కడప

ఒంటిమిట్ట శ్రీకోదండరాముడి సన్నిధికి చేరిన తలంబ్రాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,మార్చి 21: రెండవ భద్రాద్రిగా పేరు గాంచిన ఒంటిమిట్ట శ్రీకోదండరామచంద్రుడి కల్యాణ మహోత్సవానికి శ్రీరామనామంతో లిఖించిన బియ్యపు తలంబ్రాలు ఒంటిమిట్టకు చేరుకున్నాయి. ఏప్రిల్ 4 నుంచి 14వ తేదీ వరకు శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు టిడిపి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డా.బి.సాంబశివరావు, టిటిడి జెఇఓ శ్రీనివాసరాజు, ఓఎస్‌డి ముక్తేశ్వరరావు, మరో జెఏఓ పోల భాస్కర్ నేతృత్వంలో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. జెఇఓ పోలభాస్కర్ వీరబల్లి ప్రాంతీయుడైనందున ఈప్రాంత దేవాలయాల అభివృద్ధికి, ఉత్సవాలకు ముందుండి కార్యక్రమాలు నడుపుతున్నారు. అదే తరహాలో కోదండరామస్వామి నవమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు మంగళవారం ఏర్పాట్లను సమీక్షించారు. శ్రీరామనవమి ఉత్సవాలకు శ్రీరామ తలంబ్రాలు 1,01,116లు శ్రీరామనామ బియ్యపు గింజలను నెల్లూరు జిల్లా సూళ్లూరు పేటకు చెందిన విష్ణువందన అనే భక్తురాలు పత్రాలు, కోదండరామస్వామి దేవాలయంలో తలంబ్రాలు అందజేసి శ్రీరాముడి పాదాల ముందు ఉంచి పూజలు నిర్వహించారు. 80 రోజులుగా ఆమె శ్రీరామనామాల లికింపుతో రోజుకు 10 నుంచి 12 గంటలు శ్రమించి 600 నుంచి 2వేలు బియ్యపు గింజలపై శ్రీరామనామాలు లిఖించారు. రామ రామ శ్రీరామ అనే లిఖిస్తూ తెలుగు, హిందీ, ఇంగ్లీషుభాషలో ఆమె బియ్యపు గింజలపై లిఖించారు. రెండవ భద్రాద్రి అయిన ఒంటిమిట్ట కోదండరామ కల్యాణోత్సవానికి భక్తురాలు 1,01,116 శ్రీరామ నామం పేరుతో బియ్యపుగింజలు అందచేయడం రాష్టవ్య్రాప్తంగా భక్తులు ఇదే తరహాలో బియ్యపు తలంబ్రాలు ఒంటిమిట్టకు చేరుకోనున్నాయి. ముచ్చటగా మూడవ పర్యాయం కోదండరామస్వామి ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి.

జిల్లా టిడిపిలో రెండుముక్కలాట!

కడప,మార్చి 21: జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా బిటెక్ రవి గెలుపొందిన తర్వాత పదవులకోసం అధికార టిడిపిలో రెండుముక్కలాట జరుగుతోంది. త్వరలో మంత్రివర్గ విస్తరణ జరుగుతున్న నేపధ్యంలో మంత్రి పదవులకోసం ఇప్పటికే వైసిపి నుంచి వలసవచ్చిన ఎమ్మెల్యేలు, ఇరువురు ఎమ్మెల్సీలు, మంత్రి పదవిపై ఆశలుపెట్టుకుని ఉండగా తాజాగా ఎమ్మెల్సీగా అభ్యర్థి కూడా మంత్రి కావాలని అడుగుతున్నట్లు ఆయన అనుచరగణాల నుంచి తెలుస్తోంది. జిల్లాలో రెడ్ల, బలిజ (కాపు), తాజాగా వెలమ కుల సామాజికవర్గాల వారీగా తెరపైకి వచ్చింది. టిడిపి ఎమ్మెల్సీగా గెలుపొందిన బిటెక్ రవితోపాటు కొంత మంది రెడ్ల, వెలమ, బలిజ సామాజికవర్గాలపైనే ఆశలు పెట్టుకుని మనమంతా గ్రూపుగా ఉంటామని ప్రకటించినట్లు తెలిసింది. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వైఎస్ కుటుంబాన్ని ఎదిరించిన నేతలు ప్రస్తుతం గ్రూపురాజకీయాలతో నోరుమెదపకుండా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డిపై టిడిపి ఎమ్మెల్సీ అభ్యర్థి బిటెక్ రవి గెలుపొందారని సంతోషం పడుతూ 2019 ఎన్నిలకు సిద్దపడాల్సిన అధికారపార్టీ నేతలు రెండు గ్రూపులుగా ఏర్పడి మంత్రి పదవులుకోసం ఎవరికివారే యమునా తీరే అన్నచందంగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా వుండగా గవర్నర్ ఎమ్మెల్సీ కోటా కింద కేవలం రెండుఖాళీలు ఉండగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు దాదాపు 50మంది ఓటర్లను అందజేసిన బత్యాల చెంగల్రాయులుకు కానీ, జమ్మలమడుగులో పార్టీని నమ్ముకుని అన్ని విధాల నష్టపోయిన మాజీ మంత్రి పి.రామసుబ్బారెడ్డి ఎమ్మెల్సీ పదవిని ఆశిస్తున్నారు. అయితే చంగల్రాయులకు లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. రామసుబ్బారెడ్డికి పార్టీలో సముచిత స్థానం కల్పించేందుకు అధిష్ఠానం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. 2019 ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని తెలుగుదేశం అధిష్ఠానం బలిజలకు, రెడ్లకు, సామాజికవర్గానికి సముచిత స్థానం కల్పించి జగన్ సొంత జిల్లాలో విజయబావుటా జెండా ఎగురవేసేందుకు కృతనిశ్చయంతో ఉన్నట్లు తెలుస్తోంది.

