కడప

చేనేతలపై జీఎస్టీ భారం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మలమడుగు, జూన్ 18: రెక్కాడినా డొక్కాడని చేనేతన్నకు కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకువస్తున్న పన్నుపోటు భారంగా మారింది. నిత్య సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న చేనేత రంగంపై 5శాతం జిఎస్టీ భారం తీవ్ర ప్రభావం పడనుంది. జిఎస్టీ పన్నుపై చేనేతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఒకే దేశం ఒకే పన్ను విధానంను అమలుకు తీవ్ర ప్రయత్నాలు అనంతరం జిఎస్టీపై పలు సవరణల అనంతరం జూలై 1వ తేదీ నుండి అమలులోకి రానుంది. ఎన్డీఎ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న జిఎస్టీతో చేనేత రంగంలో ఉపయోగించే చిలపనూలుపై పన్నులు విధింపు జరుగుతోంది. పన్ను విధంపుపై చేనేత రంగం నుండి సర్వత్రా తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో పలుచోట్ల చేనేత రంగం నుండి నిరసన జ్వాలలు కూడా వెల్లువెత్తుతున్నాయి. పన్నులు లేని చిలపనూలుపై తొలిసారిగా వాజ్‌పేయి నాయకత్వంలోని ఎన్డీఎ ప్రభుత్వం 2002-03 బడ్జెట్‌లో 9.2శాతం సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటి విధించింది. దీంతో అప్పట్లో రాజకీయాలకు అతీతంగా ఐక్యంగా ఉద్యిమాలు జరిగాయి. చేనతే కేంద్రాలలో నిరాహార దీక్షలు, ధర్నాలు, రాస్తారోకోలు పెద్ద ఎత్తన నిర్వహించారు. అప్పటి చేనేతల ఉద్యమ ఫలితంగా 2004లో అధికారంలోకి వచ్చిన యుపిఎ ప్రభుత్వం చిలపలనూలుపై విధించిన ఎక్సైజ్ డ్యూటిని రద్దు చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత రంగంపై సవతితల్లి ప్రేమను ప్రదర్శించడంతో నానాటికీ చేనేత రంగం పరిస్థితి దిగజారుతోంది. కుటీర పరిశ్రమైన చేనేత రంగాన్ని దెబ్బతీసుస్తన్న మిల్లు, పవర్‌లూమ్ రంగాల నుండి రక్షణ కల్పించాలని, సంవత్సరాల తరబడి చేనేత సంఘాలు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. మిల్లులు, పవర్‌లూమ్ రగాలకు వేల కోట్ల రూపాయలు రాయితీలు ఇస్తూండడంతో చేనేత రంగం తీవ్ర సంక్షోభం వైపుకు పయనిస్తోంది. మిల్లు, పవర్‌లూమ్ రంగాలు ఉత్పత్తి చేసిన వస్త్రాలు చేనేత రంగం ఉత్పత్తి చేసిన వస్త్రాల కన్నా తక్కువ ధరలకు లభిస్తూండడంతో సామాన్య ప్రజలు మిల్లు, పవర్‌లూమ్ వస్త్రాల వైపు మొగ్గు చూపుతున్నారు. మరమగ్గాల రంగం పోటీని తట్టుకోలేక చేనేత రంగం కుదేలవుతుంది. ప్రపంచీకరణ నేపథ్యంలో నేపథ్యంలో మిల్లు, పవర్‌లూమ్ రంగాలు ఉత్పత్తిచేసిన వస్త్రాలు సామాన్యుల అందుబాటు ధరలలో ఉంటే చేనేత రంగం ఉత్పత్తులు ఎగువ మధ్య ఉన్నతవర్గాలకు మాత్రమే పరిమితం అవుతున్నాయి. ఇప్పటికే పెరిగిన రసాయనాలు, నూలు ధరలతో చేనేత రంగం కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. చేనేత రంగంలో వస్త్ర తయారీకి కూలీ కూడా గిట్టుబాటు కాక ఇతర రంగాలకు వలసలు పోతున్నారు. ఉపాధికోసం చేనేతలు ఇతర ప్రాంతాలకు వలస సపోతున్నా, మరోవైపు చేనేత సహకార రంగానికి గతంలో ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహకాలను రానురాను ప్రభుత్వాలు తగ్గిస్తున్నాయి. కేంద్రంలో రెండో ఎన్డీఎ ప్రభుత్వం చిలపనూలుపై మరోసారి 5శాతం జిఎస్టీ విధించడంతో గోరుచుట్టపై రోకటిపోటులా పరిణమించింది. చేనేత రంగంపై జిఎస్టీ పన్నుపోటు ఆ రంగాన్ని నడ్డి విరుస్తుందంటున్నారు చేనేతన్నలు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి చిలపనూలుపై విధించిన జిఎస్టీని తొలగించి చేనేత పరిశ్రమ రక్షణకు చర్యలు తీసుకోవాలని చేనేత సంఘాలు, చేనేత నాయకులు డిమాండ్ చేస్తున్నారు. జిఎస్టీతో సంక్షోభంలోకి చేనేత రంగం:
- బి.చంద్రవౌళి, చేనేత సమస్యల పరిష్కార జిల్లా కమిటి సభ్యుడు
జిఎస్టీ పన్నుతో చేనేత రంగంపై తీవ్ర ప్రభావం పడుతుంది. చేనేత ఉత్పత్తులకు సరైన గిట్టుబాటు ధర లేక చేనేత రంగం సంక్షోభంలో ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో పన్ను వల్ల జిల్లా వ్యాప్తంగా 10వేల కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఈ విషయాన్ని జిల్లా సమావేశంలో లేవనెత్తి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, పన్ను విషయంలో చేనేతలకు న్యాయం జరిగేందుకు మా వంతు కృషి చేస్తాం.

