కడప

మూతబడిన పాలకేంద్రాలు తెరిచేదెన్నడు..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, మే 31: జిల్లాలో పాడిపరిశ్రమపై ఆధారపడి వేలాది కుటుంబాలు జీవిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా రైతులకు పాడి పరిశ్రమపై ప్రోత్సాహం లేక రోజు రోజుకూ పశుసంపద క్షీణిస్తోంది. కొన్ని ప్రాంతాలలో గేదెలు, ఆవులు అధికంగా ఉన్నా వాటికి అతి కష్టం మీద మేతను సమకూర్చి అరకొర పాలను పశువుల ద్వారా తీసుకొని వాటిని అమ్మకాలు చేసుకోవడానికి దళారులతో రైతులు దగా పడుతున్నారు. జిల్లాలో ఎంతో ఘనచరిత్ర ఉన్న ప్రొద్దుటూరు, రాజంపేట, పెద్ద పెద్ద పాలకేంద్రాలే మూతపడ్డాయి. ఏపీ డైరీ అధికారులు డీ ఆర్‌డీ ఏ ద్వారా 21 ప్రాంతాలలో బీ ఎంసీ కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పుకొస్తున్నారు. జిల్లాలో చక్రాయపేట, పులివెందుల, ప్రొద్దుటూరు, కొండాపురం, రాజంపేట, తిమ్మాంపల్లె, భాకరాపేట, రాయచోటిలలో పాలకేంద్రాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. పట్టణాల నుంచి వ్యాపారస్థులు గ్రామాల నుంచి వ్యాపారస్థులు సిండికేట్‌గా ఏర్పడి రైతుల నుంచి సేకరించిన పాలకు సకాలంలో బిల్లులు చెల్లించకుండా రైతు పాలడబ్బుల కోసం నిలదీస్తే పాలల్లో డిగ్రీ శాతం తక్కువగా ఉందని తాము డబ్బులు ఇవ్వమని ఎగ్గొడుతున్నారు. అలాగే రైల్వేకోడూరు, వేంపల్లె, రామాపురం, ఒంటిమిట్ట, పెనగలూరు, మైదుకూరు, సింహాద్రిపురం, రాజుపాలెంలో పాలకేంద్రాలు ఇప్పటికే మూతపడ్డాయి. 565 గ్రామాల్లో రోజుకు 32 వేల లీటర్లు పాలు సేకరిస్తున్నారు. వాటిలో సగానికి పైబడి పాలు దళారుల ప్రమేయంతో పక్కదారి పడుతున్నాయి. ఏపీ డైరీ అధికారులు స్థానికంగా ఉండే చిరుద్యోగులు దళారుల సొమ్ము కాస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. విజయా డైరీ నేతృత్వంలో వ్యాపారం చేసుకోవాల్సిన మహిళలకు సేకరించాల్సిన కొంత మంది సిబ్బంది సహకరించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. అలాగే పశువులకు వైద్యం చేయాల్సిన ప్రతి మండల కేంద్రంలో వైద్యులు, వైద్య సిబ్బంది ఉన్నా చాలా మంది వైద్యులు విధులకు డుమ్మా కొట్టి వైద్యసిబ్బందిని పశువులకు చికిత్స చేయమని ఆదేశిస్తున్నారు. జిల్లా సరిహద్దులో ఉన్న గ్రామాలలోను, అటవీ ప్రాంతాల సరిహద్దుల్లోను అధికసంఖ్యలో ఉన్న పశువులు సైతం వారికి పాలకేంద్రాల అదికారులు, సిబ్బంది సహకరించని కారణంగానే పాడి రోజు రోజుకూ కనుమరుగవుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డ్వాక్రా మహిళలను అన్ని విధాలా ఆదుకోవడానికి కావాల్సిన రుణాలు రాయితీలు కల్పిస్తున్నా స్థానికంగా కానీ, జిల్లా స్థాయిలో కానీ కొంత మంది అధికారులు కొంత మంది సిబ్బంది ప్రోత్సాహం కరువైంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు జిల్లాలో మూతపడ్డ పాలకేంద్రాలను తెరిపించి మండల స్థాయిలలో పాలకేంద్రాలను ఏర్పాటు చేసి ఆ పాలను ఎగుమతి చేయడంతో పాటు జిల్లా ప్రజలకు పాల కొరత లేకుండా చేసి పాడి రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఆధునిక పరిజ్ఞానంతో అధికలాభాలు

ఆంధ్రభూమి బ్యూరో
