కడప

చంద్రబాబు పాలనలో బిసిలకు పెద్దపీట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,అక్టోబర్ 17: తెలుగుదేశం ప్రభుత్వపాలనలో ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు బిసిలకు పెద్దపీట వేశారని తెలుగుదేశం పాలన హయాంలోనే బిసిలకు న్యాయం జరిగిందని అర్హులైన ప్రతి బిసికి రుణ సహాయం తమ ప్రభుత్వమే చేస్తుందని రాష్ట్ర వడ్డెర సహకార సంఘాల ఫెడరేషన్ చైర్మన్ దేవళ్ల మురళి పేర్కొన్నారు. మంగళవారం ఆయన నగరంలో పర్యటించి జిల్లా బిసి కార్యాలయాన్ని సందర్శించారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఏ ప్రభుత్వం ఎన్నడూ బిసిలకోసం ఫెడరేషన్లు ఏర్పాటు చేయలేదని, బిసిలు ఆర్థికంగా ఎదిగేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కులాలవారీగా ఫెడరేషన్లు ఏర్పాటుచేసి అందరికీ సమన్యాయం జరిగే విధంగా ఫెడరేషన్ల చైర్మన్ల నియామకం చేసి బిసిలకోసం అనేక సంక్షేమపథకాలు ప్రవేశపెట్టిన ఘనత చంద్రబాబుదేనన్నారు. ముఖ్యంగా ఎన్‌టిఆర్ ఉన్నత విద్య పథకం కింద ప్రతి ఒక్కరికీ రూ.10లక్షలు ఖర్చుపెట్టి విదేశంలో ఉన్నత విద్య చెప్పించేందుకు ప్రభుత్వం సహకరిస్తోందని ఆయన గుర్తు చేశారు. బిసిల వివాహానికి రూ.30వేలు, దుల్హన్ పథకం బిసిలకు కూడా వర్తింపచేసిన ఘనత బాబుదే అన్నారు. బ్యాంకులు రుణాలు ఇవ్వడంలో జాప్యం చేస్తున్నారని త్వరగా రుణాలు ఇచ్చేందుకు ప్రభుత్వం వత్తిడి తీసుకురావడం జరుగుతుందని అవసరమనుకుంటే తమశాఖ అధికారులు బ్యాంకులకెళ్లి రుణాలు ఇప్పిస్తారని ఆయన స్పష్టం చేశారు. తాను 13 జిల్లాల్లో పర్యటించి రాష్ట్రప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను వడ్డెర కులస్తులకు అందేవిధంగా విచారిస్తున్నానని వడ్డెరులు కూడా తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించాలని ఆయన సూచించారు. జిల్లాకు ఈ ఆర్థికసంవత్సరంలో 1400 యూనిట్లు వస్తాయని, మరికొన్ని యూనిట్లు వచ్చేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. రుణాలు తీసుకునే గ్రూప్‌లకు ఒక్కో గ్రూప్‌లో 15మంది సభ్యులుంటారని ఆ సభ్యుల్లో మూడు భాగాలుగా చేసి అధిక రుణాలు పొందే అవకాశం కూడా కల్పిస్తున్నామని, చేతి పనులు చేసుకునే వారికి అధిక ప్రాముఖ్యత ఇస్తామని, ఇంచుమించు బిసిల్లో సగం కులాలు చేతిపని వారేనని వడ్డెర కులానికి చెందిన వారు అధికశాతం చేతిపని చేసుకుంటున్నారని వారందరీకి రుణాలు ఇచ్చి ఆదుకుంటామన్నారు. ముఖ్యంగా చంద్రన్న బీమా పథకంలో ప్రతి కార్మికుడు రూ.15లు చెల్లించి రిజిస్టర్‌చేసుకుని బీమా పథకం పొందడంతోపాటు వారికి ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా వృత్తిరీత్యా ప్రమాదాలు సంభవించినా ఆ కుటుంబమంతా జీవించేందుకు చంద్రన్నబీమాపథకం ఎంతో తోడ్పాటు అందిస్తుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నీ ప్రజలందరికీ ఎంతో ఉపయోగంగా ఉన్నాయని 80శాతం మంది ప్రజలు ప్రభుత్వంపై సంతృప్తిగా ఉన్నారని , 2019 ఎన్నికల్లో తిరిగి టిడిపి ప్రభుత్వమే ఏర్పాటుచేస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ పనితీరు, సంక్షేమపథకాలు, అభివృద్ధి పనులు తెలుసుకునేందుకు ఇంటింటికీ టిడిపి కార్యక్రమం ద్వారా తాము వెళ్లినప్పుడు ప్రజల్లో విశేషస్పందన లభిస్తోందన్నారు. ప్రతి పక్షాలు పనిబాట లేకుండా అధికారదాహంతో ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఆ విమర్శల వల్ల వారికి ఒరిగేది ఏమీలేదని ప్రజలను తప్పుదారిపట్టిస్తే ప్రజలే తగిన బుద్ధిచెబుతారన్నారు. బిసిల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి పాటుపడుతున్నందున మంగళవారం బిసి కులానికి చెందిన కర్నూలు ఎంపి బుట్టా రేణుక తన అనుచరులతో టిడిపిలో చేరారని అందుకు నిదర్శనం బాబు బిసిలకు ఇస్తున్న చేయూత, రాష్ట్భ్రావృద్ధి, సంక్షేమ పథకాల అమలుతీరేనన్నారు. సమావేశంలో బిసి కార్పొరేషన్ ఇడి రామచంద్రారెడ్డి, బిసి వెల్పేర్ అధికారిణి లక్ష్మీకాంతమ్మ తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థిని మృతిపై విచారణ

