కడప

ఎవరి బలం ఎంత!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, ఫిబ్రవరి 23: స్థానిక సంస్థల ఎన్నికల్లో బలాబలాలపై వైకాపా, టిడిపి దృష్టి సారించాయి. తమకు మద్దతు ఇచ్చే అభ్యర్థుల సంఖ్యపై రెండు పార్టీలు లెక్కలు కడుతున్నాయి. వలస నేతలపై అటు వైకాపా, ఇటు తెలుగుదేశం దృష్టి పెట్టాయి. కాగా వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వలసవచ్చిన ఎంపిటిసిలు, జడ్పీటిసిలు, మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ స్థానిక సంస్థల అభ్యర్థికి ఓటువేసే విషయంలో తటపటాయిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో వైఎస్ కుటుంబం ద్వారా లబ్దిపొంది గెలుపొందిన స్థానిక ప్రజాప్రతినిధుల్లో చాలామంది తెలుగుదేశంపార్టీలో చేరినా ఓటు వినియోగం సమయంలో ఆత్మసాక్షికి కట్టుబడి వ్యవహరించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీకి చెందిన అగ్రనేతలు, వైఎస్ వివేకా లోలోపల అందరితో సంప్రదింపులు చేసినట్లు తెలుస్తోంది. అయితే తమకు రాజకీయ జన్మనిచ్చింది దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి అని బాహాటంగా స్థానిక ప్రజాప్రతినిధులు, నేతలు చెప్పుకుంటున్నట్లు తెలిసింది. దీంతో విజయావకావాలపై వైకాపా అధిష్టానం ధీమాగా ఉన్నట్లు తెలుస్తోంది. అధికార పార్టీ నేతలు మాత్రం వైకాపా నేతలు తమ పార్టీలోచేరి రాజకీయంగా లబ్దిపొందారని తమ అభ్యర్థి అయిన బిటెక్ రవికి ఓట్లువేసి గెలిపిస్తారని ధీమాతో ఉన్నారు. నియోజకవర్గాల వారీగా ఆధిపత్యపోరు కొనసాగుతున్నందున చాలామంది అధికారపార్టీ నేతలే తమ మధ్య ఉన్న నాయకత్వం, ఆధిపత్యపోరు దృష్ట్యా ప్రతిపక్ష అభ్యర్థికే ఓటువేయాలని ఉచిత సలహా ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ, స్థానిక సంస్థల అభ్యర్థి ఎంపిక ప్రక్రియలో అందరి సమ్మతితో జరగలేదని ఎంపికచేసిన నేతలే గెలిపించుకోవాలని ఆల్టిమేటం ఇస్తున్నట్లు తెలుస్తోంది. వాస్తవంగా స్థానిక సంస్థల్లో ఓటుహక్కు కలిగిన వారిలో అధికశాతం వైకాపా నేతలే ఉన్నందున వారిలో చాలామంది అధికారదాహం కోసం, సంపాదనకోసం, తమ పనులు చక్కదిద్దుకోవడంకోసం టిడిపిలో చేరారనేది జగమెరిగిన సత్యం. అయితే ఆ నేతలలో చాలామంది పైకి టిడిపి అభ్యర్థికి జై కొడుతున్నా లోలోపల వైకాపా అభ్యర్థినే గెలిపించేందుకు సమ్మతిగా ఉన్నట్లు తెలుస్తోంది. అధికార పార్టీ నేతలు ఎమ్మెల్సీ ప్రజాప్రతినిధులకు ప్రలోభాలకు తలపెట్టినా, అదే తరహాలో వైసిపి అధిష్టానంకూడా టిడిపి నేతలకంటే వైసిపి నేతలు అధికంగా ముడుపులు చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. వైసిపి ఓటర్లే అధికంగా ఉన్నందున ఆ పార్టీ అధిష్టానం విప్ జారీ చేసేందుకు రంగం సిద్దం చేసినట్లు తెలుస్తోంది. పార్టీ ఫిరాయింపుల చట్టం విప్‌పై అధికారపార్టీ నేతలు న్యాయస్థానం ఆశ్రయించి రాజ్యసభ, పార్లమెంట్, శాసన సభ్యులు, మండలి సభ్యులను ఎక్స్ ఆఫిషియో సభ్యులుగా నమోదుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే స్వయాన జగన్ బాబాయ్ వివేకానందరెడ్డి బరిలో దిగడంతో గతంలో దివంగత నేత రాజశేఖరరెడ్డి ప్రతి ఎన్నికల్లో విజయమో వీర స్వర్గమో అనే పిలుపు ఇచ్చేవారు. అదేతరహాలో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధిష్టానం నినాదం చేస్తోంది. ఏది ఏమైనా జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు రసవత్తరంగా వ్యూహం, ప్రతి వ్యూహాల మద్య వైసిపి, టిడిపిలు హోరాహోరీగా పోరాటం కొనసాగిస్తున్నారు. ఈనేపధ్యంలో రెండు పార్టీల భవితవ్యం కాలమే నిర్ణయించాల్సివుంది.