రైతు బజార్లలో దళారుదే రాజ్యం..!

కడప,జూన్ 18: ప్రస్తుతం వ్యవసాయ మార్కెట్ మేజర్ మండలాల్లోనూ, నియోజకవర్గ, జిల్లా కేంద్రాల్లో ఉన్నా రైతులు పండించిన పండ్లు, కూరగాయలు బజార్లకు తీసుకెళితే దళారులు ప్రవేశించి రైతు మార్కెట్లలో రాజ్యమేలుతున్నారు. వ్యవసాయ మార్కెట్ యార్డులో కూడా ఆరుగాళాలు శ్రమించి పండించిన పంటలకు ప్రతిఫలం దక్కకుండా నకిలీ వ్యాపారస్తులు రైతుల అవతారమెత్తి మార్కెట్ యార్డుల్లో కూడా రైతులను దగా చేస్తున్నారు. అలాగే డ్వాక్రా మహిళలను ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెట్టినా వారి వ్యాపారాల్లో కూడా దళారులదే పెత్తనం కొనసాగుతోంది. అడుగడుగునా రాజకీయనేతల వత్తిళ్లతో ప్రభుత్వ పథకాలు నీరుగారిపోతున్నాయి. జిల్లాలో పులివెందుల, రాయచోటి, రైల్వేకోడూరు, మైదుకూరు తదితర ప్రాంతాల నుంచి అరటి, మామిడి కూరగాయలసాగు నడిరోడ్లపైనే బజార్లలో రైతులు మార్కెట్‌కు పండిన కాయలు, పండ్లను తీసుకొస్తే వాహనాల నుంచి రైతులు తమ సరుకులను కిందకు దించకముందే రాబందుల తరహాలో దళారులు నకిలీ రైతుల తరహాలో రాజ్యమేలుతున్నారు. కాగా హలం బట్టే రైతును ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవడానికి దళారీ వ్యవస్థను రూపుమాఫీ రైతు బజార్లు నెలకొల్పేందుకు ప్రభుత్వ శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం ప్రభుత్వం ప్రతి నియోజకవర్గ కేంద్రంలో 20నుంచి 40సెంట్లలో రైతు బజార్లను కడప, ప్రొద్దుటూరులలో రెండేసి రైతు బజార్లు నెలకొల్పేందుకు శ్రీకారం చుట్టారు. గతంలో కడప, ప్రొద్దుటూరులో ఉన్న రైతుబజార్లు మూతపడ్డాయి. జిల్లా నుంచి మండలస్థాయి వరకు 50 నుంచి 200 ఎకరాల వరకు ఫుడ్ ప్రాససింగ్ యూనిట్లు కూడా నెలకొల్పనున్నారు. ప్రస్తుతం రైతు బజార్లు ఏర్పాటుకు మార్కెటింగ్‌శాఖ ఈ బడ్జెట్‌లో భారీ ఎత్తున నిధులు కేటాయించినట్లు తెలుస్తోంది. జిల్లాను హార్టికల్చర్ హబ్‌గా మారుస్తామని ముఖ్యమంత్రి ఇప్పటికే హామీ ఇవ్వడం, రైతులు పండించిన కొన్ని పంటలకు కోల్డ్ స్టోరేజిలు ఏర్పాటుచేసి మార్కెట్ సౌకర్యం కల్పించేందుకు కూడా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. వాస్తవంగా ఆరుగాళాలు కష్టపడే రైతులను గుర్తించి ప్రభుత్వం వారికి గుర్తింపుకార్డులు జారీ చేసి రైతు బజార్లలో స్థలాలు కేటాయించి తనిఖీలుచేసి వారికి న్యాయం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా వివిధ మార్కెట్లలో రైతులకు ఎటువంటి సౌకర్యాలు లేని కారణంగా రైతులు పండించిన ఉత్పత్తులు మార్కెట్‌కు తెచ్చేలోపే దళారులు వాటిని లాక్కుంటున్నారు. ఇప్పటికైనా రైతు బజార్లలో ఇక నుంచి పాత పద్ధతులకు స్వస్తిచెప్పి నిజమైన రైతులకు న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే రైతుల పంటలకు గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

ఖరీఫ్‌పై రైతన్న ఆశలు.!

