుగంటడం వల్ల రాబోవు వేసవిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం నీటిని నిలుపుదలచేయడం జరిగిందని, సాగునీటిని కొనసాగించేందుకు వీలు లేదని ఆయన వివరణనిచ్చారు.

నీటి సమస్య పరిష్కరిస్తాం
ప్రొద్దుటూరు టౌన్, జనవరి 31: పట్టణంలో నీటిసమ స్య1పరిష్కరి స్తామని మున్సిపల్ ఛైర్మెన్ ఉండేల గురివిరెడ్డి తెలిపారు. మంగళవారం స్థానిక మున్సిపల్ కౌన్సిల్‌హాలులో కౌన్సిల్ బడ్జెట్ అత్యవసర సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలువురు కౌన్సిలర్లు సమావేశంలో మాట్లాడుతుండగా హాలులో రీసౌండ్ వస్తూ వారి మాటలు అర్థంకాక ఛైర్మెన్ గురివిరెడ్డి అసహనం వ్యక్తంచేశారు. కౌన్సిల్ హాలులో మూడు సంవత్సరాల నుంచి సమావేశాలు నిర్వహిస్తున్నామని, హాలు నిర్మాణాన్ని పూర్తి చేయకపోవడం వలన కౌన్సిల్ సభ్యుల మాటలు సరిగా అర్థంకావడం లేదని, అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని కమిషనర్ వెంకటశివారెడ్డిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇదే విషయంపై వైకాపా ఫ్లోర్ లీడర్ మురళీధర్‌రెడ్డి, కౌన్సిలర్లు రాచమల్లు రమాదేవి, యామినిలు కూడా అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. అలాగే పట్టణంలో ఎక్కడ చూసినా అపరిశుభ్ర వాతావరణం ఏర్పడిందని, పందులు, కుక్కలు స్వైర విహారం చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నా అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని వారు ప్రశ్నించారు. అనంతరం ఛైర్మెన్ మాట్లాడుతూ రాబోవు వేసవిని దృష్టిలో పెట్టుకొని గండికోట నుంచి ఒక టి ఎంసీ నీటిని తెప్పిస్తున్నామని, నీరు ఇప్పటికే పెన్నానదిలోని వాటర్‌హౌస్ వద్దకు చేరుకున్నాయని తెలిపారు. దీంతో భూగర్భజలాలు పెరిగి నీటి సమస్య తగ్గుతుందని, సమస్యల పరిష్కారానికి ఎప్పకటిప్పుడు స్పందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. వైస్ ఛైర్మెన్ జబీవుల్లా, కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.

మార్కెట్‌యార్డు ఆధ్వర్యంలో
మరిన్ని పశువైద్య శిబిరాలు
కమలాపురం, జనవరి 31: మార్కెట్‌యార్డు ఆధ్వర్యంలో మరిన్ని పశు వైద్య శిబిరాలను నిర్వహిస్తామని కమలాపురం మార్కెట్‌యార్డు చైర్మెన్ ఆర్ తిరుమలరెడ్డి పేర్కొన్నారు. ఆయన మంగళవారం మండలపరిధిలోని నసంతపురంగ్రామంలో మార్కెట్‌యార్డు కమిటీ ఏర్పాటు చేసిన ఉచిత పశు వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుమూల గ్రామాల్లో కూడా రైతులు గొర్రెల పెంపకందారుల సదుపాయం కోసం, పశుసంపదను కాపాడుకునేందుకు ఈ శిబిరాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ వైద్యశిబిరాలను సద్వినియోగ పరుచుకోవాలని రైతులను కోరారు. పందిళ్లపల్లె పశువైద్యాధికారి ప్రవీణ్ కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ఈ సీజన్‌లో పుట్టిన గొర్రెపిల్లల మరణాలసంఖ్య తగ్గించుకోవడానికి గొర్రెపిల్లల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను, యాజమాన్య పద్ధతులను వివరించారు. అనంతరం ఈ శిబిరంలో 2300 జీవాలకు, 12గేదెలకు, 21లేగదూడలకు మరో 32 పశువులకు వివిధ రకాల చికిత్సలను నిర్వహించి మందులను పంపిణీ చేశారు. ఇందులో మార్కెట్‌యార్డు వైస్ చైర్మన్ రాఘవరెడ్డి, కార్యదర్శి రత్నరాజు, పశువైద్యాధికారులు సుదర్శన్‌రెడ్డి, చలమారెడ్డి, పెంచలయ్య, గోపాలమిత్రులు రమేష్, శివ, సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు.

చారిత్రాత్మక కట్టడాలు అద్భుతం
సిద్దవటం,జనవరి 31: స్థానికంగా ఉన్న చారిత్రాత్మకమైన కోట అద్భుతంగా ఉందని శ్రీచైతన్య స్కూల్ కరస్పాండెంట్ అనిల్‌కుమార్‌రెడ్డి, విద్యార్థులు పేర్కొన్నారు. మాధవరంలోని స్కూల్ విద్యార్థులు 400 మందికి పైగా మంగళవారం సిద్దవటం కోటను సందర్శించారు. ఈ సందర్భంగా వారు మొదటి మండపం, రెండవ మండపం, ఢంకానగర్, రాణిమహల్, ఈద్గా, దెబ్బతిన్న నందివిగ్రహం, గుప్తనిధుల తవ్వకాల్లో భయటపడిన శివలింగం, బిస్మిల్లాషా ఖాద్రి దర్గా, నవాబులు నిర్మించిన మసీదు తదితర ప్రాంతాలను వారు సందర్శించారు. అనంతరం సొరంగం మార్గంలో ప్రకృతిని ఆశ్వాదించారు. అనంతరం పార్కులో విద్యార్థులు సరదాగా ఆటలాడుకుంటూ గడిపారు. కార్యక్రమం లో విద్యార్థులు, పలువురు ఉపాధ్యాయులు పాల్గొనా.