కడప,అక్టోబర్ 17: ఇటీవల నారాయణ బాలికల రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలకు చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థిని పావని మృతిపై ప్రభుత్వం ఆదేశాల మేరకు జాయింట్ కలెక్టర్ శే్వత తెవతియను విచారణ అధికారిగా కలెక్టర్ బాబూరావు నియామకం చేశారు. ఇప్పటికే ఆమె ఆ సంఘటన పూర్వాపరాలను రెవిన్యూ, పోలీసు, విద్యాశాఖ అధికారులతోపాటు కాలేజి యాజమాన్యం నుంచి తెప్పించుకున్నారు. తొలుత ఆమె సోమవారం రాత్రే పావని తల్లిదండ్రులు శివమ్మ, మల్లేశ్వరరెడ్డిలను పిలిపించుకుని వారి వాంగ్మూలం రికార్డు చేసినట్లు తెలుస్తోంది. సంఘటనా ప్రదేశం చింతకొమ్మదినె్న మండలం కృష్ణాపురంలోని నారాయణ కళాశాల స్థితిగతులపై పోలీసులను అడిగి తెలుసుకున్నారు. పావని మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించిన డాక్టర్ శోభారాణి , డాక్టర్ ఆనందకుమార్‌లను కూడా జెసి పిలిపించుకుని వారి వాంగ్మూలం రికార్డు చేసినట్లు తెలుస్తోంది. చింతకొమ్మదినె్న ఎస్‌ఐ హేమకుమార్‌ను కూడా విచారించారు. అన్నికోణాల నుంచి విచారణ జరగనుంది.
ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి ఉండాలి