కడప,జూన్ 18: జిల్లాలో వరుసకరవులతో సతమతమవుతున్న రైతన్న మరోసారి ఖరీఫ్‌పై ఆశలు పెంచుకుని మొండిగా సాగుకు సిద్ధమవుతున్నాడు. గత నాలుగురోజులుగా వర్షాలు ఓ మోస్తరులో కురుస్తున్నాయి. దీంతో రైతులు సాగుకు సిద్ధమవుతున్నారు. పండ్ల తోటలకు ఈ వర్షాలు కొంత ఊరట నిచ్చాయని ఉద్యానవన రైతులు అభిప్రాపడుతున్నారు. ఆదివారం చక్రాయపేట మండలంలో 26.2మి.మీ, పెనగలూరులో13.4 మి.మీ, సింహాద్రిపురం మండలంలో 20మి.మీ, మూడు డివిజన్లలో ఆ మండలాల్లో నమోదైన వర్షపాతం. అలాగే శనివారం సాయంత్రం చక్రాయపేట మండలంలో 10.6మి.మీ, రైల్వేకోడూరులో 24.4మి.మీ, బద్వేలు మండలంలో 40.2మి.మీ, గోపవరంలో 33.6మి.మీ, ముద్దనూరులో 49.8మి.మీ, చాపాడులో 44.2 మి.మీ, మైదుకూరులో 42.4మి.మీ, రాజుపాళెంలో 39.4మి.మీ, కొండాపురంలో 32.2మి.మీ, మైలవరంలో 26.4మి.మీ, సింహాద్రిపురంలో 16.2మి.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. సర్వసాధారణంగా ఖరీఫ్ సీజన్‌లో భాగంగా జూన్ చివరివారం కానీ జూలై మొదటి, రెండు వారాల్లో మెట్టప్రాంతాల్లోని పంటలసాగును రైతులు పూర్తి చేయాల్సివుంది. అయితే జిల్లాలో వరుస కరవులతో సతమతమవుతున్న రైతాంగానికి ఏ పంటసాగుచేస్తే చేతికి పంట వస్తుందో పెట్టుబడులు తక్కువవుతాయోనని రైతులు యోచిస్తున్నారు. ఖరీఫ్‌సీజన్‌లో ప్రారంభంలోనూ, మొలకెత్తే దశలోను వర్షాలు ఆశాజనకంగా కురవడం, పంటలో గింజ ఉత్పత్తి సమయానికి, పంట దిగుబడి సమయానికి వర్షం జాడ కన్పించకపోవడంతో దిగుబడి సమయానికి పంట చేతికి అందకపోవడంతో రైతులు వేరుశెనగపై ఆశలు వదులుకుంటున్నారు. ముఖ్యంగా జిల్లాలో వర్షంపై ఆధారపడి రాయచోటి, లక్కిరెడ్డిపల్లె, కడప, పులివెందుల, రాజంపేట, ప్రొద్దుటూరు తదితర ప్రాంతాల్లో వేరుశెనగపై ఆధారపడి విస్తృతంగా సాగుచేస్తున్నారు. అయితే గత ఏడాది కూడా 64150 మంది రైతాంగం 52433 హెక్టార్లలో వేరుశెనగసాగు చేయడం, పంట దిగుబడి నాటికి వర్షాలు కురవక చివరకు పశువులకు కూడా మేత లభించక పొలాలపైనే పంటలు వదులుకోవాల్సి వచ్చింది. ఒకప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు విత్తనం వేరుశెనగకాయలు ఏపీ సీడ్స్, మార్క్‌ఫెడ్ సంస్థల నుంచి ప్రభుత్వం కొనుగోలుచేసే రైతులకు సబ్సిడీతో పంపిణీ చేసేది. అయితే ప్రస్తుతం అందుకు భిన్నంగా వేరుశెనగ రైతులు బయట నుంచి సరఫరా అయ్యే నారాయణి, కే-6 విత్తనాలకు వెతుకులాటలో ఉన్నారు. ఇటీవల ప్రభుత్వం సరఫరా చేసిన సబ్సిడీ విత్తనం కాయల్లో పుచ్చులు రావడంతో రైతులు వాటిని తిరిగి వాటిని సరఫరాచేసిన ఏపిసీడ్స్, మార్క్‌ఫెడ్ సంస్థలకే అప్పగించారు. ప్రస్తుతం కొంతమంది రైతులు వేరుశెనగ సాగుకు సుముఖంగా ఉన్నా విత్తనం కాయల కోసం వ్యాపారులను, దళారులను ఆశ్రయిస్తూ అధిక వడ్డీలతో ఖరీఫ్ వేరుశెనగకు సాగుచేసేందుకు సమాయత్తం అవుతున్నారు. మరికొంతమంది ఖరీఫ్‌లో పంటలు దిగుబడి అవుతాయోలేదోనని కంది, పెసర, మినుము, సజ్జ, జొన్న, అనప, ఉలవ, అలసంద తదితర చిరుధాన్యాలు సాగు చేసుకోవడమే శ్రేయస్కరమని భావించి ఆ పంటలసాగుకు సమాయత్తం అవుతున్నారు. గతంలో వ్యవసాయం పశువులపై