ఓటమిపై వైకాపా అంతర్మథనం.!

కడప,మార్చి 21: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి వైఎస్ వివేకా ఓటమితో వైకాపా నేతలు అంతర్మథనంలో పడ్డారు. త్వరలో వైకాపా అధినేత, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి జిల్లా పర్యటన చేయనున్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసిపి అభ్యర్థి వివేకా ఓటమి చవిచూడటంతో ఓటమికి గల కారణాలు బేరీజువేసేందుకు నేతలను స్వయంగా కలుసుకోనున్నారు. 2014 ఎన్నికలు తరహాలోనే ఓటర్లపై అతి విశ్వాసం, అతి నమ్మకమే జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డిని ఓడించిందని ప్రతినోటా విన్పిస్తోంది. జిల్లాలో ఎంపిటిసి, జడ్పిటిసి, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు అధికంగా వైసిపికి ఉన్నా, వైఎస్ వివేకానందరెడ్డి ఓటమికి గురికావడంపై పార్టీ జిల్లా నేతలంతా గతంలో తమ వద్ద లబ్దిపొంది ఆర్థికంగా, రాజకీయంగా ముందంజలో ఉన్న స్థానిక ప్రజాప్రతినిధులు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బిటెక్ రవిని గెలిపించడంపై వైసిపి నేతల్లో సర్వత్రా వ్యతిరేకత విన్పిస్తోంది. జగన్ పార్టీ శ్రేణుల్లో మనోధైర్యం నింపని పక్షంలో సొంత జిల్లాలో కేడర్ చేజారిపోకుండా జిల్లాకు వస్తున్నట్లు తెలుస్తోంది. వివేకానందరెడ్డి మాత్రం ధైర్యంగా కేడర్‌ను నొప్పించకుండా గెలుపు ఓటములు సహజమేనని 2019 ఎన్నికలపై దృష్టిసారించాలని, ఆయన పార్టీ శ్రేణులకు హితబోధ చేశారు. దేశం నేతల ప్రలోభాలకు లొంగి వైసిపి నుంచి టిడిపి అభ్యర్థికి ఓటు వేసిన దరిమిలా వైసిపినేతలు వారిని బెదిరింపు చర్యలకు పాల్పడుతుండటంతో అలా చేయకుండా భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని అనుసరించాలని వివేకా పార్టీశ్రేణులకు ఆదేశించినట్లు తెలిసింది. పులివెందులలో పట్టుసాధించే దిశగా టిడిపి నేతలు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి గంటా శ్రీనివాసరావు జిల్లాకు చేరుకుని పనిలో పనిగా జిల్లా నేతలు పులివెందులపై దృష్టిపెట్టాలని ఆదేశించి వెళ్లారు. జిల్లా పరిశీలకులు ఎమ్మెల్సీ దొరబాబు, జిల్లాఅధ్యక్షుడు ఆర్.శ్రీనివాసరెడ్డి, రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్‌నాయుడు, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి, జమ్మలమడుగు ఎమ్మెల్యే సి.ఆదినారాయణరెడ్డిలు ప్రత్యేక దృష్టిపెట్టారు. వైసిపి నేతలు కూడా టిడిపి కేడర్ తమపై కాళ్లు దువ్వితే తాము వెనుకాడే ప్రసక్తేలేదని వారు కూడా సంకేతాలు పంపినట్లు తెలుస్తోంది. వైసిపి తరపున స్థానిక సంస్థలకు చెందిన ఎస్సీ,ఎస్టీ, బిసి ప్రజాప్రతినిధులు ధైర్యంగా తిరగాలన్నా, ఇళ్లల్లో ఉండాలన్న భయాందోళనకు గురౌతున్నారు. ఓపక్క వైసిపి నేతలు తమకు ఓటు వేయలేదని వత్తిళ్లు చేయడం, మరో పక్క అధికారపార్టీ టిడిపి నేతలు తమ పార్టీలోకి రావాలని వత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వత్తిళ్లతో వారు ఎవ్వరికీ ఏమి చెప్పుకోలేక మదనపడుతున్నారు. జగన్ జిల్లాకు వస్తున్న సందర్భంగా పార్టీని ప్రక్షాళన చేయనున్నట్లు తెలుస్తోంది.