చక్రాయపేట, అక్టోబర్ 17: మండలంలో ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి కట్టించుకోవడానికి ఆయా శాఖల అధికారులు చొరవ తీసుకోవాలని కలెక్టర్ బాబురావునాయుడు పేర్కొన్నారు. మంగళవారం చక్రాయపేట వెలుగు కార్యాలయంలో అన్ని శాఖల అధికారులు అంగన్‌వాడీ వర్కర్లు, పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యంగా గ్రామ పంచాయతీకి ప్రత్యేకాధికారి ఉంటారని ఆ పంచాయతీలలో ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క అధికారి పనిచేసేందుకు కంకణం కట్టుకోవాలన్నారు. ముఖ్యంగా మరుగుదొడ్డి లేనివారు డబ్బు ఉండి కట్టుకోలేని వారు పూర్తి చేయాలన్నారు. అలాగే డబ్బు లేక కట్టుకోలేని వారికి గ్రామ సంఘాల ద్వారా కానీ, స్ర్తి నిధి ద్వారా కానీ వారికి నిధులు అందజేసి మరుగుదొడ్డి నిర్మించుకోవాలన్నారు. అలాగే స్థలం లేకుండా కట్టుకోలేని వారు తహసిల్దార్‌ను సంప్రదించి ఊరు సమీపంలో ప్రభుత్వ స్థలంలో మరుగుదొడ్డి నిర్మించుకునేందుకు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఆరుబయట నిర్మించుకునే మరుగుదొడ్డికి డోర్ నెంబర్ వేసి నిర్మించుకునేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అలా మూడు విభాగాలుగా పనిచేసేందుకు సంబంధిత అధికారులు కంకణం కట్టుకోవాలన్నారు. మరుగుదొడ్లు పూర్తి చేయాలని మరుగుదొడ్డి లేక ఆరుబయట మలవిసర్జన చేస్తే వ్యాదుల బారిన పడాల్సి వస్తుందని, అలా కాకుండా అటు ఆరోగ్యకరంగాను, ఇటు సౌకర్యంగాను ఉండేందుకు ప్రతి ఒక్క ఇంటికీ మరుగుదొడ్డి నిర్మించుకునేందుకు అన్ని శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో జేడీ ఠాగూర్‌నాయక్, స్పెషలాఫీసర్ చాముండేశ్వరీ, ఎంపీడీవో విజయమ్మ, తహశీల్దార్ నాగేశ్వరరావు, ఎస్ ఐ గోవిందరెడ్డి, ఏపీవో ఆదెప్ప, ఏపీ ఎం వీరాంజనేయులుతో పాటు అన్ని శాఖల అధికారులు, అంగన్‌వాడీ, ఆశావర్కర్లు, డ్వాక్రా సంఘాల లీడర్లు తదితరులు పాల్గొన్నారు.

పేలుతున్న టపాసుల ధరలు!

కడప,(కల్చరల్)అక్టోబర్ 17: దీపావళి పండుగకు టపాసులు కాలిస్తే శబ్ధం వస్తుందో రాదో తెలియదు కానీ, ధరలు మాత్రం ఈమారు పేలుతున్నాయి. గత ఏడాది కంటే ఈసారి 50శాతం ధరలు పెరగడంతో సామన్య, మధ్యతరగతి ప్రజలు దీపావళి పండుగకు దూరంగా ఉన్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. పిల్లల కోసం ఎంత తక్కువలో టపాసులు కొనాలన్నా రూ.1000లు పెట్టాల్సిందే. కాకర వొత్తులు, చిచ్చుబుడ్డిలు, బూచక్రాలు, విష్ణుచక్రాలు, తాళ్లు, సీమటపాసులు, లక్ష్మీటపాసులు, సరాలు, ఫ్యామిలీప్యాకెట్లు, రాకెట్లు, ఫ్యాన్సీ టపాసులు, తారాజువ్వలు తదితర టపాకులన్నీ ఏ దుకాణలో చూసినా ఎవరికి నచ్చిన ధరల్లో వారు అమ్ముతున్నారు. అలాగే సంబంధిత దుకాణాల వద్ద టపాసుల ధరల అయితే కంపెనీ టపాసులు, లోకల్‌గా తయారుచేసిన టపాసులను ఏవి అనేవి వినియోగదారులు తెలుసుకోలేకపోతున్నారు. కారణం సంబంధిత టపాసుల ధరల పట్టికలను ఆయా దుకాణాల వద్ద ఏర్పాటు చేయకపోవడమే ఇందుకు కారణమని చెప్పవచ్చు. అలాగే కొన్ని టపాసులు కంపెనీ బ్రాండ్లు అంటూ అధిక ధరలతో అమ్ముతున్నారని వినియోగదారులు వాపోతున్నారు. కానీ అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నా ధరల నియంత్రణలో ఎలాంటి చర్యలు తీసుకోలేదని వినియోగదారులు అధికారులపై విమర్శలు గుప్పిస్తున్నారు. అలాగే దుకాణాల దారులకు కావాల్సిన కనీస సౌకర్యాలు ఉన్నాయా లేదా అన్న విషయాన్ని కూడా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని షాపుల యజమానులు వాపోతున్నారు. కేవలం లైసెన్సులు ఇవ్వడం, వాటికి సంబంధించిన ఆదాయాన్ని సమకూర్చుకోవడంతోనే తమ పని ముగిసినట్లు అధికారులు యజమానులు విమర్శిస్తున్నారు. ఏది ఏమైనా ఈ ఏడాది టపాసుల ధరలు పేలిపోతుండటంతో అటు సామాన్య, ఇటు మధ్యతరగతి ప్రజలు దీపావళి పండుగకు దూరంగా ఉన్నారని చెప్పక తప్పదు.