ఆధారపడి ఉన్న రైతులు యంత్రాలరాకతో యంత్రాలతో వ్యవసాయం భరించలేక ఆశించిన విధంగా పూర్తిస్థాయిలో దుక్కులు చేయకుండా మొక్కుబడిగా దుక్కులుచేసి సాగుకు సమాయత్తం అవుతున్నారు. రుతుపవనాలు సకాలంలో ప్రవేశించిన పంట దిగుబడి సమయానికి వరుణుడి కరుణ కరవవుతుందని అనుమానంతో అధిక సంఖ్యలో రైతులు ఖరీఫ్ పంటలసాగుపై తటపటాయిస్తున్నారు. జిల్లాలో పంటలపై మమకారం చంపుకుని మామిడి, అరటి, బొప్పాయి, దానిమ్మ, చీనీ, నిమ్మ తోటలపైనే ఆసక్తి కనబరుస్తూ సాగు చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఓ మోస్తరులో కురుస్తున్న వర్షాలతో పండ్లతోటల రైతులకు ఊరటనిస్తోంది. ప్రభుత్వం జిల్లాను హార్టికల్చరల్ క్లబ్‌గా ప్రకటించడంతో చాలా మంది రైతులు ప్రభుత్వంపై గంపెడు ఆశలుపెట్టుకుని ఎదురుచూస్తున్నారు. మొత్తంమీద ఖరీఫ్‌సీజన్ ప్రారంభంతో రైతులకు అన్నీ కష్టాలే మొదలయ్యాయి.

సూక్ష్మసేద్యంపై సీఎం దృష్టి..

కడప,జూన్ 18: అత్యంత కరవు జిల్లా అయిన కడప జిల్లాకు సాగు నీరందించేందుకు ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా రూ.219కోట్లతో ఎత్తిపోతల పథకాల ద్వారా 37,606 ఎకరాలకు నీరందించేందుకు తగు చర్యలు తీసుకున్నారని చెప్పవచ్చు. ఈ నేపధ్యంలో రాష్టన్రీటి పారుదల అభివృద్ధి సంస్థ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు జిల్లా నీటిపారుదలశాఖ అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఇప్పటి వరకు 36 ఎత్తిపోతల పథకాలు పూర్తి చేసేందుకు కోట్ల రూపాయలు ఖర్చుచేశారు. ముఖ్యంగా ఒంటిమిట్ట ఎత్తిపోతల పథకం కింద సోమశిల ప్రాజెక్టు ఎగువ ప్రాంతం నుంచి 0182 టిఎంసిల నీటిని తీసుకుని వచ్చేందుకు 465హెచ్‌పి మూడుమోటార్ల పంపుసెట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఒంటిమిట్ట మండలంలోని 17గ్రామాలకు తాగునీటి అవసరాలకు ఒంటిమిట్ట పెద్దచెరువుకు నీరు నింపి తద్వారా భూగర్భజలాలు అభివృద్ధి చేసి ఒంటిమిట్ట చెరువుకింద ప్రత్యక్షంగా 1014 ఎకరాల ఆయకట్టును సాగుదలకు తీసుకొని వచ్చి పరోక్షంగా 3వేల ఎకరాలకు సాగునీరు అందించే దిశగా అధికారులు చర్యలు చేపట్టారు. అంతేగాకుండా ఏడాది క్రితం 10 ఎత్తిపోతల పథకాలకు శ్రీకారం చుట్టి రూ.90కోట్లు అంచనాల విలువతో 10588 ఎకరాలకు నీరిచ్చేందుకు చర్యలు వేగవంతం చేశారు. రెండవ దశలో మరో 4 ఎత్తిపోతల పథకాలకు రూ.54కోట్లతో 5663 ఎకరాలు సాగుకు 2వ ఫేస్ కింద జిల్లాలో రూ.4.90కోట్లతో 6757 ఎకరాలు సాగుకు ఎత్తిపోతల పథకానికి పనులు శరవేగంతో చేపట్టేందుకు చర్యలు చేపట్టారు. సాగునీరు, తాగునీరు సమస్య లేకుండా ఉండేందుకే సూక్ష్మసేద్యానికి ప్రాధాన్యతనిస్తూ ఎత్తిపోతల పథకం నిర్మాణం శ్రేయస్కరమేనని భావించి జలవనరులశాఖ నడుం బిగించింది. మేజర్, మీడియం, మైనర్ ఇరిగేషన్ శాఖాధికారులు ఎత్తిపోతల పథకంపై ప్రత్యేక దృష్టిసారించి ఈ పథకాలను వేగవంతంగా పనులు చేపట్టారు. ఆశాఖల్లో 20మంది పైబడి ఇంజనీరింగ్ అధికారుల పోస్టులు ఖాళీగా ఉన్నా, ఉన్న అధికారులతోనే ఎత్తిపోతల పథకాలకు సాంకేతిక సమస్యలు ఉత్పన్నవౌతున్నా వాటిని అధిగమించి