కడప,మే 31: అత్యాధునిక పరిజ్ఞానంతో రైతులు వ్యవసాయం చేస్తే అధిక లాభాలు గడించవచ్చునని ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చర్ డెవలప్‌మెంట్ విదేశ ప్రతినిధులు పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్ సభాభవన్‌లో వ్యవసాయాధికారులకు , రైతులకు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఐఎఫ్‌ఏడి సభ్యుల బృందం లీడర్ ఈడ్‌వార్డ్ మల్లోరిఈ, లైవ్‌స్టాక్ స్పెషలిస్టు హెల్లన్ లీటిక్, ఎకనామిస్ట్ పూజ కోశియా , ఎన్వరాల్‌మెంట్ స్పెషలిస్టు సన్ ప్రీత్ కౌర్, జిల్లా వ్యవసాయాధికారి ఠాగూర్ నాయక్, ఏడి రమణలు అధ్యక్షత వహించారు. ఈసందర్భంగా ఐఎఫ్‌ఏడి సభ్యులు జిల్లాలోని రైతుల స్థితిగతులపై, వ్యవసాయంపై వ్యవసాయ స్థితిగతులపై చర్చించారు. ఎంత దిగుబడులు జిల్లా రైతులు సాధిస్తున్నారు ఏమైనా నష్టాలు వాటిల్లుతున్నాయా ఏఏ పంటలు ఎక్కువగా పండిస్తున్నారు, నీటితో సాగుచేసే విస్తీర్ణం , మెట్ట్భూముల విస్తీర్ణం తదితర వివరాలు అధికారుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ మంచి పరిజ్ఞానంతో వ్యవసాయం చేస్తే అధిక లాభాలు గడించవచ్చునన్నారు. నూతనంగా వస్తున్న పరికరాల గురించి, పనిముట్ల గురించి, పద్ధతుల గురించి రైతులకు తెలియజేయాలన్నారు. జెడి ఠాగూర్ నాయక్ మాట్లాడుతూ జిల్లాలో భూగర్భజలాలు చాలా తగ్గిపోయాయని దీనివల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని అందువల్ల మెట్ట పంటలు ఆశాజనకంగా లేవన్నారు. తమశాఖ ద్వారా రైతులకు చేయాల్సిన సహాయ సహకారాలు ఎప్పటికప్పుడు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు వ్యవసాయాధికారులు వారి సందేహాలు సలహాబృందం సభ్యులకు వివరించారు. అనంతరం వివిధ శాఖల ద్వారా వివరాలు అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయశాఖ ఏడిలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఘనంగా హనుమజ్జయంతి వేడుకలు

చక్రాయపేట, మే 31: జిల్లాలో ప్రసిద్ధిచెందిన శ్రీ గండి దేవస్థానంలో వెలిసిన శ్రీ వీరాంజనేయస్వామి జయంతి ఉత్సవాలు మంగళవారం ఘనంగా ముగిశాయి. దేవస్థాన సహాయ కమిషనర్ పట్టెం గురుప్రసాద్ ఆధ్వర్యంలో ఆదివారం ప్రారంభమై మంగళవారం సాయంకాలం ముగిశాయి. ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా స్వర్ణహంపి పంపా క్షేత్ర పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ గోవిందనంద సరస్వతి స్వామి పాల్గొన్నారు. ప్రధాన అర్చకులు చెన్నయ్యస్వామి కేసరి స్వామి, రాజాస్వామి, మురళీ, రఘుస్వాములు తెల్లవారుజాము నుండి సోమ కుంభారాధన, సుందరకాండ హోమము, మన్యసూక్తి, పవనామ సూక్తి, మూలమంత్ర హోమం, మహాపూర్ణాహుతి, మహాకుంభ వృద్దాసన, కుంభ ప్రోక్షణ, అంజన్న మూలవిరాట్‌కు మహాస్నపన తిరుమంజనం, ప్రత్యేక అలంకరణలతో ఆంజనేయస్వామి భక్తులకు దర్శనమిచ్చారు. ఏది ఏమైనప్పటికీ గండి క్షేత్రంలోని హనుమజ్జయంతి ఉత్సవాలకు జిల్లావాసులే కాకుండా చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల నుండి అధిక సంఖ్యలో భక్తులు రావడంతో గండి క్షేత్రం పోటెత్తింది. ఇక్కడ కొలువైన ఆంజనేయస్వామి విగ్రహాన్ని సాక్షాత్తూ శ్రీరామచంద్రుడే తన బాణపు కొనతో మొలిచాడని పురాణకథలు స్పష్టం చేస్తున్నాయి. స్థల పురాణ కథను గమనిస్తే ఇది వాయుక్షేత్రాల్లో ఒకటిగా నిలుస్తుంది. త్రేతాయుగంలో ఆంజనేయుని తండ్రి అయిన వాయుదేవుడు ఈ గండి ప్రాంతంలో తపస్సు చేసుకునేవాడు వారణాసుడు సీతను అపహరించి లంకకు తీసుకుపోయిన తరువాత సీతను అనే్వషిస్తూ వచ్చిన రామలక్ష్మణులకు వాయుదేవుడు ఆతిథ్యం ఇచ్చినట్లు పురాణకథల్లో ఉంది. లంకకు వెళ్లి విజయంతో వచ్చిన సీతారామలక్ష్మణులకు రెండు కొండల మధ్య బంగారు విజయతోరణాన్ని కట్టి వాయు దేవుడు స్వాగతం ఇచ్చినట్లు స్థలపురాణం చెబుతుంది. ఈ బంగారు విజయతోరణం నేటికీ పవిత్రులకు దర్శనమిస్తుందని గతంలో కడప జిల్లా మొదటి కలెక్టర్ థామస్ మన్రోకు దర్శనమిచ్చిందని గెజిట్‌లో రాసి ఉంది. అందువల్లే గండి క్షేత్రంలో జరుగుతున్న ఉత్సవాలలో జిల్లా నుండే కాకుండా ఇతర జిల్లాల నుండి తండోపతండాలుగా భక్తులు తరలివస్తుంటారు. అదే విధంగా శ్రావణ మాసోత్సవంలో కూడా ఇతర రాష్ట్రాల నుండి కూడా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటారు. భక్తులకు అలరించే విధంగా రాష్ట్ర భాష సాంస్కృతిక శాఖ, రాష్ట్ర జానపద కళాకారుల సంఘం ఆధ్వర్యంలో గండి క్షేత్రంలో హనుమజ్జయంతి ఉత్సవాలను పురష్కరించుకొని ఉమాకాంత బుర్రకథ, సుధాకర హరికథ, ఉదయకుమార్ జానపద గేయాలతో పాటు సోమశేఖర్ బృందం భీముడు, ఆంజనేయుడు, అభిమన్యుడు, ఘటోత్కచుడు, ధర్మరాజు మొదలగు వేషాలతో భక్తులకు అలరించే విధంగా పలు నాటకాలు గండి క్షేత్రంలో ఏర్పాటు చేయడంతో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ధార్మికవేత్తలు వేటూరు రామచంద్రారెడ్డి, అచ్చైయిలు ముకుందారెడ్డి, హనుమంతరెడ్డి, పుత్తా వెంకటసుబ్బారెడ్డి(కేవీపీ), రాష్ట్ర ఆగ్రోస్ మాజీ అధ్యక్షుడు చెన్నక్రిష్ణారెడ్డి, మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

చంద్రన్న బీమాను వినియోగించుకోవాలి
రాజంపేట, మే 31:రాజంపేట మున్సిపాలిటీలోని అసంఘటిత కార్మిక కుటుంబాలు, తెల్ల రేషన్‌కార్డులు కలిగిన పేద కుటుంబాలు చంద్రన్న బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ ఎన్‌వి రమణారెడ్డి కోరారు. మంగళవారం ఈడిగపాలెంలోని మహిళా సమాఖ్య భవన్‌లో చంద్రన్న పథకంపై డ్వాక్రా మహిళలకు, జన్మభూమి కమిటీ సభ్యులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రమణారెడ్డి మాట్లాడుతూ అసంఘటిత రంగాలలో కార్మిక కుటుంబాలలో ప్రమాదవశాత్తు అకాల మరణం, అంగ వైక ల్యం, అనారోగ్యంతో కార్మికులు మరణిస్తే ఆ కుటుంబాలకు ఆర్థిక సహా యం అందించేందుకు ప్రభుత్వం చంద్రన్న బీమా పథకాన్ని ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు. 18 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల వయస్సు కలిగిన కార్మికులందరికీ ఈ పథకం వర్తిస్తుందన్నారు. ఈ పథకం ద్వారా కార్మికులు ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.5 లక్షలు, అంగవైకల్యం జరిగితే రూ.3.62 లక్షలు, సహజ మరణం సంభవిస్తే రూ.30 వేలు పరిహరం చెల్లించడం జరుగుతుందన్నారు. ఈ పథకం క్రింద అర్హులను చేర్చుకునేందుకు గాను జూన్ 1 నుండి 30 తేదీ వరకు మున్సిపాలిటీలోని అన్ని వార్డులలో అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ పథకంలో చేరే లబ్ధిదారులందరూ ఈ సభ్యత్వ నమోదు కేంద్రాలలో రూ.15 చెల్లించి తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా పలువురు టిడిపి నాయకులు వార్డుల వారిగా చంద్రన్న బీమా పథకం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేసే డ్వాక్రా మహిళలకు, జెబిసి సభ్యులకు నగదు, వెండి అభరణాలను ప్రోత్సాహకాలుగా అందజేస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు డాక్టర్ సి.సుధాకర్, టి.సంజీవరావు, ఇడిమడకల కుమార్, షేక్ అబ్దుల్లా, మనుబోలు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
శేషాచలం అడవుల్లో
మళ్లీ కలకలం
రైల్వేకోడూరు, మే 31:కడప-చిత్తూరు జిల్లాల సరిహద్దులో విస్తరించిన శేషాచలం అడవులలో మంగళవారం మరోసారి కలకలం రేగింది. తమిళనాడుకు చెందిన ఎర్రచందనం కూలీలు అటవీ ప్రాంతంలోకి చొరబడ్డారన్న సమాచారంతో తిరుపతి టాస్క్ఫోర్స్‌కు చెందిన పోలీసులు, స్థానిక అటవీ అధికారులు మంగళవారం మూకుమ్మడిగా కూంబింగ్ నిర్వహించారు. ఇందులో భాగంగా జిల్లా సరిహద్దులో గల అటవీ ప్రాంతంలో 18 ఎర్రచందనం దుంగలను పట్టుకున్నట్లు సమాచారం అందింది. ఈ మేరకు 20 మందికి పైగా కూలీలు అటవీ ప్రాంతంలోకి పరారైనట్లు స్థానిక టాస్క్ఫోర్స్ అధికారులు తెలిపారు. పారిపోయిన కూలీల కోసం ముమ్మరంగా కూంబింగ్ చేపట్టినట్లు వారు వివరించారు.

నేడు పర్యటించనున్న
ఐఎఫ్‌ఏడీ విదేశీ ప్రతినిధులు
ఆంధ్రభూమి బ్యూరో
కడప, మే 31: ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చరల్ డెవలప్‌మెంట్( ఐఎఫ్‌ఏడీ) విదేశ ప్రతినిధులు బుధవారం జిల్లాలోని లక్కిరెడ్డిపల్లె, రామాపురం, పెండ్లిమర్రి, వేంపల్లె మండలాల్లో పర్యటించనున్నారు. వ్యవసాయ అనుబంధాలకు రూ.100 కోట్లు ఇవ్వనున్నట్లు మంగళవారం జిల్లాకు చేరుకున్న బృందం ప్రకటించింది. వారితో పాటు వ్యవసాయ శాఖ రాష్ట్ర సహాయ సంచాలకులు రమణ, ఐఎఫ్‌ఏడీ ప్రతినిధులు ఆర్ట్రేనెఫ్రెడే, విన్‌స్టంట్‌డార్లింగ్, సన్‌ప్రీట్‌క్రౌడ్, ఏసీయాటూరేలతో పాటు వ్యవసాయ శాఖ అధికారులు ఉద్యానవన శాఖాధికారులు మైక్రో ఇరిగేషన్ శాఖ అధికారులు నీటి పారుదల సంస్థ, నాబార్డు, డీ ఆర్‌డీ ఏ అదికారులు, ఎల్‌డీ ఎం అధికారులు పర్యటించనున్నారు. ఈ పథకం ద్వారా అనేక కార్యక్రమాలు జిల్లాలో చేపట్టడానికి వీరు పర్యటించనున్నారు. వీరితో పాటు రాష్ట్రంలోని కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన వివిధ సంస్థల ప్రతినిధులు కూడా పాల్గొననున్నారు. ముఖ్యంగా జిల్లాలో నీటిపారుదలపై విదేశ ప్రతినిధులు పరిశీలించనున్నారు.

పైడిపాలెం రిజర్వాయర్‌కు సాగునీరు

ఆంధ్రభూమి బ్యూరో
కడప, మే 31: పైడిపాలెం రిజర్వాయర్‌ను నింపి తద్వారా పులివెందుల నియోజకవర్గంలోని సింహాద్రిపురం, తొండూరు, లింగాల, వేముల, పులివెందుల, వేంపల్లె మండలాలకు నీళ్లిచ్చే దిశగా జలవనరుల శాఖ అధికారులు చర్యలు వేగవంతం చేశారు. పులివెందుల బ్రాంచ్ కెనాల్ కింద 41 వేల ఎకరాలకు నీరు స్థిరీకరించడానికి తొలుత ప్రయత్నాలు చేసి ప్రస్తుతం 47.500 ఎకరాలకు సాగునీరు ఇవ్వడానికి గండికోట రిజర్వాయర్ ఎత్తిపోతల పథకాన్ని రూపొందించారు. గండికోట జలాశయం నుంచి ఆరు టీ ఎంసీల నీటిని 9 పంపుల ద్వారా వెయ్యి క్యూసెక్కుల నీటిని 77 మీటర్లలో ఎత్తుకు తీసుకొచ్చి సింహాద్రిపురం పైడిపాలెంలో నిర్మించిన ప్రాజెక్టులకు తరలించనున్నారు. పైడిపాలెం జలాశయం నుంచి 16.60 కిలోమీటర్ల కాలువలు కూడా తవ్వి హిమకుంట్లచెరువుకు చేర్చనున్నారు. హిమకుంట్ల చెరువు నుంచి ఎత్తిపోతల ద్వారా నీటిని తోడి పులివెందుల బ్రాంచ్‌కెనాల్‌కు తరలించేందుకు చర్యలు వేగవంతం చేశారు. పులివెందుల బ్రాంచ్ కెనాల్ తొలుత గొడ్డుమర్రి ఆనకట్ట నుంచి చిత్రావతి నీరు కానీ, తుంగభద్ర హైలెవల్ కెనాల్ ద్వారా కానీ చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు వచ్చి చేరే తుంగభద్ర నీటిని లేదా గండికోట రిజర్వాయర్ నుండి ఎత్తిపోతల పథకం ద్వారా అందించేందుకు కృష్ణా నది నీటిని తరలించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.
అలాగే పులివెందుల బ్రాంచ్ కెనాల్ నుంచి అనంతపురం యల్లనూరు మండలంలో 4,729 ఎకరాలు జిల్లాలోని కొండాపురం, లింగాల, సింహాద్రిపురం, తొండూరు, పులివెందుల, వేముల, వేంపల్లె మండలాలకు మొత్తం 50, 810 ఎకరాలకు నీరిచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ ఎస్‌వి సతీష్‌కుమార్‌రెడ్డి గండికోట, పైడిపాలెం రిజర్వాయర్లకు నీటిని తెప్పించేందుకు పలుమార్లు పాదయాత్రలు చేసి ప్రాజెక్టుల వద్ద నిద్రలు చేస్తూ తరచూ అధికారులతో సమీక్షిస్తున్నారు.

సిద్దేశ్వరం అలుగుతోనే రాయలసీమకు మేలు

రాయచోటి, మే 31: కర్నూలు జిల్లాలోని సిద్దేశ్వరం అలుగుతోనే రాయలసీమకు మేలు జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయని రాయచోటి శాసనసభ్యులు గడికోట శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం స్థానిక వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దశాబ్దాలుగా, శతాబ్దాలుగా రాయలసీమ అన్యాయానికి గురవుతోందని, ఏ ఒక్క విషయంలో కూడా రాయలసీమకు న్యాయం జరగడం లేదన్నారు. మద్రాసు ప్రెసిడెన్సీ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు శ్రీబాగ్ ఒడంబడిక పూర్తిగా అమలు చేయకుండానే పక్కన పడేశారన్నారు. కానీ అప్పటి రాజధానిగా ఉన్న కర్నూలును మన ప్రాంత వాసులు త్యాగం చేసి హైదరాబాద్‌ను రాజధానిగా చేయడం జరిగిందన్నారు. కానీ 50 సంవత్సరాల తరువాత రాష్ట్ర విభజనలో పాత ఏపీగా విభజించారని, అప్పుడున్న రాజధానిని కనీసం పరిగణనలోకి తీసుకోకుండా శ్రీబాగ్ ఒడంబడికను పక్కన పెట్టి శివరామకృష్ణ కమిటీని తుంగలోకి తొక్కడం జరిగిందన్నారు. ఇక్కడి ప్రజల అమాయకత్వాన్ని వాడుకుంటూ మట్టిని ఇక్కడి మట్టిని అమరావతిలో పెడుతూ అమరావతి రాజధాని కాదు అన్ని గ్రహాలకు ఇదే రాజధాని అని మోసపూరిత మాటలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్తున్నారన్నారు. రెండు సంవత్సరాల పాటు అధికారంలో ఉండి రాయలసీమకు ఏ పనీ చేయలేదన్నారు. రాజధానికి రాయలసీమ నుండి రోడ్డు వేస్తాం అంటున్నాడు కానీ కష్టాలు తీర్చాలని, రాయలసీమకు ప్రత్యేక హోదా ఇస్తే పొరుగు రాష్ట్రం కర్ణాటక, మహారాష్టల్ర నుండి అనేక పెట్టుబడులు వస్తాయన్నారు. అమరావతి ఒక్కటిని పరిశీలన చేయండ అని సీ ఎం కోరడం ఈ ప్రాంతం నయవంచానికి గురవుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 50,600 క్యూసెక్కుల పోతిరెడ్డిపాడు చేసిన తర్వాత హంద్రీనీవా, గాలేరు-నగిరి రిజర్వాయర్లకు నిధులను కేటాయించి ఆ ప్రాజెక్టులను ఒక కొలిక్కి తీసుకొచ్చిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. పట్టిసీమ వస్తుంది నీళ్లు వస్తాయి అని చెప్పి ఇక్కడ నాయకులు సీఎం భజన చేయడంతో పట్టిసీమ అయిపోయిందని సీఎం చెప్పారు కానీ శ్రీశైలం నుండి వచ్చిన అరకొర నీరు ప్రకాశంబ్యారేజీకి తరలించడం దారుణమన్నారు. 50 సంవత్సరాల తరువాత శ్రీశైలం ప్రాజెక్టులో ఇంత ఘోర పరిస్థితి లేదన్నారు. కేసీఆర్, చంద్రబాబునాయుడులు పోటీపడి నీళ్లను తరలించుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో రాయలసీమలో పంటలు పండాలన్నా, ప్రజలు మనుగడ సాగాలన్న సిద్దేశ్వరం అలుగు నిర్మించి తీరాలన్నారు. సిద్దేశ్వరం అలుగు శంకుస్థాపన చేసేందుకు వెళ్లిన రైతులను పోలీసులు అరెస్టు చేయడం దారుణమన్నారు. ఎగువన ఉన్న తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలు ఇష్టం వచ్చినట్లు ఆనకట్టలు కడుతుంటే సీఎం చంద్రబాబు ఓటుకు నోటు కేసులో భయపడి ఈ ప్రాంత ప్రయోజనాలను తాకట్టు పెట్టడం దారుణమన్నారు. కడప జిల్లాకు ఉక్కు ఫ్యాక్టరీని వెంటనే నిర్మించాలని, అంతేకాకుండా కేంద్రం నుండి వచ్చే విద్యా కేంద్రాలను రాయలసీమకు కేటాయించాలని డిమాండ్ చేశారు. రెండో రాజధానిని కర్నూలు, తిరుపతి, కడపలలో ఏర్పాటు చేయాలన్నారు. హైకోర్టు బెంచ్ కడపలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఎయిమ్స్‌ను అనంతపురంకు కేటాయిస్తే దానిని మంగళగిరికి తరలించడం దారుణమని, వెంటనే ఎయిమ్స్‌ను అనంతపురంకే కేటాయించాలని డిమాండ్ చేశారు. కృష్ణా-నికర జలాలు 200 టీఎంసీలు ఈ ప్రాంతానికి కేటాయించి వెంటనే అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేసి తెలంగాణ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి సిద్దేశ్వరం, తుంగభద్ర ప్రాజెక్టు వద్ద 20 టీఎంసీలు ఇచ్చే గుండ్రేవుల రిజర్వాయర్‌ను నిర్మించి దానిని కేసీ కెనాల్ ఆయకట్టుకు స్థిరీకరణ చేయాలని కోరారు. ఇందుకోసం రాయలసీమలో ఉండే యువత నడుం కట్టి కనీస సౌకర్యాలు రాయలసీమకు కల్పించేందుకు అందరూ బాధ్యతగా తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ ఆఫ్జల్‌అలీఖాన్ తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్ సుడిగాలి పర్యటన

వీరబల్లి, మే 31: మండలంలో మంగళవారం కలెక్టర్ వెంకటసత్యనారాయణ సుడిగాలి పర్యటన నిర్వహించారు. అందులో భాగంగా మండలంలోని గుర్రప్పగారిపల్లె తదితర గ్రామా ల్లో ఉపాధి హామీ పథకం ద్వారా చేస్తున్న నీరు-చెట్టు పనులను ఆయన పరిశీలించారు. అనంతరం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో మండల సమస్యలపై ఆరా తీశారు. ముఖ్యంగా ఎంపీపీ స్వప్న మండల రోళ్లమడుగు స్కీం ద్వారా వచ్చే నీటిని త్వరగా వచ్చేందుకు చర్యలు తాగునీటి సమస్య పరిష్కరించాలని జిల్లా సర్వోన్నతాధికారికి విన్నవించారు. అనంతరం ఉపాధి హామీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ పనితీరును ఆయన పరిశీలించా రు. ఉపాధి హామీ బిల్లులను త్వర గా చెల్లిస్తున్నారా జాప్యం జరుగుతోందా అని ఆరా తీశారు. వెలుగు కార్యాలయంలో తనిఖీలు నిర్వహించారు. పలు సమస్యలపై ఆరా తీసి రికార్డులను పరిశీలించారు. అనంతరం మండల కేంద్రంలో వెలిసిన పురాతన దేవాలయం అయిన హరిహరాదుల దేవస్థానంలో పాత ఎర్రచందనం వేలం పాటలో ఆయన పాల్గొన్నారు. దేవాలయానికి సంబంధించి ఎర్రచందనం దుంగలు రాజంపేటకు చెందిన వెంకటక్రిష్ణారెడ్డి రూ.18 లక్షలకు వేలం పాటలో దక్కించుకున్నారు. మొదటి కేటగిరీ 981 కేజీలు, రెండో కేటగిరీ 2,285 కేజీలు, మూడో కేటగిరీ 2,722కేజీలు పాత ఎర్రచందనం దుంగలు ఉన్నట్లు దేవాలయ అధికారి వివరించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్-2 శేషయ్య, డీఎఫ్‌వో, ఆర్డీవో చినరాముడు, అసిస్టెంట్ కన్వీనర్ శంకర్‌బాలయ్య, దేవాదాయ శాఖ అధికారులు, ఎంపీపీ స్వప్న, ఆలయ ధర్మకర్త, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

పులివెందుల, మే 31:్భరతీయ జనతాపార్టీ ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకుపోవాలని, బాధ్యతగా పనిచేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కార్యకర్తలతో భాజాపా జిల్లా అధ్యక్షుడు శ్రీనాథ్‌రెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక సప్తగిరి కల్యాణ మండపం ఆవరణంలో ఏర్పాటుచేసిన సింహాద్రిపురం, లింగాల, వేముల మండలాలకు చెందిన బిజెపి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం జన్‌ధన్ పథకం, సురక్షాభీమా, అందరికీ ఇళ్లు, వికాస్ యోజన తదితర పథకాలను ప్రవేశపెట్టిందని, దీని వలన ఎంతోమంది పేద ప్రజలకు మేలు జరుగుతోందన్నారు. కేంద్రం ప్రతి గ్రామానికీ విద్యుత్‌ను అందించాలనే ఉద్దేశ్యంతో పైలెట్ ప్రాజెక్టుగా రాష్ట్రాన్ని గుర్తించి 24గంటల విద్యుత్‌ను ఇవ్వనున్నామన్నారు. ఇది కేవలం కేంద్రం నిధులతోనే అమలవుతోందని, రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం ఏమీ లేదన్నారు. ప్రతి ఒక్కరూ బిజెపి ప్రభుత్వం ప్రవేశపెట్టి పథకాలను ప్రజలకు వివరించి పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. అలాగే ప్రజలకు అందుబాటులో వుండి పథకాలు ప్రజలకు అందేలా చూడాలన్నారు. జిల్లా మాజీ అధ్యక్షుడు శశిభూషణ్‌రెడ్డి మాట్లాడుతూ ఢిల్లీ, రాజస్థాన్, ఆంద్రప్రదేశ్ రాష్ట్రాలను పైలెట్ ప్రాజెక్టుగా ఏర్పాటుచేసి 24గంటల విద్యుత్‌ను అందిస్తున్నారని, వికాస్‌యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకొని లబ్ది పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణాధ్యక్షుడు ప్రదీప్‌కుమార్‌రెడ్డి, నాయకులు జానకీరామిరెడ్డి, విజయలక్ష్మి, రమణారెడ్డి, శ్రీనివాసులరెడ్డి, మహేశ్వర్‌రెడ్డి, శ్యామ్‌సుందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రసవత్తరంగా సాగిన బండలాగుడు పోటీలు

సిద్దవటం,మే 31: మండలంలోని పెన్నానది ఒడ్డున వెలసిన లింగంపల్లెలో వీరాంజనేయస్వామి వార్షికోత్సవం సందర్భంగా మంగళవారం బండులాగుడుపోటీలు రసవత్తరంగా సాగాయి. ఈసందర్భంగా ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు , కుంకుమార్చన, అభిషేకాలు, ఆకుపూజ తదితర పూజాదికారాలు ఘనంగా ఆలయ అర్చకులు నిర్వహించారు. మద్యాహ్నం 12 గంటల నుంచి అన్నదాన కార్యక్రమం ఏర్పాటుచేశారు. అలాగే వడమాల పూజ కార్యక్రమం తదితర పూజలు చేశారు. అనంతరం నిర్వహించిన బండులాగుడుపోటీల్లో సికెదినె్న మండలం గోపులాపురం పెద్దమునిరెడ్డి ప్రధమ బహుమతి రూ.20వేలు అతికారి వెంకటయ్య అందజేశారు. ద్వితీయ బహుమతి రూ.12,116లు కొత్త సంగటిపల్లె నంద్యాల వెంకటేసుకు శ్రీను అనే దాత ఇచ్చారు. తృతీయ బహుమతి రూ.6,116లు అచ్యుత్‌రెడ్డికి ఎంపిటిసి నాగమునిరెడ్డి అందజేశారు. అలాగే జంగాలపల్లె పంచాయతీ కమ్మపాలెం వీరాంజనేయస్వామి ఆలయం వద్ద బండలాగుడుపోటీల్లో మొదటి బహుమతి రూ.3,116లుసిద్దవటం దిగువమపేటకు చెందిన ఎ.సుబ్బరాయుడుకు జనార్దన్‌నాయుడు అందజేశారు. రెండవ బహుమతి రూ.2,116లు దిగువపేట కె.సుబ్బరాయులకు అరిశ వెంకటరమణ అందజేశారు. తృతీయ బహుమతి రూ.1,116లు జంగాలపల్లెకు చెందిన రామయ్యకు కమ్మపాలెం కిట్టయ్యనాయుడు అందజేశారు. ఈకార్యక్రమంలో నిర్వాహకులు దశరధరామానాయుడు, తిరుపతినాయుడు, వెంకటసుబ్బయ్యనాయుడు ,మునీంద్రనాయుడు, అశ్వర్థనాయుడు తదితరులు పాల్గొన్నారు. అలాగే పర్వతగిరి దక్షిణ ముఖద్వారా ఆంజనేయస్వామి దేవస్థానంలో మంగళవారం కలశపూజ, గణపతి హోమం తదితర పూజలు నిర్వహించినట్లు ఆలయ చైర్మన్ లక్షుమయ్య తెలిపారు.