పోలీసుల ఆధ్వర్యంలో స్వచ్ఛతాహీ సేవ

సంబేపల్లె, అక్టోబర్ 17: సంబేపల్లె పోలీసు శాఖ ఆధ్వర్యంలో స్వచ్ఛతా సేవా కార్యక్రమాన్ని మంగళవారం ఎస్ ఐ సయ్యద్‌హషం పర్యవేక్షణలో స్థా నిక మోడల్ స్కూల్, జడ్పీ ఉన్నత పా ఠశాల విద్యార్థులతో నిర్వహించారు. పోలీసు అమరువీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమంలో భాగం గా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఎస్‌ఐ సయ్యద్‌హషం చెప్పారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ పోలీసు ఉన్నతాదికారుల ఆదేశాల మేరకు విద్యార్థులతో పాఠశాల క్రీడా మైదానంలోని పిచ్చిమొక్కలను తొలగించామన్నారు. ఎక్కువగా పిచ్చిమొక్కలతో నిండిన ఈ ప్రాంతం శ్రమదానం తరువాత శుభ్రంగా కనిపిస్తోందన్నారు. అంతేకాకుండా చేతుల శుభ్రతపై ఆయన విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఏదైనా పని చేసిన తరువాత చేతులను సబ్బు, డెట్టాల్‌లతో శుభ్రపరచుకోవాలని విద్యార్థులకు సూచించారు.
పోలీసు సంస్మరణ దినోత్సవ ర్యా లీ: పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాల నుండి విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు.
ఈ కార్యక్రమం రూరల్ సీఐ నరసింహరాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. విద్యార్థులు అమరవీరులకు జోహార్లు అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ సయ్యద్‌హసం. ఉపాధ్యాయులు, పోలీసు శాఖ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

మరుగుదొడ్ల లక్ష్యం పూర్తి చేయాలి : కలెక్టర్

కమలాపురం, అక్టోబర్ 17: వందశాతం మరుగుదొడ్ల లక్ష్యం పూర్తి చేయకపోతే బాధ్యులైన ఉద్యోగులకు అవసరమైతే వేతనాల నిలపుదల చేస్తామని కలెక్టర్ బాబురావు హెచ్చరించారు. ఆయన మంగళవారం స్థానిక మండల పరిషత్ సభాభవనంలో అధికారులు, పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 27న ముఖ్యమంత్రి నిర్వహించే సమీక్షాసమావేశం నాటికి అన్ని గ్రామాల్లో కూడా మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందుకోసం సంబంధిత అధికారులు ప్రజలను చైతన్యపరిచి వారి అవసరాలను గుర్తించి నిర్మాణాలు పూర్తి అయ్యేలా చూడాలన్నారు. అవసరమైన ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు. మండలంలో మరో 16 పంచాయతీల్లో వేగవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో స్ఫెషల్ ఆఫీసర్ శ్యాంసుందర్‌రెడ్డి, ఎంపిడివో నాగరాజు, ఏపివో శైలజ, ఆర్‌డబ్ల్యూయస్ ఇంజనీర్, అధికారులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా మండల పరిషత్ సభా భవనంలో మంగళవారం నియోజకవర్గంలోని మండలాల అధికారులు, సర్పంచులు, కార్యదర్శులతో స్పెషల్ ఆఫీసర్ శ్యాంసుందర్‌రెడ్డి అధ్యక్షతన గ్రామాల అభివృద్ధి పై సమావేశం నిర్వహించారు. ఇందులో ఎంపిడివో నాగరాజు, ఏపివో శైలజ, ఏపియం జగధీశ్వరి అధికారులు పాల్గొన్నారు.
పేదలందరికీ ప్రభుత్వ పథకాలు