4నుంచి ఒంటిమిట్టలో బ్రహ్మోత్సవాలు

ఒంటిమిట్ట, మార్చి 21:అఖిలాంఢ కోటి బ్రహ్మండ నాయకుడు, ఏకశిల నగర కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాలకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఉత్సవాల తేదీలను టిటిడి ఇఓ సాంబశివరావు తిరుపతిలో జరిగిన ఓ కార్యక్రమంలో విడుదల చేసిన కరపత్రాలు ఇక్కడి రామాలయానికి చేరాయి. ఏప్రిల్ 4వ తేదీ అంకుర్ఫారణతో ప్రారంభమయ్యే రామయ్య బ్రహ్మోత్సవాలు 14వ తేదీ పుష్పయాగం, ఏకాంత సేవలతో ముగియనున్నాయి. అంతే కాకుండా 5వ తేదీ శ్రీరామనవమి, 10వ తేదీ శ్రీ సీతారాముల కల్యాణం, 11వ తేదీ రథోత్సవం నిర్వహించేలా నిర్ణయించారు. బ్రహ్మోత్సవాల వివరాలు ఇలా ఉన్నాయి. ఏప్రిల్ 4వ తేదీ వ్యాసాభిషేకం, సాయంత్రం అంకురార్ఫరణ, 5వ తేదీ ధ్వజారోహణం, శ్రీరామనవమి, పోతన జయంతి, రాత్రి శేష వాహనం, 6న ఉదయం వేణుగాన అలంకారం, రాత్రి స్వామివారికి హంస వాహనం, 7న ఉదయం వటపత్ర సాయి అలంకారం, సాయంత్రం సింహవాహనం, 8న శనివారం ఉదయం నవనీత కృష్ణ అలంకారం, రాత్రి హనుమంత వాహనం, 9న ఆదివారం సాయంత్రం మోహినీ అలంకారం, రాత్రి గరుడ వాహనం, 10న సోమవారం ఉదయం శివ ధనుర్భాలంకారం, రాత్రి స్వామివారికి ఎదుర్కోలు, సీతారామ కల్యాణం, 11న మంగళవారం రథోత్సవం, 12న బుధవారం ఉదయం స్వామివారికి కాళీయ మర్ధన అలంకారం, రాత్రి అశ్వవాహనం, 13న గురువారం ఉదయం చక్రసాన్నం, 14న శుక్రవారం ధ్వజావరోహణం, సాయంత్రం పుష్పయాగం, రాత్రి ఏకాంత సేవ వంటి కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు టిటిడి కరపత్రాల ద్వారా పేర్కొంది. కల్యాణోత్సవం రోజున స్వామివారికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సంప్రదాయబద్ధంగా తీసుకు రానున్నారు. ముఖ్యఅతిథిగా తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహాన్ దంపతులు పాల్గొననున్నారు. ఆ రోజు ఇద్దరు విఐపిల రాకకు తగ్గట్టు టిటిడి యంత్రాంగం భారీ స్థాయిలో ఏర్పాట్లలో నిమగ్నమైంది.
25న ఏర్పాట్లపై ఇఓ సమీక్ష
ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనులపై ఈ నెల 25న టిటిడి ఇఓ సాంబశివరావు అధికారులతో సమావేశాన్ని నిర్వహించేందుకు ఇక్కడికి విచ్చేయనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఉత్సవాల సందర్భంగా ఆలయంలో చలువ పందిళ్లు, ఆలయం చుట్టూ నూతన పార్కులు, సిఎంచే ప్రారంభించనున్న భక్తుల అదనపు గదుల పనులు, కల్యాణ స్థలంలో జరుగుతున్న పనులను ఇఓ పరిశీలించనున్నారు.

స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా బిటెక్ రవి విజయంతో
టిడిపి నేతల్లో ఉత్సాహం..

కడప,మార్చి 21: వైకాపా అధ్యక్షుడు జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డిపై టిడిపి అభ్యర్థి బిటెక్ రవి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా గెలుపొందడంతో అధికారపార్టీ నేతల్లో నూతనోత్సాహం కనిపిస్తొం ది. అధిష్ఠానం కనుసన్నల్లో వివేకానందరెడ్డిని టిడిపి నేతలు ఓటమికి గురిచేసినా జిల్లాలోని టిడిపి నేతలంతా తమకృషి ఫలంగానే బిటెక్ రవి గెలుపొందారని హైకమాండ్ ముందు ప్రగల్బాలు పలుకుతు, పదవులపై ఆశలు పెట్టుకున్నారు. హైకమాండ్‌కు జిల్లా పరిస్థితిపై పూర్తి అవగాహన ఉండటం, ఏ నాయకుడు ఏ విధంగా పనిచేశారనేది హైకమాండ్ వద్ద సాక్ష్యాధారాలు ఉన్నాయి. అధికారం కోసం ఆధిపత్యపోరుతో జిల్లాలో పార్టీ శ్రేణులు అనేక ఆటుపోట్లు ఎదుర్కొంటున్నా అధిష్ఠానం ఎప్పటికప్పుడు పార్టీ కేడర్‌ను హెచ్చరిస్తుండటంతో ఇప్పుడిప్పుడు జిల్లాలో టిడిపి కేడర్ బలపడుతోంది. అయితే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధిష్ఠానం సర్వశక్తులు వడ్డి అభ్యర్థిని గెలిపించుకుని వివేకాను ఓటమికి గురిచేసినా పదవుల కోసం ప్రాకులాడే నేతలు ఊగిసలాటలు తప్ప అరకొర మంది మాత్రమే టిడిపి అభ్యర్థి గెలుపుకోసం సర్వశక్తులు వడ్డి గెలిపించుకున్నారు. 2014 ఎన్నికల్లో కేవలం 10 అసెంబ్లీ స్థానాలకు రాజంపేట అసెంబ్లీ స్థానం మాత్రమే కైవసం చేసుకుని, రెండు పార్లమెంట్ స్థానాలు వదులుకోవాల్సివచ్చింది. అయితే జిల్లాలో అధికార దాహంతో పనిచేసే నేతలు, ఆధిపత్యపోరు నేతల గురించి తెలుగుదేశం అధిష్ఠానానికి బాగా తెలుసు. ప్రస్తుతం గవర్నర్ కోటా కింద రెండు ఎమ్మెల్సీ సీట్లు ఉండటం, మరికొన్ని కార్పొరేట్ చైర్మన్ పదవులు ఉండటంతో ఆ పదవులకోసం నేతలు ఎమ్మెల్సీ ఎన్నిక దేశం అభ్యర్థి విజయాన్ని బూచుగా చూపి పదవులు ఆశిస్తుండటంతో అధిష్ఠానానికి తలనొప్పిగా మారిన పనిచేసే నాయకులకు న్యాయం చేస్తామని ఒకమాటలో కొట్టిపారేసింది. 2019 ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని గెలుపొందే అభ్యర్థికి, అభివృద్ధికోసం కృషి చేసే వ్యక్తులకే టికెట్లు ఇస్తారని ప్రకటించడంతో దేశం కేడర్ గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నాయి. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి గెలిచిన దృష్ట్యా పదవులకోసం డిమాండ్ చేస్తున్నా అధిష్ఠానం ఆచితూచి అడుగులు వేస్తోంది. జిల్లాకు గవర్నర్ కోటా కింద ఒక ఎమ్మెల్సీ పదవి దక్కే అవకాశం ఉంది.