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి
వివేకా నామినేషన్

కడప, ఫిబ్రవరి 23: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి వైకాపా అభ్యర్థి వైఎస్.వివేకానందరెడ్డి గురువారం నామినేషన్లు దాఖలు చేశారు. కలెక్టరేట్‌లో మూడు సెట్ల నామినేషన్ పత్రాలు అందజేశారు. అంతకు ముందు ఆయన ఇడుపులపాయలోని వైఎస్ ఘాట్‌ను సందర్శించారు. నామినేషన్ పత్రాలు వైఎస్ సమాధిపై ఉంచి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఫాస్టర్ రెవ.నరేష్‌బాబు, ఫాస్టర్ రెవ.రవి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. దివంగత నేత ఆశీస్సులు తీసుకున్న అనంతరం పార్టీ నాయకులతో కలిసి కడపకు చేరుకున్నారు. కలెక్టరేట్‌లో కలెక్టర్‌కు నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈకార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, వేంపల్లె ఎంపిపి రవికుమార్‌రెడ్డి, పార్టీ కన్వీనర్ చంద్ర ఓబులరెడ్డి, జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు ప్రసాద్‌రెడ్డితోపాటు వైఎస్ మనోహర్‌రెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డి, కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఘనంగా శ్రీ వీరభద్రస్వామి కల్యాణోత్సవం
రాయచోటి, ఫిబ్రవరి 23: భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామి వార్ల కల్యాణోత్సవాన్ని ఆలయ అర్చకులు వేదపండితులు చూడముచ్చటగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా ఉదయం క్షేత్ర పాలక కాల భైరవ హోమం, అభిషేకాలు కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. అంతకు మునుపు బుధవారం రాత్రి పాతరాయచోలోని శ్రీ అగస్తేశ్వరస్వామి వారి ఆలయం నుండి మృత్తికా సంగ్రహణం, అంకురార్పణ, త్రిశూల మెరవణి కార్యక్రమాలను నిర్వహించినట్లు ఆలయ ఈవో మంజుల తెలిపారు. ఈ కళ్యాణోత్సవంలో ముఖ్య అతిథులుగా జిల్లా ఐదో అదనపు జడ్జి తిరుమలరావు సతీసమేతంగా అర్బన్ సీ ఐ మహేశ్వర్‌రెడ్డి సతీసమేతంగా కళ్యాణం ఉభయదాతలు జయశంకర్ సతీసమేతంగా పాల్గొన్నారు. ఈ ఉత్సవాలను జిల్లా బీసీ సంక్షేమాధికారి ఈశ్వరయ్య పర్యవేక్షించారు.

ప్రభుత్వ సంక్షేమ ఫలాలు
అర్హులందరికీ అందాలి
సుండుపల్లె, ఫిబ్రవరి 23: ప్రభుత్వ సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్కరికీ అందేలా చర్యలు తీసుకుంటామని రాజంపేట శాసనసభ్యులు, విప్ మేడా మల్లిఖార్జునరెడ్డి తెలిపారు. మండల వ్యాప్తంగా ఉన్న అర్హులైన నిరుపేదలకు పింఛన్ అందేలా స్థానిక అధికారులు చొరవతీసుకోవాలని సూచించారు. సంక్షేమ పథకాలు ప్రజలకు చేరడమే లక్ష్యంగా పాలన సాగుతోందన్నారు. అనంతరం అర్హులైన చింతలయ్యగారిపల్లెవాసులు ఇచ్చిన పింఛన్ కొరకు వినతిపత్రాలు స్వీకరించారు. అనంతరం ప్రాథమిక పాఠశాలను తనిఖీచేసి విద్యార్థులకు పలు ప్రశ్నలు వేశారు. ప్రధానోపాధ్యాయుడు నాగరాజనాయక్ పాఠశాల శిథిలావస్థకు చేరుకునేలా ఉందని కొత్త భవనం మంజూరు చేయాలని కోరారు. అనంతరం పాఠశాలకు కావాల్సిన ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. టీడీపీ ప్రభుత్వం విద్యార్థుల అభ్యున్నతి కోసం కావాల్సిన అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తుందని నిర్లక్ష్యం చేయకుండా విద్యను అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు రాజకుమార్‌రాజు, మండల టీడీపీ నాయకులు చప్పిడి మహేష్‌నాయుడు, శివారెడ్డి, ఎంపీటీసీ మోహన్‌బాబునాయుడు, శివరామనాయుడు, చంద్రశేఖర్‌రాజు తదితరులు పాల్గొన్నారు.