కడప,(కల్చరల్)అక్టోబర్ 17: వచ్చే జనవరి నాటికంతా వందశాతం పేదలందరికీ ప్రభుత్వ పథకాలు అందించడమే ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు లక్ష్యమని మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయులు అన్నారు. మంగళవారం స్థానిక ప్రకాష్‌నగర్ 14వ డివిజన్‌లో డివిజన్ ఇన్‌ఛార్జి ఎం.విజయకుమారి ఆధ్వర్యంలో ఇంటింటికీ టిడిపి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరైన బత్యాల చెంగల్రాయులు, రాష్టన్రాయకులు ఎస్.గోవర్దన్‌రెడ్డి, పార్టీ జిల్లా కార్యదర్శి బి.హరిప్రసాద్‌లు తొలుత ఎన్‌టి రామారావు చిత్రపటానికి పూలమాలవేసి, పార్టీ జెండాను ఆవిష్కరించి డివిజన్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటికీ 80శాతం మంది పేదలకు ప్రభుత్వ పథకాలన్నీ అందుతున్నాయన్నారు. వచ్చే జనవరిలో నిర్వహించే జన్మభూమి కార్యక్రమంలో మిగిలిన 20శాతం మంది పేదలకు కూడా పథకాలు అందేలా కృషిచేసి వందశాతం పూర్తి చేస్తామన్నారు. ప్రధానంగా ప్రతిపక్ష నేత పార్టీని, ముఖ్యమంత్రి చంద్రబాబును విమర్శించడమే ధ్యేయంగా పెట్టుకుని పనిచేస్తున్నారన్నారు. ఇనే్నళ్లు కనపడని బిసిలు ఇప్పుడు గుర్తుకొచ్చారా అని ఎద్దేవా చేశారు. టిడిపి ప్రభుత్వమే బిసిలలోంచి పుట్టుకొచ్చిందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఇప్పటికైనా జగన్ ముఖ్యమంత్రిని విమర్శించడం మానుకుని అభివృద్ధికి సహకరించాలని సూచించారు. అనంతరం ప్రతి ఇంటికి నాయకులు వెళ్లి వారి సమస్యలు తెలుసుకుని సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో నగర అధ్యక్షుడు జిలానీబాషా, మైనార్టీ రాష్టన్రాయకులు విఎస్ అమీర్‌బాబు, డివిజన్ ఇన్‌చార్జ్ ఎం.విజయకుమారి, ఫ్లోర్ లీడర్ జికె విశ్వనాధరెడ్డి, దాసరి శ్రీనివాసులు, జలతోటి జయకుమార్, మధు,సుబ్బరాయుడు, శశిధర్, మాసాపేట శివ, జనార్ధన్, గంగయ్య, మీనాక్షి, గంగాదేవి, నాగమ్మ, వినయ్‌కుమార్, భానుప్రకాష్, సురేష్, పవన్‌కుమార్, వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

కేరళకు వైవియు మహిళా వాలీబాల్ జట్టు

కడప,అక్టోబర్ 17: కేరళ రాష్ట్రం కన్నూర్ విశ్వవిద్యాలయంలో ఈనెల 20 నుంచి 25 వరకు జరిగే సౌత్ జోన్ వాలీబాల్ అంతర్ విశ్వవిద్యాలయ పోటీలకు యోగివేమన విశ్వవిద్యాలయ మహిళా జట్టు మంగళవారం కేరళకు బయలుదేరి వెళ్లారు. ఈ జట్టులో ఉన్న క్రీడాకారిణలకు 15రోజులపాటు యోగివేమన విశ్వవిద్యాలయంలో వైవియు క్రీడాబోర్డు కార్యదర్శి డా.రామసుబ్బారెడ్డి ప్రత్యేక శిక్షణ ఇప్పించారు. ఆ జట్టులో ఉన్న విద్యార్థినిలు ప్రాక్టీస్ చేశారు. అలాగే ఈ విశ్వవిద్యాలయంలో ఉన్న విద్యార్థినిలు ఇటీవల జరిగిన అంతర్ జిల్లా ఖోఖో పోటీల్లో వైవియు జట్టు ప్రధమస్థానం దక్కించుకుంది. క్రీడలపట్ల విద్యార్థిని విద్యార్థులు శ్రద్ధ తీసుకునేందుకు వైవియు అధికారులు విశేషంగా కృషి చేస్తున్నారు. కేరళకు వెళ్తున్న మహిళా వాలీబాల్ జట్టుకు వైవియు వైస్ చాన్సలర్ ఆచార్య రామచంద్రారెడ్డి, రిజిస్టర్ ఆచార్య కె.చంద్రయ్య, వైవియు క్రీడాబోర్డు కార్యదర్శి డా.కె.రామసుబ్బారెడ్డి, వ్యాయామ క్రీడా విభాగం కో ఆర్డినేటర్ డా.చాన్‌బాషా, అధ్యాపకులు, విద్యార్థులు మంగళవారం ఘనంగా వీడ్కోలు చెప్పి పథకం గెలుచుకుని రావాలని ఆకాంక్షించారు.