వీరభద్ర స్వామిని దర్శించుకున్న
జిల్లా ఆడిట్ అధికారి
రాయచోటి (టౌన్), మార్చి 21: శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామిని మంగళవారం జిల్లా ఆడిట్ అధికారిణి చాముండేశ్వరి దేవి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వాహణాధికారిణి మంజుల ఆలయ మర్యాదలతో స్వాగతం పలకి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారి దర్శన అనంతరం అర్చకులతో శాలువలతో సన్మానించి స్వామి వారి చిత్రపటాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఏవో పద్మావతి, సీనియర్ ఆడిటర్ శిరీష, ఆలయ అర్చకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
24న వీరభద్రాలయంలో అంబలి పూజ
శ్రావణ బహుళ ఏకాదశి 24వ తేదీ శుక్రవారం ఉదయం 8 గంటలకు శ్రీ వీరభద్ర స్వామి దేవాలయంలో కొలువై ఉన్న గ్రామ దేవత శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారికి శీతలాంబ పూజ జరుగుతుందని ఆయన ఈవో మంజుల తెలిపారు. పట్టణంలో పెద్దలకు, పిల్లలకు అమ్మవారు(తట్టు) పోత జ్వరాలు ఎక్కువగా ఉన్నందున అమ్మవారికి ప్రత్యేక శాంతిపూజలు నిర్వహించి అంబలి ప్రసాదాలు భక్తులందరికి పంపిణీ చేస్తామని తెలిపారు.

మహిళలు ఆర్థికాభివృద్ధి చెందాలి

మైలవరం, మార్చి 21: రాయితీ రుణ సదుపాయాలను సద్వినియోగం చేసుకుంటూ మహిళలు మరింత అభివృద్ది చెందాలని జిల్లా డిఆర్‌డిఎ పిడి అనిల్‌కుమార్ రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని నవాబుపేట గ్రామంలో మంగళవారం దాల్మియా సియస్‌ఆర్ ఆధ్వర్యంలో పాల ఉత్పత్తిదారుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో పిడి అనిల్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ మహిళలు పాల ఉత్పత్తితోపాటు, పాల ఉత్పత్తులను పెంపొందించేందుకు కృషిచేయాలన్నారు. డైరీ అభివృద్ది చెందేలా స్థానికంగా పాలశీతలీకరణ కేంద్రం ఏర్పాటుకు సహకరిస్తామని అనిల్‌కుమార్ రెడ్డి తెలిపారు. నాబార్డు జిల్లా అధికారి శ్రీనివాసరావు మాట్లాడుతూ మార్చి 31లోపు ఆర్థిక సంవత్సరం ముగుస్తూండడంతో లక్ష్యాల మేర రాయితీ రుణాలు కల్పిస్తున్నామన్నారు. పాల ఉత్పత్తులు పెంచడానికి డైరీ యూనిట్లు ఏర్పాటు చేసుకొనేందుకు ఎస్సీలకు 33శాతం, జనరల్‌కు 25శాతం చొప్పున రాయితీ రుణ కల్పనకు కృషిచేస్తున్నామన్నారు. ఈ రాయితీ అవకాశాన్ని అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలని నాబార్డు అధికారి శ్రీనివాసరావు తెలిపారు. ఎపిజిబి రీజనల్ మేనేజర్ మధుసూధన్‌రావు మాట్లాడుతూ గ్రామీణాభివృద్దే ధ్యేయంగా ఎపిజిబి పరిధిలో విస్తృతంగా రుణ సదుపాయాలను కల్పిస్తున్నామన్నారు. మహిళలు గ్రూపు రుణాలు, యూనిట్లు ఏర్పాటు చేసుకొని ప్రభుత్వం ఇచ్చే రాయితీ రుణాలను ఎపిజిబి బ్యాంకుల ద్వారా పొంది అభివృద్ది పొందాలని తెలిపారు. అనంతరం 32 జెఎల్ గ్రూపు మహిళలకు రూ.1.60కోట్ల చెక్కును దాల్మియా సియస్‌ఆర్ రీజినల్ హెడ్ అశ్వనీకుమార్, అధికారుల చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో దాల్మియా సియస్ ఆర్ అసిస్టెంట్ మేనేజర్ రాజశేఖర్‌రాజు, సిబ్బంది, బ్యాంకు అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.

