కడప

శివనామస్మరణతో మారుమ్రోగిన శైవక్షేత్రాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,్ఫబ్రవరి 24: శైవ భక్తులకు పవిత్రమైన మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా అంతటా శైవక్షేత్రాలు శివనామస్మరణతో మారుమ్రోగాయి. అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాల్లో భక్తులు శివునికి విశేషపూజలు అందించారు. ముఖ్యంగా పెండ్లిమర్రి మండలం పొలతల మల్లికార్జునస్వామి దేవస్థానం, సిద్దవటం మండలం శ్రీనిత్యపూజయ్యస్వామి దేవస్థానం, రాజంపేట సమీపంలోని అత్తిరాల శివక్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. మహామహిమ గల ఆయా దేవాలయాల్లో ప్రతి ఏడాది శివరాత్రికి నిర్వాహకులు భక్తులకోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏడాది కూడా పొలతల మల్లికార్జునస్వామిని వేలాది మంది భక్తులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి దర్శించుకున్నారు. అలాగే నిత్యపూజయ్యస్వామికోన, అత్తిరాల ప్రాంతాల్లో కూడా భక్తులు జిల్లా, ఇతర జిల్లాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చి పరమశివుడిని దర్శించుకోవడం విశేషం. ఈ ప్రాంతాల్లో భక్తులకోసం దేవాదాయ ధర్మాదాయశాఖ అధికారులు భక్తులకు ఇబ్బంది లేకుండా తగు చర్యలు తీసుకున్నారు. ఆర్టీసీ యాజమాన్యం ప్రధాన క్షేత్రాలకు బస్సు సౌకర్యాన్ని కల్పించడంతో భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. అలాగే ఎస్పీ పిహెచ్‌డి రామకృష్ణ ఆదేశాల మేరకు జిల్లా పోలీసులు ఆయా ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు చోటుచేసుకోకుండా సిసి కెమెరాలు ఏర్పాటు చేశారు. పొలతల మల్లికార్జునస్వామిని శుక్రవారం కలెక్టర్ కెవి సత్యనారాయణ దంపతులు ప్రత్యేక పూజలుచేసి దర్శించుకున్నారు. అలాగే ఉదయం 10గంటలకు నిర్వహించిన శివపార్వతుల కల్యాణానికి కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి, కలెక్టర్ దంపతులు పాల్గొని కల్యాణాన్ని తిలకించారు. అలాగే నిత్యపూజయ్యకోన, అత్తిరాల తదితర ప్రాంతాల్లో కూడా రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు ఆయా దేవస్థానాల్లో భక్తులకు ఇబ్బందిలేకుండా తగు చర్యలు తీసుకోవడంతో ఎలాంటి సమస్యలు లేకుండా ప్రశాంత వాతావరణంతో పరమ శివుడిని దర్శించుకోవడం విశేషం. జిల్లాలోని సంబేపల్లె మండలం మోటకట్ల శివాలయం , రామాపురం మండలం హసనాపురం శివాలయం, ప్రొద్దుటూరు అగస్త్యేశ్వర స్వామిదేవస్థానం, చాపాడు మండలం అల్లాడుపల్లె దేవస్థానం, వీరపునాయునిపల్లె మండలం సంగమేశ్వరదేవస్థానం, వేముల మండలం మోపూరు సంగమేశ్వరాలయం, సింహాద్రిపురం మండలం భైరవకోన తదితర ప్రాంతాల్లో కూడా వెలసిన శివక్షేత్రాలకు భక్తులు తరలివెళ్లి దర్శించుకున్నారు. అన్ని శైవక్షేత్రాల్లో శివపార్వతుల కల్యాణం వైభవంగా నిర్వహించగా అత్తిరాల శైవక్షేత్రంలో మాత్రం శనివారం శివపార్వతుల కల్యాణం నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.

తిరుణాలల్లో ఎన్నికల ప్రచారం!

