కడప

28 మంది తమిళ కూలీల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయచోటి, జనవరి 10: రాయచోటి రూరల్ సర్కిల్ పరిధిలో పోలీసులు జరిపిన దాడుల్లో రూ.10 లక్షల విలువ చేసే 30 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకోవడమే కాకుండా 28 మంది తమిళ కూలీలను అదుపులోకి తీసుకున్నామని పులివెందుల ఏఎస్పీ క్రిష్ణారావు తెలిపారు. బుధవారం స్థానిక రూరల్ పోలీస్‌స్టేషన్‌లో రూరల్ సీఐ నరసింహరాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఏఎస్పీ మాట్లాడారు. అందిన సమాచారం మేరకు మంగళవారం సుండుపల్లె మండలం మడితాడు గ్రామం ఉప్పరపల్లెలోని క్రిష్ణారెడ్డిచెరువు వద్ద ఎర్రచందనం సరఫరా అవుతుందన్న సమాచారం అందిందన్నారు. వెంటనే సుండుపల్లె ఎస్‌ఐ నరసింహారెడ్డి సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించగా ఎర్రచందనం దుంగలతో పాటు కొంత మంది తమిళ కూలీలను అదుపులోకి తీసుకుని, చుట్టుపక్కల స్టేషన్లకు సుండుపల్లె ఎస్‌ఐ సమాచారం అందించారన్నారు. దీంతో వీరబల్లి ఎస్‌ఐ కొత్తరోడ్డు వద్ద 8 మంది ఎర్రస్మగ్లర్లను పట్టుకొని వారి వద్ద నుండి పది దుంగలను, చిన్నమండెం ఎస్‌ఐ రామక్రిష్ణ వండాడి క్రాస్ వద్ద పది మంది స్మగ్లర్లు, పది ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్పీ వివరించారు. మొత్తం మీద 28 మంది ఎర్రచందనం స్మగ్లర్లను, 30 ఎర్రచందనం దుంగలు, 11 కట్టెలు, 8 గొడ్డళ్లు, 13 పట్టెడు రాళ్లను స్మగ్లర్ల వద్ద నుండి స్వాధీనపరచుకున్నట్లు ఆయన తెలిపారు. పట్టుబడిన కూలీలందరూ తమిళనాడు రాష్ట్రానికి చెందిన వారని తెలిపారు. పట్టుబడిన ఎర్రచందనం దుంగలు దాదాపు 392 కేజీలు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సుండుపల్లె, చిన్నమండెం, వీరబల్లి ఎస్‌ఐలు నరసింహారెడ్డి, సుధాకర్, ప్రసాద్‌రెడ్డి, పోలీసులు పాల్గొన్నారు.