ఎత్తిపోతల పథకంలో ముఖ్యమైన నీటి పథకాలనే పూర్తిచేసి ఆయకట్టును పెంచేందుకు కృషి చేస్తున్నారు. గత ఏడాది ఏప్రిల్ 20న ఒంటిమిట్ట ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టి జిల్లా వ్యాప్తంగా ఎత్తిపోతల పథకాలకు అదేరోజు ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు ప్రారంభించారు. వీటితోపాటు జలవనరుల సంరక్షణకు పాపాగ్ని నదిలో భాగంగా చక్రాయపేట, పెండ్లిమర్రి, కమలాపురం ప్రాంతాల్లో సర్పేస్ డ్యామ్‌లను కూడా నిర్మిస్తున్నారు. ఆ డ్యామ్‌ల పరిసర ప్రాంతాల్లో ఉన్న చెరువులకు నీరిచ్చి తద్వారా తాగునీటి సమస్య శాశ్వతంగా పరిష్కరించి సాగునీరే ధ్యేయంగా పనులు చేపట్టారు. గతంలో ఎన్నడూలేని విధంగా జిల్లాలో జలసంరక్షణ ధ్యేయంగా పెట్టుకుని ప్రభుత్వం పనులను వేగవంతం చేస్తోంది.

ఘనంగా నాగారపమ్మ తిరుణాల

సుండుపల్లె, జూన్ 18: ప్రసిద్ధిచెందిన నాగారపమ్మ జాతరలో భాగంగా శనివారం రాత్రి నుంచి నిర్వహించిన మారుపల్లెం జాతర ఉత్సవం ఘనంగా జరిగింది. మండల పరిధిలోని పెద్దినేనికాల్వ పంచాయతీ బండకాడ ఈడిగపల్లె వద్ద భక్తుల కొంగుబంగారంగా వెలిసియున్న నాగారపమ్మ జాతర ప్రతి యేటా ఏరువాక పౌర్ణమిలో నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఈ యేడాది ఈ నెల 11, 12వ తేదీలలో జాతర నిర్వహించగా మారుపల్లెం జాతర ఉత్సవం శని, ఆదివారాల్లో నిర్వహించారు. ఈ ఉత్సవానికి కూడా వివిధ ప్రాంతాల నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. మొక్కుబడులు ఉన్న భక్తులు తమ మొక్కులు తీర్చుకోవడానికి చాందినీబండ్లను ఏర్పాటు చేశారు. శనివారం పగలు పూజల అనంతరం అర్ధరాత్రి నుంచి వివిధ ప్రాంతాల నుంచి బయలుదేరిన చాందినీబండ్లు బాణసంచా పేలుళ్లు వివిధ రకాల కళాకారుల చెక్క్భజనలు, కోలాటాలు, డప్పు వాయిద్యాల నడుమ ఆదివారం తెల్లవారుజామున ఆలయ ప్రాంతానికి చేరుకున్నారు. ఆలయ ప్రాంగణమంతా భజనలు హోరెత్తాయి. ఈ సందర్భంగా భక్తులు మంగళ వాయిద్యాల నడుమ బోనాలు తీసుకెళ్లి అమ్మవారికి సమర్పించి జంతుబలులతో మొక్కులు చెల్లించుకున్నారు. నాగారపమ్మ మారుపల్లెం జాతరకు మడితాడు పంచాయతీ చండ్రాజుగారిపల్లెకు చెందిన రమేష్‌రాజు, అతని సోదరుడు ఎన్ ఆర్ ఐ ప్రసాదరాజులు సాంప్రదాయబద్ధంగా ఎద్దులతో చాందినీబండి ఏర్పాటు చేశారు. ఈ చాందినీబండికి విజయవాడ నుంచి పిలిపించిన ప్రత్యేక డప్పు వాయిద్య కళాకారుల బృందం చేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. చండ్రాజుగారిపల్లె నుంచి చాందినీబండి వెంట జాతరలో ఆలయ ప్రదర్శన సందర్భంగా కళాకారులు ప్రత్యేకంగా తమ డప్పులు వాయిస్తూ నృత్యాలు చేస్తూ అందరినీ ఆకట్టుకున్నారు. నాగారపమ్మ మారుపల్లెం జాతరలో భాగంగా పలువురు భక్తులు అమ్మవారికి తలనీలాలు సమర్పించారు. తమ కోర్కెలు తీర్చిన నాగారపమ్మకు తమ మొక్కుబడులలో భాగంగా తలనీలాలు సమర్పించుకుంటున్నట్లు ఈ సందర్భంగా భక్తులు తెలిపారు. పుట్టువెంట్రుకలను పలువురు భక్తులు అమ్మవారికి సమర్పించారు. ఆలయం ఎదురుగా భక్తులు కొబ్బరికాయలు కొట్టి అమ్మవారిని దర్శించుకున్నారు.