ఘనంగా హనుమాన్ జయంతి

కడప,(కల్చరల్),మే 31: శ్రీ ఆంజనేయస్వామి జయంత్యుత్సవం పురస్కరించుకుని కడప నగరంతోపాటు చుట్టుపక్కల ఉన్న శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానాల్లో మంగళవారం వాయుపుత్రునికి ఘనంగా పూజలు జరిగాయి. ఉదయం నుంచే భక్తులతో దేవస్థానాలు నిండిపోయాయి. భక్తులు స్వామిని దర్శించుకునేందుకు బారులు తీరి, స్వామికి కాయ, కర్పూరాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అలాగే ఆంజనేయస్వామికి అత్యంత ఇష్టమైన రోజైన మంగళవారం రావడంతో ఆకుపూజలు చేయించి భక్తులు తమ మొక్కుబడులు తీర్చుకున్నారు. అలాగే ఆంజనేయునికి ప్రీతికరమైన వడమాలలు వేసి తమ భక్తిని చాటుకున్నారు. ఈసందర్భంగా ఆలయ అర్చకులు స్వామివారికి ఉదయం గణపతిపూజ, పుణ్యాహవాచనం, పురుషసూక్త, శ్రీసూక్త, నమక, చమక, మన్యుసూక్తపారాయణము, రుద్రహోమం, పూర్ణాహుతి, శ్రీరామాంజనేయ మూలమంత్ర జపం, అభిషేకం, అర్చన, నివేదనం, మంత్రపుష్పం తదితర పూజాది కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. అలాగే సాయంత్రం 6గంటలకు స్వామివారికి ఆకుపూజ, అర్చన, మంగళహారతి, మంత్రపుష్టం అనంతరం తీర్థప్రసాదాల వినియోగం గావించారు. అదేవిధంగా కొన్ని దేవస్థానాల్లో మద్యాహ్నం 12 గంటల నుంచి పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. అన్నదాన కార్యక్రమాల్లో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. కాగా కడప నగరం పాత బస్టాండ్ సమీపంలోవున్న శ్రీ గాలిదేవర ఆంజనేయస్వామి ఆలయంలో ఉదయం నుంచి విశేష పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా ఉదయం 6 గంటల నుంచి స్వామివారికి పంచామృతాభిషేకం, పుష్పా లంకరణ, సహస్రనామార్చన, మహా మంగళహారతి, ప్రసాద వినియోగం చేశారు. అనంతరం హనుమత్ చాలీసా పఠనము, మద్యాహ్నం అన్నదానము కార్యక్రమం నిర్వహించారు. అలాగే సాయంత్రం 6 గంటల నుంచి నగరంలో గ్రామోత్సవము వైభవంగా జరిగింది. చెక్క్భజన బృందం, వివిధ వేషాలతో కళాబృందాలతో ఈగ్రామోత్సవం ఆలయం నుండి ప్రారంభమై నగరంలోని ప్రధాన పురవీధుల గుండా వెళ్లి తిరిగి ఆలయం చేరుకుంది. అలాగే నగరంలోని గంజికుంట కాలనీలో వున్న ఆంజనేయస్వామిదేవస్థానంలో చిన్మయామిషన్ ఆధ్వర్యంలో విశేష పూజలు జరిగాయి. కడప నగరంలోని బ్రాహ్మణవీధిలోని జూల్ ఆంజనేయస్వామి ఆలయం, జడ్జికోర్టు వద్ద గల ఆంజనేయస్వామి ఆలయం, చిన్నచౌకు ప్రాంతంలోని శ్రీపంచముఖాంజనేయస్వామి ఆలయం, మారుతీనగర్‌లోని ఆంజనేయస్వామి ఆలయం, గడ్డిబాజరువీధిలోని (బాలాజి) దేవస్థానంలోని ఆంజనేయస్వామికి, కో- ఆపరేటివ్ కాలనీలోని దేవస్థానం, శంకరాపురంలోని దేవస్థానం, కృష్ణాపురంలోని పంచముఖ ఆంజనేయస్వామిదేవస్థానం, ఎర్రముక్కపల్లెలోని దేవస్థానం, దేవునికడపలోని దేవస్థానం, అల్మాస్‌పేటలోని దేవస్థానం, రైల్వేస్టేషన్ సమీపంలోని పంచముఖ ఆంజనేయస్వామి, రాయచోటి ఘాట్‌లో వున్న ఆంజనేయస్వామిదేవస్థానంతోపాటు పలు ఆంజనేయస్వామి దేవస్థానాల్లో విశేషపూజలు నిర్వహించారు. అలాగే సాయంత్రం దేవస్థానాల్లో భజనలు, భక్తిగీతాల కార్యక్రమాలను నిర్వాహకులు ఏర్పాటుచేశారు.