కడప,్ఫబ్రవరి 24:వచ్చేనెలలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలను పురస్కరించుకుని గ్రాడ్యుయేట్స్, ఉపాధ్యాయ, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థులు మహాశివరాత్రి పురస్కరించుకుని శుక్రవారం జాతర, తిరుణాలల్లో జోరుగా ప్రచారం నిర్వహిస్తూ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సంబంధిత స్థానిక సంస్థల్లో ఓటు హక్కు కలిగిన నేతలను వైకాపా, టిడిపిలు ఇంచుమించు అందర్నీ శిబిరాలకు తరలించారు. కొంతమంది శివరాత్రి సందర్భంగా తమ స్వగ్రామాలకు వెళ్లాలని మొండిచేయగా సంబంధిత పార్టీలకు చెందిన అగ్రనేతలు పర్యవేక్షణలో షాడో పార్టీలను పెట్టి స్థానికంగా రాజకీయ పరపతి కలిగిన నేతలను మాత్రమే పండుగులకు ఇళ్లకు పంపారు. దీంతో ఇరుపార్టీలకు చెందిన నేతలు ఎటుతిరిగి తమకు ఓటు వేయించుకునేందుకు ఇళ్లకు వచ్చిన ఓటర్లకు నయానో భయానో తరహాలో వత్తిడి చేస్తూ ఓటుకు నోటు రేటు కూడా పెంచి సంబంధిత కుటుంబాల సభ్యులను ఇరుపార్టీ నేతలు వత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. అధికారపార్టీ నేతలు తమకున్న పరపతి ద్వారా వైసిపి ఓటర్లకు గాళం వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇరుపార్టీల శిబిరాలకు చెందిన ఎస్సీ,ఎస్టీ,బిసి ఓటర్లను శిబిరాల్లో ఉంచి వారి కుటుంబ సభ్యులను శిబిరాల్లోకి తీసుకొచ్చి శివరాత్రి వేడుకలు శిబిరాల్లోనే జరుపుకుంటున్నట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ప్రతి ఓటు విలువైంది కావడంతో అధికార టిడిపి నేతలు సర్వశక్తులు వడ్డుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అధికార టిడిపికి తక్కువ ఓట్లు ఉండటంతో ఎంపిటిసి, జడ్పిటిసిలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లకు బాగా డిమాండ్ పెరిగింది. వైసిపి అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఆపార్టీ అభ్యర్థి జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి, వైసిపి ఎంపిలు కడప, రాజంపేట వైఎస్ అవినాష్‌రెడ్డి, పివి మిథున్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎ.అమరనాథరెడ్డి, వైసిపి ఎమ్మెల్యేలు జి.శ్రీకాంత్‌రెడ్డి, కె.శ్రీనివాసులు, ఎస్.రఘురామిరెడ్డి, రాచమల్లు వెంకటశివప్రసాద్‌రెడ్డి, ఎస్‌బి అంజద్‌బాషా, పి.రవీంద్రనాథరెడ్డి, సంబంధిత ప్రాంతాలకు సంబంధించిన స్థానిక ప్రజాప్రతినిధి ఓటర్లను సంబంధిత శిబిరాల్లో వారికి కావాల్సిన అన్ని సౌకర్యాలు ఏర్పాటుచేసి వారు వైసిపి శిబిరాల నుంచి అధికారపార్టీ నేతల శిబిరాలకు మొగ్గుచూపకుండా చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక టిడిపి జిల్లా అధ్యక్షుడు ఆర్.శ్రీనివాసరెడ్డి (వాసు) , రాజ్యసభ సభ్యులు సిఎం రమేష్‌నాయుడు, విప్ మేడా వెంకటమల్లికార్జునరెడ్డి, ఎమ్మెల్యేలు టి.జయరాములు, సి.ఆదినారాయణరెడ్డిలతోపాటు ఆయా నియోజకవర్గాల టిడిపి ఇన్‌చార్జిలు తమకు అందుబాటులో ఉంటున్న స్థానిక ప్రజాప్రతినిధుల ఓటర్లను శిబిరాల్లోకి తరలించారు. అధికారికంగా అన్ని విధాల చేదోడు వాదోడుగా ఉంటామని వైసిపి ఓటర్లకు అన్ని విధాల హామీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వైసిపి నుంచి టిడిపిలోకి వలసవచ్చిన ప్రజాప్రతినిధులను బుజ్జగించడంలో అధికారపార్టీ నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇరుపార్టీల నేతలు మరో 15రోజులపాటు ఓటర్లను కాపాడుకునే దిశగా ఓటర్ల గొంతెమ్మకోర్కెలు తీరుస్తూ మంచినీరు తరహాలో డబ్బులు ఖర్చు చేస్తూ ఓటుకు ఒక రేటు నిర్ణయించి నోట్లను పంపిణీ కార్యక్రమం కూడా పూర్తిచేశారు. దాదాపు మూడు ఏళ్లుగా ఎటువంటి ఆదాయం లేని ఓటర్లు ఇదే మంచి అదునుగా భావించి నేతల నుంచి దొరికిన కాడికి దోపిడీ చేస్తున్నారు. మొత్తం మీద శివరాత్రి పర్యదినం రోజు కూడా ఓటర్లకు కునుకులేకుండా ఎమ్మెల్సీ అభ్యర్థులు, టిడిపి, వైసిపిల అగ్రనేతలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు.

