కడప

భూగర్భ డ్రైనేజి పనులకు సమాయత్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖాజీపేట,నవంబర్ 21: ఎన్నో సంవత్సరాలుగా డ్రైనేజి కాలువ పూడికతీత పనులు చేయక రోడ్డుకు ఇరువైపుల ఇంటియజమానులు, దుకాణదారులు ఆక్రమించి ట్రాఫిక్‌కు అంతరాయం కల్పిస్తున్న ప్రధానరహదారి అండర్ డ్రైనేజి పనులకు పంచాయతీ కార్యాలయం సమాయత్తమైంది. అందులో భాగంగా మంగళవారం 2 ప్రొక్లైనర్లు, 4ట్రాక్టర్లను సిద్ధంగా ఉంచి డ్రైనేజిపై ఉన్న షాపులు, ఇళ్లు, కట్టడాలను కూల్చివేసేందుకు అధికారులు సమాయత్తమయ్యారు. దీంతో ఒక్కమారుగా వ్యాపారస్తులు, ఇంటి యజమానులు రాజకీయ నాయకులను ఆశ్రయించక తప్పలేదు. గతంలో అనుకూలంగా ఉన్న ప్రస్తుతం రాజకీయ నాయకులు కూడా తలలు ఊపడంతో పనులు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఎంతో వెడల్పుగా ఉండే ప్రధానరోడ్డు షాపులు, అక్రమకట్టడాలతో కుచించుకుపోయింది. వాహనదారులకు, పాదాచారులకు సైతం ఇబ్బందిగా మారింది. దీంతో పోలీసులు సైతం పలుమార్లు ట్రాఫిక్ నియంత్రణకు కృషి చేసినప్పటికీ సాధ్యమయ్యేదికాదు. ఈ డ్రైనేజి పనుల ప్రారంభంతో అక్రమ నిర్మాణాలు, వ్యాపారస్తులు లబోదిబోమంటున్నారు. ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి డ్రైనేజిని, రోడ్లపై అంగళ్లు పెట్టుకుని ప్రజలకు అంతరాయం కలిగించడం జీర్ణించుకోలేని పంచాయతీ అధికారులు ఎట్టకేలకు మంగళవారం పగులకొట్టేందుకు శ్రీకారం చుట్టారు. పనులు ప్రారంభం అనంతరం ప్రభుత్వ స్థలం మేరకు బండలు వేయించి వాటిపై కట్టడాలు, షాపులు, పెట్టుకోకుండా నియంత్రించ గలిగితే ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం లేకుండా ఉంటుంది. మరీ ఈపనులు ఎంతవరకు సఫలీకృతం చేస్తారో వేచిచూడాల్సిందే.