పెండ్లిమర్రి,మే 31: మండలంలోని ఎల్లటూరు, నందిమండలం, రెడ్డిపల్లె గ్రామాల్లో వెలసివున్న ఆంజనేయస్వామి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయ ధర్మకర్తలు వేకువ జాముననే హనుమాన్ చాలీసా చదివి భక్తులకు విన్పిస్తూ హనుమంతుడు వైశాఖ మాసంలో బహుళ దశమి కర్కట లగ్నంలో శనివారం నాడు జన్మించారని ఈ దినాన్ని హనుమంతుని జయంతిగా జరుపుకుంటారని తెలిపారు. అలాగే స్వామివారికి అభిషేకాలు, దూపధీప నైవేద్యాలతో అలంకరణలతో స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. తొలుత గణపతి పూజతో అర్చకులు పూజా కార్యక్రమం ప్రారంభించి అనంతరం భక్తులకు స్వామివారి దర్శనమిచ్చారు. అలాగే స్వామికి ఆకుపూజ తదితర కార్యక్రమాలు చేశారు. భక్తులు స్వామిని దర్శించుకుని తమ కోర్కెలు నెరవేరాలని ప్రత్యేకపూజలు, అభిషేకాలు నిర్వహించారు. అలాగే ధర్మకర్తలకు ఆలయ ప్రాంగణం వద్ద భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటుచేశారు. అలాగే సాయంత్రం స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని పురవీధుల గుండా ఘనంగా ఊరేగించారు.
చెన్నూరులో..
చెన్నూరు: స్థానిక బ్రాహ్మణవీధిలో వెలసిన ఆంజనేయస్వామి ఆలయంలో మంగళవారం హనుమాన్ జయంతి పురస్కరించుకుని తెల్లవారు జామున 5గంటల నుంచి సుప్రభాత సేవ, 6గంటల నుంచి రుద్రాభిషేకం, అభిషేకాలు, ఆకుపూజ చేశారు. అనంతరం 10గంటల నుంచి మద్యాహ్నం 12 గంటల వరకు హోమం నిర్వహించారు. అనంతరం మద్యాహ్నం 12 గంటల నుంచి అన్నదాన కార్యక్రమాన్ని ఆలయ కమిటీ, నిర్వాహకులు ఏర్పాటుచేశారు. సాయంత్రం 4గంటల నుంచి స్వామివారి ప్రత్యేక సర్వదర్శనం కల్పిచారు. గ్రామంలో ఆంజనేయస్వామి గ్రామోత్సవంతోపాటు ఆంజనేయస్వామి జెండాలు ఊరేగించారు. స్థానిక వేంకటేశ్వరస్వామి ఆలయంలో వెలసిన ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే బుడ్డాయపల్లె గ్రామం వద్దవెలసిన ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేకపూజలతోపాటు అన్నదాన కార్యక్రమం ఏర్పాటుచేశారు. రామనపల్లి, కనుపర్తి గ్రామాల్లో వెలసిన ఆంజనేయస్వామి ఆలయాల్లో పూజలతోపాటు అన్నదాన కార్యక్రమం ఏర్పాటుచేశారు. పెన్నానది ఒడ్డున వెలసిన పెన్నా ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు భారీ ఎత్తున ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు.
చింతకొమ్మదినె్నలో...
చింతకొమ్మదినె్న: మండల పరిధిలోని శ్రీరంగరాజుపల్లి, చింతకొమ్మదినె్న, జమాల్‌పల్లె తదితర గ్రామాల్లో హనుమాన్ జయంతి ఉత్సవాలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం నుంచి స్వామివారికి ప్రత్యేక అలంకరణలతోపాటు అభిషేకాలు, ఆకుపూజ తదితర పూజాకార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ నిర్వాహకులు చేపట్టిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు.
వల్లూరులో...
వల్లూరు: హనుమాన్ జయంతి పురస్కరించుకుని మండలంలోని పలు ఆంజనేయస్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిగాయి. మంగళవారం మండలంలోని గోటూరు అభయ ఆంజనేయస్వామి ఆలయంలో స్వామివారికి ఆకుపూజ నిర్వహించి ప్రత్యేక పూజలు చేపట్టారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అలాగే బండలాగుడుపోటీలు భక్తులను ఆకట్టుకున్నాయి. మండల కేంద్రంలోని బాటా ఆంజనేయస్వామి , కుమారునిపల్లె హనుమంతు ఆలయంలో ,పెద్దపుత్త, కోట్లూరు తదితర గ్రామాల్లో భక్తులు ఉదయం నుంచే హనుమంతునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవనపుత్ర, వాయుసేన, ఆంజనేయ అంటూ భజన కార్యక్రమాలు చేపట్టారు. వల్లూరు జిల్లా పరిషత్ పాఠశాల సమీపంలోని ఆంజనేయస్వామి ఆలయంలో విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు చేశారు.