రైతులకు వర్మీ కంపోస్టు ఎరువులు అందిస్తాం

ఖాజీపేట,అక్టోబర్ 17: రైతుల నుంచి పేడను సేకరించి వర్మీకంపోస్టు ఎరువులను తయారుచేసి ఇస్తామని జిల్లా కో-ఆర్డినేటర్ జుబేదా తెలిపారు. ఖాజీపేట డంపింగ్‌యార్డు పనితీరును పరిశీలించి తెలుసుకునేందుకు గోపవరం మండలంలోని 5 గ్రామపంచాయతీలకు చెందిన ప్రజాప్రతినిధులు, కార్యదర్శులు మంగళవారం వచ్చారు. డంపింగ్‌యార్డులోని పలు విభాగాలను వారు పరిశీలించి వాటిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం పంచాయతీ కార్యాలయంలో ఈవోఆర్డీ రాధాకృష్ణవేణి, సిఆర్‌పి సుబ్బారెడ్డి లతో కలిసి కో ఆర్డినేటర్ ప్రజాప్రతినిధులకు సూచనలు, సలహాలు ఇచ్చారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో 12920 పంచాయతీలను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సంకల్పించిందన్నారు. గ్రామపంచాయతీల్లో పారిశుద్ధ్యం ప్రజల్లో అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. రైతుల నుంచి, బజారుల్లో ఉన్న పేడను సేకరించి డంపింగ్‌యార్డుల ద్వారా వర్మీ కంపోస్టును తయారుచేసి మేలైన అధిక దిగుబడి తెప్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందన్నారు. ఇందులో భాగంగా జిల్లాలో 7 మండలాలైన సిద్దవటం, పుల్లంపేట, రాజుపాలెం, వేంపల్లె, సికెదినె్న, గోపవరం, మైలవరం మండలాలను ఎంపిక చేశారన్నారు. ఈ మండలాల్లోని సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు, కార్యదర్శులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు చేయించి తద్వారా వర్మీకంపోస్టు, పారిశుద్ధ్యం లాంటి పనులను చేట్టనున్నట్లు తెలిపారు. ఈనెల 17 నుంచి 25వ తేదీ వరకు విడతల వారీగా ఆయా మండలాల్లో శిక్షణ తరగతులు ఉంటాయన్నారు. గోపవరం మండలానికి చెందిన సర్పంచ్‌లు లక్ష్మీదేవి, సునీత, శ్రీనివాసులురెడ్డి, వెంకటనారాయణ, లక్ష్మీదేవి, బాల ఓబయ్య, జయరామిరెడ్డి, కార్యదర్శులు విజయకుమార్, మోషా, వెంకటసుబ్బయ్య, వెంకట లక్షుమ్మలు హాజరై అక్కడి పరిస్థితులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. తమ గ్రామపంచాయతీలను కూడా మెరుగ్గా తీర్చిదిద్దుకుంటామని వారన్నారు. జిల్లాలో 22 మండలాల్లో డంపింగ్‌యార్డుల్లో 10 పూర్తిచేసి పనులు ప్రారంభించామన్నారు. 12 నిర్మాణంలో ఉన్నాయని కో ఆర్డినేటర్ తెలిపారు.