త్వరలో పులివెందులకు చంద్రబాబు రాక

జమ్మలమడుగు, నవంబర్ 21: రాష్ట్ర ప్రతిపక్ష నేత, వైకాపా అధినేత వైయస్ జగన్‌మోహన్ రెడ్డి సొంత జిల్లాపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రత్యేక దృష్టిసారించారు. జిల్లాలో తెదేపాకు పూర్వవైభవం సాధించే దిశగా స్వయానా అధినేత చంద్రబాబునాయుడు పావులు కదుపుతున్నారు. మరో వారం రోజుల్లో ప్రతిపక్ష నేత జగన్ ఇలాఖాలో చంద్రబాబునాయుడు పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా పులివెందుల నియోజకవర్గంలోని పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. సుమారు రూ.1350కోట్లతో చేపట్టిన గండికోట-పిబిఆర్ ఎత్తిపోతల పథకంను ప్రారంభించనున్నారు. అలాగే పులివెందులలోని ధ్యాన్‌చంద్ క్రీడా మైదానంలో బహిరంగ సభలో పాల్గొననున్నారు. రాష్ట్ర ప్రతిపక్ష నేత వైయస్ జగన్‌మోహన్ రెడ్డి ఇలాఖాలో పర్యటన కావడంతో తెలుగు తమ్ముళ్లు పర్యటనను ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వాన్ని ఎండగట్టే దిశగా తెదేపా అధికారంలోకి వచ్చిన మూడేళ్ల కాలంలో అన్నింటా విఫలమైందంటూ ఈ నెల 6నుండి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్రను చేపట్టారు. పులివెందుల బహిరంగ వేదిక ద్వారా ప్రభుత్వం జిల్లా అభివృద్ధికి చేపడుతున్న కార్యక్రమాలను, పథకాలను వివరించి జగన్ విమర్శలను తిప్పికొట్టేందుకు టీడీపీ శ్రేణులు సన్నద్దం అవుతున్నాయి. ఈ క్రమంలోనే పిబిఆర్, పైడిపాళెం జలాశయాల్లో 2టియంసిల చొప్పున నీటిని పంపింగ్ చేశారు. అలాగే గండికోట జలాశయంలో ఈ ఏడాది 12టియంసిల నీటి నిల్వకు గోరకల్లు జలాశయం నుండి నీటి విడుదల చేపట్టింది. వీటి ద్వారా పులివెందులకు టీడీపీ ప్రభుత్వం చేస్తున్న కృషిని తెలిపేందుకు ఉపయోగపడుతుందని నాయకులు భావిస్తున్నారు. చంద్రబాబునాయుడు పులివెందుల పర్యటనను పెద్ద ఎత్తున విజయవంతం చేసేందుకు నియోజకవర్గ నాయకులతో పాటు, జిల్లా నాయకులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై గత ఆదివారం జిల్లా కలెక్టర్ బాబూరావునాయుడు, ఎస్పీ బాబూజీ, పలువురు అధికారులు పరిశీలించడం జరిగింది. త్వరలో అధినేత చంద్రబాబు నాయుడు పులివెందుల బహిరంగ సభ వేదికగా చేయనున్న ప్రసంగంపై అటు పార్టీ శ్రేణుల్లో, ప్రజలతో పాటు సర్వత్రా ఆసక్తికర చర్చ కొనసాగుతోంది.

దళిత, గిరిజనుల ఆర్థికాభివృద్ధికి కృషి

కడప,(కల్చరల్)నవంబర్ 21: రాష్ట్రంలో దళిత గిరిజనుల ఆర్థికాభివృద్ధికి ఎస్సీ,ఎస్టీ కమిషన్ కృషి చేస్తుందని రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ కారం శివాజీ తెలిపారు. రెండురోజుల పర్యటనలో భాగంగా కడపకు చేరుకున్న చైర్మన్‌కు కలెక్టర్, ఎస్పీలు స్వాగతం పలికారు. అనంతరం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ రాష్ట్రంలో రూ.9,800కోట్లు ఎస్సీలకు, రూ.3,800కోట్లు ఎస్టీల అభివృద్ధి కోసం సబ్‌ప్లాన్ నిధులు కేటాయించామన్నారు. ఈ నిధులతో ఎస్సీ,ఎస్టీ గ్రామాల్లో పూర్తిస్థాయిలో మార్పుతెచ్చే విధంగా కావాల్సిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ ఏర్పాటుచేసే విధంగా పర్యవేక్షిస్తున్నామన్నారు. ప్రధానంగా హాస్టల్ మూసివేత, విద్యార్థులు పడుతున్న సమస్యలు తమ దృష్టికి వచ్చాయన్నారు. ఈవిషయాలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి తెరిపించేందుకు కృషి చేస్తామన్నారు. రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఎక్కువ మంది విద్యార్థులను పెట్టడం వల్ల గదులు ఇరుకుగా ఉన్నాయని వాటిని సందర్శించి పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. ఎవరైనా ఎస్సీ, ఎస్టీలుగా నకిలీ సర్ట్ఫికెట్లతో ఉద్యోగాలు పొందితే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఎస్సీ, ఎస్టీలకు రుణాలు మంజూరులో బ్యాంకు మేనేజర్లు సహకరించకపోతే చర్యలు తప్పవన్నారు. కార్యక్రమంలో కమిషన్ సభ్యులు రవీంద్ర, సోము, నరహరి ప్రసాద్, ఓఎస్‌డి సుబ్బారావు, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ అధికారులు సరస్వతి, లలితాభాయిలు పాల్గొన్నారు.

ఎవరెన్ని హామీలిచ్చినా ప్రజలపైనే భారం..