వైభవంగా శివపార్వతుల
కల్యాణోత్సవం

చక్రాయపేట, ఫిబ్రవరి 24: మహాశివరాత్రి పురష్కరించుకొని శుక్రవారం చక్రాయపేట, గండికొవ్వూరు, దేవరగుట్టపల్లె గ్రామాల్లో శివనామాలతో శివపార్వతులకు కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. తెల్లవారుజామున 5 గంటల నుండి మహారుద్రాభిషేకం అలంకరణ కుంకుమార్చన, పూలాభిషేక, దూపదీప నైవేద్యాలతో పురోహితులు జగన్నాధశాస్ర్తీ, అనంతపద్మనాభశర్మలు శ్రీ వేంకటేశ్వర, శ్రీ వీరభద్రస్వాములకు ప్రత్యేక అలంకరణలు చేశారు. అనంతరం 9 గంటల నుండి 11 గంటల వరకు ముత్యాల తలంబ్రాలతో శివపార్వతులకు దేవస్థాన కమిటీ సభ్యులు వేంపల్లె చైతన్య స్కూల్ కరెస్పాండెంట్ చక్రపాణిరెడ్డి, అడ్వకేట్ రామాంజనేయరెడ్డి, కర్నాటి హరినాధరెడ్డి, ఇందుకూరి శ్రీనివాసులు, పట్టెం శ్రీరామమూర్తి, రంగారెడ్డి, కొవ్వూరి మనోహర్, ఉపాధ్యాయుడు నరసింహులు, విశ్రాంత ఉపాధ్యాయుడు బాలనారాయణలచే కళ్యాణోత్సవం నిర్వహించారు. అనంతరం కొండప్పగారిపల్లె, గంగారపువాండ్లపల్లె, వేంపల్లె మహిళా భజన బృందంచే భక్తిగీతాలు, యార్లవాండ్లపల్లె, మహదేవపల్లె గ్రామాల చెక్క్భజనలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం రాత్రి 9 గంటలకు వేంపల్లె చైతన్య స్కూల్ నుండి విద్యార్థినీ విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం హరికథా కార్యక్రమాన్ని నిర్వహించారు. వేలాది మంది భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అదే విధంగా గండికొవ్వూరు లో మండలాధ్యక్షురాలు మోపూరి మునికుమారి భర్త కీ.శే.మోపూరి సుబ్బిరెడ్డి జ్ఞాపకార్థం వారి కుమారుడు అశోక్‌కుమార్‌రెడ్డి, గండికొవ్వూరు గంగమ్మతల్లి జరిగిన ఎద్దుల పోటీలలో మొదటి బహుమతిగా రూ.5 వేలు వితరణ చేసినట్లు తెలిపారు. అదే విధంగా రెండో బహుమతి ఉపాధ్యాయుడు భాస్కర్‌రెడ్డి రూ.3 వేలు వితరణ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తులసిరెడ్డి, వేంపల్లె సర్పంచ్ విష్ణువర్ధన్‌రెడ్డి, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు కె.రామచంద్రారెడ్డి, వేముల పార్థసారథిరెడ్డి, మాజీ మండలాధ్యక్షుడు బెల్లం క్రిష్ణారెడ్డి పాల్గొన్నారు.

