కడప

కుటుంబ కలహాలతో దంపతుల ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజంపేట టౌన్, ఫిబ్రవరి 17:రాజంపేట మండలం మంధరం పంచాయితీ గొల్లపల్లెలో కుటుంబ కలహాలతో దంపతులు ఆత్మహత్య చేసుకున్న దుర్ఘటన శుక్రవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. గొల్లపల్లెకు చెందిన కీర్తి వెంకటసుబ్బయ్య(42), వెంకటసుబ్బమ్మ (32) దంపతులు తెల్లవారు జామున ఇంట్లో గొడవ పడి ఆత్మహత్య చేసుకుని మృతి చెంది ఉంటారని స్థానికులు పేర్కొన్నారు. వీరికి ఒక కుమార్తె, కుమారుడు ఉండగా కుమార్తెకు వివాహం చేశారు. కుమారుని గల్ఫ్ దేశాలకు పంపారు. గురువారం రాత్రి మద్యం సేవించిన వెంకటసుబ్బయ్యకు భార్య వెంకటసుబ్బమ్మల మధ్య జరిగిన ఘర్షణ ఆత్మహత్యకు దారి తీసినట్లు పోలీసులు భావిసున్నారు. అప్పుల బాధ ఎక్కువగా ఉండడంతో ఇటీవల భార్యాభర్తలు గొడవలు పడే వారన్నారు. ఉదయం ఇంట్లో నుంచి కిరోసిన్ వాసన రావడంతో స్థానికులకు అనుమానంవచ్చి చూడగా దంపతులు ఇరువురు విగత జీవులై పడివున్నారు. మృతుల కుమార్తె లక్ష్మీదేవి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు మన్నూరు పోలీసులు తెలిపారు.

వేలం పాటలో దక్కించుకున్న
భూములపై టిటిడి కన్ను.!

ఒంటిమిట్ట, ఫిబ్రవరి 17:గతంలో కోదండ రామస్వామికి సంబంధించిన భూములను వేలం పాటలో దక్కించుకున్న వారి పరిస్థితి నేడు అయోమయలో పడింది. ఫలితంగా వేలం పాటలో పొంది, ఒకటి, రెండు కంతులు చెల్లించిన యాజమానులకు సంబంధించిన భూములపై టిటిడి కన్ను పడింది. ప్రభుత్వం ఒంటిమిట్ట రామాలయాన్ని గుర్తించక మునుపే దేవాదాయ, ధర్మాదాయ శాఖలో రామాలయం ఉండేది. ఆ సమయంలో స్వామికి చెందిన భూములను దేవాదాయ శాఖ వేలం పాట నిర్వహించింది. ఆ వేలం పాటలో పాల్గొన్న యాజమానులు పాత షరతు ప్రకారం ఒక కంతు చెల్లించి భూములు స్వంతం చేసుకున్నారు. అయితే ప్రస్తుతం రామాలయాన్ని ప్రభుత్వం గుర్తించడం, ఇదే దరిమిలో టిటిడిలో విలీనం చేయడం జరిగింది. ప్రస్తుతం అభివృద్ధిలో భాగంగా దేవాదాయ శాఖ ఆధీనంలో ఉన్న సమయంలో నిర్వహించిన వేలం పాటలో పూర్తిస్థాయిలో కంతులు చెల్లించని భూములను స్వాధీనం చేసుకునేలా ఒక అడుగు ముందుకేసినట్లు తెలుస్తుంది. ఇదే తరహలో గడిచిన రోజుల క్రితం కొత్తగా బాధ్యతలు స్వీకరించిన టిటిడి రెవెన్యూ అధికారి ఈ భూములు పరిశీలించి అందుకు తగట్టు పూర్తి వివరాలను తెలుసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం కోదండ రామస్వామికి సుమారు 70 ఎకరాల స్థలం ఉంది. అయితే వేలం పాట ద్వారా స్వామికి సంబంధించిన భూములను కొంతమంది విక్రయించడం జరిగింది. అప్పటి నుండి మొన్నటికి మొన్న వరకు వేలం పాటలో పొందిన భూములపై ఆయా యాజమానులు ప్రత్యేక శ్రద్ధ చూపలేదు. ఫలితంగా ఆ భూములను ఆయా యాజమానులతో సంప్రదించి తిరిగి తీసుకునేందుకు చర్యలు తీసుకొంటున్నట్లు తెలుస్తుంది. అంతే కాకుండా ఈ భూములను స్థానిక రెవెన్యూ అధికారుల ద్వారా పరిశీలించి ఏలాంటి నిర్ణయాలు తీసుకోవాలో అన్న అంశంపై టిటిడి పూర్తిస్థాయిలో పరిశీలించేందుకు తేటతెల్లం చేసింది. మామూలుగా అయితే దేవాదాయ శాఖ నియమ, నిబంధనల ప్రకారం మిగిలిన డబ్బులు చెల్లించి వాటిని యాజమానుల పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకుని స్వంతం చేసుకోవాల్సి ఉంది. ఒకటి, రెండు కంతులు చెల్లించి వాటిపై శ్రద్ధ చూపని భూములపై టిటిడి అధికారులు కనే్నశారు. ఏదీ ఏమైనా వేలం పాట భూముల విషయంలో యాజమానులతో ఏలాంటి సంప్రదింపులు జరిపి ఆ భూముల విషయంలో ఏలాంటి తుది నిర్ణయాలు తీసుకొంటారో చూడాలి మరీ.