కమలాపురం, నవంబర్ 21: ప్రజల సమక్షంలో ఎవరు ఎన్ని హామీలిచ్చినా వాటిని అమలుపరిచే సమయంలో పరోక్షంగా ప్రజలపైనే భారం పడుతుందని మాజీమంత్రి డాక్టర్ ఎంవి మైసూరారెడ్డి అన్నారు. ఆయన మంగళవారం స్థానిక తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు చంద్రశేఖరరెడ్డి, గంగాధరరెడ్డిల గృహంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు, తన అనుయాయులతో కలసి ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయనను కలిసిన విలేఖర్లతో మాట్లాడుతూ ఇటీవల అధికారం కోసం కొందరు, అధికారం వచ్చేందుకు మరి కొందరు ప్రజలకు పలు రకాల హామీలను గుప్పిస్తున్నారని అన్నారు. హామీలు అమలు చేసేందుకు ప్రజలపై రకరకాల పన్నుల భారం విధించక తప్పదన్నారు. దీంతో నష్టపోయేది సామాన్యులేనని అన్నారు. కేంద్రప్రభుత్వం అమలు జరుపుతున్న జియస్టీ విధానం వల్ల సామాన్యుని నుంచి ధనవంతుల వరకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. వినియోగదారులకు ఏమంత ప్రయోజనం లేదనే అనిపిస్తోందన్నారు. ఇటీవల పన్నులరేట్లు పెరిగిపోయాయని ప్రజలనుంచి నిరసనలు రావడంతో కేంద్రం కొన్ని వస్తువులపై జియస్టీ రేట్లను తగ్గించిందని అన్నారు. అయినప్పటికీ ప్రజలకు లభించిన ప్రయోజనం తక్కువేనన్నారు. ప్రభుత్వం ఎంతమేర పన్ను తగ్గించకలిగిందో వ్యాపారులేమో ఆ మేరకు వస్తువుల ధరలను పెంచి ప్రజలను ఇబ్బందుల పాలు చేస్తున్నట్లు పలు ఆరోపణలు వినిపిస్తున్నాయన్నారు. ఏ వస్తువు కొనుగోలు చేయాలన్నా సామాన్యులు మార్కెట్‌లోకి వెళ్లేందుకు భయపడుతున్నారని దేనిపై పన్ను ఉందో ఏ వస్తువుపై లేదో తెలియడం లేదని కొందరునేతలు మైసూరా దృష్టికి తెచ్చారు. ప్రజలకు పన్ను ప్రయోజనం దక్కనపుడు ప్రభుత్వం జియస్టీ రేట్లు తగ్గించి లాభమేమిటని, వారు ఆయనతో వాపోయారు. బ్యాంకుల్లో డబ్బులు దాచుకోవాలన్నా, విత్‌డ్రా చేసుకోవాలన్నా సామాన్యులు బ్యాంకుల నిబంధనలతో భయపడాల్సి వస్తోందని మైసూరా దృష్టికి తెచ్చారు. కాగా ఇటీవల విద్యుత్ అధికారులు తమ వ్యవసాయపొలాల్లో ఉన్న మోటర్లను తొలగించి ప్రభుత్వం మంజూరు చేసిన సోలార్‌మోటర్లను వాడాలని వత్తిడి తెస్తున్నారని ఇందువల్ల 100 అడుగులకు పైగా లోతు ఉండే బోర్లలో నుంచి నీరు వచ్చే అవకాశం లేదని కొందరు నేతలు ఆయన దృష్టికి తెచ్చారు. కాగా సోలార్ మోటర్లతో పాటు సోలార్ ఉత్పత్తి చేసే పరికరాలను పొలాల్లో ఏర్పాటు చేస్తే ఎంతో ప్రయోజనం కలుగుతుందని రైతులనుంచి మిగులు విద్యుత్‌ను విద్యుత్‌శాఖ కొనుగోలు చేస్తే రైతులకు ఆర్థికంగా మేలు చేకూరుతుందన్నారు. ఈ విషయంపై ప్రభుత్వం దృష్టి సారించి రైతులను చైతన్యపరచాలని అన్నారు. ఇందులో టీడీపీ నేతలు సుబ్బా రెడ్డి, మహమ్మద్ ఖాసిం, ప్రసాదరెడ్డి, భాస్కరరెడ్డి, శ్రీనివాసులురెడ్డి, మైసూరా అత్యంత సన్నిహితులు సియస్ నారాయణరెడ్డి, ప్రభాకరరెడ్డి పాల్గొన్నారు.