రైతులను నిర్లక్ష్యం చేస్తున్న
సీఎం చంద్రబాబు
కమలాపురం, జనవరి 10: పంటల బీమా మంజూరులో రైతులకు అన్యాయం జరిగిందని ప్రభుత్వానికి నివేదించినా, నిర్లక్ష్యం చేస్తోందని, వారంరోజుల్లో బీమా ప్రతి ఒక్కరైతుకు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం కడప ఎంపీ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్‌రెడ్డి, అంజాద్ బాష, మేయర్ సురేశ్‌బాబు, జడ్పీ చైర్మెన్ గూడూరు రవితో కలసి జిల్లా వైసీపీ రైతునేత పుత్తాప్రసాదరెడ్డి ఆధ్వర్యంలో స్థానిక మూడురోడ్ల కూడలిలో కడప-తాడిపత్రి హైవేరోడ్డు పక్కన రైతులు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. ముందుగా రాస్తారోకో నిర్వహిస్తున్నట్లు వైసీపీ నేతలు అధికారుల నుంచి అనుమతి పొందినప్పటికీ కమలాపురం జన్మభూమికి మంత్రులు వస్తుండడంతో రాస్తారోకోకు అనుమతి నిరాకరించారు. దీంతో వైసీపీ ప్రజాప్రతినిధులు రోడ్డుపక్కన ధర్నా నిర్వహించారు. ధర్నాలో రైతుల నుద్ధేశించి మాట్లాడుతూ 2016 రబీసీజన్‌లో బుడ్డశెనగ రైతులు ప్రీమియం చెల్లించినప్పటికీ జిల్లాలో 63వేలమంది రైతులకు రూ. 186కోట్లు మాత్రమే మంజూరైందని అన్నారు. ఐతే గతనెల 3వేలమంది రైతులకు రూ.24కోట్లు మాత్రమే బ్యాంకుఖాతాల్లో జమ అయిందన్నారు. మిగిలిన రైతులకు ఈనెల 5లోగా చెల్లిస్తామని బీమా కంపెనీలు ప్రకటించాయని అయితే ఇంతవరకు ఎలాంటి మొత్తం జమకాలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో 3200మంది రైతుల దరఖాస్తులను తిరస్కరించడం అన్యాయమన్నారు. ఈ విషయంపై తాను, ఎమ్మెల్యే కలసి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఫలితం లేదన్నారు. ఈ విషయంపై ప్రభుత్వం మరో 5రోజుల్లో చర్యలు చేపట్టి ప్రీమియం చెల్లించిన ప్రతి ఒక్కరైతుకు బీమా మంజూరు చేయకపోతే ఆందోళనను జిల్లా వ్యాప్తంగా ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. 2012-13 రబీ, బుడ్డశెనగ పంట బీమా 20వేలమంది రైతులకు రావాల్సి ఉందని, 2014కు సంబంధించి రూ. 86 కోట్లు ఇన్‌పుట్ సబ్సిడీ రావాల్సి ఉందని ఈ విషయంపై గత 4 ఏళ్లుగా రైతులు రోడ్లపై ఆందోళన చేస్తున్నా సీఎం చంద్రబాబుకు చీమ కుట్టినట్టు కూడా లేదని విమర్శించారు. కమలాపురం ఎమ్మెల్యే మాట్లాడుతూ బాబుహయాంలో వరుస కరవులు వస్తున్నాయని సాగునీటి కోసం తాను పాదయాత్ర చేస్తే అధికారపార్టీనేతలు జలరాజకీయం చేస్తున్నారని విమర్శించారు. నియోజకవర్గంలో రైతులకు గత ఏడాది బీమా మంజూరు చేయకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామన్నారు. కడప ఎమ్మెల్యే అంజాద్‌బాష మాట్లాడుతూ బాబుహయాంలో రైతులకు కన్నీళ్లు తప్పడం లేదని వారి ఉసురు తగలక తప్పదన్నారు. జడ్పీచైర్మెన్ రవి మాట్లాడుతూ బాబు హయాంలో రైతులు అన్నింటా ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. కడప మేయర్ సురేశ్‌బాబు మాట్లాడుతూ దివంగతనేత వైయస్ హయాంలో జిల్లాలో గండికోటతో పాటు గాలేరు-నగిరి, వామికొండ, సాగర్ ప్రాజెక్టులు 85% పూర్తికాగా పులివెందులకు ఓట్ల కోసం నీరిచ్చి బాబు గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. ఇందులో వైకాపా రాష్ట్ర కార్యదర్శి నిమ్మకాయల సుధాకరరెడ్డి, పార్టీ బాధ్యులు ఉత్తమారెడ్డి, రఘునాథ్‌రెడ్డి, పుల్లారెడ్డి, నారాయణరెడ్డి, రాజశేఖరరెడ్డి, శ్రీనివాసులురెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఉక్కు కర్మాగారం నిర్మాణానికి
సీఎం కృషి