విద్యార్థుల సంక్షేమమే చంద్రన్న ధ్యేయం

రాజంపేట టౌన్, జనవరి 31:పేద విద్యార్థుల సంక్షేమమే ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు ధ్యేయమని ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక పార్టీ కార్యాలయంలో టిఎన్‌ఎస్‌ఎఫ్ రూపొందించిన చంద్రన్న సంక్షేమ హాస్టళ్ల సముద్ధరణ బాట పోస్టర్లను మేడా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్టవ్య్రాప్తంగా ఉన్న అన్ని సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు ఎలాంటి సమస్యలు లేకుండా చేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. రాష్ట్రంలోని బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి, ఉజ్వల భవిష్యత్‌ను అందించాన్నదే సిఎం ధ్యేయమన్నారు. టిఎన్‌ఎస్‌ఎఫ్ చేపట్టే ఈ కార్యక్రమం ద్వారా హాస్టళ్ల విద్యార్థుల సమస్యలు పరిష్కరించడానికి ఎంతగానో దోహద పడుతుందన్నారు. టిఎన్‌ఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షులు ఆర్.వేణుగోపాల్ మాట్లాడుతూ ఫిబ్రవరి 1 నుండి 10వ తేదీ వరకు జిల్లాలోని అన్ని సంక్షేమ హస్టళ్లను తమ బృందాలు సర్వే చేయడం జరుగుతుందని, హస్టళ్లలో రాత్రి నిద్ర చేసి విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని పది రోజుల నివేదికను యువ నేత నారా లోకేష్‌బాబు ద్వారా సిఎంకు నివేదించడం జరుగుతుందన్నారు. టిఎన్‌ఎస్‌ఎఫ్ నాయకులు, సభ్యులు ఈ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు యెద్దల సుబ్బరాయుడు, కెవి రమణ వడ్డెర, టి.సంజీవరావు, షేక్ అబ్దుల్లా, టిఎన్‌ఎస్‌ఎఫ్ నాయకులు శివకృష్ణ, శివకుమార్‌రాజు, సురేంద్ర, సాయి, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.

బలిజలను బిసి జాబితాలో చేర్చాలి

కడప,(కల్చరల్)జనవరి 31: మంజునాథ్ కమిషన్ త్వరగా పూర్తిచేసుకుని బలిజలను (కాపులు) బిసి జాబితాలో చేర్చాలని ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడును కోరుతూ దేవునికడపలోని శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం రాయలసీమ బలిజ సంక్షేమ ఐక్యపోరాట సమితి ఆధ్వర్యంలో 108 టెంకాయలు కొట్టారు. ఈసందర్భంగా సమితి రాయలసీమ అధ్యక్షులు ఎస్వీ రాము, జిల్లా అధ్యక్షులు కె.క్రిష్ణమూర్తి మాట్లాడుతూ బలిజ కులస్తులందరూ ఐక్యంగా ఉన్నప్పుడే కాపులకు అందాల్సిన ఫలితాలు దక్కించుకుంటామన్నారు. కాగా ఇటీవల టిటిడి బోర్డు మాజీ సభ్యులు ఓవి రమణ, శ్రీకాళహస్తి దేవస్థానం మాజీ చైర్మన్ కోలానంద్‌లు బలిజల కులస్తులను ఏనాడైనా పట్టించుకోకపోగా ఈరోజు బలిజలు, కాపులు వేరని వేర్వేరు కుంపట్లు పెట్టడం మంచిపద్ధతి కాదన్నారు. రాజకీయ లబ్దికోసం కులాన్ని విడదీసే ప్రయత్నం మానుకోవాలని వారు హితవుపలికారు. ప్రధానంగా రాయలసీమ జిల్లాల్లో ఏ నియోజకవర్గంలోనైనా గెలుపు ఓటములు శాసించే స్థాయిలో బలిజల ఓట్లు కీలకంగా ఉన్నాయన్నారు. మనలోనే కొంతమంది రాజకీయ నాయకులు సంఘీయులంతా ఏకతాటిపైకి వస్తే వారికి రాజకీయ భవిష్యత్ ఉండదని కులంపై విమర్శలు చేస్తున్నారని తీవ్రంగా ఆరోపించారు. ముఖ్యంగా మనజాతికోసం ముద్రగడ పద్మనాభం ప్రభుత్వమిచ్చిన హామీలను నెరవేర్చాలని అడుగుతున్నారే తప్ప ,వారి కుటుంబానికి పదవులకోసమే తనకు పదవులకోసమో కాదన్నారు. ముద్రగడను విమర్శించే స్థాయి ఎవ్వరికీ లేదన్నారు. అలాగే ముద్రగడ దీక్ష చేపట్టడంతో తునిలో జరిగిన సంఘటన నేటికి ఏడాది కావస్తోందన్నారు. కార్యక్రమంలో సమితి యూత్ అధ్యక్షుడు కటిక నాగరాజు, సభ్యులు పవన్, శ్రీను, శ్రీకాంత్, చలపతి రాయ ల్, సమ్మెట సత్యనారాయణ, మస్తాన్‌రావు తదితరులు పాల్గొన్నారు.