కడప

మంత్రి పదవికి ముందే ఎమ్మెల్యే గిరీకి రాజీనామా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, ఏప్రిల్ 4: మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆదినారాయణరెడ్డి రెండు రోజుల క్రితమే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం. ప్రతిపక్ష నేత జగన్ నుంచి ఎదురవనున్న సవాళ్లను దృష్టిలో పెట్టుకుని మంత్రి పదవి ఖరారు కాగానే టిడిపి అధినేతకు చెప్పి మరీ ఎమ్మెల్యే పదవికి ఆది రాజీనామా చేసినట్లు సమాచారం. ఈ మేరకు రాజీనామా లేఖను స్పీకర్‌కు అందజేసినట్లు తెలుస్తోంది. జగన్మోహన్‌రెడ్డి తన రాజీనామాకు డిమాండ్ చేస్తారని ముందుగానే ఊహించిన ఆది మంత్రిపదవి చేపట్టడానికి ముందే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం. ఆదినారాయణరెడ్డి తెలుగుదేశంపార్టీలో చేరినప్పటి నుంచి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో వైసిపి అభ్యర్థిపై పోటీచేసి గెలుపొందుతానని పలుమార్లు ప్రకటిస్తూ వచ్చారు. మంత్రివర్గ విస్తరణ ముందు ఇలాంటి సాంకేతిక సమస్యలు వస్తాయని ముఖ్యమంత్రితో అన్నట్లు సమాచారం. తాజగా వైకాపా ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడంపై జగన్ గవర్నర్‌ను కలిసిన నేపధ్యంలో ఎమ్మెల్యే ఆది రాజీనామా అంశం వెలుగుచూసింది. జమ్మలమడుగులో తమకు ఎదురులేదని, నియోజకవర్గంలో మాజీమంత్రి పి.రామసుబ్బారెడ్డితో చేతులు కలిపిన దృష్ట్యా బలం మరింత పెరిగిందని ఆది ధీమాగా ఉన్నారు. ఇదే విషయాన్ని అధినేత వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకాను ఓడించామని, జమ్మలమడుగులో ఉప ఎన్నిక జరిగితే గెలవడం ఏమంత కష్టం కాదని అని అన్నట్లు సమాచారం. అందులో భాగంగానే రాజీనామాను ఎప్పుడైనా ఆమోదించుకునేందుకు ముందస్తుగానే స్పీకర్‌కు అందజేసినట్లు తెలుస్తోంది.

ఆరు రోజులుగా ఎక్కడి లారీలు అక్కడే..