ఎస్సీ,ఎస్టీ కమిషన్‌ను ఆశ్రయించిన డ్వామా మాజీ పిడి రమేష్

కడప,అక్టోబర్ 17: దాదాపు ఏడాది క్రితం డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్‌గా పనిచేసిన రమేష్ భారత ఎస్సీ,ఎస్టీ కమిషన్‌ను ఆశ్రయించారు. ఆయన ఏడాది క్రితం వ్యవసాయశాఖ నుంచి డిప్యుటేషన్‌పై కడప డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్‌గా విధుల్లో చేరారు. డ్వామా పిడిపై పలు ఫిర్యాదులు దరిమిలా ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన ఏకంగా పోలింగ్ కేంద్రానికి రావడం, ఆయనకు అప్పగించిన విధుల్లో కాకుండా ఇతర విధుల్లో జోక్యం చేసుకున్నారని అప్పటి కలెక్టర్‌గా పనిచేసి ఇటీవల పదవీ విరమణ చేసిన కెవి సత్యనారాయణ రమేష్‌ను డ్వామా పిడి విధుల నుంచి తప్పించి తన మాతృశాఖకు అప్పగించారు. అయితే రమేష్ తాను ఏ పొరపాటు చేయలేదని కలెక్టర్‌పై, ప్రభుత్వంపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. కమిషన్ ఆ వ్యవహారంపై విచారణ ప్రారంభించింది. మంగళవారం ఆయనకు సంబంధించిన సమాచారాన్ని ఎస్సీ,ఎస్టీ కమిషన్‌కు కోరినట్లు తెలుస్తోంది. కడప పిడి వ్యవహారం వివాదాస్పదంగా మారడం, ఇంతవరకు డ్వామాకు శాశ్వత డైరెక్టర్‌ను ప్రభుత్వం నియామకం చేయలేదు. ప్రస్తుతం తాత్కాలికంగా డ్వామా పిడిని నియామకం చేశారు. ఎస్సీ,ఎస్టీ కమిషన్ నుంచి తీర్పు వచ్చేంతవరకు ప్రభుత్వం ఆ స్థానంలో ఎవరినీ పిడిగా నియామకం చేయరని తెలుస్తోంది. రమేష్ సంఘటనతో ఇతర శాఖల నుంచి డిప్యుటేషన్‌పై జిల్లా కు వచ్చే అధికారుల విషయంలో జిల్లా అధికార యంత్రాంగం ఆచి తుచి అడుగులు వేస్తోంది. అయితే మాజీ పిడి రమేష్ మాత్రం తానుప్రభుత్వంపై అమీతుమీ తేల్చుకుంటానని తనను అర్థాంతరంగా తనశాఖకు అప్పగించడం వల్ల తాను మనస్థాపానికి గురైనట్లు పేర్కొన్నారు.