సేంద్రియ వ్యవసాయ పద్ధతులు లాభదాయకం

రామాపురం, నవంబర్ 21: సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో రైతులు సాగు చేయడం మంచి లాభదాయకమని లక్కిరెడ్డిపల్లె సహాయ వ్యవసాయ సంచాలకులు దివాకర్ అన్నారు. మండలంలోని బండపల్లె పంచాయతీ గొల్లపల్లె సమీపంలో మంగళవారం పొలం పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా సేంద్రీయ వ్యవసాయ పద్ధతిలో పొలం సాగు చేసిన సుగవాసి సుధాకర్ పొలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుధాకర్ తన 4.30 ఎకరాలలో గత రెండు సంవత్సరాల నుండి సేంద్రియ వ్యవసాయం ప్రారంభించినట్లు తెలిపారు. గతంలో సాంప్రదాయ పద్ధతిలో పంటసాగు చేసి రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడి ఆశించి దిగుబడి రాక విసుగుచెందిన సుధాకర్ గుంటూరు రైతు నేస్తం ప్రతినిధులతో ఏకలవ్య ఫౌండేషన్ హైదరాబాద్ వారి స్ఫూర్తితో సేంద్రీయ ఎరువులు ప్రారంభించారు. ఒక ఎకరా వేరుశెనగ, వరి పండించడం జరిగిందన్నారు. ఇందులో ఎకరానికి 30 బస్తాల దిగుబడి సాధించారన్నారు. రైతులు సేంద్రీయ వ్యవసాయ పద్ధతులు వాడటం వల్ల మంచి లాభదాయకమన్నారు. వరి, వేరుశెనగ ఆకుకూరలు, కూరగాయలు సాగు చేసుకొని మంచి దిగుబడి పొందవచ్చన్నారు. సేంద్రియ వ్యవసాయానికి వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సేంద్రియ వ్యవసాయం ద్వారా మంచి ప్రోత్సాహం లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏవో రామాంజులాచారి, ఏఈవో భార్గవి, మెహరాజ్, ఎంపీ ఈవో ప్రసన్న, బేబీ, గాయత్రి, కుమారి, కావ్య, మాధవి, భార్గవి, ఆత్మా సిబ్బంది వీరనాగిరెడ్డి, వంశీ రైతులు తదితరులు పాల్గొన్నారు.

గిరిజన గ్రామాల్లో తాగునీటి కష్టాలు!