నీటి పథకం పనుల్లో వేగం పెంచాలి
సుండుపల్లె, జూన్ 18: సుండుపల్లె మండల వాసులకు శాశ్వత తాగునీటి సమస్య పరిష్కారంలో భాగంగా ఏర్పాటు చేస్తున్న నీటిపథకం పనుల్లో మరింత వేగం పెంచాలని రాజంపేట శాసనసభ్యులు, విప్ మేడా మల్లిఖార్జునరెడ్డి గ్రామీణ తాగునీటి సరఫరా అధికారులకు సూచించారు. అన్నమయ్య ప్రాజెక్టు వెనుకవైపు ఆర్.బుడిగుంటపల్లె సమీపంలో చెయ్యేరు నదిలో ప్రస్తుతం ఆ నీటిపథకంలో భాగంగా జరుగుతున్న బావుల నిర్మాణ పనులను ఆదివారం విప్ మేడా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుండుపల్లె వాసులకు తాగునీటిని అందించేందుకు మంజూరైన రూ.50 కోట్లతో జరుగుతున్న పనులు వేగంగా జరుగుతున్నాయని, వాటిని మరింత వేగంగా చేపట్టి పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. నదిలో బావుల నిర్మాణం త్వరగా పూర్తి చేస్తే అనంతరం పైపులైన్లు గ్రామాల్లో ఓవర్‌హెడ్ ట్యాంకు నిర్మాణ పనులు చురుకుగా సాగుతాయని ఆయన పేర్కొన్నారు. ఆ బావుల నిర్మాణ స్థలంలోనే ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులకు పలు సూచనలు చేశారు. పనుల వేగంతో పాటు నీటిపథకం పనుల్లో నాణ్యత కూడా ఉండాలని సూచించారు. తాగునీటి పథకం పనుల పరిశీలనలో ఆయన వెంట టీడీపీ మండల శాఖ అధ్యక్షుడు శివారెడ్డి, టీడీపీ నాయకుడు మహేశ్వర్‌రాజు, తిమ్మసముద్రం ఎంపీటీసీ మోహన్‌బాబు, పలువురు ఉన్నారు. కాగా సుండుపల్లె మండలంలోని జి.రెడ్డివారిపల్లె పంచాయతీ చప్పిడివాండ్లపల్లె, మడితాడు పంచాయతీ చండ్రాజుగారిపల్లెలో ఆదివారం జరిగిన విందు కార్యక్రమాల్లో విప్ మేడా మల్లిఖార్జునరెడ్డి పాల్గొన్నారు. చప్పిడివాండ్లపల్లెలో టీడీపీ నాయకుడు చప్పిడి మహేష్‌నాయుడు గ్రామ సమీపంలోని మంచాలమ్మకు ప్రత్యేక పూజలతో పాటు విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు. చండ్రాజుగారిపల్లెకు చెందిన ఎన్‌ఆర్‌ఐ ప్రసాదరాజు కుటుంబసభ్యులు నాగారపమ్మ మారుపల్లెం జాతరకు చాందినీబండి ఏర్పాటు చేసి గ్రామంలో విందు ఏర్పాటు చేశారు. ఈ విందు కార్యక్రమాల్లో టీడీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు కుసుమకుమారి, పార్టీ నాయకులు శివారెడ్డి, రాజకుమార్‌రాజు, మహేశ్వర్‌రాజు, శివకుమార్‌నాయుడు, మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

రూ.కోట్లలో క్రికెట్ బెట్టింగ్..