వంకలో వ్యక్తి మృతదేహం లభ్యం
కొండాపురం, అక్టోబర్ 17: మండల పరిధిలో యర్రగుడి వద్ద వంక దాటుతూ ఈ నెల 9వ తేదీన కొట్టుకుపోయిన తాళ్లప్రొద్దుటూరుకు చెందిన సుబ్బదాసు మృత దేహాన్ని మంగళవారం కనుగొన్నారు. తాళ్లప్రొద్దుటూరు ఎస్‌ఐ క్రిష్ణయ్య వివరాల మేరకు వంకలో కొట్టుకుపోయిన సుబ్బదాసు కొరకై మైలవరం నుండి గజ ఈతగాళ్లను రప్పించి వెతికించినా ఆచూకీ దొరకలేదన్నారు. కొండచరియల వద్ద వంక ప్రాంతంలో సుబ్బదాసు మృతదేహాన్ని కనుగొనడం జరిగిందన్నారు. ఈ విషయం నిర్దారించడం జరగిందన్నారు. మృతదేహం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహం వున్న ప్రాంతానికి వైద్యులు రానున్నారని ఎస్‌ఐ తెలిపారు.
చెన్నూరుకు చెందిన బిటెక్ విద్యార్థి అదృశ్యం
* పెన్నాలో కొట్టుకుపోయాడని అనుమానం..
చెన్నూరు,అక్టోబర్ 17: మండలంలోని కనుపర్తి గ్రామానికి చెందిన రమణారెడ్డి కుమారుడు వెంకటశివారెడ్డి కడప కెఓఆర్‌ఎం ఇంజనీరింగ్ కళాశాలలో 3వ సంవత్సరం చదువుతున్నాడు. ఎప్పటిలాగానే ప్రతిరోజు కనుపర్తి నుంచి కళాశాలకు వెళుతూ వచ్చేవాడు. సోమవారం కళాశాలకు వెళ్లి తిరిగి కనుపర్తిగ్రామానికి వస్తుండగా దారి మధ్యలో పెన్నానది ఒడ్డున తన వెంట తెచ్చుకున్న ఐడికార్డు, బ్యాగు,సెల్‌ఫోన్ నది ఒడ్డున కంపచెట్ల మద్య ఉంచాడు. అయితే పెన్నానదిలో ఈతకు వెళ్లాడా, పెన్నాలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడా అనే విషయంపై తెలియరావాల్సివుంది. ఈవిషయాన్ని విద్యార్థి తల్లిదండ్రులు పోలీసులకు తెలియజేయడంతో స్థానిక ఎస్‌ఐ వినోద్‌కుమార్, పోలీసులు హుటాహుటిన గాలింపు చర్యలు చేపట్టారు. ఒడ్డున ఉన్న సెల్‌ఫోన్, ఐడికార్డు, బ్యాగును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే సంఘటనా స్థలానికి విద్యార్థి తల్లిదండ్రులు వచ్చారు. అయితే పెన్నా ఒడ్డున ఉన్న స్థానికులు మాత్రం ఒక యువకుడు పెన్నాలో దిగుతుండగా చూసినట్లు పోలీసుల దృష్టికి తెచ్చారు. ఈవిషయంపై పోలీసులు పెన్నానదిలో స్నానానికి వెళ్లాడా లేకా పెన్నాదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడా అనే విషయంపై ఆరా తీసుకున్నారు. విద్యార్థి అదృశ్యంపై కనుపర్తి గ్రామంలో విషాధచాయలు అలుముకున్నాయి.
అగ్నిప్రమాదాల పట్ల జాగ్రత్త వహించాలి
కమలాపురం, అక్టోబర్ 17: దీపావళి వేడుకల్లో బాణసంచా కాల్చే సమయంలో ఏర్పడే అగ్నిప్రమాదాల పట్ల పిల్లలు తగు జాగ్రత్త వహించాలని అగ్నిమాపక అధికారి రఘునాధ్ హెచ్చరించారు. ఆయన మంగళవారం స్థానిక వెంకటేశ్వరా హైస్కూల్లో విద్యార్థులకు నిర్వహించిన బాణాసంచా వినియోగ సదస్సులో మాట్లాడుతూ బాణసంచా కాల్చేసమయంలో పిల్లలు తప్పనిసరిగా పాదరక్షలు వేసుకోవాలని, నూలు బట్టలు ధరించాలని, పెద్దల మార్గదర్శకత్వంలో నడవాలని, బాణసంచా కాల్చే ప్రదేశంలో డ్రమ్ముల్లో నీళ్లు ఉంచుకోవాలని సూచించారు. చేతులతో బురుజులు, రాకెట్లు, లక్ష్మిపటాసులు కాల్చరాదని పెద్ద ప్రమాదాలు ఏర్పడతాయని తెలిపారు. కాగా బాణసంచా విక్రయదారులు రోడ్లకు దూరంగా బహిరంగ ప్రదేశాల్లో విక్రయించాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెట్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
కాలువలపై అక్రమ నిర్మాణాలపై చర్యలు
* కలెక్టర్ బాబూరావు
కమలాపురం, అక్టోబర్ 17: జిల్లాలో బుగ్గవంక,తదితర నదులు, కాలువలపై అక్రమ నిర్మాణాలపై తగిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ బాబురావ్ తెలిపారు. ఆయన మంగళవారం స్థానిక ఎంపిడివో కార్యాలయంలో విలేఖర్లతో మాట్లాడుతూ కడపనగరంలో బుగ్గవంకపై అక్రమ కట్టడాలు నిర్మించారన్న ఫిర్యాదులున్నాయని, అలాగే కమలాపురంలోని పెద్దకాలువ ఆక్రమణలకు గురైనట్లు ప్రజలనుంచి ఫిర్యాదులందాయని, వీటిని తొలగించేందుకు కడప ఆర్డీవోను విచారణాధికారిగా నియమించామన్నారు. వీటిపై విచారణ జరిపిన అనంతరం తప్పని సరిగా కట్టడాలను తొలగించేలా చర్యలు చేపడతామన్నారు. కాగా జిల్లాలో 1.75లక్షల వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టామన్నారు. ఈ ఏడాది చివరినాటికి వందశాతం పూర్తి చేస్తామన్నారు. మండలంలోని సిగోపాలపురం, రైల్వేవంతెన వద్ద గ్రామానికి అడ్డంగా వర్షంనీరు నిలచి, రాకపోకలు నిలిచి పోయాయని సర్పంచ్ కలెక్టర్ దృష్టికి తేగా చర్యలు చేపడతామని చెప్పారు. కాగా కలెక్టర్ సమావేశం ముగించుకుని బయలుదేరే సమయంలో మండలస్థాయి అధికారిణి కార్యాలయానికి వస్తుండడంతో ఆమెను కలెక్టర్ సున్నితంగా మందలించారు. విధినిర్వహణ వేళలు పాటించాలని సూచించారు.