కడప,ఏప్రిల్ 4: లారీ యజమానులు తమ సమస్యలు పరిష్కారానికి ఆరు రోజులుగా యజమానులు సమ్మెలో దిగి ఎక్కడి లారీలు అక్కడ నిలిపివేశారు. ప్రస్తుతం అరకొర నిత్యవసర సరుకులు ఎగుమతులు, దిగుమతులు అవుతుండగా బుధవారం నుంచి నిత్యావసర సరుకులు కూడా పూర్తిగా రవాణాను నిలిపివేయనున్నారు. జిల్లా వ్యాప్తంగా 10వేల లారీలు ఎక్కడబడితే అక్కడ నిలిపివేశారు. ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల లారీల సమ్మె పురస్కరించుకుని శనివారం నుంచి దేశవ్యాప్తంగా లారీలను నిలిపివేయాలని ట్రాన్స్‌పోర్టు ఏపి అసోసియేషన్ పిలుపునిచ్చింది. పెట్రోలు ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్‌లో తగ్గుముఖం పట్టినా డీజల్ రేటు తగ్గలేదని, లారీల విడిభాగాలు ధరలు విపరీతంగా పెరిగాయని, టోల్‌గేట్లలో తోలు వలుస్తున్నారని, థర్డ్‌పార్టీ ఇన్సురెన్స్ పెంపును ఉపసంహరించుకోవాలని తదితర డిమాండ్లతో లారీ యజమానులు సమ్మెకు దిగారు. ఇప్పటికే గత ఆరురోజులుగా మార్కెట్‌లో ఆహారపదార్థాల రేట్లు పెంచడం, కావాల్సినన్ని కూరగాయలు దిగుమతి చేసుకోవడం, ఇతర రాష్ట్రాలనుంచి వచ్చే కూరగాయలు, పండ్లు ధరలు పెరిగిపోవడంతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. అలాగే డీజిల్ ట్రాన్స్‌పోర్టులు, గూడ్స్ ట్రాన్స్‌పోర్టు అసోసియేషన్ కూడా సమ్మెలో దిగనున్నాయి. రైతులు పండించుకున్న అరకొర పత్తి, పసుపు, కూరగాయలు, బుడ్డశెనగలు, వరి, వేరుశెనగ ఉత్పత్తులను ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లి అమ్మాలనుకున్నా రైతులకు లారీల సమ్మెతో ఢీలాపడ్డారు. అసలే రైతులు పండించిన పంటలకు అంతంతమాత్రమే ధరలు ఉండటంతో ప్రస్తుత లారీల సమ్మెకారణంగా ఎగుమతులు ఆగిపోయి రైతులు అనేక చిక్కుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. ముఖ్యంగా జిల్లాలో పలు ప్రాంతాల్లో మామిడి, టమోటా, అరటి తదితర పంటలు సాగుచేసిన పండ్లతోటల రైతులు కుదేలౌతున్నారు. అసలే కరవుకోరల్లో చిక్కుకున్న జిల్లా రైతాంగానికి లారీల సమ్మె శాపంగా మారింది. అలాగే పలువురు వ్యాపారులు ఆహార వస్తువులను నిల్వచేసుకుని కృత్రిమకొరత సృష్టిస్తూ దగ్గుతూ వెళితే సొంటి మిరమన్న తరహాలో వ్యాపారులు ఆడిందే ఆటగా పాడిందే పాటగా పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం వెంటనే లారీల యజమానుల న్యాయమైన సమస్యలను పరిష్కరించకుంటే జనజీవనం పస్తులుండే అవకాశాలున్నాయి. అలాగే 30వేల మంది డ్రైవర్లు, క్లీనర్లు, కార్మికులు రోడ్డునపడ్డారు. అలాగే వాటిని మరమ్మత్తులు చేసే షెడ్లలో ఇబ్బందికరమైన పరిస్థితులు నెలకొన్నాయి. వెంటనే ప్రభుత్వం లారీల సమ్మెను విరమింపచేసి ప్రజలను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఆకట్టుకుంటున్న ఒంటిమిట్ట
బ్రహ్మోత్సవాల బుక్‌లెట్

రాజంపేట, ఏప్రిల్ 4:రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి దేవస్థానంలో బుధవారం తెల్లవారుజాము 3గంటలకు సుప్రభాతంతో మొదలవుతున్న శ్రీరామనవమి బ్రహ్మోత్సవ వివరాలు తెలుపుతూ తిరుమల తిరుపతి దేవస్థానం ముద్రించిన 16 పేజీల బుక్‌లెట్ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. మొదటి పేజీలో కల్యాణ అలంకారంలో సీతారామలక్ష్మణులతో పాటు ఒంటిమిట్ట ఆలయ వ్యూ ఇమేజ్‌ను బ్లాక్ అండ్ వైట్‌లో ముద్రించారు. బుక్‌లెట్ చివరి పేజీలో ఒంటిమిట్ట ఆలయ వ్యూతో పాటు సీతారామలక్ష్మణులు ఇమేజ్‌లతో పాటు ఒంటిమిట్ట శ్రీ కోదండరామునిపై రచించిన కీర్తన అన్నమాచార్యులు పాడుతున్నట్టుగా ముద్రించడం విశేషం.
3ఇందులోనే కానవద్దా యితండు దైవమని..
విందువలె నొంటిమెట్ట వీరరఘురాముని2
అని లభ్యమైన అన్నమయ్య కీర్తనల రేకుల్లో 96వ రేకులో సంపుటం-1లో 477వ పాటగా ఈ కీర్తనను ఒంటిమిట్ట శ్రీ కోదండరామునిపై అన్నమయ్య కీర్తనగా పేర్కొంటూ ముద్రించారు. అలాగే లోపలి పేజీలలో బ్రహ్మోత్సవాల్లో ఆయా రోజుల్లో నిర్వహించే విశేష పూజా కార్యక్రమాలు, అర్చనలు, స్వామివారి విశేషాలంకరణలు, సాయంకాలం వాహనసేవలు, స్వామివారి కల్యాణోత్సవం, రథోత్సవం, పుష్పయాగం, ఏకాంతసేవలతో కూడిన ఫొటోలు ముద్రించారు. అలాగే ప్రతిరోజు బ్రహ్మోత్సవాల్లో నిర్వహించనున్న పలు ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాల వివరాలు తెలియజేశారు. ఒంటిమిట్ట ఆలయ చరిత్రను రెండవ పేజీలో క్లుప్తంగా వివరిస్తూ, ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయాన్ని 2015 సెప్టెంబర్ 9వ తేదీ దేవాదాయ ధర్మాదాయ శాఖ నుండి తిరుమల తిరుపతి దేవస్థానం విలీనం చేసుకున్న అంశాన్ని కూడా తెలియజేయడం జరిగింది.