కడప,జూన్ 18: పాకిస్తాన్ -ఇండియా మధ్య ఆదివారం జరుగుతున్న క్రికెట్ టోర్నీపై జిల్లా వ్యాప్తంగా రూ.కోట్లలో పందేలు కాచినట్లు తెలుస్తోంది. కాగా ఈ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లపై ఉన్న నమ్మకంతో బెట్టింగ్ రాయుళ్లు రూ. లక్షల్లో పందెం కాచారు. భారత్ ఓటమి చెందడంతో బెట్టింగ్ రాయుళ్లు నిరాశ చెందారు. దీంతో దాదాపు వంద కోట్లు చేతులు మారినట్లు సమాచారం. అంతర్ రాష్ట్రాల్లో ప్రసిద్ధిగాంచిన జిల్లా క్రికెట్ బుక్కీలు కడప, ప్రొద్దుటూరు ప్రాంతాల్లో మకాం వేసి మరీ బరితెగించి బెట్టింగ్ కాచారు. మొన్నటి వరకు ఐపిఎల్ క్రికెట్ మ్యాచ్‌లపై బెట్టింగ్ కోట్లరూపాయల్లో పందేలుకాచి, వందలాదికోట్లరూపాయలకు పడగలెత్తిన బుక్కీలు పదేళ్ల తర్వాత ఐసిసి ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్‌పై క్రికెట్ అభిమానుల ఆసక్తిని బుక్కీలు సొమ్ముచేసుకున్నారు. కొంతమంది రాజకీయ పార్టీ నేతల కనుసన్నల్లో బెట్టింగ్‌లు బరితెగించినా సంబంధిత అధికారులు పెద్దగా పట్టించుకోక పోవడంతో కర్నాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతోనే జిల్లాలోని బుక్కీలు బెట్టింగ్ రాయుళ్లు పందెం కోట్లరూపాయాల్లో కాచారు. మ్యాచ్ మ్యాచ్‌కు బుక్కీలు రంగంలో దిగి క్రికెట్ బెట్టింగ్‌ను చాలా మంది లాభసాటి వ్యాపారంగా ఎంచుకుని ఫోన్ల ద్వారా గుట్టుచప్పుడు కాకుండా పందేలు కాయడం, క్రికెట్ బుక్కీలు జనవాసాల్లో సర్వం సిద్ధం చేసుకుని ఇంటర్నెట్, సెల్ ఫోన్ల ద్వారా సబ్ ఏజెంట్లను నియామకం చేసుకుని క్రికెట్ బెట్టింగ్‌లు నిర్వహించినట్లు తెలుస్తోంది. గతంలో రెండుజట్ల మధ్య గెలుపు ఓటముల మధ్య గెలుపుకాచే బెట్టింగ్ రాయుళ్లు ఆటగాళ్లపై, ఓవర్ ఓవర్‌కు, బాల్ బాల్‌కు పందేలు కాచారు. ముఖ్యంగా ఇండియా-బంగ్లాదేశ్ మధ్య గత గురువారం జరిగిన రెండవ సెమీఫైనల్స్‌లో విరాట్‌కోహ్లీ 60పరుగులు దాటినప్పటిన తర్వాత సెంచరీ చేస్తారని కొంతమంది, చేయరని మరికొంతమంది బెట్టింగ్‌లు కాచారు. గతంలో ఇండియా క్రికెటర్లపై అభిమానం చూపే క్రికెట్ ఫ్యాన్స్ అభిమానం వదులుకుని కేవలం పందేలపై చూపుపెట్టి డబ్బుసంపాదనే ధ్యేయంగా పెట్టుకుని ఆదివారం జరిగిన ఐసిసి చాంపియన్ ట్రోఫీలో భారత్ -పాకిస్తాన్ జట్ల తలపడిన నేపధ్యంలో క్రికెట్ అభిమానులు ఆటను వీక్షిస్తే బెట్టింగ్ రాయుళ్లు పాకిస్తాన్ జట్టు గెలుపొందుతుందని కూడా పందేలు కాచినట్లు తెలుస్తోంది. క్రికెట్ మ్యాచ్‌ల పనితీరుపై ఎప్పటికప్పుడు తాజా సమాచారం బుక్కీలు కనుక్కొంటూ ముంబాయి, చెన్నై, ఇతర ప్రాంతాల మాఫీయాలతో బుక్కీలు సంబంధాలు పెట్టుకుని ఇంచుమించు దక్షిణ భారతదేశంలోనే జిల్లాకు చెందిన బుక్కీలు క్రికెట్ బెట్టింగ్‌లు కాస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో ఎన్నడూ క్రికెట్ బెట్టింగ్‌లు జరగని విధంగా క్రికెట్ బెట్టర్లు, జూదం రాయుళ్లు, బుకీలు బరితెగించి బెట్టింగ్‌లకు పోటాపోటీగా పాల్పడినట్లు తెలుస్తోంది. అయితే ఎస్పీ రామకృష్ణ సెలవుపై వెళ్లడంతో ఈ బెట్టింగ్‌లో ప్రముఖ పారిశ్రామికవేత్తలు, రియల్డర్లు, కొంతమంది వైద్యులు, కొంతమంది వ్యాపారవేత్తలు, సంపన్నకుటుంబాలకు చెందిన యువకులు , ఉద్యోగులు, రాజకీయనాయకులు ఐసిసి చాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్‌కు కాసుల కోసం బరితెగించి బెట్టింగ్‌లు కాచి చేతులు కాల్చుకున్నారు.