రాయచోటి, జనవరి 10: జిల్లాలో స్టీల్ ఫ్యాక్టరీ నిర్మించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గట్టిగా కృషి చేస్తున్నారని వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం 5వ విడత జన్మభూమి-మా ఊరు కార్యక్రమాన్ని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఇన్‌చార్జి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, మార్కెటింగ్ శాఖమంత్రి ఆదినారాయణ రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించేందుకు సీఎం చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంతో చర్చించారని తెలిపారు. స్టీల్ ఫ్యాక్టరీ నిర్మించేందుకు కూడా కేంద్రం కూడా సముఖంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 2.20 కోట్ల మంది చంద్రన్నబీమాను దరఖాస్తులు చేసుకున్నారని ఆయన తెలిపారు. గతంలో పేదవారు ఇండ్లు నిర్మించేందుకు గత ప్రభుత్వం రూ.70 వేలు మాత్రమే మంజూరు చేసేదని, కానీ ప్రస్తుతం తెలుగుదేశం ప్రభుత్వం రూ.1.50 లక్షలు మంజూరు చేస్తున్నదని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాష్ట్రంలో ఏ జిల్లాలో లేనంతగా కడప జిల్లాలో 40 టీఎంసీల నీటిని నిల్వ చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందని ఆయన చెప్పారు. ఇకపోతే రాయచోటి పట్టణంలోని ముస్లింల భూసమస్యను ఇది వరకే ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లిన విషయం తెలిసిందేనన్నారు. ఈ క్రమంలో ముస్లింల సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించేటట్లు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అంతేకాకుండా జిల్లాను హార్టికల్చర్ హబ్‌గా చేయడమే సీఎం లక్ష్యమని ఆయన వివరించారు. ఇకపోతే రైతులకు రూ.136.99 కోట్ల రుణమాఫీ విడుదల చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. ఇకపోతే పట్టణంలో 4,376 పింఛన్లు పంపిణీ చేస్తున్నాన్నారు. అంతేకాకుండా మరికొన్ని పింఛన్లు మంజూరు చేసేందుకు సీఎం చంద్రబాబుతో చర్చించి కృషి చేస్తామన్నారు. ఇకపోతే ఒక హెక్టారులో అరటి సాగు చేసేందుకు ప్రభుత్వం రూ.40,980 సబ్సిడీ ఇస్తున్నదని ఆయన గుర్తు చేశారు. అంతేకాకుండా పూల సాగుకు రూ.16 వేలు, ఆపిల్‌పండ్ల సాగుకు రూ.14 వేలు ప్రభుత్వం సబ్సిడీ కింద ఇస్తున్నదని ఆయన రైతులనుద్దేశించి వివరించారు. ముఖ్యంగా మరుగుదొడ్లు లేని ప్రతి ఒక్కరూ మరుగుదొడ్డి నిర్మించుకొని వారి ఆరోగ్యాలను కాపాడుకోవాలని ఆయన సూచించారు. అనంతరం మంత్రి ఆదినారాయణరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మునిసిపాలిటీలకు వచ్చే మార్చి నుంచి రూ.11 వేల కోట్లు అభివృద్ధి కోసం మంత్రి లోకేష్ విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. అంతేకాకుండా 19 లక్షల ఇండ్లను మంజూరు చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. గత ప్రభుత్వ హయాంలో 14 గంటలు కరెంటు ఉండేదని కానీ ప్రస్తుత ప్రభుత్వ హయాంలో 24 గంటల కరెంటు ఉందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. సౌభాగ్య స్కీం కింద తెల్ల రేషన్‌కార్డులు కలిగిన వారికి పైసా కూడా లేకుండా మీటర్ కనెక్షన్ ప్రభుత్వం కల్పించడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ఆయన సూచించారు. అనంతరం రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్‌నాయుడు మాట్లాడుతూ డ్వాక్రా మహిళలకు రూ.10 వేల కోట్లు మంజూరు చేసిన ఘనత చంద్రబాబునాయుడిదేనని తెలిపారు. ఇకపోతే ట్రిపుల్ తలాక్‌ను తమ ప్రభుత్వం స్వాగతిస్తున్నదని ఆయన తెలిపారు. అనంతరం అర్హులైన పేదలకు ఇంటి పట్టాలు, రేషన్‌కార్డులు, డ్వాక్రా మహిళలకు వడ్డీ రాయితీ చెక్కులను మంత్రులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ బాబూరావునాయుడు, కేంద్ర మాజీ మంత్రి సాయిప్రతాప్, జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, నియోజకవర్గ ఇన్‌ఛార్జి రమేష్‌రెడ్డి, నాయకులు ప్రసాద్‌బాబు, టీడీపీ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి జగన్‌మోహన్‌రాజు, మార్కెట్ కమిటీ ఛైర్మన్ గాజుల ఖాదర్‌బాష, మునిసిపల్ వైస్‌ఛైర్మన్ ఇందాదుల్లా, రాష్ట్ర ఉర్దూ అకాడమీ మాజీ ఛైర్మన్ దాదాసాహెబ్, తహశీల్దార్ మధుసూదనరెడ్డి, డీప్యూటీ తహశీల్దార్, మునిసిపల్ కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

కరవురహిత రాష్టమ్రే సీఎం ఆశయం..

ఖాజీపేట,జనవరి 10: రాష్ట్రాన్ని కరవురహిత, అవినీతి రహిత ఆర్థిక అసమానతలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు అహర్నిశలు కృషి చేస్తున్నారని మంత్రి సోమిరెడ్డి తెలిపారు. బుధవారం కడపమండల పరిధిలోని ఆలంఖాన్‌పల్లె, బచ్చుంపల్లి, జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో 5వ విడత జన్మభూమి -మా ఊరు కార్యక్రమాలకు మంత్రి ముఖ్యఅతిధిగా హాజరై ప్రసంగించారు. జన్మభూమి కార్యక్రమంలో 1997 సంవత్సరంలో మొదలుపెట్టడం జరిగిందని అప్పటి నుంచి ఇప్పటివరకు పండుగ వాతావరణంలో సమస్యలు పరిష్కరించడం జరుగుతోందన్నారు. నీటికి, వ్యవసాయరంగానికి అధిక ప్రాధాన్యతనిచ్చి అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తున్నారన్నారు. జిల్లాను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటున్నారన్నారు. నదులను అనుసంధానం కోసం సంకల్పించి చర్యలు చేపట్టి రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా చేసేందుకు ముందుకు ప్రభుత్వం వెళుతోందన్నారు. రాష్టమ్రార్కెటింగ్ గిడ్డంగులు, పశుసంవర్థకశాఖ మంత్రి ఆదినారాయణరెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో లేనివిధంగా అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు అందుతున్నాయన్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఆర్.శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ సమస్యల పరిష్కారం జరుగుతుందని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కమలాపురం పార్టీ ఇన్‌చార్జి పుత్తానరసింహారెడ్డి మాట్లాడుతూ ఏ నియోజకవర్గంలోలేని అభివృద్ధి కమలాపురం నియోజకవర్గంలోనే ముఖ్యమంత్రి అధిక నిధులు ఇచ్చి అభివృద్ధిపరచారన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ టి.బాబూరావునాయుడు, జేసీ శే్వత తెవతియ, జన్మభూమి పరిశీలకులు మధుసూదన్‌రెడ్డి, జేసీ -2 శివారెడ్డి, డ్వామా పీడీ హరిహరనాధ, ఉద్యానశాఖ పీడీ ప్రసాద్, ఏపీఎం ఐడీసీ మధుసూదన్, టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పెండ్లిమర్రిలో..
పెండ్లిమర్రి: ప్రజాసమస్యల పరిష్కార వేదికే జన్మభూమి -మా ఊరు కార్యక్రమం అని మండల స్పెషలాఫీసర్ నరసింహారెడ్డి పేర్కొన్నారు. బుధవారం మండల పరిధిలోని గొందిపల్లె, తుమ్మలూరు గ్రామపంచాయతీల్లో జన్మభూమి కార్యక్రమాన్ని సర్పంచ్‌లు చిన్నప్ప, పి.