గజవాహనంపై ఊరేగిన వీరభద్రుడు

రాయచోటి, ఫిబ్రవరి 24: స్థానిక భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు గజవాహనంలో ఊరేగారు. ఈ సందర్భంగా ఆలయ వేదపండితులు రుద్రహోమము, మహాశివరాత్రి, అభిషేకములు, విమానోత్సవ కార్యక్రమాలను చూడముచ్చటగా నిర్వహించినట్లు ఆలయ ఈవో మంజుల తెలిపారు. అంతకు మునుపు గురువారం రాత్రి అమ్మవారికి ప్రత్యేక సుమంగళి పూజ నిర్వహించి పుష్ప పల్లకీ ఉత్సవాన్ని నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి, జడ్పీ మాజీ వైస్‌ఛైర్మన్ సుగవాసి బాలసుబ్రమణ్యంలు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. వీరికి ఆలయ ఈవో మంజుల సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం గువ్వల బాలాజీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని బీసీ సంక్షేమ శాఖాధికారి ఈశ్వరయ్య పర్యవేక్షించారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. వచ్చిన భక్తాదులకు ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలను అందజేశారు.

శివనామస్మరణతో మార్మోగిన
పొలతల క్షేత్రం

పెండ్లిమర్రి,్ఫబ్రవరి 24: శేషాచల అటవీప్రాంతంలో వెలసివున్న శ్రీపొలతల పుణ్యక్షేత్రం శివరాత్రి పర్వదినంపురస్కరించుకుని శివనామస్మరణతో మారుమ్రోగింది. గురువారం రాత్రి నుంచే పొలతల క్షేత్రానికి జిల్లా నలుమూలల నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి కర్నాటక రాష్ట్రం నుంచి భక్తులు తరలివచ్చారు. శుక్రవారం వేకువజాముననే శివపార్వతులకు అర్చకులు అభిషేకాలు, కుంకుమార్చనలు, ప్రత్యేక పూజలు అనంతరం ప్రత్యేక అలంకారం నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించారు. ఆలయ ప్రాంగణంలో శివపార్వతుల కల్యాణం అర్చకులు విజయ భట్టార్ బృందం ఆధ్వర్యంలో అంగరంగవైభవంగా నిర్వహించారు. ఈ కల్యాణాన్ని తిలకించేందుకు కలెక్టర్ కెవి సత్యనారాయణ దంపతులు, ఎమ్మెల్యే పి.రవీంద్రనాథరెడ్డి దంపతులు హాజరయ్యారు. తొలుత స్వామివారిని వారు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి కల్యాణంలో పాల్గొన్నారు. కల్యాణం తిలకించేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఉదయం నుంచి స్వామివారిని దర్శించుకునేందుకు దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు బారులు తీరి స్వామి, అమ్మవార్లను దర్శించుకుని పూజలు చేశారు. పొలతల క్షేత్రంమంతా లక్షలాది మంది భక్తులతో నిండిపోయి జనసంద్రంగా మారింది. అలాగే స్వామివార్లను కమలాపురం టిడిపి ఇన్‌చార్జి పుత్తానరసింహారెడ్డి, జిల్లా మొదటి అదనపు జడ్జి శోభారాణి, మూడవ అదనపు జడ్జి శ్రీ్ధర్‌తోపాటు కడప ఆర్డీవో చిన్నరాముడు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణం వద్ద ఉన్న కోనేరులో భక్తులు స్నానాలు ఆచరించి అక్కదేవతల ఆలయం వద్ద పెద్ద ఎత్తున మహిళా భక్తులు తమ కోరికలు నెరవేరాలని, సంతానం కలగాలని వరబడ్డారు. అదేవిధంగా బండెన్నస్వామి ఆలయం వద్ద భక్తులు ప్రత్యేక పూజలు చేసి తమ మొక్కుబడులు తీర్చుకున్నారు. పీడపిశాచాలు ఉన్న మహిళలకు పూజారులు పూజలు చేసి మంత్రించారు. అక్కదేవతలకు సంప్రదాయ బద్దంగా ముడుపులు చెల్లించుకోవడానికి డప్పువాయిద్యాలతో ఆలయ ప్రాంగణానికి చేరుకున్నారు. ఆలయ ప్రాంగణంలో మంచినీటి కొరత పూర్తిగా ఏర్పడింది. తాగేందుకు నీరు, భక్తులు స్నానాలు ఆచరించేందుకు నీరులేక బురదనీటిలోనే స్నానాలు చేస్తూ ఇబ్బందిపడ్డారు. పొలతల క్షేత్రానికి వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా డిఎస్పీలు అశోక్‌కుమార్, నాగేశ్వరరెడ్డిల ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు, సిసి కెమెరాలు అమర్చి ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. రాత్రి స్వామివారి ఊరేగింపు ఘనంగా జరిగింది. కాగా ప్రతి ఏడాది పొలతల క్షేత్రానికి వచ్చిన భక్తులకు స్వామివారి కల్యాణం అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటుచేసేవారు కానీ ఈమారు అన్నదాన కార్యక్రమం ఏర్పాటుచేయకపోవడంతో భక్తులు నిరాశకు గురై నిర్వాహకులపై మండిపడ్డారు.