సుండుపల్లె, నవంబర్ 21: గిరిజన గ్రామాల ప్రజలు తాగునీటి కోసం అష్టకష్టాలు పడుతున్నారు. నీరు పుష్కలంగా తాగలేని పరిస్థితుల్లో మూడు గ్రామాల గిరిజన ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పంపుసెట్లను అధికారపార్టీ నాయకులు మాయం చేశారంటూ గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. మండలంలోని మాచిరెడ్డిగారిపల్లె పంచాయతీలోని కటారుముడుకు, రాగిమానుబిడికి, వాయలొడ్డు బిడికి గ్రామాల్లో రెండు నెలల క్రితం తాగునీటి పంపుసెట్లు పాడైపోయాయని గ్రామస్థులు లబోదిబోమంటూ సర్పంచ్‌కు తెలపడంతో 20 రోజుల్లోగా మరమ్మతులు చేయిస్తానని తీసుకెళ్లడం జరిగిందన్నారు. అయితే రెండు నెలల నుండి తీసుకురాకపోగా పంపుసెట్టు అందించాలని కోరినా స్పందించడం లేదన్నారు. తాగునీరు లేక వ్యవసాయ బోర్ల మీద ఆధారపడుతున్నామని మూడు గ్రామాల గిరిజనులు చెబుతున్నారు. అధికారుల పర్యవేక్షణ పాలకుల చేయూత లేకపోవడంతో మాచిరెడ్డిగారిపల్లె పంచాయతీలో సమస్యలపైన పట్టించుకునే నాధుడే కరువయ్యారు. గిరిజన గ్రామాల అభివృద్ధి కోసం ప్రభుత్వం లక్షల రూపాయలు నిధులు మంజూరు చేసి ఎస్సీ, ఎస్టీ గ్రామాలను అభివృద్ధి చేయాలని చెబుతుంటే కనీసం తాగునీటిని అందించలేకపోతున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఈ గ్రామంలో సర్పంచ్ పనితీరును విమర్శలు ఉన్నాయి. తాగునీటి విషయమై ఎవరైనా సర్పంచుకు తెలిపితే తానేమీ చేయలేనని ప్రభుత్వం నుండి నిధులు రావట్లేదని చెబుతున్నాడని గ్రామస్థులు తెలిపారు. పంచాయతీ నిధులను తమ స్వార్థం కోసం కొంత మంది అధికార పార్టీ నాయకులతో కలిసి దుర్వినియోగం చేస్తున్నారనే విమర్శలు లేకపోలేదు.
పంపుసెట్లను తీసుకురావాలి
పంపుసెట్లను తీసుకువస్తే తన సొంత నిధులతోనైనా మరమ్మతులు చేయిస్తానని ఎంపీటీసీ బాబురెడ్డి తెలిపారు. మూడు గ్రామాల ప్రజల తాగునీటి కష్టాలు అధికంగా ఉన్నాయని, తమ దగ్గరకు వస్తున్నారని, ఈ విషయాన్ని అధికారులకు సైతం చెప్పడం జరిగిందని ఆయన తెలియజేశారు. ప్రస్తుతం ఎంపీటీసీలకు ఒక్క రూపాయి కూడా పంచాయతీలో నిధులు లేవని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
తాగునీటి కష్టాలను
ఎదుర్కొంటున్నాం..
గత రెండు నెలల నుండి కటారుముడుకు నందు తాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నామని అదే గ్రామానికి చెందిన గోవిందు, వెంకటేశు తెలియజేశారు. ప్రస్తుతం గ్రామంలో ఉన్న తాగునీటి పంపును రిపేరు నిమిత్తం సర్పంచ్ తీసుకెళ్లి ఒక నెల పూర్తవుతున్నా తీసుకురావడం లేదన్నారు. గ్రామస్థులంతా కలిసి అడిగితే ఇంకా మరమ్మతు కాలేదని ప్రభుత్వం నుండి నిధులు రాలేదని సర్పంచ్ మాట దాటవేసే ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ గ్రామానికి తాగునీటి సౌకర్యం కల్పించాలని కోరారు.

హజ్‌హౌస్ నిర్మాణం పనులు పరిశీలన

చెన్నూరు,నవంబర్ 21: కడప-కర్నూలు జాతీయ రహదారిలో చెన్నూరు మండలం రామనపల్లె వ్యవసాయపొలాల్లో వక్ఫ్‌బోర్డుకు సంబంధించిన 13 ఎకరాల స్థలంలో జాతీయ రహదారిపక్కన రూ.12కోట్లతో నిర్మిస్తున్న హజ్‌హౌస్ భవన నిర్మాణం పనులను మంగళవారం హజ్‌హౌస్ కమిటీ సభ్యులు మగ్ధుమ్‌బుఖారి, టీడీపీ మైనార్టీ సీనియర్ నాయకులు ఆరీఫుల్లా, సుభాన్‌బాషా, అమీర్‌బాబు, పంచాయతీరాజ్ ఎస్‌ఇ నరసింహారెడ్డి, ఇఇ చంద్రశేఖర్‌రెడ్డి, ఏఇ మురళి, డిఇ శివసాగర్‌రెడ్డి పలువురు మైనార్టీ నాయకులు హజ్‌హౌస్‌ను పరిశీలించిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు 2018 ఏప్రిల్‌నాటికి పూర్తిచేయాలని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. త్వరితగతిన భవననిర్మాణం పనులు పూర్తిచేసేందుకు తగు చర్యలు చేపట్టాలని కోరారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత తొలిసారిగా ప్రభుత్వం హజ్‌హౌస్ కడపకు ఇవ్వడం ముఖ్యమంత్రి చంద్రబాబుకు మైనార్టీ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. రూ.12కోట్లతో నిర్మిస్తున్న ఈ భవనంలో ప్రత్యేక ప్రార్థనా మందిరం, గదులు, వివిధప్రాంతాల నుంచి వచ్చే వారికోసం ప్రత్యేక గదులు నిర్మించడం జరుగుతుందన్నారు. భవన నిర్మాణాలుపూర్తయి స్థానికులకు ఇక్కడ ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. పంచాయతీరాజ్ ఎస్‌ఇ నరసింహారెడ్డి మాట్లాడుతూ ఇటీవల వర్షాలకారణంగా ఇబ్బంది జరిగినా పనులు వేగవంతం అవుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు అషఫ్,్ర ఖాజాహుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.