25న రాయచోటిలో
రాష్టస్థ్రాయి ఉర్దూ సెమినార్
కడప,(కల్చరల్),మార్చి 21: ఈనెల 25వ తేదీన రాయచోటిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యుజిసి) ఆధ్వర్యంలో ‘మానవహక్కులు-మానవతా విలువలు’ అనే అంశంపై రాష్టస్థ్రాయి ఉర్దూ సెమినార్ నిర్వహిస్తున్నట్లు ఉర్దూ విభాగ అధ్యక్షుడు, సెమినార్ ఆర్గనైజింగ్ కార్యదర్శి డా.సయ్యద్ వసీవుల్లా చక్తియారీ, ఆర్గనైజింగ్ కో-ఆర్డినేటర్ డా.ఎస్.్ఫరూఖ్‌లు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కాగా సెమినార్‌లో కడప నుంచి వసీలా డైరెక్టర్లు మహమూద్ షాహిద్, షకీల్ అహ్మద్, సత్తార్ ఫైజి పరిశోధన పత్రాలు సమర్పిస్తారన్నారు. అలాగే రాష్ట్రంలోని దాదాపు 25 మంది ఉర్దూ పరిశోధకులు, ఉర్దూ సాహితీవేత్తలు, రచయితలు వివిధ అంశాలపై పరిశోధన పత్రాలు సమర్పిస్తారన్నారు. సెమినార్ ప్యాట్రన్‌గా రాయచోటి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా.కె.శివరామిరెడ్డి, కన్వీనర్‌గా డా. నివాసులు వ్యవహరిస్తారన్నారు. ఆర్గనైజింగ్ కో-ఆర్డినేటర్ డా.ఎస్.్ఫరూఖ్ బాషా తెలిపారు.

సీఎం చంద్రబాబుకు
గుణపాఠం చెప్పిన విద్యావంతులు

కమలాపురం, మార్చి 21: విద్యావంతులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తగిన గుణపాఠం చెప్పారని ఎమ్మెల్యే రవీంద్రనాధరెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన రాజధాని అమరావతి నుంచి ఫోన్ ద్వారా విలేఖర్లతో మాట్లాడుతూ తక్కువ ఓటర్లు కలిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థులు గెలుపొందడంతో గొప్పలు చెప్పుకున్న ముఖ్యమంత్రి బాబు, మంత్రులు, ఎమ్మెల్యేలు సంబరాలు చేసుకున్నారని అన్నారు. కోట్లాదిరూపాయలు డబ్బులు వెదజల్లి ఎంపిటిసిలు, జడ్పీటిసిలను ప్రలోభపెట్టి, కిడ్నాపులు చేసి గెలుపొందారని ఆరోపించారు. ఐతే లక్షలసంఖ్యలో ఓటర్లు కలిగిన పట్ట్భద్రులు, ఉపాధ్యాయులు మండలి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి తగిన గుణపాఠం చెప్పారని అన్నారు. సీఎం సొంతజిల్లా అయిన చిత్తూరులో టీచర్ల నియోజకవర్గ టిడిపి అభ్యర్థి వాసుదేశనాయుడు వైసిపి బలపరిచిన బాల సుబ్రమణ్యం చేతిలో ఘోరంగా ఓడిపోయారన్నారు. అలాగే తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో టీచర్లు, గ్రాడ్యుయేట్ నియోజకవర్గాల్లో వైసిపి బలపర్చిన పిడియఫ్ అభ్యర్థులు, వైసిపి అభ్యర్థి విజయపరంపర కొనసాగుతోందని దీన్ని తెలుగుదేశం అడ్డుకోలేకపోయిందని అన్నారు. చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కడంతో ఉపాధ్యాయులు, పట్ట్భద్రులు తెలుగుదేశం పార్టీకి విజయాన్ని దూరం చేశారన్నారు. మూడుజిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో దేశం అభ్యర్థులు గెలుపొందడంతో 2019 ఎన్నికల్లో కూడా తెలుగుదేశం అధికారంలోకి వస్తుందని, తానే మళ్లీ ముఖ్యమంత్రినని చంద్రబాబు గొప్పలు చెప్పుకోవడం తగదన్నారు. ప్రజలు తమవైపే ఉన్నారని అనుకోవడం ఎవరికీ సాధ్యం కాధన్నారు. తెలుగుదేశం పార్టీ నేతలు పోలిస్ పహారాలో బతుకుతున్నారని వచ్చే ఎన్నికల్లో ప్రజలు తెలుగుదేశానికి గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు ప్రజలకిచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

ఒప్పందం ప్రకారమే
ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్‌గా ఆసం..

ప్రొద్దుటూరు టౌన్, మార్చి 21:2014లో మున్సిపల్ ఎన్నికల ముందు జరిగిన ఒప్పందం ప్రకారం మున్సిపల్ ఛైర్మెన్‌గా ఆసం రఘురామిరెడ్డి ఎన్నిక జరుగుతుందని నియోజకవర్గ టిడిపి ఇన్‌చార్జి నంద్యాల వరదరాజులరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆయన తన కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల ముందు రాజ్యసభ సభ్యుడు సిఎం.రమేష్‌నాయుడు, లింగారెడ్డి, జిల్లా టిడిపి అధ్యక్షులు శ్రీనివాసులరెడ్డి, ఉండేల గురివిరెడ్డి, ఆసం రఘురామిరెడ్డిల మధ్య ఎన్నికల ఖర్చును గురివిరెడ్డి, ఆసం ఇద్దరూ భరించాలని, ఒకరు రెండు సంవత్సరాలు, మరొకరు మూడు సంవత్సరాలు పదవిని చేపట్టాలనే ఒప్పందం జరిగిందన్నారు. ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రావడం వలన ఒప్పందం ప్రకారం మొదటగా ఛైర్మెన్ గురివిరెడ్డిని ఎన్నుకోవడం జరిగింది. రెండేళ్లు పదవిలో కొనసాగిన గురివిరెడ్డి తాను ఎన్నికల్లో ఖర్చు ఎక్కువ పెట్టానని, తన పదవికి రాజీనామా చేయకుండా కొంత జాప్యం చేసిన విషయం వాస్తవమన్నారు. అయితే ఇటీవల స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు రావడం, ఒప్పందం ప్రకారం గురివిరెడ్డితో ఛైర్మెన్ పదవికి రాజీనామా చేయించకుండా తాము ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాల్గొనలేమని కొందరు కౌన్సిలర్లు పట్టుబట్టడం జరిగింది. ఈ విషయాన్ని జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులరెడ్డి, సిఎం.రమేష్, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, జయనాగేశ్వరరెడ్డిల దృష్టికి తీసుకెళ్లగా వీరందరూ రెండుమూడు పర్యాయాలు గురివిరెడ్డితో చర్చించి సిఎం దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. ఇందుకు సిఎం స్పందిస్తూ ఒప్పందం ప్రకారం గురివిరెడ్డి రాజీనామా చేసి ఆసంకు పదవిని ఇవ్వాలని ఆదేశించగా పలువురు నాయకుల సమక్షంలో గురివిరెడ్డి రాజీనామా చేశారన్నారు. ఈనెల 25న రాజీనామా ఆమోదానికి సమావేశం ఏర్పాటు చేస్తామని, అనంతరం ఆసం రఘురామిరెడ్డి ఎన్నిక జరుగుతుందని వరదరాజులరెడ్డి స్పష్టం చేశారు. కొందరు నాయకులు తమ కౌన్సిలర్లతో కూడిన క్యాంప్‌లు నిర్వహిస్తామని, ఓటింగ్‌లో పాల్గొనబోమని, ఛైర్మెన్ పదవికి తాము అర్హులని ప్రగల్బాలు పలుకుతున్నారని, అవి ఎంతమాత్రం జరగబోదని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ ఛైర్మెన్ జబీవుల్లా, మార్కాపురం గణేష్‌బాబు, తలారి పుల్లయ్య, కోనేటి సునంద, టిడిపి పట్టణాధ్యక్షుడు ఘంటసాల శ్రీనివాసులు, ఎంపివి.ప్రసాద్ పాల్గొన్నారు.

అధికారం, ప్రలోభాలతో గెలిచారు...

ప్రొద్దుటూరు టౌన్, మార్చి 21:స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బు, దౌర్జన్యంతోనే టిడిపి అభ్యర్థి బిటెక్ రవి గెలుపొందారని, అదీ ఒక గెలుపేనా అని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి విమర్శించారు. మంగళవారం స్థానిక వైకాపా కార్యాలయంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వైకాపాకు చెందిన కొందరిని బెదిరించి, మరికొందరికి డబ్బుకట్టలు వెదజల్లి జిల్లాలోని టిడిపి నాయకులు ఎమ్మెల్సీ స్థానాన్ని దక్కించుకున్నారని, ఇటువంటి చర్యలకు పాల్పడడం టిడిపి నాయకులకే చెల్లిందన్నారు. వంద ఓట్లు, రెండువందల ఓట్ల తేడాతో గెలుపొందుతామని ప్రగల్బాలు పలికిన టిడిపి నాయకులు కేవలం 33 ఓట్ల తేడాతో గెలుపొంది చావుతప్పి కన్ను లొట్టపోయిందన్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే వీరి కుయుక్తులకు కారకులని, శాసనసభలో ఉండవలసిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఎన్నికలకోడ్‌ను ఉల్లంఘించి జిల్లాలోనే మకాం వేయడం సిగ్గుచేటన్నారు. రాబోవు 2019 ఎన్నికల్లో జిల్లాలోని తొమ్మిది స్థానాలను మేమే సాధిస్తామని, మరోసారి తానే ముఖ్యమంత్రిని అవుతానని చంద్రబాబు అంటున్నారని, జిల్లాలో టిడిపి గూటికి చేరిన వైకాపా ఎమ్మెల్యేలైన ఆదినారాయణరెడ్డి, జయరాములును రాజీనామా చేయించి మరలా గెలిపించుకుంటే జిల్లాలో వైకాపా అభ్యర్థులుగా తాము పోటీ చేయమన్నారు. సొంత చిన్నాన్నను గెలిపించుకోలేని నీ పార్టీని మూసివేసి టిడిపిలోకి వస్తే ఉన్నత పదవిని ఇస్తామన్న టిడిపి నాయకులకు విజ్ఞత లోపించిందన్నారు. తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్‌టి.రామారావు బలహీనుడైన చిత్తరంజన్‌దాస్ చేతిలో ఓడిపోయినా కాంగ్రెస్‌పార్టీ వారు ఇటువంటి మాటలు అనలేదని, ఉక్కుమహిళ అయిన ఇందిరాగాంధీ రెండుసార్లు ఓడిపోయినా ఆనాటి ప్రభుత్వాలైన బిజెపి, వామపక్షాలు పదవులు ఇస్తామనలేదన్నారు. చంద్రబాబు పాలనను అసహ్యించుకున్న యువకులైన పట్ట్భధ్రులు, ఉపాధ్యాయులు టిడిపి అభ్యర్థులను చిత్తుచిత్తుగా ఓడించడం మీకు సిగ్గుచేటుగా లేదా అని రాచమల్లు ప్రశ్నించారు. పులివెందులలో సాధారణ కార్యకర్తను పెట్టి గెలుస్తామంటున్న సతీష్‌కుమార్‌రెడ్డి ఎన్నిసార్లు పరాభవాన్ని చవిచూశారో తెలుసుకుని మాట్లాడాలన్నారు. వైకాపాకు సహకరించిన ఓటర్లకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో వైకాపా పట్టణాధ్యక్షుడు చిప్పగిరిప్రసాద్, రాష్ట్ర ప్రచారకార్యదర్శి కొనిరెడ్డి శివచంద్రారెడ్డి, కౌన్సిలర్ యామిని, టప్పా గైబూసా, మహిళా నాయకురాలు విజయలక్ష్మి పాల్గొన్నారు.

ఆరోగ్యరక్ష పథకం పట్ల ప్రజలకు అవగాహన కల్పించండి

కడప,మార్చి 21: ప్రభుత్వం ప్రజలకు నాణ్యమైన కార్పొరేట్ వైద్యం ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ప్రవేశపెట్టిన ఆరోగ్యరక్ష పథకంలో ప్రతి ఒక్కరు నమోదు చేసుకుని ప్రయోజనం పొందేందుకు విస్తృతంగా ప్రచారం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అజయ్‌కల్లం అన్నారు. మంగళవారం ఎన్‌టిఆర్ ఆరోగ్యరక్ష పథకంపై ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పూనం మాలకొండయ్యలతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా అజయ్‌కల్లం మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజలకు నాణ్యమైన కార్పొరేట్ వైద్యం అందించేందుకు ప్రవేశపెట్టిన డా.ఎన్‌టిఆర్ వైద్యసేవ, ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ పథకం, పాత్రికేయుల ఆరోగ్యసంరక్షణ పథకంతో ధీటుగా ఈ మూడు పథకాలతో లబ్ధిపొందలేని వారికోసం ఆరోగ్య రక్షను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ఈ పథకంద్వారా సంవత్సరానికి కుటుంబంలోని పిల్లల నుంచి పెద్దల వరకు ఒక్కొక్కరికి కేవలం రూ.1200 మాత్రమే చెల్లించి దరఖాస్తు చేసుకుని హెల్త్‌కార్డును పొందాలని కోరారు. రాష్టవ్య్రాప్తంగా 410 నెట్ వర్క్ ఆసుపత్రుల్లో వైద్యిచికిత్సలు చేయించుకోవచ్చునన్నారు. బీమా గడువుమద్యలో పుట్టిన పిల్లలను చేర్చాలంటే పథకంలో చేర్చే నెల నుంచి బీమా గడువుముగిసే చివరి నెల వరకు రూ.100లు చొప్పున మొత్తం చెల్లించాల్సివుంటుందని ఇందుకు ముందుగా పిల్లలపేర్లను ప్రజాసాధికార సర్వేలో నమోదు చేసుకోవాలని కోరారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ భారత్‌దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రప్రజలకు కార్పొరేట్ వైద్యం అందించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోగ్యరక్ష పథకం ప్రవేశపెట్టి వైద్యసదుపాయాలు కల్పిస్తున్నారన్నారు. ఈ పథకంలో అధిక సంఖ్యలో ప్రజలు నమోదుచేసుకునేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. వైద్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పూనం మాలకొండయ్య మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరోగ్యరక్ష పథకంలో బిపిఎల్‌లో ఉన్నవారితోపాటు బిపిఎల్ పైన ఉన్నవారు కూడా నమోదు చేసుకోవాలని అధికారులు ప్రజాసాధికారత సర్వేలోని వివరాల ఆధారంగా పథకంలో అర్హతను కల్పించి చర్యలు తీసుకోవాలన్నారు. ఈ పథకంపై గ్రామస్థాయి నుంచి విస్తృతప్రచారం చేసి అవగాహన కల్పించాలని అధికసంఖ్యలో ఆరోగ్యరక్ష పథకంలో చేర్పించాలని కోరారు. అధిక సంఖ్యలో ఈ పథకం కింద చేర్పించిన వారికి ఏప్రిల్ 7న జరిగే ప్రపంచ ఆరోగ్య దినోత్సవం రోజున రాష్టస్థ్రాయిలో బహుమతులు ప్రదానం చేయడం జరుగుతుందని అలాగే రాష్ట్రంలో అధికసంఖ్యలో నమోదుచేసిన జిల్లాలో కలెక్టర్లు బహుమతులు అందిస్తారన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ కెవి సత్యనారాయణ, డిఎంహెచ్‌ఓ రామిరెడ్డి, ఎన్‌టిఆర్ వైద్యసేవ జిల్లా కోఆర్డినేటర్ శివనారాయణ సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

మరుగున పడుతున్న మైలవరం అందాలు!