పొలతల క్షేత్రంలో నిర్మించివున్న శ్రీకాశిరెడ్డి నాయన ఆశ్రమంతోపాటు మొక్కుబడులు ఉన్న భక్తులు మాత్రమే భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటుచేశారు.
మహిమల క్షేత్రం పొలతల : కలెక్టర్
అటవీప్రాంతంలో వెలసివున్న శ్రీపొలతల మల్లేశ్వరస్వామి క్షేత్రం మహిమ గల క్షేత్రమని కోరుకున్న కోర్కెలు తీర్చే మల్లేశ్వరుడని ఆయన కొనియాడారు. శివరాత్రి రోజు ప్రజలు శుభిక్షంగా సంతోషంగా పండుగను జరుపుకోవాలని శివపార్వతుల ఆశీర్వాదాలు ఎల్లవేళలా ప్రజలకు ఉండేలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు. అలాగే క్షేత్రంలో ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పోలీసులు, ఆలయ అధికారులు చేసిన ఏర్పాట్లు పకడ్బందీగా ఉన్నాయని పేర్కొన్నారు. ముఖ్యంగా మహిళలకు స్నానాలు ఆచరించేందుకు గ్రీన్ టాయ్‌లెట్స్ ఏర్పాటుచేయడం, ఆలయం ప్రాంగణమంతా సిసి కెమెరాలు ఏర్పాటుచేయడం జిల్లాలో ప్రథమమన్నారు. ప్రతి ఏడాది జిల్లా ప్రాంగణమంతా సిసి కెమెరాలు మరింత ఎక్కువగా ఏర్పాటు చేస్తామని తెలిపారు.
వైభవంగా శ్రీ నాగలింగేశ్వరుని కల్యాణోత్సవం

రాజంపేట టౌన్, ఫిబ్రవరి 24:మండలంలోని ఊటుకూరులో వెలసిన శ్రీ కామాక్షి సమేత శ్రీ నాగలింగేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం మహాశివరాత్రిని పురస్కరించుకుని శివ పార్వతుల కల్యాణోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. భక్తకన్నప్ప జన్మస్థలి, అన్నమాచార్యుల అవ్వ గారి గ్రామమైన ఊటుకూరు శివాలయం అతి పురాతనమైంది కావడంతో ఈ కల్యాణోత్సవంలో భక్తులు పెద్దఎత్తున పాల్గొన్నారు. ఆలయ నిర్మాణదాత మాజీ సిఎండి కసిరెడ్డి విద్యాసాగర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆలయ పర్యవేక్షకులు నాగా ఫృధ్వీపతిరెడ్డిచే వేద పండితులు ఫణిభూషన్ మంత్రోచ్ఛరణలతో స్వామివారి కల్యాణ తంతు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంపీటీసీ రేవరాజు శ్రీనివాసరాజు దంపతులు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. గ్రామ పెద్ద పెంచల్‌రాజు భక్తాదులకు అన్నదానం నిర్వహించారు. సాయంత్రం శ్రీ కామాక్షి సమేతంగా స్వామివారు పురవీధులలో భక్తులకు గ్రామోత్సవంలో దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు బి.సుబ్బరాజు, వి.బాల, ఆర్.సతీష్, ఎం.లక్ష్మీకరరెడ్డి, సుబ్బరాజు, వెంకటరాజు, పెంచలరాజు, వెంగమరాజు, ఆర్.చిన్నపెంచలరాజు, ఎం.కృష్ణార్జునరెడ్డి, ట్రాన్స్‌కో డిఇ చంద్రశేఖర్, సబ్ రిజిస్ట్రార్ ఎం.శోభారాణి, పంచాయితీ బిల్ కలెక్టర్ జి.వెంకటయ్య పాల్గొన్నారు.
శ్రీ ఉల్లంఘేశ్వరుని
గ్రామోత్సవం
నందలూరు: శుక్రవారం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మండలంలోని పలు శివాలయాలలో భక్తుల శివనామ స్మరణలతో ఆలయాలు మార్మోగాయి. వేకువ జాము నుండే శివాలయాలకు భక్తులు భక్తిశ్రద్ధలతో చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్యంగా నందలూరులో 11 శతాబ్దంలో నిర్మితమైన అతి పురాతన ఆలయమైన శ్రీ కామాక్షి సమేత ఉల్లంఘేశ్వరస్వామి ఆలయం, పాటూరు, టంగుటూరు, చింతకాయలపల్లె, పొత్తపి, నారాయణరాజుపేట తదితర గ్రామాలలోని శివాలయాలలో భక్తులు ఉదయం నుండే స్వామివారిని సందర్శించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు భక్తాదులకు అన్నదానాలు నిర్వహించారు. ముఖ్యంగా శ్రీ ఉల్లంఘేశ్వరాలయంలో సాయంత్రం స్వామివారిని, అమ్మవారిని పురవీధులలో ప్రత్యేక వాహనంపై గ్రామోత్సవం నిర్వహించారు. మండలంలోని శివ భక్తులు అత్తిరాల, నిత్యపూజయ్యస్వామి కోన, పొలతల, తల కోన తదితర క్షేత్రాలకు భారీగా తరలి వెళ్లారు.
రైల్వేకోడూరులో...
రైల్వేకోడూరు: శుక్రవారం మహాశివరాత్రి సందర్భంగా కోడూరు ప్రాంతంలోని శివాలయాన్ని భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారు జాము నుంచే భక్తులు శివపార్వతులను దర్శించేందుకు క్యూ కట్టారు. గుండాలకోన, ఎండ్రకాయ గుండాల కోన, ఎన్వీఎస్ గిరిజన కాలనీ, కోడూరు, రాఘవరాజుపురం, ఎస్.కొత్తపల్లె, తూర్పుపల్లె తదితర ప్రాంతాలలోని శివాలయాలకు భక్తులు పోటెత్తారు. మహాశివరాత్రిని పురస్కరించుకుని కోడూరు, రాఘవరాజుపురం శివాలయాలలో స్వామివారి కల్యాణోత్సవ కార్యక్రమాలు వేద పండితుల మంత్రోచ్ఛరణల నడుమ ఘనంగా జరిగాయి. భక్తులకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. కోడూరు నుంచి వై.కోట, గుండాల కోన, తల కోన, శ్రీకాళహస్తి ప్రాంతాలలోని ప్రముఖ శివక్షేత్రాలకు ఆర్టీసీ కంట్రోలర్ స్వామిదాస్ ఆధ్వర్యంలో 24 ప్రత్యేక బస్సులను నడిపారు. ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయులు, ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, టిడిపి ఇన్‌ఛార్జి విశ్వనాధనాయుడు, పలువురు అధికారులు, రాజకీయ నాయకులు శివాలయాలను దర్శించి తమ మొక్కులు తీర్చుకున్నారు. శివరాత్రి వేడుకలను కోడూరు ప్రాంతంలోని దేవాలయాలలో భక్తుల నడుమ ఘనంగా జరిగాయి.
