కడప

వైసీపీలోకి సీఆర్‌సీ.. జనసేనకు భారీ గండి..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజంపేట, నవంబర్ 13:రాష్ట్ర రాజకీయాల్లో తన కంటూ ఒక ప్రత్యేకతను సొంతం చేసుకున్న మాజీ మంత్రి సి.రామచంద్రయ్య(సీఆర్‌సీ) మంగళవారం విజయనగరం జిల్లా పార్వతిపురంలో పాదయాత్రలో ఉన్న వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం తీసుకోవడం రాజకీయంగా ముఖ్యంగా రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో సంచలనం రేకెత్తిస్తుంది. సీఆర్‌సీ వైసీపీ తీర్థం పుచ్చుకోవడం ఒకరకంగా ఇప్పుడిప్పుడే రాజకీయంగా ఎదగాలనుకుంటున్న జనసేనకు ఈ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో భారీ గండి పడినట్టేనని చెప్పవచ్చు. సీఆర్‌సీ వైసీపీ తీర్థం పుచ్చుకునే సమయంలో రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జి ఆకేపాటి అమర్‌నాథరెడ్డితో పాటు జిల్లాలోని వైసిపి ముఖ్యనేతలు, ఎమ్మెల్యేలు హాజరవ్వడం జరిగింది. ఈ పార్లమెంటరీ నియోజకవర్గంలో సంస్థాగతంగా జనసేన ఇంకా ఎదగనప్పటికి బలిజ సామాజికవర్గం జనసేనకు అండగా ఉండే పరిస్థితులే అధికం. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సామాజికవర్గంకు చెందిన సి.రామచంద్రయ్య వైసీపీ తీర్థం పుచ్చుకోవడంతో ఓ రకంగా జనసేన రాజకీయంగా ఈ పార్లమెంటరీ నియోజకవర్గంలో ఎదిగేందుకు ఉన్న అవకాశాలు చాలావరకు మృగ్యంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే బలిజ సామాజికవర్గానికి చెందిన మాజీ పార్లమెంటు సభ్యులు ఎ.సాయిప్రతాప్, సుగవాసి పాలకొండ్రాయుడు వర్గం, మాజీ మంత్రి పసుపులేటి బ్రహ్మయ్య, మాజీ ఎమ్మెల్సీ బత్యాల చంగల్రాయుడు, కడప ఆర్టీసీ రీజనల్ మాజీ ఛైర్మెన్ యెద్దల సుబ్బరాయుడు లాంటి ముఖ్యమైన నేతలు తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నారు. ఈ పరిస్థితుల్లో రాజకీయంగా మంచి అవగాహన కలిగిన సి.రామచంద్రయ్య లాంటి నేత చేరిక ఓ రకంగా వైసీపీకి అదనపు బలమని చెప్పవచ్చు. అంతకు మించి ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపధ్యంలో బలిజ సామాజికవర్గానికి చెందిన సీనియర్ నేత సీఆర్‌సీ చేరికతో వైసీపీకి కొత్త ఉత్సాహం వచ్చినట్టేనని చెప్పవచ్చు. ఈ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో బలిజ సామాజికవర్గ ఓటర్లు కూడా అధికంగా ఉన్నారనే చెప్పవచ్చు. బలిజ సామాజికవర్గాన్ని వైసీపీకి చేరువ చేసేందుకు ఉపయోగపడనుందని రాజకీయ విశే్లషకుల భావన. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఆ పార్టీకి కీలకనేతగా, చిరంజీవికి అత్యంత సన్నిహితంగా సి.రామచంద్రయ్య మెలగడం జరిగింది. అందువల్లే ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలోకి విలీనం చేసినప్పుడు చిరంజీవి సూచనతో సి.రామచంద్రయ్యకు ఎమ్మెల్సీ పదవితో పాటు మంత్రి పదవి కూడా దక్కింది. ఇప్పటికీ చిరంజీవికి అత్యంత ఆప్తుడిగానే సి.రామచంద్రయ్య కొనసాగుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో సి.రామచంద్రయ్య జనసేనకు మద్దతుగా నిలుస్తారని అందరూ భావించారు. అయితే అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ వైసీపీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది. రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని రాజంపేట, రైల్వేకోడూరు నియోజకవర్గాల్లో సీఆర్‌సీకి అనుచరగణం ఉంది. గతంలో ఈ పార్లమెంటరీ నియోజకవర్గం నుండి సీఆర్‌సీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడం కూడా జరిగింది. సీఆర్‌సీ వైసీపీ తీర్థం పుచ్చుకోవడం వల్ల ఈ పార్లమెంటరీ నియోజకవర్గంలోని ఆయన వర్గమంతా వైసీపీకి మద్దతుగా నిలిచే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో సీఆర్‌సీ కొనసాగుతున్నప్పటికి గత కొంతకాలంగా రాజకీయంగా క్రియాశీలకమైన పాత్రను పోషించడం లేదు. ప్రస్తుతం వైసీపీలోకి చేరడంతో సిఆర్‌సి తిరిగి రాజకీయంగా క్రియాశీలకంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అన్ని అంశాలపై సంపూర్ణ అవగాహన కలిగిన నేతగా, తాజా రాజకీయ పరిస్థితులపై ఎప్పటికప్పుడు ఘాటుగా స్పందించే నేర్పరిగా, వక్తగా పేరుంది. ఈ పరిస్థితుల్లో జనసేన రానున్న ఎన్నికల నాటికి ఈ పార్లమెంటు నియోజకవర్గంలో పుంజుకుంటుందా అన్నది వేచిచూడాలి. ఏ రకంగా చూసినా సీఆర్‌సీ చేరిక వైసీపీకి రాజకీయంగా ప్రయోజనకరంగానే కనిపిస్తుంది. అదే సమయంలో అధికార తెలుగుదేశం పార్టీకి బలిజ సామాజికవర్గం నేతల అండ ఉన్నప్పటికి రానున్న రోజుల్లో చోటుచేసుకునే రాజకీయ మార్పులను బట్టి ఆ పార్టీ పరిస్థితిని అంచనా వేసేందుకు వీలవుతుంది.