స్క్వాడ్ క్రియాశీలకంగా వ్యవహరించాలి
* ఆర్డీవో కె.వినాయకం
జమ్మలమడుగు, ఫిబ్రవరి 23: ఎమ్మెల్సీ ఎన్నికల్లో నియమించిన స్క్వాడ్ బృందం క్రియాశీలకంగా పనిచేయాలని ఆర్డీవో కె.వినాయకం పేర్కొన్నారు. స్థానిక ఆర్డీవో కార్యాలయ సభాభవనంలో గురువారం ఎన్నికల కోసం నియమించిన స్క్వాడ్ బృందానికి విధులపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో అధికారులకు ఎన్నికలు పూర్తయ్యేవరకు వారు నిర్వహించాల్సిన విధులు, బాధ్యతల గురించి వివరించారు. డివిజన్ పరిధిలో ఎమ్మెల్సీ ఎన్నికల కోసం జిల్లాలోని 106 పోలింగ్ కేంద్రాలకు గాను డివిజన్ పరిధిలో 69 పట్ట్భద్రులకు, ఉపాధ్యాయులకు 52కు గాను 37 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఎన్నికల నియమావళి ఎక్కడ ఉల్లంఘన జరుగకుండా ఏర్పాటు చేసిన అధికారులు విధులు నిర్వర్తించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల స్క్వాడ్ బృందం, అధికారులు పాల్గొన్నారు.

మహాశివరాత్రికి భారీ ఏర్పాట్లు
రాజంపేట, ఫిబ్రవరి 23: రాజంపేట డివిజన్ శైవక్షేత్రాలకు ప్రసిద్ది చెందింది. 11వ శతాబ్దంనాటి శివాలయాల్లో నేటికి నిత్యపూజలు ఘనంగా జరుగుతున్నాయి. చెయ్యేరు నది పరివాహక ప్రాంతమంతా శివాలయాలతో నిండి ఉన్నాయి. పురాతన శివాలయాలకే కాకుండా చారిత్రాత్మక చరిత్ర కలిగిన శివాలయాలకు డివిజన్ ప్రసిద్ధిచెంది ఉంది. పరశురాముని మాతృహత్యా పాతకాన్ని రూపుమాపిన క్షేత్రంగా అత్తిరాల ఇతిహాసాల్లో చెప్పబడుతుంది. ఈ క్షేత్రం శివవిష్ణువులకు సాంకేతికంగా బౌద్ద క్షేత్రంగాను ప్రసిద్ధి గాంచింది. పట్టణానికి 6 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం దక్షిణకాశీగా విరాజిల్లుతుంది. ఇక్కడి బాహుదానదిలో స్నానమాచరించిన వెంటనే పరశురాముని మాతృహత్యా పాతకం రూపుమాపబడినట్టు చరిత్ర చెప్పబడుతుంది. ఈ అత్తిరాల శైవక్షేత్రంలో శివరాత్రి మహోత్సవాల్లో సుమారు 2 లక్షలు పైగా భక్తులు ఇక్కడి త్రేతేశ్వరస్వామిని దర్శించుకొని పూజలు నిర్వహించుకోవడం ఆనవాయితి. శ్రీ వేంకటేశ్వరుని ప్రియభక్తుడైన అన్నమాచార్యుని జన్మస్థలమైన తాళ్లపాకలో 11వ శతాబ్దంలో చోళుల కాలంలో నిర్మించబడినట్టు చెప్పబడుతున్న శ్రీ సిద్దేశ్వరస్వామి ఆలయం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధీనంలో నిత్యపూజలందుకుంటుంది. చిట్వేలి-నెల్లూరు రహదారికి 4 కిలోమీటర్ల దూరంలో అటవీప్రాంతంలో గుండాలకోన క్షేత్రంలో కర్కటేశ్వరస్వామిగా సంవత్సరానికి ఉత్తరాయణం, దక్షిణాయణ కాలం అనగా కార్తీక మాసం, మాఘమాసంలలో ప్రత్యేకంగా ఘనంగా భక్తులు స్వామిని కొలిచి సంతానంను, వారివారి కోరికలుతీర్చే దేవుడిగా భక్తులపాలిట కొంగుబంగారంగా వెలుగొందుతున్నారు. ఇక్కడి క్షేత్రంలో మహాశివుడు ఎండ్రకాయ రూపంలో భక్తులకు దర్శనమిస్తుంటారు. శివరాత్రి సందర్భంగా అటవీ ప్రాంతంలోని ఈ క్షేత్రానికి వేల సంఖ్యలో భక్తుల తరలిరావడం ఆనవాయితీ. ఇక్కడున్న అతిపెద్ద జలపాతం కూడా భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది. రాజంపేట మండలం మదనగోపాలపురంలో శ్రీ పంచముఖేశ్వరస్వామి ఆలయం అత్యంత ప్రాశస్యం పొంది ఉంది. పాలేశ్వరం, కనే్నశ్వరం పేరిట రాజంపేట మండలం మందపల్లె గ్రామంలో మహాశివుడి ఆలయాలు చెయ్యేరు నది ఒడ్డున పూజలందుకుంటున్నాయి. ఇక్కడ కార్తీక, మాఘమాసాల్లో భక్తులు విశేషంగా స్వామిని సేవించి వారి మొక్కుల్లు తీర్చుకుంటుంటారు. గుండ్లూరులోని అగస్తేశ్వరస్వామి ఆలయంలో కార్తీకమాసంలో బుగ్గ విశేషంగా వచ్చును. ఊటుకూరు గ్రామంలో మట్లి వెంకటరామరాజు వారి కాలంలో నాగలింగేశ్వరస్వామిని ఆగస్తేశ్వర ప్రతిష్టగా ఆలయ అభివృద్ధికి కొంత ధనవస్తు రూపేణా సహాయం చేసినట్టుగా చెప్పబడుతుంది. ఈ ఆలయంలో భక్తకన్నప్ప ప్రత్యేక పూజలు నిర్వహించినట్టుగా చెపుతారు. ఈ ఆలయంలో భక్తకన్నప్ప విగ్రహాన్ని భక్తులు ఏర్పాటు చేసి పూజలు నిర్వహిస్తూ వస్తున్నారు. రాజంపేట నడిబొడ్డున శ్రీ పర్వతవర్ధినిదేవి సమేత శ్రీ రామలింగేశ్వరస్వామి ఆలయంలో ప్రతి నిత్యం భక్తులు విశేషంగా వచ్చి స్వామిని దర్శించి వారి వారి కోరికలను నెరవేర్చుకునే కొంగుబంగారంగా చెప్పబడుతుంది.అయితే కన్నప్ప జన్మస్థలంకు సంబంధించి రకరకాల కథలు కూడా ప్రచారంలో ఉన్నాయి.
చక్రాయపేటలో...
చక్రాయపేట: చక్రాయపేటలో వెలిసిన వెంకటేశ్వర, వీరభద్రస్వామి దేవాలయాల ఆవరణంలో నేడు మహాశివరాత్రి పురష్కరించుకొని భారీఎత్తున ఏర్పాట్లు చేయనున్నట్లు దేవస్థాన కమిటీ సభ్యులు పేర్కొన్నారు. సుమారు 700 సంవత్సరాల చరిత్ర కలిగిన శిథిలావస్థలో ఉన్న దేవాలయాలను తొలగించి ప్రభుత్వం సర్వసేవ నిధుల నుండి మరియు దాతల సహకారంతో సుమారు కోటి రూపాయలతో నిర్మించిన వెంకటేశ్వర, వీరభద్రస్వాముల దేవాలయాలను పునరుద్ధరించి, టూరిజం డిపార్టుమెంట్ వారిచే కోటి రూపాయలు వెచ్చించి కళ్యాణ మండపం నిర్మించి 2006 సంవత్సరం నుండి దేవస్థానం నందు ఆలయాభివృద్ధి మీద పూజా కార్యక్రమంలో భాగంగా శివరాత్రిని పురష్కరించుకొని అంగరంగ వైభవంగా ఉత్సవాలను నిర్వహించాలని ఆలయ కమిటీ సభ్యులు కంకణం కట్టుకున్నారు. ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు ముత్యాల తలంబ్రాలతో శివపార్వతుల కమనీయ కళ్యాణోత్సవం మేళతాళాలతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు. అన్నదానం ఉదయం 10 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఎడతెరిపి లేకుండా వచ్చిన భక్తాదుల కొరకు అన్నదాన కార్యక్రమం చేపట్టడంతో పాటు పాయసం దాత నందిమండలం సతీష్‌రెడ్డి ఏర్పాటు చేసినట్లు కమిటీ సభ్యులు తెలిపారు. అలాగే 15 వేల ప్లేట్లు, 15 వేల గ్లాసులు ఉషారాణి నర్సింగ్ హోం నుండి డాక్టర్ మల్లిఖార్జున, డాక్టర్ ఉషారాణిలు పంపినట్లు పేర్కొన్నారు. ఎద్దుల పోటీలు నిర్వహిస్తున్నట్లు దేవస్థాన కమిటీ తెలిపారు. బాత్‌రూం టైల్స్ కొరకు గంగిరెడ్డి వితరణ చేసినట్లు తెలిపారు. దేవుని ప్రసాదాల కొరకు శ్రీకాంత్‌రెడ్డి, బండ్రెడ్డి సత్యారెడ్డి, కశిరెడ్డి యోగాంజులరెడ్డిలు ఏర్పాటు చేశారు. శేషారెడ్డి శెనిగలతో పాటు అల్పాహారం కొరకు హేమాద్రిరెడ్డి, యర్రగుడి గ్రామానికి చెందిన ప్రతాప్‌రెడ్డి, రామమోహన్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, గఫూర్ వేరుశనగ, కందిపప్పు వితరణ చేశారన్నారు. వీరభద్రస్వామి నామాల దాత వేంపల్లె మండలానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఉదయ్‌దీపక్‌రెడ్డి, వీరభద్ర పాదాల దాత కడప పట్టణానికి చెందిన ప్రసన్నకుమారి, చక్రాయపేటకు చెందిన ఈశ్వరయ్య కళ్యాణకర్త ఏర్పాటు చేసినట్లు, అలాగే అన్నదానానికి సహకరించిన పలు గ్రామాల రైతులు, ప్రజలకు ప్రత్యేక వందనాలు తెలియజేశారు.
పులివెందులలో...