విష్వక్సేన ఆరాధన

ఒంటిమిట్ట, ఏప్రిల్ 4:ఏకశిల శ్రీ రాములోరి బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం మొదటి రోజు రాత్రి విష్వసేన ఆరాధనతో కూడిన అంకురార్పణ కార్యక్రమం కన్నుల పండుగ శోభాయమానంగా సాగింది. ముందుగా శ్రీ సీతారామలక్ష్ముణులను ఆలయ మధ్యరంగంలో ఆసీనులు చేసి విష్వసేన పూజలు చేశారు. డిప్యూటీ ఇఓ సుబ్రమణ్యం దంపతులచే పండితులు మహా సంకల్పం నిర్వహించారు. అనంతరం స్వస్తిపుణ్యావాచనం, గణపతి పూజ, పంచారాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం పండితులు ఈ కార్యక్రమం ప్రారంభించారు. మధ్య మధ్యలో కేరళ వాయిద్య బృందం, శాస్ర్తియ సంగీతాల మధ్య విశ్వక్ సేన ఆరాధన సాగింది. అనంతరం పుట్టబంగారం కోసం పుట్ట వద్ద శాస్త్రోక్తంగా పూజలు చేశారు. తీసిన పుట్టమన్నును తలపై పెట్టుకుని అంకుర్ఫారణ జరిపారు. పాల్గొన్న టిటిడి అధికారులకు పండితులు కంకణధారణ చేశారు. మొదటి రోజు పూజా కార్యక్రమాలను శోభాయమానంగా జరిపారు.

ముస్లింలను నిర్లక్ష్యం చేస్తున్న సీఎం చంద్రబాబు

కడప,(కల్చరల్)ఏప్రిల్ 4: ముస్లింల అభివృద్ధికోసం ఆ పథకాలు ప్రవేశపెట్టాం, ఈపథకాలు ప్రవేశపెట్టామని గొప్పలు చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు తన మంత్రివర్గంలో ఒక ముస్లింకు కూడా మంత్రి పదవి ఇవ్వలేదని, ప్రధానంగా మైనార్టీశాఖకు ప్రత్యేక మంత్రి లేకుండా పాలన సాగించడం ఒక చంద్రబాబుకే దక్కుతుందని జిల్లా మైనార్టీనేత, ప్రముఖ సంఘసేవకులు సయ్యద్ సలావుద్దీన్ విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాలన్నీ మైనార్టీశాఖకు ముస్లింను మంత్రిగా చేసిన వారేనని ఆయన గుర్తు చేశారు. దీంతో ఒక ముస్లిం కూడా లేని క్యాబినెట్‌గా చంద్రబాబు చరిత్ర సృష్టించారని ఘాటుగా విమర్శించారు. అలాగే టిడిపి పాలనలో ముస్లింలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, రాష్ట్రంలో జనాభా ప్రాతిపదికగా ముస్లిం వర్గాలు రెండవస్థానంలో ఉన్నారన్నారు. అదేవిధంగా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంతోపాటు ఇతర రాష్ట్రాలు ముస్లింలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నాయని, పొరుగున ఉన్న తెలంగాణ ప్రభుత్వం కూడా ముస్లింవర్గానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. టిడిపి ప్రభుత్వం ముస్లింలను మోసగించడం మంచిదికాదన్నారు. ఈ సమావేశంలో మైనార్టీ నాయకులు అషఫ్ అలీఖాన్, అక్బర్ అలీ, ఇక్బాల్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.