రవీంద్రారెడ్డిలు అధ్యక్షతన జరిగాయి. అనంతరం స్పెషలాఫీసర్ నరసింహారెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారవేదికగా జన్మభూమి కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందని ఈ కార్యక్రమంలో ప్రజల సమస్యలు అధికారులకు విన్నవించి పరిష్కరించుకోవాలన్నారు. అనంతరం కొత్తగా మంజూరైన రేషన్‌కార్డులను, పెన్షన్లను, ఇంటినివాస ధృవీకరణ పత్రాలు, చంద్రన్న కానుకలను, డ్వాక్రా మహిళలకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ ఆంజనేయులు, ఎంపీడీవో మల్‌రెడ్డి, ఏవో నాగార్చన, ఏపీఎం వసుధ, ఏపివో వెంకటసుబ్బమ్మ, ఆర్‌ఐ వెంకటలక్షుమ్మ, ఈవోపీఆర్డీ రఘునాథరెడ్డి, మండల ఇంజనీర్లు సోమశేఖరరెడ్డి, ముజీబ్, పశువైద్యులు రాజశేఖరరెడ్డి, ఎంఇవో సుజాత, అధికారులు, పాల్గొన్నారు.
సిద్దవటంలో..
సిద్దవటం: గ్రామాల్లో నెలకొన్న సమస్యలు అక్కడే పరిష్కరించడం జరుగుతోందని విప్ మేడా మల్లికార్జునరెడ్డి అన్నారు. మండలంలోని మాధవరం, ఉప్పరపల్లెగ్రామాల్లో బుధవారం ఆయా సర్పంచ్‌ల అధ్యక్షతన జన్మభూమి జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి జన్మభూమి గ్రామసభ మంచి వేదిక అన్నారు. రాష్ట్రంలో ఎక్కడలేని విధంగా ఎక్కడి సమస్యలు అక్కడే పరిష్కరిస్తున్నామన్నారు. దేశంలోనే 3వ అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత చంద్రబాబుదే అన్నారు. ఉన్న వనరులను సమృద్ధిగా వాడుకుని ప్రజాసంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నారన్నారు. మాధవరంలోని చేనేత కార్మికులకు పెన్షన్లు, మంచినీటి సమస్య తీర్చేందుకు మంచినీటి పథకాన్ని చేపట్టామన్నారు. కార్యక్రమంలో జిల్లా టీడీపీ మహిళా అధ్యక్షురాలు మల్లెల శ్రీవాణి, ప్రత్యేక అధికారి సుబ్బారావు, ఎంపీపీ నరసింహారెడ్డి, తహశీల్దార్ చంద్రశేఖరరెడ్డి, మండల ఉపాధ్యక్షుడు బాలకృష్ణారెడ్డి, సర్పంచ్ ఓబులయ్య, టీడీపీ నాయకులు అవ్వారు జానకీ రామయ్య, సుబ్బరాయుడు, సింగిల్ విండో డైరెక్టర్ నారాయణరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లు సంజీవరెడ్డి, ఏంఇవో హేమలత, ఆర్‌ఐ వేణు, విఆర్వోలు శేషారెడ్డి, రమేష్, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కాగా గత 4 జన్మభూమిలో మసీదుకు 2సెంట్ల స్థలం ఇవ్వాలని కోరినా ఇంతవరకు స్థలం ఇవ్వలేదని సిద్దవటం మండలం ఉప్పరపల్లెకు చెందిన అంజుమన్ భాను అనే మహిళ జన్మభూమి గ్రామసభలో అధికారులను నిలదీసింది. ఉప్పరపల్లెలో జరిగిన గ్రామసభలో ఆమె మాట్లాడుతూ ముస్లింలంటే చిన్నచూపుగా చూస్తున్నారని నాలుగు సంవత్సరాలుగా మసీదుకు 2సెంట్లస్థలాన్ని కేటాయించాలని కోరినప్పటికీ ఇంతవరకు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

పట్టిసీమపై అవగాహన లేని జగన్

కమలాపురం, జనవరి 10: రాయలసీమకు కృష్ణానీటిని అందించేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పోలవరంతో నిమిత్తం లేకుండా పట్టిసీమ ప్రాజెక్టు చేపట్టారని, దీనిపై అవగాహన లేకుండా ప్రతిపక్షనేత జగన్ తప్పుడు విమర్శలు చేస్తున్నారని కడప జిల్లా ఇన్‌చార్జి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, మార్కెటింగ్‌శాఖ మంత్రి ఆదినారాయణ రెడ్డి విమర్శించారు. వారు బుధవారం కమలాపురంలో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో పాల్గొన్నారు. సర్పంచ్ సలీమాఖాదర్ బాష, అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి సోమిరెడ్డి మాట్లాడుతూ కడపను హార్టికల్చర్ హబ్‌గా అభివృద్ధి చేసే దిశగా ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారన్నారు. జిల్లాలో గండికోట ప్రాజెక్టుకు 8 టీఎంసీల నీటిని అందించి పులివెందుల ప్రాంతంలోని జలాశయాలను నీటితో నింపి పండ్ల తోటలను అభివృద్ధి పరిచేలా బాబు చర్యలు తీసుకుంటున్నారన్నారు. పట్టిసీమ వల్ల ప్రకాశం బ్యారేజికి గోదావరి నీరు అనుసంధానం చేశారని ఐతే ఆ బ్యారేజికి శ్రీశైలంనీరు విడుదల చేయకుండా ఆ నీటిని రాయలసీమకు మళ్లిస్తున్నారని ఈ విషయం అర్థంకాక జగన్ అర్థంలేని విమర్శలు చేస్తున్నారని అన్నారు. రాయలసీమకు ఇప్పటికే 122టీయంసీల నీటిని తమ ప్రభుత్వం అందించిందన్నారు. కృష్ణా, గోదావరి నదులను అనుసంధానించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. గోదావరి, పెన్నా అనుసంధానంపై కూడా ఆయన గట్టిగా ఉన్నారన్నారు. తద్వారా సోమశిలకు గోదావరి నీరు అందుతుందని ఆ క్రమంలో గాలేరు-నగరితో కూడా దీనిని అనుసంధానం చేస్తారన్నారు. రూ.24 వేలకోట్లు రుణమాఫీ చేసి రైతుకు విముక్తి కల్పించినట్లు చెప్పారు. పండ్లతోటలను సాగుచేసే రైతులకు, ఎస్సీ, ఎస్టీ రైతులకు ప్రయోజనం కల్గించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. మంత్రి ఆదినారాయణరెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని శెనగ, మినుము, వేరుశెనగ పంటరైతులకు గిట్టుబాటుధర కల్పించి ఆదుకుంటామని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం ప్రజలను అన్ని విధాలా ఆదుకునేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తోందని చెప్పారు. పార్టీనియోజక వర్గ ఇన్‌చార్జి పుత్తా తిరిగి ఎన్నికల్లో పోటీ చేస్తారని ఆయనకే టిక్కెట్టు దక్కుతుందని ప్రజలు ఈమారు ఆయనను తప్పక గెలిపించాలని అన్నారు. మాజీ ఎమ్మెల్సీ పుత్తా మాట్లాడుతూ కమలాపురంలోని అన్ని మండలాల్లో నీరు-చెట్టు పథకం కింద చెరువుల అభివృద్ధికి రూ.80కోట్ల నిధులు సీఎం మంజూరు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో జన్మభూమి పరిశీలకుడు మధుసూదన్‌రెడ్డి, జాయింట్ కలెక్టర్ శే్వత ప్రసంగించారు. మంత్రి సోమిరెడ్డి అర్హులకు ఇళ్లపట్టాలను, రేషన్‌కార్డులు, పెన్షన్లు, చంద్రన్న బీమా చంద్రన్నకానుకలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు, టీడీపీ జిల్లా నేతలు పాల్గొన్నారు. అంతకుముందు మంత్రులను పుత్తా ఆధ్వర్యంలో ఎంపీపీ సులేఖ మండల ఉపాధ్యక్షుడు వాసుదేవరెడ్డి, జిల్లా మైనార్టీనేత ఖాదర్‌బాష, జిల్లా పార్టీనేతలు ఆర్ సుబ్రమణ్యం, సూదా అంకిరెడ్డి, నబీసాబ్, సుబ్బారెడ్డి గజమాలలతో, శాలువలతో సత్కరించారు. అనంతరం మంత్రులు హైస్కూల్ ఆవరణలో చెట్లను నాటారు. అలాగే క్రీడాపోటీల ఎద్దులను. అంగన్వాడీల పోష్టికాహార ప్రదర్శన, అటవీశాఖ వారి పుస్తకావిష్కరణ చేశారు. అంతకుముందు పార్టీనేతలు, కార్యకర్తలు స్థానిక డిగ్రీకళాశాల విద్యార్థులు మంత్రులపై పూలవర్షం కురిపిస్తూ ఘనస్వాగతం పలికారు.

ప్రభుత్వ పథకాలు అందరికీ ఇవ్వండి

చిన్నమండెం, జనవరి 10: మండలంలోని వండాడి గ్రామంలో జరిగిన జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు తారతమ్యాలు లేకుండా ప్రతి ఒక్కరికీ సమానంగా ఇవ్వాలన్నారు. బుధవారం జరిగిన జన్మభూమి-మా ఊరు కార్యక్రమం సర్పంచ్ హేమావతి అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ మండలంలోని రైతులందరికీ పింఛన్లు, రేషన్‌కార్డులు, పక్కా గృహాలు, పట్టా భూములు, రాష్ట్ర ప్రభుత్వం నుండి వస్తున్నటువంటి సంక్షేమ పథకాలన్నీ ప్రతి ఒక్కరికీ తారతమ్యం లేకుండా ఇవ్వాలని ఆయన అధికారులను కోరారు. అనంతరం మండల టీడీపీ అధ్యక్షుడు బెల్లం నరసింహారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అడిషనల్ పీడీ సురేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని, ఇందులో అర్హులైన ప్రతి ఒక్కరూ వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జివి రమణారెడ్డి, తహసిల్దార్ మల్లిఖార్జున, ప్రత్యేకాధికారి గుణశేఖర్‌పిళ్లై, పంచాయతీ సెక్రటరీ రమాదేవి, వీ ఆర్‌వో రామయ్య, మండల వైస్ ఎంపీపీ ముసల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఎత్తిపోతల పథకాలకు
రూ.100.84 కోట్ల నాబార్డు రుణం

మైదుకూరు,జనవరి 10: గ్రామీణ వౌళిక వసతుల అభివృద్ధి నిధి నుంచి ఎత్తిపోతల ప్రాజెక్టుల నిర్మాణానికి జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబార్డు) రాష్ట్ర ప్రభుత్వానికి రూ.100.84కోట్లు రుణం మంజూరు చేసిందని నాబార్డు జిల్లా అభివృద్ధి అధికారి బి.శ్రీనివాసులు తెలిపారు. బుధవారం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ రాష్ట్రంలోని 9 జిల్లాల్లో నిర్మించతలపెట్టిన 20 ఎత్తిపోతల ప్రాజెక్టుల నిర్మాణాల ద్వారా 9965 హెక్టార్ల భూమికి ఖచ్చితమైన నీటి పారుదల సౌకర్యం కల్పించడం కోసం నాబార్డు రుణసహాయం చేయనుందన్నారు. కడప జిల్లాలో కుందూనదిపై కామనూరు సమీపంలో నిర్మించతలపెట్టిన ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణానికి గాను రూ.190.484 లక్షలు నాబార్డు రుణసహాయం అందించిందన్నారు. ఈప్రాజెక్టు 101.98 హెక్టార్ల భూమికి నీటిపారుదల సౌకర్యం కలుగుతుందన్నారు. అలాగే అనంతపురం జిల్లాలో నిర్మించే ప్రాజెక్టుకు రూ.221.45లక్షలు రుణం, గుంటూరు జిల్లాలో నిర్మించనున్న 5ప్రాజెక్టులకు గాను రూ.1862.085 లక్షలు, కృష్ణాజిల్లాలో నిర్మించనున్న 5ప్రాజెక్టులకు గాను రూ.2132.872 లక్షలు నాబార్డు రుణాన్ని మంజూరుచేయనున్నట్లు తెలిపారు. అలాగే కర్నూలు జిల్లాలోనిర్మించనున్న 2ప్రాజెక్టులకు రూ.1973.748 లక్షలు, ప్రకాశం జిల్లాలో నిర్మించనున్న ప్రాజెక్టుకు రూ.731.870 లక్షలు, శ్రీకాకుళంలో నిర్మించనున్న 3ప్రాజెక్టులకు రూ.2545.344 లక్షలు, విశాఖపట్నంలో నిర్మించనున్న ప్రాజెక్టుకు రూ.218.538 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో నిర్మించనున్న ప్రాజెక్టుకు రూ.208.27లక్షల మేర నాబార్డు రాష్ట్ర ప్రభుత్వానికి రుణం మంజూరు చేయనున్నట్లు ఆయన తెలిపారు.

ఇష్టారాజ్యంగా జన్మభూమి సభలు.!

ఓబులవారిపల్లె, జనవరి 10: రాష్ట్రప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జన్మభూమి-మా ఊరు గ్రామసభ బుధవారం మండలంలోని జీవీ పురం పంచాయితీలో నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో తెలుగుదేశం పార్టీలోని ఇరువర్గాలు జన్మభూమి కార్యక్రమం ఎక్కడ నిర్వహించాలో, ప్రజలకు ఎక్కడ అనుకూలమో నిర్థారించుకునే సమయంలోనే అధికారులు స్థానిక నాయకులకు వత్తాసు పలుకుతూ పంచాయితీ కార్యాలయం, పాఠశాలలో కాకుండా ఒక టీడీపీ నాయకుని ఇంటిలో నిర్వహించడంపట్ల ప్రజలు మండిపడ్డారు. పంచాయితీలోని అన్ని వర్గాల ప్రజలు తమ సమస్యలు తెలుపుకునేందుకు వచ్చారు. కాగా జీవీ పురం టీడీపీ నాయకులు స్వంత ప్రలోభాలకు ఘర్షణ పడడంతో ప్రజల సమస్యలువినే నాథుడే కరవయ్యారు. అధికారులు టీడీపీ నాయకులతో కుమ్మక్కై వారు నిర్వహించిన సభలో జన్మభూమిని నిర్వహించారు. జీవీ పురంలో దాదాపు 500 మంది పింఛన్‌దారులు, 750 మంది రేషన్ లబ్దిదారులు ఉండగా, నూతన ప్రభుత్వ పథకాల అమలుతీరులో వారి పేర్లు లేకపోవడంతో చెప్పుకునేందుకు సభ నిర్వహించకపోవడంతో ప్రజలు అవేదన చెందారు. ఎంపీపీ వెంకటేశ్వరరాజు మాట్లాడుతూ కొన్నికొన్ని కారణాలతో సభ ఏర్పాటు ఆలస్యం అయిందని, ప్రజలకు జన్మభూమి ద్వారా అందాల్సిన అన్ని సదుపాయాలు అందిస్తామని, సంక్షేమాల అమలులో లోటుపాట్లులేకుండా చూస్తామని హమీ ఇచ్చారు. జివి పురం పంచాయితీలో ఇప్పటికీ ఏ సమస్యలు లేకుండా చేశామని, సమస్యలుంటే ఎంపీడీఓకు తెలపాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ వెంకటసుబ్బయ్య, తహశీల్దార్ నరసింహులు, ఎంఇఓ పద్మజ తదితరులు పాల్గొన్నారు.

త్వరలో బీమా మంజూరుకు చర్యలు

కమలాపురం, జనవరి 10: ఈనెలాఖరు నాటికి జిల్లాలోని రబీ రైతులందరికీ పంట బీమా మంజూరయ్యేలా చర్యలు తీసుకుంటామని వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి హామి ఇచ్చారు. ఆయన కమలాపురం జన్మభూమికి హాజరయ్యేందుకు వస్తుండగా బుధవారం స్థానిక మూడురోడ్ల కూడలి వద్ద ఆందోళన చేస్తున్న వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్‌రెడ్డి, అంజాద్‌బాషాలను మంత్రిని కలుసు కునేందుకు పోలీసులు అనుమతించారు. ఈ సందర్భంగా వారు మంత్రిని కలసి జిల్లాలో 2016 పంట బీమా మంజూరులో రైతులకు అన్యాయం జరిగిందని రైతుల సమస్యలను పరిష్కరించాలని మంత్రిని కోరారు. ఇందుకు స్పందించిన జిల్లా ఇన్‌చార్జి మంత్రి సోమిరెడ్డి వారితో మాట్లాడుతూ మరోపక్షం రోజుల్లో సంబంధిత ఇన్సూరెన్స్ కంపెనీలతో వ్యవసాయశాఖ అధికారులతో చర్చించి రైతులకు న్యాయం చేస్తానని హామి ఇచ్చారు. 2013-14 బీమామొత్తాలు, పంట నష్టపరిహారాలు, ఇన్‌పుట్ సబ్సిడీ మొత్తాలు కూడా అర్హత కల్గిన రైతులందరికీ అందేలా చర్యలు తీసుకుంటామని హామి ఇచ్చారు.

సంతోషంగా సంక్రాంతి జరుపుకోవాలి
* మండలి మాజీ ఉపాధ్యక్షుడు సతీష్‌రెడ్డి
వేంపల్లె, జనవరి 10: కులమతాలకు అతీతంగా సంక్రాంతి పండుగను అందరూ జరుపుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆలోచన అని మండలి మాజీ ఉపాధ్యక్షుడు ఎస్‌వి సతీష్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం వేంపల్లెలో ఆయన సంక్రాంతి చంద్రన్న కానుకను లబ్దిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు ఉన్న ముఖ్యమంత్రుల్లో ఏ ముఖ్యమంత్రి కానీ, ఇలాంటి పండుగ కానుకలను ఇవ్వలేదన్నారు. క్రిస్టియన్లకు, ముస్లింలకు, హిందువులకు సంబంధించిన పండుగలకు ప్రతిసారి సీ ఎం చంద్రబాబు పండుగ సరుకులతో కూడిన కానుకలను ఇవ్వడం జరుగుతుందన్నారు. ముఖ్యంగా పులివెందుల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని ఆయన ఎంతో కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. ఇప్పటికే పులివెందుల నియోజకవర్గానికి తాగునీరు, సాగునీరుకు ఎటువంటి కొరత లేదన్నారు. మరింత సాగునీరు తెచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వేంపల్లె సర్పంచ్ విష్ణువర్ధన్‌రెడ్డి, తహశీల్దార్ ప్రభాకర్‌రెడ్డి, వేంపల్లె ప్రత్యేకాదికారి శ్రీనివాసులరెడ్డి తదితర అధికారులు, పాల్గొన్నారు.