హరహర మహాదేవ శంభోశంకర

సిద్దవటం,్ఫబ్రవరి 24: మండలంలోని వంతాటిపల్లెకు 13కి.మీ.దూరంలో లంకమల అభయారణ్యంలో వెలసిన నిత్యపూజయ్యస్వామిని దర్శించుకునేందుకు భక్తుల శివనామస్మరణలతో మారుమ్రోగింది. హరహర మహాదేవ శంభోశంకర, శివ శివ నిజమైన దేవుడా నిత్యపూజయ్య అంటూ భక్తులు పంచలింగాల నుంచి నిత్యపూజయ్య కోన వరకు నడుచుకుంటూ వెళ్లారు. ఎలాంటి అవాంతరాలు లేకుండా పిల్లా పాపలతో వృద్ధులు తమ లగేజిని వెంటతీసుకుని కోరిన కోర్కెలు తీర్చే నిత్యపూజయ్యను భక్తులు దర్శించుకున్నారు. అయితే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పోలీసులు ముందుజాగ్రత్త చర్యలు చేపట్టారు. అలాగే మెట్లకింద నుంచి స్వామి ఆలయం వరకు బ్యారిగేట్లు ఏర్పాటు చేయించి వచ్చి వెళ్లే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు. అర్చకులు అక్కదేవతల సమీపంలోని కల్యాణ కట్ట వద్ద శివపార్వతుల కల్యాణం ఘనంగా నిర్వహించారు. ఈ కల్యాణ మహోత్సవాన్ని దేవాదాయ, ధర్మాదాయ సహాయ కమిషనర్ శంకర్‌బాలాజి, నిత్యపూజయ్య ఆలయ చైర్మన్ రాజేంద్రప్రసాద్‌ల ఆధ్వర్యంలో శివరాత్రి ఉత్సవాల ప్రత్యేక అధికారి వెంకట్రావు అధ్యక్షతన కన్నుల పండువగా జరిగింది. మేడా మధుసూదన్‌రెడ్డి, సిద్దవటం ప్రత్యేక అధికారి సుబ్బారావు, ఎంపిపి నరసింహారెడ్డిలు ముఖ్యఅతిధులుగా కల్యాణానికి హాజరయ్యారు. గురువారం రాత్రి నుంచి నిత్యపూజయ్యస్వామిని దర్శించుకునేందుకు ఆర్టీసీ బస్టాండు నుంచి పంచలింగాల, నిత్యపూజయ్యస్వామి కొండపేట వరకు జనరేటర్ల సాయంతో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విద్యుత్‌దీపాలను ఏర్పాటుచేశారు. అనంతరం శుక్రవారం రాత్రి గ్రామోత్సవం పంచలింగాల వరకు కన్నుల పండువగా జరిగింది.
కలసపాడులో...
కలసపాడు: మండలంలోని శ్రీలింగమయ్యస్వామి, శివాలయాలు తదితర ఆలయాల్లో శుక్రవారం మహాశివరాత్రి సందర్భంగా శివనామ స్మరణతోమ్రోగాయి. ఈ సందర్భంగా తెల్లవారు జామున నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకు చేరుకుని కాయ కర్పూరాలు సమర్పించి తమ భక్తిని చాటారు.
అలాగే ఆలయాల అర్చకులు ఉదయం అభిషేకాలు, అర్చనలు చేసి స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. ఆలయాలకు వచ్చిన భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.

భక్తులతో పోటెత్తిన శైవక్షేత్రాలు..

కడప,(కల్చరల్)్ఫబ్రవరి 24: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం జిల్లాలోని శైవక్షేత్రాలతోపాటు నగరంలోని శివాలయాలన్నీ భక్తులతో పోటెత్తాయి. ఈ సందర్భంగా ఉదయం నుంచే పెద్ద ఎత్తున భక్తులు ఆయా శైవక్షేత్రాల్లో శివపార్వతులను దర్శించుకునేందుకు బారులు తీరారు. రెండురోజులు ముందుగానే భక్తులు తండోపతండాలుగా శైవక్షేత్రాలకు తరలివెళ్లారు. ముఖ్యంగా కొండల నడుమ ఉన్న శైవక్షేత్రాలకు లక్షలమంది భక్తులు తరలివెళ్లారు. శైవక్షేత్రాలకు చాలామంది భక్తులు కాలినడకన కూడా వెళ్లి తమ మొక్కుబడులు తీర్చుకున్నారు. కాలినడకన వెళితే పుణ్యం లభిస్తుందని భక్తుల విశ్వాసం. ప్రధానంగా కడప జిల్లాలో కొండల మధ్య ఉన్న శ్రీనిత్యపూజయ్యస్వామికోన, పొలతల మల్లికార్జునస్వామి, భానుగుట్టస్వామి, గుండాలకోన, జ్యోతి సిద్దవటేశ్వరం, అత్తిరాల ప్రాంతాలకు పెద్ద ఎత్తున భక్తులు కాలినడకన వెళ్లారు. ప్రతి రోజూ భక్తుల కోసం హరికథా కాలక్షేపం, పౌరాణిక నాటకాలు, బుర్రకథలు తదితర సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వాహకులు ఏర్పాటు చేశారు. అలాగే శివపార్వతుల కళ్యాణం అత్యంత వైభవంగా కన్నుల పండుగగా నిర్వహించారు. అన్ని శైవక్షేత్రాల్లో భక్తుల సౌకర్యార్థం భక్తులకు, ప్రజలకు అన్నసంతర్పణ చేశారు. అలాగే కడప నగరంలోని శివాలయాలన్నీ భక్తులతో కిక్కిరిసి పోయాయి. తెల్లవారు జామున నుంచే మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి కాయ కర్పూరాలు సమర్పించి తమ భక్తిని చాటుకున్నారు. ప్రధానంగా నగరంలోని శ్రీ సోమసుందరేశ్వరస్వామి (బాలాజి) దేవస్థానం, నగర సమీపంలోని ఉక్కాయపల్లె వద్దవున్న కొండపైన వెలసి వున్న శ్రీఉరకొండ మల్లికార్జునస్వామి ఆలయం, కొండాయల్లెలోని శ్రీ ఉమామహేశ్వరస్వామి ఆలయం, రామచంద్రయ్య కాలనీలోని శ్రీజ్ఞానేశ్వరస్వామి-అన్నపూర్ణాదేవి ఆలయం, హౌసింగ్ బోర్డు కాలనీలోని శ్రీమణికంఠేశ్వరస్వామి ఆలయం, కనుమలోపల్లె వద్దవెలసివున్న శ్రీఉమాదేవి సహిత నీలకంఠేశ్వరస్వామి ఆలయం, మున్సిపల్ మైదానంలోని శ్రీరాజరాజేశ్వరీ ఆలయం ప్రాంగణంలోని శ్రీకాశీ విశే్వశ్వరస్వామి ఆలయం, నబీకోటలోని శ్రీశ్రీశ్రీ మల్లికార్జున సర్వమంగళాదేవి దేవస్థానం, రవీంద్రనగర్‌లోని శ్రీరామాంజనేయస్వామి దేవస్థానం, ప్రకాష్‌నగర్‌లోని శ్రీఅమరేశ్వరస్వామి దేవస్థానం, మోచంపేటలోని శివాలయం, మృత్యుంజయకుంటలోని శివాలయంతోపాటు పలు శివాలయాల్లో మహాశివరాత్రి మహోత్సవాలు వైభవంగా జరిగాయి. శ్రీసోమసుందరేశ్వరస్వామి దేవస్థానంలో శుక్రవారం తెల్లవారు జామున నుంచి శివునికి ప్రత్యేక పూజలు, అభిషేకాలతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అనంతరం ఉదయం 9గంటలకు మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, మధ్యాహ్నం 2.30గంటల నుంచి స్వామివారి కల్యాణోత్సవం, సాయంత్రం 5గంటలకు గ్రామోత్సవం వైభవంగా నిర్వహించారు. అలాగే రాత్రి లింగోద్భవ పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయ అర్చకులు చంద్రవౌళిశర్మ ఆధ్వర్యంలో సామూహిక మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేశారు. పై కార్యక్రమాలకు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ భక్తిని చాటారు.
చెన్నూరులో...
చెన్నూరు: మండలంలో శివాలయాలు మహాశివరాత్రి పురస్కరించుకుని భక్తులతో కిటకిటలాడాయి. మండలం పరిధిలోని పుష్పగిరికి వెళ్లే రహదారిలో వెలసిన కాశీవిశ్వనాధస్వామి ఆలయంలో శుక్రవారం ఉదయం నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే శివపార్వతుల కల్యాణం నిర్వహించారు. ఆలయాన్ని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి శివపార్వతులను దర్శించుకున్నారు. బలసింగాయపల్లె అటవీప్రాంతంలో వెలసిన సిద్దేశ్వరాలయంలో ప్రత్యేకపూజలు జరిగాయి. అలాగే స్థానిక పెన్నానది ఒడ్డున వెలసిన మల్లికార్జునస్వామి ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. శివాలయాలను విద్యుత్‌దీపాలతో అలంకరించారు.