కడప

జోరుగా ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్‌లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,మే 26: గత రెండువారాలుగా దేశవ్యాప్తంగా జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ క్రికెట్ లీగల్ మ్యాచ్‌లు జిల్లాలోని పలు పోలీసుస్టేషన్లకు కాసుల వర్షం కురిపిస్తున్నాయనే విమర్శలు విన్పిస్తున్నాయి. జిల్లాక్రికెట్ బెట్టింగ్‌లు కాస్తున్నారంటూ పలుప్రాంతాల్లో పోలీసులు పలువురు యువకులను అదుపులోకి తీసుకుంటున్నారు. అయితే అదుపులోకి తీసుకుంటున్నవారికంటే, మామూళ్లు వసూలు చేసి వదలిపెడుతున్న కేసులే ఎక్కువ అనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఐపీఎల్ మ్యాచ్‌లపై బెట్టింగ్‌లు ప్రతిరోజు అనేక ప్రాంతాల్లో, స్థలాలు మార్చుతూ జరుపుతున్నారు. జిల్లా వ్యాప్తంగా క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకులు ఎక్కడపడిడే అక్కడ అందుబాటులో ఉండటంతో, క్రికెట్ ఆటపై ఆసక్తి, అభిమానం ఉన్నవాళ్లు క్రమంగా క్రికెట్ బెట్టింగ్‌లలోకి దిగుతున్నారు. వేసవికాలం రావడం, పాఠశాలలకు, కాలేజిలకు సెలవులు రావడంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో యువకులు క్రికెట్ ఆటల పోటీలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ పోటీల్లో కూడా బెట్టింగ్స్ జరుగుతున్నాయి. బెట్టింగ్సే కాకుండా యువకుల మధ్య విభేధాలు పొడచూపడం, దాన్ని ఆసరా తీసుకుని కొంతమంది పోలీసులకు సమాచారం ఇవ్వడం, పోలీసులు వచ్చి బెట్టింగ్ ఆడకపోయినా, వారిపై క్రికెట్ బెట్టింగ్ కేసులు నమోదు చేయడం జరుగుతోందనే ఆరోపణలు ఉన్నాయి. వాస్తవంగా క్రికెట్ బెట్టింగ్‌లు నిర్వహిస్తూ వేలు, లక్షల రూపాయల్లో చేతులు మార్చుతున్న వారిని వదిలిపెట్టి, క్రికెట్ ఆట ఆడుకునేవారి మధ్య గొడవలు జరిగినప్పుడు వారిని అదుపులోకి తీసుకుంటున్నారనే విమర్శలు విన్పిస్తున్నాయి. ఇలాంటి కేసుల్లో ఏమాత్రం విచారణ లేకుండానే, ఆ యువకుల తల్లిదండ్రుల నుంచి భారీ ఎత్తున వసూలు చేస్తున్నారనే ఆరోపణలూ ఉన్నాయి. తాజాగా జమ్మలమడుగులో ఒక ఎస్‌ఐ, బెట్టింగ్ ఆడకపోయినా ఒకటిన్నర లక్షల రూపాయలు తీసుకుని తన కుమారుడిని కేసులో ఇరికించారని ఆప్రాంతానికి చెందిన ఓ వ్యాపారి రోడ్డుకెక్కారు. కాగా క్రికెట్ పందేలకు ఎప్పటి నుండో ప్రొద్దుటూరు కేంద్రంగా ఉంది. ఇక్కడ దళారుల జోరు, జోష్ ఎక్కువ. ఇప్పటికే ఈప్రాంతంలో క్రికెట్ బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నారంటూ పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకుని సొమ్ము చేసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న ఓ పోలీసుస్టేషన్ పరిధిలో కొందరు యువకులు క్రికెట్ బెట్టింగ్ కాస్తున్నారంటూ వారిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి రూ.30వేలు వసూలు చేసినట్లు ఆరోపణలు విన్పిస్తున్నాయి. గతంలో చెన్నూరు పోలీసుస్టేషన్ పరిధిలో క్రికెట్ బెట్టింగ్‌ల నిర్వాహకుల నుండి సుమారు రూ.10లక్షలు వసూలు చేసిన కేసులో ఎస్‌ఐ, సీఐలను విఆర్‌లో వుంచిన విషయం తెలిసిందే. ఇప్పుడు కూడా ఇదే పరిస్థితి జిల్లా వ్యాప్తంగా నెలకొన్నదనే విమర్శలు ఉన్నాయి. ఈ ఆరోపణలు తీవ్రస్థాయికి చేరడంతో రెండురోజుల క్రితం ప్రొద్దుటూరులో కొంతమందిని అరెస్టు చూపించి రూ.2లక్షలు నగదు పట్టుకున్నట్లు ప్రకటించారు. కడప నగరంలోనూ కొందరని అదుపులోకి తీసుకుని, రూ.12లక్షలు నగదు, గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు. గత కొనే్నళ్లుగా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో క్రికెట్ బెట్టింగ్‌ల వ్యవహారంలో కోట్లరూపాయల పందేలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఇక్కడ పోలీసుల నుండి మామూళ్ల వత్తిళ్లు, వేధింపులు పెరగడంతో ఇక్కడున్న క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకులు గుంటూరుకు తమ మకాం మార్చినట్లు తెలుస్తోంది. ఇలా జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ వ్యవహారం పలు పోలీసుస్టేషన్లకు కాసుల వర్షం కురిపిస్తోందనేది మాత్రం వాస్తవమని అంటున్నారు.