కడపకు గర్వకారణం
గండికోట ఉత్సవాలు..

కడప,్ఫబ్రవరి 17: వందల సంవత్సరాలు చరిత్ర కలిగిన గండికోట ఉత్సవాలు ఘనంగా జరుపుకోవడం కడప జిల్లాకే గర్వకారణమని జిల్లా కలెక్టర్ కెవి సత్యనారాయణ అన్నారు. ఈనెల 18,19వ తేదీల్లో అంగరంగ వైభవంగా జరిగే ఉత్సవాలు పురష్కరించుకుని శుక్రవారం కడప నగరంలో కళాకారులతో ఏర్పాటుచేసిన శోభాయాత్ర ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలందరికీ తెలిసేలా శోభాయాత్ర కార్యక్రమం ఏర్పాటు చేశామని ప్రజలందరూ పాల్గొనేలా అధికారులు కూడా చర్యలు తీసుకోవాలన్నారు. ఉత్సవాల్లో పాల్గొనేందుకు ప్రజలకు అనుగుణంగా ప్రత్యేక ఆర్టీసీ బస్సులు కూడా ఏర్పాటు చేసినట్లు ముఖ్యంగా కళాశాల విద్యార్థులు ఈ ఉత్సవాల్లో పాల్గొని గండికోట ప్రాశస్థిని, వైభవాన్ని తెలుసుకోవాలని కోరారు. రెండురోజులపాటు గండికోటలో జరిగే సాంస్కృతిక కార్యక్రమాలు, సంప్రదాయ క్రీడలు, కర్రసాము, అగ్గిబరాట, పతంగుల పోటీలు, శాస్ర్తియనృత్యాలు, ఖవ్వాలి ప్రదర్శన, వాణిజ్య ప్రదర్శన, డ్వాక్రా స్టాల్స్ తదితర ప్రదర్శన అంశాలు ఉంటాయన్నారు. గండికోట వారసత్వ ఉత్సవాల శోభాయాత్రలో గురువయ్యల బృందం, శ్రీరామచెక్క్భజన బృందం, కోలాటం తదితర కళాకారులతో స్థానిక కృష్ణా థియేటర్‌నుంచి ప్రారంభమై గోకుల్ సర్కిల్ మీదుగా చెన్నూరు బస్టాండు వరకు చేరుకుంది. ఈయాత్ర సందర్భంగా మేళతాళాలు, డప్పువాయిద్యాలతో కళాకారుల ఆటపాటలు, పట్టణ ప్రజలను ఉర్రూత లూగించాయి. కార్యక్రమంలో పర్యాటకశాఖ ఆర్డీ జి.గోపాల్, డిఆర్‌డిఏ పిడి అనిల్‌కుమార్‌రెడ్డి, బిసి, ఎస్సీ కార్పొరేషన్ ఇడిలు రామచంద్రారెడ్డి, శ్రీలక్ష్మి , వైవియు సమన్వయ కర్త మూలమల్లికార్జునరెడ్డి, సిపిఓ తిప్పేస్వామి, ఆర్డీలో చిన్నరాముడు, బిసి సంక్షేమశాఖ అధికారి వెంకటయ్య, గృహనిర్మాణశాఖ పిడి ప్రసాద్‌తోపాటు అధికారులు, జిల్లా నలుమూలల నుంచి వచ్చిన కళాకారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ప్రభుత్వం నైతిక విలువలు పాటించాలి