జమ్మలమడుగు, మార్చి 21: జిల్లాలోనే ప్రత్యేక ప్రాంతంగా, పర్యాటక కేంద్రంగా గుర్తింపు వున్న మైలవరం పర్యాటక కేంద్రం నేడు దీనస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. కాంట్రాక్టర్లకు దోచిపెట్టడమే లక్ష్యంగా పనులతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న పర్యాటక శాఖ తీరుతో పదేళ్లుగా పర్యాటకులకు కనీస సౌకర్యాలు కూడా లేకుండా పోయాయి. అరచేతిలో వైకుంఠం చూపి మైలవరంలో అడుగుపెట్టిన పర్యాటక శాఖ దోచుకోవడమే లక్ష్యంగా తయారైంది. ఫలితంగా మైలవరం పర్యాటక కేంద్రానికి కోట్ల రూపాయల నిదులు విడుదలయినా ఎనిమిదేళ్లుగా కనీస అభివృద్ది పనులకు కూడా నోచుకోకుండా కునారిల్లిపోతోంది. పాలకులు నిధులు మంజూరు చేయించడంలో చూపిన వాటిని అభివృద్ది చేయించడంలో మాత్రం కనిపించడం లేదు. దీంతో నాడు ఎంతో పేరున్న మైలవరం పర్యాటకం నేడు వెలవెలబోతోంది.
జిల్లాలోనే ప్రత్యేక ప్రాంతంగా, పర్యాటక కేంద్రంగా పేరుపొందిన మైలవరం అందాలు మరుగున పడిపోయాయి. సహజ సిద్దంగా ఏర్పడిన కొండ కోనలతో, ప్రకృతి అందాలు, కొండలను మధ్యలో చీలుస్తూ ప్రవహించే పెన్నమ్మ సోయగాలు, పెన్నానది వెంబడి ప్రకృతి పరంగా ఏర్పడిన వింతలు విశేషాలు మైలవరం పర్యాటకం సొంతం. మూడున్నర్ర దశాబ్దాల కిందట మైలవరం జలాశయం నిర్మాణంతో పాటు పర్యాటక కేంద్రంగా రూపొంది పర్యాటకుల మనసును దోచేసింది. మైలవరంను పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేస్తామంటూ పర్యాటక శాఖ 28జనవరి 2004లో అడుగు పెట్టింది. మైలవరం అభివృద్దిని దశల వారీగా చేపడతామని అప్పట్లో పర్యాటక శాఖామాత్యులు ప్రకటించారు. ఈ క్రమంలో కొద్ది కాలంలోనే దాదాపు రూ.1.98 కోట్లు అభివృద్ది పనులకు ఎమ్మెల్యే విడుదల చేయించారు. మైలవరంలో 2005లో పర్యటించిన పర్యాటక శాఖ ఎండి రేమండ్ పీటర్ మనసును దోచేశాయి మైలవరం అందాలు. పర్యాటక కేంద్రంగా చేపట్టడానికి అనువైన సర్వేలకు పూనుకున్నారు. ఈ క్రమంలోనే టూరిజం జిఎం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో 2005 అక్టోబర్‌లో మూడు రోజుల పాటు సర్వేలు నిర్వహించారు. చేపట్టాల్సిన పనులపై పలు నివేదికలను రూపొందించి నివేదించారు. తరువాత అధికారులెవ్వరూ ఇటువైపు కనె్నత్తి చూడలేదు. 2007లో ఏప్రిల్‌లో పర్యాటక శాఖ ఇడి, ఒఎస్డీ, ఎస్‌ఇ అధికారుల బృందం మైలవరంలో పర్యటించి 1.5 ఎకరాల స్థలాన్ని పరిశీలించారు. 2009 నవంబర్‌లో పర్యాటక శా ఖ సుమారు రూ.60 లక్షలతో టూరి జం రెస్టారెంట్ చేపట్టి 2011లో ప్రారంభించారు. రెస్టారెంట్ తప్ప ఇతర ఎటువంటి అభివృద్ది పనులు చేపట్టలేదు. 2004 నుండి మైలవరంలో టూరిజం శాఖ బోటింగ్ నిర్వహిస్తున్నా ఇప్పటికీ కనీసం పర్యాటకులు జలాశయం ఒడ్డు నుండి బోటులోకి ఎక్కడానికి కనీసం ప్లాట్‌ఫాం కూడా ఏర్పాటు చేయని నిర్లక్ష్యంలో అధికారులు వున్నారని పర్యాటకులు తీవ్రంగా మండిపడుతున్నారు. అపిట్‌కో ఆధ్వర్యంలో రూ.కోటితో ప్రత్యేక పండుగ రోజు తప్ప వెళ్లని ప్రాంతమైన శ్రీఅగస్తేశ్వర కోన వద్ద కొండలో టిక్‌టాక్ బిల్డింగ్ నిర్మాణంను చేపట్టారు. పూర్తయి ఏళ్లు గడుస్తున్నా ఇంతవరకు అధికారులు, గుత్తేదారుల మధ్య సమన్వయం లేక ఇంతవరకు టిక్‌టాక్ బిల్డింగ్ ప్రారంభానికి నోచుకోలేదు. పర్యాటక శాఖ అధికారుల తీరుతో ఎం తో పేరున్న మైలవరం పర్యాటక కేం ద్రం అభివృద్దికి నోచుకోక దీన పరిస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ఈ విషయంపై కనీసం జిల్లా ఉన్నతాధికారులై నా స్పందించి తగిన చర్యలు చేపట్టి గత ప్రాభవం పొందేలా అభివృద్ది చేయాలని పర్యాటకులు కోరుతున్నారు.