రైతులకు అన్యాయం జరిగితే సహించం

రాయచోటి, నవంబర్ 21: శ్రీనివాసపురం రిజర్వాయర్ తూము గండి పడి నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లింపుల్లో అన్యాయం జరిగితే సహించనని ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి ఇరిగేషన్ అధికారులను హెచ్చరించారు. మంగళవారం ఆయన తన కార్యాలయంలో ఇరిగేషన్ ఈఈ సుధాకర్, డీఈ వెంకటేశ్వర్లులతో బాధిత రైతులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శ్రీనివాసపురం రిజర్వాయర్ నిర్మాణం పనులను సకాలంలో పూర్తి చేయకుండా, ఎగువ, దిగువ తూములకు గేట్లు ఏర్పాటు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహించడం వల్లే తూముకు గండిపడి పెద్ద ఎత్తున నష్టం వాటిల్లిందన్నారు. చేతికొచ్చిన పంట పొలాలు నీట మునిగాయన్నారు. భూములు సైతం కోతకు గురయ్యాయన్నారు. వ్యవసాయపు బోరు మోటార్లు కొట్టుకుపోయాయన్నారు. నీటి ప్రవాహ ఉధృతికి రహదారులు, విద్యుత్ లైన్లు దెబ్బతిన్నాయన్నారు. ఈ నిర్లక్ష్యం వల్ల రైతులు పూర్తిగా నష్టపోయారన్నారు. తూములకు గేట్లు ఏర్పాటు చేయాలని తాను పలుమార్లు మీ శాఖ అధికారులకు కోరినప్పటికీ స్పందించలేదని ఆయన మండిపడ్డారు. గేట్లు ఏర్పాటు చేసి ఉంటే ఈ నష్టం జరిగి ఉండేదా అని ప్రశ్నించారు. ఇందుకు ఇరిగేషన్ అధికారులే పూర్తి బాధ్యత వహించి రైతులకు జరిగిన నష్టాన్ని పూడ్చాలన్నారు. జరిగిన నష్టాలపై పూర్తి స్థాయిలో నివేదికను సేకరించి ఉన్నతాధికారులకు పంపి పరిహారాన్ని త్వరగా మంజూరు చేయిస్తామని ఈఈ సుధాకర్ ఎమ్మెల్యేకు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కంచంరెడ్డి, మాజీ సర్పంచ్ చక్రపాణిరెడ్డి, వైసీపీ నాయకులు రమణ, రెడ్డప్ప, రిజర్వాయర్ మేనేజర్ వీరనాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

జాతీయస్థాయి తైక్వాండోకు గురుకుల విద్యార్థిని

కమలాపురం, నవంబర్21: స్థానిక గురుకులపాఠశాలకు చెందిన విద్యార్థిని యల్ అనూష ఎంపికైనట్లు ఆ పాఠశాల ప్రిన్సిపాల్ యల్ మాదవీలత కోచ్ రమేష్ తెలిపారు. మంగళవారం ఆ పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో క్రీడాకారిణి అనూషను అభినందించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ఈనెల 16నుంచి 18వరకు చిత్తూరుజిల్లా పుత్తూరులో జరిగిన రాష్టస్థ్రాయి స్కూల్ గేమ్స్ అండర్ 17 బాలికల విభాగంలో తమ పాఠశాలలో చదువుతున్న అనూష 61-63కేజిల విభాగంలో అత్యంత ప్రతిభ కనపరిచి తైక్వాండో పోటీలో బంగారు పతకం సాధించడం సంతోషకరమన్నారు. ఢిల్లీలో వచ్చేనెల 2న జరిగే జాతీయస్థాయి పోటీల్లో కూడా తమ విద్యార్థిని విజయం సాధించి తమ పాఠశాలకు పేరుప్రఖ్యాతులు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఇందులో ఆ పాఠశాల పిడి ఎంవి నాగమణి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.