రాయచోటి, ఫిబ్రవరి 17: స్థానికసంస్థల మండలి ఎన్నికలలో తెలుగుదేశం ప్రభుత్వం నైతిక విలువలకు దిగజారి వ్యవహరిస్తోందని రాజంపేట పార్లమెంటు సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఎంపీ మిథున్‌రెడ్డి ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డితో కలిసి రాయచోటిలోని వైసీపీ కార్యాలయంలో విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్రాన్ని అవినీతిలో నెంబర్‌వన్‌గా మార్చారని ధ్వజమెత్తారు. నిధుల కొరత అంటూనే ఇతర రాష్ట్రాల కన్నా అధిక రేట్లకు విద్యుత్‌ను కొనుగోలు చేయడం, తాత్కాలిక రాజధాని భవనాల నిర్మాణం కోసం నాలుగింతలు ఖర్చు చేసి, ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రాన్ని పూర్తి అవినీతిమయంగా మార్చారని విమర్శించారు. సీఎం చంద్రబాబుపై వచ్చిన కేసులకు భయపడి కోర్టుల్లో విచారణ జరగకుండా స్టేలు తెచ్చుకున్నారని, ఆ స్టేలు ఎక్కువ కాలం ఉండవని, చంద్రబాబు జైలుకెళ్లడం ఖాయమన్నారు. అనంతరం ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ పోలీసు వ్యవస్థను సీఎం చంద్రబాబు తన సొంత వ్యవస్థగా వాడుకుంటున్నారని ఆరోపించారు. వైసీపీలోకి స్వచ్ఛంధంగా చేరిన ఎంపీటీసీని పోలీసులే టీడీపీ నాయకులకు అప్పగించడం ప్రజాస్వామ్యంలో తీరని మచ్చ అన్నారు. జిల్లాలో వైసీపీ ఎంపీటీసీలు, కౌన్సిలర్లు టీడీపీ కన్నా 200 మంది మెజార్టీగా ఉన్నారన్నారు. ఒక పార్టీ గుర్తుతో గెలిచిన ప్రజాప్రతినిధులను ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా ప్రలోభాలకు, బెదిరింపులకు ఒత్తిళ్లకు గురిచేసి టీడీపీలోకి చేర్పించుకోవడం నీచ రాజకీయాలన్నారు. తెలుగుదేశం పార్టీ ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా వ్యవస్థలను దుర్వినియోగం చేసినా చివరకు జిల్లాలో స్థానికసంస్థల మండలి అభ్యర్థి వైఎస్ వివేకానందరెడ్డిదేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో కో ఆప్షన్ సభ్యుడు సలావుద్దీన్, కౌన్సిలర్లు ఫయాజుర్‌రెహిమాన్, చిల్లీస్ ఫయాజ్, మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ ఆఫ్జల్‌అలీఖాన్, వైసీపీ నాయకులు చెన్నూరు అన్వర్‌బాష, రిజ్వాన్, గంగిరెడ్డి, సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ప్రజాప్రతినిధులు
అధికారిక పర్యటనల్లో పాల్గొనరాదు

కడప,్ఫబ్రవరి 17: ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే జిల్లాల్లో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్నందున మంత్రులుగానీ, అధికారులుగానీ అధికార పర్యటనల్లో పాల్గొనరాదని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ స్పష్టం చేశారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి జిల్లాల వారీగా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా భన్వర్‌లాల్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాల మేరకు ఓటర్ల దరఖాస్తులన్నీ సంబంధిత రిటర్నింగ్ అధికారులతో విచారణ చేయించి, అర్హులైన ఓటర్ల జాబితా సిద్ధం చేయాలన్నారు. వివిధ రాజకీయ పార్టీల నాయకుల నుంచి ఫిర్యాదులు, అభ్యంతరాలు ఉన్నాయని వాటిని నిశితంగా విచారించాలన్నారు. అలాగే ఇంటర్ పరీక్షలు జరుగుతున్న కేంద్రాలు దగ్గరగానే పక్కనే పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేషన్లుచేసే అభ్యర్థుల అఫిడవిట్స్ ప్రధాన ఎన్నికల అధికారి వెబ్‌సైట్‌లో ఉంచాలని కలెక్టర్లకు సూచించారు. ఎన్నికలు ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ జరుగుతుందని మండలాల వారీగా పోలీసుస్టేషన్ల బందోబస్తు, నామినేషన్ల పత్రాల వివరాలు ఓటర్లు కాని వారిని ఓటర్ల జాబితాలో చేర్చాలని ఫిర్యాదులు వచ్చాయని వాటిని వెరిఫికేషన్ చేయించాలని కోరారు. అనంతరం కలెక్టర్ కెవి సత్యనారాయణ మాట్లాడుతూ ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని జనవరి 12వ తేదీ వరకు ఓటర్ల జాబితా మేరకు 106 పోలింగ్ కేంద్రాలకు గాను పట్ట్భద్రులు 79501మంది కాగా, ఫిబ్రవరి 17వ తేదీ నాటికి 77899 మంది ఓటర్ల జాబితాలో తయారుచేయడం జరిగిందని, ఇందులో 1602 మందిని తొలగించడం జరిగిందన్నారు.
ఉపాధ్యాయుల ఓటర్ల జాబితా మేరకు జనవరి 12 నాటికి 5877 మంది ఓటర్లకు గాను ఫిబ్రవరి 17నాటికి 5772 మంది ఓటర్ల జాబితాను తయారు చేశామని, 105మందిని తొలగించడం జరిగిందన్నారు. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 17 వరకు పట్ట్భద్రుల క్లైమ్స్ మొత్తం 879 మందికాగా 228మందిని అనుమతించడం జరిగిందని, 51 మందిని తిరస్కరించడం జరిగిందని, 600మందిని పెండింగ్‌లో ఉంచడం జరిగిందన్నారు. అలాగే ఉపాధ్యాయులు మొత్తం క్లైమ్స్ 360మందికిగాను 56మందిని అనుమతించి 21 మందిని తిరస్కరించడం జరిగిందని, 283మందిని పెండింగ్‌లో ఉంచడం జరిగిందని వివరించారు. మార్చి 9వ తేదిన ఇంటర్మీడియట్ పరీక్షల సందర్భంగా 9 పట్ట్భద్రుల పోలింగ్ కేంద్రాలను, 4 ఉపాధ్యాయ పోలింగ్ కేంద్రాలను మార్పుచేసేందుకు అనంతపురం ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ప్రతిపాదనలు పంపడం జరిగిందని తెలిపారు. అలాగే జిల్లాలో కడప,రాజంపేట, జమ్మలమడుగు డివిజన్ల పరిధిలో 158 పోలింగ్ కేంద్రాలు, 21 రూట్లు, 21జోన్లుగా తయారు చేశామని ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రత ఏర్పాట్లు చేశామని, పెండింగ్‌లో ఉన్న ఓటర్ల జాబితాను మరోసారి క్షుణ్ణంగా పరిశీలించి ఖచ్చితమైన ఓటర్ల జాబితాను తయారుచేయడం జరుగుతుందని ఎన్నికల అధికారికి వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ పిహెచ్‌డి రామకృష్ణ, జెసి శే్వత, జెసి -2 నాగేశ్వరరావు, డిఆర్వో నరసింహారావు, కడప, రాజంపేట, జమ్మలమడుగు ఆర్డీవోలు చిన్నరాముడు, వీరబ్రహ్మం, వినాయకం, డిఐఓ విజయకుమార్, ఎన్నికల విభాగపు పర్యవేక్షకులు జయరాములు, విఆర్వోలు, ఏఇఆర్వోలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

నేటి నుంచి గండికోట వారసత్వ ఉత్సవాలు

కడప,(కల్చరల్)్ఫబ్రవరి 17: శ్రీ కృష్ణదేవరాయల పాలనలో రాయలసీమ జిల్లాలకే తలమానికమైన గండికోట వారసత్వ ఉత్సవాలు లాంఛనంగా రెండు రోజుల పాటు శనివారం నుంచి గండికోటలో ప్రారంభంకానున్నాయి. రాయల నాటి కాలంలో క్రీ.శ.1653 ఆగస్టు 27న గండికోట ప్రభువులైన పెమ్మసాని తిమ్మనాయుడుపై నవాబులు విష ప్రయోగం చేయడంతో మరణించడం, అనంతరం జరిగిన యుద్ధంలో ఆయన వారసులైన కమ్మవీరులు నివశించిన 66 ప్రాంతాల నుంచి వలస వెళ్ళిన్నట్లు చరిత్ర చెప్పుతున్నంది. వారు 1.అద్దంకి,2. బొల్లినేని, 3.చల్లా, 4. అట్లూరి, 5.అడప, 6.చుక్కలపల్లె, 7.అడసుమిల్లి, 8.దాసరి, 9.గొంటిముక్కల, 10 కటారి, 11.చిరుమామిళ్ల, 12,తొండేటి, 13.ఘట్టమానేని, 14.గుత్తా అడసుమిల్లి,15.చెరుకూరు, 17.జెటి , 18.గోళ్ల, 19.కరణం, 20 కట్టా, 21 కొడలి, 22 కాకర్ల, 23.కోటపాటి, 24.తిలారు, 25. మేదరమెట్ట, 26.కొంగర, 27 కొండవీటి, 28.ముద్దన్న, 29.కోనేరు, 30. మిక్కినేని, 31. మోల్లవరపు, 32. మదమంచి, 33. మోటారి, 34.నెట్టేం, 35 మల్లేల, 36. మలినేని, 37.మెడబలిమి, 38. మేడసాని, 39. మానం, 40. పరచూరి, 41. నర్రావుల, 42.పాలడుగు, 43 రావెళ్లె, 44 రాయపానేని, 45.నీరుకొండ, 46.రావూరు, 47. శాఖమురి, 48.తాళ్లూరు, 49 రామినేని, 50.రాచకొండ, 51. శ్రీపతినేని, 52.సూర్యదేవర, 53.వెలూరు, 54. తుమట్టి, 55.తాతినేని, 56.వాసిరెడ్డి, 57. విపర్లా, 58.సుఖవాసి, 59.ముస్నూరు, 60.తాళ్లూరి గ్రామాల్లో ఉన్న వంశీయులు వలసి వెళ్లినట్లు చరిత్ర చెబుతొంది. ఈ ఉత్సవాల్లో ఆ వంశానికి చెందిన నేటితరం వారు వివిధ రాష్ట్రాల్లో ఉన్న వారిని జిల్లా యంత్రాంగం ఆహ్వానిస్తున్నారు. ఇక గండికోట ప్రాచుర్యం తీసుకుంటే పర్యాటకులను ఆకర్షించే విధంగా గండికోట నాటి కట్టడాలకు మెరుగులు దిద్దారు. విజయ నగర స్థాపన అనంతరం క్రీ.శ. 1336 గండికోట, సీమజిల్లా పాలన విభాగంగా ఉండేది. బుక్కరాయల కాలంలో ఎల్లమరసును గండికోట సమపాలికుడుగా నంద్యాల రాజులను నియమాకం చేశారు. తల్లికోట యుద్ధ అనంతరం నంద్యాల రాజులు తిరుగుబాటు చేసి గండికోటను వశపరుచుకున్నారు. అప్పట్లో వీరవెంకటపతి రాయులు నంద్యాల వారిని అణిచి వేసి పెన్నసాని తిమ్మనాయుడుకి గండికోట సీమ జిల్లాలను అప్పగించారు. క్రీ.శ.1598లో చోటు చేసుకున్న పరిణమాలు క్రీ.శ.1650 నాటికి సీమ జిల్లాలు గొల్కొండ నవాబులకు వశమైంది. కోట పాలకుడుగా సుబేదార్ మీర్ జూమ్లా నియమించారు. ప్రెంచి యాత్రికుడు అయిన టవెర్నియార్ మీర్ జూమ్లా అతిథిగా గండికోట యాత్రకు వచ్చి గండికోటలో 15 రోజులు విడిది చేశారు. కాలక్రమేణా హైదరఅలీ ఆధీనంలోను మహారాష్ట్ర పాలనలో ఉండిన ఆంగ్లేయులకు దత్తతమైనది. ఈ కోట 4.5 మైళ్ల పొడవులో ప్రాకారం కలిగి కోట ద్వారాలు ఈరుపగుబ్బలతో శ్రతుదుర్భేత్వంగా ఉన్నాయి. అదేవిధంగా సీమ జిల్లాలోనే పురాతన కట్టడాలలో గండికోట చారిత్రాత్మకంగా ఆనవాళ్లు తీసుకుంటే గండికోటకు దక్షిణ భాగంలో పెన్నానది లోయ, మాధవరాయ ఆలయం, ధాన్యగారం, జామియామసీదు, ఆయుధాగారం, ఫిరంగి, మూడంతస్థుల మేడ ప్యారేబాగ్, జలపాతం భూగర్భ డ్రైనేజి, కోట వెలుపల నుంచి తాగునీటి సౌకర్యం ఉండడంతో పాటు కోట లోపల ఎన్నో అద్భుతాలతో కూడిన నిర్మాణాలను క్రీ.శ.1106లో ఒరుగల్లు పాలించిన కాకతీయ రాజుల కాలంలో నిర్మించారు. కోట శిథిలాల గుండా వెళ్లిన తర్వాత రెండు కొండల మధ్య గండిలో పెన్నానది ప్రవహించడం వల్ల గండివల్లనే గండికోటగా పేరు వచ్చింది. అప్పట్లో పెన్నానది పరివాహక ప్రాంతాలైన జమ్మలమడుగు, చెన్నూరు, కడప, సిద్దవటం, సగిలేరు ప్రాంతంలో కలసపాడు, సంజీవరాయుని పేట, ఖాదరాబాద్, కొండ సుంకేసుల, అనంతపురం జిల్లాకు చెందిన లద్దగిరి, వజ్రకరూరు, గంజికుంట, కర్నూలు జిల్లాకు చెందిన గాజులపల్లె, బనగానపల్లె, బసవాపూర్, వజ్రగిరి, తెరవలి, జొన్నగిరి, పగిడిరాయి, తుగ్గలి, ఒండుట్ల తదితర ప్రాంతాల్లో వజ్రాలను తవ్వి గండికోటలో స్వదేశ,విదేశ వ్యాపారస్థులకు విక్రయం జరిగేవి. అప్పట్లో వర్తకులు వివిధ దేశాల నుంచి ఇక్కడ వచ్చేవారు. వారికి ఉండడానికి నమాజులు చేసుకోవడానికి మసీదు ముందు భాగంలో స్పాంటిన్‌ను ఏర్పాటు చేశారు. ఇక్కడికి ఎర్రచెరువు నుంచి కోటలోని ఎర్ర కోనేరు నీరు చేరి అక్కడ నుంచి స్పాంటిన్‌కు చేరతాయి. వజ్రాల వర్తకులు ఎళ్ళతరబడి మకాం వేసి వజ్రాలు కొనుగోలు చేసేవారు. గండికోటను పాలించే క్రీ.శ. 1652 ఆగస్టు 27 ప్రభువు పెమ్మసాని చిన తిమ్మనాయుడు ప్రభువుపై నవాబులు యుద్ధంలో విషప్రయోగం చేయడంతో మృతి చెందారు. అనంతరం నవాబులు కోటను స్వాధీనం చేసుకొని వివిధ ప్రాంతాలను తెప్పించిన వజ్రాలను మీర్‌జు మర్లాలో భద్రపరచి, సీమ జిల్లాలోని గనుల్లో వజ్రాలను తవ్వించి వాటిని మద్రాసు, పులికాట్ ఓడరేవుల ద్వారా విదేశాలకు తరలించడం జరిగినట్లు పూర్వీకులు చెప్పుకొంటున్నారు. దీంతో గండికోట యుద్ధం, ప్రాముఖ్యత వాసికెక్కింది. ఈ జిల్లాలో కవులకు, రచయితలకు, కళాకారులకు కొదవ లేదు. వీరంతా గండికోట చారిత్రాత్మక కట్టడాలను, ప్రాచుర్యాని విశదీకరించారు. శని, ఆదివారాల్లో రెండురోజులపాటు గండికోట వారసత్వ ఉత్సవాలు వైభవంగా జరగనున్నాయి.

గనిగుంతలో పడి మహిళ మృతి
ప్రొద్దుటూరు రూరల్, ఫిబ్రవరి 17: స్థానిక రూరల్ పోలీసు స్టేషన్ పరిధిలోని పెద్దశెట్టిపల్లె గ్రామశివార్లలో ఉన్న రాళ్లగని గుంతల్లో శుక్రవారం ఓ మహిళ మృతదేహాన్ని కనుగొన్నట్లు రూరల్ పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల మేరకు నరసింహాపురం గ్రామానికి చెందిన మునికుమారి (20)కి రెండు సంవత్సరాల క్రితం మునిస్వామితో వివాహమైందన్నారు. ఏడాది క్రితం మునికుమారి మతిస్థిమితం లేకుండా ప్రవర్తిస్తుండడంతో భర్త ఆమెను పుట్టింటిలో వదిలేసి వెళ్లగా మునికుమారి కుటుంబసభ్యులు కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స చేయిస్తుండేవారన్నారు. కాగా మునికుమారి నాలుగురోజుల క్రితం ఇల్లు వదిలి వెళ్లిపోయిందని, కుటుంబసభ్యులు చుట్టుపక్కల గాలించినా ఫలితం లేకపోయిందన్నారు. శుక్రవారం ఉదయం గనిగుంతల్లో ఓ మహిళ మృతదేహం ఉందని తెలియడంతో మునిశేఖర్ అక్కడికివెళ్లి మృతదేహాం తన చెల్లెలు మునికుమారిదిగా గుర్తించాడని, మునిశేఖర్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ పోలీసులు తెలిపారు.

ఉప్పరపల్లెలో
ఆరు తులాలు బంగారం, నగదు చోరీ
చెన్నూరు,్ఫబ్రవరి 17: మండలంలోని ఉప్పరపల్లె గ్రామంలో హరిజనవాడలో గురువారం అర్ధరాత్రి తాళం వేసివున్న ఇంటిలో ఆరు తులాలు బంగారం, రూ. లక్ష నగదు దొంగలు అపహరించుకుపోయారు. మల్లికార్జున, అతని భార్య ఇద్దరు ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్లారు. తాళం వేసివున్న విషయాన్ని దొంగలు గమనించి ఇనుపరాడ్లతో తాళాలు పగులకొట్టి లోపలికి ప్రవేశించారు. శుక్రవారం తెల్లవారు జామున మల్లికార్జున అతని భార్య ఇంట్లోకి వెళ్లిచూడగా సామాన్లు చెల్లాచెదురయ్యాయి. చోరీ విషయాన్ని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా కడప నుంచి సిఐ వెంకటశివారెడ్డి, స్థానిక ఎస్‌ఐ వినోద్‌కుమార్ చోరీ జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. అలాగే కడప నుంచి డాగ్‌స్వ్కాడ్, క్లూస్‌టీమ్‌లను వచ్చి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ సంఘటనపై కేసు నమోదుచేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

పునరావాస కాలనీలో నీటి కొరత.!

కొండాపురం, ఫిబ్రవరి 17: గాలేరునగరి - సృజల స్రవంతిలో అంతర్భాగమైన గండికోట ప్రాజెక్టు కింద ముంపునకు గురై కొండాపురంలోని ఓబన్నపేట, గండ్లూరు పునరావాస కాలనీల్లో ఇళ్లు నిర్మించుకున్నవారు నీటి సమస్యతో ఇక్కట్లకు గురవుతున్నారు. పునరావాస కాలనీల్లో తాగటానికి నీరు లేక ఇబ్బందులు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. గతంలో తాము నివాసమున్న గ్రామాలు నీటిలో మునిగిపోతుంటే తామున్న పునరావాస కాలనీలో నీటికోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని కాలనీవారు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వం అరకొరగా ఒకటీరెండు ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తున్నా అవి ఏమాత్రం సరిపోవడం లేదని కాలనీవారు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. వేసవికి ముందే తాగునీటి సమస్య ఇలా వుంటే వేసవికాలంలో నీటి గురించి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందోనని వారు భయాందోళన వ్యక్తంచేస్తున్నారు. నీటి ట్యాంకర్లు కూడా సక్రమంగా రాకపోవడంతో నీటి కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని కాలనీవాసులు అంటున్నారు. కొన్ని నిర్మాణంలో ఉన్న గృహాలు పూర్తి చేసుకోవాలనుకున్నా నీటి కొరతతో పూర్తి చేయలేకపోతున్నామంటున్నారు. అలాగే నీటిని ట్యాంకర్ల ద్వారా కొనుగోలుచేయాలంటే ఒక్కో ట్యాంకర్ రూ.600 నుండి రూ.800ల వరకు అద్దె చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని, అంత డబ్బు వెచ్చించి ఇళ్ల నిర్మాణాలు ఎలా చేపట్టాలని వారు బాధను వ్యక్తంచేస్తున్నారు. అలాగే వీధి దీపాలు లేకపోవడంతో చీకటిపడితే విషపురుగులతో ఇబ్బందులు పడుతున్నామని తెలుపుతున్నారు. అధికారులు వచ్చి స్థానిక సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని చెబుతున్నారేగానీ చర్యలు తీసుకున్న దాఖలాలు లేవంటున్నారు. ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి పునరవాస కాలనీల్లో పర్యటించి నీటి సమస్యను పరిష్కరించాలని కాలనీవారు ముక్తకంఠంతో కోరుతున్నారు.

పెహల్వాన్ నాగసుబ్బారెడ్డి మృతి
చెన్నూరు,్ఫబ్రవరి 17: చెన్నూరుకు చెందిన పెహల్వాన్ పోరాట యోధుడు పొట్టిపాటి నాగసుబ్బారెడ్డి (86) గురువారం రాత్రి అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందారు. మృతుడు నాగసుబ్బారెడ్డి పోరాట యోధునిగా కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ఫైల్మాన్‌గా మంచి గుర్తింపు పొందారు. ప్రత్యేక గోదాశాలలు ఏర్పాటుచేసి స్థానిక యువకులతోపాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే యువకులకు కూడా ప్రత్యేక శిక్షణ ఇచ్చేవారు. అనేక ప్రాంతాల్లో నిర్వహించిన పోటీల్లో ఫైల్మాన్‌గా పేరు పొందారు. ఈయన గత రెండునెలల నుంచి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఉండేవారు. కాగా శుక్రవారం ఉదయం కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్ అవినాష్‌రెడ్డి, కడప మేయర్ కె.సురేష్‌బాబు, ఎమ్మెల్యేలు ఎస్.రఘురామిరెడ్డి, పి.రవీంద్రనాథరెడ్డి, ఎస్‌బి అంజద్‌బాషా, కమలాపురం టిడిపి నియోజకవర్గ ఇన్‌చార్జి పుత్తా నరసింహారెడ్డిలు భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. నివాళులర్పించిన వారిలో ఎంపిపి బాలమ్మ, జడ్పీటిసి చీర్ల ఉమాదేవి, మాజీ సర్పంచ్ జిఎన్ భాస్కర్‌రెడ్డి, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు విజయభాస్కర్‌రెడ్డి, వైకాపా నాయకులు రాజేంద్రప్రసాద్‌రెడ్డి, చీర్ల సురేష్‌యాదవ్, మండలంలోని సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, టిడిపి, బిజెపి, వైకాపా నాయకులు, కార్యకర్తలు నివాళులర్పించారు.

గండికోట వారసత్వ ఉత్సవాల నిర్వహణపై విమర్శలు

జమ్మలమడుగు, ఫిబ్రవరి 17:రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న గండికోట ఉత్సవాలు ప్రారంభం కాకుండానే విమర్శలపాలవుతున్నాయి. సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గండికోట ఖ్యాతిని ప్రపంచస్థాయిలో గుర్తింపు చేస్తామని ప్రకటించారు. ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో ప్రజాప్రతినిథులు ఉత్సవాల్లో పాల్గొనే అవకాశం లేదనీ, అన్నివర్గాలవారు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని అధికారులు ప్రతి సమావేశాల్లో ఊదరగొడుతున్నారు. ఎట్టకేలకు ఎన్నికల కోడ్ అడ్డం ఉండకూదన్న ఉద్దేశ్యంతో ఉత్సవాలు 18, 19తేదీల్లో జరగాల్సివున్నా ముందస్తుగా 7వ తేదీనుండే పలు కార్యక్రమాలతో ప్రణాళికల ప్రకారం చేస్తున్నారు. వారసత్వ ఉత్సవాలు శనివారం, ఆదివారం రెండు రోజులు గండికోట దుర్గంవద్ద జరుగనున్నాయి. అయితే ఉత్సవాలకు వచ్చే సిబ్బంది ఎవరి భోజనాలు వారే తెచ్చుకోవాలంటూ ఆయా శాఖల అధికారులు సూచించారు. దీంతో ఉత్సవాలకు కొన్నిశాఖల సిబ్బంది భోజన కేరీర్‌లతో శనివారం ఉత్సవాలకు హాజరుకానున్నారు. ఇప్పటికే వారసత్వ ఉత్సవాలపై పలుమార్లు క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులకు జిల్లా స్థాయి, స్థానిక శాఖల అధికారులు చేపట్టాల్సిన, చేసిన పనులపై సమీక్షలు, పరిశీలనలు చేశారు. అయితే గండికోటకు సమావేశ కార్యక్రమాలకు వచ్చిన పలువురు అధికారులు, సిబ్బంది కనీసం భోజనం లేక కడుపులు మాడ్చుకుని వెళ్లిన సందర్భాలున్నాయి.
రెండు రోజుల క్రింద నిర్వహించిన సమీక్షల కార్యక్రమానికి పలుశాఖల సిబ్బంది చాలామంది భోజనంలేక వెనుదిరిగే పరిస్థితి వచ్చింది. తాజాగా శనివారం ఉత్సవాల కార్యక్రమానికి ఎవరి భోజనాలు వారే తెచ్చుకోవాలని సిబ్బంది సూచించడం జమ్మలమడుగులో చర్చనీయాంశంగా మారింది. ఉత్సవాలు గండికోటలో రాత్రి పూటనిర్వహించే కార్యక్రమాలకు వచ్చే వారి పరిస్థితి ఏమిటన్న విమర్శలు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కనీస అవసరాల పరిస్థితే ఇలావుంటే ఉత్సవాల ఎలా వుంటుందన్న విమర్శలు సర్వత్రా వినబడుతున్నాయి. గతంలో నిర్వహించిన ఉత్సవాల నిర్వహణపై కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి. అయినా నిర్వహణాధికారుల తీరు గతంలో మాదిరిగా వుండడంపై ఈ సారి ఉత్సవాలు ప్రారంభం కాకుండా నిర్వహణ కార్యక్రమం విమర్శల పాలవుతోంది. ఈవిషయంపై జిల్లా కలెక్టర్ దృష్టిసారించి ఉత్సవాలు అభాసుపాలుకాకుండా తగిన తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.