పులివెందుల: పులివెందుల పట్టణ పరిధిలోని నామాలగుండు, గుండాలయ్యకోన, పంచలింగాల కోన, పులివెందుల శివాలయం మహాశివరాత్రి సందర్భంగా ముస్తాబయ్యాయి. అలాగే ఆర్టీసీ వారు కూడా ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు అన్ని చర్యలు చేపట్టారు.
ప్రొద్దుటూరులో...
ప్రొద్దుటూరు టౌన్: నేడు శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని పట్టణంలో వెలసిన శైవ క్షేత్రాల్లో ఆయా ఆలయాల కమిటీ సభ్యులు, కార్యనిర్వహణాధికారుల ఆద్వర్యంలో భక్తుల రాకను దృష్టిలో వుంచుకొని ఏర్పాట్లను పూర్తిచేశారు. స్థానిక అగస్త్యేశ్వరాలయం (శివాలయం)లో చలువపందిళ్లు వేయడంతోపాటు బారీకేడ్ల నిర్మాణం, తాగునీటి సౌకర్యం, అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటుచేశారు. అలాగే రామేశ్వరంలో వెలసిన శ్రీ ముక్తిరామలింగేశ్వరాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాల నిర్వహణకు, భక్తుల దర్శనార్థం ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లుచేయడం జరిగింది. పెన్నానదీ తీరాన వెలసిన శ్రీ అమృతేశ్వరాలయంలో కూడా శివరాత్రికి భక్తులు పెద్ద ఎత్తున రానుండగా దర్శనార్థం అన్ని వసతులు కల్పించారు. అలాగే శుక్రవారం వేకువజాము నుంచే స్వామివార్లకు వేదపండితుల ఆద్వర్యంలో వైభవోపేతంగా పూజా కార్యక్రమాలు, అర్చనలు, అభిషేకాలతోపాటు హోమాలు కూడా వుంటాయని నిర్వాహకులు పేర్కొన్నారు.
శివపార్వతుల కల్యాణం వీక్షించండి
మహాశివరాత్రి సందర్భంగా స్థానిక అగస్త్యేశ్వరస్వామి వారి దేవస్థానంలో శివపార్వతుల కళ్యాణం వీక్షించాలని ఆలయ ఈవో రామచంద్రాచార్యులు తెలిపారు. నేటి ఉదయం 4.30 గంటలకు రుద్రాభిషేకంతో మొదలై హరికథా కాలక్షేపంతో జాగారం ముగుస్తుందన్నారు. రాత్రి 7 గంటలకు శివపార్వతుల వారి గ్రామోత్సవం, 6 గంటలకు రుద్రహోమం, రాత్రి 10 గంటలకు శ్రీరమ్యశ్రీ భాగవతారిణిచే హరికథా కాలక్షేపం జరుగుతునని తెలిపారు. ప్రతి నెలా పౌర్ణమి రోజున ఉదయం 8 గంటల నుండి చండీహోమం కూడా జరుగుతాయన్నారు. భక్తులుపాల్గొని భగవంతుని కృపకు పాత్రులు కావాలని కోరారు.
కడపలో...
కడప(కల్చరల్): శివ శివ శంకర-్భక్తవ శంకర..శంభోహర హర- నమోనమో..అంటూ శివరాత్రి పర్వదినాన దేశం అంతటా శివనామ సంకీర్తనతో హోరెత్తుతుంది. శివక్షేత్రాలన్నీ భక్తజన సందోహంతో కిటకిటలాడతాయి..తమ కష్టాల బారినుంచి కాపాడమనీ, తాము కోరుకునే కోర్కెలను తీర్చమనీ భక్తులు, ఆ భక్తవ శంకరుడు శివుని భక్తిశ్రద్ధలతో ప్రార్థిస్తారు. పురణాలలోని దేవుళ్లలో శివుడికి లయ కారకుడిగా ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. కోరిన మాత్రానే అనుగ్రహించి అడిగిన వారికి లేదనక వరాలిచ్చే భోళాశంకరుడుగా, ఆగ్రహిస్తే తన మూడవ కన్ను తెరిచి ప్రపంచానే్న క్షణాలలో భస్మీపటలం చేయగల రుద్రమూర్తిగా ఆ ఆదిశంకరునికి పేరుంది...
అద్భుతం శివలింగోద్భవ ఘట్టం.