నత్తనడకన రేషనలైజేషన్!

కడప,జూన్ 18: ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల హేతుబద్దీకరణ, ఉపాధ్యాయుల బదిలీ షెడ్యూల్ ప్రక్రియ రేషనలైజేషన్ పేరిట విద్యాశాఖ నత్తనడకలో నిర్వహిస్తున్నారనేది జగమెరిగిన సత్యం. జూలై 3లోగా బదిలీల ప్రక్రియ పూర్తి చేయాల్సివుండగా ఈ బదిలీల ప్రక్రియ పూర్తికి మరో నెలరోజులపాటు గడువు పొడిగిస్తూ జూలై 24కు బదిలీల ప్రక్రియ ముగియనుంది. రేషనలైజేషన్ ప్రక్రియ పుణ్యమా అని బదిలీల ప్రక్రియ ముందుకుసాగడం లేదు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు తొలుత ప్రకటించిన గడువుముగిసినా రేషనలైజేషన్ పుణ్యమా అని ఈనెల 28వరకు దరఖాస్తులు చేసుకోవడానికి గడువు పొడిగించారు. ఈ ఏడాది ఏప్రిల్ 31 వరకు విద్యార్థులను పరిగణలోకి తీసుకుని హేతుబద్దీకరణ అమలు చేయనున్నారు. ఉపాధ్యాయుల ఖాళీలు ఈనెల 27న వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చి బదిలీ దరఖాస్తులు 27,28వ తేదీల్లో దరఖాస్తుకు గడువు ఇచ్చారు. జిల్లాలో 100పాఠశాలలు పైబడి రేషనలైజేషన్ కింద మూతపడనున్నాయి. 4573 పాఠశాలలు ఉండగా 60ప్రాథమికపాఠశాలలు, 34 ప్రాథమికోన్నత పాఠశాలలు, 2 హైస్కూల్స్, 96స్కూల్స్ మూతపడనుండగా 10మంది విద్యార్థుల్లోపు 46 పాఠశాలలు ఉండగా, వాటిని మూతవేసేందుకు అధికారులు తర్జన భర్జనలు పడుతూ రేషనలైజేషన్ అనంతరం ఈనెల 27న వెబ్‌సైట్‌లో వాటిని కనబర్చనున్నారు. మూతపడే పాఠశాలల ఉపాధ్యాయులకు ప్రభుత్వం విధించిన బదిలీ ప్రక్రియకు గడువున్న వారిని ఆ ఉపాధ్యాయులు కోరుకునే ప్రాంతాల్లోనే సర్దుబాటు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా 3వేల మంది ఉపాధ్యాయులు అర్హులుగా ఉన్నారు. పాఠశాలలు మూతవేసే ప్రాంతాల్లో దాదాపు 300 మంది ఉపాధ్యాయులుండగా వారు కోరుకున్న ప్రాంతాల్లో బదిలీ లను అధికారులు అంగీకరించకుంటే న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు కూడా ఉపాధ్యాయులు సిద్ధపడుతున్నారు. బదిలీ ప్రక్రియ గత ఏడాది కూడా జాప్యం జరగడం, ఈ ఏడాది కూడా జాప్యంతో ఉన్నత పాఠశాలల్లో సిలబస్ పూర్తయ్యేది గగనంగానే ఉంటుంది. బదిలీల ప్రక్రియలో రోజుకొక నిబంధనలు ప్రభుత్వం మార్చుతుండటంతో రేషనలైజేషన్ ప్రక్రియ ఉపాధ్యాయ బదిలీలకు గొడ్డలి పెట్టుగా మారింది. అయితే ఇప్పటి వరకు ఆన్‌లైన్‌లో బదిలీల దరఖాస్తులు అందుబాటులో లేవు. తాజాగా ప్రభుత్వం షెడ్యూల్డ్ మార్పుతో ఒకపక్క రేషనలైజేషన్, మరో పక్క బదిలీల ప్రక్రియ నత్తనడకలో సాగుతూ బదిలీలకు అర్హులైన ఉపాధ్యాయులను ఉక్కిరి బిక్కిరి చేస్తూ పాఠాల బోధన ముందుకుసాగక 4లక్షల మంది విద్యార్థులను వారి తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది.