కడప

గండికోటకు ఒరిగేదేమిటి.!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,జనవరి 17: ప్రస్తుతం జిల్లా అధికార యంత్రాంగం ‘గండికోట ఉత్సవాల’ను నిర్వహించబోతున్న తీరు వల్ల గండికోటకు ఒరిగేదేమిటో అర్థం కావడంలేదు. గండికోటను ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాల్సిన చర్యలు ఏవీ లేవనే విమర్శలు చరిత్ర, సామాజిక విశే్లషకుల నుంచి విన్పిస్తున్నాయి. రూ.2కోట్లు డబ్బునంతా, హైదరాబాద్‌కు చెందిన ఈవెంట్ ఆర్గనైజింగ్ సంస్థ ‘విన్‌సన్ గ్రాఫిక్స్’కు ధారపోయడంతో, తక్కిన సౌకర్యాలకు ఒక్క నయాపైసా కూడా ఖర్చుపెట్టని పరిస్థితి స్పష్టంగా కన్పిస్తోంది. సదరు విన్‌సన్‌గ్రాఫిక్స్ సంస్థ, సినిమా ఆడియో కార్యక్రమాలు నిర్వహించిన తరహాలో కార్యక్రమాలు రూపొందించుకుంది. అధికారులు ఈ తీరుపై పత్రికల్లో వచ్చిన వార్తలకు స్పందించి, బుధవారం గండికోటలో అధికారులు తొలిసారిగా సమావేశమయ్యారు. ఉత్సవాలకు హాజరయ్యే ప్రజలకు ఏవిధమైన అసౌకర్యాలు కలగకుండా తాత్కాలిక సౌకర్యాలు ఏర్పాటు చేయాలని జాయింట్ కలెక్టర్ శే్వతతెవతియ అధికారులను ఆదేశించారు.
గండికోటకు పర్యాటక గుర్తింపుతెచ్చే చర్యలపై జిల్లా ఉన్నతాధికారులకు గానీ, పర్యాటకశాఖకు కానీ ఏమాత్రం శ్రద్ధ లేదనే విషయం ఉత్సవాల రూపకల్పనను బట్టి అర్థవౌతోంది. కేవలం ఉత్సవాల రోజు మాత్రం ప్రజలను ఆకర్షించేందుకే వారు ప్రాధాన్యమిచ్చినట్లు స్పష్టవౌతోంది. సినీ గాయకులతో పాటలు, సినిమా నటులతో మిమిక్రీ, హాస్య కార్యక్రమాలు లాంటి వినోద కార్యక్రమాలకే అధికమొత్తం వెచ్చించినట్లు తెలుస్తోంది. కనీసం స్థానిక కళాకారులకు ఈమొత్తంలో 5శాతం వెచ్చించేందుకు కూడా అధికారులు ఇష్టపడటం లేదనే విమర్శలు విన్పిస్తున్నాయి. ఉత్సవాల కల్చరల్ కన్వీనర్ మూలమల్లికార్జునరెడ్డి ఈ విషయమై జాయింట్ కలెక్టర్ వద్ద ప్రస్తావించగా ఆమె ఆగ్రహించినట్లు విశ్వసనీయ సమాచారం. రూ.5లక్షల కన్నా ఎక్కువ స్థానిక కళాకారులమీద ఖర్చుచేయలేమని ఖరాఖండిగా చెప్పినట్లు తెలుస్తోంది. మొత్తం డబ్బును ఈవెంట్ ఆర్గనైజింగ్ సంస్థలకు ధారపోయడం వెనుక కొంతమొత్తం చేతులు మారేందుకే కరిగిపోయిందనే విమర్శలు విన్పిస్తున్నాయి.
గండికోటకు ప్రపంచపర్యాటక గుర్తింపు ఎప్పుడు?
ఫ్రెంచ్ ఇన్సిట్యూట్ ఆఫ్ పాండిచ్చేరి వారు ముద్రించిన ‘్ఫర్ ఫోర్ట్స్ ఆఫ్ దక్కన్’ అనే ప్రతిష్టాత్మక చారిత్రక కోటల విశేష సంచికలో మనదేశంలోని నాలుగు కోటలకు స్థానం లభించింది. అందులో గండికోటకు స్థానం లభించడం, ఆ కోట యొక్క ప్రాశ్యస్త్యాన్ని చెప్పకనే చెబుతోంది. తక్కిన వాటిలో అనంతపురం జిల్లాలోని గుత్తికోట, కర్నాటకలోని ముద్గల్‌కోట, మహారాష్టల్రోని దేవగిరి కోటలు ఉన్నాయి. గండికోటను ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని, గత ఏడాది గండికోటను సందర్శించిన వెళ్లిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. అమెరికాలోని గ్రాండ్ క్యానియల్ తరహాలో గండికోటను తీర్చిదిద్దేందుకు అన్ని భౌగోళిక అనుకూలతలు ఉన్న విషయాన్ని ముఖ్యమంత్రి అప్పట్లో గుర్తుచేశారు. కోటలో పార్కులు, రోప్‌వే ,కోటపక్కనే గండిలో ప్రవహిస్తున్న పెన్నానదిలో బోటింగ్ ఏర్పాట్లు లాంటివి ఎన్నోచేస్తామని ప్రకటించారు. అయితే ఇంతవరకు కనీసం జమ్మలమడుగు నుంచి గండికోట వరకు 16కి.మీ. రోడ్డును కూడా వెడల్పు చేయలేదు. దీనికి టెండర్లు పిలిచినా, రాజకీయ జోక్యాలతో ఈ రోడ్డుపని కార్యరూపం దాల్చలేదు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో గండికోట వద్ద పర్యాటక అతిధిగృహ సముదాయాలు నిర్మాణం కావడం మినహా అక్కడ ఒక్క నయాపైసా పని కూడా ఈ ప్రభుత్వహయాంలో జరగలేదు. జిల్లా అధికారులు సైతం యధారాజా తధా అధికారులు అన్నట్లు గండికోటపై చిన్నచూపు చూస్తున్నారు. విధిలేని పరిస్థితిలో గండికోట ప్రాశస్త్యాన్ని నిర్లక్ష్యం చేయలేక, పర్యాటకశాఖ క్యాలెండర్‌లో పొందుపరచి ప్రతి ఏటా నామకార్థంగా ఉత్సవాలు జరిపేందుకు మాత్రం నిర్ణయించారనే విమర్శలున్నాయి.
ప్రభుత్వం కేటాయించిన రూ.2కోట్లు కాకుండా, జిల్లాలోని భారీ పరిశ్రమల నుంచి విరాళాలు సేకరించినట్లు విశ్వసనీయ సమాచారం. గతంలో ఉత్సవాలు జరిగిన రెండుసార్లు ఈ విషయాన్ని అధికారులు పారదర్శకంగానే బయటపెట్టారు. అయితే ఈసారి పరిశ్రమల నుంచి విరాళాలు ఏమీ తీసుకోలేదని చెబుతున్నారు. అంతా గోప్యత పాటిస్తున్నారు. ఈ గోప్యతే అనేక విమర్శలకు తావిస్తోంది. గండికోటను ఒక సౌకర్యవంతమైన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడాన్ని గాలికి వదిలి, కేవలం ఉత్సవాలరోజు ప్రజలను ఆకర్షించేందుకు వినోద కార్యక్రమాలు ఏర్పాటుచేసేందుకే డబ్బంతా ధారపోయడం వల్ల గండికోటకు ఒరిగేదేమిటో జిల్లా ఉన్నతాధికారులకే తెలియాలి. ఉత్సవాలు ముగిసిన మరుసటిరోజునుంచి గండికోటకు వెళ్లే వారే కరువవుతున్నారు. కారణం అక్కడ ఏ సౌకర్యాలు లేకపోవడమే. ప్రధానంగా దీన్ని జిల్లా ఉన్నతాధికారులు గ్రహించాల్సివుంది.

రాజంపేటలో డ్రైనేజీ విస్తరించరా?

రాజంపేట, జనవరి 17: రాజంపేట పంచాయతీ నుండి మున్సిపాలిటీకి అప్‌గ్రేడ్ అయి దశాబ్దం పూర్తయ్యినా వసతుల విషయంలో ఇంకా వెనుకబడే ఉంది. మున్సిపాలిటీ అయితే పట్టణ సౌకర్యాలు కలుగుతాయని ఇక్కడి ప్రజలు భావించినా వీరిభావనలకు తగ్గట్టుగా అభివృద్ధి ముందుకు సాగడంలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా డ్రైనేజీ విషయంలో రాజంపేట పట్టణం ముందుకు వెనుకకు అన్నట్టుగా అభివృద్ధి సాగుతున్నది. దీర్ఘకాలిక ప్రయోజనాలకు తగ్గట్టు ఇక్కడి డ్రైనేజీని విస్తరించని పరిస్థితులు దారుణం. రోజురోజుకు పట్టణ జనాభా పెరుగుతుండడమే కాకుండా శివారుప్రాంతాల్లో కూడా కొత్తకొత్త కాలనీలు ఏర్పడుతున్నా ఇందుకు తగ్గట్టు డ్రైనేజీని విస్తరించే విషయంలో పూర్తి నిర్లక్ష్యవైఖరి కానవస్తుంది. చాలాప్రాంతాల్లో రోడ్డుపైకే మురికినీటిని వదిలే పరిస్థితులున్నాయి. దశాబ్దాల క్రితం నాటి డ్రైనేజీ వ్యవస్టకే కొద్దిపాటి మార్పులుచేస్తూ పట్టణ డ్రైనేజీని ముందుకు నడిపిస్తున్నారు. మున్సిపాలిటీ పరిధి రోజురోజుకు విస్తరిస్తున్న దృష్ట్యా డ్రైనేజీ వసతిని విస్తరించాలన్న విజ్ఞప్తులు ఎక్కువవుతున్నాయి. ఇప్పటికే పలుమార్లు మున్సిపల్ అధికార్ల మొదలు ప్రజాప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికార్ల వరకు విజ్ఞప్తులు చేస్తున్నా పట్టించుకునే నాథుడే కరవవుతున్నారన్నారు. కేవలం హామీలతో కప్పిపుచ్చుతున్నారని విమర్శించారు. డ్రైనేజీ వసతిలేని కారణంగా కొత్తగా పెరుగుతున్న పట్టణానికి డ్రైనేజీ వసతి కరవై ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంతకుమించి ఒక మోస్తరు వర్షాలుపడ్డా రోడ్లపైనే వర్షపునీరు మోకాలిలోతుకు పైగా నిలిచిపోయే పరిస్థితులున్నాయి. అంతేకాకుండా ఉన్న డ్రైనేజీవ్యవస్థ కూడా సరిగ్గా లేనందున అనేకచోట్ల మురికినీటిని రోడ్లపైకి వదిలేసేదుస్థితి నెలకొంది. మురికినీరు రోడ్లపై పారుతుండడంతో ఈ నీటి మీదుగానే పాదచారులు, వాహనాలు రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరికొంతమంది డ్రైనేజీ వసతి ఉన్నా రోడ్లపై చెత్తా చెదారంతో పాటు మురికినీటిని వదిలేస్తుండడం జరుగుతుంది. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని కూడా మున్సిపాలిటీని వివిధ వర్గాల ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికైనా పట్టణంలో డ్రైనేజీ వసతిని మెరుగుపరిచేందుకు దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించి తదనుగుణంగా అభివృద్ధిని ముందుకు నడిపించేందుకు స్థానిక ప్రజాప్రతినిధులు సత్వరం స్పందించాల్సి ఉంది.

దేవుని కడప బ్రహ్మోత్సవాలు ప్రారంభం
* ప్రత్యేక పూజలు చేసిన భక్తులు
కడప,(కల్చరల్)జనవరి 17: స్థానిక దేవునికడపలోని శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు బుధవారం దీక్షా తిరుమంజనం కార్యక్రమంతో వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా భక్తులు శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారు జాము నుంచి శ్రీవారికి శాస్త్రోక్తంగా ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. అలాగే రాత్రి టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు అన్నమయ్య కీర్తనలు ఆలపించారు. అదేవిధంగా స్వామివారికి సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణం తదితర కార్యక్రమాలు జరిగాయి. ఉత్సవాల ప్రారంభం సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి తమ భక్తిని చాటుకున్నారు. కాగా గురువారం ఉదయం 10.30గంటలకు స్వామివారికి స్నపన తిరుమంజనం, రాత్రి చంద్రప్రభ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.

బీసీలకు అండగా ఉండేది వైకాపానే..

పులివెందుల, జనవరి 17: వెనుకబడిన వర్గాలకు అండగా వుండేది వైయస్ పార్టీయేనని కడప పార్లమెంటు సభ్యులు వైఎస్ అవినాష్‌రెడ్డి తెలిపారు. బుధవారం స్థానిక వైయస్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ వైయస్‌ఆర్ కాంగ్రేస్ పార్టీ బీసీ నాయకులకు మండలాల వారిగా, గ్రామాలవారిగా పదవులను ఇవ్వడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా పులివెందుల మండల బీసీ కన్వీనర్‌గా బాబును, లింగాల మండలానికి పక్కీరప్ప, వేంపల్లె మండలానికి రామాంజనేయులు, సింహాద్రిపురానికి రాజాబాబు, తోండూరు మండలానికి గంగయ్యయాదవ్, చక్రాయపేట మండలానికి శ్రీనివాసులు నియమించడం జరిగిందన్నారు. వీరు ఆయా వర్గాల సమస్యలు తీర్చేందుకు, అభివృద్ధి కొరకు కృషి చేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో వైయస్ ఆర్ కాంగ్రేస్ పార్టీ ఎన్నికల పరిశీలుకుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, వైకాపా పట్టణ అధ్యక్షుడు వరప్రసాద్‌రెడ్డి, పులివెందుల నియోజకవర్గంలోని బీసీ నాయకులు పాల్గొన్నారు.

శెనగ రైతుకు పంట బీమా అందించాలి

కమలాపురం, జనవరి 17: జిల్లాలో శెనగరైతుకు పంట బీమా అందించాలని, గతంలో ఎన్నడూ లేనంతగా ఈ మారు రైతులు తీవ్రంగా అన్యాయమయ్యారని జిల్లా వైసీపీ రైతు విభాగం కన్వీనర్ పుత్తా ప్రసాద్ రెడ్డి విమర్శించారు. ఆయన బుధవారం పార్టీకార్యాలయంలో విలేఖర్లతో మాట్లాడుతూ 2016 రబీసీజన్‌లో బుడ్డశెనగ సాగుచేసిన రైతులు పంట దెబ్బ తినడంతో పీఎం ఫసల్ బీమా కోసం డీఆర్‌డీఏ లోని ఐకేపీ సమాఖ్యవారికి ప్రీమియం మొత్తం చెల్లించారన్నారు. ఐతే జిల్లాలో పలు మండలాల్లోని రైతులకు బీమామొత్తం ఒక్కరూపాయి కూడా బ్యాంకుల్లోని వారి ఖాతాల్లో జమకాలేదని అన్నారు. ఐసీఐసీఐ లాంబార్డ్ బీమా సంస్థ రైతులను మోసం చేసిందని ఆందోళన వ్యక్తం చేశారు. దరఖాస్తుల్లో తప్పులు ఉన్నాయని వంకలు పెట్టి 2263 మంది రైతుల దరఖాస్తులను తిరస్కరించారన్నారు. అంతేకాక జిల్లాలో 2016 రబీకి సంబందించి 8రకాల పంటలకు బీమా చేసుకునే విధంగా రైతులకు ప్రభుత్వం వీలు కల్పించడం జరిగిందన్నారు. ర. జిల్లాలో ఆ ఏడాదికి సంబంధించి రబీలో 1.39లక్షల హెక్టార్లలో వివిధరకాల పంటలు సాగుచేశారన్నారు. వాణిజ్య పంటలకు సంబంధించి రైతులు సుమారు 6.5కోట్ల రూపాయల ప్రీమియం చెల్లించారన్నారు. ఐతే ప్రీమియంల వివరాలన్నీ అప్పట్లో తప్పులు దొర్లాయని తెలుపుతూ 17 వేలమంది రైతుల దరఖాస్తులను తిరస్కరించిందన్నారు. ఐతే రైతుల ఆందోళన ఫలితంగా ప్రభుత్వం దరఖాస్తులను పరిశీలించి తిరిగి 2263 మంది రైతుల దరఖాస్తులను తిరస్కరించడం అన్యాయమన్నారు. ప్రధానంగా జిల్లాలో వీయన్‌పల్లె, వేంపల్లె, వేముల, తొండూరు, లింగాల పెద్దముడియం మండలాల్లో అధికమంది రైతులకు బీమా మొత్తాలు మంజూరు కాలేదని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతులకు జరిగిన అన్యాయాన్ని గుర్తించి ప్రతి ఒక్కరైతుకు బీమా మొత్తం మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఉమేష్‌చంద్ర సేవలు మరువలేం
* ఎస్పీ అట్టాడ బాబూజీ
ఖాజీపేట,జనవరి 17: పోలీసుశాఖకు వనె్నతెచ్చిన దివంగత ఐపీఎస్ అధికారి ఉమేష్‌చంద్ర అందించిన సేవలు మరవలేనివని ఎస్పీ అట్టాడ బాబూజీ పేర్కొన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం ఉమేష్‌చంద్ర స్మారక కేలండర్‌ను ఎస్పీ బాబూజీ ఆవిష్కరించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ ప్రజలకు, ప్రభుత్వానికి అనుసంధానంగా పనిచేస్తూ ప్రజలకు సేవచేసినప్పుడే ప్రజల హృదయాల్లో నిలిచిపోతామన్నారు. దివంగత ఉమేష్‌చంద్ర అటు అధికారుల్లో, ప్రజల్లో పేరు ప్రతిష్టలు పొంది చిరస్థాయిగా నిలిచారన్నారు. కార్యక్రమంలో ఆపరేషన్ ఏఎస్పీ నయిం ఆజ్మీ, పరిపాలన విభాగం ఏఎస్పీ శ్రీనివాసులురెడ్డి, ఏఆర్ ఎస్‌ఐలు హజరతయ్య, రత్నాపతిలు పాల్గొన్నారు.

పింఛాగేట్ల నుంచి లీకేజీలు!

సుండుపల్లె, జనవరి 17: పింఛా ప్రధాన గేట్ల ద్వారా నీరు వృథా కావడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. సుండుపల్లె మండలంలో కడప-చిత్తూరు జిల్లాల సరిహద్దులో పింఛా నదిపై నిర్మించిన పింఛా ప్రాజెక్టు కొద్ది రోజుల క్రితం వర్షం నీటితో కళకళలాడేది. ప్రస్తుతం గేట్ల ద్వారా నీరు వృధా కావడం కుడి, ఎడమ కాలువల ద్వారా పంటల సాగుకు నీటిని విడుదల చేయడంతో 93 అడుగులకు ప్రాజెక్టు నీరు చేరింది. ప్రస్తుతం వర్షాలు పడే సూచనలు లేకపోవడంతో పంటలు చేతికందేనా అని రైతుల్లో గుబులు మొదలైంది. ప్రధాన గేట్ల ద్వారా నీరు వృధా కాకుండా పింఛా ప్రాజెక్టు సంబంధిత అధికారులు నీటిని ఆపేందుకు చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. కొద్దిపాటి నీటిని ఆపినా మరింత నీరు వృథాగా ఏటిలోకి వెళ్తోంది. కుడి, ఎడమ కాలువల ద్వారా ప్రస్తుతం సుమారు 5 వేలకు పైన హెక్టార్లకు నీటిని సరఫరా చేయుగల సామర్థ్యం ప్రాజెక్టు సొంతం. పింఛా, పెద్దినేనికాలువ, రాయవరం, మాచిరెడ్డిగారిపల్లె, ముడుంపాడు ప్రాంతాల రైతులకు పింఛా ప్రాజెక్టు వరప్రసాదం లాంటిది. ముఖ్యంగా ఒకప్పుడు నాగరిక సమాజానికి తండాలో పింఛా ప్రాజెక్టుతో వారి దశ మారింది. పంటల సాగు,తోటల పెంపకంలో ఆర్థికంగా బలపడ్డ గిరిజన గ్రామాలు ప్రస్తుతం ప్రాజెక్టు పరిస్థితిపై ఆందోళన చెందుతున్నారు. తుప్పు పట్టిన ప్రాజెక్టు గేట్లను చూస్తే ఆశ్చర్యపోక తప్పడం లేదు. 1954లో మొదలుపెట్టి 1960లో పింఛా ప్రాజెక్టును పూర్తి చేశారు. 1961లో ప్రాజెక్టును పరీక్షించి 1962లో 0.327ఎఫ్‌సిఎంటీఎల్ పూర్తి సామర్థ్యంతో నీటిని నిల్వ చేయడం ప్రారంభించారు. ప్రాజెక్టు సామర్థ్యం అక్షరాలా వంద అడుగులు. అలాగే ప్రాజెక్టు కింద ప్రస్తుతం సాగులో ఉన్న వేరుశనగతో పాటు పలు రకాల పంటలలో వేరుశెనగ అరకొరగా చేతికి అందుతుందని, వరిసాగుపై రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం నీటి వృథాని అరికట్టే మార్గాలు లేకపోవడంతో స్థానిక అధికారులు సైతం చేతులెత్తేశారు. పింఛా ప్రాజెక్టుకు అధికారులతో పాటు నీటిసంఘం అధ్యక్షుడి ఎంపిక అనంతరం మొదటిసారి పింఛా ప్రాజెక్టు నిండింది. రెండు సార్లు పంటలు పండించుకోవచ్చని ధీమాగా ఉన్న రైతుల ఆశలపై తుప్పుపట్టిన గేట్లు నీళ్లు గార్చాయి.
పింఛా నీటి సంఘం అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి వివరణ.:
నీటి వృథాను అరికట్టేందుకు తమ శాయశక్తులా ప్రయత్నించామని గోనే సంచులు, ఎండుగడ్డి వంటి వాటిని వినియోగించి సాధ్యమైనంత వరకు నీటిని ఆపేందుకు ప్రయత్నించామని, కొంత వరకు ఆగినా మరికొంత నీరు వృధాగా పోతున్నదని ఆయన తెలియజేశారు. త్వరలో అధికారులతో చర్చించి నీటి వృథా అరికట్టేందుకు మరిన్నీ చర్యలు చేపడుతామన్నారు.

గండికోట ఉత్సవాలను విజయవంతం చేయాలి

జమ్మలమడుగు, జనవరి 17: గండికోట వారసత్వ ఉత్సవాలను విజయవంతం చేసేందుకు అధికారులు కృషిచేయాలని జాయింట్ కలెక్టర్ శే్వత తెవతీయ పేర్కొన్నారు. ఉత్సవాల ఏర్పాట్లపై గండికోట టూరిజం కాన్ఫరెన్స్ హాలులో బుధవారం జిల్లా, డివిజనల్ స్థాయి అధికారుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఉత్సవాల నిర్వహణకై తీసుకోవాల్సిన చర్యలపై శాఖల వారీగా ఆయాశాఖల అధికారులతో సమీక్షించారు. అనంతరం జెసి శే్వత మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గండికోట వారసత్వ ఉత్సవాలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందన్నారు. ఈనెల 21నుండి మూడురోజుల పాటు నిర్వహించే ఉత్సవాలను పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఉత్సవాల నిర్వహణలో ఎటువంటి పొరపాట్లు చోటుచేసుకోకుండా గట్టిచర్యలు తీసుకోవాలన్నారు. ఉత్సవాలకు మంత్రులు, ప్రముఖులు వస్తున్నందున పోలీసుశాఖ వారు పట్టిష్టమైన ఏర్పాటు చేయాలన్నారు. అదే క్రమంలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా హోర్డింగులు, బారికేడ్లు ఏర్పాటు చేయాలన్నారు. ఉత్సవాలకు ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చే అవకాశం ఉన్నందున తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయాలన్నారు. ఉత్సవాలకు వచ్చే ప్రజలకు మెరుగైన ఆర్టీసీ సర్వీసులను అందించడంతో పాటు, ప్రజలకు అందుబాటులో ఉండేలా టికెట్‌లో రాయితీ కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. గండికోట ఉత్సవాల పబ్లిసిటీ కొరకు జిల్లాలోని ప్రధా న ప్రాంతాల్లో హోర్డింగ్‌లు ఏర్పాటు చేయాలన్నారు. ఉత్సవాల సమయం లో పారిశుద్ద్యలోపం లేకుండా ప్రత్యేకచర్యలు తీసుకోవాలన్నారు. గండికోట ఉత్సవాలను విజయవంతం చేసేందుకు అధికారయంత్రాంగం కృషిచేయాలని జాయింట్ కలెక్టర్ శే్వత తెలిపారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ -2 శివారెడ్డి, టూరిజం జాయింట్ డైరెక్టర్ గోపాల్, జిల్లా టూరిజం అభివృద్ది అధికారి విజయ్‌కుమార్, డిఆర్‌డిఎ పీడీ రామచంద్రారెడ్డి, ఆర్డీవో నాగన్న, ఈవెంట్ మేనేజర్ ప్రసాద్ చౌదరి, ఎపీడీ మొగలిచెండు సురేష్, తహసీల్దార్ చంద్రశేఖరరెడ్డి, అధికారులు పాల్గొన్నారు.
రైతులకు
పంట బీమా చెల్లించండి

పులివెందుల, జనవరి 17: పంట నష్టపోయన రైతులకు బీమా అందించి ఆదుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు తుప్పాల శ్రీనాథ్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2012 సంవత్సరము నుంచి 2016వ సంవత్సరము వరకు రైతులు పంటల బీమాకోసం ప్రీమియం చెల్లించారని కానీ కొంతమందికి మాత్రమే బీమా కంపెనీలు బీమాను చెల్లించారని మరి కొంతమందికి చెల్లించకుండా జాప్యం చేస్తున్నారన్నారు. ఈ విషయమై ఎన్నో సార్లు అధికారులను అడిగినా పట్టించుకోలేదన్నారు. ఇది ఇలాగే జరిగితే రైతులందరూ రోడ్డుపైకి వచ్చి ధర్నాలు చేయాల్సివస్తుందన్నారు. గత పది సంవత్సరాలుగా రైతులు పంటలు పండక తీవ్రంగా నష్టపోతున్నారన్నారు.ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చొరువ తీసుకుని రైతుల ఖాతాలలోకి పంటల బీమాకు సంబంధించిన డబ్బులను వేయాలన్నారు. ఒకే గ్రామంలో పంట బీమా కొంతమందికి వచ్చి, మరికొంత మందికి రాకపోవడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. రైతులకోసం బీజేపీ ఎప్పుటికీ అండగా ఉంటుందని వారికి న్యాయం జరిగేంతవరకు పోరాటం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రమణారెడ్డి, అప్పయ్యనాయుడు, పాల్గొన్నారు.