పురాణాలలో శివుని ఉద్భవం గురించి అద్భుతంగా తీర్చిదిద్దారు. మాఘమాసంలో, బహుళ త్రయోదశి నాటి అర్థరాత్రి సమయాన (తెల్లవారితే చతుర్ధశి) లోకోద్భవ కారకుడైన ఆ పరమేశ్వరుని శివలింగోద్భవం జరిగిందని ‘‘శివుపురాణం’’ లోంది. ఆ ఆవిర్భావ దివ్యఘట్టాన్ని కనులారా వీక్షించేందుకు సకల దేవతలూ, భక్తిశ్రద్ధలతో అర్థరాత్రి వరకూ వేచి ఉంటారనీ, శివలింగావిర్భావం తరువాత భక్తితో శివపూజలు చేశారని చెబుతారు. ఆనాటి రాత్రే శివరాత్రి అయింది.. శివరాత్రి రోజు శివునికి ఎంతో ఇష్టమైన మారేడు దళాలతో పూజలు చేసి, రాత్రంతా శివనామ స్మరణతో నిద్రమేలుకుని జాగరణ చేస్తారు. జిల్లాలో సైతం చాలావరకూ ప్రసిద్ధి శివక్షేత్రాలన్నీ అటవీ ప్రాంతాలలోనే ఉన్నాయి. శ్రీనిత్యపూజకోన, పొలతల, భైరవకోన లాంటి పుణ్యక్షేత్రాలను దర్శించాలంటే కారడవి ప్రాంతంలో మైళ్ళకొద్దీ నడవాల్సిందే. మండించే వేసవి ఆరంభంలో వచ్చే ఈపండుగ నాడు..సాధారణంగా వేసవిలో ఎదురయ్యే నీటి యెద్దడిని తీర్చేలా వర్షాలను కరిపించి, వేసవి తాపంనుంచి ఉపశమనం కలిగించమని ఆ జంగమయ్యను, గంగవిడువు జంగమయ్యా! అంటూ భక్తితో ప్రార్థిస్తారు. అటు భుక్తికి లోటులేకుండా చూడమని ప్రార్థించి, ఇటు ముక్తికి బాటలు వేసుకుంటారు. కడప జిల్లాలో శివక్షేత్రాలకు కొదవలేదు. నిత్యపూజస్వామికోన, భైరవకోన, అత్తిరాల, పుష్పగిరి, పొలతల, కన్యతీర్థం, అగస్త్యేశ్వరాలయం, సంగమేశ్వరాలయం ఇలా చాలా క్షేత్రాలలో ఈ శివరాత్రి పర్వదినాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. కొన్ని క్షేత్రాలు మరీ అరణ్య ప్రాంతాలలో ఉన్నా, ఆలయాల నిర్వాహకులు, భక్తుల సౌకర్యార్థం సకల సదుపాయాలు కల్పిస్తారు. అన్న సంతర్పణ, వైద్య, రవాణా సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తారు. కాగా మహాశివరాత్రిని శివక్షేత్రాలలో శుక్రవారం ఘనంగా నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాటు పూర్తి చేశారు.
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని గురువారం లక్షలాది మంది భక్తులు కడప సమీపంలోని శైవక్షేత్రాలకు తరలివెళ్లారు. భక్తుల సౌకర్యార్థం కడప ఆర్టీసి వారు వందలాది బస్సులను ఏర్పాటు చేశారు. అలాగే వివిధ ప్రైవేటు వాహనాలు కూడా అధికంగా ఏర్పాటు చేశారు. గురువారం తెల్లవారు జామున నుంచే శైవక్షేత్రాలకు వెళ్ళే భక్తుల రద్దీ ఎక్కువైంది. ఆర్టీసితోపాటు ప్రైవేట్ వాహనాలన్నీ భక్తులతో నిండిపోయాయి.కడప సమీపంలోని పొలతల, నిత్యపూజకోన,కనె్నతీర్థం, అత్తిరాల, లంకమలకోన, శ్రీగుండాలకోన, నీలకంఠేశ్వరస్వామికోన, శ్రీ వెంగ గురుస్వామి ఆలయం, శ్రీగోపాలయ్యస్వామికోన, ప్రొద్దుటూరులోని శివాలయం, యాగంటి ఉమామహేశ్వరాలయం, అల్లాడుపల్లె వీరభద్రస్వామి ఆలయం, భైరవకోన, ఝరికోన, మోటకట్ల , దుర్గంకొండ, వీరభద్రస్వామి దేవాలయం తదితర శైవక్షేత్రాలకు భక్తులు తరలివెళ్లారు.

వినియోగదారుల సేవాకేంద్రం ప్రారంభం
చక్రాయపేట, ఫిబ్రవరి 23: స్థానిక మండల కేంద్రమైన చక్రాయపేటలో వినియోగదారుల సేవాకేంద్రాన్ని గురువారం తహసీల్దార్ నాగేశ్వరరావు ప్రారంభం చేశారు. ఈ వినియోగదారుల సేవా కేంద్రంలో బిజినెస్ కరస్పాండెంట్ షేక్ షఫీవుల్లా వారి ఆధ్వర్యంలో సెలవు దినాలలో సైతం లావాదేవీలు జరిగేందుకు ఈ వినియోగ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చక్రాయపేట ఎస్‌బీఐ మేనేజర్ మురళీధర్ పేర్కొన్నారు. ఇండియాలో ఉన్న అన్ని బ్యాంకుల లావాదేవీలు జరుపుకోవచ్చని ఎస్‌బీఐకి సంబంధించి ప్రతినిధులు రోజూ రూ.25 వేలు వేయడం కానీ, తీసుకోవడం కానీ చేయవచ్చని, ఇతర బ్యాంకులకు సంబంధించి రూ.15 వేలు వరకు లావాదేవీలు జరుపుకోవచ్చన్నారు. ఏది ఏమైనప్పటికీ బ్యాంకు సెలవు అయినప్పటికీ ఏటీఎంలో నగదు లేనప్పటికీ ఈ వినియోగదారుల సేవా కేంద్రం ఎంతో ఉపయోగకరమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ గోవిందరెడ్డి, సర్పంచ్ పెద్దరామయ్య, ఎస్‌బీఐ సిబ్బంది భాస్కర్, సాంబశివుడు తదితరులు పాల్గొన్నారు.
మహాశివరాత్రికి ముస్తాబైన శివాలయాలు
సంబేపల్లె, ఫిబ్రవరి 23: మాఘమాసంలో చతుర్ధశి రోజున మహాశివరాత్రిగా జరుపుకోవడం హిందువుల సాంప్రదాయం. ఈ రోజున మండలంలోని ప్రముఖ ఆలయాలైన శ్రీ శివసాయి ఆలయం, గుహేశ్వరి పశుపతినాధ ఆలయం, చిన్నజంగంపల్లె, గున్నికుంట్ల, గుట్టపల్లె గ్రామాలలోని శివాలయాలను సర్వాంగ సుందరంగా అలంకరించారు. భక్తుల దర్శనార్థం ఆలయ నిర్వాహకులు తగు ఏర్పాట్లను చేశారు. ప్రధానంగా సంబేపల్లె గుహేశ్వరి పశుపతినాధ ఆలయంలో ఉదయం అర్చనాభిషేకాలు, సాయంత్రం పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం నిర్వహించనున్నట్లు ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు జయవర్ధన్‌రాజు, అంజిరాజు తెలిపారు. కళ్యాణోత్సవం అనంతరం అన్నదాన కార్యక్రమంతో పాటు జాగరణ సందర్భంగా డ్రామాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు విరివిగా పాల్గొని భగవంతుని కృపకు పాత్రులు కావాలని వారు కోరారు.
బాలికకు ఆర్థికసాయం
గాలివీడు, ఫిబ్రవరి 23: మండలంలోని అరవీడు గ్రామం మంగళపల్లెకు చెందిన వీరనాగమ్మ కుమార్తె శ్రీలత ఇటీవల ఆటో ఢీకొన్న ప్రమాదంలో చెయ్యిని కోల్పోయి ప్రమాదబారిన పడింది. మెరుగైన వైద్యం కోసం తిరుపతిలోని కార్పొరేట్ వైద్యశాలలో చికిత్స పొందుతోంది. ఈ తరుణంలో అధిక మొత్తంలో వైద్యం కోసం డబ్బులు అవసరం అవుతుండటంతో దాతలు ఆర్థికసాయాన్ని అందజేస్తున్నారు. గాలివీడు నారా లోకేష్‌సేన ఆధ్వర్యంలో రూ.14 వేలను బాలిక తల్లికి ట్రస్టు అధ్యక్షుడు రేవనూరు రాజ్‌కుమార్ అందజేశారు. అంతేకాకుండా సీ ఎం రిలీఫ్ ఫండ్ ద్వారా బాలికకు అయ్యే ఖర్చులను అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రమేష్, ఆదినారాయణ పాల్గొన్నారు.
ఓదివీడులో నేడు టీటీడీ పూజలు
వీరబల్లి, ఫిబ్రవరి 23: శివరాత్రి పర్వదినం సందర్భంగా మండలంలోని ఓదివీడు శివాలయంలో టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్తు జిల్లా ప్రోగ్రాం నిర్వాహకులు హరినాథ్‌చే కుంకుమపూజ, గోపూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ ఛైర్మన్ గంగులు, కార్యదర్శి సిద్ధిరాజు, కోశాధికారి రాచరాయుడులు తెలిపారు.
కన్నుల పండువగా సూర్యప్రభ వాహన సేవలు
రాజంపేట, ఫిబ్రవరి 23:రాజంపేట మండలంలో శైవక్షేత్రం అత్తిరాల శ్రీ త్రేతేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం శ్రీ కామాక్షి సమేత శ్రీ త్రేతేశ్వరస్వామి సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయంలో జరుగుతున్న వేడుకల్లో ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఏర్పాట్లు చేసినట్టు ఆలయ ఇ.ఓ.శ్రీనివాసులు తెలిపారు. కాగా రాత్రి చంద్రప్రభ వాహనంపై దేవీ సమేతుడై స్వామివారు భక్తులకు దర్శనమివ్వడం జరిగింది
నేడు అత్తిరాలలో మహాశివరాత్రి వేడుకలు
పరశురాముని మాతృహత్యా పాతకాన్ని రూపుమాపిన అత్తిరాల శ్రీ త్రేతేశ్వరస్వామి ఆలయంలో తెల్లవారుజాము నుండి అర్ధరాత్రి పైబడి కూడా ప్రత్యేక ఉత్సవ వేడుకలు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. ఉదయం మహాశివరాత్రి వేడుకల్లో భాగంగా ఆలయంలో పంచామృతాభిషేకాలతో పాటు కపాలేశ్వర ఉత్సవం, రాత్రి లింగార్చన, రాత్రి 10 గంటలకు శిఖర దీపారాధన, రాత్రి 12 గంటలకు లింగోధరణ, రాత్రి ఒంటి గంటకు నంది ఉత్సవ వేడుకలకు ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక బాణాసంచా వేడుకలను కూడా ఈ సందర్భంగా ఆలయంలో ఏర్పాటు చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు కూడా అత్తిరాలలో భక్తుల కోసం ఏర్పాటు చేశారు. అత్తిరాల శైవక్షేత్రానికి గురువారం నుండే ప్రత్యేక బస్సులరాకపోకలు మొదలయ్యాయి.
శివాలయంలో ఉత్సవ ఏర్పాట్లు పూర్తి
రైల్వేకోడూరు, ఫిబ్రవరి 23:మహాశివరాత్రి సందర్భంగా శుక్రవారం స్థానిక శివాలయంలో భక్తులకు ఏర్పాటు పూర్తి చేశామని ఆలయ కమిటీ అధ్యక్షులు మందల ప్రవీణ్‌కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా శివ, పార్వతుల కల్యాణోత్సవాన్ని నిర్వహించనున్నట్లు చెప్పారు. కోడూరు సర్కిల్ పరిధిలోని వివిధ శివక్షేత్రాలలో భక్తులకు రక్షణగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని సిఐ యుగంధర్‌నాయుడు తెలిపారు. ఎస్సైలు, సిబ్బంది సహకారంతో శివక్షేత్రాలలో చోరీలు జరగకుండా అప్రమత్తంగా ఉండేందుకు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు.
మైనర్ బాలిక పెళ్లిని అడ్డుకొన్న ఐసిడిఎస్, పోలీసులు
నందలూరు, ఫిబ్రవరి 23: మండలంలోని ఎర్రిపాపాయపల్లెలో గురువారం మైనర్‌బాలిక వివాహ సంఘటనను ఐసిడిఎస్ సూపర్‌వైజర్ సరోజినీదేవి పోలీసుల సహకారంతో అడ్డుకున్నారు. వివరాలిలావున్నాయి. పసుపులేటి వెంకటయ్య తన కుమార్తె అనిత మైనర్‌బాలిక కావడంతో శుక్రవారం పెళ్లి చేస్తున్నారనే విషయాన్ని స్థానికుల ఫిర్యాదు మేరకు కడప నుండి ఐసిడిఎస్ అధికారిణి స్థానిక సూపర్‌వైజర్‌కు తెలపడంతో పోలీసులతో గ్రామానికెళ్లి చిన్నవయస్సులో పెళ్లి చట్టరీత్యా నేరమని సర్దిజెప్పి వివాహన్ని నిలిపేశారు.
సుంకన్నమృతి కార్మిక లోకానికి తీరని లోటు
రాజంపేట టౌన్, ఫిబ్రవరి 23: భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి.సుంకన్న మృతి కార్మికలోకానికి తీరనిలోటుయని ఎఐటియుసి జిల్లా అధ్యక్షులు కాటంశెట్టి వెంకటయ్య, ఏరియా అధ్యక్షులు ఎంఎస్ రాయుడు అన్నారు. గురువారం స్థానిక ఎఐటియుసి కార్యాలయంలో సుంకన్న చిత్రపటానికి పూలమాలలేసి, ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కర్నూల్ జిల్లా కార్యదర్శిగా, రాష్ట్ర సంఘ అధ్యక్షులుగా, జాతీయ ఉపాధ్యక్షులుగా సుంకన్న కార్మికులకు చేసిన సేవలను కొనియాడారు. ఈ సమావేశంలో సిపిఐ ఏరియా కార్యదర్శి పి.మహేష్, సంఘ నాయకులు పి.సుబ్రమణ్యం, కె.ఈశ్వరయ్య, జయన్న, అత్తర్‌బాషా, దర్భార్, కె.వెంగల్‌రెడ్డి, ఎస్‌కె ఖాసీం తదితరులు పాల్గొన్నారు.
శివరాత్రికి ప్రత్యేక బస్సులు
ప్రొద్దుటూరు రూరల్, ఫిబ్రవరి 23: శివరాత్రి పర్వదినాన్ని పురష్కరించుకొని ప్రొద్దుటూరు నుండి అల్లాడుపల్లెకు 15 బస్సు సర్వీసులు, కన్యతీర్థానికి 9 బస్సు సర్వీసులను నడపనున్నట్లు ప్రొద్దుటూరు ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీహరి తెలిపారు. నేటి ఉదయం 8 గంటల నుండి మైదుకూరు రోడ్డులోని అన్వర్ థియేటర్ నుండి ఈ బస్సులు అందుబాటులో ఉంటాయని, పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తమ సిబ్బంది అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఈ సర్వీసులలో ప్రత్యేక ఛార్జీలను వసూలు చేయనున్నట్లు తెలిపారు.